Tuesday, 13 March 2018

ఛాయా సోమేశ్వరాలయం

సోమేశ్వరాలయ రహస్యమిదీ!


నల్లగొండ పట్టణానికి కూతవేటు దూరంలో పానగల్లు ఉంది. ఆ ఊరి శివారులో ఉదయ సముద్రం.. దాని పక్కన పచ్చటి పొలాల మధ్య ఓ పురాతన దేవాలయం. 11వ శతాబ్దపు కుందూరు చోళుల కాలం నాటిది. దీని పేరు ఛాయా సోమేశ్వరాలయం. ఆ పేరులోనే దాని మిస్టరీ దాగి ఉంది. మనం ఉదయించే సూర్యుడి ఎదురుగా నిలబడితే మన నీడ ఎక్కడ పడుతుంది? మన వెనుక వైపు పడుతుంది కదా. అదే మధ్యాహ్నం నిలబడితే నీడ ముందుకు పడుతుంది.

అయితే గుడిలోని శివలింగంపై పడే నీడ ఉదయం అయినా, మధ్యాహ్నం అయినా ఎప్పుడూ కదలదు. ఆ నీడ ఒక స్తంభం నీడలా కనిపిస్తుంది. ఆ గుడిలో ఎనిమిది స్తంభాలుంటాయి, కాని ఆ నీడ ఏ స్తంభానిదో కూడా ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఒక స్తంభం నీడ అని మనం అనుకున్నామనుకోండి, దాని నీడ పడినప్పుడు దాన్ని పట్టుకుంటే మన చెయ్యి మీద పడాలి, కాని అలా పడదు. ఆ నీడ ఎక్కడినుంచి పడుతుంది. రోజంతా స్థిరంగా ఎలా ఉంటుందనేది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటుంది.

వందల ఏళ్ల చరిత్ర ఛాయా సోమేశ్వరాలయం వందల ఏళ్ళకు పైగా చరిత్ర కలిగి ఉంది. మూడు గర్భగుడులు కలిగి త్రికూటాలయంగా ప్రఖ్యాతి చెందింది. ఈ ఆలయం కళ్యాణి చాళుక్యుల కాలం నాటి గణిత, భౌతిక శాస్త్ర మేధస్సుకు చిహ్నం. ఆలయంలో పశ్చిమాన ఉండి తూర్పునకభిముఖంగా ఉన్న గర్భగుడిలో స్తంభాకారం గల ఒక నిశ్చల ఛాయ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరుకు భానుడి స్థానంతో సంబంధం లేకుండా మహా శివలింగం మీదుగా నిలకడగా ఉంటుంది.

ఆలయం తూర్పు వైపు నుంచి లోనికి ప్రవేశించే పరిక్షేపణ సూర్య కాంతి వల్ల ఏక నిశ్చల ఛాయ ఏర్పడుతుంది. మిగతా రెండు గర్భ గుడులు కూడా ఒకే రీతి విమాన శైలి కలిగి ఉన్నా ఎలాంటి ఛాయలు ఏర్పడవు. ఆలయాన్ని నిర్మించిన వారు తెలివిగా పశ్చిమాన ఉన్న గర్భ గుడికి ఇరు వైపులా అడ్డంకులు ఏర్పాటుచేసి కాంతిని ఆలయంలోకి ప్రవేశించకుండా చేశారు. ఉత్తరాన ఉన్న గర్భగుడికి ఎదురుగా ఆలయం ప్రధాన ద్వారం ఉండటం వల్ల ఎలాటి ఛాయలు ఏర్పడవు. ఆలయ ద్వారం స్థానంలో నాలుగో గర్భగుడి నిర్మించినట్లైతే ప్రజలకు నాలుగు గదుల్లో ఏక ఛాయలను వీక్షించే అవకాశం ఉండేది.

అయితే ఉత్తర, దక్షిణ గర్భగుడుల్లో ఏర్పడిన ఏక ఛాయలు నిశ్చలంగా ఉండకుండా సూర్యుడు తూర్పునుంచి ప్రయాణించినప్పుడు అవి పడమర నుంచి తూర్పుకు కదులుతాయి. ఇకపోతే తూర్పు పడమర గర్భగుడుల్లో ఛాయలను కలిగిన తలము సూర్యుడు ప్రయాణించే దిశకు సమాంతరంగా ఉండటం వల్ల ఆ ఛాయలు నిశ్చలంగా ఉంటాయని తెలుస్తుంది. ఉత్తర, దక్షిణ గర్భగుడుల్లో ఛాయలను కలిపే తలము సూర్యుడు ప్రయాణించే దిశకు లంబంగా ఉండటం వల్ల అవి కదులుతాయి.

భౌతికశాస్త్రంలోని కాంతి పరిక్షేపణ సిద్ధాంతాన్ని ఉపయోగించి సోమేశ్వర దేవాలయాన్ని నిర్మించారు. ఈ రహస్యానికి సంబంధించి తాను కనుగొన్న అంశాలను, ప్రయోగాలను ఆర్కియాలజీ డిపార్ట్‌మెంటుకు చెందిన శివనాగిరెడ్డి ఆమోదించినట్లు సూర్యాపేటకు చెందిన భౌతిక శాస్త్రవేత్త మనోహర్‌ తెలిపారు.

జలాల్‌పురంలో..

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం జలాల్‌పురం గ్రామంలోని శివాలయంలో కూడా నల్లగొండలోని ఛాయా సోమేశ్వరాలయం మాదిరిగానే పరిస్థితులుండటం విశేషం.. అక్కడ.. పానగల్లు ఆలయానికి పూర్వ నమూనాలో సోమేశ్వరాలయం నెలకొని ఉండడాన్ని భౌతిక శాస్త్రవేత్త శేషగాని మనోహర్‌ గౌడ్‌ కనుగొన్నారు. గతంలో పానగల్‌లోని ఛాయా సోమేశ్వరాలయంలో నీడగా పడే శివలింగం రహస్యాన్ని వెలుగులోకి తీసుకువచ్చిన మనోహర్‌ను ప్రభుత్వం, టూరిజం శాఖ ప్రోత్సహించినట్లైతే మరుగున పడిన చరిత్ర వెలుగులోకి వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయని చెప్పవచ్చు.
(నల్లగొండ-ఆంధ్రజ్యోతి)


ఏక నిశ్చలాకార నీడకు నిలయం ఛాయా సోమేశ్వరాలయం!

Sun,September 10, 2017 01:14 AM
ఛాయా సోమేశ్వరాలయం కుందూరు చోడుల కాలం నాటిది.దీనిని వాస్తుశాస్త్ర అద్భుతంగా పేర్కొంటారు చరిత్రకారులు. ఛాయా సోమేశ్వరాలయానికి రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి.. ఈ ఆలయ గర్భగుడిలో గోడపై ఎప్పటికీ కదలకుండా ఒకేస్థానంలో ఉన్నట్లుగా కనిపించే నీడ. రెండోది అక్కడికి దగ్గర్లోని చెరువులో నీరుంటే గర్భగుడిలో కూడా నీరు ఉబికి వస్తుంది.

ఎక్కడ ఉంది?: నల్లగొండ పట్టణానికి సుమారు
4 కిలోమీటర్ల దూరంలో పానగల్లులో ఉంది.

విశిష్టత ఏంటి?: నిరంతర ఏక నిశ్చలాకార నీడ గర్భగుడిలో కనిపించడమే ఈ ఆలయ విశిష్టత. గర్బగుడి ముఖద్వారం ముందు రెండు స్తంభాలున్నా అన్నివేళలా ఒకే నీడ పడుతుంది. అది వెలుతురు ఉన్నంత సేపు కదలకుండా ఒకే స్ధానంలో ఉంటుంది. సూర్యుని గమనంలో మార్పు ఆ నీడను మార్చదు.

నిర్మాణం ఏ కాలం?: క్రీస్తుశకం 11, 12 శతాబ్దకాలానికి చెందినదిగా చెప్తుంటారు. కుందూరు చోడులు దీనిని నిర్మించినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు.

పేరెలా వచ్చింది?: సోమేశ్వరుడి ఆలయ గర్భగుడిలో నేరుగా నీడ పడటం వల్ల ఈ ఆలయానికి ఛాయా సోమేశ్వరాలయం అనే పేరొచ్చిందని కొందరంటే.. మరికొందరేమో.. శ్రీ సూర్యభగవానుడు తన సతీమణి ఛాయాదేవితో వచ్చి సోమేశ్వరుడిని పూజించాడనీ అందుకే ఛాయా సోమేశ్వరాలయం అనే పేరొచ్చిందని అంటున్నారు.

ఛాయా మహత్యం: ఛాయా సోమేశ్వరాలయం త్రికూటాలయంగా కూడా ప్రసిద్ధి. తూర్పు వైపు ముఖం ఉన్న గర్భగుడిలో శివలింగం మీదుగా స్తంభాకారంలో ఏక నిశ్చలాకార నిరంతర ఛాయ సూర్యుని స్థానంతో సంబంధం లేకుండా ఏర్పడడం ఇక్కడి వింత. ఈ నీడ ఏ వస్తువుదన్న విషయం ఇంతవరకూ అంతు చిక్కలేదు. ఆలయ మధ్యభాగం చతురస్రాకారంలో ఉండి దానికి మూడువైపులా అంటే.. తూర్పు, పడమర, ఉత్తర దిశల్లో మూడు గర్భగుడులు ఉంటాయి. మూడు గర్భగుడులు ఒకేరీతి నిర్మాణ శైలిని కలిగి ఉన్నప్పటికీ కేవలం తూర్పువైపు ముఖం ఉన్న గర్భగుడిలో మాత్రమే ఏక నిశ్చల ఛాయ కనిపిస్తుంది. వాస్తవానికి ఈ నమూనా ప్రకారం.. కాంతి అంతరాలయంలోకి ప్రవేశించే క్రమంలో ప్రతీ గది కూడా ఎదురుగా ఉన్న గదిలో ఏకఛాయ ఏర్పడాలి. నాలుగు గదులలోనూ ఏకఛాయను వీక్షించే అవకాశం ఏర్పడేది. కానీ నీడలను ఏర్పరచడానికి శిల్పి సూర్యకాంతిని నేరుగా ఉపయోగించకుండా పరిక్షేపణం చెందిన సూర్యకాంతిని ఉపయోగించడం విశేషం.

శిల్పకళా కేంద్రం: ఛాయా సోమేశ్వరాలయానికి రాళ్లతో కూడిన పునాదిని ఎంచుకున్నారు. భూకంపాల వంటి ఉపద్రవాలు వచ్చినా కూడా నీడ చెదరకుండా ఉండేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందనేది శిల్పి ఆలోచన అయుండొచ్చు అని గ్రామస్థుల అభిప్రాయం. ఇక్కడ అద్భుతమైన శైలితో చెక్కిన కళా శిల్పాలతో కూడిన సంపద నిండి ఉన్నది. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే శిల్పాలను విభిన్న రీతిలో ప్రతిష్టించారు. మధ్యయుగపు ఛాయలతో శిల్ప కళానైపుణ్యానికి ప్రతీకగా నల్లరాతిలో చెక్కిన శిల్పకళాకృతులతో పశ్చిమ చాళుక్యులు.. కుందూరు చోడులు.. కాకతీయుల కళాతృష్ణకు నిదర్శనంగా ఛాయా సోమేశ్వరాలయం నిలిచింది. ఆలయానికి ముందు ఉదయ సముద్రమనే చెరువును తవ్వించారు నాటి రాజులు. దీనిద్వారా సాగునీరు.. తాగునీరు అందేది. పొలాల మధ్యలో నిర్మితమైన ఈ ఆలయం త్రికూటాలయంగా మూడు గర్భాలయాలతో ప్రసిద్ధి చెందింది. ఆలయ దర్శనానికి వెళ్లిన భక్తులకు చెరువునీళ్లు పంటచేళ్లు నిండి దేవాలయ మార్గంలోకి, ఆలయ ప్రాంగణంలోకి పొంగి పొర్లడం గమనించవచ్చు.

ప్రత్యేక ఆలయం: పానగల్లులోని అన్ని దేవాలయాల్లో అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో నిర్మించిన ఆలయం ఛాయా సోమేశ్వరాలయం. పురాతన కట్టడాలలో ప్రత్యేకమైందిగా.. విశిష్ట నేపథ్యమున్న ఆలయంగా దీనిని పిలుస్తారు. ప్రతిరోజూ భక్తులు ఇక్కడకు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. పానగల్లు చెరువు.. ఆలయాలు.. చరిత్రను దృష్టిలో ఉంచుకుని దీనిని పర్యాటక కేంద్రంగా గుర్తించాల్సిన అవసరం ఉన్నది.
-సిలివేరు లింగస్వామి

No comments:

Post a Comment