Saturday, 31 March 2018

పచ్‌మఢీ

చల్లటి ఒడి.. పచ్‌మఢీ

జగన్మోహినిని కట్టిపడేసిన జలపాతాలు.. పాండవులకు నీడనిచ్చిన గుహలు.. ఆంగ్లేయులను సైతం ఆహ్లాదపరచిన పచ్చదనం.. వేసవిలో చల్లదనాన్ని అందించే నెలవు.. మధ్యప్రదేశ్‌లోని పచ్‌మఢీ. సాత్పురా-వింధ్య పర్వత సానువుల్లో.. దట్టమైన అరణ్యంలో.. ఉన్న పచ్‌మఢీలో గుహలు.. జలపాతాలు.. కొండలు.. లోయలు.. ఎన్నెన్నో అందాలు.  వేసవి విడిదిగా పేరొందిన పచ్‌మఢీ విశేషాలివే...

బ్రిటిష్‌ పాలకులు పాలిస్తున్న రోజులవి. సెంట్రల్‌ ఇండియా ప్రావిన్స్‌లో అధికారిగా చేరాడు జేమ్స్‌ ఫార్సిథ్‌. సహజంగా ప్రకృతి ప్రేమికుడైన జేమ్స్‌ సాత్పుర-వింధ్య పర్వత పంక్తుల్లోని పచ్చదనం చూసి మైమరచిపోయాడు. రోజూ పరివారం సహా అడవుల బాట పట్టడం అతని పని. కొండలు, కోనలు విహరించేవాడు. అలా తిరుగుతుండగా.. ఒకరోజు ఆయనకు ఐదు గుహలు కనిపించాయి. వనవాస కాలంలో పంచ పాండవులు ఈ గుహల్లో నివసించారని అంటారు. పాంచ్‌ అంటే ఐదు అనీ, మఢీ అంటే గుహ అని అర్థం. వెరసి ఈ ప్రాంతానికి పాంచ్‌మఢీ అని పిలిచేవారు. కాలక్రమంలో ఆ పేరు కాస్తా పచ్‌మఢీగా స్థిరపడింది. పచ్‌మఢీలో పంచ పాండవుల గుహలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. గుహల్లోని బండలపై రంగులతో వేసిన చిత్తరువులు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఈ గుహలకు సమీపంలోనే పాంచాలి సరస్సు కూడా ఉంది. అయితే ఈ ప్రాంతం ఒకప్పుడు బౌద్ధారామంగా విలసిల్లిందని చెప్పేవాళ్లూ ఉన్నారు.

మహాదేవ శంకర..
పాండవ గుహలకు సమీపంలోని మరో గుహలో శివాలయం ఉంటుంది. దీనిని జటాశంకర గుహ అని పిలుస్తారు. భస్మాసురుడి నుంచి తనను తాను రక్షించుకోవడానికి పరమ శివుడు ఈ గుహలోకి వచ్చి దాక్కున్నాడని స్థల పురాణం. గర్భాలయంలో సహజ సిద్ధంగా ఏర్పడిన 108 శివలింగాలు కనిపిస్తాయి. గుహలో గుప్త గంగ అనే కుండం కూడా ఉంది. అతి పురాతమైన ఈ ఆలయంలో ఏటా శివరాత్రి సందర్భంగా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. పాండవ గుహలకు కొంత దూరంలో మహాదేవ కొండ ఉంటుంది. కొండపై అరవై అడుగుల పొడవున్న గుహ ఉంది. దీనిని బడే మహదేవ్‌ గుహ అని పిలుస్తారు. విష్ణుమూర్తి మోహినీ రూపంలో వచ్చి భస్మాసురుణ్ణి ఇక్కడే సంహరించారని చెబుతారు. గుహలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల విగ్రహాలు దర్శనమిస్తాయి. మధ్యలో జలకుండం ఉంది. ఇందులోని జలాలు శివలింగాన్ని నిరంతరం అభిషేకిస్తుంటాయి.

రాజేంద్రగిరి
పచ్‌మఢీలో ఉన్న ప్రముఖ వ్యూపాయింట్లలో రాజేంద్రగిరి ఒకటి. ఇది సముద్రమట్టానికి మూడున్నరవేల అడుగుల ఎత్తులో ఉంటుంది. సూర్యాస్తమయాన్ని చూసేందుకు ఈ కొండపైకి వస్తుంటారు. ఇక్కడే అందమైన ఉద్యానవనం కూడా ఉంది. భారతదేశ తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్‌ దీనిని సందర్శించడంతో.. ఈ కొండకు రాజేంద్రగిరి అని పేరు పెట్టారు. ఆనాడు రాష్ట్రపతి నాటిన మొక్క ఇప్పుడు మహావృక్షమై చరిత్రకు సాక్షిగా కనిపిస్తుంది. ఈ గిరిపైనే విడిది కేంద్రమైన రవిశంకర్‌ భవనం ఉంటుంది.

దూప్‌గఢ్‌
సాత్పుర పర్వత శ్రేణుల్లో అత్యంత ఎత్తయిన ప్రదేశం దూప్‌గఢ్‌ వ్యూ పాయింట్‌. 4,430 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇక్కడి నుంచి ఐదు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ప్రాంతమంతా కనిపిస్తుంది. ఈ వ్యూ పాయింట్‌ నుంచి సూర్యోదయంతో పాటు సూర్యాస్తమయం కూడా చూడవచ్చు. పచ్‌మఢీలో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇదీ ఒకటి.

వెండి జిలుగులు

పచ్‌మఢీ చుట్టుపక్కల సుందరమైన జలపాతాలు ఉన్నాయి. అందులో రజత్‌ ప్రతాప్‌ జలపాతం ప్రధానమైనది. 351 అడుగుల ఎత్తు నుంచి వేగంగా కిందికి దూకుతుంది. ఈ జలపాతంలో నీళ్లు వెండి వెలుగులు జిలుగుతాయి. దీనిని సిల్వర్‌ ఫాల్‌ అని కూడా అంటారు. జలపాతం కింద ప్రవాహం తక్కువే! పిల్లలు, పెద్దలు జలకాలాడేందుకు అనుకూలంగా ఉంటుంది. పచ్‌మఢీ అరణ్యంలో సాల వృక్షాలు, రావి, జువ్వి, వెదురు చెట్లు విస్తారంగా ఉన్నాయి. ఈ అడవి గుండా ప్రవహించే రజిత జలపాతం నీళ్లు ఎంతో స్వచ్ఛంగా, మరెన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటాయి.
ఎప్పుడు అనుకూలం

దట్టమైన అడవిలో ఉన్న పచ్‌మఢీకి వేసవి విడిదిగా పేరుంది. ఈ సమయంలో ఇక్కడ గరిష్ఠ ఉష్ణోగ్రతలు 33-35 డిగ్రీల మధ్య నమోదవుతుంటాయి. వేసవిలో (ఏప్రిల్‌- జూన్‌) పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. నవంబర్‌-ఫిబ్రవరి వరకు శీతాకాల విహార కేంద్రంగానూ దీనికి మంచి పేరుంది.

బస: పచ్‌మఢీలో రెస్టారెంట్లు చాలానే ఉన్నాయి. బడ్జెట్‌ హోటల్స్‌ మొదలు రిసార్ట్స్‌ వరకు అన్ని రకాల ఆతిథ్యం లభిస్తుందిక్కడ. గదుల అద్దె రూ.1,000 నుంచి రూ.6,000 వరకు ఉంటుంది. దక్షిణాది ఆహారం దొరకడం కష్టమే. ఉత్తరాది వంటకాలు, చైనీస్‌ రుచులు అన్ని రెస్టారెంట్లలో లభిస్తాయి.
సాత్పురా కీ రాణి

పచ్‌మఢీని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడంలోనూ బ్రిటిష్‌ అధికారి ఫార్సిథ్‌ జేమ్స్‌ కీలక పాత్ర పోషించాడు. ఉన్నతాధికారులను ఒప్పించి పచ్‌మఢీని వేసవి విడిదిగా తీర్చిదిద్దాడు. సాత్పురా పర్వత శ్రేణుల్లోని కొండలు, జలపాతాలు, అడవుల వివరాలతో ‘ద హైల్యాండ్స్‌ ఆఫ్‌ సెంట్రల్‌ ఇండియా’ అనే పుస్తకం కూడా రాశాడు జేమ్స్‌. అందులో పచ్‌మఢీని ‘క్వీన్‌ ఆఫ్‌ సాత్పురా’ (సాత్పురా కీ రాణి) అని అభివర్ణించాడు. పచ్‌మఢీని ఆయన తొలిసారిగా గుర్తించిన ప్రదేశాన్ని ఫార్సిథ్‌ పాయింట్‌గా పిలుస్తారు. 1964లో ఇందిరాగాంధీ ఈ ప్రదేశానికి విచ్చేశారు. అప్పటి నుంచి దీనిని ‘ప్రియదర్శిని వ్యూ పాయింట్‌’ అని కూడా పిలుస్తున్నారు.
అప్సర విహార్‌

అప్సర విహార్‌ జలపాతంలో కేరింతలు కొట్టకుండా పచ్‌మఢీ విహారం పూర్తవ్వదు. దాదాపు 35 అడుగుల ఎత్తు నుంచి జలధారలు పడుతుంటాయి. రజిత జలపాతం నుంచి ప్రవహించే నీరే అప్సర విహార్‌లో కనువిందు చేస్తాయి. పాండవ గుహలకు ఈ జలపాతం కూత వేటు దూరంలో ఉంటుంది. భస్మాసురుణ్ని సంహరించిన తర్వాత మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి ఈ జలపాతంలో స్నానం చేశాడట. అందుకే అప్సర విహార్‌ను మోహినీ జలపాతం అని కూడా పిలుస్తారు. జలపాతం అందాలే కాదు.. చుట్టూ ప్రకృతి కూడా సమ్మోహనపరిచే విధంగా ఉంటుంది.
బీ ఫాల్‌

పచ్‌మఢీలో అందరినీ ఆకట్టుకునే మరో జలపాతం బీ ఫాల్‌. దీనిని జమునా ప్రతాప్‌ జలపాతం అంటారు. 150 అడుగుల ఎత్తు నుంచి ఏటవాలు కొండ మీదుగా జలప్రవాహం కొనసాగుతుంది. పర్యాటకులు జలకాలాడేందుకు వీలుగా ఉంటుంది బీ ఫాల్‌. ఈ జలపాతం నుంచే పచ్‌మఢీవాసులకు తాగునీరు సరఫరా అవుతుంది.
ఎలా వెళ్లాలి?

విమానయానం
* భోపాల్‌ నుంచి పచ్‌మఢీకి 195 కిలోమీటర్ల దూరం. ఇక్కడి నుంచి బస్సులు, ప్రైవేట్‌ ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి.
* హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం నుంచి భోపాల్‌కు సింగిల్‌ స్టాప్‌ విమాన సర్వీసులు ఉన్నాయి.
రైలు మార్గం
* హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం నుంచి భోపాల్‌కు రైళ్లు అందుబాటులో ఉన్నాయి. భోపాల్‌ నుంచి పచ్‌మఢీకి బస్సులో వెళ్లాల్సి ఉంటుంది.
* పచ్‌మఢీకి సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్‌ పిపరియా. ఇక్కడి నుంచి పచ్‌మఢీకి 55 కిలోమీటర్లు.
* సికింద్రాబాద్‌, విజయవాడ నుంచి పిపరియాకు రైళ్లు అందుబాటులో ఉన్నాయి. అక్కడి నుంచి పచ్‌మఢీకి బస్సులు, ట్యాక్సీల్లో వెళ్లాలి.

Sunday, 18 March 2018

కడప శ్రీలక్ష్మీవేంకటేశ్వర స్వామి

అక్కడ ముస్లింలకూ పండగే!

ఉగాది... అంటే హిందువుల పండగ అని అందరికీ తెలిసిందే. ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే... కడప జిల్లాలో ఎంతోమంది ముస్లింలకూ ఈ పండగ ప్రత్యేకమైందే. ఆ రోజున వందల మంది ముస్లింలు స్థానికంగా కొలువైన వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని కానుకలు సమర్పించడం అక్కడ అనాదిగా వస్తున్న ఆచారం.

తిరుమల తొలి గడప దేవుని కడప. పూర్వం తిరుమల వెళ్లే భక్తులు కడపలోని శ్రీలక్ష్మీవేంకటేశ్వర స్వామిని దర్శించుకునే వెళ్లేవారట. అందుకే తాళ్లపాక అన్నమయ్య ‘కాదనకు నామాట కడపరాయ నీకు - గాదె బోసెవలపులు కడపరాయా...’ అంటూ కీర్తించాడు. ఎంతో ప్రాశస్త్యం ఉన్న ఆ మొలకనవ్వుల కడప రాయడిని దర్శించుకునేందుకు కేవలం హిందూ భక్తులే కాదు, ముస్లింలు కూడా రావడం ఈ ఆలయానికున్న విశిష్టత. శ్రీనివాసుడు తమ ఇంటి ఆడపడుచు బీబీ నాంచారమ్మను మనువాడాడు కాబట్టి ఆయన్ను తమ అల్లుడిగా భావిస్తారు స్థానిక ముస్లింలు. అందుకే, ఏటా తెలుగు సంవత్సరాది రోజున ఉపవాసం ఉండి కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తారు. బియ్యం, గారెలు, కొబ్బరికాయలూ తెచ్చి స్వామివారికి సమర్పిస్తారు. వెంకన్నను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నాక సాయంత్రం ఉపవాస దీక్షను విరమిస్తారు. ఇలా ఏటా ఉగాదినాడు ఉదయం నుంచి మధ్యాహ్నంలోపు స్వామి దర్శనానికి వచ్చే ముస్లింల సంఖ్య వందల్లో ఉంటుంది. హిందూ భక్తులతోపాటే వాళ్లూ తీర్థ ప్రసాదాలను స్వీకరిస్తారు. ఈ సంప్రదాయం ఎన్నో వందల ఏళ్ల నుంచీ ఆ ఆలయంలో కొనసాగుతోంది. ఆ రోజున కడప రాయడిని దర్శించి కానుకలు సమర్పిస్తే ఏడాదంతా తమకు మంచే జరుగుతుందని అక్కడి ముస్లిం భక్తుల నమ్మకం.

రమణీయ శిల్పవైభవం
కడప లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయ శిల్ప సౌందర్యం రమణీయం. స్వామి సన్నిధిలో ఉన్న మంటపం విజయనగర రాజుల కాలంలో నిర్మితమైనట్లు చరిత్ర చెబుతోంది. ఇక్కడి తాండవ గణపతి రూపం అతిమనోహరం. స్థానిక రాజులే కాక నవాబులు, ఆంగ్లేయుడైన సర్‌ థామస్‌ మన్రో సైతం ఆలయ పునర్నిర్మాణానికీ మరమ్మతులకూ సహకరించినట్లు ఆధారాలున్నాయి. స్వామి గర్భగుడి వెనుక ఆంజనేయ స్వామి విగ్రహం పశ్చిమాభిముఖమై ఉంటుంది. తిరుమల క్షేత్రపాలకుడు వరాహస్వామి కాగా ఇక్కడి క్షేత్ర పాలకుడు హనుమంతుడు. స్వామి వక్షస్థలంపై కుడివైపున శ్రీవత్స చిహ్నంతో మహాలక్ష్మీమూర్తి ఉండడం విశేషం. మూల విరాట్టు విగ్రహంపైన సుందరంగా చెక్కిన యజ్ఞోపవీతాలూ నాలుగు కంఠాభరణాలూ కనిపిస్తాయి. విజయనగర సామ్రాజ్య స్థాపకులైన హరిహర, బుక్కరాయలూ సాళువ వంశీయుడైన నరసింహరాయలూ ఆంధ్రభోజుడైన శ్రీకృష్ణదేవరాయలూ స్వామికి మడిమాన్యాలూ ఆభరణాలూ సమర్పించినట్లు ఆలయ కుడ్య శాసనాల ద్వారా తెలుస్తోంది. గర్భాలయానికి ఎడమ వైపున అమ్మవారి మందిరం ఉంది. విష్వక్సేన మందిరం, నాగుల విగ్రహాలు, వినాయకుడు, ఆండాళ్లమ్మ మందిరం, శమీవృక్షం, ధనుర్మాసాది మంటపాలే కాక వేంకటేశ్వర స్వామికి ఎదురుగా ఆంజనేయ స్వామి మందిరం సైతం ఉండడం ఈ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయానికున్న ప్రత్యేకతగా చెబుతారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న కోనేరుని పుష్కరిణిగా పిలుస్తారు. కృష్ణా కాలువలోంచి దీన్లోకి వచ్చే నీరు తూర్పు వైపున ఉన్న చిన్న కాలువద్వారా బయటకు వెళుతుంది. కాబట్టి, నీరు ఎప్పుడూ స్వచ్ఛంగా ఉంటుంది. ఈ పుష్కరిణిలోనే స్వామివారి తెప్పోత్సవం, చక్రస్నానాది కార్యక్రమాల్ని అంగరంగ వైభవంగా జరిపిస్తారు. ఇక, ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఎంతో కన్నుల పండగగా జరుగుతాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా సాగే స్వామి రథోత్సవాన్ని అన్నమయ్య కీర్తించిన తీరే అందుకు ఉదాహరణ.

కన్నుల పండుగలాయ కడప రాయని తేరు
మిన్నునేల శృంగారము మితిమీరినట్లు
కాంతతో శ్రీవేంకటేశ కడప తేరెక్కి
యింత నన్ను గూడి వీధులేగితివి నీవు

అంటూ కప్పురపు నవ్వుల కడప రాయని కీర్తించి తరించాడు అన్నమయ్య. వేంకటేశుడి రథోత్సవం సమయంలో కూడా కులమతాలకు అతీతంగా వేలమంది భక్తులు తేరును లాగి దేవేరీ సహితుడైన కడపరాయడిని దర్శించి పరవశిస్తారు.

Friday, 16 March 2018

పిఠాపురం – పీఠికాపురము – పురుహూతికాపురముపిఠాపురం – పీఠికాపురము – పురుహూతికాపురముపిఠాపురం – పీఠికాపురము పురుహూతికాపురము. మూడూ ఒక క్షేత్ర నామాలే! అదే తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం. ఈ క్షేత్రానికి గల మరో పేరు పాంచాలపురము. ఈ క్షేత్రానికి పలు విశేషాలున్నాయి. పాద గయ, స్వయంభూ శివ క్షేత్రం, శక్తి పీఠం మరియూ శ్రీపాద శ్రీవల్లభ స్వయంభూ అవతార మూర్తి.

పాద గయ
కృతయుగంలో విష్ణు భక్తుడైన గయాసురుడు విష్ణుమూర్తి కృపను ఆపేక్షించి, ఎన్నో దివ్య సంవత్సరాలు తపస్సు చేసి, స్వామిని మెప్పించి ఈ పృథివీ మండలము మీద ఉన్న అన్ని పుణ్య క్షేత్రాల కన్నా తన దేహము పవిత్రము అగునట్టు వరమును పొందాడు. ఇక అతనిని దర్శించిన ఎంతటి పాపాత్ముడైనా చివరకు అతని శరీరము పై నుంచి వీచే గాలి సోకినంత మాత్రానే క్రిమి కీటకాది జన్మలెత్తిన పాపత్ములు కూడా తరించిపోయేవారు. అతను ఎన్నో అశ్వమేధాది పూణ్య క్రతువులు చేసి ఇంద్ర పదవిని కూడా పొందాడు. పదవీచ్యుతుడైన దేవేంద్రుడు తిరిగి తన పదవి పొందేందుకు త్రిమూర్తులను గూర్చి కొన్ని వేల ఏళ్ళు తపస్సు చేసి వారిని మెప్పించి ఆతనిని వారే వధించే వరం పొందాడు. గయాసురుడు ధర్మాత్ముడైనప్పటికీ, దుష్టులైన అతని అనుచరులు ధర్మ విరుద్ధమైన పనులు యధేచ్ఛగా చేస్తుండడంతో ఇలా జరిగింది.

ఇక ముగ్గురు త్రిమూర్తులు బ్రాహ్మణ వేష ధారణలో ఆతని వద్దకు వెళ్ళి ఒక గొప్ప యాగము కొరకు అతిపవిత్రమైన అతని శరీరాన్ని ఒక ఏడు రోజుల పాటు యజ్ఞ వేదికగా పొందారు. కానీ ఆ యజ్ఞము పూర్తయ్యే వరకు అతడు కదలకూడదని, కదిలితే సంహరిస్తామని చెబుతారు. అందుకు అతను మనఃపూర్తిగా అంగీకరిస్తాడు.

గయాసురుడు మహిమా శక్తి చేత తన దేహమును బీహారు రాష్ట్రంలోనున్న గయా క్షేత్రంలో శిరస్సు ఉండునట్లు, నాభీ స్థానము నేటి ఒరిస్సా రాష్ట్రంలోనున్న జాజిపూర్ నందు ఉండునట్లు, పాదములు పీఠికాపురంలో ఉండునట్లు విస్తరించాడు.

అలా ఆ దివ్య యజ్ఞం ఆరు రోజులు నిర్విఘ్నంగా జరిగిపోతుంది. కానీ ఏడో రోజు విష్ణుమూర్తి ప్రేరేపణ చేత శివుడు లింగోద్భవ కాలంలో అంటే అర్ధరాత్రి, కోడిరూపము దాల్చి, కోడి కూత ధ్వని చేస్తారు. ఈ మాయ తెలియని గయాసురుడు  ఏడు రోజులు పూర్తయిందని తన దేహాన్ని కదిలిస్తాడు. యజ్ఞము పూర్తి కాకుండానే తన దేహాన్ని కదిల్చాడని అందుచేత సంహరిస్తామని పలికి, త్రిమూర్తులు ఆతని చివరి కోర్కె తెలుపమని ఆడుగుతారు.

అప్పుడు గయాసురుడు, తన శరీరంలోని మూడు భాగాలు తన పేరిట గయా క్షేత్రములుగా వెలిసి, వాటి యందు త్రిమూర్తులూ వసించాలని వరము పొందుతాడు. ఆ మూడు క్షేత్రములు శక్తి పీఠలుగా కూడా విరాజిల్లుతాయి. మానవులు చనిపోయిన తమ పితరులను ఉద్దేశించి చేయు శ్రాద్ధ కర్మలు ఈ గయా క్షేత్రాలలో చేస్తే, విశేషమైన ఫలితముంటుంది.

క్లుప్తంగా ఇది, పాదగయ వెనుకనున్న వృత్తాంతం. అంత పెద్ద శరీరం కుదురుతుందా? తవ్వితే భారీ అస్తికలు దొరుకుతాయా అంటూ ప్రశ్నలు మాత్రం వేయకండి. సాధారణంగా ఇతరత్రా విశేషాలు, ఇలా తేలికగా బోధపడే విధంగా తెలియ జెప్పడం మన పురాణాల్లో ఎప్పుడూ కనపడుతూనే ఉంటుంది.

శిరోగయ = గయ క్షేత్రం బీహారు  ఫల్గునీ నదీ తీరం; విష్ణు క్షేత్రం; మంగళగౌరీ దేవి శక్తి పీఠం.
నాభిగయ = జాజిపూర్ క్షేత్రం ఒరిస్సా యజ్ఞవేదికా స్వరూప బ్రహ్మ; గిరిజాదేవి శక్తి పీఠం
పాదగయ = పిఠాపుర క్షేత్రం ఆంధ్రప్రదేశ్ కుక్కుటేశ్వరలింగరూపంలో ఈశ్వరుడు; పురుహూతికా శక్తి పీఠం స్వయంభూ శివ క్షేత్రం
సర్వలోక శుభంకరుడైన శంకరుడు లోకకళ్యాణార్ధము గయసురుని సంహారార్థమై కోడి రూపము ధరించి కోడి కూత ఇక్కడే చేశారు కాబట్టి, ఆతని కొరికమేర కోడి / కుక్కుట రూపంలో లింగారూపుడై స్వయంభువమూర్తియై శ్రీ కుక్కుట లింగేశ్వర స్వామిగా ఈ క్షేత్రంలో విరాజిల్లుతుంటారు. ఇక్కడి అర్చకులను అడుగగా, ముందు ఇక్కడి శివలింగం కోడి ఆకృతిలో ఉండేదని, అభిషేకాలవల్ల ఆ రూపు కొద్దిగా గుండ్రంగా మారిందని చెప్పారు.

శక్తి పీఠం
కృతయుగంలో, దక్ష ప్రజాపతి పరాశక్తిని గూర్చి గొప్ప తపస్సుచేసి, అంబను మెప్పించి తన కూతురుగా పొందుతాడు. ఆవిడే సతీదేవి లేదా దక్షుని కూతురగుటవలన దాక్షాయని. కొన్ని కారణాల వల్ల దక్షుడు నిరీశ్వర యాగం చేయాలని సంకల్పిస్తాడు. పిలవకుండానే, అమ్మవారు తన తండ్రి తలపెట్టిన యాగానికి చేరుకుంటుంది. ఈశ్వర ద్వేషాన్ని సంహించలేక, దాక్షాయని అని ఇక పిలిపించుకోవటం ఇష్ట పడక, తల్లి యోగాగ్నిలో తన తనువును చాలిస్తుంది. మరణించిన సతీదేవియందు తనకు గల ప్రేమ చేత  శివుడు ఆమె మృత కళేబరాన్ని భుజాన ధరించి విరాగియై లోక సంచారము చేస్తుంటాడు. అప్పుడు పరాశక్తి ఆజ్ఞమేర శ్రీ మహా విష్ణువు సతీ మృత దేహాన్ని తన సుదర్శన చక్రంతో ఖండిస్తారు. ఆ దేహ భాగములు భూమిపై పడి 108 శక్తి పీఠాలుగా విరాజిల్లాయి.  వాటిలో 101 విశేషముగానూ, 52 పీఠములు ముఖ్యమైనవిగాను, అందులో ముఖ్యాతి ముఖ్యమైనవిగా 18 భాగాలు అష్టాదశశక్తి పీఠాలుగా పిలువబడుతున్నాయి.

1. ఎడమ చెవి – శ్రీలంక – క్యాండీదంబులా – శాంకరీ దేవి
2. కుడి కన్ను – కాంచిపురం (తమిళనాడు) – కామాక్షీ దేవి
3. కుడి చేయి – ప్రద్యుమ్నం (చోటిల్లా, గుజరాత్) – శృంఖలా దేవి
4. ఎడమ చేయి – క్రౌంచపట్టణము (కర్నాటక) – చాముండేశ్వరి దేవి
5. కుడి చెవి – ఆలంపుర్ (కర్నూలు, ఆంధ్ర ప్రదేశ్) – జోగులాంబ దేవి
6. కుడి కాలు – శ్రీశైలం (కర్నూలు, ఆంధ్ర ప్రదేశ్) – భ్రమరాంబికా దేవి
7. ముక్కు – కోల్హాపూర్ (మహరాష్ట్ర) – మహాలక్ష్మీ దేవి
8. కంఠము – మాహూర్ (మహరాష్ట్ర) – ఏకవీరా దేవి
9. నాలుక – ఉజ్జయిని (మధ్య ప్రదేశ్) – మహాకాళీ దేవి
10. పిరుదులు – పిఠాపురం (ఆంధ్రప్రదేశ్) – పురుహూతికా దేవి
11. కటి భాగము – జాజిపూర్ (ఒరిస్సా) – గిరిజా దేవి
12. నాభి – దక్షారామము (ఆంధ్రప్రదేశ్) – మాణిక్యాంబ దేవి
13. హృదయం – హరిద్వార్ (ఉత్తరాంచల్) – మానసా దేవి
14. ఎడమ కాలు – అలహాబాదు (ఉత్తర్ ప్రదేశ్) – మాధవేశ్వరి దేవి
15. నోరు – జమ్ము (జమ్మూ కాశ్మీర్) – వైష్ణో దేవి
16. స్తనములు – గయ (బీహార్) – మంగళగౌరి దేవి
17. ఎడమ కన్ను – వారణాశి (ఉత్తర్ ప్రదేశ్) – విశాలాక్షి దేవి
18. కపాలం – కాశ్మీర్ (జమ్మూ కాశ్మీర్) – సరస్వతి దేవిప్రయాగ యాత్ర

త్రివేణీ సంగమం – ప్రయాగ యాత్ర

ప్రయాగ అంటే?
గంగా, యమునా, సరస్వతుల సంగమస్థానం ప్రయాగ. త్రివేణీ సంగమస్థానమైన ప్రయాగ తీర్థ రాజం. “ప్రకృష్టం సర్వ యౌగభ్యః ప్రయాగమితి కథ్యతే” (స్కాంద పురాణం) ప్రయాగ అనే పదాన్ని రామాయణ, మహాభారత, పురాణాది గ్రంథాలు ‘ప్ర’ – ప్రకృష్ట అనగా విశేషంగా + ‘యాగ’ అనగా యాగాలు – వెరసి ‘ప్రకృష్ట యజ్ఞాలు జరిగిన క్షేత్రం’ అని నిర్వచిస్తున్నాయి. “ప్రకృష్టత్వా ప్రయాగో సా ప్రాధాన్యా రాజ శబ్దవాన్” (బ్రహ్మ పురాణం) ప్రకృష్టమైన యాగాలు జరిగిన తీర్థక్షేత్రాలకే తలమానికం – కాబట్టి ఇది ‘ప్రయాగ రాజము’.

ప్రయాగ తీర్థ క్షేత్రం, ఇలాహాబాదు పట్టణ అంతర్భాగంగా ఉంటుంది. ఇలాహాబాదు నగరం – ఒకప్పటి ప్రతిష్ఠానపురము. మనువుయొక్క పుత్రిక ‘ఇలా’ పుత్రుడైన పురూరవుడు తదితర చంద్రవంశజుల రాజధాని ప్రతిష్ఠానపురము. అంచేత చంద్రవంశజుల కాలంలో, ప్రయాగ సహిత ప్రతిష్ఠానపురాన్ని ‘ఇలా’ పేరున ‘ఇలావర్తము’ అని పిలిచేవారు. కాలాంతరంలో ఇది ‘ఇలావాసము’ అయింది. ముఘల్ చక్రవర్తి అక్బర్ – ఈ ఇలావాసాన్ని ‘అల్లాహావాస్‌’ అని మార్చాడని చరిత్రకారుడు అబు ఫజల్ వ్రాశాడు. క్రమేపీ ఆ పదం ‘అలహాబాదు’, ‘ఇలాహాబాదు’లుగా మారిపోయి, ఇప్పటికీ అలానే పిలువబడుతుంది.

ప్రయాగ మాహాత్మ్యం
దశకోటి సహస్రాణి త్రిస్త్కోట్‌యస్తథాపరే, మాఘ మాసే తు గంగాయాం గమిష్యన్తి నరర్షభ” (స్వర్గఖండం, పద్మ పురాణం) దీనిలో అసంఖ్యాకంగా తీర్థాలు నిత్య నివాసముంటాయి. ఇక మాఘమాసంలోనయితే లెక్కకే అందనన్ని తీర్థాల మహత్తు ప్రయాగ పొందుతుంది. మత్స్యపురాణంలో మార్కండేయ ముని యుధిష్టురిడికి దీని మాహాత్మ్యం తెలియజేస్తూ, స్వయంగా బ్రహ్మదేవుడుశైతం – నిరంతరం ఈ తీర్థ స్మరణ చేస్తూ ఉంటారని చెప్పారు. సమస్త దేవతాగణం, అన్ని తీర్థాలు – దీనిలో నివాసముంటాయని మత్స్యపురాణాం చెబుతోంది. మహాకవి కాళిదాసు – సముద్రపత్నుల (గంగాయమునలు) సంగమస్థానంలో పుణ్యస్నానమాచరించిన పవిత్రాత్ములు, తత్వజ్ఞానం పొందకపోయినా, మరణానంతరం మోక్షానికి అర్హులవుతారని చెప్పారు.

ఐదు యోజనాల విస్తీర్ణంలోనున్న సంగమ స్థలం, గంగాయమునల ప్రవాహ కారణంగా మూడు భాగాలుగా విభాగించబడుతుంది. గంగకు పూర్వోత్తరాన ఉన్న స్థలాన్ని ‘గంగాపార్‌’ అని, గంగాయమునలకు దక్షిణాన ఉన్న ప్రదేశాన్ని ‘యమునాపార్‌’ అని, ఈ రెండు నదుల మధ్యనున్నప్రదేశాన్ని ‘దోఆబ’ (ద్వాబా) అని అంటారు. గంగాపార్ ‘ప్రతిష్ఠాన్‌’ (ఝూసీ), యమునాపార్‌లో ‘అలర్క్‌’ (అరౌల్‌) అని మూదవది అయిన రెండు నదుల మధ్యస్థలంలో ‘ప్రయాగ’ అని మొత్తం మూడు అగ్ని కుండాలుగా అవధారణ చేయవచ్చు. ఈ మూడు కుండాల మధ్యనుండి ప్రవహిస్తూ గంగమ్మ ముందుకు సాగుతున్నట్టుగా పరిగణించవచ్చు. ప్రతిష్ఠాన్‌పుర్‌లో ఉన్నది ‘ఆహ్వనీయాగ్ని’ కుండమని, అలర్కపుర్‌లో ‘దక్షిణాగ్ని’ కుండమని, ప్రయాగలో ‘గార్హాపత్యాగ్ని’ కుండమని అంటారు. ఈ మూడుగా విభాగించబడిన ప్రతి క్షేత్రంలో – శుచిపూర్వకంగా నియమ సంయమనాలతో ఒక్క రాత్రన్నా గడిపితే, ఆయా క్షేత్రాలలో అగ్ని (త్రేతాగ్నుల) ఉపాసన చేసిన ఫలితం దక్కుతుంది.

ఈ రెండు నదుల సంగమంలో పవిత్ర స్నానం చేసిన వారు స్వర్గాన్ని చేరుతారని, ఇక్కడ పరమపదించినవారికి జన్మరాహిత్యం కలుగుతుందని – ఈ ప్రయాగ తీర్థ మహిమా వర్ణన, ఋగ్వేదంలో సైతం కనిపిస్తుంది. ప్రయాగరాజములో వసించే వారు నిష్కాములై లేక కామార్థులైనా సరే – ధర్మబద్ధంగా జీవిస్తూ, శక్తికొలది దానాలు చేస్తూ మోక్షాస్థితికి అర్హత పొందగలరు.

స్కాంద పురాణాంతర్గత కాశీ ఖంఢంలో “జన్మాన్తరేష్వసంఖ్యేషు యః కృతః పాపసంచయః, పుంసః శరీరాన్నితర్యాతుమపేక్షేత పదాన్తరమ్‌” అంటే జన్మ జన్మాంతరాలలో సంచయమైన పాపం, ప్రయాగ తీర్థముయొక్క యాత్ర వల్ల మనిషి శరీరాన్ని వీడిపోతుంది. ఇలా పురాణేతిహాసాలలో ఉన్న విశేషాలను ఉటంకిస్తూ పోతే, ఒక చిన్ని పుస్తకమే రాయొచ్చు.

ప్రయాగలో చేయవలసినవి?
స్వచ్ఛంగా ఉన్న గంగ, నల్లనయ్య వర్ణంతో యమున, అంతర్వాహినిగా సరస్వతీ నదులు సంగమించే ఈ తీర్థంలో చేయవలసిన ముఖ్యమైన కర్మ – పవిత్ర సంగమ స్నానం. ప్రయాగలో పూణ్యస్నానం చేయటానికి తిథి, మాసాలు, లేక ఆ భక్తుడి అవస్థలకు సంబందించిన నియమమంటూ ఏదీ లేదు. ఎప్పుడైనా చేయవచ్చు. కానీ ప్రతి పన్నేండేళ్ళకొకసారి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కుంభ మేళ సమయంలో, ఇంకా ప్రతి సంవత్సరం వచ్చే మాఘ మాసంలో – ఈ తీర్థస్నానం విశేష ఫలితాన్నిస్తుంది. ఒక చిన్న గమనిక. మన తెలుగువారి లెక్క ప్రకారం పుష్య బహుళ పాడ్యమి నుండి మాఘ పౌర్ణమి వరకు గల కాలం, ఉత్తర భారతీయులకు మాఘ మాసం. ఈ విషయానికి సంబందించిన వివరాలు విడిగా వేరే టపాలో తెలియజేస్తాను.

ప్రయాగం వపనం కుర్యాత్ గయాయాం పిండపాతనమ్‌, దానం దధ్యాత్కురుక్షేత్రే వారాణస్యాం తను త్యజేత్‌” అని కూడా స్కాంద పురాణాంతర్గత కాశీ ఖంఢంలో ఉంది. దీని అర్థం – ప్రయాగలో వపనం అంటే (మన తిరుమలలోలాగా) శిరో ముండనం, గయలో పిండదానం, కురుక్షేత్రంలో దానం మరియూ కాశిలో మరణాలను ఒకటిగా పోల్చారు. అంచేత, స్నానానికి ముందు నమ్మకం ఉన్నవారు ముండనం కూడా చేయించుకుంటారు.

తత్ర దానం ప్రదాతత్వ్యం యథావిభవసమ్భవమ్‌, తేన తీర్థ ఫలేనైవ వర్ధతే మాత్ర సంశయః” ప్రయాగలో శక్తికొలది దానాలు చేయాలని చెప్పబడింది. ఇక్కడ చేసిన దానాలు క్షేత్రమాహాత్మ్యంవల్ల విశేష ఫలితాన్ని ప్రసాదిస్తాయి.

హిరణ్య శ్రాద్ధం మరో ముఖ్య కర్మ. తల్లీ, తండ్రి, తాత ముత్తాతలే కాక, తనతో సంబంధం ఉన్న వారు లేదా పరమపదించిన స్నేహితులు, చుట్టాలు వంటి అందరికీ ఇక్కడ పిండ రహిత శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తుంటారు.

ఈ త్రివేణీ సంగమంలో, మరణించినవారి చితా భస్మాన్ని వదలటానికి దూర దూరాల నుండి వస్తుంటారు.

మరో ముచ్చటైన తంతు – వేణీ దానం. ఇది సుమంగళులైన స్త్రీలకు సంబందించినది. తమ భర్తకు అర్చన చేసి, తను తెలిసీ తెలియక చేసిన తప్పులన్నిటికి క్షమాపణకోరి, భర్త ఒడిలో కూర్చొని, అతని చేత కొంత జుత్తు కత్తిరింపజేసి, ఆ జుత్తును త్రివేణీ సంగమంలో వదులుతారు. సాధారణంగా కత్తిరించిన జుత్తు, నీటిపై తేలియాడుతుంది. కానీ ఇక్కడ, ఆ జుత్తు మునుగుతుంది. జీవితంలో ఒక్క సారి మాత్రమే వేణి దానం చేయాలని పండితుడు చెప్పాడు.శ్రీ ఉమాకొప్పులింగేశ్వర స్వామి

శివలింగంపై కొప్పు
శ్రీ ఉమాకొప్పులింగేశ్వర స్వామి

తూర్పు గోదావరి జిల్లా, కొత్తపేట మండలం పలివెల గ్రామంలో ఉన్న శ్రీ ఉమాకొప్పులింగేశ్వర స్వామివారి క్షేత్రం బహు పురాతనమైనది. ఈ గ్రామం రావులపాలెం నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. అనుకోకుండా మొన్నీమధ్య మధ్యాహ్నం రెండు గంటలకు అక్కడికి చేరుకున్నాను. ఆ సమయంలో దేవాలయం తెరిచి ఉంటుందా అన్న అనుమానంతో దేవాలయంలోకి ప్రవేశించాను. ఏవో కారణాలవల్ల తెరిచే ఉన్నది. అలా మనకి రాసున్నదన్నమాట. ఈ దేవాలయానికి కొన్ని వైవిధ్యాలు ఉన్నాయి. మొదటిది – శివలింగంపై కొప్పు ఉండడం. రెండవది – అమ్మవారు స్వామివారి పక్కనే ఉండడం. శ్రీ పార్వతీపరమేశ్వరులు కలిసియున్న ఏకపీఠం ఇక్కడే ఉన్నది. మూడవది – నిజానికి శివలింగంపై కొప్పు మొదటినుండీ ఉండినది కాదు; కాలాంతరంలో పుట్టుకొచ్చినది.

శ్రీ ఉమాకొప్పులింగేశ్వర స్వామి గుడి వెలుపల, ఇటీవలే అమర్చిన ఒక శిలా ఫలకంపై ఆ క్షేత్ర మాహాత్మ్యాన్ని తెలియజేస్తున్న వివరాలను యథాతదంగా ఇక్కడ ఫొటోలతో సహా పొందుపరుస్తున్నాను. కానీ వింధ్య పర్వతం, అగస్త్య మహాముని వివరాలు కౢప్తంగా తెలుసుకుంటే కింద ఉన్న మాహాత్మ్య వర్ణనం పూర్తిగా అర్థమవుతుంది.

అగస్త్యుడు: ఒకానొక సమయంలో వింధ్య పర్వతానికి మేరు పర్వతం పై అసూయ కలిగి, తానదే పనిగా పెరిగిపోతూ గ్రహనక్షత్రమండల గమనానికి అవరోధం కలిగించసాగింది. అందుకు సూర్యుడు తన చుట్టూ తిరుగక మేరువు చుట్టూ తిరగడమే ప్రధాన కారణం. అలా వింధ్య పర్వతం పెరిగిపోవడంతో లోక వ్యవహారం దెబ్బ తిన్నది. దేవతలు వింధ్య పర్వతాన్ని ప్రార్థించారు. ఆయన వినలేదు; తగ్గ లేదు. చేసేదేమీలేక దేవతలందరూ బ్రహ్మ వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. అంత బ్రహ్మ ఈ ఉపద్రవము నుండి మిమ్ము రక్షించువాడు అగస్త్యుడు తప్ప మరెవరూ లేరని సెలవిచ్చారు. దేవతలు తిన్నగా అగస్త్యుని చేరి విషయం విశదపరిచారు. విన్న అగస్త్యుడు భయము వలదని వారికి అభయమిచ్చి తాను వింధ్య పర్వత ప్రాంతాన్ని సమీపించాడు.

అంత దూరాన అగస్త్యుని చూచిన వింధ్య, పూర్వం వలె ఒదిగిపోయింది. గ్రహ గమనము మరలా ప్రారంభమైనది. వింధ్య పురుషాకృతి దాల్చి అగస్త్యునకు సాష్ఠాంగదండ ప్రణామం చేసి ఆయన రాకకు కారణం వినగోరాడు. అందుకు సమాధానంగా ఆ మహా ముని “నేను దక్షిణాపథమందలి తీర్థములను చూడ బయలుదేరితిని. తిరిగి వచ్చునంత వరకూ నీవు ఇటులనే ఉండవలెను” అని ఆదేశించగా వినమ్రంగా వింధ్య అంగీకరించి అలాగే ఉండి పోయింది. అప్పటి నుండి ఆయన దక్షిణ భారతంలోనే స్థిర పడి పోయారు. ఆయనకిచ్చిన మాట మేర వింధ్య పర్వతం కూడా అలాగే ఉండి పోయింది.

అగస్త్యుని మాట వింధ్య పర్వతం విన్నది అంటే, ఆయన ఎంతటి పుణ్య పురుషుడో అర్థమవుతుంది. శ్రీమద్రామాయణం, అరణ్య కాండము సర్గలు 10, 11 లలో ఆయన ఎంతటి గొప్పవాడో స్వయంగా శ్రీరాముడే తెలియజేస్తాడు. నిజానికి ‘అగమ్ స్థంభయతీతి అగస్త్యః’ అనగా అగమును (పర్వతమును) స్థంబింపజేసిన వాడు కాబట్టి ఆయన ‘అగస్త్యుడు’ అను పేరుతో విఖ్యాతి కెక్కారు.

ఇక శిలా ఫలకంపై ఉన్న క్షేత్ర మాహాత్మ్య వివరాలు…

శ్రీ స్వామివారి పూర్వ చరిత్ర: పూర్వము అగస్త్య మహాముని కౌశికానది తీరామున పల్వలపుర ప్రాంతంలో తపస్సు చేసుకొనుచుండగా హిమవత్ పర్వతమున లోక కల్యాణార్థమై పార్వతీ పరమేశ్వరుల కల్యాణము అతి వైభవముగా జరుగుచుండెను. ఆ కల్యాణమును చూచి తరించవలెనని అగస్త్య మహాముని సంకల్పించెను. అగస్త్యుడు బయలుదేరి వెళ్ళినచో వింధ్య పర్వతము యెప్పటియెట్లే తన ఉగ్రరూపమును చూపి సంభోంతరాశమునకు ఎదిగి, గ్రహభ్రమణమునకు తీవ్ర ఆఘాతము కలుగజేయును. అట్టి ఉపద్రవం జరుగునని భయపడి ఇంద్రాది దేవతలు అగస్త్యుని ప్రయాణమును విరమింపజేయుటకై విశ్వబ్రహ్మను పంపిరి. అగస్త్యుడు విశ్వబ్రహ్మ ద్వారా కల్యాణ మహోత్సవ వైభవమును శ్రవణానందముగా విని, తన దివ్యదృష్టిచే కనులారా గాంచి పార్వతీపరమేశ్వరులను కల్యాణ పసుపు వస్త్రములతో దర్శనమీయవలసినదిగా ప్రార్ధించెను. వారట్లే దర్శనమిచ్చిరి. కల్యాణపీఠముపై దివ్యమంగళ స్వరూపులుగా విరాజిల్లుచున్న పార్వతీ పరమేశ్వరులను ఏకపీఠముపై పల్వలపుర దివ్యక్షేత్రమున భక్త వాంచితమును తీర్చుటకై లోక కల్యాణార్ధం ప్రతిష్ఠ గావించెను. అగస్త్యునిచే ఈ క్షేత్రమునకు “అగస్త్యేశ్వర క్షేత్రము” అని పేరు ఈ లింగము ప్రతిష్ఠింపబడుటచే వచ్చెను. ఇట్లుండ…

శ్రీ అగస్త్యేశ్వరుడు కొప్పులింగేశ్వరుడైన చరిత్ర: పల్వలపురంలో అగస్త్య మహాముని వలన ప్రతిష్ఠ గావింపబడిన అగస్త్యేశ్వరుని వెలనాటి వంశమునకు చెందిన యొక విప్రుడు పరమ నిష్టాగరిష్టుడై విశేష భక్తితో పూజించుచుండేను. పౌరులాతని వేశ్యాలోలతను సహింపజాలక రాజ్యపాలకునకు ఫిర్యాదు చేసిరి. మహారాజు ఫిర్యాదులను వినయు నిర్లక్ష్యము చేసెను. కాని నానాటికి ఫిర్యాదులు హెచ్చుచుండుటచే ఒకానొక రోజున ఆకస్మికంగా పూజారిని పరీక్షింపనెంచి మహారాజు పల్వలపురమునకు వచ్చెను. ఆ సమయమున పూజారి వేశ్య యొద్ద నుండెను. మహారాజు రాక విని రివాజు ప్రకారము నిర్మాల్య మాలికను రాజు గారికి ప్రసాదముగా ఇచ్చుటకుగాను ఆ సమయములో మరియొక పూలమాల లేదు కదాయని గ్రహించి, తన వేశ్య కొప్పులో అంతకుముందే యుంచిన స్వామి పూలమాలను తీసి రహస్యముగా ఆలయములోనికి తెచ్చి నిర్మాల్య మాలికగా రాజుగారికి ఇచ్చెను. మహారాజు ఆ నిర్మాల్య మాలికయందు నిగనిగలాడుచున్న పొడవైన కేశమును గాంచి శంకించి పూజారిని ప్రశ్నింపగా నాతను “పరమశివుడు జటాఝూటధారి” గాన పూలమాలికను అగస్త్యేశ్వరుని కేశము చుట్టుకొని యుండేనని బదులు పలికెను. లింగమునకు జటాఝూటముండుటయా అని రాజు ఆశ్చర్యపడి – అయినచో ఈశ్వరలింగమునకు కేశములు చూపమనెను. దానికి పూజారి నిర్మల హృదయుడై ధైర్యమును బూని, మహారాజా, యిది మాధ్యాహ్నిక సమయము, స్వామివారికి అభిషేక పూజా విధులు నిర్వర్తించి మహానివేదనమొనర్చి నాగాభరణాలు అలంకరించి యుంటిని, రేపటి ఉదయం వరకు అలంకరణాదులను తొలగించరాదు. మీరు ప్రాతః కాలము వరకు యుండిన స్వామి జటాఝూటమును చూపగలననేను.

మహారాజు దానికంగీకరించి జటాఝూటములు చూపనిచో నీకు శిరచ్ఛేదము తప్పదని పలిక ఆ రేయి పల్వలపురం లోనే విడిదిచేసి యుండెను. అంతట పూజారి తనకు శిరచ్ఛేదము తప్పదని యెంచి అవసానకాలంబున చేసికొనినచో మోక్షం లభించునని యెంచి ఆ రాత్రంతయు శ్రీ స్వామి గర్భాలయమునందే యుండి పరమ శివుని పలురీతులు వేడుకొనుచూ స్వామీ! నీ భక్త పరమాణువును నా పూర్వ జన్మ ఫలంబుచే నేనీ పాపాలు చేసి యుంటిని. నా తప్పును మన్నించి ఇప్పటి నుండి మీరు కొప్పును ధరించవలెను. మీ కొప్పును మహారాజుగారికి చూపనిచో నాకు శిరచ్ఛేదము తప్పదు. మీరు కొప్పును ధరించరేని నా శిరస్సును ఈ లింగమునకు బాదుకొని ప్రాణములు విడిచెదను. అని దీనముగా పలికి మూర్ఛిల్లెను. అంతట నీలకంఠుడు పూజారి మొరాలకించి లింగోద్భవ కాలమున (అర్ధరాత్రి) కొప్పును ధరించెను. స్వామి కొప్పును ధరించుట పూజారి చేసిన కృత్రిమ చర్య అని ప్రజలు ఏక కంఠముతో పలికిరి. అంతట మహారాజు “ఏది శిరోజమును పెకిలించి తీసుకొని రమ్ము” అని ఆజ్ఞాపించగా పూజారి అట్లే చేసెను. రాజునకు శిరోజము మొదట రక్తము కనిపించెను. వెంటనే రాజునకు నేత్ర అవరోధము కలిగెను. అప్పుడు మహారాజు పరమేశ్వరునకు అపచారము జరిగెనని తలంచి, దోషమును మన్నించి దృష్టిని ప్రసాదించమని వేనోళ్ళ పరమేశ్వరుని వేడుకొనగా అంతట పరమేశ్వరుడు శాంతించి రాజునకు దృష్టిని ప్రసాదించెను. మహారాజునకు పరమేశ్వరుడు దృష్టిని ప్రసాదించినందుకు దానికి గుర్తుగా రాజుగారు జుత్తుగపాడు గ్రామానికి చెందిన భూమిని స్వామికి కానుకగా సమర్పించెను.

జుత్తుగపాడు అను గ్రామం రావులపాలెం మండలం పొడగట్లపల్లి గ్రామమునకు రెండు ఫర్లాంగుల దూరంలో కలదు.

కావున అగస్త్యేశ్వరుడు తన పూజారి ప్రాణములను కాపాడుటకుగాను కొప్పును ధరించుటవలన నాటి నుండి శ్రీ ఉమాకొప్పేశ్వర స్వామిగా నామాంతరము చెంది అప్పటి లగాయతు శోభాయమానంగా విరాజిల్లు చున్నది.

ఆనాటి పల్వలపురమే నేటి పలివెల గ్రామము.

Thursday, 15 March 2018

శ్రీరంగం - పెరియ కోయిల్‌

పెరియ కోయిల్‌.. శ్రీరంగం

పాలకడలి నుంచి శ్రీ మహావిష్ణువు ఉద్భవించిన క్షేత్రమే శ్రీరంగం. సమున్నత గోపురాలతో, విశాల ప్రాకారాలతో, శ్రీరంగనాధుని నామస్మరణలతో నిత్యం మార్మోగే దివ్యక్షేత్రం శ్రీవైష్ణవ వైభవానికి పట్టుగొమ్మలా వెలుగొందుతోంది. 108 దివ్యదేశాల్లో పవిత్రమైన ఈ క్షేత్రం తమిళనాడులో నెలకొనివుంది. కోయిల్‌ అంటే శ్రీరంగం, మలై అంటే తిరుమల అంటారు. శ్రీరంగాన్ని పెరియకోయిల్‌ అని కూడా అంటారు. దీనర్థం పెద్ద దేవాలయం అని. శ్రీరంగనాధుడు శయనమూర్తిగా వుండి భక్తులకు ఆశీస్సులు అందిస్తుంటారు. దాదాపు 157 ఎకరాల్లో నెలకొన్న ఆలయం ప్రపంచంలోని పెద్ద దేవాలయం అంటారు. కంబోడియాలోని అంగ్‌కార్‌వాట్‌ ప్రపంచంలోనే పెద్ద దేవాలయం అయితే అది పర్యాటక స్థలం మాత్రమే. దీంతో నిత్యం పూజలందుకుంటున్న క్షేత్రాల్లో శ్రీరంగమే పెద్దది. శ్రీరంగనాథుడిని దర్శించినంతనే మనకు సాక్షాత్తు ఆ శేషసాయిని దర్శించున్న దివ్యానుభూతి కలుగుతుంది. వేల సంవత్సరాలుగా కోట్లాది భక్తులకు ఆశీస్సులు అందజేస్తున్న శ్రీరంగ పుణ్యక్షేత్ర సందర్శన మనకు ఎంతో పుణ్యాన్ని కలిగిస్తుంది.

విభీషణుడికి రాముడు ఇచ్చిన విగ్రహం..
సీతా అపహరణం తరువాత అగ్రజుడైన రావణుడికి అతని సోదరుడు విభీషణుడు పలు హితవచనాలు చెబుతాడు. స్త్రీలను అపహరించడం తగదనిహితవు పలుకుతాడు. అయితే రావణుడు ఈ మాటలను పెడచెవిన పెడ్తాడు. దీంతో విభీషణుడు రాముడి దగ్గరకు వచ్చి ఆశ్రయం పొందుతాడు. రావణ వధ అనంతరం విభీషణుడి భక్తికి మెచ్చిన రాముడు రంగనాధుడి విగ్రహాన్ని అతనికిస్తాడు. లంకకు వెళ్లే సమయంలో ఎక్కడా నేల మీద వుంచకూడదని షరతు విధిస్తాడు. లంకకు వెళుతున్న విభీషణుడు కావేరి దాని ఉపనది మధ్యలో వున్న ద్వీపంలో కాసేపు విశ్రమించేందుకు భూమిపై విగ్రహాన్ని వుంచుతాడు. అనంతరం తిరిగి వెళ్లే సమయంలో విగ్రహాన్ని తీసుకువెళ్లేందుకు యత్నిస్తుండగా విగ్రహం రాలేదు. ఆ ప్రదేశాన్ని పాలించిన ధర్మచోళుడు విభీషణుడిని ఓదార్చుతాడు. స్వామివారు కూడా అక్కడే వుండేందుకు ఇష్టపడటంతో దేవాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. విభీషణుడి కోరిక మేరకు స్వామివారు దక్షిణ దిక్కునకు తిరుగుతారు.

శయనమూర్తి.. ప్రధాన ఆలయంలో స్వామివారు శయనమూర్తిగా వుంటారు. క్షీరసాగరంలో పవళించిన శ్రీ మహావిష్ణువు అదే భంగిమలో ఇక్కడ భక్తులకు దర్శనమివ్వడం విశేషం. మహావిష్ణువు నాభినుంచి పద్మంలో జన్మించిన బ్రహ్మ ఇక్కడ కనపడరు. దీనర్థం సూర్యోదయానికి ముందే బ్రహ్మదేవుడే స్వామివారిని పూజిస్తారని క్షేత్రగాధ వెల్లడిస్తోంది. విశిష్టాద్వైత సిద్ధాంతకర్త శ్రీరామానుజాచార్యులు శ్రీరంగంలోనే అనేక సంవత్సరాలు వుండి స్వామిసేవలో పాల్గొన్నారు. భాష్యాకార్లకు ప్రత్యేకమైన మందిరం వుంది.

లౌకికవాదానికి ప్రతీక.. దిల్లీ సుల్తాన్‌ కాలంలో ఇక్కడ మూర్తిని దిల్లీకి తరలించినట్టు తెలుస్తోంది. అక్కడ సుల్తాన్‌ కుమార్తె స్వామిభక్తురాలిగా మారింది. అనంతరం ఆ విగ్రహాన్ని శ్రీరామానుజాచార్యుల వారు శ్రీరంగానికి తీసుకువస్తారు. సుల్తాన్‌ కుమార్తె తన విశేష భక్తితో స్వామివారిలో ఐక్యమైంది. ఇప్పటికీ ఆ ఘటనకు ప్రతీకగా పౌర్ణమి, ఏకాదశి సమయాల్లో స్వామివారు లుంగీ ధారణలో కనిపిస్తారు. నివేదనగా రోటీని సమర్పిస్తారు.

ఏడు ప్రాకారాలు.. శ్రీరంగనాధుని ఆలయంలో మొత్తం ఏడు ప్రాకారాలు, 21 గోపురాలు వున్నాయి. ఒక్కో ప్రాకారంలో పలు ఆలయాలు నెలకొనివున్నాయి. శ్రీరంగనాధునికి ఏడాదిలో మూడు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. చిత్తిరై (ఏప్రిల్‌-మే), తాయ్‌ (జనవరి-ఫిబ్రవరి), పంగుణి (మార్చి-ఏప్రిల్‌) ఈ ఉత్సవాలు జరుగుతాయి. మహావిష్ణువు అనుంగుభక్తుడు గరుడాళ్వర్‌కు ప్రత్యేకమైన మందిరం వుంది. సాగరమథనం నుంచి ఉద్భవించిన దేవతా వైద్యుడు ధన్వంతరికి కూడా ఒక మందిరం వుండటం విశేషం. మాతృమూర్తి రంగనాయకి తాయర్‌తో పాటు శ్రీదేవి, భూదేవిలు కూడా ఆలయంలో భక్తులను ఆశీర్వదిస్తుంటారు.

ఇలా చేరుకోవచ్చు.. * శ్రీరంగం సమీపంలోని రైల్వేస్టేషన్‌ తిరుచినాపల్లి. ఇక్కడ నుంచి శ్రీరంగం 9 కి.మీ. దూరంలో ఉంది.
* దేశంలోని పలుప్రాంతాల నుంచి శ్రీరంగానికి రహదారి సౌకర్యముంది.
* తిరుచినాపల్లి విమానాశ్రయంలో దిగి వాహనాల ద్వారా శ్రీరంగం చేరుకోవచ్చు.కాకిముట్టని క్షేత్రం - కాటకోటేశ్వరం

కాకిముట్టని క్షేత్రం - కాటకోటేశ్వరం

అనంతపురం / తాడిమర్రి: కాటికోటేశ్వరాలయం ప్రాంగణంలో కాకులు కనిపించవు. అసాంఘిక కార్యక్రమాలు జరగవు. అలా ఎవరైనా జరపడానికి ప్రయత్నించినా ఆలయ ప్రాంగణంలో ఉన్న తేనెటీగలు వారిని చుట్టుముట్టి ఆలయాన్ని దాటి వెళ్లేంతవరకు వదిలిపెట్టవని భక్తుల నమ్మకం. ఈ క్షేత్రం గురించి ఒక కథ ప్రచారంలో ఉంది. పూర్వం పాండవులు వనవాసం చేసినప్పుడు ఈ ఆలయ ప్రాంగణంలో నిద్రిస్తున్నారు. సోదరులు తాగేందుకు నీరు అడగటంతో వారి దప్పిక తీర్చేందుకు భీముడు భూమిని గదతో మోదగా ఇక్కడ గదేగుండం ఏర్పడి నీరు వస్తోందని స్థలపురాణం చెబుతోంది. ఆలయానికి హాజరయ్యే భక్తులు ముందుగా గదేగుండంలో స్నానం చేసిన తరువాత స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీ. అయితే దీర్ఘ కాలిక రోగాలతో బాధపడుతున్న వారు కూడా ఆలయప్రాంగణంలోనే గడుపుతూ రోజూ గదేగుండంలో స్నానం చేయడం ద్వారా రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం.

ఇటీవల కాలంలో ఆలయ ప్రాంగణంలో దక్షిణకాశీ నుంచి తెప్పించిన శివలింగాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. దీంతో పాటు ధ్యానమందిరం, అన్నదాన సత్రం, వసతిగృహాలను భక్తుల విరాళాలతో నిర్మించడంతో ఆలయానికి విచ్చేస్తున్న భక్తులకు వసతులు సులువుగా లభిస్తున్నాయి. ప్రతి సోమవారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీ. కార్తీకమాసాన్ని పురష్కరించుకుని ప్రతిరోజూ పూజలను నిర్వహిస్తున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో నిత్యాన్నదానం చేస్తున్నారు. ఈ క్షేత్రానికి వెళ్లాలంటే అనంతపురం వైపు నుంచి వచ్చే భక్తులు నార్పల, గూగూడు, నడింపల్లి మీదుగా చిల్లవారి పల్లి కాటకోటేశ్వర క్షేత్రానికి చేరుకోవచ్చు. రోజూ అనంతపురం నుంచి రెండు బస్సులు తిరుగుతాయి. ధర్మవరం వైపు నుంచి వచ్చే భక్తులు దాడితోటకు చేరుకుని అక్కడి నుంచి ఆటోల ద్వారా క్షేత్రాన్ని చేరుకోవచ్చు.
Tags : Crow, KatakoteswaramWednesday, 14 March 2018

మానసా దేవి

ఇష్టార్ధాలను శీఘ్రంగా పూరించే మానసా దేవి

మన దేశంలో అనేక ప్రాచీన దేవాలయాలు ఉన్నాయి. ఆ ఆలయాలలో అతి ముఖ్యమైనవి అష్టదశ శక్తి పీఠాలు. ప్రతి క్షేత్రం దానికదే ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ప్రసిద్ధి చెందింది. వాటిలో మానసా దేవి దేవాలయం కూడా ఒకటి. ఈ దేవాలయం ఆలయ గర్భగుడిలో మానసా దేవి వెలసి అత్యంత మహిమాన్విత శక్తిస్వరూపిణిగా భక్తులకు దర్శనమిస్తుంది. ఈ ఆలయం పంచ తీర్థాలు లేదా ఐదు తీర్థాలలో ఒకటిగా వుంది. దేశంలోని అన్ని ప్రాంతాల నుండి భక్తులు ఈ శక్తిని ఆరాధిస్తారు. కాబట్టి ఆ దేవాలయం యొక్క స్థలపురాణం ఏమిటి? ఆ తల్లి శక్తి ఏమిటి? ఆమె ఎక్కడ వెలసియున్నది? అనే అనేకమైన ప్రశ్నలకు సమాధానంగా వ్యాసంమూలంగా సంక్షిప్తంగా తెలుసుకుందాం.

ఈ మానసా దేవి దేవాలయం భారత దేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పవిత్రమైన నగరం హరిద్వార్ లో వుంది. ఈ దేవాలయం ఒక హిందూ దేవాలయం. మానస దేవికి అంకితం చేయబడినది. ఈ దేవాలయం హిమాలయాల యొక్క దక్షిణ పర్వత శ్రేణులలోని శివాలిక్ కొండల మీద బిల్వా పర్వతం పైన వుంది. ముఖ్యంగా ఈ తీర్థక్షేత్రాన్నిను బిల్వా తీర్థం అని పిలుస్తారు.

ఆశ్చర్యం ఏంటంటే ఒకానొకకాలంలో ఆదివాసీలచే పూజించబడిన ఈ తల్లి అనేక వేల సంవత్సరాల తరువాత హిందూధర్మంలో పూజించడం ప్రారంభించటం జరిగింది. హాలాహలాన్నిసేవించిన పరమేశ్వరునికి విషప్రభావం నుంచి మానస దేవి రక్షించినది. అదేవిధంగా పరమశివుడు ఆమె కోరికను మెచ్చి తన కూతురిగా స్వీకరించాడు అనే కథ ప్రచారంలో ఉంది.

ఈ గుడి ప్రత్యేకత ఏమంటే ఈ మానసాదేవి భక్తుల కోరికలను త్వరగా నెరవేరుస్తుంది. అందువల్ల చాలామంది భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు. వారి కోరికలను నెరవేర్చటానికి ఈ తల్లి వెలిసిన స్థలంలో ఒక పవిత్రమైన చెట్టు ఉంది. వారు ఆ చెట్టు దగ్గర నిలబడి భక్తులు తమ కోర్కెలను కోరుకుని దారం కడితే శీఘ్రంగా ఇష్టార్థాలు నెరవేరుతాయని నమ్ముతారు.

భక్తులు వారి కోరికలు నెరవేరిన తరువాత, వారు ఈ దేవాలయానికి వచ్చి తమ దారాలను విప్పుతారు. ఆ తల్లిని భక్తితో పూజించటానికి టెంకాయలు, పండ్లు, పూలమాలలు మరియు ధూపదీపాలను మానసాదేవికి సమర్పించి వెళ్తారు.

ఆరాధనకు యోగ్యమైన స్థలం ఇది, హరీద్వార్ లోని మూడు పీఠాలలో ఇది కూడా ఒకటి. ఇతర రెండు పీఠాలు ఏవంటే ఒకటి చండి దేవి దేవాలయం మరొకటి మాయాదేవి దేవాలయం

మానసాదేవి ఆలయం పురాతన ఆలయాలలో ఒకటి. హరిద్వారాన్ని సందర్శించే యాత్రికులు తప్పకుండా ఈ తల్లిని దర్శించుకుంటారు. ఈ పవిత్రమైన దేవాలయం అనేక శతాబ్దాలనుంచి హరిద్వార్ లో పవిత్రమైన సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే ఉంది.

ఈ దేవాలయం నుంచి గంగానది మరియు హరిద్వార్ న్ని చూడవచ్చును. ఈ తీర్థయాత్రకు వెళ్ళాలంటే మెట్లమార్గం ద్వారా వెళ్ళాలి. ఈ ఆలయానికి ఒక "తాడు మార్గం" కూడా ఉంది. ఈ సేవను "మానాసాదవి ఉడాన్ కటోలా" అని కూడా పిలుస్తారు. యాత్రికులకు ఈ ప్రదేశంలో చండి దేవి ఆలయం కూడా ఉంది.

ఈ తాడు-మార్గం సుమారు 540 మీటర్లు (1,770 అడుగులు) మరియు ఎత్తు 178 మీటర్లు (584 అడుగులు) వుంది. సాధారణ రోజులలో ఈ దేవాలయాన్ని ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు భక్తులు మానసాదేవిని దర్శించుకొనవచ్చును.

పార్వతి దేవి రూపంలో "మానస" మరియు "చండి" రూపంలో రెండు దేవతలు లీనమై వెలసినారని అక్కడి ప్రజలు నమ్ముతారు.

అందువల్లనే మనసా దేవి దేవాలయం బ్లూ మౌంట్ ఎదురుగా బిల్వ పర్వతంమీద వెలసియున్నది.

చేరుకోవడానికి ఎలా?
మానస దేవి టెంపుల్ కి 2 విధాలుగా చేరుకోవచ్చు. కాలునడక లేదా కేబుల్ కారు ద్వారా. హరిద్వార్, స్టేషన్ నుండి కేవలం 1 కిలోమీటర్ల దూరంలో, ఢిల్లీ నుండి 215 km, డెహ్రాడూన్ నుండి 50 కిలోమీటర్ల దూరంలో, డెహ్రాడూన్ జాలీ గ్రాంట్ విమానాశ్రయం నుండి 45 కిలోమీటర్ల దూరంలో, రిషికేశ్ నుండి 30 కిలోమీటర్లదూరంలో,మస్సూరు నుండి 85కిమీ ల దూరంలో వుంది. మీరు సులభంగా రిక్షా ద్వారా ఆలయానికి చేరవచ్చును.
పంచ సరోవరాలు

పంచ సరోవరాలు - దేవాలయాలుమన సంసృతి సంప్రదాయాలలో తీర్థయాత్రలకు చాలా ప్రాముఖ్యత వుంది. ప్రస్తుతం తీర్థం అంటే ఓ క్షేత్రమనే అర్థాన్నే అన్వయించుకుంటున్నాము. అయితే వేదకాలంలో తీర్థమనే పదానికి సరస్సు అర్థం కూడ ఉండేది. అలా తీర్థాలకు చేసే యాత్రలనే తీర్థయాత్రలని పిలుచుకుంటున్నాం. దేశంలో ఎన్నో సరోవరాలు ఉండగా, వాటిలో ఐదు 'పంచ సరోవరాలు' గా ప్రసిద్ధికెక్కాయి. అవి:

  1. మానస సరోవరం,
  2. పంపా సరోవరం,
  3. పుష్కర్‌ సరోవరం,
  4. నారాయణ సరోవరం,
  5. బిందు సరోవరం,

1. మానస సరోవరం
సమస్త లోకాలలో మానస సరోవరం వంటి పవిత్ర సరోవరం మరొకటి లేదన్నది వాస్తవం. ఈ సరోవరం బ్రహ్మదేవుని మనస్సు నుంచి ఉద్భవించింది. అందుకే దీనిని గతంలో 'బ్రహ్మసరం' అని పిలిచేవారు. ఇది ఎన్నో పవిత్రనదులకు పుట్టినిల్లు. ఈ సరోవరం చెంతనే గంగను దివి నుంచి భువికి తెప్పించడానికి భగీరథుడు తీవ్రమైన తపస్సు చేశాడు. మన పురాణాలలో మానస సరోవర ప్రస్తావన అక్కడక్కడా కనిపిస్తూంటుంది. ఈ సరోవరాన్ని బ్రహ్మదేవుడు ఆదిదంపతుల కోసం సృష్టించాడని పురాణ కథనం.

ఒకసారి బ్రహ్మమానస పుత్రులైన సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు పన్నెండుమంది పరమశివుని ప్రశన్నం చేసుకోవడానికి ఘోరమైన తపస్సు చేశారు. వారి తపస్సు సుమారు పన్నెండు సంవత్సరాల పాటు సాగింది. అదే సమయంలో ఆ పెన్నెండేళ్ళపాటు ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలలో తీవ్రమైన దుర్బిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. దగ్గరదాపుల్లోని జలవనరులన్నీ ఎండి పోవడంతో మునులందరూ నిత్యం స్నానాదికాల కోసం మందాకినీ నదిదాకా వెళ్లాల్సి వచ్చేది. పన్నెండు సంవత్సరాలు ముగుస్తున్న సమయంలో బ్రహ్మమానస పుత్రులకు ఆది దంపతుల సాక్షాత్కారం లభించింది. అప్పుడు ఆది దంపతులను పూజించడానికి ఆ దరిదాపుల్లో నీరు లేకపోవడంతో, మునులందరూ తమ తండ్రియైన బ్రహ్మదేవుని నీటికోసం ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మదేవుడు తన సంకల్పంతో ఒక సరస్సు సృష్టించాడు. హంసరూపంలో తానే స్వయంగా సరస్సులో ప్రవేశించాడు. అలా ఆ సరస్సు ఏర్పడుతున్నప్పుడే అందులోంచి ఒక బ్రహ్మాండమైన శివలింగం ఉద్భవించిందట. అలాగే మనం పూజలు చేస్తూ సంకల్పం చెప్పుకుంటున్నప్పుడు, 'జంబు ద్వీపే, భరతవర్షే, భరతఖండే, అని సంక్పలం చెబుతూంటాం. ఈ జంబూ ద్వీపం అఖండ భారతావనిని సూచిస్తుంటుందని చెబుతున్నారు. ;ఈ పేరు రావడానికి వెనుక కూడ ఓ కథ వుంది. పూర్వం ఈ సరోవరం మధ్యలో ఓ చెట్టు ఉండేదట. ఆ చెట్టులో ముగ్గిన పండ్లు నీటిలో పడుతున్నప్పుడు 'జం' అనే శబ్దం వస్తుండేదట. అందుకే ఈ సరోవరం చుట్టు ప్రక్కల ప్రాంతాలను జంబూలింగప్రదేశమని పిలువసాగారట. అలా మన ప్రాంతానికి జంబూద్వీపమనే పేరు ఏర్పడిందట. కాబట్టి, జంబూద్వీపమనే పేరు రావడానికి కూడా కారణం మానస సరోవరమేనని తెలుస్తోంది. మానస సరోవరం గురించి భారతావనిలో పుట్టిన ప్రతి మతం ఓ కథను చెబుతూవుండడం విశేషం. ఉదాహరణకు జైనమతం కథనం ప్రకారం, ఇక్కడ జైనుల ప్రథమ తీర్థంకరుడైన ఆదినాథ ఋషభదేవుడు ఈ సరోవర పరిసరాలలో నిర్వాణం చెందాడని చెప్పబడుతోంది. ఇక, బౌద్ధ గ్రంథాలు మానస సరోవరాన్ని అనోత్తత అని పేర్కొంటున్నాయి. ఈ పదానికి వేడి, బాధ లేని సరస్సు అని అర్థం. ఈ సరస్సు మధ్యలో ఉన్న చెట్టున పూచే పువ్వులూ, కాయలు చాలారకాల వ్యాధులను నయంచేస్తాయని బౌద్ధుల నమ్మకం. అలాగే మానస సరోవరంలో చాలా పెద్ద తామరపువ్వులు పూస్తాయనీ, బుద్ధుడు, బోధిసత్త్వలు ఆ పువ్వులపై కూర్చునేవారని కథనం. బుద్ధుని జన్మవృత్తాంత కథలో కూడ ఈ సరస్సు ప్రస్తావన కనిపిస్తుంది.

మరో కథనం ప్రకారం, మానస సరోవరం చుట్టూ ఏడు వరుసల్లొ చెట్లు, దాని మధ్యలో ఓ పెద్దభవనం ఉండేదట. సరోవర మధ్యలో కల్పవృక్షం ఉండేదట. నాగులు ఆ చెట్టుకు కాసే కాయలను తింటుండేవారట. నాగులు తినకుండా వదిలేసిన కాయలు, సరస్సు అడుగుభాగానికి చేరుకుని బంగారంగా మారాయని చెబుతూంటారు.

ఈ మానస సరోవరం శక్తిపీఠాలలో ఒకటని కూడ చెప్పబడుతోంది. 51శక్తి పీఠాలలో మానస సరోవరం కూడా ఒకటి. దక్షయజ్ఞం సమయంలో తండ్రి చేసిన అవమానాన్ని భరించలేకపోయిన సతీదేవి ప్రాణత్యాగం చేస్తుంది. ఆ ఉదంతాన్ని విన్న పరమశివుడు అగ్రహోదగ్రుడై శివగణాలను పంపి, దక్షయజ్ఞ వాటికను ధ్వంసం చేస్తాడు. సతీదేవి వియోగాన్ని భరించలేకపోయిన ఆ స్వామి, అ తల్లి కళేబరాన్నిభుజంపై ఉంచుకుని ఆవేశంతో తిరగసాగాడు. ఫలితంగా లోకాలన్నీ కల్లోలంలో కూరుకుపోయాయి. అప్పుడు దేవతలంతా విష్ణుమూర్తితో మొరపెట్టుకోగా, విష్ణుదేవుడు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి సతీదేవి కళేబరాన్ని ముక్కలుముక్కలుగా చేస్తాడు. అప్పుడు ముక్కలైన సతీదేవి శరీరభాగాలు ఒక్కొక్కచోట పడతాయి. అలా సతీదేవి శరీరభాగాలు పడిన ప్రదేశాలే శక్తిపీఠాలుగా ప్రసిద్ధిచెందాయి. ఇక్కడ సతీదేవి కుడిహస్తం పడిందని పురాణ గ్రంథాలు పేర్కొంటున్నాయి.

మానస సరోవరాన్ని తాకినా, స్నానమాచరించినా బ్రహ్మలోకం చేరుకుంటారనీ, ఆ సరోవర జలాన్ని తాగిన వారికి శివలోక ప్రాప్తి కలుగుతుందని పురాణ వచనం. మానస సరోవర పరిక్రమ మరో గొప్ప సాధన. మానస సరోవరంలో స్నానమాచరించి, పితృదేవతలకు తర్పణాలు వదలడం, సరోవరతీరంలో హోమం చేయడం వల్ల పితృదేవతలకు ఉత్తమగతులు సంప్రాప్తిస్తాయి. ఈ సరస్సులోని నీటికి అద్భుత చికిత్సా గుణాలున్నాయని పెద్దలు చెబుతారు. అదేవిధంగా మానస సరోవరం దగ్గర దొరికే కొన్ని రాళ్ళు 'ఓం' ఆకారంలో ఉంటుండటం విశేషం.

ఇంతటి మహిమాన్వితమైన మానస సరోవరం సముద్ర మట్టానికి సుమారు 14, 900 అడుగుల ఎత్తులో ఉంది. ఈ సరోవరం చుట్టుకొలత దాదాపు 54 మైళ్ళు అని అంటారు. 200 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో పరుచుకుని ఉన్న ఈ సరోవరం సుమారు 300 అడుగుల లోతు ఉంటుంది.

చాలా మంది మానస సరోవర పరిక్రమను చేయడానికి ఉత్సుకతను చూపిస్తుంటారు. మానస సరోవర తీరంలోని ఎనిమిది బౌద్ధ మఠాలు మీదుగా పరిక్రమనం చేయాలంటే, దాదాపు 110 కి.మీ దూరం నడవాల్సి ఉంటుంది. సరోవర తీరం వెంబడి నడిస్తే 90 కి.మీ దూరం మాత్రమే ఉంటుంది. ఈ పరిక్రమను చేయడానికి దాదాపు రెండు రోజుల సమయం పడుతుంది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోతే ఈ పరిక్రమకు దాదాపు నాలుగైదు రోజులు సమయం కూడా తీసుకుంటుంది. ప్రదక్షిణా మార్గం దుర్గమంగా ఉంటుంది. మార్గమధ్యంలో అనేక సెలయేర్లను, నదులను దాటాల్ని ఉంటుంది. సాధారణంగా పరిక్రమణ కార్యక్రమాన్ని వేసవికాలంలోనే పెట్టుకుంటుంటారు. గతంలో నడుస్తూనే పరిక్రమ చేసేవారు. ప్రస్తుతం రహదారుల సౌకర్యం ఏర్పడతంతో వాహనాల ద్వారానే పరిక్ర్తమ చేస్తున్నారు.

ఈ యాత్ర అత్యంత కష్టంతో కూడుకున్నది. పరమశివుని అనుగ్రహానికి ఆ మాత్రం కష్టపడక తప్పదుగా. మానస సరోవరం ఒకప్పుడు భారతావనిలో భాగాలే అయినప్పటికీ, ప్రస్తుతం టిబెట్టులో ఉన్నాయి. ప్రస్తుతం టిబెట్‌ చైనా అధీనంలో ఉన్నది కనుక, మానస సరోవర యాత్ర ఓ విధంగా విదేశీయాత్రను చేసినట్లే అవుతోంది. ఆవిధంగా ఆ యాత్ర చేయడానికి అయ్యే ఖర్చు కూడా అధికంగానే ఉంటోంది. శ్రమ కూడా అధికం.

ఈ యాత్రకు సంబంధించి భారతప్రభుత్వం ప్రచార సాధానాలలో ప్రకటనలు ఇస్తారు. ఇలా భారత ప్రభుత్వం ద్వారా యాత్ర చేస్తోంటే, ఆ యాత్ర రక్షణ బాధ్యత అంతా ప్రభుత్వమే వహిస్తుంటుంది. ఈ యాత్రను చేయదలచుకున్నవారు 'అండర్‌ సెక్రెటరీ (చైనా), విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వశాఖవారిని సంప్రదించాల్సి ఉంటుంది. ముందుగా వచ్చినవాళ్లకు ముందు అన్న ప్రాతిపదికన ఆ కార్యాలయం దరఖాస్తులను స్వీకరిస్తుంది. మరికొంత మంది నేపాల్‌ రాజధాని ఖాట్మంటు మార్గం ద్వారా యాత్రను చేస్తుంటారు. అయితే ఆ యాత్రలో అంతగా సౌకర్యాలు ఉండవన్నది యాత్రలు చేసి వచ్చిన యాత్రీకులు చెబుతున్న విషయాలు. శ్రమదమాదులను ఓర్చుకుంటూ ముందుకు సాగే మానససరోవర యాత్ర ద్వారా సహనం, కృతనిశ్చయం, మౌనం వంటి గుణాలు అలవడతాయి.

2. పంపా సరోవరం
పంపా సరోవరం కర్ణాటక రాష్ట్రంలో హంపిలో ఉంది. ఆ సరోవరం రామాయణకాలం నాటిదని ప్రతీతి. ఇక్కడ భక్త శబరి ఉండేదట.

ఆ కథ ప్రకారం, ఒక బోయకాంత అయిన శబరి, పంపానదీతీరంలో మతంగ మహర్షి శిష్యులకు సేవలు చేస్తూండేది. వారు శబరికి రామలక్ష్మణులు ఇక్కడకు వస్తారని చెప్పారు. అప్పటినుంచి శబరి అక్కడే నివశిస్తూ రాముని రాక కోసం ఎదురు చూస్తూండేది. సీతాన్వేషణలో కబంధుని సూచనను అనుసరించి రామలక్ష్మణులు పంపాసరోవర తీరానికి చేరుకున్నారు. రామలక్ష్మణులను చూసిన వెంటనే సంతోష పులకాంకితురాలైన శబరి ఆయన పాదాలకు నమస్కరించింది. ఆ అన్నదమ్ములకు అర్ఘ్యపాద్యాదులతో మర్యాదలు చేసింది. వారి కోసం తాను సేకరించిన ఫలాలను అందించింది.

"శ్రీ రామచంద్రమూర్తి! మీ దర్శనం వలన నా జన్మ ధన్యమైంది. నా తపస్సు ఫలించింది. నాకు ఇప్పటికి తపః సిద్ధి కలిగింది. నా గురుసేవ సఫలీకృతమైంది. ఓ పురుషోత్తమా! నీవు దేవతలందరిలోను శ్రేష్ఠుడవు. నాకిప్పుడు నిన్ను పూజించే భాగ్యం కలిగింది. నాకు ఇక స్వర్గం సిద్ధించినట్లే. ఓ రామా! నీ చల్లని చూపుల వల్ల నేను పరిశుద్దురాలినయ్యాను. నీ అనుగ్రహం వలన దివ్యలోకాలకు చేరుకుంటాను. స్వామీ, మతంగముని శిష్యులకు సేవ చేస్తూండేదానిని. అప్పుడు వారు, మీరు ఇక్కడకు వస్తారని చెప్పారు. అప్పట్నుంచీ మీకోసం ఎదురుచూస్తూ, పండ్లు ఫలాలు సేకరించి పెడుతున్నాను. కాబట్టి నువ్వు నీ తమ్ముడు నా ఆతిథ్యాన్ని స్వీకరించాలి" అని అభ్యర్థించగా, శ్రీరాముడు "శబరీ! కబంధుడు నీ గురించి, నీ గురువుల గురించి చెప్పారు. నాకు ఇక్కడి వనాల మహిమలను గురించి తెలుపవలసింది" అని శ్రీరాముడు అడగడం ఆలస్యమన్నట్లుగా, శబరి ఆ విశేషాలను చెప్పసాగింది.

"ఓ రామా! మేఘ సమూహాల వంటి వృక్షాలతో, నానావిధ పక్షిగణాలతో ఈ మతంగ వనం అత్యంత ప్రసిద్ధి చెందింది. ఇక్కడే మునులు తమ ఆశ్రమాలను ఏర్పాటు చేసుకుని తపస్సులను చేసేవారు. వారి తపః ప్రభావం వలన ఈ ప్రాంతమంతా దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతోంది. ఆ మహర్షులు తమ శక్తి వలన సప్తసాగరాలను ఇక్కడున్న పంపా సరస్సులోనికి వచ్చేట్లుగా చేశారు. ఈ నేల అత్యంత మహిమాన్వితమైనది. అందుకే ఇక్కడి పుష్పాలు ఎప్పటికీ వాడవు" అని చెప్పి, తాను సేకరించిన ఫలాలను అందించింది.

రామలక్ష్మణులు ఫలాలను ఆరగించగానే, భక్తితో పులకాంకితురాలైన శబరి, ఆస్వామి అనుగ్రహంతో సమాధియోగ బలం వల్ల మోక్షపథాన్ని చేరుకుంది.

హంపికి వెళ్ళాలనుకునేవారు గుంతకల్లు - హుబ్లీ రైలు మార్గంలోనున్న హోస్పెటలో దిగి హంపి చేరుకోవచ్చు. హోస్పేట నుంచి హంపికి బస్సు సౌకర్యం ఉంది.

3. పుష్కర సరోవరం
పద్మపురాణంలో ఈ తీర్థాన్ని గురించి విపులంగా వివరించబడింది. ఒకసారి బ్రహ్మదేవుడు ఇక్కడకు రాగా, ఇక్కడున్న చెట్లన్నీ ఘనస్వాగతం పలికాయట. అవి పలికిన స్వాగత వచనాలకు ముగ్ధుడైన బ్రహ్మదేవుడు ఆ వృక్షాలను ఏదైనా వరం కోరుకొమ్మనగా, బ్రహ్మదేవుని ఇక్కడే ఉండాల్సిందంటూ ఆ వృక్షాలు అభ్యర్థించాయట. ఫలితంగా బ్రహ్మదేవుడు అక్కడ తామర పువ్వును నేలపై వదిలాడు. అప్పుడు పెద్ద శబ్దం ఏర్పడి, ఆ నాద ప్రభావానికి చిన్నపిల్లలను చంపే వజ్రనాభుడు అనే రాక్షసుడు అంతమైయ్యాడట.

ఈ సరస్సు రాజస్థాన్‌లోని అజ్మీరుకు ఏడు మైళ్ళ దూరంలో ఉంది. అక్కడే బ్రహ్మదేవుని ఆలయం కూడ ఉంది. పుష్కర సరస్సులోని నీటికి రోగాలను నయం చేసే శక్తి ఉందని నమ్ముతుంటారు. ఇందుకు ఉదాహరణగా 9 వ శతాబ్దంలో ఓ రాజు ఈ నీటిని స్పృశించగా, చేతిపై ఉన్న మచ్చలు మాయమైయ్యాయని చెబుతూంటారు. అత్యంత పవిత్రమైన ఈ సరోవరంలో యాత్రీకులు పితృ తర్పాణాలను చేస్తుంటారు.

4. నారాయణ వన సరోవరం
ఈ సరోవరం గుజరాత్‌ రాష్ట్రంలో కచ్‌ ప్రాంతంలో ఉంది. గుజరాత్‌లోని భుజ్‌ పట్టణం నుంచి సుమారు 150 కి.మీ దూరంలో ఈ నారాయణ వన సరోవరం ఉంది. ఈ నారాయణ వన పరిసరప్రాంతాలన్నీ శివకేశవుల పాద స్పర్శతో పునీతమయ్యాయని స్థలపురాణాల ద్వారా మనకు తెలుస్తోంది. ఈ సరస్సుకు కాస్త దూరంలో శివుడు కోటేశ్వరునిగా కొలవబడుతున్నాడు. ఆయన ఇక్కడ కొలువై ఉండటం వెనుక ఓ కథ చెప్పబడుతోంది. ఒకసారి పరమశివుని వేడుకుంటూ ఘోరమైన తపస్సు చేసిన రావణునికి శివుడు ప్రత్యక్షమై ఓ విగ్రహాన్ని బహుకరిస్తాడు. స్వామి నుంచి లింగాన్ని అందుకున్న రావణుడు, ఆశ్రద్ధతో ఆ లింగాన్ని నేలపై పడవేస్తాడు. దాంతో కోపగించుకున్న శివపరమాత్మ అనేక లక్షల కోట్ల లింగాలుగా మారిపోతాడు. రావణునికి అన్ని కోట్ల లింగాలలో ఏది అసలైన లింగం అనే విషయం తెలియదు. చివరకు అసలు లింగాన్ని అక్కడే వదిలేసి, చేతికి అందిన లింగంతో రావణుడు వెళ్లిపోయాడని కథనం. ఇలా శివుడు నారాయణ వన సరోవర ప్రాంతాలలో కొలువై ఉండగా, విష్ణురూపుడైన శ్రీకృష్ణ పరమాత్మ మధుర నుంచి ద్వారకకు వెళ్తున్నప్పుడు, ఇక్కడున్న సరోవరంలో పాదాలను కడుకున్నాడనీ, అందుకే ఇది నారాయణవన సరోవరమని పిలువబడుతోందని మరో కథనాన్ని భక్తులు చెబుతున్నారు.

భుజ్‌ పట్టణం నుంచి ఈ నారాయణవన సరోవరం రెండుగంటల ప్రయాణమే కాబట్టి, ప్రయాణానికి పెద్దగా శ్రమపడాల్సిన అవసరం లేదు. నారాయణవన సరోవర ప్రాంతంలో భక్తులకు బస సౌకర్యాలు బాగానే ఉన్నాయి.

5. బిందు సరోవరం
గుజరాత్‌లోని సిద్ధపూర్‌లో ఉన్న బిందు సరోవరం కపిలముని తపస్సు చేసి తరించిన ప్రాంతమని చెబుతారు. బిందు సరోవరం పరమశివుని కృప వలన ఏర్పడిన సరోవరమనీ, కపిలముని తపస్సు చేసిన ప్రాంతమంటూ బిందుసరోవరానికి అనేక ప్రత్యేకతలున్నాయి.

ఓ పురాణ కథనం ప్రకారం,స్వాయంభువు మనువు - శతరూప దంపతులకు ఆకూతి, ప్రకూతి, దేవహూతి అంటూ ముగ్గురు కుమార్తెలు. యుక్తవయస్కురాలైన దేవహుతికి తగిన వరుని కోసం వెదికే ప్రయత్నంలో పడిన స్వాయంభువు దేశదేశాలకు తిరిగాడు. చివరకు ఇక్కడకు రాగానే కర్దముడు అతని కంటబడ్డాడు. అతడే తన కూతురికి తగిన వరుడని సంతోషిస్తున్న సమయంలో అతని కళ్ళ నుండి ఆనందభాష్పాలు వెలువడ్డాయట. ఆ భాష్పాల వెల్లువతో ఓ సరోవరం ఏర్పడిందనీ, అదే బిందు సరోవరమని కథనం.

కర్దమ - దేవహూతిల వివాహం అయిన తరువాత సంతానప్రాప్తి కోసం కర్దమ ముని ఓ విమానాన్ని సృష్టించి, తద్వారా లోకమంతా తీర్థయాత్రలు చేస్తూ పుణ్యస్నానాలు చేయసాగారు. అలా వారు సరస్వతీ నదిలో పుణ్యస్నానం చేయగా వారికి కళ, అనసూయ, శ్రద్ధ, హరిర్భువు, గతి, క్రియ, ఖ్యాతి, అరుంధతి, శాంతి అంటూ తొమ్మిదిమంది కుమార్తెలు కలిగారు. కూతుళ్లకు పెళ్లుళ్ళు చేసిన కర్దముని మనసులో తనకు ఓ కొడుకు కూడ ఉంటే బాగుంటుందనిపించింది. భార్యను పిలిచి శ్రీమన్నారాయణుని పూజచేయమన్నాడు. అలా దేవహుతి ప్రార్థనలతో ప్రసన్నుడైన విష్ణుదేవుడు ఆమెకు పుత్రభాగ్యాన్ని కలిగించాడు ఆ పుత్రుడే కపిలుడు.

ఈ బిందు సరోవరం ప్రక్కన కపిలముని, కర్దమ - దేవహూతిల సన్నిధులున్నాయి. ఈ బిందు సరోవరం ప్రక్కనున్న రావిచెట్టు క్రింద తర్పణాలు చేస్తుంటారు. ఇక్కడ మాతృదేవతలకు మాత్రమే తర్పణాలను చేయడం విశేషం. ఇలా మాతృదేవతలకు మాత్రం తర్పణాలు ఇవ్వడాన్ని దేశంలో మరెక్కడా చూడలేము.

బిందు సరోవరం గుజరాత్‌లోని పఠాన్‌జిల్లా, సిద్ధపూర్‌లో అహ్మదాబాద్‌ - డిల్లీ జాతీయ రహదారిలో ఉంది. సిద్ధపూర్‌ అహ్మదాబాద్‌ నుంచి సుమారు 115 కి.మీ దూరములో ఉంది. గుజరాత్‌లోని అన్నిముఖ్యపట్టనాల నుంచి సిద్ధపూర్‌కు బస్సు సౌకర్యాలున్నాయి. సిద్ధపూర్‌ చిన్న ఊరే అయినప్పటికీ ఇక్కడ యాత్రీకుల సౌకర్యార్థం అనేక ధర్మశాలలు ఉన్నాయి.

అహ్మదాబాద్‌ నుంచి సుమారు రెండు గంటల ప్రయాణమే కాబట్టి, అహ్మదాబాద్‌కు యాత్రార్థం వెళ్లిన యాత్రీకులు తప్పక బిందుసరోవరాన్ని దర్శించుకుని వస్తుంటారు.

పితృదేవతలకు తర్పణాలు:
ముఖ్యంగా పితృదేవతలకు తర్పణాలను అర్పించాలనుకున్నవారు ఈ పంచసరోవర యాత్రలను చేస్తుంటారు. మరికొంతమంది ఆయా ఆలయాలకు వెళ్ళినపుడు అక్కడున్న సరోవరాలను దర్శించుకుంటుంటారు. మొత్తం మీద పంచసరోవరాల దర్శనం ఉభయతారకం. ఎందుకంటే ఒకప్రక్క తీర్థయాత్రను చేసిన అనుభూతితో పాటు, మరో ప్రక్క పితృదేవతలకూ తర్పణాలను విడిచి, వారికి ఉత్తమలోక గతులను ఏర్పరచి, పితృదేవతల్ను తృప్తి పరిచినట్లు అవుతుంది. ఇలా తీర్థయాత్రలు చేయడం వల్ల మనలో మానసికతీర్థాలు కూడ నెలకొంటాయి. అవి: సత్యం, ఓర్పు, ఇంద్రియ నిగ్రహం, దయ, ఋజుత్వం, దానం, తృప్తి, బ్రహ్మచర్యం, మధురసంభాషణం, జ్ఞానం, తపశ్చర్యలు తదితరాలు మానసిక తీర్థాలు. ‌దేవ దేవుడు.. శ్రీ వేంకటేశుడు

దేవ దేవుడు.. శ్రీ వేంకటేశుడు  
‘వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి’
బ్రహ్మాండంలో వేంకటాద్రికి సమానమైన పుణ్యక్షేత్రం లేదు. అలాగే శ్రీనివాసుడికి సాటిరాగల దేవుడు ఇటు భూతకాలంలో కానీ.. అటు భవిష్యత్తులో కానీ మరెవరూ ఉండరు... ఇదీ శ్లోకానికి అర్థం.
తిరుమల పుణ్యక్షేత్రం ‘కలియుగ వైకుంఠ’మని ప్రసిద్ధి. ఈ ప్రశస్తికి మూలకారణం.. స్వయం వ్యక్త స్వరూపంలో వెలిసిన శ్రీవేంకటేశ్వరుడు. తిరుమలగిరిపై పవిత్రాద్భుతమైన ఒక సాలగ్రామశిల ద్వారా స్వయంభూగా వెలసిన శ్రీ వేంకటేశ్వరుణ్ణి శ్రీనివాసుడని, సప్తగిరీశుడని, ఏడుకొండలవాడని, బాలాజీ, తిరుమలప్ప, తిమ్మప్ప అని.. ఇలా ఎన్నో పేర్లతో భక్తజనులు ఆర్తిగా సంబోధిస్తూ ఉన్నారు. ఆనందనిలయుడైన శ్రీవారు నెలకొన్న బంగారు మందిరానికి ‘ఆనంద నిలయ’మనే వ్యవహారం అనాదిగా ప్రసిద్ధమై ఉంది.
స్థలపురాణం
కలియుగారంభంలో... అనగా సుమారు 5వేల సంవత్సరాల క్రితం.. వక్ష స్థల మహాలక్ష్మి సమేతంగా ఆవిర్భవించిన శ్రీనివాసునికి తరతరాలుగా ఎందరో భక్తులు మందిర, గోపుర, ప్రాకార, మహాద్వారాలు నిర్మిస్తూ వచ్చారు. వేంకటపతికి నిత్యోత్సవ, వార్షికోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. నారాయణవనం అధిపతులు ఆకాశరాజు, తొండమాన్‌ చక్రవర్తి, పల్లవరాణి సామవై, విజయనగర సామ్రాజ్యాధీశులు సాళువ నరసింహరాయలు, శ్రీకృష్ణదేవరాయలు, తిరుమలరాయలు, అచ్యుతరాయలు ఇలా.. ఎందరో మహానుభావులు.. ఇక్కడ అద్భుత నిర్మాణాలను చేపట్టి అపూర్వసేవా కైంకర్యాల నెలవుగా తిరుమల క్షేత్రాన్ని తీర్చిదిద్దారు.
శ్రీవారిని దర్శించుకునే భక్తులు ముందుగా క్షేత్రపాలకుడైన వరాహస్వామివారిని దర్శించుకోవాలని స్థలపురాణంలో ఉంది. అలాగే స్వామి వారి దర్శనానంతరం... తిరుపతిలో పద్మావతి/బీబీనాంచారి/అలివేలుమంగ అమ్మవారిని, గోవిందరాజస్వామి వారిని దర్శించుకోవాలి. తిరుమలగిరులలో ఉన్న పవిత్ర ఆకాశగంగ.. పాపనాశనం.. వకుళమాత ఆలయం,, హాథీరాంజీ మఠం.. త్రిదండి జీయర్‌స్వామివారి మఠం..వన్యప్రాణుల పార్క్‌.. వంటి ఆధ్యాత్మిక-పర్యాటక ప్రాశస్త్యమున్న ప్రాంతాల్ని దర్శించుకోవచ్చు. తితిదే బస్సు సర్వీసులతో పాటు ఆయా ప్రదేశాలకు ప్రైవేటు వాహనాలూ అందుబాటులో ఉంటాయి. తలనీలాలు మొక్కుబడి ఉన్నవారు తప్పనిసరిగా స్వామివారి ‘కల్యాణకట్ట’ వద్దనే తలనీలాలు సమర్పించాలి
శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన వేళలు
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ప్రత్యేక దర్శనవేళలు ఒక్కోరోజు ఒక్కోవిధంగా ఉంటాయి. స్వామివారికి జరిగే నిత్య, వారపు సేవలను బట్టి ఆయా సమయాలను తితిదే నిర్దేశించింది. టిక్కెట్లను ముందస్తుగా అంతర్జాలం, ఈ-దర్శన్‌, తపాలా శాఖ ద్వారా విక్రయిస్తోంది. ఉదయం నుంచి సాయంత్రంలోపు నిర్దేశించిన సమయంలోపు శ్రీవారిని దర్శించుకునే వేళలను ఎంపిక చేసుకోవచ్చు. ఎంపిక చేసుకున్న సమయం టిక్కెట్టుపై ముద్రితమవుతుంది. ఈ సమయానికి మాత్రమే ఆలయానికి చేరుకోవడానికి వరుస వద్దకు రావాల్సి ఉంటుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను నిత్యం రూ.300 ధర వంతున 26వేల టిక్కెట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. 56 రోజులకు ముందుగా టిక్కెట్లను పొందే అవకాశం ఉంది. విశేష పర్వదినాల్లో రద్దీని దృష్టిలో ఉంచుకుని టిక్కెట్ల సంఖ్యను దేవస్థానమే తగ్గిస్తుంది.
తితిదే ప్రకటించిన వేళల వివరాలివీ:
వారంసమయం
ఆదివారంఉదయం 9గం. నుంచి సాయంత్రం 7గం. వరకు
సోమవారంఉదయం 9గం. నుంచి సాయంత్రం 7గం. వరకు
మంగళవారంఉదయం 9గం. నుంచి సాయంత్రం 7 గం. వరకు
బుధవారంఉదయం 10గం. నుంచి సాయంత్రం 7గం. వరకు
గురువారంఉదయం 9గం. నుంచి సాయంత్రం 4గం. వరకు
శుక్రవారంఉదయం 10గం. నుంచి సాయంత్రం 4గం. వరకు
శనివారంఉదయం 7 గం. నుంచి సాయంత్రం 4 గం. వరకు
వృద్ధులకు, వికలాంగులకు దర్శన వేళలు:శ్రీవారి దర్శనానికి వచ్చే వికలాంగులు, వృద్ధులకు తితిదే ప్రత్యేక ప్రవేశ అవకాశం కల్పిస్తోంది. మందిరం మహాద్వారం సమీపం నుంచి ఆలయంలోకి చేరుకునే సౌలభ్యం కల్పించింది. నిత్యం ఉదయం 10, మధ్యాహ్నం 3గంటలకు ఆలయ ప్రవేశాలకు అనుమతిస్తుంది. ఈ దర్శన సమయాల కన్నా గంట ముందుగా ఆయా భక్తులు పరిశీలనకు హాజరవ్వాల్సి వుంటుంది. 65 ఏళ్లకు పైబడిన వృద్ధులకు వయస్సు ధ్రువీకరణ పత్రం ఆధారంగా అనుమతిస్తారు. నడవలేని పరిస్థితిలో ఉన్నవారి వెంట సహాయకులను అనుమతిస్తారు. వికలాంగులు, గుండె జబ్బుతో ఆపరేషన్‌ చేసుకున్న భక్తులను వైద్యులు జారీచేసి పత్రాల పరిశీలన అనంతరం అనుమతిస్తారు. బ్రహ్మోత్సవాలు వంటి విశేష పర్వదినాల్లో ఈ దర్శనాలను తితిదే రద్దు చేస్తుంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని తితిదే ముందుగానే ప్రకటిస్తుంటుంది.
తిరుపతి-తిరుమలకు ప్రయాణ సదుపాయాలు
తిరుమల, తిరుపతి శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు రోడ్డు.. రైలు.. ఆకాశ మార్గాల్లో విస్తృతమైన ప్రయాణ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. తిరుపతి రైల్వేస్టేషన్‌కు చేరుకునే భక్తులకు స్టేషన్‌ ఎదురుగానే కొండపైకి తీసుకెళ్లే ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి. తిరుపతి రైల్వేస్టేషన్‌ నుంచి తిరుమలకు ప్రతి నిమిషానికో బస్సు చొప్పున బ్రహ్మోత్సవాల సమయంలో నడుస్తుంటాయి. ప్రీపెయిడ్‌ ట్యాక్సీలు కూడా అందుబాటులో ఉంటాయి.
రేణిగుంట విమానాశ్రయం నుంచి నిత్యం మధ్యాహ్నం ఒక ఆర్టీసీ సూపర్‌ లగ్జరీ సర్వీసు నిర్వహిస్తున్నారు. ఈ బస్సు తిరుమల నుంచి ఉదయం 11 గంటలకు బయల్దేరి.. రేణిగుంట విమానాశ్రయానికి మధ్యాహ్నం 12.30 నిమిషాలకు చేరుతుంది. తిరిగి విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు తిరుమలకు బయల్దేరుతుంది. విమానాశ్రయంలో ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి. తిరుపతి కేంద్రంగా ఉన్న ట్రావెల్‌ కంపెనీలకు సమాచారం ఇచ్చే పక్షంలో వాహనాలను సమకూర్చుతారు. అన్ని రకాల సొంత వాహనాలనూ తిరుమల వెళ్లేందుకు తితిదే అనుమతిస్తోంది. అలిపిరి భద్రతా వలయంలో తనిఖీలు నిర్వహించుకున్న అనంతరం టోల్‌ రుసుం చెల్లించి ఆయా వాహనాల్లో తిరుమలకు రావాల్సి ఉంటుంది. అన్ని రకాల వాహనాలు అలిపిరి నుంచి తిరుమలకు రెండో కనుమ రహదారిలో 28 నిమిషాల వ్యవధిలో చేరుకోవచ్చు. ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని తితిదే వేగ నియంత్రణ చర్యలు చేపట్టింది. అదేవిధంగా తిరుమల నుంచి తిరుపతికి మొదటి కనుమ రహదారిలో ప్రయాణ సమయం 45 నిమిషాలు తీసుకోవాల్సి వుంటుంది. నిర్దేశిత సమయం కంటే ముందుగా వచ్చే పక్షంలో సంబంధిత వాహనాలను తిరుమలకు 10 రోజులపాటు రాకుండా నిషేధం విధిస్తూ చర్యలు తీసుకుంటారు! రెండోసారి కూడా నిబంధనలు పాటించని పక్షంలో జరిమానా విధిస్తారు. సమయాన్ని లెక్కించడానికి అలిపిరి భద్రతావలయంలో వాహనదారులకు తితిదే బార్‌ కోడింగ్‌ రశీదులను జారీ చేస్తుంది.
కాలినడకన వెళ్లే భక్తుల కోసం
అలిపిరి, శ్రీవారి మెట్టు నుంచి తిరుమలకు కాలినడకన రావడానికి తితిదే అనుమతిస్తుంది. అలిపిరి నుంచి 24 గంటల సమయం, శ్రీవారి మెట్టు నుంచి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ప్రవేశం కల్పిస్తుంది. గరుడోత్సవం సమయంలో 24 గంటల సమయం అనుమతించాలని నిర్ణయించింది. అడవి జంతువులను దృష్టిలో పెట్టుకుని శ్రీవారి మెట్టు మార్గంలో పగటి సమయంలో మాత్రమే భక్తుల రాకపోకలకు అనుమతిస్తున్నారు. వీరికి మార్గమధ్యంలో దివ్యదర్శనం టోకెన్లను తితిదే ఉచితంగా జారీ చేస్తుంది. టోకెన్లను పొందిన భక్తులకు శ్రీవారి దర్శనం ఉచితంగా కల్పించడంతో పాటు ఒక లడ్డూ ప్రసాదాన్ని అందజేస్తారు. రెండు లడ్డూలు కావాలంటే రూ. 10 చొప్పున రాయితీపై అందజేస్తారు. అవసరమైన వారు రూ. 25 ధరపై మరో రెండు లడ్డూలూ పొందవచ్చు. భక్తుల లగేజీని తితిదేయే తిరుమలకు ఉచితంగా చేరవేస్తుంది. అలిపిరి, శ్రీవారిమెట్టు ప్రవేశమార్గంలో ఈ ఉచిత లగేజీ రవాణా కేంద్రాలు ఉన్నాయి. అక్కడ భక్తులు తమ లగేజీని డిపాజిట్‌ చేసి రశీదు చూపి ఈ లగేజీని తీసుకోవచ్చు.
బ్రహ్మోత్సవాల సమయంలో తితిదే ప్రత్యేక ప్రవేశ దర్శనాల టికెట్లను కరెంటు బుకింగ్‌ కింద ఇవ్వడాన్ని రద్దు చేస్తుంది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నారు. అడ్వాన్స్‌ బుకింగ్‌ కింద నిత్యం అంతర్జాలంలో 6వేలు, ఇ-దర్శన కౌంటర్ల ద్వారా మరో 5వేల టికెట్లను రూ.300 చొప్పున విక్రయిస్తున్నారు. టికెట్లలో నిర్దేశించిన సమయానికి ఆయా భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో శ్రీవారి దర్శనానికి హాజరుకావాల్సి ఉంటుంది. గుర్తింపు కార్డు, సంప్రదాయ దుస్తులు ధరించని పక్షంలో శ్రీవారి దర్శనానికి అనుమతించరు. ఒక్కో టికెట్‌పై రెండు ప్రసాద లడ్డూలు ఉచితంగా అందజేస్తారు.
తిరుమలలో భక్తులందరికీ తితిదే స్వామివారి అన్నప్రసాదం అందజేస్తోంది. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయంలో ఉదయం 9.30 నుంచి రాత్రి 10 గంటల వరకూ ఈ అన్నప్రసాదం అందుబాటులో ఉంటుంది. ఎలాంటి సిఫార్సు లేకుండా ప్రతిఒక్కరూ ఈ అన్న ప్రసాదాన్ని ఉచితంగా స్వీకరించవచ్చు. బ్రహ్మోత్సవాల్లో రద్దీ ప్రాంతాలను గుర్తించి అక్కడే భక్తులకు అల్పాహారం, పానీయాలనూ అందించేందుకు తితిదే ఏర్పాట్లు చేస్తోంది.
వసతి సౌకర్యం
స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు 24 గంటలపాటు ఉచిత వసతి కల్పిస్తారు. తితిదే ఆధ్వర్యంలో తిరుపతి-తిరుమల ప్రాంతాల్లో సుమారు 15వేల కాటేజ్‌లు భక్తుల కోసం అందుబాటులో ఉన్నాయి. హాథీరాంజీ మఠం, జీయర్‌ మఠం, శంకరమఠం తదితర సంస్థల ఆధ్వర్యంలోనూ వసతి లభిస్తుంది.
ఇవికాక ఆర్జితసేవలు పొందేవారి కోసం ప్రత్యేక కాటేజ్‌లు ఉన్నాయి. అలాగే వివిధ రాష్ట్రాల టూరిజం శాఖల అతిథిగృహాలు, వివిధ ఆధ్యాత్మిక సంస్థల అద్దెగదులు అందుబాటులో ఉన్నాయి. ముందస్తు రిజర్వేషన్‌, ఇతర వివరాలకు తితిదే కార్యాలయంలో సంప్రదించాలి
ఆర్జితసేవ పేరుహాజరు కావాల్సిన సమయం
సుప్రభాతంఉదయం 2 గంటలకు
వస్త్రాలంకరణ సేవఉదయం 3 గంటలకు
అభిషేకంఉదయం 3 గంటలకు
తోమాలఉదయం 3గంటలకు
అర్చనఉదయం 4గంటలకు
నిజపాద దర్శనంఉదయం 4.30గంటలకు
అష్టదళ పాద పద్మారాధన సేవఉదయం 5 గంటలకు
సహస్ర కలశాభిషేకంఉదయం 5గంటలకు
తిరుప్పావడ సేవఉదయం 5గంటలకు
విశేషపూజఉదయం 6గంటలకు
కల్యాణోత్సవంఉదయం 10గంటలకు
వూంజలసేవఉదయం 11గంటలకు
ఆర్జిత బ్రహ్మోత్సవంమధ్యాహ్నం 1.30గంటలకు
వసంతోత్సవంమధ్యాహ్నం 2గంటలకు
సహస్ర దీపాలంకరణ సేవసాయంత్రం 5గంటలకు

ప్రధాన/ ప్రత్యేక పూజలు:
నిత్యసేవలు: సుప్రభాతం
ప్రవేశం: ఒకరికిరోజు: నిత్యంటిక్కెట్టు ధర: రూ. 120
నిత్యసేవలు: తోమాల
ప్రవేశం: ఒకరికిరోజు: మంగళ, బుధ, గురుటిక్కెట్టు ధర: రూ.220
నిత్యసేవలు: అర్చన
ప్రవేశం: ఒకరికిరోజు: మంగళ, బుధ, గురుటిక్కెట్టు ధర: రూ.220
నిత్యసేవలు: కల్యాణోత్సవం
ప్రవేశం: ఇద్దరికిరోజు: నిత్యంటిక్కెట్టు ధర: రూ. 1000
నిత్యసేవలు: ఆర్జిత బ్రహ్మోత్సవం
ప్రవేశం: ఒకరికి రోజు: నిత్యంటిక్కెట్టు ధర: రూ.200
నిత్యసేవలు: డోలోత్సవం
ప్రవేశం: ఒకరికిరోజు: నిత్యంటిక్కెట్టు ధర: రూ.200
నిత్యసేవలు: సహస్ర దీపాలంకరణ సేవ
ప్రవేశం: ఒకరికిరోజు: నిత్యంటిక్కెట్టు ధర: రూ.200
నిత్యసేవలు: వారం సేవలు విశేషపూజ
ప్రవేశం: ఒకరికిరోజు: సోమవారంటిక్కెట్టు ధర: రూ.600
నిత్యసేవలు: అష్టదళ పాదపద్మారాధనం
ప్రవేశం: ఒకరికిరోజు: మంగళవారం టిక్కెట్టు ధర: రూ. 1,250నిత్యసేవలు: సహస్ర కలశాభిషేకం
ప్రవేశం: ఒకరికిరోజు: బుధవారంటిక్కెట్టు ధర: రూ.850
నిత్యసేవలు: తిరుప్పావడ సేవ
ప్రవేశం: ఒకరికిరోజు: గురువారంటిక్కెట్టు ధర: రూ.850
నిత్యసేవలు: అభిషేకం
ప్రవేశం: ఒకరికిరోజు: శుక్రవారంటిక్కెట్టు ధర: రూ.750
నిత్యసేవలు: నిజపాద దర్శనం
ప్రవేశం: ఒకరికిరోజు: శుక్రవారంటిక్కెట్టు ధర: రూ.200
నిత్యసేవలు: వస్త్రాలంకరణ సేవ
ప్రవేశం: ఇద్దరికిరోజు: శుక్రవారంటిక్కెట్టు ధర: రూ. 12,250

కేదారనాథ్‌ - బద్రినాథ్‌

వెండికొండల్లో కేదారం... బద్రినాథ్‌


దేవభూమిగా ఖ్యాతిచెందిన ఉత్తరాఖండ్‌లో కేదార్‌నాథ్‌, బద్రినాథ్‌లు హిమాలయ పర్వతసానువుల్లో ఉన్నాయి. హిమాలయ శ్రేణుల్లో వెలసిన ఈ పుణ్యక్షేత్రాలు ఏటా మంచులో కూరుకుపోయి ఉంటాయి. దాదాపు ఆరునెలలు మూసి ఉండే ఈ ఆలయాలు సాధారణంగా మేనెలలో మాత్రమే తెరచుకుంటాయి. అక్టోబర్‌లో లేదా నవంబర్‌లో తిరిగి మూసుకుపోయే మంచు మేటల వల్ల దర్శనానికి వీలుపడదు.

దిల్లీ నుంచి సుమారు 500కి.మీ దూరంలో వున్న ఈ క్షేత్రాలకు యాత్రికులకు అనుకూలమైన రీతిలో ఎన్నో టూరిస్టు బస్సులు నడుస్తుంటాయి. హరిద్వార్‌, రుషికేశ్‌ల మీదుగా ఈ ప్రయాణాన్ని (రిషికేశ్‌ వరకూ రైల్లో వెళ్లొచ్చు). ప్లాన్‌ చేసుకోగలిగితే, ఒకే టూర్‌ ప్యాకేజీగా చక్కని యాత్ర ప్లాన్‌ చేసుకోగలిగిన వారవుతారు. రిషికేశ్‌ నుంచి హిమాలయాల మీదనే కేదార్‌నాథ్‌ చేరుకోవాలంటే 250కి.మీ దూరం ప్రయాణించాలి.

ఒకవైపు ఎత్తయిన పర్వతాలు, ఇంకో వైపు అగాధమైన లోయలు. దానికున్న దారి మాత్రం ఇరుకు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కైలాసనాథుడిపై భారం వేసి ప్రయాణం చేయతగిన యాత్ర. పైగా కొండచరియలు విరిగిపడి దారి ఎక్కడెక్కడ మూసుకుపోతుందో కూడా చెప్పలేని పరిస్థితి.

ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన కేదారం శివభక్తుల పాలిట మందారం. విష్ణుభక్తులకు బదరీ మోక్షరాదారి.

ఇక్కడ భగవంతుని మహిమకు గొప్ప నిదర్శనం. ఈ రెండు ఆలయాలకూ తాళాలు వేసే ముందు ఆఖండ జ్యోతిని వెలిగిస్తారు. ఆలయాలను ఆర్నెల్ల తర్వాత తిరిగి తెరిచాక కూడా ఇవి వెలుగుతూనే వుంటాయి.పూర్తిగా మంచుతో కప్పబడిపోయినా.. వీటికి కావలసిన వాయు ప్రసారం ఎలా అందుతుందో అన్నది ఇప్పటికీ మానవుడి పరిశోధనకు అంతుబట్టకపోవడం దైవమహిమకు నిదర్శనంగానే నిలిచిపోయింది. ప్రఖ్యాత శాస్త్రవేత్తలు సైతం దీనికి జవాబు చెప్పలేకపోయారు. దీనిని దైవమహిమగానే భావించాలి.

అంతేకాకుండా.. ఈ రెండు క్షేత్రాలకు మధ్య వందలాది కి.మీ పరిధిలో నిత్యశీతలం... తప్ప వేడి అనేది ఉండదు. ఇటువంటి చోట 120డిగ్రీల సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రత కలిగిన వేడినీటి వూటల ప్రవాహం. నిజంగా ఇది అద్భుతం. ఇదెలా సాధ్యమనే విషయమై పరిశోధనలు అయితే జరిగాయి. కానీ పరిశోధనలకు అందలేదు. జన్మలో ఒక్కసారైనా ఈ క్షేత్రాలను దర్శించలేని వారి జన్మవృథా అనేది కొందరి విశ్వాసం.

ఈ యాత్ర కష్టసాధ్యమే కానీ అసాధ్యమేమీ కాదు.

12 వేల అడుగుల ఎత్తులో.. కేదార్‌నాథ్‌
గౌరీకుండ్‌ అనే శిఖర ప్రాంతం వరకు ఏదో రీతిన వాహన సదుపాయాలు లభ్యం అవుతున్నప్పటికీ అక్కడి నుంచి మోటారు వాహనాలకు అవకాశం లేదు. డోలీ కట్టించుకుని కానీ, కాలినడకన ప్రయాణించి కానీ 14కి.మీ ప్రయాణం తప్పదు. ఎంతో సుశిక్షితంగా, సునిశితంగా గుర్రాలు యాత్రికుల్ని తీసుకెళ్లగలవు. కానీ వాటిని ఎక్కేవారికి ధైర్యం చాలకపోతే ఇబ్బందే. డోలీ ప్రయాణం ఖరీదైనది. ఒక్కో వ్యక్తికి 14కి.మీలకు రానుపోను రూ.2,500లకు పైగా వసూలు చేస్తారు.

సముద్రమట్టానికి 12వేల అడుగుల ఎత్తున ఉన్న, మంచుతో అవరింపబడి ఎంతో మనోహరంగా ఉన్న కేదార్‌నాథ్‌ ఆలయాన్ని పాండవులు నిర్మించారని ప్రతీతి.

శివభక్తుల పాలిట భువిలో వెలసిన కైలాసంగా భావించబడుతున్న ఈ జ్యోతిర్లింగ క్షేత్రంలో భక్తులే స్వయంగా కేదారేశ్వరుని దర్శించుకుని పూజలు జరుపుకోవచ్చు. ఆదిశంకరాచార్యులు స్వయంగా ఈ శివుని దర్శించాకే హిమాలయాల్లోకి వెళ్లి అదృశ్యమయ్యారట.

ఇక్కడ ఇప్పటికీ వందలాది సంవత్సరాల నుంచి రుషులు తపస్సు చేస్తున్నారని కొందరు చెబుతుంటారు. వారిలో వృద్ధాప్య ఛాయలు ఏమాత్రం కనిపించవు. ఇక్కడ మరణిస్తే పునర్జన్మ ఉండదంటారు.

ఇంత శీతల ప్రదేశంలోనూ పర్యాటకులకు అనువైన వసతి గృహాలు, హోటళ్లు ఉంటాయి. విద్యుత్తు సరఫరాకు అవకాశం లేని ప్రాంతం. మేలో మండు వేసవిలో ఇక్కడ మాత్రం చలిగా ఉంటుంది. బదరీనాథ్‌


కేదారనాథ్‌ నుంచి సరాసరి బదరీనాథ్‌కు వెళ్లలేం. తిరిగి గౌరీకుండ్‌కు చేరుకోవాలి. ఇక్కడి నుంచి బదరీనాథ్‌ 230కి.మీ దూరంలో ఉంటుంది.

జోషీమఠ్‌ వరకు అన్నికాలాల్లోనూ యాత్రికులకు వెళ్లగల అవకాశం ఉంటుంది. ఇక్కడి నుంచి బదరీనాథ్‌కు 42కి.మీ ఇది కూడా వన్‌వే ట్రాఫిక్‌. గౌరీకుండ్‌ నుంచి జోషీమఠ్‌ 160 కి.మీ.దూరంలో ఉంది.

బదరీ దేవాలయం మూసి ఉన్న కాలంలో నారాయణుడికి ఇక్కడే పూజలు జరుగుతాయి.

జోషీమఠ్‌ నుంచి బదరీనాథ్‌ చేరుకోవడానికి సుమారు 4గంటలు ఈ పడుతుంది.ఈ ప్రాంతం హిమాలయాల్లో సుమారు పదివేల అడుగుల ఎత్తున ఉంటుంది.విష్ణుభక్తులకు ఇది భూలోక వైకుంఠం. బ్రహ్మకపాలం పేరుగల ప్రాంతం ఇక్కడికి చేరువలోనే ఉంది.ఇక్కడ పితృదేవతలకు పిండప్రదానం చేస్తే, ఏ ఇతర ప్రాంతాల్లోనైనా ఏటా పిండ ప్రదానం అవసరం లేదని చెబుతారు. ఈ ప్రదేశంలో ఎక్కువగా రేగు చెట్లు ఉండటం వల్ల ఈ ప్రాంతాన్ని బదరీనాథ్‌ అంటారట.

క్రీ.శ 15శతాబ్దిలో గఢ్వాల్‌ రాజులచే ఇక్కడ ఆలయం నిర్మితమైందనీ కానీ క్రీ.శ 8వ శతాబ్ది నాటికే, ఇక్కడ శంకరాచార్యుల వారి ప్రయత్నంతో ఆలయానికి అంకురార్పణ జరిగిందని చెబుతారు. కేదార్‌నాథ్‌ మాదిరిగానే ఇక్కడ కూడా తప్తకుండ్‌లో వేడినీటి వూటలు వస్తుంటాయి.

ఇక్కడికి సమీపంలోనే ‘మానా’అనే ఊరు ఉంది. ఈ గ్రామం భారత్‌-చైనా సరిహద్దును ఆనుకొని ఉంది. భారతదేశానికి సంబంధించి ఇదే చివరి గ్రామం.

ఎలా వెళ్లాలి
హైదరాబాద్‌ నుంచి కేదార్‌నాథ్‌ 1,485 కి.మీ దూరంలో ఉంది. కేదార్‌నాథ్‌ వెళ్లడానికి రైలు, విమాన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. కేదార్‌నాథ్‌కు 239కి.మీ దూరంలో ఉన్న డెహ్రాడూన్‌లోని జాలీగ్రాంట్‌ విమానాశ్రయానికి దిల్లీ నుంచి ప్రతిరోజూ విమానాలు ఉన్నాయి. విమానాశ్రయం నుంచి టాక్సీ సౌకర్యం ఉంది. కేదార్‌నాథ్‌కు 221దూరంలో ఉన్న రిషికేష్‌కు రైలు సౌకర్యం ఉంది. ఇక్కడి నుంచి ట్యాక్సీలో కేదార్‌నాథ్‌ (14 కి.మీ) చేరువకు వెళ్లవచ్చు. అక్కడి నుంచి 14కి.మీ నడక మార్గంలో కేదార్‌నాథ్‌ చేరుకోవచ్చు. రిషికేశ్‌, కోట్‌ద్వార్‌ నుంచి రోడ్డు మార్గాన యాత్రికులు ట్యాక్సీలు, ఇతర ప్రైవేటు వాహనాల్లో దిల్లీ - మనా జాతీయరహదారి(538కి.మీ) మీదుగా చేరుకోవచ్చు. కేదార్‌నాథ్‌ నుంచి నడకదారిలో గౌరీకుండ్‌ చేరుకుని, రిషికేశ్‌, డెహ్రాడూన్‌, కోట్‌ద్వారా, హరిద్వార్‌ నుంచి బస్సు సౌకర్యం కూడా ఉంది.

* పటా- కేదార్‌నాథ్‌కు పవన్‌హాన్స్‌, యూటీఎయిర్‌, ఎయిర్‌ఛార్టర్‌, ప్రభాతమ్‌ సంస్థలు హెలికాప్టర్‌ సేవలను ప్రారంభించాయి. దీనికి ఒక్కొక్కరికిగాను రూ.7,000నుంచి 7,200వరకు వసూలు చేస్తున్నారు.ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రములు

ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రములు


సోమనాథలింగంద్వాదశ జ్యోతిర్లింగాలలో(12) మొదటిదిగా వర్ణించబడింది సోమనాథలింగం. ఇది ఒకనాడు సౌరాష్ట్రగా చెప్పబడిన గుజరాత్ రాష్ట్రములోని ప్రభాస పట్టణానికి సుమారు 40 కి.మీ.ల దూరంలో ఉన్నది.

యాత్రామార్గం:
విజయవాడ నుండి ఖాజీపేట, సికింద్రాబాద్, కురిదివాడి, పూనాల మీదుగా బొంబాయి వెళ్ళి అక్కడ నుంచి అహ్మదాబాద్, వీరంగం స్టేషన్‌లమీదుగా వెరావల్ స్టేషన్‌లో దిగాలి. వెరావల్ రైల్వేస్టేషన్ నుండి 7 కి.మీ. దూరంలో వున్న సోమనాథ్ క్షేత్రానికి బస్సు ద్వారా వెళ్ళవచ్చు.

పురాణగాథ:
ఈ జ్యోతిర్లింగము చంద్రుని వలన ప్రతిష్ఠింపబడిందని చెబుతారు. దక్షప్రజాపతికి సంతతిలోని అశ్విని మొదలుకొని రేవతి వరకు మొత్తం 27 మంది కుమార్తెలు అందరూ చక్కని చుక్కలే. దక్షుడు తన కుమార్తెలకు సరియైన జోడుగా భావించి వారిని సౌందర్యమూర్తి అయిన చంద్రునికిచ్చి వివాహం చేశాడు. భార్యలందరిలో రోహిణి మరింత అందగత్తె కావటంవల్ల ఆమె పై చంద్రుడు అధికంగా ప్రేమను ప్రకటించసాగాడు. మిగిలిన వారందరికి ఇది అసూయను కల్గించింది. రోహిణి తప్ప మిగిలిన 26 మంది ఈర్ష్యతో తన తండ్రి దగ్గరకు వెళ్ళి తమబాధను చెప్పుకున్నారు. దక్షుడు చంద్రుణ్ణి పిలిచి భార్యలందరిని సమానమైన ప్రేమతో చూడమని పలువిధాలుగా నచ్చచెప్పాడు. కాని మామగారి మాటలు చంద్రుని మనస్సునకు ఎక్కలేదు. అందువల్ల అతడు మునుపటి కంటే ఎక్కువగా రోహిణిపై అనురాగాన్ని చూపించాడు అందుకు దక్షుడు పట్టరానికోపంతో చంద్రుణ్ణి “క్షయరోగంతో పీడించబడుదువుగాక” అని శపించాడు. అప్పటినుంచి ఆ శాపం కారణంగా చంద్రుడు తన కళలను కోల్పోవటం ప్రారంభించాడు. సుధాకరుని సుధాకిరణములు నీరిసంచి పోవటంవల్ల అమృతమే ఆహారముగా గల దేవతలు హాహాకారాలు చేయసాగారు. ఓషధులు వాడిపోయాయి. చరాచరజగత్తు అంతా నిస్తేజం అయిపోయింది. అపుడు ఇంద్రుడు మొదలైన దేవతలు, వశిష్టుడు మొదలైన మునీంద్రులు కలసి చంద్రుని తీసుకొని బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి ఈ ఉపద్రవం నుండి లోకాలనన్నింటిని రక్షించమని వేదుకున్నారు. అప్పుడు బ్రహ్మ చంద్రునితో పవిత్రమైన ప్రభాసతీర్థానికి వెళ్ళి పరమశివుని ఆరాధించవలసినదిగాను అందువల్ల సమస్త శుభములు చేకూరగలవని హితవు చెప్పి, అతనికి మృత్యుంజయ మంత్రాన్ని ఉపదేశించాడు.

ఆ తరువాత చంద్రుడు దేవతలతో కలసి ప్రభాసక్షేత్రానికి వెళ్ళి నిష్టతో మహేశ్వరుని ఆరాధించి, ఆరు మాసాల కాలం (ఘోరమైన) తపస్సు చేశాడు. దీక్షతో 10 కోట్లసార్లు మృత్యుంజయమంత్రాన్ని జపించాడు. చంద్రుని భక్తికి మెచ్చిన శంకరుడు అతని ముందు సాక్షాత్కరించి వరం కోరుకోమన్నాడు. అప్పుడు చంద్రుడు ఆ పరమ శివునికి సాష్టాంగ ప్రణామం చేసి తనను అనుగ్రమింపమని శివుని కటాక్షవీక్షములను తనపై ప్రసరింపచేసి శాప నివృత్తిని కలిగించమని ప్రార్థించడు. కరుణామయుడైన శివుడు చంద్రుని ప్రార్థనను మన్నించి దక్షుడి శాపాన్ని రూపుమాపే అవకాశం లేదని చెప్పి దానికి సవరణలు చేస్తాడు. కృష్ణ పక్షంలో మాత్రం చంద్రుని కళలు క్షీణించే విధంగానూ, శుక్లపక్షంలో కళలు దినదిన ప్రవర్థమానం అయ్యేటట్లు, పూర్ణిమనాటికి కళాపరిపూర్ణుడుగా విరాజిల్లగలడనీ వరం ప్రసాదించాడు.

ఈ విధంగా మరల అమరత్వం ప్రసాదించిన చంద్రుడు కళాప్రపూర్ణుడై కళకళలాడుతూ మునుపటి వలెనే అమృతవర్షాన్ని కురిపంచసాగాడు. అపుడు బ్రహ్మాది దేవతలు ప్రార్థించగా పరమశివుడు పార్వతీసమేతుడై ఈ ప్రభాసక్షేత్రములో సోమనాథునిగా నిలిచిపోయాడు.

ఈ సోమనాథ లింగమును దర్శించటానికే తప్ప తాకటానికి మాత్రం భక్తులకు అవకాశం లేదు. పశ్చిమ సముద్రతీరాన, రామేశ్వరంలాగా ఉన్న జ్యోతిర్లింగం ఇది. ఈ ఆలయ వాస్తునిర్మాణం, త్రయంబకేశ్వరాలయాన్ని గుర్తుకు తెస్తుంది.
మల్లికార్జున లింగం:

12 జ్యోతిర్లింగాలలో రెండవదిగా చెప్పబడే ఈ జ్యోతిర్లింగం శక్తిపీఠంలో కలిసి ఉండటం వలన అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకొన్నది. ధూళి దర్శనం ఆచారంగా ఉన్న శ్రీశైలమహాక్షేత్రంలో యుగయుగాలనుండి స్వామిని తాకి తల ఆనించి తమ కష్టాలను చెప్పుకొనే అవకాశం ఉంది.

యాత్రామార్గం:
ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రధాన కూడలుల నుండీ నేరుగా బస్సులున్నాయి. విజయవాడ- కర్నూలు మార్గంలోని దోర్నాల నుండి 49 కి.మీ. ఘాట్ రోడ్డులో ప్రయాణించవలసి ఉంటుంది. రాత్రి గం 9.00 ల నుండి ఉదయం 6 గం ల వరకు ప్రేవేటు వాహనాలు ఘాట్‌లో ప్రవేశించే అవకాశం ఉండదు. దోర్నాల నుండి శ్రీశైలానికి రోజూ సుమారు 40 ఆర్.టి.సి. బస్సులు వెడతాయి. ఇవన్నీ ఇతర ప్రాంతాల నుండి శ్రీశైలం వెళ్ళే బస్సులే.

ఉనికి:
శ్రీశైలమహాక్షేత్రం ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా, ఆత్మకూరు తాలూకాలోనున్న నల్లమల అడువులలోని పర్వతశ్రేణుల నడుమ పాతాళగంగ పేరుతో ఉత్తరవాహినిగా ప్రవహిస్తున్న కృష్ణానదికి కుడివైపున ఉంది. 16⁰12 ఉత్తర అక్షాంశము, మరియు 78⁰5 తూర్పు రేఖాంశముల వద్దనున్న యీ క్షేత్రపు ఎత్తు సముద్రమట్టానికి 476 మీటర్లు (1500 అడుగులు).

శ్రీశైల మహిమ:
12 జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీ మల్లికార్జునస్వామికి 18 శక్తిపీఠాలలో ఒకరైన శ్రీ భ్రమరాంబాదేవికి, నిలయమైన యీ మహాక్షేత్రం వేదములకు ఆలవాలమై, సకల సంపదలకు పుట్టినిల్లై, ఎనిమిది శృంగాలతో, 44 నదులతో, 60 కోట్ల తీర్థరాజాలతో, పరాశర, భరద్వాజాది మహర్షుల తపోవనాలతో, చంద్రగుండ, సూర్యగుండాది పుష్కరిణులతో, స్పర్శ వేదులైన లతలు, చెట్లు మరియు లింగాలతో, అనంతమైన ఓషధులతో విరాజిల్లుతూ యాత్రికుల మనస్సులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

శ్రీశైల దర్శనఫలం:
కురుక్షేత్రంలో లక్షలకొలదీ దానమిచ్చినా రెండువేలసార్లు గంగాస్నానం చేసినా,నర్మదానదీ తీరంలో బహుకాలం తపస్సాచరించినా, కాశీక్షేత్రంలో లక్షల సంవత్సరాలు నివసించినా ఎంత పుణ్యం లభిస్తుందో అంతటి మహాపుణ్యం శ్రీశైల మల్లికార్జునుని ఒక్కసారి దర్శించినంతనే కలగుతుందని స్కాందపురాణం చెబుతోంది.

శిఖరదర్శన మాత్రాన, అనంతమైన పుణ్యాన్ని సంతరించి పెట్టి పునర్జన్మనుండి ముక్తిని కలిగించే ఈ క్షేత్రాన్ని ఆయా మాసాలలో సందర్శించేవారు వాజపేయ, అతిరాత్ర మొదలైన మహాయజ్ఞాలు అచరించినందువల్ల కలిగే ఫలాన్ని, కన్యాదానం, గోదానం మొదలైన మహాదానాలు చేసినందువల్ల కలిగే ఫలన్ని, కన్యాదానం, గోదానం మొదలైన మహాదానాలు చేసినందువల్ల కలిగే ఫలాన్ని అనాయాసంగా పొందుతారని శివుడు పార్వతికి స్వయంగా చెప్పినట్లు స్కాందపురాణం చెబుతున్నది.

యుగయుగాలుగా  ప్రసిద్ధికెక్కిన యీ శైవక్షేత్రం కృతయుగంలో హిరణ్య కశిపునికి పూజామందిరం కాగా, అహోబిలక్షేత్రం సభామండపమనీ, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు అరణ్యవాస సమయంలో సతీసమేతుడై శ్రీశైలనాధుని సేవించి సహస్రలింగాన్ని ప్రతిష్ఠించాడని, పాండవులు తమ వనవాస సమయంలో ద్రౌపదీ సమేతులై యీ క్షేత్రంలో కొంతకాలముండి, లింగాలను ప్రతిష్ఠించారని చెప్పబదుతోంది. ఇందుకు నిదర్శనంగా నేటికీ యీ క్షేత్రంలో, రామప్రతిష్ఠితసహస్రలింగం, సీత్పాతిష్ఠిత సహస్రలింగం, పాండవులచే ప్రతిష్ఠింపబడిన ‘సద్యోజాత ‘ మొదలైన ఐదు లింగాలు భక్తుల సేవల నందుకొంటున్నాయి.
మహాకాళేశ్వర లింగం:

మాలవ దేశంలోని ఉజ్జయిని పట్టణంలో శిప్రానది ఒడ్డున ఈ జ్యోతిర్లింగం ఉన్నది. ఉజ్జయిని నగరాన్నే అవంతి అని కూడా అంటారు. భారతేశంలోని మోక్షదాయకములైన 7 నగరాలలో అవంతిక ఒకటి. ఈ విషయాన్ని

అయోధ్యామధురా మాయా కాశీ కాంచీ అవంతికా |
పురీ ద్వారవతీ చైవ సప్తైతే మోక్షదాయకాః ||
అనే పురాణ వచనం చెబుతోంది.

స్కౌంద పురాణంలోని ఆవంత్య ఖండం ఈ నగరం యొక్క గొప్పతనాన్ని ఎంతగానో వర్ణించింది. శివపురాణంలోను మహాభారతంలోను ఉజ్జయిని యొక్క మహిమ ఎంతగానే చెప్పబడింది. ఇక్కడ ప్రవహించే శిప్రానదిలో స్నానం చేసినవారికి సర్వపాపాలు నశిస్తాయని, అష్టదరిద్రాలు దూరమైపోతాయని పురాణాలు చెప్పబడింది. శ్రీకృష్ణుడు విద్యాభ్యాసం చేసిన సాందీపని ఆశ్రమం ఇక్కడే ఉన్నది. ఈ క్షేత్రమే విక్రమాదిత్యునికి రాజధాని అయి కాళిదాసు మొదలైన మహాకవులకు నిలయమయ్యింది.

యాత్రామార్గం:
విజయవాడ నుంచి అహ్మదాబాద్ వెళ్ళే మార్గంలో ఉజ్జయిని రైల్వేస్టేషన్ వుంది. జ్యోతిర్లింగ క్షేత్రమైన ఓంకారేశ్వరాన్ని సందర్శించిన భక్తులు 5 గంటల కాలం ప్రయాణించి ఉజ్జయినిని చేరుకోవచ్చు. ఈ దారిలో ప్రయాణించేవారు దారిలో ఇన్‌డోర్ నగరాన్ని కూడా చూడవచ్చు. ఇన్‌డోర్ నగరం ఒకప్పుడు రాణి అహాల్యాబాయ్ నివాసస్థలం. ఇన్‌డోర్ నగరం ఉజ్జయినికి 53 కి.మీ. దూరంలో వుంది.

పురాణగాథ:
ఒకప్పుడు అవంతి నగరంలో వేద విద్యలలో గొప్పవాడైన వేదప్రియుడనే పేరుగల బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు దేవప్రియుడు, ప్రియమేథుడు, సుకృతుడు, సువ్రతుడు అని నలుగురు కుమారులు ఉండేవరు. వారంతా శివభక్తులే. ఇది యిలా ఉండగా అవంతి నగరానికి సమీపంలో ఉన్న రత్నమాల పర్వతం మీద నివసించే దూషణుడు అనే రాక్షసుడు వేదప్రియుని కీర్తిప్రతిష్ఠలు విని తన సైన్యంతో అవంతి నగరం మీదికి దండెత్తాడు.

ఆ పట్టణంలోని ప్రజలంతా ఆ రాక్షసుని చూచి ఆర్తనాదాలు చేయటం ప్రారంబించారు. ప్రజల ఏడుపుల ధ్వని ఆకాశాన్ని అంటుకుంది. కానీ శివభక్తుడైన వేదప్రియుడు మాత్రం ఆవంతైనా చలించలేదు. ఆయన నిశ్చలమైన మనస్సుతో శివదీక్షతో నిమగ్నుడై ఉన్నాడు. రాక్షసుడు అతనిని చూచి క్రోధంతో “నరకండి, చంపండి ” అంటూ వేదప్రియునిపై దురాక్రమణ చేశాడు. అప్పుడు శివుడు మహాకాళ రూపంతో సాక్షాత్కరించి ప్రళయ హుంకారంతో ఆరాక్షసుని భస్మంచేశాడు. తరువాత శంకరుడు ప్రసన్నవదనంతో వేదప్రియుని చూచి వరం కోరుకోమన్నాడు. వేదప్రియుడు చేతులు జోడించి నమస్కరించి “దేవ దేవా నా వంటి దీనులైన భక్తులను అకాల మృత్యువు నుండి రక్షిస్తూ సర్వకాలములలో ఇక్కడనే నెలకొని వుండు” అని ప్రార్థించాడు. శివుడు ఆ భక్తుని కోరికను అనుసరించి మహాకాళ నామంతో జ్యోతిర్లింగమై అచ్చట వెలసి ముక్తిని ప్రాసాదిస్తున్నాడు.

ఉజ్జయిని నగరాన్ని పరిపాలించే చంద్రసేన మహారాజు గొప్ప శివభక్తుడు. ఒకనాడు అతడు శివపూజలో నిమగ్నమై ఉండగా ‘శ్రీకరుడు ‘ అనే ఐదేళ్ళ గోపాలబాలుడు తన తల్లితోపాటు అక్కడకు వచ్చాడు. రాజుగారి దైవభక్తిని చూచి తన్మయుడైతాను కూడా స్వయంగా భగవంతుని ఆరాధించాలని నిర్ణయించుకున్నాడు. ఇంటికి వెళ్ళే మార్గంలోని శిలాఖండాన్ని ఒకదానిని తీసుకొని వెళ్ళి ఆ రాతిబండనే శివలింగంగా భావించి భక్తిశ్రద్ధలతో పూజించాడు. శ్రీకరుడు శివధ్యానంలో నిమగ్నుడై ఉన్నప్పుడు అతని తల్లి వచ్చి భోజనమునకు రమ్మని పిలిచింది. తల్లిమాటలు వినిపించుకొనక కళ్ళు మూసుకొని తన్మయుడై ఉన్నాడు శ్రీకరుడు. పిలిచి పిలిచి వేసారిన అతని తల్లి చివరకు శిలాశకలాన్ని తీసి దూరంగా పారవేసింది.

శ్రీకరుడు తన ఇష్ట దైవమైన శివునికోసం పెద్దగా ఏడ్చి ఏడ్చి అలసిపోయి మూర్ఛ పొందాడు. అపుడు భక్తసలభుడైన శంకరుడు శ్రీకరుని ముందు నిజరూపముతో ప్రత్యక్షమయ్యాడు. శ్రీకరుడు కళ్ళు తెరచేటప్పటికి ఎదురుగా మహాకాళ మందిరం, అందులో దేదీప్యమానంగా ప్రకాశించే జ్యోతిర్లింగం అతనికి కనిపించాయి. అది చూచిన బాలుడు ఆశ్చర్యంతో పులకించిపోయాడు.మాహాదేవుడైన ఆ శివుని మరల స్తుతించటం ప్రారంభించాడు. ఇంతలో తల్లివచ్చి జరిగినదానిని చూచి ఆనందంతో ఉప్పొంగిపోయింది. కొద్ది సేపటిలోనే ఈ విషయం నగరమంతటా వ్యపించింది.

చంద్రసేన మహారాజు ఆ విషయం తెలుసుకొని వెంటనే ఆ ప్రదేశానికి వచ్చి శ్రీకరుని భక్తికి ఆశ్చర్యం పొందాడు. ఇంతలో హనుమంతుడు వారి ముందు ప్రత్యక్షమై “ఓ మానవులారా ! ఈ చరాచర సృష్టికి శంకరుడే ఏకైక శరణ్యడు. ఆ మహాదేవుని ఆరాధించి తరింపుడు. వేలకొలది సంవత్సరములు తపస్సు చేసిన మహార్షులు కూడా పొందలేని ఫలమును శివపూజవలన ఈ బాలుడు సునాయాసంగా పొందగలిగెను. వీని సందర్శనము వలన వీరందరు ధన్యులైరి. ఈ గోపబాలుని ఎనిమిదవ తరమున నందుడను వాడు జన్మించును. మహావిష్ణువు ఆ నందునికి కుమారుడై జన్మించి లోకోద్ధరణ చేయగలడు.” అని చెప్పి అదృశ్యమయ్యాడు.

శ్రీ మహాకాళలింగమును సేవించి వేదప్రియుడు, శ్రీకరుడు, చంద్రసేన మహారాజు మొదలైనవారు శివసాన్నిద్యం పొందారు.

“ఆకాశే తారకం లింగం పాతాలే హటకేశ్వరం
మర్త్యలోకే మహాకాలం లింగత్రయ నమోస్తుతే ||”

అని పురాణములలో మహాకాళేశ్వరుని యొక్క మహిమ చెప్పబడింది.
ఓంకారేశ్వరలింగం:

ఓంకారేశ్వరుని అమరేశ్వరుడని, అమలేశ్వరుడని కూడా పిలుస్తారు. కానీ ఇక్కడ నర్మదానదికి రెండువైపుల ఓంకారేశ్వర, అమరేశ్వర దేవాలయాలు ఉన్నాయి. వాటిమధ్య నర్మదానదిమీద వంతెన కూడా నిర్మించబడింది. ఈ క్షేత్రంలో నర్మదానది, నర్మద, కావేరిక అని రెండు పాయలుగా ప్రవహిస్తోంది. ఈ రెండుపాయల మధ్య ఉన్న ప్రదేశాన్ని ‘‘ శివపురి ” అని ‘‘మాంధాతృపురి ‘ అని పిలుస్తారు.

మాంధాత సూర్యవంశపురాజు. ఈయన రఘవంశానికి మూలపురుషుడు. శ్రీరామచంద్రుడు కూడా ఈ వంశములోనివాడే. మహావీరుడైన మాంధాత ఇక్కడి పర్వతశిఖరం మీద అనేక సంవత్సరాలు తప్పస్సు చేసి పరమేశ్వరుని ప్రసన్నుని చేసుకొని స్వామికి దేవాలయాన్ని నిర్మించాడు. అందువలన దీనికి మాంధాతపురి అని పేరు వచ్చింది.

మాంధాత పర్వతం మీద చాలా దేవాలయాలు ఉన్నాయి. అవన్నీ “ఓం ” అనే ప్రణవకారంలో ఉండి. ఓంకారేశ్వర దేవాలయం ఆ ప్రణవంపై బాలచంద్రుని లాగే ప్రకాశింస్తొంది. ఈ ఓంకారేశ్వరుని దగ్గరకు వెళ్ళే మార్గంలో విష్ణుపురి, బ్రహ్మపురి అనే చిన్న చిన్న రెండు కొండగుట్టలున్నాయి. ఆ రెండింటి మధ్య “కపిలధార” అనే నది ప్రవహించి నర్మదానదిలో కలుస్తూంది.
వైద్యనాథ లింగం:

జ్యోతిర్లింగంగా చెప్పబడే వైద్యనాథలింగం బీహార్ రాష్ట్రంలోని చితాభూమిలో ఉన్నదని ఉత్తరాదివారు భవిస్తారు. వారి దృష్టిలో మహారాష్ట్రలోని పర్లివైద్యనాథలింగం జ్యోతిర్లింగం కాదు. కానీ దక్షిణాదివారు మహారాష్ట్రలోని పర్లి వైద్యనాథ క్షేత్రాన్నే జ్యోతిర్లింగ క్షేత్రంగా చెబుతారు. ఈ జ్యోతిర్లింగం ఎక్కడ ఉన్నదిగా చెప్పబడినప్పటికి దానికి సంబంధించిన పురాణగాథ ఒక్కటే.

యాత్రామార్గం:
ఔరంగాబాద్ నుంచి 12 గం|| ల కాలం బస్సులో ప్రయాణించి పర్లివైద్యనాథ క్షేత్రాన్ని చేరవచ్చు. లేదా పర్భిణి రైల్వేజంక్షన్ నుంచి 40 కి.మీ. దూరం రైలులో ప్రయాణించి పర్లివైద్యనాథ్ క్షేత్రంలో దిగవచ్చు.

పురాణగాథ:
శివభక్తుడైన రావణాసురుడు ఒకప్పుడు వెండికొండకు పోయి శివుని ప్రీతికోసం తన తలలను హోమంచేసి 9 తలలను హోమంలో వేసిన తరువాత 10వ తలను కూడా ఖండిచబోగా శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అప్పుడు రావణాసురుడు ఇతరులు తన తలలను ఖండించినప్పుడు అవి వెంటనే మరల మొలచి యథాస్థితిగా ఉండాలని, శివుడు తన లంకారాజ్యానికి వచ్చి అక్కడే స్థిరంగా ఉండాలని వరం కోరాడు. అందుకు శివుడు అలాగే అంటూ తన బదులు ఆత్మలింగాన్ని ఇస్తున్నానని, దానిని తీసుకొనిపోయి లంకారాజ్యంలో ఉంచమని అది లంకలో ఉన్నంతకాలం రావణునికి అపజయం అన్నది లేక రాజ్యం సుభిక్షంగా ఉంటుందని రాజ్యానికి ఎటువంటి పతనావస్థా ఉండదని చెప్పాడు. కానీ ఆత్మలింగాన్ని లంకకు వెళ్ళేలోపు మరెక్కడా క్రిందపెట్టకూడదని, నేలపై పెట్టిన తరువాత దానిని పెకలించటం ఎవరికీ సాధ్యంకాదని కూడా శివుడు చెప్పాడు.

దానికి అంగీకరించిన రావణుడు శివుని ఆత్మలింగాన్ని తీసుకొని మధ్య దారిలో సంధ్యా వందనానికి సమయం కాగా ఆ సమయానికి కనిపించిన ఒక బాలుని చేతిలో ఆ లింగాన్ని ఉంచి వెంటనే తిరిగి వస్తాననీ, అప్పటివరకు క్రింద పెట్టికుండా జగ్రత్తగా పట్టుకోవలసినదిగాను చెప్పి సంధ్యావందనానికి వెళ్ళాడు.

శివుడు ఆత్మలింగం లంకకు చేరినందువల్ల దేవతలకు కష్టములు నాలుగింతలు అవుతాయని ఊహించిన దేవతలు నారదుని సలహామేరకు గణాధిపతి అయిన వినాయకుని ఆత్మలింగం లంకకు చేరకుండా చూడమని ప్రార్థించినట్లుగానీ, వినాయకుడే పిల్లవాని రూపంలో తనకు కనిపించాడని గానీ రావణాసురునికి తెలయదు.

సంధ్యావందనానికి వెళ్ళిన రావణుడు 48 ని||ల కాలంవరకు రాలేదు. పనిపూర్తి చేసుకొని తిరిగివస్తున్న రావణుని చూడగానే ఆ పిల్లవాడు ” రావణా ! ఈ లింగాన్ని ఇంక మోయలేను ” అని గట్టిగా అరుస్తూ ఆ ఆత్మలింగాన్ని నేలపై పెట్టివేశాడు. పరుగు పరుగున వచ్చిన రావణుడు ఎంత ప్రయత్నించినా ఆ లింగంపైకి రాలేదు సరికదా అతని శరీరమంతా గాయాలయ్యాయి. అపుడు శివుడు ప్రత్యక్షమై అతని గాయాలను మానపి ఇక ఆ లింగం కదలదని కనుక రావణసురునే ప్రతిరోజు వచ్చి ఆ లింగాన్ని సేవించుకోవలసినదిగాను ఉపదేశించి అదృశ్యమయ్యాడు.

రావణాసురునికి వైద్యం చేసి గాయాలను మానపినందువల్ల స్వామికి వైద్యనాథుడని పేరు వచ్చింది. ఈ సందర్భంగా రావణాసురుడు చేసిన శివతాండవ స్తోత్రం ఎంతో పేరు పొందింది.
భీమశంకర లింగం :

సహ్య పర్వతం యొక్క శిఖరాలలో ఒకదాని పేరు డాకిని. ఆ కొండపై భాగంలో పరమశివుడు ” భీమశంకర జ్యోతిర్లింగంగా వెలిశాడు. భీమానది ఇక్కడే పుట్టింది. అది పుట్టినచోట శివలింగం ప్రక్కభాగం నుంచి కొద్ది కొద్దిగా ప్రవహిస్తుంటుంది. భీమశంకరుడు శాకిని, డాకిని మొదలైన రాక్షస సమూహాలతో సేవించబడుతూ ఉన్నాడని పురాణవచనం.

యాత్రా మార్గం:

బొంబాయి దగ్గరలోని పూనావరకు రైలులో వెళ్ళి పూనాలో బస్సు ఎక్కి 75 కి.మీ. ప్రయాణం చేసి ”డాకినీ భీమ శంకరం” క్షేత్రాన్ని చేరాలి. యాత్రికులకు వసతులు అంతగా లేని యీ క్షేత్రానికి పూనా నుండి ప్రతిరోజు ఐదారు బస్సులు వస్తాయి. ఆలయం చుట్టూ అరణ్యం దట్టంగా ఉంటుంది. లోయలో నిర్మించబడిన ఈ ఆలయానికి ప్రక్కనే ఉన్న కోనేరులో స్నానం చేసి భీమశంకరుని సేవించవచ్చు.

పురాణ గాథ:
పూర్వం భీముడనే పేరుగల రాక్షసుడు తన తల్లియైన కర్కటితో ఈ పర్వత శిఖరం మీద నివసిస్తూ ఉండేవాడు. వాడు ఒకనాడు తల్లిని ”అమ్మా నా తండ్రి ఎవరు ?” ఎక్కడున్నాడు? నీవు ఈ కొండమీద ఒంటరిగా ఉండటానికి కారణం ఏమిటి ” అని ప్రశ్నించాడు. అప్పుడు కర్కటి కుమారునితో “నాయనా లంకా రాజ్యానికి ప్రభువైన రావణాసురుని తమ్ముడైన కుంభకర్ణుడు మీ తండ్రి, పరాక్రమవంతులైన నీ తండ్రిని, పెదతండ్రిని దుర్మార్గుడైన శ్రీరాముడు సంహరించాడు. నా తండ్రి కర్కటుడు, తల్లి పుష్కసి. నా మొదటి భర్త విరాధుడు. అతనిని కూడా ఒకప్పుడు శ్రీరాముడే సంహరించాడు.

ఒకనాడు నా తల్లిదండ్రులు అగస్త్యమహర్షి శిష్యుడైన సుతీక్ష్ణుడు అనేవాడిని తినబోయారు. తపస్సంపన్నుడైన వాడు కోపంతో నా తల్లిదండ్రులను భస్మం చేశాడు. నేను దిక్కులేని దానినై బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నాను. అప్పుడు ఒకనాడు ఇక్కడికి వచ్చిన కుంభకర్ణుడు నన్ను బలవంతంగా చేపట్టాడు. ఆ విధంగా నీవు జన్మించావు. నీ తండ్రి మహావీరుడు కనుక తండ్రిని మించిన కొడుకువై నీ వంశానికి పేరు తీసుకొనిరా” అని చెప్పింది.

తల్లిమాటలు విన్న భీముడు కోపంతో వణికిపోయాడు. తన వంశాన్ని నాశనం చేసిన విష్ణుమూర్తినీ, ఆయన భక్తులనూ సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్నాడు. దేవతలను, మహర్షులను మట్టుపెట్టాలని పట్టుపట్టాడు. బ్రహ్మదేవుని గురించి వేయి సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశాడు. అప్పుడు బ్రహ్మప్రత్యక్షమై ఆ రాక్షసునికి అంతులేని పరాక్రమాన్ని , అనంతమైన దైర్యాన్ని వరంగా ప్రసాదించాడు.

వరగర్వంతో భీమాసురుడు దేవలోకం మీదికి దండెత్తి దేవేంద్రుని ఓడించి దేవలోకాన్ని ఆక్రమించుకొన్నాడు. ఆ తరువాత భూలోకమంతా తిరిగి సాధువులైన భక్తులను మహార్షులను బాధించాడు.

ఆ కాలంలో కామరూప దేశాన్ని సుదక్షిణుడు అనే రాజు పరిపాలిస్తూండేవాడు. ఆయన గొప్ప శివభక్తుడు. అఖండమైన తపస్సంపన్నుడు. భీమాసురుడు అతనిపై దండెత్తి అతనిని కారాగారంలో బంధించాడు. శివభక్తుడైన సుదక్షిణుడు కారాగారంలోనే మట్టితో ఒక లింగాన్ని చేసి పూజిస్తూ నిరంతరం శివపంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉన్నాడు. ఒకరోజు భీమాసురుడు ఆ రాజును సమీపించి “ఓరీ బుద్ధిమాలినవాడా ఈ జపము లేమిటి? ఈ శివపూజలేమిటి ? ఇకపై ఈ పిచ్చిపనులు మాను ” అని గర్జించాడు. అయినా ఆ రాజు ఇవి ఏమీ పట్టించుకోకుండా శివపూజలో నిమగ్నమైపోయాడు. రాక్షసుడికి వళ్ళు మండింది పళ్ళు పటపట కొరకుతూ కత్తిని తీసి ” మూర్ఖుడా ఏమి మాట్లాడవు ! నిన్నే !” అని అరిచాడు. రాజు నెమ్మదిగా కళ్ళు తెరచి “రాక్షసరాజా మనకు కనిపించే చరాచర జగత్తుకంతటికి పరమశివుడే ప్రభువు. అతడే ఈ ప్రపంచానికి కర్త. భరించేది అతడే, హరించేది అతడే. నేనా జగత్పత్తిని సేవిస్తూన్నాను. నీ గర్జనలు, గాండ్రింపులు నన్ను ఏమీ చేయలేవు” అన్నాడు. అంతటితో భీముడు మరింత … మండిపడుతూ వికటాట్టహాసంతో కత్తిని ఝుళిపిస్తూ “ఈ లోకానికి వీడేనా కర్త ? వీడేనా రక్షించేది ? ఇప్పుడు ఈ లింగాన్ని నా కత్తితో ముక్కలు ముక్కలు చేస్తాను. తనను తాను రక్షించుకోమను” అంటూ కత్తినెత్తి శివలింగాన్ని నరకబోయాడు. అంతలో శివలింగం నుండి శివుడు ఆవిర్భవించి, ఆ రాక్షసుని భస్మం చేశాడు. సుదక్షిణుడు భక్తిపారవశ్యంతో శివుని పాదాలపై పడి నమస్కరించి ఎన్నో విధాలుగా స్తుతించాడు. పరమశివుని కరుణాకటాక్షం వలన లోకాలకు భీమాసురుని పీడ విరగడయ్యింది. ఇంద్రుడు మొదలైన దేవతలంతా తమ తమ స్థానాలను అలంకరించారు. అప్పటినుండి మునులంతా నిరాటంకంగా తపస్సు చేసుకోవటం ప్రారంభించారు. సుదక్షిణుడు తన రాజ్యాన్ని పొంది ఎప్పటివలెనే పరిపాలించసాగాడు. నారదుడు మొదలైనవారి కోరికమేరకు జ్యోతిర్లింగరూపిగా అక్కడే నెలకొన్న పరమశివుడు భీమశంకరునిగా భక్తుల పూజలందుకొన్నాడు.
రామేశ్వరలింగం:

రామేశ్వర జ్యోతిర్లింగం దక్షిణ సముద్రతీరంలో ఉంది. ఈ క్షేత్రం యొక్క గొప్పతనాన్ని గురించి స్కాందపురాణం ఎంతగానో వర్ణించింది. ఈ జ్యోతిర్లింగం శ్రీరామచంద్రుని చేతులమీదుగా ప్రతిష్టించబడింది. రామేశ్వరస్వామి దేవాలయం 1000 అడుగుల పొడవు, 650 అడుగుల వెడల్పు, 150 అడుగుల ఎత్తు కలిగి అనంతమైన శిల్పకళతో అలరారుతోంది. ఈ క్షేత్రంలో నందీశ్వరుడు, వెండి రథము, బంగారు గోపురాలు చూడవలసినవి. ఆలయం చుట్టూ 1200 స్తంభాలతో కూడిన ప్రదక్షిణ మండపం భక్తులను ఆకట్టుకుంటుంది. ఈ ఆలయంలో 23 తీర్ధాలు ఉన్నాయి. కాగా సముద్రాన్ని 24వ తీర్థమైన అగ్ని తీర్థముగా చెబుతారు. ఉత్తర భారతం నుండి వచ్చే యాత్రికులు గంగాజలన్ని తెచ్చి రామలింగేశ్వరునికి అభిషేకిస్తారు. మన దక్షిణాదివారు రామేశ్వరంలో సముద్రమునందలి ఇసుకను సేకరించి కాశీలో గంగానదిలో కలుపుతారు. ఈ పుణ్యకార్యం త్రేతాయుగంలో శ్రీరామచంద్రుని నుండి నేటివరకు కొనసాగుతూనే వుంది.

యాత్రామార్గం:
విజయవాడ నుంచి మద్రాసు వెళ్ళి, మద్రాసు ఎగ్మోర్ స్టేషన్ నుంచి రామేశ్వరానికి నేరుగా రైలులో వెళ్ళవచ్చు. గంగా, కావేరి ఎక్స్‌ప్రెస్ కాశీ – రామేశ్వరం మధ్య మద్రాసు మీదుగా నడుస్తోంది. ఒకప్పుడు బస్సులో ప్రయాణించి వెళ్ళిన యాత్రికులు పాంబన్ వరకు వెళ్ళి అక్కడి నుండి 34 కి.మీ. రైలులో సముద్రం మీదుగా ప్రయాణించి రామేశ్వరం చేరేవారు. ప్రస్తుతం బస్సులో ప్రయాణించేవారు కూడా నేరుగా రామేశ్వరాన్ని చేరటానికి వీలుగా ఇటీవల సముద్రంపై వంతెనను నిర్మించారు.

పురాణగాథ:
త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు రావణాసురుని సంహరించిన తరువాత సీతతో కలసి సపరివారంగా పుష్పక విమానంపై సముద్రాన్ని దాటి గంధమాదన పర్వతానికి వచ్చాడు. అక్కడ మునులంతా శ్రీరామచంద్రుని చూచి పులస్త్యబ్రహ్మ కొడుకైన రావణాసురుని చంపటంవలన బ్రహ్మహత్యాపాపం సంభవించిందని, కనుక ఆ పాపపరిహారార్థం ఆ ప్రదేశంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించవలసినదిగాను చెప్పారు.

శ్రీరాముడు శివలింగమును తీసుకొనిరమ్మని హనుమంతుని కైలాసానికి పంపాడు. ఆంజనేయుడు శివలింగమును తెచ్చునంతలో శుభముహూర్తం సమీపించినందువల్ల ఋషుల ఆజ్ఞప్రకారం సీతాదేవి చేతులతో అక్కడ ఇసుకను పోగు చేయించి శివలింగమును సిద్ధంచేసి యథావిధిగా శ్రీరాముడు ప్రతిష్ఠించాడు. ప్రతిష్ఠ పూర్తి అయ్యే సమయానికి హనుమంతుడు శివలింగంతో వచ్చి జరిగిన విషయాన్ని తెలుసుకొని చాలా బాధపడ్డాడు. తన పాదాలపై పడి వెక్కి వెక్కి ఏడుస్తున్న హనుమంతుని శ్రీరాముడు పైకి లేవనెత్తి బుజ్జగిస్తూ జరిగినదానికి కారణాన్ని చెప్పాడు.

శ్రీరాముని మాటలు హనుమంతునికి తృప్తిని కలిగించలేదు. అప్పుడు శ్రీరాముడు ఒక నవ్వు నవ్వి “ఆంజనేయా శుభముహూర్తం మించినదని కదా ప్రతిష్ఠ జరిపితిమి. నీకు ఇష్టం లేనిచో ఆ లింగమును పెకలించి వేయుము. తరువాత నీవు తెచ్చిన లింగమునే అక్కడ ప్రతిష్టించుదము” అన్నాడు. హనుమంతుడు పట్టరాని సంతోషముతో కుప్పిగంతువేసి, ముందుకు దూకి, శివలింగాన్ని పెకిలించాలని ప్రయత్నించాడు. గొప్ప బలసంపన్నుడైన వాయుపుత్రుడు ఎంత ప్రయత్నించినా శివలింగం కదలలేదు. పొడవాటి తన తోకను లింగం చుట్టూ చుట్టి బలవంతంగా ఒక్క గుంజు గుంజాడు. ఆవగింజంతైన ఉపయోగం లేకపోగా ఆ ఊపుకు హనుమంతుడు ఎగిరి క్రిందపడి మూర్చపోయాడు. సీత భయపడింది. శ్రీరాముని బ్రతిమాలింది. రాముడు తన చల్లని చేతులతో హనుమంతుని శరిరాన్ని తాకి మూర్చను పోగొట్టి,తన వడిలోనికి చేరదీశాడు. కన్నీరు తుడిచి బుజ్జగిస్తూ “నాయనా శాస్త్రోక్తముగా స్వామిని ప్రతిష్ఠించాం కదా! ఇప్పుడు ఈ శివలింగాన్ని ప్రపంచంలోని ఏ శక్తీ కదిలించలేదు” అని ఓదార్చి హనుమంతుడు తెచ్చిన శివలింగాన్ని ఆ దగ్గరలోనే శాస్త్రోక్తంగా ప్రతిష్ఠ చయించి హనుమంతుని తృప్తిపరచాడు. రామునిచే ప్రతిష్ఠించబడిన లింగం రామేశ్వరునిగాను, హనుమంతుడు తీసుకొనివచ్చిన శివలింగం హనుమదీశ్వరునిగాను ప్రసిద్ధి పొంది పూజలను అందుకొంటున్నాయి.
నాగేశ్వరలింగం:

నాగేశ్వర జ్యోతిర్లింగం. దారుకావనంలో గోమతికీ అరేబియా సముద్రానికి సంగమ స్థానంలో వుంది. ఒకప్పుడు శ్రీకృష్ణుని నివాసస్థానమైన ద్వారకా నగరం ఈ దారుకావనంలోనిదే.

యాత్రామార్గం:
గుజరాత్ రాష్ట్రంలోని ఈ క్షేత్రానికి వెళ్ళాలంటే బొంబాయినుండి అహ్మదాబాద్, సోమనాథ్, జూనాగఢ్ మీదుగా ద్వారాకచేరి అక్కడ నుండి 22 కి.మీ దూరంలో ఉన్న నాగేశ్వరాలయానికి సముద్ర ప్రయాణం చేసి దారుకావనంలో దిగి ‘గోపీ తలాబ్’ వెళ్ళే బస్సులో నాగ్‌నాథ్ వద్ద దిగాలి.

జ్యోతిర్లింగ క్షేత్రమైన సోమనాథ క్షేత్రమునుండి 7 గంటల కాలం బస్సులో ప్రయాణించి ద్వారకను చేరుకోవచ్చు.ద్వారకలో యాత్రికులకు వసతి సౌకర్యాలు బాగానే ఉన్నాయి. నాగ్‌నాథ్, ద్వారకకు 22 కి.మీ దూరం కాగా భేట్ ద్వారక 32 కి.మీ 12 జ్యోతిర్లింగ క్షేత్రాలలో నాగ్‌నాథ్ ఆలయమే అతి చిన్నది.

మహారాష్ట్రులు గుజరాత్‌లోని దీనిని జ్యోతిర్లింగముగా కాక పర్లి, వైద్యనాథ్ సమీపంలోని ఔండా నాగనాథ్‌ను క్షేత్రముగా భావిస్తారు.

పురాణగాథ:
పుర్వం దారుకుడు అనే పేరుగల రాక్షసుడు ఉండేవాడు. అతని భార్య దారుక ఆ రాక్షస దంపతులు మానవులను బాధిస్తూ, మహర్షుల యజ్ఞయాగాదులను నాశనం చేస్తూ పశ్చిమ సముద్ర తీరంలో 1000 యోజనాల పొడవు 1000 యోజనాల వెడల్పుగల వనాన్ని సొంతం చేసుకొని విలాసంగా విహరించసాగారు. వారిచే బాధింపబడే సాధువులందరు ఔర్వమహర్షి దగ్గరకు వెళ్ళి తమ బాధలను చెప్పుకున్నారు. వానిని రక్షించాలని భావించిన ఔర్వ మహర్షి “నిరపరాధులైన భూమిమీది ప్రజలను హింసించిన యెడల ఆ రాక్షసులు మరుక్షణమే మరణించెదరుగాక” అని శపించాడు.

ఆ విషయం తెలిసిన దారుకుడు ఆ వనాన్నంతటిని పైకెత్తి సముద్రం మధ్యలో స్థాపించుకున్నాడు. మహర్షి తన శాపంలో “భూమిమీద ప్రజలు” అన్నందువల్ల ఆ రాక్షస దంపతులు భూమిపై ఉన్న ప్రజల జోలికి పోకుండా సముద్రంలో ప్రయాణించేవారిని సంహరిస్తూ నిర్భయంగా కాలం గడపసాగారు.


విశ్వేశ్వరలింగం

విశ్వేశ్వర జ్యోతిర్లింగం పురాణ ప్రసిద్ధమైన కాశీనగరంలో ఉన్నది. కాశీక్షేత్రానికి వారణాసి, వారణాసి, మహాశ్మశానం,ఆనందకాననం, అవిముక్తం, రుద్రావాసం, ముక్తిభూమి, శివపురి, క్షేత్రపురి,కాశిక మొదలైన పేర్లున్నాయి. “వరణ” “అసి” అనే రెండు నదులు రెండు ప్రక్కల ఈ క్షేత్రానికి ప్రవహించటం వల్ల దీనికి వారణాసి అనే పేరు వచ్చినట్లు కనబడుతుంది.

మోక్షదాయకమైన ఏడు క్షేత్రాలలో కాశీ ప్రసిద్ధి పొందింది. వేదాలలోను పురాణాలలోను కాశీక్షేత్రం యొక్క మహిమ గొప్పగా వర్ణించబడింది. స్కాంద  పురాణంలోని కాశీఖండం ఈ క్షేత్రాన్ని గురించిన అసంఖ్యాకమైన వివరాలను తెలియజేస్తోంది.

ప్రళయ కాలంలో పరమేశ్వరుడు కాశీనగరాన్ని, తన త్రిశూలంమీద నిలబెట్టాడని చెబుతారు. “కాశ్యాంతు మరణాన్ముక్తిః” అనే సూక్తివలన ఈక్షేత్రంలో మరణిస్తే ముక్తి తప్పక లభిస్తుందని తెలుస్తోంది. ఈ క్షేత్రంలో మరణించిన వారికి కాశీ విశ్వనాథుడు కుడిచెవిలో తారకమంత్రాన్ని ఉపదేశిస్తాడని పూరాణాలు చెబుతున్నాయి.

“ఎప్పుడు కాశీకి వెళతానో! ఎప్పుడు విశ్వనాథుని సేవిస్తానో!” అని మనస్సులో పదే పదే తపన పడేవారికి కాశీలో నివసించినంత పుణ్యఫలం లభిస్తుందని.

    కదా కాశీం గమిష్యామి కదా డ్రక్ష్యామి శంకరం |
    ఇతి ఋవాణస్సతతం కాశీవాసఫలం లభేత్ ||

అనే పురాణవచనం చెబుతోంది.

యాత్రామార్గం:
దేశంలోని అన్ని ప్రధాన నగరాలనుంచీ కాశీ క్షేత్రానికి వెళ్ళటానికి రైలు సదుపాయాలున్నాయి. విజయవాడ నుంచి ఈ క్షేత్రం వెళ్ళేవారు కాజీపేట నాగపూర్, ఇటార్సీ, అలహాబాద్ మీదుగా వెళ్ళవలసి ఉంటుంది.

పురాణగాథ:
చిత్‌స్వరూపుడైన పరమశివుడు ఈ ప్రపంచాన్ని సృష్టించాలని అనుకున్నప్పుడు సగుణ రూపములో శివ స్వరూపుడుగా ఆవిర్భవించాడు. స్త్రీ పురుష రూపాలలో ప్రకటీకృతమైన ఆ పరబ్రహ్మమే శక్తిగాను, శివుడుగాను రూపొందారు. ఆ శివశక్తులు ప్రకృతి, పురుషులను సృష్టించారు. ప్రకృతి, పురుషుడు ఇరువురూ తమ తల్లిదండ్రులను తెలుసుకోలేక విచారిస్తున్నారు. అదే సమయంలో నిర్గుణ పరబ్రహ్మ అయిన పరమశివుడు అక్కడ ప్రత్యక్షమై “మీరిద్దరూ తపస్సు చేయండి బ్రహ్మాండాన్ని సృష్టించండి ” అని చెప్పాడు.

“ప్రభూ తపస్సు చేయటానికి అనువైన స్థానం ఏది ” అని ప్రశ్నించారు ప్రకృతి పురుషులు. అప్పుడు పరమశివుడు ఐదు కోసుల పరిమితి గల ఒక సుందరమైన నగరాన్ని వారికి నిర్మించి ఇచ్చాడు. ఆ మహానగరం ఆ పురుషునికి దగ్గరలో ఆకాశంలో నిలబడింది. ఆ నగరమే కాశీక్షేత్రం. పురుషుడే శ్రీమహావిష్ణువు.

విష్ణుదేవుడు కాశీనగరం నుండి సృష్టి చేయాలని సంకల్పించి చాలా సంవత్సరాలపాటు తపస్సు చేశాడు. ఆ సమయములో అలసిపోయిన ఆయన శరీరం నుండి అసంఖ్యాకమైన స్వేదజలధారలు ప్రవహించి విశాలమైన ఆకాశంలో వ్యాపించాయి. ఆ విచిత్రమైన దృశ్యాన్ని చూచి విష్ణువు ఆశ్చర్యంతో శిరస్సును కంపించాడు. అప్పుడీతని కుడిచెవి నుండి ఆభరణం (మణిభూషణం) జారిపడింది. అది పడిన ప్రదేశమే “మణికర్ణిక” అనే మహాతీర్థమయ్యింది. మహత్తరమైన ఆ జలరాశిలో కాశీనగరం మునిగిపోవటం మొదలయ్యింది. అప్పుడు పరమశివుడు కాశీపట్టణాన్ని తన త్రిశూలంపై ధరించాడు. మహావిష్ణువు తన భార్య అయిన ప్రకృతితో అక్కడ నిద్రించాడు. అప్పుడు ఆయన నాభినుంచి చతుర్ముఖబ్రహ్మ ఆవిర్భవించాడు. ఆయన శివాజ్ఞను పొంది బ్రహ్మాండాన్ని సృష్టించాడు. ఆ సందర్భంలో మహావిష్ణువు అణువుకంటే చిన్న, బ్రహ్మాండంకంటే పెద్ద అయిన పరమాత్మ స్వరూపుడగు పరమశివుని ఎన్నో విధాల స్తుతించాడు.

శ్రీమన్నారాయణుని సోత్రానికి పరమశివుడు సంతుష్టుడై, బ్రహ్మ, విష్ణు మొదలైనవారి ప్రార్థనను మన్నించి విశ్వేశ్వర జ్యోతిర్లింగంగా వారణాసిలో కొలువుతీరాడు.

త్ర్యంబకేశ్వరలింగం:

నాసిక్ మండలంలోని సహ్య పర్వతశిఖరం మీద వెలసియున్న త్ర్యంబకేశ్వర జ్యోతిర్లింగం ప్రపంచ ప్రఖ్యాతి గాంచినది. ఆ పరిసరాలలోనే పంచవటి ఉన్నది. లక్ష్మణుడు, శూర్పణఖకు ముక్కు, చెవులు కోసిన ప్రదేశమే పంచవటి. రావణాసురుడు సీతను అపహరించినది కూడా ఈ ప్రదేశంలోనే. ఇక్కడికి కొద్దిదూరంలో ఉన్న బ్రహ్మగిరి మీద గోదావరి నది పుట్టింది.

భక్తుల పాపాలను పోగొట్టుటలో ఉత్తర భారతదేశంలోని  గంగానది ఎలా ప్రసిద్ది గాంచినదో దక్షిణ భారతదేశంలోని గోదావరినది అంతటి ప్రసిద్ధిగాంచినది. గంగానది అవతరించటానికి భగీరథుని తపశ్శక్తి కారణం కాగా, గోదావరినది ఆవిర్భవించడానికి గౌతమమహర్షి త్యాగఫలం కారణమయ్యింది. అందువల్లనే గంగానదికి ‘భాగీరథి ‘ అని ప్రేరువచ్చినట్లు గోదావరికి ‘గౌతమి’ అని పేరు వచ్చింది.

గోదావరి, గౌతమ మునీంద్రుల ప్రార్థనవల్ల భక్తవత్సలుడైన శివుడు త్ర్యంబకేశ్వర రూపంలో ఇక్కడ వెలసియున్నాడు. ఈ ఆలయంలో మూడు చిన్న చిన్న లింగాకృతులు ఉన్నాయి. వాటిని బ్రహ్మ, విష్ణు, శివాత్మకమైన వాటిగా భక్తులు భావిస్త్తారు.

యాత్రామార్గం: మహారాష్ట్రలో ఉన్న ఈ జ్యోతిర్లింగాన్ని చూడటానికి బొంబాయి నగరం నుండి నాసిక్ వరకు 184 కి.మీ.లు రైలులో ప్రయాణించి అక్కడి నుండి 30 కి.మీ. బస్సులో ప్రయాణించి ఈ క్షేత్రాన్ని చేరవచ్చు.

పురాణగాథ:
గౌతముడు తపస్సంపన్నుడైన మహర్షి. ఆయన ధర్మపత్ని అహల్యాదేవి. బ్రహ్మగిరి శిఖరంమీద గౌతముడు అహల్యతో కలసి 1000 సం||రాలు కఠోరమైన తపస్సు చేశాడు. ఇది ఇలా ఉండగా ఒకప్పుడు అనావృష్ఠి కారణంగా దేశం నాలుగు మూలలా కరువుకాటకాలు వచ్చాయి. త్రాగటానికి నీరుకానీ, తినటానికి తిండిగానీ లేక ప్రజలు మలమలా మాడిపోయారు. పశువులకు గడ్డిలేక ఒక్కొక్కటి అంతరించి పోయాయి. చెట్టు చేమలు ఎండిపోయాయి. నేలబీటలు వారింది. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రపంచమంతా పాడుపడినట్లు అయింది.

దేశంలోని ఆ పరిస్థితి గౌతముని మనస్సును కదిలించివేసింది. కరుణామయుడైన గౌతముడు, వరుణదేవుని గురించి ఆరునెలలు తపస్సు చేశాడు. వరుణుడు ప్రత్యక్షమై “మహర్షీ నీ తపస్సుకు కారణం గ్రహించాను. నీవు చిన్న సరస్సు ఒకటి నిర్మించుకో, నేను దానిని నిండుగా అయ్యేలా చేస్తాను. అందులోని నీటిని ఎంతవాడినా తరగక అక్షయమై ఉంటుంది. అది అని చెప్పి అంతర్థానమయ్యాడు.

గౌతముడు సరస్సును నిర్మించాడు. వరుణదేవుని అనుగ్రహం వలన అది అక్షయ జలంతో నిండిపోయింది. గౌతముడు ఆ నీటితో తన నిత్యకృత్యాలు నెరవేర్చుకుంటూ జపహోమాలు, పూజలు మొదలైనవి యథావిధిగా చేసుకొంటున్నాడు. ఈ సరోవరంలోని నీటివల్ల పరిసర ప్రాంతమంతా చెట్లు చిగిర్చి పచ్చపడింది. పశువులకు, పక్షులకు సుఖజీవితం లభించింది. ఆ సరసున చుట్టూ ఒక చక్కని తపోవనం తయ్యారయ్యింది.

ఎక్కడెక్కడి ఋషులు అక్కడికి వచ్చి చేరారు. మునులంగా గౌతమాశ్రమం చుట్టూ వర్ణశాలలను నిర్మించుకొని కాలం సుఖంగా గడపసాగారు .

ఇది ఎలా ఉండగా ఒకరోజు ఋషుల భార్యలు గౌతముని భార్య అయిన అహల్యాదేవితో కారణం లేకుండానే తగాదాపడ్డారు. అంతటితో ఆగక తమ భర్తలను గౌతమునిపైకి పురికొల్పారు. విశ్వాసం లేని ఆ ఋషులు గౌతముని మీదికి కయ్యానికి కాలుదువ్వారు. చివరకు గౌతమునికి హాని తలపెట్టారు. అయినా ఋషుల దూషణలనుగానీ రోషంతో కూడిన తీవ్రపదజాలాన్ని గానీ గౌతముడు లెక్కపెట్టక సహనంతో ఉన్నాడు. అతని సహనం. వారి కోపాన్నీ వేయింతలు చేసింది. చివరకు చెడ్డవారైన ఆ ఋషులు గౌతముని పంటపొలాలలోనికి తోలరు. ఆవు పంటను పాడుచేయుట చూచి గౌతముడు ఒక గడ్డిపరకతో ఆవును అదలించాడు. ఆ గడ్డిపరక ఆవును తాకునంతనే ఆ ఆవు గిరగిర తిరిగి నెలపై కొరిగి మరణించింది.ఇదంగా ఋషులు చేసిన కుట్ర అని గౌతముడు ఊహించలేదు.

ఆవు నేలపై పడినే వెంటనే సమయం కోసం వేచి చూస్తున్న ఆ ఋషులందరూ పరుగు పరుగున గౌతముని వద్దకు వచ్చి గోహత్య చేసినందుకు గౌతమ మహర్షిని రకరకాలుగా నిందించారు. అహంకారం వల్ల కళ్ళు మూసుకుపోతున్నాయా! అని నిలదీశారు. అంతేకాక తక్షణమే ఆ వనాన్ని వదలి వెళ్ళిపోవలసినదని శాసించారు. ధర్మమూర్తి అయిన గౌతముడు చేసేదిలేక భార్యతో కలసి ఆశ్రమాన్ని వదలి కొంతదూరం వెళ్ళి అక్కడ ఒక కుటీరాన్ని నిర్మించుకొన్నాడు.

మునులంతా అహంకారంతో గౌతముని కుటీరానికి వెళ్ళి “ఓయీ గౌతమా నీతలపై గోహత్యా పాతకం తాండవిస్తోంది. నీ ముఖం చూస్తేనే పంచ మహాపాపాలు అంటుకుంటాయి. నీ దర్శనంవల్ల అష్టకష్టాలు సంప్రాప్తిస్తాయి. నీవు మాకు దగ్గరలో ఉన్నందువల్ల మేము చేసే యజ్ఞయాగాదులకు దేవతలు హాజరుకావటంలేదు. హోమంలో వేసే పదార్థలు దేవతలకు కానీ పితృదేవతలకు కానీ చెందటంలేదు. అందువల్ల ఇక్కడ ఉండే అర్హత నీకులేదు. నీ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకో ” అని గర్జించారు.

గౌతముడు “మునులతో నా పాపానికి ప్రాయశ్చిత్తం కూడా మీరే చెప్పండి.” అన్నాడు.

అప్పుడు ఋషులు గౌతముని చూచి “నీవు మూడుసార్లు భూప్రదక్షిణం చేసిరావాలి. ఒక నెలకాలం ఏ విధమైన ఆహారం తీసుకోకుండా తపోదీక్ష సాగించాలి. ఈ బ్రహ్మగిరి చుట్టూ 101సార్లు తిరిగి రావాలి. ఇక్కడకు గంగను తీసుకొనిరావాలి. ఆ నీటితో కోటీ శివలింగాలకు అభిషేకం చేసి పూజించాలి. తరువాత 100 బిందెల నీటితో శివుని అభిషేకించాలి. అప్పటికి గానీ నీ గోహత్యాపాతకం తీరదు.” అని కఠోరంగా పలికారు.

గౌతముడు ఋషుల ఆదేశాన్ని శిరసా వహించాడు. వాళ్ళు చెప్పిన పనులన్నీ కొనసాగించాడు. భార్యతో కలసి బ్రహ్మగిరిపైన పార్ధివలింగాకారములో ఉన్న పరమశివుని భక్తితో పూజించాడు.

గౌతముని ధర్మాసక్తికి, దైవభక్తికి, సహనానికి శివుడు సంతోషించి ప్రమథగణంతో సహా ప్రత్యాక్షమై గౌతమునితో “నీ భక్తికి మెచ్చాను. నీ కోరిక తీర్చటనికే వచ్చాను. కావలసిన వరం ఏమిటి కోరుకో.” అన్నాడు.

గౌతముడు ఆనందంతో ప్రభూ నీ దర్శనం వలన నా జన్మ తరించినది. నాకు ఇంకేమీ వద్దు” అని శివుని పాదాలు పట్టుకోని ప్రార్థించాడు.

శివుడు “నీవు మునులలో శ్రేష్ఠవు. నీ తోడి ఋషులు నీ గొప్పతనాన్ని సహించలేక అజ్ఞానముతో నిన్ను హింసించారు. వారిని క్షమించు. ” అన్నాడు .

అందుకు గౌతముడు “స్వామీ వారు నాకు చాలా ఉపకారం చేశారు. లేకుంటే మీ దర్శనభాగ్యం నాకు కలిగేది కాదుగదా” అన్నాడు.

గౌతముని శాంత స్వభావానికి పరమశివుడు సంతోషించి “గౌతమా ఇదిగో నీ కోరికను అనుసరించి గంగను ప్రసాదిస్తున్నాను. ఈ గంగ గౌతమి అనే పేరుతో నీ కీర్తిప్రవాహంలాగా ప్రవహిస్తుంది. నేను త్ర్యంబకేశ్వర జ్యోతిర్లింగ రూపంతో ఈ గౌతమి తీరంలో ఉండి నీవంటి భక్తులను అనుగ్రహిస్తాను.” అని అంతర్ధనమయ్యాడు.

ఋషులంతా గౌతముని పాదాలపై పడి క్షమించమని వేడుకున్నారు. దేవతలంతా సంతోషించారు. అప్పటి నుండి గంగ “గౌతమి” పేరుతో ప్రవహిస్తూ భూమిని పవిత్రం చేస్తోంది. శివుడు త్ర్యంబకేశ్వర రూపంతో ఆ తీరంలో విరాజిల్లుతున్నాడు.
కేదారేశ్వర లింగం

హిమాలయాలలోని కేదార శిఖరంపై విరాజిల్లే జ్యోతిర్లింగమే కేదారనాథ లింగం. కేదార శిఖరానికి పడమటి వైపున ‘మందాకిని’, తూర్పువైపున అలకనంద ప్రవహిస్తున్నాయి. మందానికి ఒడ్డున కేదారనాథస్వామి, అలంకనంద ఒడ్డున బదరీనారాయణ స్వామి వెలసియున్నారు. అలకనందా, మందాకిని నదులు ‘రుద్రప్రయాగ’లో కలసి కొంతదూరం ప్రవహించి ‘దేవప్రయాగ’ దగ్గర ‘భాగీరథి’లో కలుస్తున్నాయి. అందువల్ల గంగా స్నానముచేసే భక్తులు కేదారనాథ, బదరీనాథ్‌ల చరణ కమలాల నుండి వచ్చిన నీటిలో మునుగుతున్నట్లుగా భావించి పులకించిపోతారు. స్కాందపురాణంలోని కేదారఖండం ఈ కేదారేశ్వర జ్యోతిర్లింగం మహిమను గొప్పగా వర్ణించింది. ఏ భక్తుడైన కేదారనాథుని దర్శించకుండా బదరీయాత్ర చేసినట్లుయితే వాని యాత్ర నిష్ఫలమని పై పురాణం చెబుతోంది.

కేదారనాథుని దర్శించటానికి బయలుదేరిన ప్రాణి మార్గమధ్యంలో మరణించినా స్వామిని దర్శించిన పుణ్యం తప్పక లభిస్తుందని పురాణలు చెబుతున్నాయి.

కేదారనాథక్షేత్రం హరిద్వారమునకు 240 కి.మీ.లు., ఋషి కేశమునకు 211 కి.మీ.లు. 12 జ్యోతిర్లింగాలలో అత్యంత ఉన్నతమైనది కేదారనాథ్. ఇది సముద్ర మట్టానికి సుమారు 16,000 అడుగుల ఎత్తులో వుంది. 12 జ్యోతిర్లింగాలలో అతిపెద్దది కూడా ఇదే. పర్వతశిఖరమే జ్యోతిర్లింగము కనుక దీనికి పానుపట్టంలేదు. గర్భగృహాన్ని లింగాకారములో ఉన్న పర్వత శిఖరము ఆక్రమించివున్నదని చెప్పటంకంటే జ్యోతిర్లింగ రూపమైన పర్వత శిఖరం చుట్టూ ఆలయం నిర్మించబడిందని చెప్పటం బాగుంటుందేమో. ఈ జ్యోతిర్లింగంలో కైలాసపర్వతం యొక్క సూక్ష్మరూపం గోచరిస్తుంది.

కేదారనాథ్ యాత్రలో శివశక్తి స్పష్టంగా కనపడుతుంది.

యాత్రామార్గం:
ఉత్తరప్రదేశ్‌లోని ఈ క్షేత్రానికి వెళ్ళాలంటే విజయవాడ నుండి నేరుగా ఢిల్లీ వెళ్ళి అక్కడ నుండి ఋషికేశ్ దాకా రైలులో ప్రయాణించి అక్కడ నుండి 280 కి.మీ బస్సులో వెళ్ళి గుప్తకాశీని దాటి గౌరీకుండాన్ని చేరాలి. అక్కడే గౌరీదేవి ఆలయం ఉంది. అక్కడే మంచుకొండల మధ్య నిరంతరం ఒక నీటిబుగ్గలో నుండి వేడినీరు వస్తూ ఉంటుంది. అదే గౌరీకుండం. అక్కడే పార్వతీదేవి తపస్సు చేసింది. ఆమె సౌకర్యం కోసమే తండ్రి అయిన హిమవంతుడు ఆ తపోభూమిని ఏర్పాటు చేశాడు. అదే నేడు భక్తులకు సౌకర్యంగా వుంది. ప్రకృతిలోని విచిత్రాలలో యీ వేడినీటిబుగ్గ ఒకటి.

గౌరీకుండం నుంచి భక్తులు తప్పనిసరిగా కాలినడకనగానీ, డోలీలలో గానీ, పొట్టి గుఱ్ఱాలపై గానీ 14 కి.మీ.లు ప్రయాణించి కేదరనాథ్‌ను చేరాలి. గుఱ్ఱపుస్వారికి సుమారు 200 రూ.లు, డోలీకి 350 రూ.లు తీసుకుంటారు. ఉదయం బయలుదేరితే కేదరానాథ్ దర్శనము చేసుకొని సాయంత్రానికి గౌరీకుండానికి తిరిగి రావచ్చు.

రాత్రిపూట కేదరానాథ్‌లోని ఉండాలనుకొన్న యాత్రికులకు “కాలీకంబ్లీ వాలాసత్రం” “భారత్ సాధూసమాజ్” వారి యాత్రా నివాసం, టూరిస్ట్ బంగ్లా మొదలైనవి వసతిని కల్పిస్తున్నాయి. కేదారేశ్వర వాతావరణం చాలా మనోహరంగా ఉంటుంది. కానీ తరుచు హఠాత్తుగా మబ్బులు కమ్మి వడగండ్లతో వాన పడుతుంది.

పురాణగాథ:
నరనారాయణులు గొప్ప తపస్సంపన్నులు. వారిద్దరూ విష్ణుమూర్తి యొక్క అవతారములు. ఆ మహర్షులు బదరికాశ్రమంలో చాలా సంవత్సరాలు తపస్సు చేసి జగత్తుకు మేలు కలగాలన్న కోరికతో కేదార శిఖరంపై శివుని ఆరాధించటం మొదలుపెట్టారు.

వారిద్దరూ ప్రతిరోజు ప్రభాత కాలంలో మందాకినిలో స్నానం చేసి ఈశ్వరుని పార్థింప లింగములను నిర్మించుకొని భక్తితో పూజ చేసేవారు. మందాకిని నీటితోనూ పవిత్రమైన బిల్వప్రతితోనూ చక్కగా వికసించిన తామర పువ్వులతోనూ వారిద్దరూ ప్రతిరోజు మిక్కిలి శ్రద్ధతో శివుని పూజించేవాళ్ళు.

ఇలా కొంతకాలం గడిచాక పరమశివునికి నరనారాయణులపై కరుణ కలిగి వారికి సాక్షాత్కరించాడు. అప్పుడు వారిద్దరు శివునికి సాష్టాంగ నమస్కారములు చేసి ఏంతగానో స్తుతించారు. ప్రసన్నుడైన శివుడు వారిని వరం కోరుకోమన్నాడు. అప్పుడు వారిద్దరు చేతులు జోడించి “మృత్యుంజయా ! జగత్ కళ్యాణం కోసం మేము నిన్ను ఆరాధించాము. నీవు మమ్ము అనుగ్రహించావు. ఇక ముందుకాలములో కూడా నిన్ను ఇక్కడ సేవించినవారికి కోరికలు నెరవేరుస్తూ ఈ శిఖరం మీదనే ‘కేదారేశ్వరుడు’ అనే పేరుతో నిలిచివుండు. నిన్ను దర్శించి స్తుతించిన భక్తులు తరిస్తారు. ఇదే మా కోరిక”  అని ప్రార్థించారు. పరమశివుడు వారి కోరికను మన్నించి కేదారనాథ్ జ్యోతిర్లింగ రూపంలో అక్కడే ప్రకాశిస్తున్నాడు.

ఈ స్వామిని కృతయుగంలో నరనరాయణులు, త్రేతాయుగంలో ఉపమన్యు మహర్షి, ద్వాపర యుగంలో పాండవులు పూజించి ధన్యులయ్యారు. కేదారనాథ్ దేవాలయంలో పాండవులు శిలావిగ్రహాలను మనం చూస్తాం.

ఘృష్ణేశ్వరలింగం

దక్షిణ భారతదేశంలోని జ్యోతిర్లింగాలలో ఒకటైన ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు సమిపంలో వుంది. దౌలతాబాద్‌కు 4 కి.మీ. దూరంలోని ఎల్లోరాలో ఉన్న ఈ జ్యోతిర్లింగం “స్పర్శవేది లింగం”. సంతానం లేనివారు ఈ స్వామిని సేవించి సంతానాన్ని పొందుతారు. ఇతిహాస కాలంలో ‘విశాల’ దేశంగా ప్రసిద్ది చెందిన ఆ ప్రాంతానికి అదే ముక్తికేద్రం.

యాత్రామార్గం:
ఈ క్షేత్రానికి చేరటానికి ఔరంగాబాద్ నుండి నేరుగా బస్సులు ఉన్నాయి. స్థానికులచే “వెరూలా”గా పిలువబడే ఈ క్షేత్రం ఔరంగాబాదుకు 8 కి.మీ.లు ఇది చిన్నగ్రామం అయినందువల్ల యాత్రికుల వసతికి ఏర్పాట్లు అంతగా లేవు. అందువల్ల యాత్రికుల ఔరంగాబాద్‌లోనే విశ్రాంతి తీసుకుంటారు.

పురాణగాథ:
పూర్వం దేవగిరి అనే పట్టణంలో సుధర్ముడు, సుదేహ అనే బ్రాహ్మణ దంపతులుండేవారు. వారిద్దరు ధర్మ కార్యాలలో ఆసక్తి కలిగి వైదిక విధులను నిర్వర్తిస్తూ శివభక్తులై ఉండేవారు. వారికి సకల సంపదలు ఉన్నప్పటికి సంతానం లేనందువల్ల ఎన్నో నోములు నోచి తీర్థయాత్రలు చేసి అప్పతికీ ఫలితం లేనందువల్ల తమ వంశాన్ని ఎలా నిలుపుకోవాలా అని ఆలోచించసాగారు.

ఒకనాడు సుదేహ తన భర్తతో సంతానం కోసం తన చెల్లెలు అయిన ఘృశ్మలను వివాహం చేసుకొనవలసినదిగా వత్తిడి చేసింది. భార్య కోరికమేరకు సుధర్ముడు చివరకు ఘృశ్మలను పెళ్ళిచేసుకొన్నాడు. శివానుగ్రహం వలన ఘృశ్మలకు చక్కని కుమారుడు పుట్టాడు. వారు ముగ్గురు పిల్లవానిపై మమకారాన్ని పెంచుకుటూ ఎంతో గారాబంతో విద్యాబుద్దలు చెప్పించారు.

శివభక్తురాలైన ఘృశ్మల తన వివాహం అయినప్పటినుంచి ప్రతిరోజూ 1001 పార్థివ లింగాలకు పూజచేసి అనంతరం వాటిని ఇంటికి దూరంగా ఉన్న ఒక చెరువులో వేసివచ్చిన తరువాతనే భోజనం చేసేది. తమ కుటుంబానికి మంచి జరగటం కోసం ఆమె చేస్తున్న పూజలవల్లనే తనకు పుత్రసంతానం కలిగిందని ఆమె విశ్వసించేది.

ఇదిలా వుండగా ఘృశ్మల కొడుకు పెరిగి పెద్దవాడయ్యాడు. సుధర్ముడు మంచి సంస్కారం, చక్కని రూపంగల ఒకామెను తీసుకొని వచ్చి ఆమెతో తన కుమారునికి వివాహం జరిపించాడు.

సుధర్ముడి పెద్ద భార్య సుదేహ తన చెల్లెలి వివాహం అయినప్పట్టి నుండి చుట్టు ప్రక్కల ప్రజలు ఆమెకు యిస్తున్న గౌరనాన్ని, ఆమెకు పుత్రుడు కలిగిన తరువాత ప్రజలు ఆమెకు మరింత గౌరవాన్ని యివ్వడాన్ని ఓర్చుకోలేకపోయింది. కొడుకు, కోడలుతో ఘృశ్మల ఎంత ఆనందంగా ఉన్న విషయం సుదేహకు మరీ భాదను కలిగించింది.ఎలాగైనా ఆ ఆనందాన్ని కాలరాయాలని అనుకొంది. అసూయా ద్వేషాలతో కుళ్ళిపోతున్న ఆమె మనస్సుకు ఘృశ్మల కొడుకును చంపేయాలనిపించింది. ఒకనాటి రాత్రి అందరూ నిద్రిస్తుండగా కొడుకు తలనరికి యింటికి దూరంగా ఉన్న చెరువులో వేసి ఏమీ తెలియనిదానిలా వచ్చి నిద్రకు ఉపక్రమించింది. భర్త మొండెం నుంచి ప్రవహించిన రక్తం తన శరిరానికి తాకగానే కోడలు నిద్రలేచి భర్త తలనరికి ఉండటం చూసి పెద్దగా ఏడుస్తూ అత్తమామలకు చెప్పబోయింది. శివపంచాక్షరీ జపంలో నిమగ్నమై ఉన్న సుదర్ముడు ఏమీ గమనించే స్థితిలో లేదు. ఘృశ్మల ఆనాటి లింగార్చనలో లీనమై ఉంది.

కోడలి ఏడుపులు విని కళ్ళు తెరచిన ఘృశ్మల కొడలితో “అమ్మా నేటితో కోటింగార్చన పూర్తి అయ్యింది. శివుడు మనకు సాక్షాత్కరించునున్నాడు. అందువల్ల యీ శుభసమయంలో నీకు పతివియోగం కాని, నాకు పుత్రశోకం గాని ఉండదు నా కుమారుడు ఎలా మరణించాడో అలాగే తిరిగి జీవిస్తాడు” అంటూ పూజలో నిమగ్నమయ్యింది.

కోడలికి ఏం చేయాలో దిక్కుతోచలేదు.

పూజ పూర్తి అయిన వెంటనే ఘృశ్మల లింగాలను తీసుకొని వెళ్ళి చెరువులో వేసింది.

వెంటనే శివుడు ప్రత్యక్షమై “నీ కోటి లింగార్చనకు, శివపూజలో నీ ఏకాగ్రతకూ మెచ్చాను. వరం కోరుకో.” అన్నాడు.

అందుకు ఘృశ్మల “స్వామీ నా కోడలు పతి వియోగం విలవిలలాడుతోంది. ఆమెకు పతిబిక్ష పెట్టు. నీవు ప్రత్యక్షమైన ఈ ప్రదేశంలోనే జ్యోతిర్లింగ రూపునివై ఘృశ్మేశ్వరునిగా ప్రజల సేవలనందుకొంటూ నిన్ను సేవించినవారికి సంతాన నష్టంగాని అకాల మరణంగాని లేకుండా కాపాడు.” అని కోరింది.

‘తథాస్తు’ అన్నాడు శివుడు.

ఇప్పుడున్న ఘృష్ణేశ్వరలింగానికి దగ్గరలో చెరువులో కోటిలింగాలున్నాయి.