Sunday, 11 March 2018

అనంతగిరి


ఆహ్లాదసిరి... అనంతగిరి

తెల్లారితే చాలు ఉరుకులు పరుగులు. గంటల కొద్దీ ట్రాఫిక్‌ తిప్పలు.. ఆఫీసులో సమస్యలు.. ఇంట్లో ఇబ్బందులు.. మానసిక బాధలు.. ఇవన్నీ వదిలి ప్రశాంతంగా ఎక్కడికైనా వెళ్లాలనే కోరిక. వామ్మో ఖర్చులకు భయపడి విరమణ. అయినా ఏదో పోగట్టుకుంటున్నామనే వేదన. కాస్త సేదతీరి మనసుని ఆహ్లాదపరుచుకోవాలనే ఆలోచన. ఇది సగటు మనిషి తపన.. వాస్తవమే... యాంత్రిక జీవనానికి అలవాటు పడ్డ ప్రజలకు విశ్రాంతి కావాలంటే ఏదైనా టూర్‌కు వెళ్లాలి మరి. అది ఎక్కడో దూరాన ఉన్న ఊటి, కోడైకెనాల్‌, వైజాగ్‌, అరకు వెళ్తేనే దొరుకుతుందనేది పాత మాట. ఇప్పుడు సహజ సిద్ధమైన ప్రకృతి అందాలతో మనల్ని కనువిందు చేసే ప్రాంతం హైదరాబాద్‌కు అతి దగ్గర్లోనే ఉందన్న సంగతి చాలా మందికి తెలియదు. అంతగా ప్రచారంలోకీ రాలేదు కానీ ఇటీవల ఈ ప్రాంతం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. అక్కడి చెట్ల కొమ్మల గలగలలు, పక్షుల కిలకిల రావాలు, రయిమనిపించే రహదారులు, దూరం నుంచే హత్తుకునే కొండలు, ఉట్టిపడేలా కనిపించే సేలయేటిధారలు.. పురి విప్పిన నెమళ్ల నాట్యాలు, రమ్మని పిలిచేలా రాతి కట్టడాలు,సేద తీర్చుకొమ్మనే గుహలు ప్రకృతి ప్రేమికుల మనసును నిలువునా దోచేస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అక్కడ ఉదయించే బాలభానుని, అస్తమించే సూర్యచంద్రుని వాడియైన కిరణాలతో ఆ ప్రాంతం మనల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తోంది. అవును అక్కడికెళ్తే మనసుకెంతో హాయి.. కుటుంబానికెంతో జారు.. కాస్త ఆధ్యాత్మికం.. ఇంకాస్త ఆహ్లాదం.. ఈ రెండింటి కలయికే అనంతగిరి ప్రత్యేకం.. హైదరాబాద్‌కి సుమారు 70 కిలో మీటర్ల దూరంలో మనల్ని కనువిందు చేస్తూ తెలంగాణ ఊటీగా పేరుగాంచిన పర్యాటక కేంద్రం అనంతగిరి గురించి.

రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌ నుంచి కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనంతగిరి క్షేత్రంగా, పర్యాటక కేంద్రంగా విలసిల్లుతోంది. 3,763 ఎకరాల 15 గుంటల విస్తీర్ణంలో విస్తరించిన ఈ అడవి అందాలతో అబ్బుర పరుస్తోంది. ప్రకృతి రమణీయత ఉట్టిపడేలా ఉన్న ఈ ప్రాంతంలోని కొండలు, అడవి అందాల మధ్య అనంత పద్మనాభస్వామి ఆలయం అందరినీ ఆకర్షిస్తోంది. ప్రకృతి ఒడిలో సేద తీరాలనుకునే వాళ్లు ఇక్కడికి వస్తే శరీరం ఉత్తేజకరంగా మారుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎత్తయిన కొండలు, పచ్చటి హరిత వనాలు, ఇరుకైన లోయలు, అలరించే మయూరాలు, స్వచ్ఛమైన గాలి, సహజ సిద్ధంగా ఏర్పడిన మంచినీటి బుగ్గలు ఇలా ఎన్నో ప్రకృతి అందాలు మనకు ఇక్కడ కనిపిస్తాయి. కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం గురించి మనం వినే ఉంటాం. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అనంతగిరినే చెప్పుకోవచ్చు. ఈ క్షేత్రానికి పురాణ ప్రసిద్ధి కూడా ఉంది. విష్ణు పురాణంలో ఈ క్షేత్రం ప్రస్తావన ఉంది. ఆలయ సమీపంలో ప్రాచీనమైన గుండాలు ఉంటాయి. కొన్ని చోట్ల గుహలూ కనిపిస్తాయి. ఇందులో మహర్షులు తపస్సు చేసుకునేవారని చెబుతారు. మహావృక్షాలతో నిండిన దట్టమైన అనంతగిరి అభయారణ్యంలోని ఈ ఆలయం ఉంది. సహజసిద్ధంగా ఏర్పడిన రాతి గుహల్లో స్వామి రూపం చూపరులను ఆకట్టుకుంటోంది. ఆలయానికి కిలోమీటరున్నర దూరంలో బుగ్గరామ లింగేశ్వర ఆలయం ఉంది. అక్కడ అందమైన జలపాతాన్ని చూసేందుకు ప్రత్యేకంగా వర్షాకాలంలో సందర్శకులు వస్తుంటారు. ఇంకో విషయేమంటే తాండూరు వాసులు ఈ అడవిని దాటుకుంటూ వారి గ్రామాలకు వెళ్తుంటారు. అడవిని అభివృద్ధి చేసేందుకు ఈ ప్రాంతంలోనే 10 ఎకరాల్లో రీ ప్లాంటేషన్‌ కింద యూకలిప్టస్‌ చెట్లను ప్రభుత్వం పెంచుతోంది. అనంతగిరి కొండల పైన వ్యూ పాయింట్‌ ఒకటి ఉంది. అక్కడి నుంచి చూస్తే దగ్గర గ్రామాలతో పాటు చుట్టూ ప్రాంతం ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. 50 ఏళ్ల క్రితం ఉన్న అనంతగిరికి ఇప్పుడు చాలా వ్యత్యాసం ఉంది. ఒకప్పుడు రాజీవ్‌ నగర్‌కాలనీ సమీపంలోని రెండు రోడ్ల వద్దనే అడవి జంతువులు దర్శనమిచ్చేవి. జన సంచారం కూడా ఎక్కువగా ఉండేది కాదు. ఒక్కరు వెళ్లలేని పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుతం అలాంటిది లేదు. జనం తాకిడి ఎక్కువైంది. అడవిలో అణువణువు తిరిగే వీలుంది. అందుకే ప్రస్తుతం జంతువులు ఎక్కువగా కనిపించడం లేదు. ప్రస్తుతం సుమారు 100 రకాల పక్షులు ఉన్నాయి. నెమలి, అడవి పంది, కొన్ని రకాల పాములు, కుందేళ్లు మాత్రమే ఉన్నాయి. అటవీశాఖ ఆధ్వర్యంలో జింకలను పెంచుతున్నారు. అనంతగిరిలో ఏడాదిలో రెండు పర్యాయాలు జాతర జరుగుతుంది. కార్తీక మాసంలో 11 రోజుల పాటు పెద్ద ఎత్తున జాతర నిర్వహిస్తారు. ఆషాఢమాసంలో 5 రోజుల పాటు జరుగుతుంది. ఈ జాతరకు జిల్లా ప్రజలతో పాటు, హైదరాబాద్‌, మెదక్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల నుంచి పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తారు. వారాంతాలలో సుదూర ప్రాంతాల నుంచి కుటుంబ సభ్యులతో వచ్చి అందమైన ప్రకృతి మధ్య ఆనందగా గడపడానికి అనువైన ప్రాంతమిది.

ఇక్కడి పద్మనాభ ఆలయ చరిత్ర దాదాపు 1300 సంవత్సరాల నాటిది. ఈ ప్రాంతమంతా అప్పట్లో దట్టమైన అడవి. స్థలపురాణం కథనాల ప్రకారం అలనాడు కొండలతో ఉన్న ఈ ప్రాంతంలో మహర్షులు తపస్సు చేసుకునేవారు. ముచుకుందుడనే మహర్షి రాక్షసులతో అనేక సంవత్సరాలు యుద్ధం చేసి వారిని ఓడించాడు. స్వర్గ లోకాధిపతి అయిన దేవేంద్రుడిని కీర్తించి, భూలోకంలో తనకు అలసట తీర్చుకోవడానికి సుఖంగా నిద్రించడానికి కావాల్సిన అహ్లాదకరమైన ప్రశాంత స్థలాన్ని చూపాల్సిందిగా, అంతే కాకుండా తన నిద్రను భంగం చేసినవారు తన తీక్షణమైన చూపులతో భస్మమయ్యేలా వరమివ్వాలని కోరాడు. దేవేంద్రుడు అనంతగిరి గుహలను చూపించగా ఓ గుహను నివాసంగా చేసుకుని ముచుకుందుడు నిద్రపోయాడు. ముచుకుందుడి చేత శ్రీకృష్ణుడి పాదాలు కడిగిన జలమే జీవనది అయి నేడు ముచుకుందానదిగా ప్రసిద్ధి చెందిందన్న కథనం ప్రచారంలో ఉంది. కాలక్రమేణా మూసీనదిగా మారింది. ఇక్కడ పుట్టిన మూసీ నది హైదరాబాద్‌ మీదుగా నల్ల గొండ జిల్లా వాడపల్లి వద్ద కృష్ణానదిలో కలుస్తోంది. అనంతగిరికే మకుటాయమానంగా కనిపించే పద్మనాభ స్వామి ఆలయం దిగువ భాగంలోని ఓ నీటి బుగ్గ నుంచి ముచికుందా నది ప్రవహిస్తోంది. కృష్ణుడు ముచికుందునకు 'అనంత పద్మనాభస్వామి' రూపంలో దర్శనమివ్వడం వల్ల ఈ ఆలయానికి అనంత పద్మనాభ క్షేత్రంగా పేరు వచ్చిందని స్థల పురాణం చెబుతోంది. ఈ ఆలయం పక్కనే భవనానిశిని అని పిలిచే భగీరథగుండం ఉంది. ఇందులో స్నానం చేస్తే ఆయురారోగ్యాలతో పాటు కోరిన కోర్కెలు నెరవేరుతాయని నమ్మకం జనాల్లో వుంది.

ఆకర్షణీయం..పర్యాటక భవనం..

పర్యాటకుల తాకిడిని పరిశీలించిన అప్పుడున్న వైఎస్‌ ప్రభుత్వం పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే భవనాన్ని నిర్మించింది. రిసెప్షన్‌ రెస్టారెంట్‌ పేరుతో ఉన్న ఈ భవనంలో వెజ్‌, నాన్‌ వెజ్‌తో పాటు ఇతర ఆహార పదార్థాలు లభిస్తాయి. తందూరి రోటీని ఇక్కడ బాగా ఇష్టపడుతారు. చిన్నారుల కోసం ఈతకొలను, రెస్టారెంట్‌, పిల్లలు ఆడుకునేందుకు ఆట వస్తువులున్నాయి. సెమినార్‌ హాల్‌ అందుబాటులో ఉంది. ఇక్కడ సమావేశాలు జరుపుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ఇతర దేశాల్లో మాదిరిగా ఏకోటూరిజం, జంగిల్‌ పార్కు తదితర పర్యాటక అభివృద్ధి పనులు చేయాల్సి ఉంది. ప్రభుత్వ నిధులు మంజూరైనా పనులు ముందుకు సాగడం లేదు.

సినిమా షూటింగ్‌లకు విడిది...
అనంతగిరిలో సినిమా షూటింగ్‌లు బాగా జరుగుతుంటాయి. అందమైన రోడ్డు మలుపులు, రోడ్డుకిరువైపులా అల్లుకున్న వృక్షాలు, కోనేరు దగ్గర ఆహ్లాదకరమైన వాతావరణం ఉండటంతో దర్శకులు చిత్రీకరించేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. సినీ తారలు, కథానాయకులు, దర్శక, నిర్మాతలు హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న మంచి ప్రదేశమని ఆసక్తి చూపుతున్నారు. ఈ ప్రాంతాన్ని ఎంచుకుని సినిమాల్లోని సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. అడ్డా, లైఫ్‌ఈజ్‌బ్యూటిఫుల్‌, అరుంధతి, నువ్వునేను, అదుర్స్‌ సినిమాలతో పాటు మంచి పేరున్న హీరోల సినిమాలు ఇక్కడ చిత్రీకరించారు. ఎన్‌టిఆర్‌ కాలం నుంచి నేటి ఆయన మనువడి వరకు ఈ ప్రాంతం సుపరి చితమని చెప్పొచ్చు. పద్మనాభ స్వామి ఆలయం కింది భాగాన ఉన్న మెట్లు చాలా ఆకర్షించే విధంగా ఉంటాయి. చుట్టూ అడవి విస్తరించి అందమైన చెట్లతో ఆకర్షిస్తుంటే ఔరా అనిపిస్తుంది. ఇక్కడున్న కొలను ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. చాలా మంది విహారయాత్రకు వచ్చి ఇక్కడ ఆనందంగా గడుపుతారు. వారి వెంట తెచ్చుకున్న తినుబండారాలు ఇక్కడే తింటుంటారు. ఇక్కడే నువ్వు నేను సినిమాలోని 'నువ్వే నాకు ప్రాణం.. నేనే నీకు లోకం'అనే పాటను చిత్రీకరించారు.

ప్రకృతి ఒడిలో... క్షయ చికిత్సాలయం
అనంతగిరిలోని గాలికి వెలకట్టలేని విలువ ఉంది. అదే తరహాలో ప్రకృతి ఒడిలో క్షయ వైద్య శాల ఒదిగి ఉంది. ఇక్కడి పర్యవరణానికి పరవశించి నైజాం నవాబులు వారి కాలంలోనే క్షయ చికిత్సాలయాన్ని నిర్మించారు. ఈ గాలి పీల్చుకుంటే ఉన్న రోగాలు నయమవుతాయని నమ్మకం. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్షయ చికిత్సాలయ పరిధి తగ్గించి పర్యాటక రంగానికి ప్రాధాన్యతనిస్తోంది. మంచిదే కానీ క్షయ చికిత్సాలయంలో రోగులను చేర్చుకోవడం తగ్గించింది. అందుకే ఇక్కడ పనిచేసే ఉద్యోగుల కంటే రోగులు తక్కువగానే ఉంటారు. 3 వందలకు పైగా ఉద్యోగులు విధులు నిర్వహిస్తుండగా రోగులు మాత్రం 30 నుంచి 40 మంది మాత్రమే ఉన్నారు. అనంతగిరి క్షయ చికిత్సాలయం స్థానంలో ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ఏర్పాటు చేస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని భావించిన ఈ ప్రాంత ప్రజలకు నిరాశే ఉంది. ప్రభుత్వం మెడికల్‌ కళాశాలకు ప్రయ త్నం చేయకుండా ఎర్రగడ్డలో ఉన్న మానసిక, చాతి ఆసుపత్రిని ఇక్కడకు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే క్షయ ఆసుపత్రి మరమ్మతులు శరవేగంగా జరుపుతోంది. స్థానికులు మాత్రం పర్యాటకంగా అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. గతంలో నిమ్స్‌ ఆసుపత్రి అధికారులు, కలెక్టర్‌, ప్రభుత్వ ఉన్నతాధికారులు అనంతగిరిని, క్షయ హాస్పిటల్‌ను సందర్శించి వైద్య కళాశాల ఏర్పాటుకు అవసరమైన సౌకర్యాలను ఆరాతీశారు. ఇక్కడున్న పరిస్థితులపై ఓ నివేదిక తయారుచేసి ప్రభుత్వానికి అందజేశారు. ఇక్కడ ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్‌ వస్తోంది. కళాశాల ఏర్పాటైతే వికారాబాద్‌ అనే కంటే అనంతగిరి ఎక్కువ ప్రచారంలో ఉండే అవకాశం ఉంది. దీనికి తోడు అనంతగిరి జిల్లా కేంద్రంగా పెట్టాలన్న ప్రతిపాదనలూ బలంగానే వినిపిస్తున్నాయి.

అనంతగిరికి ఇలా వెళ్లాలి..
హైదరాబాద్‌ మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌ నుండి ప్రతి అరగంటకు వికారాబాద్‌ వెళ్లే బస్సులుంటాయి. వాటితో పాటు తాండూరు, కర్ణాటక వెళ్లే సర్వీసులు సైతం అక్కడి నుంచే వెళ్తాయి. రైలు సదుపాయం ఉన్న వాళ్లు వికారాబాద్‌కు రైళ్లో రావచ్చు. ముంబై వెళ్లే ప్రతి రైలు ఈ స్టేషన్‌లో ఆగుతుంది. బస్టాండ్‌, రైెల్వే స్టేషన్‌ పక్కపక్కనే ఉంటాయి. అక్కడి నుంచి అనంతగిరి 6 కిలోమీటర్లు ఉంటుంది. ఆటోలు, జీపుల్లో లేదంటే తాండూరు ధారుర్‌ వెళ్లే లోకల్‌ బస్సుల్లో వెళ్లొచ్చు. లేదంటే ప్రత్యేకంగా బైకులు, వాహనాల్లో వెళ్తే ఆనందంగా, సౌకర్యంగానూ ఉంటుంది. వికారాబాద్‌ నుంచి అనంతగిరికి వెళ్తుంటే రోడ్డు పొడవునా ఇరువైపులా పచ్చని చెట్లతో అలరారుతుంది. అనంతగిరుల్లో శాంతిభద్రతల దృష్ట్యా పోలీస్‌ ఔట్‌పోస్టును ఏర్పాటు చేశారు. దీంతో పర్యాటకులు స్వేచ్ఛగా ఆనందంగా గడిపే అవకాశం లభించింది. పోలీసులు అడవిలో మొబైల్‌ వాహనంలో తిరుగుతుంటారు.

ఆహ్లాదకరం.. 'దామగుండం'...
అనంతగిరికి ముందు దామగుండం గురించి చెప్పుకోవాలి. చుట్టూరా చూడ ముచ్చటైన కొండలు, ఆహ్లాదకరమైన వాతవరణంలో కనువిందు చేసే దామగుండంలో రామలింగేశ్వర ఆలయం ఉంది. పర్యాటకుల తాకిడి బాగా ఉంటుంది. శని, ఆదివారాల్లో చాలా మంది విక్‌ఎండ్‌ ఎంజారు చేస్తుంటారు. వికారాబాద్‌ వెళ్లే దారిలో పూడూర్‌ ఎక్స్‌రోడ్‌, మండల కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. 400 ఏళ్ల చరిత్ర కలిగిన దామగుండం అభివృద్ధిలో పూర్‌ అనే చెప్పొచ్చు. బస్సు సౌకర్యం లేదు. మౌలిక వసతులు లేక పురాతన ఆలయనికి నిత్యం వచ్చే భక్తులు, పర్యాటకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. పర్యాటకులు ఎక్కువగా ద్విచక్రవాహనాలు, కార్లు, సుమోల్లో వస్తుంటారు. అక్కడ ఉగాది పర్వదినాల్లో జాతర మహోత్సవాలు నిర్వహిస్తారు. ఈ మహోత్సవాలకు వేల సంఖ్యలో భక్తులు విచ్చేసి కోనేటిలో స్నానాలు చేస్తారు. ఇక్కడ టీవీ సీరియల్స్‌ షూటింగ్‌లు కూడా జరుగుతుంటాయి. ఇక్కడి మర్రి చెట్లు, వాటి ఊడలతో చిన్నారులు ఆడుకుంటుంటారు. పర్యాటకులు ఫొటోలు కూడా దిగుతుంటారు. ఇక్కడ కొనేరు మండు వేసవిలో సైతం ఎన్నడూ ఎండిపోదు. దామగుండ ఆటవీ ప్రాంతంలో 2 వేల 900 వందల ఎకరాల్లో కేంద్ర నౌకదళానికి చెందిన సంబంధించిన ర్యాడర్‌ సిగల్‌ ఏర్పాటుకు స్థలం కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దామగుండ ఆలయనికి సంబంధించిన 42 ఎకరాల భూమిని సైతం నేవీలో పరిధిలోకి తీసుకుంటూ కేవలం ఆలయనికి 5 ఎకరాల భూమిని కేటాయిస్తున్నట్లు ఆధికారులు పత్రికల్లో ప్రకటన ఇచ్చారు. దీన్ని స్థానికులు, పర్యాటకులు తీవ్రంగా వ్యతిరేకించారు.


అనంతగిరి
ప్రకృతి అందాల సిరి

తరచి చూడాలే కానీ  మనకు దగ్గరరలోనే ఎన్నో సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి. అందులో ఒకటి అనంతగిరి. హైదరాబాద్‌కు 80 కిలోమీటర్ల దూరంలో వికారాబాద్‌కు కూతవేటులో ఉన్న అనంతగిరికి సాగే ప్రయాణం ఓ మధురానుభూతినిస్తుంది.

పసుపుపచ్చ లోగిలిలో ప్రకృతి అందాలు ఆరబోసినట్టు..!
ఊటీకి తీసిపోని కొండల్లో, కోనల్లో విహరించినట్టు...!
ఆకాశగంగే వచ్చి ఇక్కడ పారుతున్నట్టు...!
మునులు తపస్సు చేస్తున్నట్లు...!
దేవతలు కొలువుదీరినట్టు..!

గతమంతా పునరావృతమైనట్టు.. చారిత్రక కట్టడాలు, శిల్పకళా సంపద... ప్రకృతి అందాలు.. చరిత్రకు సజీవ సాక్షాలుగా నిలుస్తున్నాయి.

ఎన్నెన్నో అందాలను తన ఒడిలో నింపుకున్న అనంతగిరి రారమ్మని పిలుస్తోంది...

పిల్లగాలులు మేనును తాకుతుంటే... దారంతా ప్రకృతి అందాలు ఆహ్వానం పలుకుతుంటే మైమరిచిపోవాల్సిందే. కాలుష్యానికి దూరంగా, పచ్చని రమణీయత మధ్య ఉన్న అనంతగిరి ఆలయానికి చేరుకోగానే భారీ హనుమంతుడు, గరుత్మంతుడు భక్తులకు, పర్యాటకులకు దర్శనమిస్తారు! నిత్యం కాంక్రీట్ జంగిల్‌లో రణగొణ ధ్వనుల మధ్య నివసించేవారికి అక్కడికి చేరుకోగానే గొప్ప స్వాంతన చేకూరుతుంది. ఆలయ ముఖద్వారం, పరిసర ప్రాంతాలు పరవశింపచేస్తాయి. ఆధ్యాత్మిక చింతనకు చిగురులు తొడుగుతాయి. భక్తుల కొంగుబంగారంగా పిలుచుకొనే అనంతపద్మనాభుడి ఆలయంలో నిత్యం భక్తుల సందడి నెలకొంటుంది. ఇక్కడి ఆలయ ఆర్చకుల పూజావిధానం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఆలయ కిందిభాగంలో కోనేరు ఉంటుంది. మెట్ల ద్వారా ఆ దారి గుండా వెళ్తుంటే వానరసమూహాలు... నెమళ్లు తారసపడుతాయి. ఆ దృశ్యాలు వర్ణించలేనివి! దారికిరువైపులా మునులు తిరుగాడిన స్థలాలు.. మార్కండేయుడి తపోవనం దర్శనమిస్తాయి. ఆలయం నుంచి కొంతదూరం వెళ్లగానే పుష్కరిణి కనిపిస్తుంది.అక్కడ భక్తులు స్నానమాచరిస్తారు.

ప్రకృతి రమణీయత:
పుష్కరిణినే మూసీ అని కూడా పిలుస్తారు. పురాతన కాలం నాటి గుహలు... చారిత్రాత్మక, పురాతన కట్టడాలు చరిత్రకు సజీవ సాక్షంగా నిలుస్తాయనడానికి అనంతగిరి ఉదాహరణగా చెప్పుకోవచ్చు! పుష్కరిణి దాటగానే దట్టమైన అడవులు.. అందమైన లోకేషన్స్ ఇక్కడి ప్రకృతి రమణీయతకు అద్దం పడతాయి. ఇక్కడ పర్యాటకులు ఆనందంగా గడుపుతూ సేద తీరుతారు. భక్తుల అనంతమైన కోరికలు తీర్చే పేరుండటంతో అనంతపద్మనాభుడిగా పిలుచుకుంటారు. కర్ణాటక, మహార్రాష్ట వాసులకు ఈ ఆలయం ఇంటిదైవంగా విరాజిల్లుతోంది.

మూసీ పుట్టుక ఇక్కడే:

బలరామకృష్ణుల పాదాలు కడిగిన నీరే జీవనదిగా మారింది. కాలక్రమేణా దీనిని మూసీనది అని పిలవడం జరుగుతోంది. ఇది హైదరాబాద్, నల్లగొండ జిల్లాల మీదుగా ప్రవహించి కృష్ణానదిలో కలుస్తుంది. కృష్ణానదికి మూసీనది ఉపనది కావడంతో ఇది ప్రత్యేకత సంతరించుకుంది.

కనువిందు చేసే కోనేరు:
పద్మనాభుని ఆలయ ప్రాంగణంలో ఉన్న కోనేటిని భవనాశిని అని పిలుస్తున్నారు. భక్తుల పాపాలను హరించి, వారికి సత్ఫలితాలు ప్రసాదించడంతో ఈ కోనేటికి ఈ పేరు వచ్చిందని ఇక్కడివారు చెబుతుంటారు. ఈ కోనేటితో పాటు స్వామి వారి ఆలయ ప్రాంగణంలో 7 గుండాలు ఉన్నాయి. కాలక్రమేణా అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. పెళ్లికాని యువతీ యువకులు ఈ కోనేటిలో స్నానమాచరించి స్వామివారికి పూజలు చేసినట్లయితే కోరికలు ఫలిస్తాయని ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం.

మార్కండేయ గుహ:
పసివయస్సులో తనను యముడు అంతమొందిస్తాడని తెలిసిన మార్కండేయుడు శివసాక్షాత్కారంతో పూర్ణాయుష్కుడవుతాడు. అనంతరం మార్కండేయుడు అనంతగిరి కొండల్లో తపస్సుకు పూనుకొంటాడు. కలియుగ ప్రారంభంలో మార్కండేయుని భక్తికి మెచ్చిన మహా విష్ణువు అనంత పద్మనాభస్వామి అవతారంగా మార్కండేయునికి దర్శమిస్తాడు.

ఏటా రెండు జాతరలు:
భక్తుల కోరికలు తీర్చడంలో కొంగుబంగారంగా పేరొందిన అనంత పద్మనాభస్వామి జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలు ప్రతీ ఏడాదిలో రెండుమార్లు నిర్వహిస్తారు. కార్తీక మాసంలో కార్తీక శుద్ధ పౌర్ణమిన పెద్దజాతరను 15 రోజుల పాటు నిర్వహిస్తారు. ఆషాడ శుద్ధ ఏకాదశిన మూడు రోజుల పాటు చిన్నజాతర నిర్వహిస్తారు.

ఆలయ ప్రాశస్త్యం:
ఈ అనంత పద్మనాభ స్వామి ఆలయం అతి పురాతనమైంది. 13 వందల ఏళ్ల చరిత్ర ఈ ఆలయానికి ఉన్నట్టు తెలుస్తోంది. ప్రకృతి ఒడిలో వెలసిన అనంత పద్మనాభ స్వామి పేరు మీదుగానే ఈ కొండలను అనంతగిరి కొండలుగా పిలుస్తున్నారు. అనంతగిరి ప్రత్యేకత గురించి విష్ణు పురాణంలో పేర్కొనడం విశేషం.

సినిమా షూటింగ్ స్పాట్:
టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ నిర్మాతలు సైతం వికారాబాద్, అనంతగిరి కొండలను షూటింగ్‌లకు ఎంచుకుంటున్నారు. అనంతగిరి కొండలను, అక్కడే కొలువుదీరిన అనంతపద్మనాభ స్వామి ఆలయాన్ని చూసేందుకు పర్యాటకులే రావడం లేదు. టాలీవుడ్ టూ బాలీవుడ్ సినిమా షూటింగ్‌లకు ఇక్కడి ప్రాంతాలు అనువైనవని సినీ నిర్మాతలు, దర్శకులూ ఈ ప్రాంతం పట్ల ఆసక్తి చూపుతున్నారు.. హైదరాబాద్‌కు సమీపంలో ఉండటంతో సినీ ప్రముఖులు ఇక్కడి అందమైన లొకేషన్స్‌పై మక్కువ చూపుతున్నారు. తక్కువ ఖర్చుతో పాటు సహజత్వానికి వీలుండటమే ఇందుకు కారణం. దశాబ్దకాలంగా నిర్మితమైన సినిమాల్లో దాదాపు 60 శాతానికి పైగా ఇక్కడ షూటింగ్ చేసినవే కావడం విశేషం. మొదట్లో చిన్న సినిమాలకే పరిమితమైనా.. నేడు అగ్ర హీరోల షూటింగ్‌లు అనంతగిరి కొండల్లో జరుగుతున్నాయి. ఇక్కడికి వచ్చే పర్యాటకులకు విడిది, భోజన తదితర సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువస్తూ అన్ని హంగులతో కూడిన హరిత రిసార్ట్ కూడా ఉంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఆకర్షించేందుకు అన్నిరకాల సౌకర్యాలను కల్పించారు. టూరిజం రిసార్ట్ ఏర్పాటుతో సినీ పరిశ్రమ వాళ్లకు ఎంతో ఉపయుక్తంగా మారింది. అంజి, పౌర్ణమి, రెడీ, జయం వంటి ఎన్నో హిట్ సినిమాలు ఇక్కడ చిత్రీకరణ జరుపుకున్నాయి.

ఎన్నెన్నో అందాలు:
పక్షుల కిలకిల రావాలు... కుందేళ్ల పరుగులు... నెమళ్ల సోయగాలు.. పచ్చని పంటపొలాలతో కోట్‌పల్లి ప్రాజెక్టు కళకళలాడుతుంది. ప్రాజెక్టు పరిసర ప్రాంతాలు ఎంతో ఆహ్లాదాన్నిస్తాయి. నీటి అలలను ముద్దాడుతూ వచ్చే చల్లని గాలలు బరువెక్కిన శరీరాన్ని తేలికపరుస్తాయి. ఇక్కడికి వచ్చే పర్యాటకులు ప్రాజెక్టులో జలకాలడుతూ ఆనందంగా గడుపుతారు. వికారాబాద్‌కు 30 కిలోమీటర్ల పరిధిలో, పెద్దేముల్‌కు సమీపంలో ఉన్న కోట్‌పల్లి ప్రాజెక్టు హాలీడే స్పాట్‌గా మారుతోంది.

ఇప్పటికీ రహస్యమే:
భూమి నుంచి గంగ బుడగ రూపంలో రావడం వల్ల బుగ్గరామలింగేశ్వరాలయంగా పిలువబడుతుంది. శ్రావణమాసం, కార్తీకమాసం సందర్భంగా ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఇక్కడి కోనేటిలో నిత్యం జలం ప్రవహించడం విశేషం. ఆ జలం ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటికే అంతుపట్టని రహస్యమే!

సూర్యోదయం సరిగ్గా సాయంత్రం స్కూల్ బెల్ కొట్టినట్టు 4 మరియు 5 గంటల సమయమప్పుడు సూర్యాస్తమయ సమయం కావడం వల్ల సూర్యుని బంగారపు కిరణాలు పచ్చని ప్రకౄఎతి తో కలిసి అద్భుతమైన దౄఎశ్యంగా పర్యాటకులకి కనువిందు కలిగిస్తుంది. అలాగే ఇక్కడ ఉదయాన్నే సూర్యోదయం చూడటం ఒక మరుపురాని జ్ఞాపకం. ఈ ప్రాంతం పర్యాటకులకి రోజు వారీ బిజీ లైఫ్ స్టైల్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. అనంతగిరిలో అనంత పద్మనాభ స్వామి ఆలయం కలదు. వారాంతంలోని ఈ ఆలయం భక్తుల రాకతో కిటకిటలాడుతుంది.

సాహసికులకు ట్రెక్కింగ్:
మొదటి సారి ట్రెక్కింగ్ అనుభవాన్ని సొంతం చేసుకోవాలనుకునే వారికి అనువైన ప్రదేశం ఇది. ట్రెక్కింగ్‌లో అందమైన ప్రకృతి పర్యాటకుల మనస్సు దోచుకుంటుంది. అనంతగిరి ప్రాంతంలో ఎన్నో చిన్న చిన్న కొండలు ఉన్నాయి. ఇవి అన్నీ ట్రెక్కింగ్ లో సందర్శించే అవకాశం కలదు. అనంతగిరి మరీ దట్టమైన అడవి కాకపోవడం వల్ల అడవిలో దారి తప్పి పోయే అవకాశాలు తక్కువ. చాలా మంది ఈ ప్రాంతానికి ట్రెక్కింగ్ కోసమే ప్రత్యేకంగా వస్తారు. అయితే, అడవి లోపలకి వెళ్ళాలని అనుకునే వారు ఒక పెద్ద గ్రూప్‌గా వెళ్తే మంచిది. అడవిలో సాహసం చేయాలనుకునేవారికి అనంతగిరిలో ఎన్నో ట్రెక్కింగ్ మరియు కామ్పింగ్ అవకాశాలు కలవు. ఈ అటవీ ప్రాంతంలో రెండు ట్రెక్కింగ్ ట్రైల్స్ ఉన్నాయి. ఒకటి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ వద్ద మరొకటి ఈ ఆలయం నుండి అర కిలోమీటరు దూరం లో కెరెల్లి వద్ద ప్రారంభం అవుతుంది. అనంతగిరి హిల్స్‌లో ఉన్న కామ్పింగ్ సైట్‌ని 'డెక్కన్ హిల్స్' అని అంటారు. ఇక్కడ అటవీ ప్రాంతంలో విహారం చాలా బాగుంటుంది.

వీటితో పాటు, పర్యాటకులు ఇక్కడ 'రాక్ క్లైమ్బింగ్', 'బర్మా బ్రిడ్జి', 'స్పైడర్స్ వెబ్' మరియు టార్జాన్ స్వింగ్ వంటి ఎన్నో ఆక్టివిటీస్ లో పాల్గొని ఆనందించవచ్చు.

కోటిపల్లి రిజర్వాయర్:
నాగసముద్రం లేక్ లేదా కోటిపల్లి రిజర్వాయర్ అనంతగిరి హిల్స్ నుండి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో కోటిపల్లి రిజర్వాయర్ లేదా నాగసముద్రం లేక్ ఉంది. ఈ సరస్సు చాలా పెద్దది. వర్షాకాలంలో ఈ సరస్సు, నీళ్ళు సమృద్దిగా కలిగి ఉండటం వల్ల ఎంతో ఆకట్టుకుంటుంది.

రవాణా మార్గం అనంతగిరి హిల్స్ కి చేరే రోడ్డు మార్గం చక్కగా ఉండడం వల్ల 100 కిలోమీటర్ల ప్రయాణంలో అలసట అస్సలు తెలియదు. కేవలం రెండు గంటల సమయం లోనే ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. అదే సొంత వాహనం ద్వారా లేదా ప్రైవేటు ట్రావెలర్స్ వాహనాల చేరుకోవడం మరింత సౌకర్యం. పబ్లిక్ రవాణా సౌకర్యం అంతగా అందుబాటులో లేకపోవడం ఒక కారణం. ఆహారాన్ని ఇంటి నుండి తీసుకువెళ్ళడం మంచిది. ట్రెక్కింగ్ సమయంలో కూడా తినే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా, అనంతగిరి లోని భోజన సదుపాయాలు అంతంత మాత్రమే కావడం మరొక ముఖ్య విషయం. ఒక్క మాటలో అనంతగిరి గురించి చెప్పాలంటే ప్రకృతి ఒడిలో సేద దీరాలనుకునే వారికి హైదరాబాద్‌కి సమీపంలో ఉన్న అందమైన ప్రదేశం అని అనవచ్చు.
అనంతగిరి పద్మనాభ స్వామి
ఈ పద్మనాభుడు పవళించడు..!


భక్తుల పాలిట కొంగుబంగారంగా, సిరిగల స్వామిగా ప్రసిద్ధి చెందిన దైవం అనంత పద్మనాభుడు. ఇక్కడ స్వామి శేషతల్పంమీద పవళించినట్టుగా కాకుండా నిలబడిన భంగిమలో సాలగ్రామ శిలారూపంలో దర్శనమిస్తాడు.

మూసీ నది జన్మస్థానంగా, అనంత పద్మనాభుడి దివ్యధామంగా వికారాబాద్‌లోని అనంతగిరి విరాజిల్లుతోంది. అనంతానంత దేవేశ అనంత ఫలదాయక। అనంత దుఃఖ నాశాయ అనంతాయ నమో నమః।। అంటూ... అనంతమైన సిరిసంపదలు ఇచ్చే ఆ దేవదేవుడిని ధ్యానిస్తూ ఈ క్షేత్రానికి చేరుకుంటారు భక్తులు. అమితమైన భక్తితో స్వామిని దర్శించి పులకిస్తారు. అనంతగిరి కొండల్లో కొలువైన ఈ ఆలయ సందర్శనం ఎంతటి భక్తి భావాన్ని పెంపొందిస్తుందో, ప్రకృతి కాంతకు పచ్చనిచీర కట్టినట్లుండే ఇక్కడి మనోహర దృశ్యాలూ అంతటి మధురానుభూతిని కలిగిస్తాయి. అందుకే ఈ ప్రాంతాన్ని తెలంగాణ ఊటీగా పేర్కొంటారు.

స్థలపురాణం
సుమారు అయిదు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రాచీన వైష్ణవ పుణ్య క్షేత్రం అనంతగిరి పద్మనాభస్వామి దేవాలయం. విష్ణుపురాణం ప్రకారం... విష్ణుమూర్తి పాన్పు అయిన శేషుని తలభాగం తిరుమలగా, మధ్య భాగం అహోబిలంగా, తోకభాగం అనంతగిరిగా వెలుగొందుతోంది. ఇక్కడే సుమారు పద్నాలుగు వేల సంవత్సరాల పాటు మార్కండేయ మహర్షి తపస్సు చేసి శ్రీమహావిష్ణువు ఈ కొండల్లోనే కొలువై ఉండేటట్లుగా వరాన్ని పొందుతాడు. సాలగ్రామ శిలగా వెలసిన ఆ శ్రీహరిని మార్కండేయుడు కాశీ నుంచి గంగాజలం తీసుకువచ్చి అర్చించినట్లు స్థలపురాణం తెలియజేస్తోంది. కలియుగ ప్రారంభ సమయంలో మార్కండేయుడు పద్మనాభ స్వామిని ఇక్కడికి వచ్చినవారందరికీ గంగా స్నాన భాగ్యం కలిగేట్లుగా అనుగ్రహించమని ప్రార్థిస్తాడు. అప్పుడు స్వామి ఆనతి మేరకు గంగాదేవే స్వయంగా అనంతగిరి క్షేత్రానికి వచ్చి పుష్కరిణిగా మారిందట.

ముచుకుందే మూసీ...
రాజర్షి అయిన ముచుకుందుడు దేవేంద్రుడి కోరిక మేరకు సుమారు వెయ్యి సంవత్సరాల పాటు రాక్షసులతో పోరాడి, విజయం సాధిస్తాడు. దీనికి ప్రీతి చెందిన ఇంద్రుడు ఏదైనా వరం కోరుకోమని అడుగుతాడు. అప్పుడు ముచుకుందుడు ‘ఓ మహేంద్రా, సుదీర్ఘకాలం పాటు రాక్షసులతో పోరాడటం వల్ల నాకు నిద్ర కరవైంది. ఎలాంటి ఆటంకం కలగకుండా నిద్రపోయే అందమైన ప్రదేశాన్ని చూపించు. ఒక వేళ ఎవరైనా నాకు నిద్రా భంగం చేస్తే వారు వెంటనే భస్మమయ్యేటట్లు వరాన్ని అనుగ్రహించు.’ అంటాడు. అందుకు ఇంద్రుడు అనంతగిరి గుహల్లో నిద్రపొమ్మని సూచిస్తాడు. ఇదిలా ఉండగా బలరామకృష్ణులను అంతమొందించడానికి వస్తున్న యవనుడి నుంచి రక్షణ పొందడానికి అన్నదమ్ములిద్దరూ ముచుకుందుడు నిద్రిస్తున్న గుహలోకి వెళతారు. వీరిని అనుసరిస్తున్న కాలయవనుడు గుహలో నిద్రపోతున్న ముచుకుందుడిని చూసి, కృష్ణుడనుకుని పొరబడి ఆగ్రహంతో దాడిచేస్తాడు. దాంతో ముచుకుందుడు నిద్ర మేల్కొనడం యవనుడు భస్మం కావడం ఏకకాలంలో జరిగిపోతాయి. అనంతరం శ్రీకృష్ణుడిని చూసిన ముచుకుందుడు తన కమండలంలోని జలంతో స్వామిని అర్చించి, నదిగా మారి ఎప్పుడూ కృష్ణుడి పాదాల చెంతే ఉండే విధంగా వరాన్ని పొందుతాడు. అలా ముచుకుందుడి కోరిక మేరకు అతని పేరు మీద ముచుకుంద నది ఏర్పడిందట. కాలక్రమంలో అది మూసీనదిగా ప్రసిద్ధి చెందిందని స్థలపురాణం తెలియజేస్తోంది.

ఏటా రెండు సార్లు...
ఏటా అనంతగిరిలో రెండు సార్లు ఉత్సవాలు జరుగుతాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున చిన్న జాతరను నిర్వహిస్తారు. ఆ రోజు ఉదయం నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలూ, పల్లకీ సేవా, అనంతరం పెరుగు వసంతాన్నీ కనుల పండగగా చేస్తారు. కార్తిక మాసంలో అనంత పద్మనాభుడికి వారంరోజుల పాటు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ఈ రోజుల్లో రోజుకొక వాహనం మీద స్వామివారిని ఊరేగిస్తారు. కార్తిక పౌర్ణమినాడు నిర్వహించే రథోత్సవం, చక్రస్నానాలతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి.

ఇలా చేరుకోవాలి
అనంతగిరి పద్మనాభ స్వామి ఆలయాన్ని చేరుకోవడానికి రైలు, రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌కి డెబ్భై  కిలోమీటర్ల దూరంలో ఉందీ ఆలయం. భాగ్యనగరంలోని ప్రధాన బస్‌స్టేషన్ల నుంచి తాండూరు వెళ్లే బస్‌లో వికారాబాద్‌ వరకూ వెళ్లొచ్చు. అక్కడి నుంచి ఆటోలో ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు. సికింద్రాబాద్‌, లింగంపల్లి రైల్వే స్టేషన్ల నుంచి రైలు సదుపాయం కూడా ఉంది. వికారాబాద్‌ రైల్వే స్టేషన్‌లో దిగి అక్కడి నుంచి రోడ్డుమార్గంలో ప్రయాణించి స్వామిని దర్శించుకోవచ్చు.

అన్నెపు దామోదరరావు


No comments:

Post a Comment