Monday, 26 February 2018

ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహ ఆలయం

ఈ గుడికి వెళ్తే... యమబాధలు ఉండవట!


దక్షిణాభిముఖంగా ప్రవహించే గోదావరి నదీతీరంలో వెలసిన ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహ ఆలయం నవనారసింహ క్షేత్రాల్లో ఒకటిగా భాసిల్లుతోంది. దక్షిణ కాశీగా, తీర్థ రాజంగా, హరిహర క్షేత్రంగా విరాజిల్లుతున్న ఈ ఆలయం ఫిబ్రవరి 26 నుంచీ జరిగే బ్రహ్మోత్సవాలకు అంగరంగవైభవంగా ముస్తాబవుతోంది. దేశంలో మరెక్కడా లేని విధంగా ఆలయ ప్రాంగణంలో యమధర్మరాజు కోవెల ఉంది. ఈ కారణంగానే ‘ధర్మపురికి వస్తే యమపురి ఉండదు.’ అనే నానుడి ప్రసిద్ధి చెందింది.

‘దక్షిణాభిముఖీ గంగా యత్ర దేవోనృకేసరీ తత్ర శ్రీహృదయం తీర్థం కాశ్యాత్‌ శతగుణం భవేత్‌’... అనే శ్లోకం ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం విశిష్టతను చాటుతోంది. ఇక్కడ శ్రీలక్ష్మీనరసింహస్వామి యోగానంద రూపుడై భాసిల్లుతున్నాడు. స్వామివారి విగ్రహం మొత్తం సాలగ్రామ శిలతోనే తయారైంది. విగ్రహం చుట్టూ దశావతారాల ముద్రలు సుందరంగా కనిపిస్తుంటాయి. ప్రశాంత చిత్తంతో స్వామివారిని తలచినంతనే దుఃఖాలన్నీ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.

స్థలపురాణం ధర్మవర్మ అనే మహారాజు ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని పాలించడం వల్లే ధర్మపురి అనే పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. వేయి సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయం క్రీ.శ.1422-33 కాలంలో బహమనీ సుల్తానుల దండయాత్రలో ధ్వంసమైంది. తిరిగి ఈ ఆలయాన్ని 17వ శతాబ్దంలో పునరుద్ధరించినట్లు ధర్మపురి క్షేత్ర చరిత్ర తెలియజేస్తోంది. పామునే పతిగా పొందిన సత్యవతీదేవి ఎన్ని గుళ్లూగోపురాలూ తిరిగినా ఫలితం కనిపించలేదు. చివరికి ధర్మపురికి వచ్చి నృసింహస్వామిని దర్శించుకుందట. గోదావరిలో స్నానం ఆచరించగానే సత్యవతీదేవి భర్తకు సర్పరూపం పోయి సుందర రూపం వచ్చినట్లు స్థల పురాణం తెలుపుతోంది. అందువల్లే ధర్మపురిని దర్శించిన వారికి యమపురి ఉండదన్న నానుడి వచ్చిందని స్థానికుల విశ్వాసం. చారిత్రకంగానూ ఈ ప్రాంతం ప్రసిద్ధి పొందింది. ధర్మపురి పట్టణం వేదాలకూ, ప్రాచీన సంస్కృతికీ, సంగీత సాహిత్యాలకూ పుట్టినిల్లుగా పేరుగాంచింది. ఇక్కడ బ్రహ్మపుష్కరిణితోపాటు సత్యవతీ ఆలయం (ఇసుక స్తంభం) ప్రసిద్ధి చెందింది. స్వామివారిని దర్శిస్తే మానసిక, శారీరక బాధల నుంచి విముక్తి లభిస్తుందనీ, ఆయురారోగ్య, ఐశ్వర్యాలు సిద్ధిస్తాయనీ భక్తుల విశ్వాసం. దేవస్థానంలో పక్కపక్కనే ఉన్న ఉగ్ర, యోగస్వాముల ఆలయాలతోపాటు, శ్రీవేంకటేశ్వర, గోపాలస్వామి గుళ్లూ, ముందు భాగంలో శ్రీరామలింగేశ్వరుడి కోవెలా ఉన్నాయి.

ఉత్సవాలు ఏటా ఈ ఆలయంలో శ్రీనృసింహ నవరాత్రి ఉత్సవాలూ, శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవోపేతంగా నిర్వహిస్తారు. కార్తీక పౌర్ణమి రోజున కోనేరులో జరిగే పంచసహస్ర దీపాలంకరణల్లో పాల్గొనడానికి వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. అలాగే ధనుర్మాసంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలూ, ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నుంచి 13 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను ఇక్కడ ఘనంగా జరుపుతారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే కళ్యాణోత్సవం, డోలోత్సవం, రథోత్సవాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. గోదావరి నదీ తీరంలో ఏటా కార్తీకమాసంలో అమావాస్య నుంచి పౌర్ణమి వరకూ నిత్యం గంగాహారతి ఇస్తారు.

ఇలా చేరుకోవచ్చు జగిత్యాల జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో ధర్మపురి ఉంటుంది. ఇక్కడి నుంచి ప్రతి 20 నిమిషాలకో బస్సు బయల్దేరుతుంది. కరీంనగర్‌ నుంచి ధర్మారం, వెల్గటూర్‌, రాయపట్నం మీదుగా 60 కిలోమీటర్ల దూరం ప్రయాణించి చేరుకోవచ్చు. రైల్లో రావాలనుకుంటే మంచిర్యాల స్టేషన్‌లో దిగి, లక్సెట్టిపేట మీదుగా 40 కిలోమీటర్ల దూరం రోడ్డు మార్గంలో ప్రయాణించి ధర్మపురికి చేరుకోవచ్చు.

Sunday, 18 February 2018

మానస సరోవరం

మనోహరం మానస సరోవరం.

ఓం నమశ్శివాయ... ఓం నమశ్శివాయ...’ అంటూ కళ్లు మూసుకుని శివ ధ్యానం చేస్తే మనోఫలకం మీద నిత్యం చూసే శివరూపం సాక్షాత్కరమవుతుంది. కానీ ఆ శివ సాన్నిధ్యంలో తాదాత్మ్యం చెందాలంటే మాత్రం ఆయన కొలువైన ఆ కైలాసాన్నీ, దేవతల సరస్సుగా భావించే మానస సరోవరాన్నీ చూసి రావాల్సిందే’ అంటున్నారు ఇటీవలే కైలాస మానస సరోవర యాత్ర చేసి వచ్చిన హైదరాబాద్‌ వాసి ఎస్‌. గీతాంజలి.

మంచుకొండల్లోని మానససరోవరాన్నీ కైలాస పర్వతాన్నీ కళ్లారా చూడాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఆ భోళాశంకరుడి అనుగ్రహం ఇన్నాళ్లకు లభించినట్లుంది. మిత్రులంతా కలిసి ఈ యాత్రకు వెళుతున్నారని తెలుసుకుని నేనూ మా అమ్మాయితో బయలుదేరాను. అక్కడికి వెళ్లేందుకు అవసరమైన ఫిట్‌నెస్‌ కోసం రెండు నెలల ముందు నుంచే వాకింగ్‌, యోగా, ప్రాణాయామం చేశాం. యాత్రకు అవసరమైన మందులూ, థెర్మల్‌ దుస్తులూ, నూలుదుస్తులూ, షూ, గ్లోవ్స్‌... అన్నీ సిద్ధం చేసుకున్నాం.

ఎందుకంటే మానస సరోవరం, కైలాస శిఖరం రెండూ టిబెట్‌లోనే ఉన్నాయి. టిబెట్‌ ఓ ఎత్తైన పీఠభూమి. అక్కడ పగలు ఎండా, రాత్రి చలీ విపరీతంగా ఉంటాయి. కాబట్టి పగలు తేలికైన నూలు దుస్తులూ రాత్రివేళలో ధరించడానికి ఉన్ని దుస్తులూ కావాలి. ముఖ్యంగా పరిక్రమణ చేయాలనుకునేవాళ్లు సన్‌స్క్రీన్‌తోబాటు, ప్రథమ చికిత్సకు అవసరమైన మందులూ బ్యాండేజీలూ దగ్గర ఉంచుకోవాలి. హైదరాబాద్‌ నుంచి లఖ్‌నవూకి విమానంలో వెళ్లాం. అక్కడికి చేరేటప్పటికి నేపాల్‌ ట్రావెల్‌ ఏజెన్సీ వాళ్లు మమ్మల్ని ఆహ్వానించి నేపాల్‌ గంజ్‌కు తీసుకువెళ్లడానికి కార్లతో సిద్ధంగా ఉన్నారు. నాలుగు గంటల రోడ్డు ప్రయాణం అనంతరం నేపాల్‌ గంజ్‌ చేరుకున్నాం. టూర్‌ నిర్వాహకులు అన్ని సౌకర్యాలూ ఉన్న హోటల్‌ గది ఇచ్చారు. భోజనం చేసి సాయంత్రం నేపాల్‌ గంజ్‌లో శక్తిపీఠంగా పిలవబడే భాగేశ్వరి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నాం. అక్కడ సాయంత్రం ధూపదీపాలూ, ఘంటానాదాలూ, భజనలతో సాగే హారతి కార్యక్రమాలను చూసి ఆనందించాం. నేపాల్‌ యాత్రా నిర్వాహకులు ఎంతో ప్రణాళికతో ఉన్నా ప్రకృతి సహకరించకపోవడంవల్ల సెమికోట్‌కి వెళ్లలేకపోయాం.

దేవలోకం!
ఆ మర్నాడు వాతావరణం అనుకూలించడంతో సెమికోట్‌కు చార్టర్డ్‌ విమానంలో బయలుదేరాం. కొండల మధ్యలో నుంచి మేఘాలను తాకుతూ ప్రయాణించడాన్ని ఆనందించేలోగానే మళ్లీ వాతావరణం బాగోలేదని ఓ కొండ ప్రాంతంలో విమానాన్ని ఆపేశారు. దాంతో అందరం కిందకిదిగి కెమెరాలకు పనిచెప్పాం. చుట్టూ ఉన్న మంచుకొండల్ని ఫొటోల్లో బంధించాం. దాదాపు అరగంట తరవాత తిరిగి సెమికోట్‌కు బయలుదేరాం. సెమికోట్‌ సముద్ర మట్టానికి 2910 మీ. ఎత్తున ఉన్న ఓ చిన్న గ్రామం. ఇక్కడ ఇళ్లన్నీ కొండలమీదే ఉంటాయి. అదేరోజు హెలీప్యాడ్‌లో హిల్‌సా గ్రామానికి బయలుదేరాం.

హిల్‌సా సముద్ర మట్టానికి 3640 మీ. ఎత్తులో నేపాల్‌కీ టిబెట్‌కీ సరిహద్దులో ఉంది. చుట్టూ కొండలూ వాటిమధ్యలోంచి పారే సెలయేర్లూ... ఆ ప్రదేశం ఎంతో మనోహరంగా అనిపించింది. పైలట్‌ చాలా జాగ్రత్తగా విమానాన్ని నడుపుతున్నాడు. ఆ అరగంట ప్రయాణం జీవితంలో మర్చిపోలేని అనుభూతిని అందించింది. హిల్‌సాలో దిగగానే మాకోసం వేడి వేడి భోజనం తయారుచేశారు. అప్పటికే మా అందరికీ ఆల్టిట్యూడ్‌ సిక్‌నెస్‌ కారణంగా తలనొప్పి మొదలైంది. అది తగ్గాలంటే డయామాక్స్‌ మాత్రలు వేసుకోవాలని చెప్పారు. దాంతో హిల్‌సా నుంచి తిరుగు ప్రయాణం వరకూ రోజూ ఉదయంపూట మాకు ఆ ట్యాబ్లెట్లే శివప్రసాదం.

హిల్‌సా ప్రాంతం అంతటా సౌరశక్తినే వాడుతున్నారు. రాత్రి పది గంటలకు చీకటి పడింది. కాస్త వెలుతురు కూడా లేదు. చుట్టూ ఆ కొండల మధ్యలో, చందమామా నక్షత్రాల వెలుగులో ఆ రాత్రి మరో లోకంలో ఉన్నట్లే అనిపించింది. నిజంగా ఇది దేవలోకమేమో అనిపించిందో క్షణం.

మానస సరోవరం!
మర్నాడు ఉదయం హిల్‌సా నుంచి సరిహద్దు దాటి చైనాలో ప్రవేశించడానికి మా యాత్రా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లూ చేశారు. ఈ యాత్రకు పాస్‌పోర్టు తప్పనిసరి. ప్రభుత్వంతోబాటు ప్రైవేటు సంస్థలు కూడా ఈ యాత్రను నిర్వహిస్తున్నాయి కాబట్టి, మన పాస్‌పోర్టును వాళ్లకు పంపిస్తే, వాళ్లే చైనా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుంటారు. అదే గతంలో అయితే ప్రభుత్వం మాత్రమే కైలాసమానస సరోవర యాత్రను నిర్వహించేది. కానీ ఇటీవల అనేక ప్రైవేటు సంస్థలు కూడా దీన్ని నిర్వహిస్తున్నాయి. చైనా ఇమిగ్రేషన్‌ చాలా స్ట్రిక్టు. అవన్నీ పూర్తిచేసుకుని, నాలుగు చెక్‌పాయింట్లు దాటి తకలా కోట్‌లోని హోటల్‌కి చేరేటప్పటికి సమయం ఆరు గంటలు దాటింది. ఈ తకలా కోట్‌ సముద్ర మట్టానికి 4025 మీ. పైన ఉంది. అక్కడ అందరం మన రూపాయల్ని చైనా యెన్‌ల్లోకి మార్చుకున్నాం. ఎప్పుడెప్పుడు మానస సరోవరాన్ని చూద్దామా అన్న ఆలోచనతోనే తెల్లవారిపోయింది. మళ్లీ ఓ చెక్‌ పాయింట్‌ దాటి ఉదయం 11 గంటలకు మానస సరోవరానికి బయలుదేరాం. ముందుగా రాక్షస స్థల్‌ అనే ప్రాంతం వస్తుంది. ఇది రావణాసురుడు సృష్టించుకున్న ఓ పెద్ద సరోవరం అని చెబుతారు.

ఇక్కడకు చేరడంతోనే మంచు వర్షం కురవడం మొదలైంది. ఈ సరోవరంలో ఎవరూ స్నానం చేయరు. ఇది ఉప్పునీటి కొలను. ఇది మానస సరోవరానికి పడమర దిక్కుగానూ కైలాసానికి దక్షిణంగానూ ఉంటుంది. రావణాసురుడు ఇక్కడే తన పది శిరస్సుల్లో రోజుకో తలను ఖండిస్తూ శివదర్శనం కోసం తపస్సు చేశాడనీ, పదోరోజు శివుడు ప్రత్యక్షమై రావణాసురుడికి ఆత్మలింగాన్ని ప్రసాదించాడనీ చెబుతారు.

అక్కడి నుంచి మానస సరోవరం 23కి.మీ. దూరంలో ఉంది. దాన్ని చూడగానే ఓ అద్భుతంలా తోచింది. నీలం రంగులో ఎంతో ప్రశాంతంగా ఉందా సరస్సు. సుమారు 88 కి.మీ. చుట్టుకొలత ఉన్న ఆ సరస్సు చుట్టూ బస్సులోనే ప్రదక్షిణ చేశాం. అక్కడ మాకు స్నానాలు చేసేందుకు కూడా వీలుగా ఓ చిన్న టెంటు వేశారు నిర్వాహకులు. సరోవరంలో నీరు చాలా చల్లగా తేటగా మెరుస్తున్నాయి. అందరం గబగబా మూడు మునకలు వేసి బయటకు వచ్చాం. అందులో స్నానం చేయడం ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అనిపించింది. ఒడ్డు దగ్గరే దీపాలు వెలిగించాం. ఎవరికి తోచిన రీతిలో వాళ్లు పూజ చేసుకున్నారు. కొందరు యాగాలూ హోమాలూ కూడా చేశారు. మాకు దాని సమీపంలోనే సుమారు 20 అడుగుల దూరంలోనే టెంటులు వేసి వసతి ఏర్పాట్లు చేశారు.

దేవతలే దిగి వస్తే...
రాత్రివేళలో రెండు నుంచి నాలుగు గంటల మధ్యలో ఈ సరోవరానికి దేవతలూ గంధర్వులూ యక్షులూ స్నానాలు చేయడానికి వస్తారనీ వీళ్లు నక్షత్ర కాంతి మాదిరిగా గోచరిస్తారనీ పురాణాల్లో వింటుంటాం. ఇది నమ్మశక్యం కాకపోవచ్చు గానీ, మాకెందుకో రాత్రి 2.45 నిమిషాలకు ఆకస్మికంగా మెలకువ వచ్చింది. బయటకు వెళ్లి చూసేసరికి ఓ అద్భుతం మా కళ్లముందు నిలిచింది. సరోవరానికి అవతలి వైపునా సరోవరం మధ్యలోనూ ఆకాశంలోంచి సరోవరంలోకి దిగుతున్నట్లు నక్షత్ర కాంతులు కనిపించాయి. వాటిని చూడ్డానికి రెండుకళ్లూ చాల్లేదు. రెప్ప వేయకుండా మైనస్‌ 12 డిగ్రీల ఉష్ణోగ్రతలో గడ్డ కట్టించే చలిలో దాదాపు 45 నిమిషాలపాటు ఆ కాంతుల్ని చూస్తూనే ఉన్నాం. మా జన్మ ధన్యమైనట్లుగా భావించాం.

మర్నాడు మానస సరోవరం నుంచి కైలాస పర్వత దర్శనం కోసం వెళ్లాం. ముందుగా యమ ద్వారం వచ్చింది. దానికి మూడు ప్రదక్షిణలు చేసి ఓ ద్వారం గుండా వెళ్లి, రెండో ద్వారం గుండా బయటకు వచ్చాం. ఇక్కడ అందరూ తమ పితృదేవతల్ని స్మరించుకుని, నమస్కరిస్తారు. అక్కడి నుంచే కైలాస పర్వత దర్శనం చేసుకోవచ్చు. ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న ఆ రోజు రానే వచ్చింది అనుకుంటూ అంతులేని ఆనందంతో అందరం ఆ శిఖరాన్ని దర్శించుకున్నాం. అయితే కైలాస పర్వతంమీద మాత్రమే మంచు కనిపించింది. దాని పక్కనే అదే ఎత్తులో ఉన్న కొండలమీద ఎలాంటి మంచూ లేదు. అది మాకు ఎంతో చిత్రంగా అనిపించింది. పరిక్రమణ చేయడానికి వాతావరణం అనుకూలించకపోవడంతో హోటల్‌కు తిరిగి వచ్చేశాం. అదే కైలాస పర్వతం చుట్టూ పరికమ్రణ చేస్తే దేవతల లోయనీ, శివస్థల్‌, గౌరీకుండ్‌... వంటి ప్రదేశాలన్నీ కనిపిస్తాయట. అవన్నీ చూడలేకపోయినప్పటికీ పరమశివుడు కొలువైన ఆ కైలాసగిరినీ బ్రహ్మ సృష్టించిన ఆ దేవతల సరస్సునీ ప్రత్యక్షంగా చూడగలిగినందుకు ఆ పరమేశ్వరుడికి మనసులోనే ప్రదక్షిణ చేసుకుని, తిరుగు ప్రయాణమయ్యాం.


Wednesday, 14 February 2018

వేళకు సన్నద్ధం హాయిగా వెళ్లొద్దాం

వేళకు సన్నద్ధం హాయిగా వెళ్లొద్దాం

‘‘ఈ మధ్యాహ్నం ఎండను చూస్తుంటే.. వేసవి మొదలైందేమో అనిపిస్తోంది...!’’

రాత్రి చలి గిలి పెడుతున్నా.. భానూదయంతో సీను మారిపోతోంది.. వేసవి రావడానికి సిద్ధమవుతోంది. సమ్మర్‌ ఎంట్రీతో మండుటెండలు ఆ తర్వాత పిల్లలకూ, పెద్దలకూ హాయినిచ్చే సెలవులూ వచ్చేస్తాయి. మరి అప్పుడు ఎక్కడికి వెళ్లాలో.. ఓ మాట అనేసుకుందామా! అప్పుడే ఎందుకంటారా? ముందస్తుగా సన్నద్ధమైతే ప్రయాణం సాఫీగా సాగుతుంది. ఆర్థికంగానూ ఎంతో కొంత కలిసొస్తుంది. మీ ఆలస్యం ప్రయాణాన్ని భారం చేయవచ్చు. అందుకే ముందస్తు సన్నద్ధతతో.. అందుబాటు ధరల్లోనే ఆనందాన్ని ఆస్వాదించండి.

వేసవి వినోదాలలో విహారం కూడా ఒకటి. ప్రపంచ పటం ముందేసుకొని.. పిల్లలు వేలు పెట్టి చూపించిన దేశానికి తీసుకెళ్లే తల్లిదండ్రులూ ఉన్నారు. సెలవుల్లో ఎక్కడికి వెళ్లినా ఖర్చు తడిసి మోపెడవుతుందని పర్యటనను ఎప్పటికప్పుడు వాయిదా వేసే వాళ్లూ ఉంటారు. ఎవరి సౌకర్యం వారిది. ఎవరి కష్టం వారిది. ప్రణాళిక ప్రకారం ముందడుగు వేస్తే.. వీలైనంత తక్కువ ఖర్చులో సమ్మర్‌ టూర్‌ ముగించేయొచ్చని చెబుతున్నారు పర్యాటక నిపుణులు. ఈ లెక్కలన్నీ ఎక్కడికి వెళ్తున్నాం.. ఎలా వెళ్తున్నాం.. ఎంత తొందరగా ప్లాన్‌ చేసుకుంటున్నాం అన్నదానిపైనే ఆధారపడి ఉంటాయంటున్నారు.

ఊరించే ధరలు.. ఊహించని ఆఫర్లు..
వేసవిలో తెలుగు రాష్ట్రాల ప్రజలు విహార యాత్రల కంటే.. తీర్థయాత్రలకు ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. భక్త సంఘాలు, మిత్ర బృందాలు రకరకాల యాత్రలు చేస్తుంటాయి. నలుగురితో పాటు నారాయణ అనుకుంటే తప్ప దూర ప్రయాణాలు సాధ్యం కావు. తీర్థయాత్రల విషయంలో అయితే మరీనూ! వీటికి తోడు ప్రైవేట్‌ టూర్‌ ఆపరేటర్లు ప్రకటించే ప్యాకేజీలు ఉండనే ఉన్నాయి. ఊరించే ధరల్లో.. ఊహించని ఆఫర్లు రారమ్మని పిలుస్తుంటాయి. రామేశ్వరం మొదలు చార్‌ధామ్‌ వరకు టూర్‌ ప్యాకేజీలు కోకొల్లలుగా ప్రకటిస్తూనే ఉంటాయి. అమర్‌నాథ్‌, చార్‌ధామ్‌, నైమిశారణ్యం, కాశి-ప్రయాగ, సోమ్‌నాథ్‌-ద్వారక ఇలా ఉత్తర భారతావని యాత్రలకు సంబంధించిన ప్యాకేజీలు ఎక్కువగా పలకరిస్తుంటాయి. వీటి ధర రూ.12,000 నుంచి రూ.35,000 వరకూ ఉన్నాయి. వాటిలో ఉన్నతమైన ప్యాకేజీని ఎంపిక చేసుకోవడమే మన పని. ట్రావెల్‌ సంస్థను ఎంచుకునే ముందు ఆ సంస్థ విశ్వసనీయత, గత చరిత్ర గురించి తెలుసుకోవడం మరచిపోవద్దు.

లాభంతో వెళ్లి.. క్షేమంగా రండి..
ఏ టూరిస్ట్‌ ఆపరేటర్లతోనూ సంబంధం లేకుండా.. సొంతంగా వెళ్లే వాళ్లూ ఉంటారు. అయితే మీరు వెళ్లదలచిన ప్రదేశం గురించి వీలైనంత ఎక్కువ సమాచారం తెలుసుకోవాలి. పాస్‌పోర్ట్‌, వీసా వగైరా ఏర్పాటు చేసుకోవాలి. వీలైనంత తొందరగా విమాన టికెట్లు బుక్‌ చేసుకోవాలి. ఇప్పటికిప్పుడు వెళ్లాలనుకుంటే బ్యాంకాక్‌ విమాన టికెట్‌ ధర రూ.11,000- రూ.18,000 మధ్య ఉంది. అదే.. మే రెండో వారం టికెట్‌ ఇప్పుడే బుక్‌ చేసుకుంటే రూ.8,000-రూ.12,000కే దొరుకుతుంది. అన్ని రకాల విమాన టికెట్ల ధరల్లోనూ ఇలాంటి వ్యత్యాసం కనిపిస్తుంది. అప్పటికప్పుడు విహారానికి వెళ్దామని ఫిక్సయినవారికి ఈ ఆఫర్లు వర్తించవు. రెండు, మూడు నెలల ముందుగా ఓ నిర్ణయానికి వస్తే టికెట్ల దగ్గరే 20 శాతం లాభపడొచ్చు. ఇదే సూత్రం హోటల్‌ గదుల బుకింగ్‌కూ వర్తిస్తుంది. ముందుగా బుక్‌ చేసుకోవడం వల్ల పదోపరకో మిగుల్చుకోవచ్చు. యాప్‌ల సహకారం తీసుకుంటే.. ప్రయాణం స్మార్ట్‌గా సాగిపోతుంది. మొత్తానికి లాభంతో వెళ్లి.. క్షేమంగా తిరిగి రావొచ్చు.

భూటాన్‌ నుంచి బ్రిటన్‌ వరకు..
సంపన్నులే కాదు.. ఎగువ మధ్యతరగతి కుటుంబీకులూ విహారానికి విదేశాలకేగుతున్నారు. సిరిగలవారు బ్రిటన్‌, ఫ్రాన్స్‌, స్విట్జర్లాండ్‌ వంటి ధనిక దేశాలకు విడిదికి వెళ్తుంటారు. కాస్త భిన్నత్వం కోరుకునేవారు టర్కీ, ఈజిప్ట్‌, ఒమన్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. తీరంలో ఆనందం వెతుక్కోవాలని భావించిన వారు మాల్దీవులు, సీషెల్స్‌ ద్వీపాలు, మారిషస్‌ బాట పడుతుంటారు. జంతు ప్రపంచంలో విహరించాలనుకునే వారు దక్షిణాఫ్రికా, కెన్యా, జాంబియా దేశాలకు పయనమవుతారు. బడ్జెట్‌ ధరలో విదేశాలను చుట్టి రావాలనుకునే వారు థాయ్‌లాండ్‌, మలేషియా, ఇండోనేషియా (బాలి), నేపాల్‌, భూటాన్‌ దేశాలపై ఆసక్తి చూపిస్తుంటారు. ప్రసిద్ధ ప్రైవేట్‌ టూరిస్ట్‌ సంస్థలు విదేశీ పర్యటన ప్యాకేజీలు ప్రకటించేశాయి. 7 నుంచి 14 రోజుల వరకు ఆయా దేశాలు తిప్పిచూపిస్తామని చెబుతున్నాయి. యూరప్‌ ట్రిప్‌ ప్యాకేజీ ధర రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షల వరకూ పలుకుతోంది. కాస్త ముందుగా సంప్రదించే వారికి పది నుంచి పదిహేను శాతం తగ్గింపు లభించే అవకాశమూ ఉంది.

ఆలోచించి..
ఎక్కడికి వెళ్తున్నామన్నది ముందుగా తేల్చాలి. ఆ తరువాత ఎలా వెళ్లడం? అని ఆలోచించాలి. వేసవిలో చల్లటి నీడనిచ్చే ప్రదేశాలు మనదేశంలో ఎన్నో! ఉత్తరాదిలోనే కాదు... దక్షిణ భారతంలోనూ చాలానే ఉన్నాయి. కర్ణాటకలో కూర్గ్‌, తమిళనాడులో ఊటీ, కొడైకెనాల్‌, ఆంధ్రప్రదేశ్‌లో హార్స్‌లీహిల్స్‌ ఇవన్నీ వేస‘వినోద’ కేంద్రాలే! ఉత్తరాదిలోని కశ్మీర్‌ (లద్ధాఖ్‌, శ్రీనగర్‌, లెహ్‌, పహల్గామ్‌), ఉత్తరాఖండ్‌ (చార్‌ధామ్‌, రుషీకేష్‌, హరిద్వార్‌, డెహ్రాడూన్‌, నైనిటాల్‌, ముస్సోరి, అల్మోరా), హిమాచల్‌ప్రదేశ్‌ (సిమ్లా, కులు, మనాలి, డల్హౌసి), సిక్కిం, మేఘాలయ వంటి రాష్ట్రాల్లో కావాల్సినన్ని పర్యాటక కేంద్రాలున్నాయి. వీటిలో మనసుకు నచ్చిన ప్రదేశాన్ని ఎంచుకొని వేసవి విహారం మరచిపోలేని అనుభూతిగా మిగుల్చుకోండి.

ఆ రెండు నెలలు..
ప్రణాళిక ప్రకారం చేస్తే పనులన్నీ పక్కాగా జరిగిపోతాయి. ఇదే సూత్రం యాత్రలకూ వర్తిస్తుంది. ఆధ్యాత్మిక యాత్ర విషయంలో గుంపులో గోవింద అనే అవకాశం ఉంది కానీ, విహార యాత్ర విషయంలో అన్నీ ఓ పట్టాన తెమలవు. ఎక్కడికి వెళ్లాలో తేల్చడానికే కొన్ని రోజుల సమయం పడుతుంది. ఎలా వెళ్లాలో తేలేసరికి... అక్కడికి వెళ్లే రైళ్లన్నీ వెయిటింగ్‌ లిస్ట్‌ను సూచిస్తుంటాయి. ప్రైవేట్‌ ట్రావెల్‌ సంస్థల ఆఫర్లన్నీ అడుగంటిపోతాయి. విమానం టికెట్‌ ధరలకు రెక్కలొచ్చేస్తాయ్‌! ఎక్కడికి వెళ్లాలో.. త్వరగా నిర్ణయించుకుంటే.. రైళ్లో బెర్త్‌లు కన్‌ఫర్మ్‌ అవుతాయి. విమానం టికెట్ల విషయంలో మంచి బేరం కుదిరే అవకాశాలు ఉంటాయి. మంచి ప్యాకేజీలు దొరుకుతాయి. మనం చేయాల్సిందల్లా ముందుగా నిర్ణయానికి రావడమే! సహజంగా మన దేశంలో ఏప్రిల్‌ నుంచి జులై వరకు సమ్మర్‌ వెకేషన్‌గా భావిస్తారు. అందునా పిల్లలకు సెలవులుండే ఏప్రిల్‌-మే నెలల్లోనే ఎక్కువ యాత్రలు చేస్తుంటారు. ఫిబ్రవరి వచ్చేసింది. వెంటనే ఎక్కడికి, ఎప్పుడు, ఎలా వెళ్లాలో ఓ నిర్ణయానికి వచ్చేయండి. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు మొదలెట్టండి. మీరు సిద్ధమే కదా! రెడీ వన్‌.. టూ.. త్రీ.. హ్యాపీ జర్నీ!!మల్లెల తీర్థం - నల్లమల
నల్లమల కానలో మల్లెల వాన

కొండలు, లోయలు, భారీ వృక్షాలు, వాటికి అల్లుకున్న లతలు.. నల్లమల వనసౌందర్యం గురించి ఎంత చెప్పినా తక్కువే! సుమారు 3,500 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్న నల్లమల అడవుల్లో ఆధ్యాత్మిక కేంద్రాలు, జలపాతాలు, విహార కేంద్రాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి మల్లెల తీర్థం. నల్లమల సిగలో.. ప్రకృతి తురిమిన విరులపాతం ఇది. దట్టమైన అటవీ మార్గం గుండా సాగే మల్లెలతీర్థ యాత్ర మనసుకు ఉల్లాసాన్ని కలిగిస్తుంది.

హైదరాబాద్‌ నుంచి శ్రీశైలం వెళ్లే దారిలో వాతావర్లపల్లికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ మల్లెల తీర్థం. కిలోమీటర్‌ దూరం నుంచే జలధారల హోరు వినిపిస్తుంటుంది. జలపాతానికి కొంత దూరంలో టికెట్లు తీసుకోవాలి. ఎత్తయిన కొండ నుంచి సుమారు 300 మెట్లు దిగితే మల్లెల తీర్థం చేరుకోవచ్చు. సగం మెట్లు దిగామో.. లేదో.. చెట్ల గుబురుల నుంచి జలపాత విన్యాసాలు కనిపిస్తాయి.

వంద అడుగుల ఎత్తు..
మల్లెల తీర్థం జలపాతం ఎత్తు సుమారు 100 అడుగులు. రెండు పర్వతాల మధ్యనున్న లోయలో నుంచి దూకే జలపాతం నీళ్లు.. దిగువనున్న మరో లోయలోకి చేరుతాయి. పైనుంచి దూకే జలధారలు మల్లెల్లా మెరుస్తూ.. జడివానలా కురుస్తాయి. అందుకే ఈ జలపాతానికి మల్లెల తీర్థం అని పేరు వచ్చింది. ఫిబ్రవరి మాసాంతం వరకు ఇక్కడ జలధారలు కనువిందు చేస్తాయి. జలపాతం ముందుండే గుండం చాలా లోతుగా ఉంటుంది. గుండంలోని నీళ్లు రెండు గుట్టలను చీల్చుకుంటూ ఉత్తర దిశగా సాగుతాయి. కాస్తంత దూరంలోనే అరు చిన్న చిన్న జలపాతాలను ఏర్పరుస్తాయి. అయితే చెట్లు, గుబురుగా ఉన్న పొదలు కప్పేయడంతో వీటి దగ్గరికి వెళ్లడం కష్టమే!

మల్లెల తీర్థం పరిసరాల్లో స్థానిక గిరిజనులు అల్పాహారం, చిరుతిళ్లు అమ్ముతుంటారు. భోజనం, బస దొరకాలంటే జలపాతానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న మన్ననూరు (హైదరాబాద్‌ వైపు), దోమలపెంట (శ్రీశైలం వైపు) గ్రామాలకు చేరుకోవాలి. మన్ననూరులో వనమాలి గెస్టహౌజ్‌ విడిదికి అనుకూలం. దోమలపెంటలోని వన మయూరి అతిథి గృహం కృష్ణానది ఒడ్డున ఉంటుంది. ఇవి రెండూ అటవీ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. వనమాలి గెస్ట్‌హౌజ్‌ సమీపంలో పర్యావరణ విద్యా ప్రదర్శనశాల, షావలి దర్గా ఉంటాయి.

ఎలా వెళ్లాలంటే..

 • హైదరాబాద్‌ నుంచి శ్రీశైలం దారిలో.. మన్ననూరు దాటాక 25 కిలోమీటర్లకు వాతావర్లపల్లి గ్రామం వస్తుంది. అక్కడి నుంచి మల్లెల తీర్థానికి ఆటోలు అందుబాటులో ఉంటాయి.
 • శ్రీశైలం నుంచి వచ్చే వాళ్లు.. దోమలపెంట మీదుగా వాతావర్లపల్లికి చేరుకోవాలి. అక్కడి నుంచి ఆటోల్లో మల్లెల తీర్థం వెళ్లొచ్చు.

చూడాల్సిన ప్రదేశాలు

 • శ్రీశైలం (57 కిలోమీటర్లు)
 • టైగర్‌ సఫారీ, మన్ననూరు ఫారెస్ట్‌ చెక్‌పోస్ట్‌ (17 కిలోమీటర్లు)
 • లొద్ది మల్లన్న ఆలయం (25 కిలోమీటర్లు)
 • ఉమామహేశ్వర ఆలయం (47 కిలోమీటర్లు)Friday, 9 February 2018

బాహుబలికి మహామస్తకాభిషేకం!

బాహుబలికి మహామస్తకాభిషేకం!

ప్రముఖ జైన క్షేత్రాల్లో కర్ణాటక రాష్ట్రంలోని శ్రావణ బెళగొళ ఒకటి. అక్కడి గోమఠేశ్వరుడికి పన్నెండేళ్లకోసారి మహామస్తకాభిషేకాషాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఆ వేడుకను చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచీ లక్షల జనం హాజరవుతారు. ఫిబ్రవరి 17 నుంచి 25 వరకూ జరగనున్న ఈ ఉత్సవాలకు ఏడోతారీఖున నాంది పలకనున్నారు.

శ్రావణబెళగొళ పేరు పరిచయమున్నవారెవరికైనా ముందుగా గుర్తొచ్చేది అక్కడ కొలువై ఉండే ఎత్తైన గోమఠేశ్వరుడి విగ్రహమే. పొడవాటి చేతులూ బలిష్ఠమైన దేహం నిర్వికారమైన నవ్వుతో దిగంబరుడిగా కనిపించే ఈయన్నే బాహుబలి అనీ పిలుస్తారు. జ్ఞాన బోధకుడిగా, అహింసా మార్గాన్ని అనుసరిస్తూ శాంతిని పాదుగొల్పిన మహనీయుడిగా ఆయనకు జైన మతంలో పవిత్రస్థానముంది. కర్ణాటకరాష్ట్రం హాసన జిల్లా శ్రావణబెళగొళలో ఉన్న ఈయన విగ్రహానికి ఈ ఏడాది 89వ మహామస్తకాభిషేకాన్ని నిర్వహించనున్నారు.

ఎవరీ బాహుబలి...
జైన, విష్ణు పురాణాల్లో బాహుబలి ప్రస్తావన కనిపిస్తుంది. విష్ణుపురాణం ప్రకారం, జైన తీర్థంకరుల్లో మొదటివాడూ ఇక్ష్వాకు వంశస్థుడైన వృషభనాథుడు అయోధ్యను రాజధానిగా చేసుకుని పాలన చేసేవాడు. ఆయనకు సునందాదేవి, యశస్వతీదేవి అనే ఇద్దరు భార్యల ద్వారా భరతుడు, బాహుబలి అనే పుత్రులు కలిగారు. కొన్ని కారణాలవల్ల వృషభనాథుడు విరక్తుడై రాజ్యాన్ని విభజించి అయోధ్యకు భరతుడినీ, పోదనపురానికి(ఇప్పటి తెలంగాణలోని బోధన్‌ను) బాహుబలినీ రాజులుగా చేసి సర్వసంగపరిత్యాగుడయ్యాడు. జైత్రయాత్రలో భాగంగా బాహుబలితోనూ భరతుడు యుద్ధం చేయాలనుకున్నాడు. ఇద్దరూ యుద్ధ విద్యాసంపన్నులు కాబట్టి వీరి పోరు వల్ల అపార సైన్య నష్టం వాటిల్లుతుందని భయపడ్డ ఇరు పక్షాల మంత్రులూ సోదరులిద్దరే ఆయుధాలు లేకుండా యుద్ధం చేస్తే బాగుంటుందని చేసిన ప్రతిపాదనను వీరిద్దరూ అంగీకరించారు. మల్లయుద్ధంలో బాహుబలి భరతుణ్ణి పిడికిలితో గుద్ది చంపేయాలని చెయ్యి పైకెత్తాడు. అప్పుడు సోదరుడి కళ్లలో మరణ భయాన్ని చూసి చలించిపోయిన బాహుబలి, వెంటనే విరక్తుడయ్యాడు. రాజ్యం కోసం అన్నతో యుధ్ధమా అని బాధపడి, తన రాజ్యాన్ని సైతం భరతుడికి అప్పగించి, సన్యాసం తీసుకుని తపస్సుచేసి మహత్తర జ్ఞాన సంపన్నుడయ్యాడు.

అదే స్ఫూర్తితో...
అప్పట్లో బాహుబలి పాలించిన బోధన్‌లో అతి ఎత్తైన బాహుబలి విగ్రహం ఉండేదట. దాని స్ఫూర్తితో అప్పటి గంగరాజుల మంత్రి చాముండరాయ కర్ణాటకలోనూ అలాంటిదే నిర్మించాలని తలపెట్టి జైన మతానికి ఆలవాలంగా ఉన్న వింధ్యగిరిపై  క్రీ.శ.981లో దీన్ని ప్రతిష్ఠించి పన్నెండేళ్లకొకసారి మహామస్తకాభిషేకాన్ని జరిపే ఆనవాయితీని ప్రారంభించాడు. విగ్రహాన్ని చెక్కించాడు కాబట్టి తనొక్కడే దానికి అభిషేకం చేయాలని భావించి తొలుత అభిషేకోత్సవాల్లో ఎవర్నీ పాల్గొననివ్వలేదు. తెప్పించిన ద్రవ్యాలన్నీ అయిపోయినా బాహుబలి విగ్రహం కాళ్లదాకా తడవకపోవడం వల్ల అక్కడికి వచ్చిన ఒక వృద్ధురాలు తాను తెచ్చిన పాలు పోస్తానని అడగడంతో తప్పని పరిస్థితుల్లో ఆమెను అనుమతించాడట. అయితే ఆ పాలు విగ్రహాన్ని తడపడమే కాదు నేల మీది దాకా ఒక ధారలా ప్రవహించాయట. ఆ రోజు చాముండరాయ కళ్లు తెరిపించింది జైన దేవతేనని చెప్పుకుంటారు. అప్పటి నుంచీ ఆ వేడుకకి హాజరయిన జనమంతా అభిషేకంలో భాగస్వాములవుతూ ఉంటారు. 17వ తారీఖు నుంచి జరగబోయే ఈ అభిషేకానికి నీళ్లు, పసుపు, చందనం, సర్వౌషధి కషాయం, పువ్వులూ తదితరాలను వినియోగిస్తారు. విగ్రహానికి ఎదురుగా కూర్చుని ఆరువేల మంది దాకా పూజలు తిలకించొచ్చు. ఈ కొండకు ఎదురుగా ఉండే చంద్రగిరిపై నుంచీ రెండు లక్షల మంది వేడుకను వీక్షించగలిగేలా ఏర్పాట్లు చేశారు.

- జి.జగదీశ్వరి, న్యూస్‌టుడే, బెంగళూరు.

Thursday, 8 February 2018

భారతదేశ పర్యాటక ఆకర్షణలు
ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడికి
పదండి ప్రణాళిక ఇదండి

నడి వేసవిలో రాజస్థాన్‌ పర్యటనకు వెళ్తే ఆనందం ఏముంటుంది. భారీ వర్షాలప్పుడు హిమగిరి సోయగాలు చూస్తానంటే ఎలా కుదురుతుంది. ఒక్కో ప్రాంతం సందర్శించడానికి ప్రత్యేకమైన సమయం ఉంటుంది. ఆ కాలంలో వెళ్తేనే అసలైన ఆనందం దొరుకుతుంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు ఎప్పుడు వెళ్లాలి? అక్కడి పర్యాటక ఆకర్షణలు ఏమిటి? ఈ వివరాలు తెలుసుకోండి. ఏ సీజన్‌లో ఏ ప్రాంతానికి వెళ్లాలి, వేసవి సెలవుల్లో ఎక్కడ విహరించాలో.. ఇప్పట్నుంచే ప్రణాళికలు రూపొందించుకోండి.

రాజస్థాన్‌ - ఎడారి దారిలో

చుట్టూ ఉన్న ఎడారే రాజస్థాన్‌ పర్యాటక రంగానికి ఒయాసిస్‌! రాజులు పోయినా.. వారు నిర్మించిన ప్రాసాదాలు నేటికీ ఠీవీగా దర్శనమిస్తున్నాయి. వేసవిలో నిప్పుల కొలిమిలా ఉండే ఈ ఎడారి ప్రాంతం.. శీతాకాలంలో దేశవిదేశాల నుంచి వచ్చే పర్యాటకులతో భలేగా ఉంటుంది.
November‌ - February: పర్యటనకు అనుకూల సమయం. ఇదే సీజన్‌లో ఇక్కడ బికనీర్‌ ఒంటెల పండగ, జైపూర్‌ మ్యూజిక్‌ ఫెయిర్‌, ఫుష్కర్‌ ఫెయిర్‌, జైసల్మేర్‌ ఫెస్టివల్‌ ఇలా సంప్రదాయ పండగలు ఎన్నో జరుగుతుంటాయి. థార్‌ ఎడారిలో జీప్‌ సఫారీ మంచి జ్ఞాపకంగా మిగిలిపోతుంది.

June‌ - September: పేరుకే వానాకాలం. కానీ, ఇక్కడ భారీ వర్షాలేం ఉండవు. ఈ సమయంలోనూ వెళ్లిరావొచ్చు.

దర్శనీయ స్థలాలు: జైపూర్‌, అజ్మీర్‌, బికనీర్‌, పుష్కర్‌, జోధ్‌పూర్‌, జైసల్మేర్‌...
కశ్మీరు లోయలో..

పర్యాటక ప్రియులు ఒక్కసారైనా చూడాలనుకునే ప్రాంతం జమ్మూ కశ్మీర్‌. సంస్కృతి, ఆహార్య వ్యవహారాలు ఆకట్టుకుంటాయి. హిమగిరి సొగసులు, శ్రీనగర్‌లో హౌస్‌బోటు షికారు మధురానుభూతిని మిగుల్చుతాయి.
January - February: దట్టమైన మంచుతో ఉంటుంది. స్కేటింగ్‌ విన్యాసాలు, హిమసీమల్లో విహరించాలని భావించేవారు ఈ సమయంలో వెళ్తుంటారు.

March - June‌: సమశీతోష్ణంగా ఉంటుంది. పిల్లలతో వచ్చి జాలీగా సెలవులు గడపవచ్చు.

September - October‌: లేహ్‌-లద్దాఖ్‌ దారిలో బైకులు దూసుకుపోతుంటాయి. కశ్మీరు లోయ సౌందర్యం చూడాలంటే ఇది అనువైన సమయం.

దర్శనీయ స్థలాలు: శ్రీనగర్‌, లెహ్‌, లద్దాఖ్‌, ఉదంపూర్‌, పుల్వామా, వైష్ణోదేవి ఆలయం
ఉత్తరాఖండ్‌ - ఆధ్యాత్మికం.. పర్యాటకం..

దైవ భూమిగా పేరొందిన ఉత్తరాఖండ్‌లో ఎన్నో పుణ్యతీర్థాలు ఉన్నాయి. చార్‌ధామ్‌ యాత్రలోని క్షేత్రాలన్నీ ఇక్కడే కొలువుదీరాయి. హిమాలయాల సౌందర్యం, హిమనీ నదుల వయ్యారాలు.. ఉత్తరాఖండ్‌ను పర్యాటక రాష్ట్రంగా తీర్చిదిద్దాయి.
December‌ - January: మంచు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. హిమాలయాల సౌందర్యం చూడాలనుకుంటే వెళ్లొచ్చు.

February - May: ప్రశాంత వాతావరణం ఉంటుంది. నైనిటాల్‌, డెహ్రాడూన్‌కు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది.

July-September:  భారీ వర్షాలు కురుస్తాయి. ఇది ప్రతికూల సమయం.

October‌ - November‌: సాహసక్రీడలకు అనుకూలం. మంచుతెరల్లో ఇక్కడి ప్రదేశాలు మరింత మనోహరంగా కనిపిస్తాయి.

దర్శనీయ స్థలాలు: చార్‌ధామ్‌ యాత్ర (కేదార్‌నాథ్‌, బద్రినాథ్‌, గంగోత్రి, యమునోత్రి), రుషీకేశ్‌, హరిద్వార్‌, నైనిటాల్‌, అల్మోరా, డెహ్రాడూన్‌
ఉత్తర్‌ప్రదేశ్‌-వారణాసి- పవిత్ర సంగమం

హిందువులు అత్యంత పవిత్రంగా భావించే వారణాసి ఉన్న రాష్ట్రం ఉత్తర్‌ప్రదేశ్‌. ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్‌మహల్‌ కూడా ఈ రాష్ట్రంలోనే ఉంది. ఆధ్యాత్మిక సుగంధాలు, గంగా, యమున తరంగాలు, నవాబుల హవేలీలు లాంటి ఎన్నో విశేషాల సంగమం ఉత్తర్‌ప్రదేశ్‌.
April‌ - May: ఎండలు ఎక్కువ. పర్యాటకుల సందడి తక్కువ. అయితే ఎండలు ఎలా ఉన్నా.. May మాసాంతంలో పర్యాటకులు కాశి, ప్రయాగ క్షేత్రాలకు వస్తుంటారు.

July - September: ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తుంటాయి. ఈ సమయంలో హోటల్‌ గదుల అద్దెలు తక్కువగా ఉంటాయి.

October‌ - February: పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. శివరాత్రి సమయంలో కాశిలో ఆధ్యాత్మిక వైభవం చూసి తీరాల్సిందే!

దర్శనీయ స్థలాలు: వారణాసి, ఆగ్రా, మథుర, లఖ్‌నవు, అలహాబాద్‌ (త్రివేణి సంగమం), అయోధ్య, ఝాన్సి, సారనాథ్‌, ఆలీగఢ్‌, ఫతేపూర్‌ సిఖ్రి
గుజరాత్‌ - సంప్రదాయాల పట్టుకొమ్మ

వాణిజ్య సంపదతో తులతూగే గుజరాత్‌లో పర్యాటక కేంద్రాలు చాలానే ఉన్నాయి. అతిథులను ఆకర్షించడంలో గుజరాత్‌ పర్యాటక శాఖ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్యాకేజీలు ప్రకటిస్తుంటుంది.
September - October‌: గుజరాత్‌లో దసరా, దీపావళి పండగలు ఘనంగా జరుగుతాయి. గుజరాతీయుల సంప్రదాయాలు, ఆచారాలు తెలుసుకోవాలనుకున్నా, ఆహార పదార్థాలు రుచి చూడాలనుకున్నా.. ఇది సరైన సమయం.

November‌ - February: ఇక్కడ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పర్యాటకుల తాకిడి ఎక్కువ. ఇదే సమయంలో రణ్‌ ఆఫ్‌ కచ్‌ ఫెస్టివల్‌ కూడా జరుగుతుంది. తెల్లటి ఇసుక తిన్నెల్లో.. వెన్నెలను చూసేందుకు వేలాదిగా పర్యాటకులు తరలి వస్తుంటారు.

దర్శనీయ స్థలాలు: సోమ్‌నాథ్‌ ఆలయం, ద్వారకా, అక్షరధామ్‌, అహ్మదాబాద్‌, సబర్మతి ఆశ్రమం, గిర్‌ అభయారణ్యం...
ఈశాన్య సౌందర్యం

ఈశాన్య భారతంలో పొదిగిన ఏడు రాష్ట్రాలు పర్యాటక రంగంలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాయి. సిక్కిం, మణిపూర్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, మేఘాలయ పర్యాటక కేంద్రాలుగా అలరిస్తున్నాయి. ఇక్కడి ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు, ప్రకృతి కట్టిపడేస్తాయి.
November‌ - February: చల్లటి వాతావరణం, నిర్మలమైన ఆకాశం ఆహ్లాదాన్నిస్తాయి.

June‌ - October‌: వర్షాలు కురుస్తుంటాయి. ఆకాశంలో కారుమబ్బులు, పర్వత పంక్తులపై మంచు తెరలు ప్రకృతికాంత సరికొత్తగా కనిపిస్తుంది. జలధారలతో లోయలన్నీ పొంగిపోతుంటాయి. పర్యాటకులకు కావాల్సినంత ఆనందం దొరుకుతుంది.

దర్శనీయ స్థలాలు: షిల్లాంగ్‌, చిరపుంజి (మేఘాలయ), జిరో, తవాంగ్‌ (అరుణాచల్‌ ప్రదేశ్‌), మాజులీ, గువాహటి (అస్సాం), ఐజ్వాల్‌ (మిజోరాం), ఇంఫాల్‌ (మణిపూర్‌)
గో.. గో.. గోవా

టీనేజ్‌ కుర్రాడి మొదలు.. ఓల్డేజ్‌ పెద్దాయన వరకు గోవా అనగానే.. లెట్స్‌ గో అంటారు. ఏడాది పొడుగునా పర్యాటకుల సందడి కనిపిస్తుందిక్కడ.
November‌ - February: దేశవిదేశాల నుంచి పర్యాటకులు వస్తారు. చిన్నా-పెద్దా కార్నివాల్స్‌ జరిగే సీజన్‌ ఇది.

July - September: ఈ సమయంలో గోవా అందంగా ఉంటుంది. చిరుజల్లుల వేళ బీచ్‌లో విహారం మరచిపోలేని అనుభూతినిస్తుంది.

April‌-May: పర్యాటకుల తాకిడి ఉండదు. ఎండలు తట్టుకునే స్థాయిలోనే ఉంటాయి. ఈ సమయంలో గదుల అద్దె తక్కువగా ఉంటుంది. బడ్జెట్‌ ధరలోనే స్టార్‌ హోటల్‌లో బస చేయవచ్చు.

చూడాల్సినవి: గోవా బీచుల్లో సరదాగా గడపవచ్చు. ఓల్డ్‌ గోవా మొత్తం చుట్టి రావొచ్చు.
తుంగ అల.. హంపి కళ

కర్ణాటకలో చారిత్రక ప్రాశస్త్యం కలిగిన ప్రాంతాలెన్నో ఉన్నాయి. పుణ్యక్షేత్రాలతో పాటు పర్యాటక కేంద్రాలకు కొదవలేదిక్కడ.
October‌ - February: అనుకూలం. మైసూర్‌ దసరా ఉత్సవాలు, హంపి ఉత్సవాలు ఈ సీజన్‌లోనే జరుగుతాయి.

June‌ - September: సీజన్‌ ఓ మోస్తరుగా ఉంటుంది. ఆధ్యాత్మిక కేంద్రాలకు పర్యాటకుల తాకిడి ఎక్కువ.

April‌ - May: వేసవిలో ఎండలు మెండుగా ఉంటాయి. కర్ణాటక స్వర్గధామం కూర్గ్‌లో మాత్రం వేసవి పసందుగా ఉంటుంది.

దర్శనీయ స్థలాలు: గోకర్ణం, బెంగళూరు, మైసూర్‌, శ్రీరంగపట్నం, కూర్గ్‌, చిక్‌ మంగళూర్‌, మురుడేశ్వర్‌...
రుతురాగాల వేళలో..

పడమటి కనుమల్లో ఒదిగిన కేరళలో ఆధ్యాత్మిక కేంద్రాలు, జలపాతాలు, సముద్ర తీరాలు.. ఇలా ఎన్నో!
November‌ - February: వాతావరణం బాగుంటుంది. హిల్‌స్టేషన్లు, జలపాతాలు, సముద్ర తీరాలకు వెళ్లొచ్చు.

May - June‌: నైరుతి రుతుపవనాల రాకతో.. తొలకరి చినుకుల్లో తడిసిపోవాలని పర్యాటకులు చాలామంది ఇక్కడికి వస్తుంటారు.

August‌: ఈ నెలలోనే కేరళ నూతన సంవత్సరాది ఓనమ్‌ పండగ జరుగుతుంది. ఆ సమయంలో ఇక్కడి పల్లెల్లో పడవ పందేలు, నృత్య ప్రదర్శనలు విశేషంగా జరుగుతుంటాయి.

దర్శనీయ స్థలాలు: అలెప్పీ, తిరువనంతపురం, మున్నార్‌, వాయనాడ్‌, శబరిమల, గురువాయూర్‌ ఇలా ఎన్నో..
ఆధ్యాత్మిక విహారం

ఆధ్యాత్మిక కేంద్రాలు, వేసవి విడిదులు తమిళనాడు పర్యాటక రంగానికి ఊతమిస్తున్నాయి. సంప్రదాయ వేడుకలు విహారయాత్రకు వచ్చే వారికి అదనపు ఆనందాన్ని అందిస్తాయి.
November‌ - February: మధ్యాహ్నం ఉక్కపోత ఉన్నా.. ఉదయం, సాయంత్రం చల్లగా ఉంటుంది. పర్యాటకులు ఎక్కువగా వచ్చే సీజన్‌ ఇది. ధనుర్మాసంలో తమిళనాట ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది.

July - November‌: అడపాదడపా భారీ వర్షాలు కురుస్తాయి. అయినా, దసర, దీపావళి పండగలప్పుడు కంచి, మదురై, అరుణాచలం వంటి పుణ్యక్షేత్రాలు కిటకిటలాడుతుంటాయి.

March - May: వేసవిలో ఎండలు దానికి తోడు ఉక్కపోత చికాకు కలిగిస్తాయి. ఈ సమయంలో ఊటి, కొడైకెనాల్‌, ఎలగిరి హిల్స్‌ వంటి ప్రాంతాలకు వెళ్లొచ్చు.

దర్శనీయ స్థలాలు: అరుణాచలం, మహాబలిపురం, కంచి, మదురై, కుర్తాళం, రామేశ్వరం, కన్యాకుమారి, చిదంబరం, కుంభకోణం, శ్రీరంగం మరెన్నో..
ఎన్నెన్నో అందాలు..

భారతావని హృదయసీమగా పేరున్న మధ్యప్రదేశ్‌లో పర్యాటకానికి ఊతమిచ్చే ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. ఆధ్యాత్మిక కేంద్రాలు, సాత్పురా పర్వత శ్రేణులు, దట్టమైన అడవులు, కోటలు, రాజప్రాసాదాలు ఇలా ఎన్నెన్నో అందాలు.. పర్యటక పటంలో మధ్యప్రదేశ్‌ను దర్జాగా నిలబెట్టాయి.
October‌ - April‌: వాతావరణం అనుకూలంగా ఉంటుంది. December‌, January మాసాల్లో చలి ఎక్కువగా ఉన్నా.. పర్యాటకులకు ఆనందం పంచుతుంది.

April‌ - May: ఎండలు ఎక్కువగా ఉంటాయి.

June‌ - September: వర్షాకాలంలో నర్మదా నది పరివాహక ప్రాంతాలు అందంగా కనిపిస్తాయి. వింధ్య-సాత్పుర పర్వత శ్రేణుల్లోని జలపాతాలు నిండైన ప్రవాహంతో కళకళలాడుతుంటాయి.

దర్శనీయ స్థలాలు: జ్యోతిర్లింగ క్షేత్రాలు ఉజ్జయిని, ఓంకారేశ్వర్‌, ఖజురహో, సాంచి, జబల్‌పూర్‌, భోపాల్‌, చిత్రకూట్‌, హనువంతియా, పచ్‌మఢీ, పాతాల్‌కోట్‌, గ్వాలియర్‌ మరెన్నో..

Monday, 5 February 2018

పంచభూతలింగాలు

పంచభూతలింగాలు 

పరమేశ్వరుడు లింగరూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. ఆ లింగరూపాన్ని దర్శించుకునే వారికి సకలసంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. అందులో కీలకమైన పంచభూతలింగాలు. పృథ్విలింగం, ఆకాశలింగం, జలలింగం, తేజోలింగం, వాయులింగములను పంచభూతలింగాలు అంటారు.

 1. పృథ్విలింగం:
  ఇది మట్టిలింగం. కంచిలోఉంది. ఏకాంబరేశ్వర స్వామి అంటారు. పార్వతీదేవిచే ఈ లింగం ప్రతిష్టించబడినది. ఇక్కడున్న అమ్మవారి పేరు కామాక్షీదేవి. అష్టాదశ పీఠాలలో ఇది ఒకటి.
 2. ఆకాశలింగం:
  ఇది తమిళనాడులోని చిదంబర క్షేత్రంలో ఉన్నది. ఆకాశలింగ దర్శనం రహస్యమైనది. ఆకాశంవలే శూన్యంగా కనిపిస్తుంది. లింగ దర్శనముండదు. అందువల్లనే చిదంబర రహస్యం అనే పేరు వచ్చినది. ఈ క్షేత్రంలో నటరాజస్వామి, శివకామ సుందరి అమ్మవార్లు మాత్రమే ఉంటారు.
 3. జలలింగం:
  ఈ లింగం క్రింద ఎప్పుడూ నీటి ఊట ఉండటం వలన దీనిని జలలింగం అంటారు. ఇది తమిళనాడులోని తిరుచురాపల్లికి సమీపంలో జంబుకేశ్వర క్షేత్రంలో ఉంటుంది. ఈ స్వామి పేరు జంబుకేశ్వరుడు. అమ్మవారి పేరు అఖిలాండేశ్వరి. బ్రహ్మహత్యా పాతక నివారణకోసం పరమేశ్వరుడు జంబూక వృక్షం క్రింద తపస్సు చేసినందుకే ఇక్కడి శివునికి జంబుకేశ్వరుడని పేరువచ్చెను.
 4. తేజోలింగం:
  తమిళనాడులోని అరుణాచలంలో తిరువన్నామలై క్షేత్రంలో తేజోలింగం ఉన్నది. అరుణాచల శిఖరాగ్రంపై అగ్నిశిఖ ఒకటి ఆవిర్భవించి తేజోలింగ రూపమయ్యాడు శివుడు. ఈయన పేరే అరుణాచలేశ్వరుడు. అమ్మవారి పేరు అరుణాచలేశ్వరి.
 5. వాయులింగం:
  ఆంధ్రప్రదేశ్ తిరుపతికి దగ్గరలోని శ్రీ కాళహస్తీశ్వరస్వామి ఆలయంలోని లింగమే వాయులింగం. ఈయన పేరు కాళహస్తీశ్వరుడు. అమ్మవారి పేరు ఙ్ఞానప్రసూనాంబ. సాలెపురుగు, పాము, ఏనుగులకు మోక్షము ప్రసాదించిన క్షేత్రం. ఇవే పంచభూతలింగాలుగా ప్రసిద్ధి చెందినవి.

నవనందులు

నవనందులు

ఎవరు సదాశివ నామస్మరణ చేస్తారో అలాంటి వారి వెంటే శివుడుంటాడు. అలాంటి తన నిజమైన భక్తుల్నే శివుడు వెన్నంటి కాపాడుతాడు. ఆ స్వామి తన భక్తులకోసం వెలసిన క్షేత్రాలు మన దేశంలో అనేకం ఉన్నాయి. ఆ పరంపరలోని మరో విశిష్ఠ శైవ క్షేత్రమే నంది మండలం. ఇది కర్నూలు జిల్లాలో ఉంది. నంద్యాల చుట్టూ నవ నందులుండడంవల్ల ఈ క్షేత్రానికి ఆ పేరు వచ్చింది. నంద్యాల కర్నూలు జిల్లాలో ఉన్న ఒక విశిష్టమైన పట్టణం. చారిత్రక విశేష గాథలతో ముడిపడి ఉన్న ఈ పట్టణానికి ఆ పేరు రావడానికి కూడా అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. కుందూ నదీ తీరాన ఉన్న ఈ పట్టణాన్ని పూర్వం నందియాల అని పిలిచేవారు. 14వ శతాబ్దంలో నందన మహారాజు ఈ మండలం చుట్టూ నవ నందులను నిర్మించడంవల్ల దీనికి నంది మండలమని పేర్కొచ్చిందని చెబుతారు. ఇదే కాలాంతరంలో నంద్యాలగా రూపాంతరం చెందింది. మంచి వాణిజ్య కేంద్రంగా ఉన్న నంద్యాల ప్రముఖ శైవ క్షేత్రంగా కూడా పేర్గాంచింది. మండలంలో ఉన్న నవ నందులలో మూడు నందులు ఇక్కడే ఉండడం విశేషం.

ప్రథమ నంది:- నవ నందులలో ప్రథమమైన ప్రథమ నందీశ్వరాలయం ఇక్కడే ఈ పట్టణంలోనే ఉంది. నంద్యాల పట్టణంలో శ్యామ్ కాల్వ గట్టున ఈ ఆలయం అలరారుతోంది. విజయనగర రాజుల కాలంలో ఎంతో అభివృద్ధి చెందిన ప్రథమ నందీశ్వరాలయం అనంతర కాలంలో ఆదరణ లేక జీర్ణావస్థకు చేరుకుంది. అయితే ఇటీవల కాలంలో భక్తులు, వధాన్యుల సహకారంతో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. ప్రశాంతమైన వాతావరణం, ఆహ్లాదకరమైన పరిసరాలు ఈ ఆలయం సొంతంవిశాలమైన ప్రాంగణంలో అలరారుతున్న ఈ దివ్యాలయానికి చేరుకోగానే అక్కడి ప్రశాంత వాతావరణం మైమరపిస్తుంది. గర్భాలయంలో ప్రథమ నందీశ్వరుడిగా కొలువులందుకుంటున్న కేదారేశ్వర లింగం భక్తులకు దర్శనమిస్తుంది. తేజో విరాజమానమవుతున్న కేదారేశ్వర లింగ దర్శనం, కేదారనాథ్‌లో కేదారేశ్వర లింగ దర్శన ఫలాన్నిస్తుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ఇక్కడే మరోపక్క కేదారేశ్వరి మాత కొలువుతీరి ఉంది. సర్వాభూషణ శోభితంగా కానవచ్చే ఆ తల్లి దర్శనం సర్వమంగళకరం.

నాగనంది:- నంద్యాల పట్టణంలో ఆర్టీసీ బస్టాండుకు సమీపంలోఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో నాగనందీశ్వరుడు కొలువుదీరాడు. కోదండ రామాలయంగా ఖ్యాతికెక్కిన ఈ ఆలయం కూడా అతి పురాతనమైనదే.ఈ ఆలయం కొన్ని ఆలయాల కూడికగా కానవస్తుంది. ఈ మందిరంలో భారీ ఆకారంలో ఉన్న ఆంజనేయస్వామి మూర్తి చూపరులను విపరీతంగా ఆకర్షిస్తుంది. విశాల శిల్ప మూర్తిగా ఉన్న ఈ ఆంజనేయస్వామి దర్శనం సర్వ మంగళకరం. ఆంజనేయస్వామి గర్భాలయానికి సమీపంలో ఉన్న చిన్న మండపంలో నాగ నందీశ్వరుడు కొలువుదీరాడు. నవ నందులలో నాగ నందీశ్వరుడు రెండవ వాడు.

సోమనంది:- నంద్యాల పట్టణంలోనే ఆత్మకూరు బస్టాండుకు సమీపంలో ఉన్న మరో ఆలయం శ్రీ సోమ నందీశ్వరాలయం. చంద్రుడు ఇక్కడ మహేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించడంవల్ల ఈ లింగానికి సోమ నందీశ్వర లింగమనే పేరొచ్చింది. ఈ ఆలయం ప్రాంగణం చిన్నదే అయినప్పటికీ ప్రాశస్త్యం రీత్యా ఇక్కడ స్వామివారి మహిమ గొప్పది. గర్భాలయంలో సోమ నందీశ్వరుడు దర్శనమిస్తాడు.

శివనంది:- నంద్యాలకు సుమారు 15 కిలోమీటర్లు దూరంలో ఉన్న మహిమాన్విత క్షేత్రమే శివనందీశ్వరాలయం. శివనందిగా పేర్గాంచిన ఈ క్షేత్రం నవ నందులలో విశేషమైన నందిగా ఖ్యాతి గాంచింది. ఈ ఆలయం బండి ఆత్మకూరు మండలం కడమల కాల్వ గ్రామంలో ఉంది. అతి పురాతన ఈ క్షేత్రాన్ని చేరుకోవడానికి నంద్యాల వరకు బస్సు లేదా రైలులో చేరుకోవాలి. అనంతరం అక్కడనుంచి ఏదైనా వాహనంలో గాని, బస్సులో గాని ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. ప్రశాంతమైన వాతావరణం, పచ్చని ప్రకృతి దృశ్యాలు ఆభరణాలుగా అలరారుతున్న ఈ ఆలయ శోభ అనన్య సామాన్యం... విశాలమైన ప్రాంగణంలో ఉన్న ఈ ఆలయ ప్రాంగణంలోనో కట్టడాలన్నీ చాళుక్యుల కాలం నాటివిగా ఇక్కడి ఆధారాల ద్వారా అవగతమవుతోంది.

14వ శతాబ్దంలో నందన మహారాజు ఇక్కడ శివనందిని ప్రతిష్టించినట్లు ఇక్కడి ఆధారాల ద్వారా తెలుస్తోంది. అనంతరం విజయనగర రాజుల కాలంలో ఎంతో అభివృద్ధి చెందిన ఈ ఆలయం అనంతర కాలంలో ఆదరణ లేక జీర్ణావస్థకు చేరుకుంది. అయితే ఇటీవల కాలంలో భక్తులు, వధాన్యుల సహకారంతో ఈ ఆలయాన్ని పనర్నిర్మించారు. గర్భాలయంలో శివనందీశ్వరుడిగా కొలువులందుకుంటున్న మహాదేవ లింగం భక్తులకు దర్శనమిస్తుంది.

తేజో విరాజమానమవుతున్న పరమేశ్వర లింగ దర్శనం, అమోఘమైన పుణ్యఫలాన్నిస్తుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ముఖ మండపంలో మరోపక్క పార్వతి మాత కొలువుదీరి ఉంది. సర్వాభూషణ శోభితంగా కానవచ్చే ఆ తల్లి దర్శనం సర్వ మంగళకరం. ఇదే ఆలయ ప్రాంగణంలో మరో వైపు భాగంలో వీరభద్రస్వామి కూడా కొలువుదీరాడు. విష్ణునంది లేక కృష్ణ నంది, శివనందీశ్వరస్వామి ఆలయానికి మూడు కిలోమీటర్లు దూరంలో తెలుగు గంగ కాల్వకు సమీపంలో విష్ణు నందీశ్వరుడు కొలువుదీరాడు. దట్టమైన నల్లమల అడవుల మధ్యలో ఉన్న ఈ ఆలయ శోభ వర్ణనాతీతం..

ఈ ఆలయానికి చేరుకున్న భక్తులు ఇక్కడి ప్రకృతి అందాలకు మైమరచిపోతారు. చుట్టూ పరచుకున్న నల్లమల అడవీ ప్రాంతం, ఇంకో పక్క కొండలు, గుట్టలు ఈ క్షేత్రానికి వచ్చిన భక్తుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. విష్ణునంది లేక కృష్ణనందిగా పేర్గాంచిన ఈ క్షేత్రంలో సాక్షాత్తు విష్ణుమూర్తి ఇక్కడ భవ్య లింగాన్ని ప్రతిష్టించినట్లు ఇక్కడి స్థల పురాణాల ద్వారా చెబుతున్నాయ. ఆ కారణంగానే ఈ నందికి విష్ణునంది అనే పేరొచ్చింది. గర్భాలయంలో విష్ణునందీశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. లింగ రూపంలో ఉన్న విష్ణు నీదంశ్వరుడి దర్శనం పూర్వజన్మల పుణ్య ఫలంగా భక్తులు భావిస్తారు. ఓ ప్రత్యేకమైన లోకాలకు తోడ్కొనిపోయే ఈ దివ్యాలయం చుట్టూ పురాతన కాలంనాటి కోనేరు, నవగ్రహాలు, వినాయక, విష్ణు, లక్ష్మి మందిరాలున్నాయి. ఆలయానికి సమీపంలో సెలయేరు నిత్యం పారుతూ ఉంటుంది. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు ఈ సెలయేటిలోనే భక్తితో స్నానాలు చేసి విష్ణునందీశ్వరుడ్ని దర్శించుకుంటారు.

సూర్యనంది:- నంద్యాలకు సుమారు 8 కిలోమీటర్లు దూరంలో ఉన్న మహిమాన్విత క్షేత్రమే సూర్య నందీశ్వరాలయం. సూర్యనందిగా పేర్గాంచిన ఈ క్షేత్రం నవనందులలో విశేషమైన నందిగా ఖ్యాతిగాంచింది. సూర్యుడు ఇక్కడ శివుడి గురించి తపస్సు చేసి ఆ స్వామి లింగాన్ని ప్రతిష్టించాడు. ఆ కారణంగా ఇది సూర్యనంది అయ్యింది. పూర్వకాలం నాటి ఆనవాళ్ళతో అలరారుతున్న ఈ ఆలయాన్ని అనంతరం భక్తులు, వధాన్యుల సహకారంతో నిర్మించారు. ఈ ఆలయం యు.బొల్లవరం గ్రామానికి సమీపంలో తమ్మడపల్లె గ్రామంలో ఉంది. అతి పురాతన ఈ క్షేత్రాన్ని చేరుకోవడానికి నంద్యాల వరకు బస్సు లేదా రైలులో చేరుకోవాలి. అనంతరం నంద్యాలనుంచి మహానంది మార్గంలో ఏడు కిలోమీటర్లు ప్రయాణించి యు.బొల్లవరం గ్రామానికి చేరుకోవాలి. అక్కడనుంచి కుడి చేతివైపుగా కిలోమీటరు దూరం ప్రయాణిస్తే ఈ ఆలయానికి చేరుకోవచ్చు. తమ్మడపల్లె ఓ చిన్ని గ్రామం. ఇక్కడ ఉన్న సూర్య నందీశ్వరాలయంవల్ల ఈ గ్రామ ఖ్యాతి దశ దిశలా వ్యాపించింది. 14వ శతాబ్దంలో నందన మహారాజు ఇక్కడ సూర్యనంది ఆలయాన్ని కట్టించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. గర్భాలయంలో సూర్య నందీశ్వరుడిగా కొలువులందుకుంటున్న ఆలయంలో మరో పక్క పార్వతి మాత కొలువుదీరి ఉంది.

గరుడ నంది:- సూర్య నందీశ్వరస్వామి ఆలయానికి సుమారు పది కిలోమీటర్లు దూరంలో మహానంది దివ్య క్షేత్ర నడిబొడ్డున గరుడ నందీశ్వరుడు కొలువుదీరాడు. మహానంది క్షేతానికి ప్రారంభంలో ఉన్న ఈ గరుడ నందీశ్వరాలయం అతి పురాతనమైనది. ఆ కారణంగా ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో దీనిని తిరిగి పునరుద్ధరిస్తున్నారు. గరుడ నందిగా పేర్గాంచిన ఈ క్షేత్రంలో సాక్షాత్తు గరుత్మంతుడు ఇక్కడ మహాదేవుని గురించి తపస్సు చేసి ఇక్కడో భవ్య లింగాన్ని ప్రతిష్టించినట్లు ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. ఆ కారణంగానే ఈ నందికి గరుడ నంది అనే పేరొచ్చింది. గర్భాలయంలో గరుడ నందీశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు.

వినాయక నంది:- మహానందిలో ఉన్న మరో విశిష్ట నంది వినాయక నంది. మహానందీశ్వరస్వామి వారి ఆలయానికి ఈశాన్య దిశలో ఉన్న ఈ దివ్యాలయం లో పరమేశ్వర లింగాన్ని సాక్షాత్తు వినాయకుడు ప్రతిష్టించడానికి ఇక్కడి స్థల పురాణాలు చెబుతున్నాయి. నిత్యం వందలాది మంది భక్తులతో రద్దీగా ఉండే ఈ దివ్యాలయంలో వినాయక నందీశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. నాగ ఫణాఫణి ఛత్రంగా ఇక్కడ స్వామివారు అలరారుతున్నారు. వినాయక నందీశ్వరస్వామి వారి దర్శనం పూర్వజన్మల పుణ్యఫలం.

మహానంది:- నవ నందులలో విశేషమైన ప్రాధాన్యాన్ని సంతరించుకున్న క్షేత్రం మహానంది. ఇది కర్నూలు జిల్లాలో నంద్యాలకు 14 కి.మీ. దూరంలో ఉంది. ఇది ఆహ్లాదకరమైన యాత్రా స్థలం. గుడి చుట్టు ప్రవహించే నీటి బుగ్గల చల్లదనం, చుట్టు అల్లుకున్న నల్లమల అరణ్యపు ప్రకృతి సౌందర్యం, అన్ని కాలాల్లోను భక్తులను ఆకర్షిస్తూనే ఉంటుంది. పూర్వం శాలంకాయనుడు రాళ్ళను తింటూ అతి విచిత్రమైన తపస్సు చేసి శంకరుని మెప్పించి శిలాదునిగా పిలువబడుతూ, శివభక్తుడై, జీవించసాగాడు. అతడొక రోజున పొలాన్ని దున్నుకుంటుంటే, ఓ బాలుడు దొరికాడు. వృషభ రూపంలోనున్న ధర్ముడే ఇలా పుట్టాడని, అతనికి ‘‘నంది’’ అని పేరు పెట్టి పెంచాడు. అతడు పరమశివుని దర్శనం కోరి ఘోర తపస్సు చేశాడు. ప్రత్యక్షమైన శంకరుడు నందిని వరం కోరుకొమ్మన్నాడు.


సదాశివ ధ్యానమే తనకు కలుగునట్లు వరం కోరుకున్నాడు నంది. శివుడు అనుగ్రహించి అతనిని పుత్రుడుగా స్వీకరించాడు. ఎన్నో సిద్ధులను ప్రసాదించి తనంతటి వాణ్ణి చేసి, వాహనంగా తన చెంతనే ఉండమన్నాడు. ‘‘సుయశ’’ అనే కాంతనిచ్చి వివాహం చేశాడు. తన ద్వారపాలకునిగా నియమించుకున్నాడు. ఈ విధంగా నందిని శంకరుడు అనుగ్రహించిన ప్రదేశమే మహానంది క్షేత్రం. ఇక్కడ ఉన్న ఈశ్వరుని నంది ప్రతిష్టించాడని, అందువల్లనే ఇది నందీశ్వరాలయమైందని స్థల పురాణం. ఈ క్షేత్రంలో వెలసిన మహానందీశ్వర స్వామి లింగం స్వయంభూలింగంగా ఖ్యాతికెక్కింది. గర్భాలయంలో ఉన్న శివలింగంపై భాగాన ఆవు పాదం ముద్రలు కనిపిస్తాయి. శ్రీ మహానందీశ్వర స్వామి రజత కవచాలంకృతుడై నయన మనోహరంగా దర్శనమిస్తారు. పార్వతీదేవి కామేశ్వరిగా కొలువులందుకుంటోంది.

కార్తీక మాసంలో సోమవారం రోజున నంద్యాల చుట్టు కొలువై ఉన్న నవ నందుల దర్శనంవల్ల జన్మ జన్మల నుండి వెంటాడుతున్న పాప గ్రహ దోషాలన్ని పటాపంచలవుతాయని పెద్దల నానుడి. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపల ఈ క్షేత్రాలన్నింటినీ దర్శిస్తే అన్ని దోషాలు తొలగి కుటుంబంలో ఆయురారోగ్యాలతో కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల ప్రధాన విశ్వాసం. నవ నందుల దర్శనం పూర్వజన్మల పుణ్యఫలం.