Tuesday, 31 October 2017

ఉడుపి భూలోక వైకుంఠం

ఉడుపి భూలోక వైకుంఠం


సరిగ్గా బ్రాహ్మీముహూర్తం రాగానే శంఖనాదాలు, దుందుభులు, నగారాలతో ప్రతిధ్వనిస్తుంది ఉడుపి మఠం. ఆలయ పూజారులతో సహా మఠంలో పని చేసేవారందరూ ఆ దివ్యనాదాలతో మేల్కొని, తమ దైనందిన చర్యలు ప్రారంభిస్తారు. కర్ణాటకలోని పేరెన్నికగన్న పుణ్యక్షేత్రాల్లో ప్రసిద్ధి పొందినది ఉడుపి. ధనిక-పేద; అగ్ర-నిమ్న కులాలనే భేదభావాలు మనుషులకే తప్ప, పరమాత్ముడికి లేవనేందుకు సాక్షాత్తూ ఆ కృష్ణభగవానుడే నిదర్శనం చూపించిన పుణ్యస్థలి ఉడుపి.

కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లాకు పశ్చిమంగా, మంగుళూరుకు 60 కి.మీ దూరంలో ఉంది. ఉడుపి పుణ్యక్షేత్రం. నిత్యం ఉత్సవాలతో, లక్షలాది మంది యాత్రికులతో కళకళలాడుతూ ఉంటుంది ఈ పవిత్ర యాత్రాస్థలం. ‘ఉడుప’(చంద్రుడు)’ అనే పదాన్ని అనుసరించి ఈ క్షేత్రానికి ఉడుపి అనే పేరు వచ్చింది. పేరుకు తగ్గట్టే ఈ పవిత్ర క్షేత్రం స్వచ్ఛంగా, వెన్నెలలో ప్రకాశించే చంద్రుడిలా అద్వితీయమైన, అగోచరమైన దివ్యచైతన్యంతో అక్కడక్కడ పెద్ద పెద్ద మామిడి, పనస తోటలు, సువిశాలమైన పొలాలగుండా ప్రయాణించే యాత్రికులకు కొబ్బరి, పోక చెట్లు తమ తలలూపుతూ స్వాగతం పలుకుతాయి.

విశిష్టాద్వైత మత స్థాపకులు మధ్వాచార్యుల పవిత్ర హస్తాల మీదుగా స్థాపితమైన మఠం ఉడుపి. కనకదాసు అనే పరమభక్తుడిని నిమ్న కులస్థుడనే కారణంతో పూజారులు కృష్ణ దర్శనానికి నిరాకరించగా స్వయంగా తానే తన ప్రియభక్తునికి ప్రత్యక్ష దర్శనమిచ్చిన కరుణామూర్తి ఉడుపి చిన్నికృష్ణుడు. ఉడుపి పూర్వపు పేరు శివళ్ళీ. ఇది పరశురామక్షేత్రాలలో ప్రథమస్థానం కలిగి ఉంది. ప్రతి సంవత్సరం, లక్షలాది భక్తులు కృష్ణుని దర్శనం చేసుకోవటానికి ఉడుపిని సందర్శిస్తారు. స్వామి దర్శనం నవరంధ్రాలున్న కిటికీ ద్వారా చేసుకోవలసి ఉండటం ఈ దేవాలయ ప్రత్యేకత. ఉడుపి రథవీధిలో శ్రీ కృష్ణమందిరం ఉంది. ఉత్తర ద్వారం గుండా గుడిలోకి ప్రవేశించినప్పుడు కుడివైపు దేవాలయ కార్యాలయం, ఇంకొద్దిగా ముందుకు వెళ్ళితే మధ్వ సరోవరం కనిపిస్తుంది. ప్రధాన ఆలయానికి ద్వారం ఎడమవైపు ఉంటుంది. కొద్దిగా ముందుకు వెళితే చెన్నకేశవ ద్వారం వస్తుంది. దీని ద్వారా గర్భగుడిలో ప్రవేశం పీఠాధిపతులకు తప్పితే అన్యులకు ఉండదు. చెన్నకేశవ స్వామి ద్వారం నుండి ముందు వెళ్ళితే ప్రదక్షిణం చేసిన తరువాత శ్రీకృష్ణ దర్శనం వెండితో తాపడం పెట్టిన నవరంధ్రాల గవాక్షం గుండా చేసుకోవచ్చు. గర్భగుడికి కుడివైపు ముఖ్యప్రాణ దేవత (హనుమంతుడు), వామభాగాన గరుడ దేవర ఉన్నారు. స్వామి దర్శనం చేసుకొని ముందుకు వెళ్ళి దక్షిణ మార్గం వైపు వెళితే, ఎడమభాగాన మధ్వాచ్యారులు మంటపం కనిపిస్తుంది. ఉడుపి శ్రీకృష్ణ మఠానికి అనుసంధానంగా అష్టమఠాలు కృష్ణ మఠాలు ఉన్నాయి. ఈ ఎనిమిది మఠాలు ఉడుపి రథవీధిలో, శ్రీ కృష్ణ దేవాలయానికి చుట్టూ ఉంటాయి. అవి: పుత్తగె, పేజావర, పలిమారు, అదమారు, సోదె, శీరూరు, కాణియూరు, కృష్ణాపుర.

మధ్వాచార్యులవారు ఒకసారి సముద్రంలో తుఫానులో చిక్కుకున్న ఓడను, అందులోని ప్రయాణికులను తన తపశ్శక్తితో రక్షించాడు. అప్పుడు ఓడలోని నావికుడు ఆయనకు గోపీచందనం మూటను కానుకగా సమర్పించాడు. మధ్వాచార్యులు ఆ మూటను విప్పి చూడగా, ఆ చందనపు కణికల మధ్య చిన్నికృష్ణుడి విగ్రహం కనిపించింది. అది శ్రీకృష్ణుడి లీలగా భావించిన మధ్వాచార్యులవారు ఆ కృష్ణుడి విగ్రహాన్ని ఉడుపిలో ప్రతిష్ఠించారు. అదే మనం చూస్తున్న విగ్రహం. కనకదాసుకు కృష్ణపరమాత్మ పశ్చిమాభిముఖుడై దర్శనమిచ్చిన చోటనే ఒక మంటపం కట్టించారు. ఆ మంటపానికే కనకదాసు మంటపమని పేరు. ఉడుపిలో జరిపే పండుగలు, పర్వదినాలు: మకర. సంక్రాంతి, మధ్వ నవమి, హనుమాన్‌ జయంతి, శ్రీ కృష్ణ జన్మాష్టమి, నవరాత్రి మహోత్సవం, మధ్వ జయంతి (విజయ దశమి), నరక చతుర్దశి, దీపావళి, గీతాజయంతి వంటి పండుగలను పర్యాయ మఠంలో అంగరంగవైభవంగా జరుపుతారు.

దగ్గరలో ఉన్న మరికొన్ని ముఖ్య ప్రదేశాలు: 

కొల్లూరు ముకాంబికా దేవాలయం, మరవంతె బీచ్, మల్పే రేవు, కాపు దీపస్తంభం (కాపు లైటు హౌసు), కార్కళలోని గోమటేశ్వరుడు, వేణూరులోని గోమటేశ్వరుడు, అత్తూరులో సెయింట్‌ లారెన్స్‌ ఇగర్జి, సెయింట్‌ మేరీస్‌ ద్వీపం, మూడబిదరెలో సావిరకంబద బసది మణిపాల్, బైందూరు కోసళ్ళి జలపాతం, జామియా మసీదు, 200 సంవత్సరాల జామియా మసీదులో సరికొత్తగా 18,000 మంది ప్రార్థనలు చేసే విధంగా ప్రార్థనాశాలలున్నాయి. ఇక్కడ 3000 మంది భక్తులు బసచేయవచ్చు.

పాజక: ఉడిపి నుండి 12 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ మాధవాచార్యుడు ద్వైతసిద్ధాంత ప్రసంగం చేశాడు.
కొల్లూరు: ఉడిపి నుండి 74 కి.మీ దూరంలో ఉంది. మూకాంబికాదేవి నివాసిత ప్రదేశమని భక్తుల విశ్వాసం.
కర్కల: ఉడిపి నుండి 37 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ జైన బసదీలు (ఆలయాలు), గోమటేశ్వర శిల్పం (బృహద్రూపం ) ప్రత్యేక ఆకర్షణ.
అనెగుడ్డె: ఉడిపి నుండి 30 కి.మీ.లు. ఇక్కడ ప్రముఖ గణేశాలయం ఉంది.
ఆత్తుర్‌ చర్చి: ఉడిపి నుండి 25 కి.మీ.లు. ఇక్కడ ఏటా నిర్వహించే సంతకు కులమతభేద రహితంగా ప్రజలు వస్తారు.
బర్కూర్‌: ఉడిపి నుండి 15కి.మీల దూరం. జైన బసదీలు ఉన్న బర్కూరు తులునాడు రాజులకు రాజధాని.
సాలిగ్రామ: ఉడిపి నుండి 27కి.మీల దూరం. ఇక్కడా గురునరసింహస్వామి ఆలయం ఉంది.
పరంపల్లి: ఇక్కడ ఎనిమిది వందల ఏళ్ల నాటి పురాతనమైన విష్ణుమూర్తి ఆలయం ఉంది.
పెర్నకిల: ఇక్కడ ఒక పురాతన గణేశుని ఆలయం ఉంది.
పెర్దోర్‌: ఉడిపి నుండి 22 కి.మీ దూరంలో ఉంది.
అగుంబే – షిమోగా రాష్టీయ్ర రహదారి సమీపంలో అనంతపద్మనాభస్వామి ఆలయం ఉంది.
హరియాద్క: ఉడిపి నుండి 16 కి.మీలు. పురాతనమైన వీరభద్రాలయం ఉంది.
శంకరనారాయణ: ఉడిపి నుండి 40 కి.మీలు. శకరనారాయణాలయం ఒక సరోవరం మధ్యన ఉండడం విశేష ఆకర్షణ.
మారనకట్టె: ఉడిపి నుండి 45 కి.మీలు. ఈప్రాంతం ప్రకృతి ఆరాధకులకు స్వర్గభూమివంటిది.
మందర్హి: ఉడిపి నుండి 20 కి.మీలు. ఇక్కడ అమ్మనవారు (దుర్గాపరమేశ్వరి) ఆలయం ఉంది. ఇక్కడ ప్రసాదంగా ఇచ్చే ‘దోశ‘ సంతానప్రాప్తి కలిగిస్తుందని ప్రజలు విశ్వాసం.
ముదుహోలె కర్కడ: ఇక్కడ పురాతన దుర్గాపరమేశ్వరి ఆలయం ఉంది.
సోమేశ్వర వన్యప్రాణి అభయారణ్యం: ఇది ఉడిపి నుండి 40 కి.మీలు. ఇక్కడ అరుదైన జంతువులు, పక్షులు, ఔషధ మొక్కలు ఉన్నాయి.
మూకాంబికా వన్యప్రాణి అభయారణ్యం: ఇది ఉడిపి నుండి 50 కి.మీలు. కుందపూర్‌– కొల్లూర్‌ రోడ్డు పక్కన విస్తరించి ఉంది.
కుర్ధు తీర్ధ జలపాతాలు: ఉడిపి నుండి 42 కి.మీలు. పశ్చిమ కనుమలలోని దట్టమైన అరణ్యాల మధ్య, 300 అడుగులున్న ఒక అందమైన జలపాతం. ఋషుల తపస్సుతో ఈ మడుగు ఎంతో పవిత్రతను, ప్రాధాన్యతను సంతరించుకుంది.
మంగ తీర్ధ: కుర్ధు తీర్ధకు ఎగువన మంగ తీర్ధ ఉంది. ఇది దట్టమైన అరణ్యాల మధ్య నిటారుగా ఉన్న పర్వతాలలో ఉంది కనుక ఇక్కడకు కోతులు తప్ప మానవమాత్రులు చేరలేరు కనుక దీనిని కోతుల తీర్థం అని కూడా అంటారు.
బర్కన జలపాతం: ఉడిపి నుండి 54 కి.మీ దూరంలో ఉంది. ఇది పశ్చిమ కనుమలలో ఉడిపి, చికమగళూరు, శివమొగ్గ కూడలి ప్రాంతంలో ఉంది; బెల్కల్‌ తీర్థ జలపాతం, అరసిన గుండి, కుద్లు తీర్థ, కొసల్లి జలపాతం, సౌపర్ణిక, స్వర్ణ, చక్ర, సీత, వర్హి, కుబ్జ నదులున్నాయి. ఈ నదులలో అందమైన నదీ ద్వీపాలు ఉన్నాయి. వీటిని కుర్దూలు అంటారు. వీటిలో కొన్ని ద్వీపాలలో జనావాసాలు ఉన్నాయి.

విశేషాల ఉడిపి
శ్రీ కృష్ణుని రథానికి బ్రహ్మరథమని పేరు. ఇది బంగారంతో రూపొందింది.
శ్రీ కృష్ణుని ఉత్సవ విగ్రహాన్ని రత్నఖచితమైన సింహాసనంపై ఉంచుతారు.
అలనాడు శ్రీ కృష్ణుడు కనకదాసుకు దర్శనమిచ్చిన గవాక్షం(కిటికీ)లో నుంచే ఈ నాటికీ భక్తులు స్వామిని దర్శనం చేసుకుంటున్నారు.

ఎలా వెళ్లాలి?
దేశంలోని అన్ని ప్రధాన నగరాలనుంచి మంగుళూరుకు రైళ్లు, బస్సులు ఉన్నాయి. అక్కడి నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉడుపికి బస్సులు, ప్రైవేటు వాహనాలలో చేరుకోవచ్చు. హైదరాబాద్‌ నుంచి ఉడుపికి నేరుగా బస్సులున్నాయి. హైదరాబాద్‌ డెక్కన్‌ నుంచి వాస్కోడిగామా ఎక్స్‌ప్రెస్‌ ఉంది.
– డి.వి.ఆర్‌.భాస్కర్‌

ద్వారక - మునిగి తేలిన నగరం

ద్వారక
మునిగి తేలిన నగరం


ద్వారకనగరాన్ని శ్రీ కృష్ణుడు పరిపాలించాడని పురాణాల్లో చదువుకున్నాం కదా... ఆయన తన అవతారాన్ని చాలించి వైకుంఠం చేరిన తరువాత ఈ పవిత్ర నగరం సముద్రపు జలాలలో మునిగిపోయింది. మహాభారత యుద్ధం జరిగిన 36 సంవత్సరాల అనంతరం ఈ నగరం సముద్రంలో కలిసి పోయింది. విష్ణు పురాణం ద్వారకానగర మునక గురించి ప్రస్తావించింది. యాదవ ప్రముఖులు గాంధారి శాపప్రభావాన, మునుల శాపప్రభావాన తమలో తాము కలహించికొని నిశ్శేషంగా మరణిస్తారు. ఆ తరువాత శ్రీ కృష్ణుని ఆదేశం మీద అర్జునుడు యాదవకుల సంరక్షణార్థం ఇక్కడకు వచ్చి శ్రీకృష్ణ బలరాములకు అంత్యక్రియలు నిర్వహించి ద్వారాకాపుర వాసులను ద్వారక నుండి దాటించిన మరు నిమిషం ద్వారక సముద్రంలో మునిగిపోయింది. ద్వారకానగరం మునిగిపోవడంతో ద్వాపరయుగం అంతమై కలియుగం ప్రారంభమైంది.

పదహారో శతాబ్దంలో ఈ అలయ నిర్మాణం జరిగినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. శ్రీకృష్ణుని ముదిమనుమడు వజ్రనాభుడు ఈ ఆలయానికొక రూపునిచ్చాడని చెబుతారు. ప్రస్తుతం మనకు కనిపించే అయిదంతస్తుల దివ్య ఆలయ శిఖరం మీద సూర్యచంద్రుల చిహ్నాలతో విలసిల్లే పతాకం కనిపిస్తుంది. ఈ ఆలయంలోకి స్వర్గ, మోక్షద్వారాలనే రెండు ద్వారాల గుండా ప్రవేశించవచ్చు. గర్భగుడిలో నాలుగు భుజాలతో విలసిల్లే త్రివిక్రమ(వామన) మూర్తి ఉన్నారు. ఆలయ సమీపంలో బలరాముడికి, కృష్ణుడికీ కుమారుడు, మనుమడూ అయిన ప్రద్యుమ్న అనిరుద్ధులకూ, శివకేశవులకూ ప్రత్యేకమైన పూజాస్థానాలున్నాయి. ఈ ఆలయంలో దేవకి, జాంబవతి, సత్యభామల విగ్రహాలు కూడా ఉన్నాయి. రుక్మిణీదేవికి మాత్రం ఈ ఆలయానికి దూరంగా ప్రత్యేకమైన ఆలయం ఉంది. ఆమె శ్రీకృష్ణుని అష్టమహిషుల్లో ప్రధానమైనది కాబట్టి ఈ ఆలయానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. గోమతీ నది సముద్రంలో కలిసే చోటున ద్వారకాధీశుని ఆలయం ఉంది.

ఈ క్షేత్రానికి సమీపానే గోమతీ నది సముద్రంలో సంగమిస్తుంది. అక్కడ నుండి బస్సుమార్గంలో బేట్‌ ద్వారక చేరాలి. ఇది శ్రీ కృష్ణుని నివాస స్థలం. ఇక్కడ స్వామి శంఖ చక్రధారియై ఉపస్థితమై ఉన్నాడు. దీనికి ఐదు కి.మీ. దూరంలో శంఖతీర్థం ఉంది. ఇక్కడ పెరుమాళ్ళ వక్షస్థలాన శ్రీదేవి ఉపస్థితమై ఉంది. రుక్మిణీదేవి ఉత్సవ తాయార్‌. ఇక్కడ అనేక సన్నిధులు ఉన్నాయి. ఇక్కడ నిత్యం తిరుమంజనం జరుగుతుంది. పసిపిల్లాడిలా–రాజులా–వైదికోత్తమునిలా అలంకారాలు జరుగుతుంటాయి. ద్వారక నుండి ఓఖా పోవుమార్గంలో ఐదు కి.మీ.ల దూరాన రుక్మిణీదేవి సన్నిధి ఉంది. ఇదే రుక్మిణీ కల్యాణం జరిగిన ప్రదేశం. ద్వారకాపురిలో వసుదేవ, దేవకి, బలరామ, రేవతి, సుభద్ర, రుక్మిణీదేవి, జాంబవతీదేవి, సత్యభామాదేవి ఆలయాలు కూడా ఉన్నాయి. బేట్‌ ద్వారక ఆలయానికి వెళ్ళే మార్గంలో రుక్మిణీదేవికి ప్రత్యేక ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని బోటులో ప్రయాణించి చేరుకోవాలి.

పవిత్ర నగరం
ద్వార్‌ అనే పదానికి సంస్కృత భాషలో వాకిలి, ద్వారం లాంటి అర్థాలు ఉన్నాయి. ద్వార్‌ అనే పదం ఆధారంగా ఈ నగరానికి ఈ పేరు వచ్చింది. అనేక ద్వారాలు ఉన్న నగరం కనుక ద్వారక అయింది. హిందువులు అతి పవిత్రంగా భావించే చార్‌ ధామ్‌ (నాలుగు ధామాలు) లలో ద్వారకాపురి ఒకటి. మిగిలిన మూడు పవిత్రనగరాలు బద్రీనాథ్, పూరి, రామేశ్వరం. ద్వారకాధీశుని ఆలయాన్ని జగత్‌మందిరం అని పిలుస్తారు. ఈ ఆలయ ప్రధాన దైవం శ్రీకృష్ణుడు. ద్వారకాపురి సమీపంలో జ్యోతిర్లింగాలలో ఒకటైన నాగేశ్వరలింగం ఉంది. ద్వారకలో శంకరాచార్యుడు ద్వారకా పీఠం స్థాపించబడింది. ఆది శంకరాచార్యులవారు నెలకొల్పిన నాలుగు మఠాలలో ఇది ఒకటి. మిగిలినవి శృంగేరి, పూరి, జ్యోతిర్మఠం. ద్వారకా పీఠాన్ని కాళికా పీఠంగా కూడా అంటారు.

శ్రీద్వారకనాథ్‌ మహాత్యం
ఆదిశంకరులు ద్వారకాధీశుడిని దర్శించి ద్వారకాపీఠాన్ని ప్రతిష్ఠించాడు. ఇక్కడ కృష్ణుడు క్షత్రియ రాకుమార వివాహ అలంకరణలో దర్శనం ఇస్తాడు. 108 దివ్యదేశాలలో ఈ క్షేత్రం ఒకటి. ద్వారకానా«థుడికి అనేక సేవలు, దర్శనాలు ఉంటాయి. దర్శనలకు తగినట్లు వస్త్రధారణలో మార్పులుంటాయి.

ద్వారకాసామ్రాజ్యం
మహాభారతం, హరివంశం, స్కాంద పురాణం, భాగవత పురాణం, విష్ణుపురాణాలలో ద్వారకాపురి ప్రస్తావన ఉంది. ప్రస్తుత ద్వారకాపురి సమీపంలో శ్రీ కృష్ణ నిర్మితమైన ద్వారాపురి ఉండేదని. పురాణేతిహాసాలలో వర్ణించబడిన విధంగా అది సముద్రగర్భంలో కలసిపోయిందని విశ్వసిస్తున్నారు. శ్రీ కృష్ణుడు యుద్ధాల వలన జరిగే అనర్థాల నుండి ద్వారకావాసులను రక్షించే నిమిత్తం ద్వారకానగర నిర్మాణం చేసి యాదవులను ఇక్కడకు తరలించి సురక్షితంగా పాలించాడని పురాణ కథనాలు వర్ణిస్తున్నాయి.  ద్వారకా నగరాన్ని శ్రీ కృష్ణుడి ఆజ్ఞానుసారం విశ్వకర్మ నిర్మించాడని ప్రతీతి. సౌరాష్ట్ర పడమటి సముద్రతీరంలో ఈ భూమి నగర నిర్మాణార్థ్ధం ఎంచుకోవడమైంది. ఈ నగరం ప్రణాళిక చేయబడి తరువాత నిర్మించబడింది. గోమతీనదీ తీరంలో ప్రణాళికాబద్ధంగా నిర్మించబడిన నగరం ద్వారక. ఈ నగరానికే ద్వారామతి, ద్వారావతి కుశస్థలి అని పేర్లున్నాయి. ఇది నిర్వహణా సౌలభ్యం కోసం ఆరు విభాగాలుగా విభజించి నిర్మించబడింది. నివాస ప్రదేశాలు, వ్యాపార ప్రదేశాలు, వెడల్పైన రాజమార్గాలు, వాణిజ్యకూడళ్లు, సంతలు, రాజభవనాలు, అనేక ప్రజోపయోగ ప్రదేశాలతో నిర్మితమైనది. రాజ్యసభా మంటపం పేరు సుధర్మ సభ. రాజు ప్రజలతో సమావేశం జరిపే ప్రదేశం ఇదే. ఈ నగరం సుందర సముద్రతీరాలకు ప్రసిద్ధం.

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషన్‌ టెక్నాలజీకి చెందిన ఒక బృందం చేసిన పరిశోధనలలో సముద్రగర్భంలోని ద్వారాపురి కనుగొనబడింది. ఆరు మాసాల పరిశోధనానంతరం 2000 డిసెంబరు మాసంలో కనుగొన్నారు. ఈ పరిశోధనానంతరం అదే విద్యాసంస్థ 2001లో జరిపిన పరిశోధనలో సముద్రజలాల్లో మునిగి ఉన్న కళాఖండాలను స్వాధీనపరచుకున్నారు. అలా లభించిన కళాఖండాలలోని భాగాలు యు. కె లోని ఆక్స్‌ఫర్డ్, జర్మనీ లోని హానోవర్‌ అలాగే పలు భారతీయ విద్యాసంస్థలకు కాలనిర్ణయ పరిశోధనా నిమిత్తం పంపారు.

బేట్‌ ద్వారక
బేట్‌ ద్వారక ప్రధాన దైవమైన శ్రీ కృష్ణుని ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. పురాతన హిందూ సంప్రదాయానికి బేట్‌ ద్వారక ప్రసిద్ధి చెందింది. ఇక్కడ సముద్రతీర ప్రదేశాలు పురాతన వస్తువులకు ప్రసిద్ధి చెందినవి. ఇక్కడ లభించే మట్టి పాత్రల అవశేషాలు క్రీస్తు శకంలో సముద్రతీర దేశాలతో జరిగిన వ్యాపార, వాణిజ్యాలకు తార్కాణం. ఈ పుష్కలమైన రేవుపట్టణం మతప్రధానమయిన కేంద్రం. శ్రీ కృష్ణుడు అవతారం చాలించి వైకుంఠానికి వెళ్ళిన తరువాత సముద్రగర్భంలో కలసి పోయిందనే విశ్వాసానికి బలం చేకూరుతోంది. నిర్మాణశాస్త్ర నిపుణుల బృందాల పరిశోధనా ఫలితంగా అనేక పురాతన కళాఖండాలు సముద్రగర్భం నుండి వెలికి వచ్చాయి. ఇక్కడ అధిక సంఖ్యలో లభించిన రాతి లంగర్లు పురాతనకాలంలో ఉన్న రేవుపట్టణాలలో బేట్‌ ద్వారక చాలా ప్రముఖమైనదని సూచిస్తున్నాయి. బేట్‌ ద్వారక పరిసరాలు నౌకలు సురక్షితంగా నిలవడానికి అవకాశం కల్పిస్తూ ఈ నగరాన్ని సముద్రతరంగాల నుండి రక్షించిందని తెలియజేస్తున్నాయి.

ఎలా వెళ్లాలి?
హైదరాబాద్‌ నుంచి అహ్మదాబాద్‌కు విమానంలో వెళ్లి, అక్కడి నుంచి ద్వారకకు రోడ్డు మార్గాన వెళ్లవచ్చు.
సికింద్రాబాద్, అహ్మదాబాద్‌ ఓఖా ఎక్స్‌ప్రెస్‌లో ద్వారకకు సుమారు 39 గంటల ప్రయాణం. ద్వారక రైల్వేస్టేషన్‌ నుంచి పదినిమిషాలలో ద్వారకాధీశుని ఆలయానికి చేరుకోవచ్చు.

గోపరాజు పూర్ణిమాస్వాతి

Friday, 13 October 2017

సంతాన ప్రదాయిని కోట సత్తెమ్మ


సంతాన ప్రదాయిని కోట సత్తెమ్మ

పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో ఉంది కోట సత్తెమ్మ అమ్మవారి దేవస్థానం. అమ్మవారు భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు. కోరిన కొర్కెలు తీర్చే చల్లని తల్లిగా ప్రసిద్ధి చెందింది సత్తెమ్మ. శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారి దేవస్థానానికి పురాతన చరిత్ర ఉంది. అమ్మవారి విగ్రహం 11వ శతాబ్దంలోని తూర్పు చాళుక్యుల కాలానికి చెందినదని పరిశోధనలు చెబుతున్నాయి. అప్పట్లో నిడదవోలును నిరవధ్యపురంగా పిలిచేవారు. నిరవధ్యపురాన్ని పాలించిన వీరభద్రుని కోటలోని అమ్మవారు శక్తిస్వరూపిణిగా పూజలందుకున్నారు. కాలక్రమేణా కోట శిథిలమైంది. అమ్మవారి విగ్రహం కనుమరుగైంది. అలా అదృశ్యమైన అమ్మవారు 1934లో తిమ్మరాజుపాలెం గ్రామానికి చెందిన దేవులపల్లి రామసుబ్బరాయ శాస్త్రి పొలంలో, పొలం దున్నుతున్నప్పుడు బయటపడింది. భూమి యజమాని కలను అనుసరించి కోటసత్తెమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆనాటి నుంచి  నేటి వరకు అమ్మ... భక్తుల కోరికలు తీర్చే కొంగుబంగారంగా, వరాలిచ్చే చల్లని తల్లిగా పేరుగాంచుతోంది. ఈ ఆలయానికి ఉభయగోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్టణం, విజయనగరం, గుంటూరు, కృష్ణ, జిల్లాల భక్తులు అధికంగా విచ్చేస్తుంటారు. ఆలయంలో ఏటా దసరా ఉత్సవాలతోపాటు అమ్మవారి తిరునాళ్ళను వైభవంగా నిర్వహిస్తున్నారు.

శంఖచక్రగద అభయ హస్త యజ్ఞోపవీతధారిణిగా ఏకశిలా స్వయంభూ విగ్రహంతో త్రిశక్తి స్వరూపిణిగా వెలసిన అమ్మవారిని సందర్శించటానికి రెండుకళ్లూ చాలవేమోననిపిస్తుంది. ఈ ఆలయానికి  క్షేత్రపాలకుడు పంచముఖ ఆంజనేయస్వామి. 


అమ్మవారి దర్శనం కోసం ఏటా సుమారు 5 నుంచి 6 లక్షల మంది భక్తులు వస్తుంటారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తుల సౌకర్యార్థం ఇక్కడ 65 గదులు ఉన్నాయి. ఆలయానికి ప్రతి ఆది, మంగళవారాలలో భక్తులు విశేషంగా తరలివచ్చి తమ మెక్కుబడులు తీర్చుకుంటారు. చుట్టుపక్కల గ్రామాలలో ప్రతి కుటుంబంలోనూ కోటసత్యనారాయణ, కోటసత్తెమ్మ అనే పేర్లు తప్పనిసరిగా పెట్టుకుంటారు. ఏటా శ్రావణమాసంలో చివరి శుక్రవారం నాడు సుమారు 1000 మంది ముతైదువలతో ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలను వైభవంగా నిర్వహిస్తారు. ఈ వ్రతాలకు నిడదవోలు పట్టణంతో పాటు వివిధ గ్రామాల నుండి మహిళలు తరలిరావడంతో సందడి నెలకొంటుంది. దేవస్థానం ఆధ్వర్యంలో మహిళలకు ఉచితంగా పసుపు, కుంకుమ, గాజులు, తమలపాకులు, లడ్డూ ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు రోజుకి సుమారు 100 మందికి శాశ్వత అన్నదాన ట్రస్టు ద్వారా అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అమ్మవారి దేవస్థానం ముందు భాగంలో దాతల సహకారంతో తొమ్మిది అంతస్తుల రాజగోపురం నిర్మాణ పనులు సాగుతున్నాయి.

సంతాన వృక్షానికి పెరుగుతున్న  భక్తుల తాకిడి
శ్రీ కోటసత్తెమ్మ అమ్మవారి దేవస్థానంలో గర్భాలయానికి నైరుతి వైపున ఉన్న సంతాన వృక్షానికి రోజు రోజుకు భక్తుల తాకిడి పెరుగుతోంది. సంతానం లేని దంపతులు ఈ వృక్షానికి ఊయల కట్టడం సంప్రదాయం. సంతానం లేని దంపతులు ఈ వృక్షం దగ్గరకు చేరుకుని ఎర్రటి వస్త్రం, పూర్తిగా పండిన రెండు అరటిపండ్లను అమ్మవారికి సమర్పిస్తారు. అనంతరం ఒక అరటి పండును, ఎర్రటి వస్త్రాన్ని తీసుకుని దంపతులు సంతాన వృక్షానికి ఊయల కట్టి, ఆ ఊయలలో పండును ఉంచి, ‘అమ్మా... పండు కడుతున్నాను పండంటి బిడ్డను ప్రసాదించు తల్లీ’ అని వేడుకుంటారు. బిడ్డ పుట్టిన తరువాత అమ్మవారి సన్నిధి తీసుకువచ్చి పేరు పెట్టుకోవడంతోపాటు బిడ్డ ఎత్తు తులాభారంతో మొక్కుబడి తీర్చుకుంటారు. తులాభారానికి నగదు (నాణేల రూపంలో) లేదా పటిక బెల్లం తూకం సమర్పించుకుంటారు.

ఆలయానికి వచ్చే మార్గం...
అమ్మవారి ఆలయం నిడదవోలు రైల్వేస్టేషన్‌కి (బస్‌ స్టాండ్, గణపతి సెంటర్‌ల మీదుగా) 3 కిలోమీటర్ల దూరాన ఉంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుండి 26 కిలోమీటర్లు, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నుండి 25 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఆలయానికి చేరుకోవచ్చు.