Wednesday, 14 February 2018

వేళకు సన్నద్ధం హాయిగా వెళ్లొద్దాం

వేళకు సన్నద్ధం హాయిగా వెళ్లొద్దాం

‘‘ఈ మధ్యాహ్నం ఎండను చూస్తుంటే.. వేసవి మొదలైందేమో అనిపిస్తోంది...!’’

రాత్రి చలి గిలి పెడుతున్నా.. భానూదయంతో సీను మారిపోతోంది.. వేసవి రావడానికి సిద్ధమవుతోంది. సమ్మర్‌ ఎంట్రీతో మండుటెండలు ఆ తర్వాత పిల్లలకూ, పెద్దలకూ హాయినిచ్చే సెలవులూ వచ్చేస్తాయి. మరి అప్పుడు ఎక్కడికి వెళ్లాలో.. ఓ మాట అనేసుకుందామా! అప్పుడే ఎందుకంటారా? ముందస్తుగా సన్నద్ధమైతే ప్రయాణం సాఫీగా సాగుతుంది. ఆర్థికంగానూ ఎంతో కొంత కలిసొస్తుంది. మీ ఆలస్యం ప్రయాణాన్ని భారం చేయవచ్చు. అందుకే ముందస్తు సన్నద్ధతతో.. అందుబాటు ధరల్లోనే ఆనందాన్ని ఆస్వాదించండి.

వేసవి వినోదాలలో విహారం కూడా ఒకటి. ప్రపంచ పటం ముందేసుకొని.. పిల్లలు వేలు పెట్టి చూపించిన దేశానికి తీసుకెళ్లే తల్లిదండ్రులూ ఉన్నారు. సెలవుల్లో ఎక్కడికి వెళ్లినా ఖర్చు తడిసి మోపెడవుతుందని పర్యటనను ఎప్పటికప్పుడు వాయిదా వేసే వాళ్లూ ఉంటారు. ఎవరి సౌకర్యం వారిది. ఎవరి కష్టం వారిది. ప్రణాళిక ప్రకారం ముందడుగు వేస్తే.. వీలైనంత తక్కువ ఖర్చులో సమ్మర్‌ టూర్‌ ముగించేయొచ్చని చెబుతున్నారు పర్యాటక నిపుణులు. ఈ లెక్కలన్నీ ఎక్కడికి వెళ్తున్నాం.. ఎలా వెళ్తున్నాం.. ఎంత తొందరగా ప్లాన్‌ చేసుకుంటున్నాం అన్నదానిపైనే ఆధారపడి ఉంటాయంటున్నారు.

ఊరించే ధరలు.. ఊహించని ఆఫర్లు..
వేసవిలో తెలుగు రాష్ట్రాల ప్రజలు విహార యాత్రల కంటే.. తీర్థయాత్రలకు ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. భక్త సంఘాలు, మిత్ర బృందాలు రకరకాల యాత్రలు చేస్తుంటాయి. నలుగురితో పాటు నారాయణ అనుకుంటే తప్ప దూర ప్రయాణాలు సాధ్యం కావు. తీర్థయాత్రల విషయంలో అయితే మరీనూ! వీటికి తోడు ప్రైవేట్‌ టూర్‌ ఆపరేటర్లు ప్రకటించే ప్యాకేజీలు ఉండనే ఉన్నాయి. ఊరించే ధరల్లో.. ఊహించని ఆఫర్లు రారమ్మని పిలుస్తుంటాయి. రామేశ్వరం మొదలు చార్‌ధామ్‌ వరకు టూర్‌ ప్యాకేజీలు కోకొల్లలుగా ప్రకటిస్తూనే ఉంటాయి. అమర్‌నాథ్‌, చార్‌ధామ్‌, నైమిశారణ్యం, కాశి-ప్రయాగ, సోమ్‌నాథ్‌-ద్వారక ఇలా ఉత్తర భారతావని యాత్రలకు సంబంధించిన ప్యాకేజీలు ఎక్కువగా పలకరిస్తుంటాయి. వీటి ధర రూ.12,000 నుంచి రూ.35,000 వరకూ ఉన్నాయి. వాటిలో ఉన్నతమైన ప్యాకేజీని ఎంపిక చేసుకోవడమే మన పని. ట్రావెల్‌ సంస్థను ఎంచుకునే ముందు ఆ సంస్థ విశ్వసనీయత, గత చరిత్ర గురించి తెలుసుకోవడం మరచిపోవద్దు.

లాభంతో వెళ్లి.. క్షేమంగా రండి..
ఏ టూరిస్ట్‌ ఆపరేటర్లతోనూ సంబంధం లేకుండా.. సొంతంగా వెళ్లే వాళ్లూ ఉంటారు. అయితే మీరు వెళ్లదలచిన ప్రదేశం గురించి వీలైనంత ఎక్కువ సమాచారం తెలుసుకోవాలి. పాస్‌పోర్ట్‌, వీసా వగైరా ఏర్పాటు చేసుకోవాలి. వీలైనంత తొందరగా విమాన టికెట్లు బుక్‌ చేసుకోవాలి. ఇప్పటికిప్పుడు వెళ్లాలనుకుంటే బ్యాంకాక్‌ విమాన టికెట్‌ ధర రూ.11,000- రూ.18,000 మధ్య ఉంది. అదే.. మే రెండో వారం టికెట్‌ ఇప్పుడే బుక్‌ చేసుకుంటే రూ.8,000-రూ.12,000కే దొరుకుతుంది. అన్ని రకాల విమాన టికెట్ల ధరల్లోనూ ఇలాంటి వ్యత్యాసం కనిపిస్తుంది. అప్పటికప్పుడు విహారానికి వెళ్దామని ఫిక్సయినవారికి ఈ ఆఫర్లు వర్తించవు. రెండు, మూడు నెలల ముందుగా ఓ నిర్ణయానికి వస్తే టికెట్ల దగ్గరే 20 శాతం లాభపడొచ్చు. ఇదే సూత్రం హోటల్‌ గదుల బుకింగ్‌కూ వర్తిస్తుంది. ముందుగా బుక్‌ చేసుకోవడం వల్ల పదోపరకో మిగుల్చుకోవచ్చు. యాప్‌ల సహకారం తీసుకుంటే.. ప్రయాణం స్మార్ట్‌గా సాగిపోతుంది. మొత్తానికి లాభంతో వెళ్లి.. క్షేమంగా తిరిగి రావొచ్చు.

భూటాన్‌ నుంచి బ్రిటన్‌ వరకు..
సంపన్నులే కాదు.. ఎగువ మధ్యతరగతి కుటుంబీకులూ విహారానికి విదేశాలకేగుతున్నారు. సిరిగలవారు బ్రిటన్‌, ఫ్రాన్స్‌, స్విట్జర్లాండ్‌ వంటి ధనిక దేశాలకు విడిదికి వెళ్తుంటారు. కాస్త భిన్నత్వం కోరుకునేవారు టర్కీ, ఈజిప్ట్‌, ఒమన్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. తీరంలో ఆనందం వెతుక్కోవాలని భావించిన వారు మాల్దీవులు, సీషెల్స్‌ ద్వీపాలు, మారిషస్‌ బాట పడుతుంటారు. జంతు ప్రపంచంలో విహరించాలనుకునే వారు దక్షిణాఫ్రికా, కెన్యా, జాంబియా దేశాలకు పయనమవుతారు. బడ్జెట్‌ ధరలో విదేశాలను చుట్టి రావాలనుకునే వారు థాయ్‌లాండ్‌, మలేషియా, ఇండోనేషియా (బాలి), నేపాల్‌, భూటాన్‌ దేశాలపై ఆసక్తి చూపిస్తుంటారు. ప్రసిద్ధ ప్రైవేట్‌ టూరిస్ట్‌ సంస్థలు విదేశీ పర్యటన ప్యాకేజీలు ప్రకటించేశాయి. 7 నుంచి 14 రోజుల వరకు ఆయా దేశాలు తిప్పిచూపిస్తామని చెబుతున్నాయి. యూరప్‌ ట్రిప్‌ ప్యాకేజీ ధర రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షల వరకూ పలుకుతోంది. కాస్త ముందుగా సంప్రదించే వారికి పది నుంచి పదిహేను శాతం తగ్గింపు లభించే అవకాశమూ ఉంది.

ఆలోచించి..
ఎక్కడికి వెళ్తున్నామన్నది ముందుగా తేల్చాలి. ఆ తరువాత ఎలా వెళ్లడం? అని ఆలోచించాలి. వేసవిలో చల్లటి నీడనిచ్చే ప్రదేశాలు మనదేశంలో ఎన్నో! ఉత్తరాదిలోనే కాదు... దక్షిణ భారతంలోనూ చాలానే ఉన్నాయి. కర్ణాటకలో కూర్గ్‌, తమిళనాడులో ఊటీ, కొడైకెనాల్‌, ఆంధ్రప్రదేశ్‌లో హార్స్‌లీహిల్స్‌ ఇవన్నీ వేస‘వినోద’ కేంద్రాలే! ఉత్తరాదిలోని కశ్మీర్‌ (లద్ధాఖ్‌, శ్రీనగర్‌, లెహ్‌, పహల్గామ్‌), ఉత్తరాఖండ్‌ (చార్‌ధామ్‌, రుషీకేష్‌, హరిద్వార్‌, డెహ్రాడూన్‌, నైనిటాల్‌, ముస్సోరి, అల్మోరా), హిమాచల్‌ప్రదేశ్‌ (సిమ్లా, కులు, మనాలి, డల్హౌసి), సిక్కిం, మేఘాలయ వంటి రాష్ట్రాల్లో కావాల్సినన్ని పర్యాటక కేంద్రాలున్నాయి. వీటిలో మనసుకు నచ్చిన ప్రదేశాన్ని ఎంచుకొని వేసవి విహారం మరచిపోలేని అనుభూతిగా మిగుల్చుకోండి.

ఆ రెండు నెలలు..
ప్రణాళిక ప్రకారం చేస్తే పనులన్నీ పక్కాగా జరిగిపోతాయి. ఇదే సూత్రం యాత్రలకూ వర్తిస్తుంది. ఆధ్యాత్మిక యాత్ర విషయంలో గుంపులో గోవింద అనే అవకాశం ఉంది కానీ, విహార యాత్ర విషయంలో అన్నీ ఓ పట్టాన తెమలవు. ఎక్కడికి వెళ్లాలో తేల్చడానికే కొన్ని రోజుల సమయం పడుతుంది. ఎలా వెళ్లాలో తేలేసరికి... అక్కడికి వెళ్లే రైళ్లన్నీ వెయిటింగ్‌ లిస్ట్‌ను సూచిస్తుంటాయి. ప్రైవేట్‌ ట్రావెల్‌ సంస్థల ఆఫర్లన్నీ అడుగంటిపోతాయి. విమానం టికెట్‌ ధరలకు రెక్కలొచ్చేస్తాయ్‌! ఎక్కడికి వెళ్లాలో.. త్వరగా నిర్ణయించుకుంటే.. రైళ్లో బెర్త్‌లు కన్‌ఫర్మ్‌ అవుతాయి. విమానం టికెట్ల విషయంలో మంచి బేరం కుదిరే అవకాశాలు ఉంటాయి. మంచి ప్యాకేజీలు దొరుకుతాయి. మనం చేయాల్సిందల్లా ముందుగా నిర్ణయానికి రావడమే! సహజంగా మన దేశంలో ఏప్రిల్‌ నుంచి జులై వరకు సమ్మర్‌ వెకేషన్‌గా భావిస్తారు. అందునా పిల్లలకు సెలవులుండే ఏప్రిల్‌-మే నెలల్లోనే ఎక్కువ యాత్రలు చేస్తుంటారు. ఫిబ్రవరి వచ్చేసింది. వెంటనే ఎక్కడికి, ఎప్పుడు, ఎలా వెళ్లాలో ఓ నిర్ణయానికి వచ్చేయండి. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు మొదలెట్టండి. మీరు సిద్ధమే కదా! రెడీ వన్‌.. టూ.. త్రీ.. హ్యాపీ జర్నీ!!No comments:

Post a Comment