Wednesday, 14 March 2018

ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రములు

ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రములు


సోమనాథలింగంద్వాదశ జ్యోతిర్లింగాలలో(12) మొదటిదిగా వర్ణించబడింది సోమనాథలింగం. ఇది ఒకనాడు సౌరాష్ట్రగా చెప్పబడిన గుజరాత్ రాష్ట్రములోని ప్రభాస పట్టణానికి సుమారు 40 కి.మీ.ల దూరంలో ఉన్నది.

యాత్రామార్గం:
విజయవాడ నుండి ఖాజీపేట, సికింద్రాబాద్, కురిదివాడి, పూనాల మీదుగా బొంబాయి వెళ్ళి అక్కడ నుంచి అహ్మదాబాద్, వీరంగం స్టేషన్‌లమీదుగా వెరావల్ స్టేషన్‌లో దిగాలి. వెరావల్ రైల్వేస్టేషన్ నుండి 7 కి.మీ. దూరంలో వున్న సోమనాథ్ క్షేత్రానికి బస్సు ద్వారా వెళ్ళవచ్చు.

పురాణగాథ:
ఈ జ్యోతిర్లింగము చంద్రుని వలన ప్రతిష్ఠింపబడిందని చెబుతారు. దక్షప్రజాపతికి సంతతిలోని అశ్విని మొదలుకొని రేవతి వరకు మొత్తం 27 మంది కుమార్తెలు అందరూ చక్కని చుక్కలే. దక్షుడు తన కుమార్తెలకు సరియైన జోడుగా భావించి వారిని సౌందర్యమూర్తి అయిన చంద్రునికిచ్చి వివాహం చేశాడు. భార్యలందరిలో రోహిణి మరింత అందగత్తె కావటంవల్ల ఆమె పై చంద్రుడు అధికంగా ప్రేమను ప్రకటించసాగాడు. మిగిలిన వారందరికి ఇది అసూయను కల్గించింది. రోహిణి తప్ప మిగిలిన 26 మంది ఈర్ష్యతో తన తండ్రి దగ్గరకు వెళ్ళి తమబాధను చెప్పుకున్నారు. దక్షుడు చంద్రుణ్ణి పిలిచి భార్యలందరిని సమానమైన ప్రేమతో చూడమని పలువిధాలుగా నచ్చచెప్పాడు. కాని మామగారి మాటలు చంద్రుని మనస్సునకు ఎక్కలేదు. అందువల్ల అతడు మునుపటి కంటే ఎక్కువగా రోహిణిపై అనురాగాన్ని చూపించాడు అందుకు దక్షుడు పట్టరానికోపంతో చంద్రుణ్ణి “క్షయరోగంతో పీడించబడుదువుగాక” అని శపించాడు. అప్పటినుంచి ఆ శాపం కారణంగా చంద్రుడు తన కళలను కోల్పోవటం ప్రారంభించాడు. సుధాకరుని సుధాకిరణములు నీరిసంచి పోవటంవల్ల అమృతమే ఆహారముగా గల దేవతలు హాహాకారాలు చేయసాగారు. ఓషధులు వాడిపోయాయి. చరాచరజగత్తు అంతా నిస్తేజం అయిపోయింది. అపుడు ఇంద్రుడు మొదలైన దేవతలు, వశిష్టుడు మొదలైన మునీంద్రులు కలసి చంద్రుని తీసుకొని బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి ఈ ఉపద్రవం నుండి లోకాలనన్నింటిని రక్షించమని వేదుకున్నారు. అప్పుడు బ్రహ్మ చంద్రునితో పవిత్రమైన ప్రభాసతీర్థానికి వెళ్ళి పరమశివుని ఆరాధించవలసినదిగాను అందువల్ల సమస్త శుభములు చేకూరగలవని హితవు చెప్పి, అతనికి మృత్యుంజయ మంత్రాన్ని ఉపదేశించాడు.

ఆ తరువాత చంద్రుడు దేవతలతో కలసి ప్రభాసక్షేత్రానికి వెళ్ళి నిష్టతో మహేశ్వరుని ఆరాధించి, ఆరు మాసాల కాలం (ఘోరమైన) తపస్సు చేశాడు. దీక్షతో 10 కోట్లసార్లు మృత్యుంజయమంత్రాన్ని జపించాడు. చంద్రుని భక్తికి మెచ్చిన శంకరుడు అతని ముందు సాక్షాత్కరించి వరం కోరుకోమన్నాడు. అప్పుడు చంద్రుడు ఆ పరమ శివునికి సాష్టాంగ ప్రణామం చేసి తనను అనుగ్రమింపమని శివుని కటాక్షవీక్షములను తనపై ప్రసరింపచేసి శాప నివృత్తిని కలిగించమని ప్రార్థించడు. కరుణామయుడైన శివుడు చంద్రుని ప్రార్థనను మన్నించి దక్షుడి శాపాన్ని రూపుమాపే అవకాశం లేదని చెప్పి దానికి సవరణలు చేస్తాడు. కృష్ణ పక్షంలో మాత్రం చంద్రుని కళలు క్షీణించే విధంగానూ, శుక్లపక్షంలో కళలు దినదిన ప్రవర్థమానం అయ్యేటట్లు, పూర్ణిమనాటికి కళాపరిపూర్ణుడుగా విరాజిల్లగలడనీ వరం ప్రసాదించాడు.

ఈ విధంగా మరల అమరత్వం ప్రసాదించిన చంద్రుడు కళాప్రపూర్ణుడై కళకళలాడుతూ మునుపటి వలెనే అమృతవర్షాన్ని కురిపంచసాగాడు. అపుడు బ్రహ్మాది దేవతలు ప్రార్థించగా పరమశివుడు పార్వతీసమేతుడై ఈ ప్రభాసక్షేత్రములో సోమనాథునిగా నిలిచిపోయాడు.

ఈ సోమనాథ లింగమును దర్శించటానికే తప్ప తాకటానికి మాత్రం భక్తులకు అవకాశం లేదు. పశ్చిమ సముద్రతీరాన, రామేశ్వరంలాగా ఉన్న జ్యోతిర్లింగం ఇది. ఈ ఆలయ వాస్తునిర్మాణం, త్రయంబకేశ్వరాలయాన్ని గుర్తుకు తెస్తుంది.
మల్లికార్జున లింగం:

12 జ్యోతిర్లింగాలలో రెండవదిగా చెప్పబడే ఈ జ్యోతిర్లింగం శక్తిపీఠంలో కలిసి ఉండటం వలన అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకొన్నది. ధూళి దర్శనం ఆచారంగా ఉన్న శ్రీశైలమహాక్షేత్రంలో యుగయుగాలనుండి స్వామిని తాకి తల ఆనించి తమ కష్టాలను చెప్పుకొనే అవకాశం ఉంది.

యాత్రామార్గం:
ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రధాన కూడలుల నుండీ నేరుగా బస్సులున్నాయి. విజయవాడ- కర్నూలు మార్గంలోని దోర్నాల నుండి 49 కి.మీ. ఘాట్ రోడ్డులో ప్రయాణించవలసి ఉంటుంది. రాత్రి గం 9.00 ల నుండి ఉదయం 6 గం ల వరకు ప్రేవేటు వాహనాలు ఘాట్‌లో ప్రవేశించే అవకాశం ఉండదు. దోర్నాల నుండి శ్రీశైలానికి రోజూ సుమారు 40 ఆర్.టి.సి. బస్సులు వెడతాయి. ఇవన్నీ ఇతర ప్రాంతాల నుండి శ్రీశైలం వెళ్ళే బస్సులే.

ఉనికి:
శ్రీశైలమహాక్షేత్రం ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా, ఆత్మకూరు తాలూకాలోనున్న నల్లమల అడువులలోని పర్వతశ్రేణుల నడుమ పాతాళగంగ పేరుతో ఉత్తరవాహినిగా ప్రవహిస్తున్న కృష్ణానదికి కుడివైపున ఉంది. 16⁰12 ఉత్తర అక్షాంశము, మరియు 78⁰5 తూర్పు రేఖాంశముల వద్దనున్న యీ క్షేత్రపు ఎత్తు సముద్రమట్టానికి 476 మీటర్లు (1500 అడుగులు).

శ్రీశైల మహిమ:
12 జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీ మల్లికార్జునస్వామికి 18 శక్తిపీఠాలలో ఒకరైన శ్రీ భ్రమరాంబాదేవికి, నిలయమైన యీ మహాక్షేత్రం వేదములకు ఆలవాలమై, సకల సంపదలకు పుట్టినిల్లై, ఎనిమిది శృంగాలతో, 44 నదులతో, 60 కోట్ల తీర్థరాజాలతో, పరాశర, భరద్వాజాది మహర్షుల తపోవనాలతో, చంద్రగుండ, సూర్యగుండాది పుష్కరిణులతో, స్పర్శ వేదులైన లతలు, చెట్లు మరియు లింగాలతో, అనంతమైన ఓషధులతో విరాజిల్లుతూ యాత్రికుల మనస్సులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

శ్రీశైల దర్శనఫలం:
కురుక్షేత్రంలో లక్షలకొలదీ దానమిచ్చినా రెండువేలసార్లు గంగాస్నానం చేసినా,నర్మదానదీ తీరంలో బహుకాలం తపస్సాచరించినా, కాశీక్షేత్రంలో లక్షల సంవత్సరాలు నివసించినా ఎంత పుణ్యం లభిస్తుందో అంతటి మహాపుణ్యం శ్రీశైల మల్లికార్జునుని ఒక్కసారి దర్శించినంతనే కలగుతుందని స్కాందపురాణం చెబుతోంది.

శిఖరదర్శన మాత్రాన, అనంతమైన పుణ్యాన్ని సంతరించి పెట్టి పునర్జన్మనుండి ముక్తిని కలిగించే ఈ క్షేత్రాన్ని ఆయా మాసాలలో సందర్శించేవారు వాజపేయ, అతిరాత్ర మొదలైన మహాయజ్ఞాలు అచరించినందువల్ల కలిగే ఫలాన్ని, కన్యాదానం, గోదానం మొదలైన మహాదానాలు చేసినందువల్ల కలిగే ఫలన్ని, కన్యాదానం, గోదానం మొదలైన మహాదానాలు చేసినందువల్ల కలిగే ఫలాన్ని అనాయాసంగా పొందుతారని శివుడు పార్వతికి స్వయంగా చెప్పినట్లు స్కాందపురాణం చెబుతున్నది.

యుగయుగాలుగా  ప్రసిద్ధికెక్కిన యీ శైవక్షేత్రం కృతయుగంలో హిరణ్య కశిపునికి పూజామందిరం కాగా, అహోబిలక్షేత్రం సభామండపమనీ, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు అరణ్యవాస సమయంలో సతీసమేతుడై శ్రీశైలనాధుని సేవించి సహస్రలింగాన్ని ప్రతిష్ఠించాడని, పాండవులు తమ వనవాస సమయంలో ద్రౌపదీ సమేతులై యీ క్షేత్రంలో కొంతకాలముండి, లింగాలను ప్రతిష్ఠించారని చెప్పబదుతోంది. ఇందుకు నిదర్శనంగా నేటికీ యీ క్షేత్రంలో, రామప్రతిష్ఠితసహస్రలింగం, సీత్పాతిష్ఠిత సహస్రలింగం, పాండవులచే ప్రతిష్ఠింపబడిన ‘సద్యోజాత ‘ మొదలైన ఐదు లింగాలు భక్తుల సేవల నందుకొంటున్నాయి.
మహాకాళేశ్వర లింగం:

మాలవ దేశంలోని ఉజ్జయిని పట్టణంలో శిప్రానది ఒడ్డున ఈ జ్యోతిర్లింగం ఉన్నది. ఉజ్జయిని నగరాన్నే అవంతి అని కూడా అంటారు. భారతేశంలోని మోక్షదాయకములైన 7 నగరాలలో అవంతిక ఒకటి. ఈ విషయాన్ని

అయోధ్యామధురా మాయా కాశీ కాంచీ అవంతికా |
పురీ ద్వారవతీ చైవ సప్తైతే మోక్షదాయకాః ||
అనే పురాణ వచనం చెబుతోంది.

స్కౌంద పురాణంలోని ఆవంత్య ఖండం ఈ నగరం యొక్క గొప్పతనాన్ని ఎంతగానో వర్ణించింది. శివపురాణంలోను మహాభారతంలోను ఉజ్జయిని యొక్క మహిమ ఎంతగానే చెప్పబడింది. ఇక్కడ ప్రవహించే శిప్రానదిలో స్నానం చేసినవారికి సర్వపాపాలు నశిస్తాయని, అష్టదరిద్రాలు దూరమైపోతాయని పురాణాలు చెప్పబడింది. శ్రీకృష్ణుడు విద్యాభ్యాసం చేసిన సాందీపని ఆశ్రమం ఇక్కడే ఉన్నది. ఈ క్షేత్రమే విక్రమాదిత్యునికి రాజధాని అయి కాళిదాసు మొదలైన మహాకవులకు నిలయమయ్యింది.

యాత్రామార్గం:
విజయవాడ నుంచి అహ్మదాబాద్ వెళ్ళే మార్గంలో ఉజ్జయిని రైల్వేస్టేషన్ వుంది. జ్యోతిర్లింగ క్షేత్రమైన ఓంకారేశ్వరాన్ని సందర్శించిన భక్తులు 5 గంటల కాలం ప్రయాణించి ఉజ్జయినిని చేరుకోవచ్చు. ఈ దారిలో ప్రయాణించేవారు దారిలో ఇన్‌డోర్ నగరాన్ని కూడా చూడవచ్చు. ఇన్‌డోర్ నగరం ఒకప్పుడు రాణి అహాల్యాబాయ్ నివాసస్థలం. ఇన్‌డోర్ నగరం ఉజ్జయినికి 53 కి.మీ. దూరంలో వుంది.

పురాణగాథ:
ఒకప్పుడు అవంతి నగరంలో వేద విద్యలలో గొప్పవాడైన వేదప్రియుడనే పేరుగల బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు దేవప్రియుడు, ప్రియమేథుడు, సుకృతుడు, సువ్రతుడు అని నలుగురు కుమారులు ఉండేవరు. వారంతా శివభక్తులే. ఇది యిలా ఉండగా అవంతి నగరానికి సమీపంలో ఉన్న రత్నమాల పర్వతం మీద నివసించే దూషణుడు అనే రాక్షసుడు వేదప్రియుని కీర్తిప్రతిష్ఠలు విని తన సైన్యంతో అవంతి నగరం మీదికి దండెత్తాడు.

ఆ పట్టణంలోని ప్రజలంతా ఆ రాక్షసుని చూచి ఆర్తనాదాలు చేయటం ప్రారంబించారు. ప్రజల ఏడుపుల ధ్వని ఆకాశాన్ని అంటుకుంది. కానీ శివభక్తుడైన వేదప్రియుడు మాత్రం ఆవంతైనా చలించలేదు. ఆయన నిశ్చలమైన మనస్సుతో శివదీక్షతో నిమగ్నుడై ఉన్నాడు. రాక్షసుడు అతనిని చూచి క్రోధంతో “నరకండి, చంపండి ” అంటూ వేదప్రియునిపై దురాక్రమణ చేశాడు. అప్పుడు శివుడు మహాకాళ రూపంతో సాక్షాత్కరించి ప్రళయ హుంకారంతో ఆరాక్షసుని భస్మంచేశాడు. తరువాత శంకరుడు ప్రసన్నవదనంతో వేదప్రియుని చూచి వరం కోరుకోమన్నాడు. వేదప్రియుడు చేతులు జోడించి నమస్కరించి “దేవ దేవా నా వంటి దీనులైన భక్తులను అకాల మృత్యువు నుండి రక్షిస్తూ సర్వకాలములలో ఇక్కడనే నెలకొని వుండు” అని ప్రార్థించాడు. శివుడు ఆ భక్తుని కోరికను అనుసరించి మహాకాళ నామంతో జ్యోతిర్లింగమై అచ్చట వెలసి ముక్తిని ప్రాసాదిస్తున్నాడు.

ఉజ్జయిని నగరాన్ని పరిపాలించే చంద్రసేన మహారాజు గొప్ప శివభక్తుడు. ఒకనాడు అతడు శివపూజలో నిమగ్నమై ఉండగా ‘శ్రీకరుడు ‘ అనే ఐదేళ్ళ గోపాలబాలుడు తన తల్లితోపాటు అక్కడకు వచ్చాడు. రాజుగారి దైవభక్తిని చూచి తన్మయుడైతాను కూడా స్వయంగా భగవంతుని ఆరాధించాలని నిర్ణయించుకున్నాడు. ఇంటికి వెళ్ళే మార్గంలోని శిలాఖండాన్ని ఒకదానిని తీసుకొని వెళ్ళి ఆ రాతిబండనే శివలింగంగా భావించి భక్తిశ్రద్ధలతో పూజించాడు. శ్రీకరుడు శివధ్యానంలో నిమగ్నుడై ఉన్నప్పుడు అతని తల్లి వచ్చి భోజనమునకు రమ్మని పిలిచింది. తల్లిమాటలు వినిపించుకొనక కళ్ళు మూసుకొని తన్మయుడై ఉన్నాడు శ్రీకరుడు. పిలిచి పిలిచి వేసారిన అతని తల్లి చివరకు శిలాశకలాన్ని తీసి దూరంగా పారవేసింది.

శ్రీకరుడు తన ఇష్ట దైవమైన శివునికోసం పెద్దగా ఏడ్చి ఏడ్చి అలసిపోయి మూర్ఛ పొందాడు. అపుడు భక్తసలభుడైన శంకరుడు శ్రీకరుని ముందు నిజరూపముతో ప్రత్యక్షమయ్యాడు. శ్రీకరుడు కళ్ళు తెరచేటప్పటికి ఎదురుగా మహాకాళ మందిరం, అందులో దేదీప్యమానంగా ప్రకాశించే జ్యోతిర్లింగం అతనికి కనిపించాయి. అది చూచిన బాలుడు ఆశ్చర్యంతో పులకించిపోయాడు.మాహాదేవుడైన ఆ శివుని మరల స్తుతించటం ప్రారంభించాడు. ఇంతలో తల్లివచ్చి జరిగినదానిని చూచి ఆనందంతో ఉప్పొంగిపోయింది. కొద్ది సేపటిలోనే ఈ విషయం నగరమంతటా వ్యపించింది.

చంద్రసేన మహారాజు ఆ విషయం తెలుసుకొని వెంటనే ఆ ప్రదేశానికి వచ్చి శ్రీకరుని భక్తికి ఆశ్చర్యం పొందాడు. ఇంతలో హనుమంతుడు వారి ముందు ప్రత్యక్షమై “ఓ మానవులారా ! ఈ చరాచర సృష్టికి శంకరుడే ఏకైక శరణ్యడు. ఆ మహాదేవుని ఆరాధించి తరింపుడు. వేలకొలది సంవత్సరములు తపస్సు చేసిన మహార్షులు కూడా పొందలేని ఫలమును శివపూజవలన ఈ బాలుడు సునాయాసంగా పొందగలిగెను. వీని సందర్శనము వలన వీరందరు ధన్యులైరి. ఈ గోపబాలుని ఎనిమిదవ తరమున నందుడను వాడు జన్మించును. మహావిష్ణువు ఆ నందునికి కుమారుడై జన్మించి లోకోద్ధరణ చేయగలడు.” అని చెప్పి అదృశ్యమయ్యాడు.

శ్రీ మహాకాళలింగమును సేవించి వేదప్రియుడు, శ్రీకరుడు, చంద్రసేన మహారాజు మొదలైనవారు శివసాన్నిద్యం పొందారు.

“ఆకాశే తారకం లింగం పాతాలే హటకేశ్వరం
మర్త్యలోకే మహాకాలం లింగత్రయ నమోస్తుతే ||”

అని పురాణములలో మహాకాళేశ్వరుని యొక్క మహిమ చెప్పబడింది.
ఓంకారేశ్వరలింగం:

ఓంకారేశ్వరుని అమరేశ్వరుడని, అమలేశ్వరుడని కూడా పిలుస్తారు. కానీ ఇక్కడ నర్మదానదికి రెండువైపుల ఓంకారేశ్వర, అమరేశ్వర దేవాలయాలు ఉన్నాయి. వాటిమధ్య నర్మదానదిమీద వంతెన కూడా నిర్మించబడింది. ఈ క్షేత్రంలో నర్మదానది, నర్మద, కావేరిక అని రెండు పాయలుగా ప్రవహిస్తోంది. ఈ రెండుపాయల మధ్య ఉన్న ప్రదేశాన్ని ‘‘ శివపురి ” అని ‘‘మాంధాతృపురి ‘ అని పిలుస్తారు.

మాంధాత సూర్యవంశపురాజు. ఈయన రఘవంశానికి మూలపురుషుడు. శ్రీరామచంద్రుడు కూడా ఈ వంశములోనివాడే. మహావీరుడైన మాంధాత ఇక్కడి పర్వతశిఖరం మీద అనేక సంవత్సరాలు తప్పస్సు చేసి పరమేశ్వరుని ప్రసన్నుని చేసుకొని స్వామికి దేవాలయాన్ని నిర్మించాడు. అందువలన దీనికి మాంధాతపురి అని పేరు వచ్చింది.

మాంధాత పర్వతం మీద చాలా దేవాలయాలు ఉన్నాయి. అవన్నీ “ఓం ” అనే ప్రణవకారంలో ఉండి. ఓంకారేశ్వర దేవాలయం ఆ ప్రణవంపై బాలచంద్రుని లాగే ప్రకాశింస్తొంది. ఈ ఓంకారేశ్వరుని దగ్గరకు వెళ్ళే మార్గంలో విష్ణుపురి, బ్రహ్మపురి అనే చిన్న చిన్న రెండు కొండగుట్టలున్నాయి. ఆ రెండింటి మధ్య “కపిలధార” అనే నది ప్రవహించి నర్మదానదిలో కలుస్తూంది.
వైద్యనాథ లింగం:

జ్యోతిర్లింగంగా చెప్పబడే వైద్యనాథలింగం బీహార్ రాష్ట్రంలోని చితాభూమిలో ఉన్నదని ఉత్తరాదివారు భవిస్తారు. వారి దృష్టిలో మహారాష్ట్రలోని పర్లివైద్యనాథలింగం జ్యోతిర్లింగం కాదు. కానీ దక్షిణాదివారు మహారాష్ట్రలోని పర్లి వైద్యనాథ క్షేత్రాన్నే జ్యోతిర్లింగ క్షేత్రంగా చెబుతారు. ఈ జ్యోతిర్లింగం ఎక్కడ ఉన్నదిగా చెప్పబడినప్పటికి దానికి సంబంధించిన పురాణగాథ ఒక్కటే.

యాత్రామార్గం:
ఔరంగాబాద్ నుంచి 12 గం|| ల కాలం బస్సులో ప్రయాణించి పర్లివైద్యనాథ క్షేత్రాన్ని చేరవచ్చు. లేదా పర్భిణి రైల్వేజంక్షన్ నుంచి 40 కి.మీ. దూరం రైలులో ప్రయాణించి పర్లివైద్యనాథ్ క్షేత్రంలో దిగవచ్చు.

పురాణగాథ:
శివభక్తుడైన రావణాసురుడు ఒకప్పుడు వెండికొండకు పోయి శివుని ప్రీతికోసం తన తలలను హోమంచేసి 9 తలలను హోమంలో వేసిన తరువాత 10వ తలను కూడా ఖండిచబోగా శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అప్పుడు రావణాసురుడు ఇతరులు తన తలలను ఖండించినప్పుడు అవి వెంటనే మరల మొలచి యథాస్థితిగా ఉండాలని, శివుడు తన లంకారాజ్యానికి వచ్చి అక్కడే స్థిరంగా ఉండాలని వరం కోరాడు. అందుకు శివుడు అలాగే అంటూ తన బదులు ఆత్మలింగాన్ని ఇస్తున్నానని, దానిని తీసుకొనిపోయి లంకారాజ్యంలో ఉంచమని అది లంకలో ఉన్నంతకాలం రావణునికి అపజయం అన్నది లేక రాజ్యం సుభిక్షంగా ఉంటుందని రాజ్యానికి ఎటువంటి పతనావస్థా ఉండదని చెప్పాడు. కానీ ఆత్మలింగాన్ని లంకకు వెళ్ళేలోపు మరెక్కడా క్రిందపెట్టకూడదని, నేలపై పెట్టిన తరువాత దానిని పెకలించటం ఎవరికీ సాధ్యంకాదని కూడా శివుడు చెప్పాడు.

దానికి అంగీకరించిన రావణుడు శివుని ఆత్మలింగాన్ని తీసుకొని మధ్య దారిలో సంధ్యా వందనానికి సమయం కాగా ఆ సమయానికి కనిపించిన ఒక బాలుని చేతిలో ఆ లింగాన్ని ఉంచి వెంటనే తిరిగి వస్తాననీ, అప్పటివరకు క్రింద పెట్టికుండా జగ్రత్తగా పట్టుకోవలసినదిగాను చెప్పి సంధ్యావందనానికి వెళ్ళాడు.

శివుడు ఆత్మలింగం లంకకు చేరినందువల్ల దేవతలకు కష్టములు నాలుగింతలు అవుతాయని ఊహించిన దేవతలు నారదుని సలహామేరకు గణాధిపతి అయిన వినాయకుని ఆత్మలింగం లంకకు చేరకుండా చూడమని ప్రార్థించినట్లుగానీ, వినాయకుడే పిల్లవాని రూపంలో తనకు కనిపించాడని గానీ రావణాసురునికి తెలయదు.

సంధ్యావందనానికి వెళ్ళిన రావణుడు 48 ని||ల కాలంవరకు రాలేదు. పనిపూర్తి చేసుకొని తిరిగివస్తున్న రావణుని చూడగానే ఆ పిల్లవాడు ” రావణా ! ఈ లింగాన్ని ఇంక మోయలేను ” అని గట్టిగా అరుస్తూ ఆ ఆత్మలింగాన్ని నేలపై పెట్టివేశాడు. పరుగు పరుగున వచ్చిన రావణుడు ఎంత ప్రయత్నించినా ఆ లింగంపైకి రాలేదు సరికదా అతని శరీరమంతా గాయాలయ్యాయి. అపుడు శివుడు ప్రత్యక్షమై అతని గాయాలను మానపి ఇక ఆ లింగం కదలదని కనుక రావణసురునే ప్రతిరోజు వచ్చి ఆ లింగాన్ని సేవించుకోవలసినదిగాను ఉపదేశించి అదృశ్యమయ్యాడు.

రావణాసురునికి వైద్యం చేసి గాయాలను మానపినందువల్ల స్వామికి వైద్యనాథుడని పేరు వచ్చింది. ఈ సందర్భంగా రావణాసురుడు చేసిన శివతాండవ స్తోత్రం ఎంతో పేరు పొందింది.
భీమశంకర లింగం :

సహ్య పర్వతం యొక్క శిఖరాలలో ఒకదాని పేరు డాకిని. ఆ కొండపై భాగంలో పరమశివుడు ” భీమశంకర జ్యోతిర్లింగంగా వెలిశాడు. భీమానది ఇక్కడే పుట్టింది. అది పుట్టినచోట శివలింగం ప్రక్కభాగం నుంచి కొద్ది కొద్దిగా ప్రవహిస్తుంటుంది. భీమశంకరుడు శాకిని, డాకిని మొదలైన రాక్షస సమూహాలతో సేవించబడుతూ ఉన్నాడని పురాణవచనం.

యాత్రా మార్గం:

బొంబాయి దగ్గరలోని పూనావరకు రైలులో వెళ్ళి పూనాలో బస్సు ఎక్కి 75 కి.మీ. ప్రయాణం చేసి ”డాకినీ భీమ శంకరం” క్షేత్రాన్ని చేరాలి. యాత్రికులకు వసతులు అంతగా లేని యీ క్షేత్రానికి పూనా నుండి ప్రతిరోజు ఐదారు బస్సులు వస్తాయి. ఆలయం చుట్టూ అరణ్యం దట్టంగా ఉంటుంది. లోయలో నిర్మించబడిన ఈ ఆలయానికి ప్రక్కనే ఉన్న కోనేరులో స్నానం చేసి భీమశంకరుని సేవించవచ్చు.

పురాణ గాథ:
పూర్వం భీముడనే పేరుగల రాక్షసుడు తన తల్లియైన కర్కటితో ఈ పర్వత శిఖరం మీద నివసిస్తూ ఉండేవాడు. వాడు ఒకనాడు తల్లిని ”అమ్మా నా తండ్రి ఎవరు ?” ఎక్కడున్నాడు? నీవు ఈ కొండమీద ఒంటరిగా ఉండటానికి కారణం ఏమిటి ” అని ప్రశ్నించాడు. అప్పుడు కర్కటి కుమారునితో “నాయనా లంకా రాజ్యానికి ప్రభువైన రావణాసురుని తమ్ముడైన కుంభకర్ణుడు మీ తండ్రి, పరాక్రమవంతులైన నీ తండ్రిని, పెదతండ్రిని దుర్మార్గుడైన శ్రీరాముడు సంహరించాడు. నా తండ్రి కర్కటుడు, తల్లి పుష్కసి. నా మొదటి భర్త విరాధుడు. అతనిని కూడా ఒకప్పుడు శ్రీరాముడే సంహరించాడు.

ఒకనాడు నా తల్లిదండ్రులు అగస్త్యమహర్షి శిష్యుడైన సుతీక్ష్ణుడు అనేవాడిని తినబోయారు. తపస్సంపన్నుడైన వాడు కోపంతో నా తల్లిదండ్రులను భస్మం చేశాడు. నేను దిక్కులేని దానినై బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నాను. అప్పుడు ఒకనాడు ఇక్కడికి వచ్చిన కుంభకర్ణుడు నన్ను బలవంతంగా చేపట్టాడు. ఆ విధంగా నీవు జన్మించావు. నీ తండ్రి మహావీరుడు కనుక తండ్రిని మించిన కొడుకువై నీ వంశానికి పేరు తీసుకొనిరా” అని చెప్పింది.

తల్లిమాటలు విన్న భీముడు కోపంతో వణికిపోయాడు. తన వంశాన్ని నాశనం చేసిన విష్ణుమూర్తినీ, ఆయన భక్తులనూ సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్నాడు. దేవతలను, మహర్షులను మట్టుపెట్టాలని పట్టుపట్టాడు. బ్రహ్మదేవుని గురించి వేయి సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశాడు. అప్పుడు బ్రహ్మప్రత్యక్షమై ఆ రాక్షసునికి అంతులేని పరాక్రమాన్ని , అనంతమైన దైర్యాన్ని వరంగా ప్రసాదించాడు.

వరగర్వంతో భీమాసురుడు దేవలోకం మీదికి దండెత్తి దేవేంద్రుని ఓడించి దేవలోకాన్ని ఆక్రమించుకొన్నాడు. ఆ తరువాత భూలోకమంతా తిరిగి సాధువులైన భక్తులను మహార్షులను బాధించాడు.

ఆ కాలంలో కామరూప దేశాన్ని సుదక్షిణుడు అనే రాజు పరిపాలిస్తూండేవాడు. ఆయన గొప్ప శివభక్తుడు. అఖండమైన తపస్సంపన్నుడు. భీమాసురుడు అతనిపై దండెత్తి అతనిని కారాగారంలో బంధించాడు. శివభక్తుడైన సుదక్షిణుడు కారాగారంలోనే మట్టితో ఒక లింగాన్ని చేసి పూజిస్తూ నిరంతరం శివపంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉన్నాడు. ఒకరోజు భీమాసురుడు ఆ రాజును సమీపించి “ఓరీ బుద్ధిమాలినవాడా ఈ జపము లేమిటి? ఈ శివపూజలేమిటి ? ఇకపై ఈ పిచ్చిపనులు మాను ” అని గర్జించాడు. అయినా ఆ రాజు ఇవి ఏమీ పట్టించుకోకుండా శివపూజలో నిమగ్నమైపోయాడు. రాక్షసుడికి వళ్ళు మండింది పళ్ళు పటపట కొరకుతూ కత్తిని తీసి ” మూర్ఖుడా ఏమి మాట్లాడవు ! నిన్నే !” అని అరిచాడు. రాజు నెమ్మదిగా కళ్ళు తెరచి “రాక్షసరాజా మనకు కనిపించే చరాచర జగత్తుకంతటికి పరమశివుడే ప్రభువు. అతడే ఈ ప్రపంచానికి కర్త. భరించేది అతడే, హరించేది అతడే. నేనా జగత్పత్తిని సేవిస్తూన్నాను. నీ గర్జనలు, గాండ్రింపులు నన్ను ఏమీ చేయలేవు” అన్నాడు. అంతటితో భీముడు మరింత … మండిపడుతూ వికటాట్టహాసంతో కత్తిని ఝుళిపిస్తూ “ఈ లోకానికి వీడేనా కర్త ? వీడేనా రక్షించేది ? ఇప్పుడు ఈ లింగాన్ని నా కత్తితో ముక్కలు ముక్కలు చేస్తాను. తనను తాను రక్షించుకోమను” అంటూ కత్తినెత్తి శివలింగాన్ని నరకబోయాడు. అంతలో శివలింగం నుండి శివుడు ఆవిర్భవించి, ఆ రాక్షసుని భస్మం చేశాడు. సుదక్షిణుడు భక్తిపారవశ్యంతో శివుని పాదాలపై పడి నమస్కరించి ఎన్నో విధాలుగా స్తుతించాడు. పరమశివుని కరుణాకటాక్షం వలన లోకాలకు భీమాసురుని పీడ విరగడయ్యింది. ఇంద్రుడు మొదలైన దేవతలంతా తమ తమ స్థానాలను అలంకరించారు. అప్పటినుండి మునులంతా నిరాటంకంగా తపస్సు చేసుకోవటం ప్రారంభించారు. సుదక్షిణుడు తన రాజ్యాన్ని పొంది ఎప్పటివలెనే పరిపాలించసాగాడు. నారదుడు మొదలైనవారి కోరికమేరకు జ్యోతిర్లింగరూపిగా అక్కడే నెలకొన్న పరమశివుడు భీమశంకరునిగా భక్తుల పూజలందుకొన్నాడు.
రామేశ్వరలింగం:

రామేశ్వర జ్యోతిర్లింగం దక్షిణ సముద్రతీరంలో ఉంది. ఈ క్షేత్రం యొక్క గొప్పతనాన్ని గురించి స్కాందపురాణం ఎంతగానో వర్ణించింది. ఈ జ్యోతిర్లింగం శ్రీరామచంద్రుని చేతులమీదుగా ప్రతిష్టించబడింది. రామేశ్వరస్వామి దేవాలయం 1000 అడుగుల పొడవు, 650 అడుగుల వెడల్పు, 150 అడుగుల ఎత్తు కలిగి అనంతమైన శిల్పకళతో అలరారుతోంది. ఈ క్షేత్రంలో నందీశ్వరుడు, వెండి రథము, బంగారు గోపురాలు చూడవలసినవి. ఆలయం చుట్టూ 1200 స్తంభాలతో కూడిన ప్రదక్షిణ మండపం భక్తులను ఆకట్టుకుంటుంది. ఈ ఆలయంలో 23 తీర్ధాలు ఉన్నాయి. కాగా సముద్రాన్ని 24వ తీర్థమైన అగ్ని తీర్థముగా చెబుతారు. ఉత్తర భారతం నుండి వచ్చే యాత్రికులు గంగాజలన్ని తెచ్చి రామలింగేశ్వరునికి అభిషేకిస్తారు. మన దక్షిణాదివారు రామేశ్వరంలో సముద్రమునందలి ఇసుకను సేకరించి కాశీలో గంగానదిలో కలుపుతారు. ఈ పుణ్యకార్యం త్రేతాయుగంలో శ్రీరామచంద్రుని నుండి నేటివరకు కొనసాగుతూనే వుంది.

యాత్రామార్గం:
విజయవాడ నుంచి మద్రాసు వెళ్ళి, మద్రాసు ఎగ్మోర్ స్టేషన్ నుంచి రామేశ్వరానికి నేరుగా రైలులో వెళ్ళవచ్చు. గంగా, కావేరి ఎక్స్‌ప్రెస్ కాశీ – రామేశ్వరం మధ్య మద్రాసు మీదుగా నడుస్తోంది. ఒకప్పుడు బస్సులో ప్రయాణించి వెళ్ళిన యాత్రికులు పాంబన్ వరకు వెళ్ళి అక్కడి నుండి 34 కి.మీ. రైలులో సముద్రం మీదుగా ప్రయాణించి రామేశ్వరం చేరేవారు. ప్రస్తుతం బస్సులో ప్రయాణించేవారు కూడా నేరుగా రామేశ్వరాన్ని చేరటానికి వీలుగా ఇటీవల సముద్రంపై వంతెనను నిర్మించారు.

పురాణగాథ:
త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు రావణాసురుని సంహరించిన తరువాత సీతతో కలసి సపరివారంగా పుష్పక విమానంపై సముద్రాన్ని దాటి గంధమాదన పర్వతానికి వచ్చాడు. అక్కడ మునులంతా శ్రీరామచంద్రుని చూచి పులస్త్యబ్రహ్మ కొడుకైన రావణాసురుని చంపటంవలన బ్రహ్మహత్యాపాపం సంభవించిందని, కనుక ఆ పాపపరిహారార్థం ఆ ప్రదేశంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించవలసినదిగాను చెప్పారు.

శ్రీరాముడు శివలింగమును తీసుకొనిరమ్మని హనుమంతుని కైలాసానికి పంపాడు. ఆంజనేయుడు శివలింగమును తెచ్చునంతలో శుభముహూర్తం సమీపించినందువల్ల ఋషుల ఆజ్ఞప్రకారం సీతాదేవి చేతులతో అక్కడ ఇసుకను పోగు చేయించి శివలింగమును సిద్ధంచేసి యథావిధిగా శ్రీరాముడు ప్రతిష్ఠించాడు. ప్రతిష్ఠ పూర్తి అయ్యే సమయానికి హనుమంతుడు శివలింగంతో వచ్చి జరిగిన విషయాన్ని తెలుసుకొని చాలా బాధపడ్డాడు. తన పాదాలపై పడి వెక్కి వెక్కి ఏడుస్తున్న హనుమంతుని శ్రీరాముడు పైకి లేవనెత్తి బుజ్జగిస్తూ జరిగినదానికి కారణాన్ని చెప్పాడు.

శ్రీరాముని మాటలు హనుమంతునికి తృప్తిని కలిగించలేదు. అప్పుడు శ్రీరాముడు ఒక నవ్వు నవ్వి “ఆంజనేయా శుభముహూర్తం మించినదని కదా ప్రతిష్ఠ జరిపితిమి. నీకు ఇష్టం లేనిచో ఆ లింగమును పెకలించి వేయుము. తరువాత నీవు తెచ్చిన లింగమునే అక్కడ ప్రతిష్టించుదము” అన్నాడు. హనుమంతుడు పట్టరాని సంతోషముతో కుప్పిగంతువేసి, ముందుకు దూకి, శివలింగాన్ని పెకిలించాలని ప్రయత్నించాడు. గొప్ప బలసంపన్నుడైన వాయుపుత్రుడు ఎంత ప్రయత్నించినా శివలింగం కదలలేదు. పొడవాటి తన తోకను లింగం చుట్టూ చుట్టి బలవంతంగా ఒక్క గుంజు గుంజాడు. ఆవగింజంతైన ఉపయోగం లేకపోగా ఆ ఊపుకు హనుమంతుడు ఎగిరి క్రిందపడి మూర్చపోయాడు. సీత భయపడింది. శ్రీరాముని బ్రతిమాలింది. రాముడు తన చల్లని చేతులతో హనుమంతుని శరిరాన్ని తాకి మూర్చను పోగొట్టి,తన వడిలోనికి చేరదీశాడు. కన్నీరు తుడిచి బుజ్జగిస్తూ “నాయనా శాస్త్రోక్తముగా స్వామిని ప్రతిష్ఠించాం కదా! ఇప్పుడు ఈ శివలింగాన్ని ప్రపంచంలోని ఏ శక్తీ కదిలించలేదు” అని ఓదార్చి హనుమంతుడు తెచ్చిన శివలింగాన్ని ఆ దగ్గరలోనే శాస్త్రోక్తంగా ప్రతిష్ఠ చయించి హనుమంతుని తృప్తిపరచాడు. రామునిచే ప్రతిష్ఠించబడిన లింగం రామేశ్వరునిగాను, హనుమంతుడు తీసుకొనివచ్చిన శివలింగం హనుమదీశ్వరునిగాను ప్రసిద్ధి పొంది పూజలను అందుకొంటున్నాయి.
నాగేశ్వరలింగం:

నాగేశ్వర జ్యోతిర్లింగం. దారుకావనంలో గోమతికీ అరేబియా సముద్రానికి సంగమ స్థానంలో వుంది. ఒకప్పుడు శ్రీకృష్ణుని నివాసస్థానమైన ద్వారకా నగరం ఈ దారుకావనంలోనిదే.

యాత్రామార్గం:
గుజరాత్ రాష్ట్రంలోని ఈ క్షేత్రానికి వెళ్ళాలంటే బొంబాయినుండి అహ్మదాబాద్, సోమనాథ్, జూనాగఢ్ మీదుగా ద్వారాకచేరి అక్కడ నుండి 22 కి.మీ దూరంలో ఉన్న నాగేశ్వరాలయానికి సముద్ర ప్రయాణం చేసి దారుకావనంలో దిగి ‘గోపీ తలాబ్’ వెళ్ళే బస్సులో నాగ్‌నాథ్ వద్ద దిగాలి.

జ్యోతిర్లింగ క్షేత్రమైన సోమనాథ క్షేత్రమునుండి 7 గంటల కాలం బస్సులో ప్రయాణించి ద్వారకను చేరుకోవచ్చు.ద్వారకలో యాత్రికులకు వసతి సౌకర్యాలు బాగానే ఉన్నాయి. నాగ్‌నాథ్, ద్వారకకు 22 కి.మీ దూరం కాగా భేట్ ద్వారక 32 కి.మీ 12 జ్యోతిర్లింగ క్షేత్రాలలో నాగ్‌నాథ్ ఆలయమే అతి చిన్నది.

మహారాష్ట్రులు గుజరాత్‌లోని దీనిని జ్యోతిర్లింగముగా కాక పర్లి, వైద్యనాథ్ సమీపంలోని ఔండా నాగనాథ్‌ను క్షేత్రముగా భావిస్తారు.

పురాణగాథ:
పుర్వం దారుకుడు అనే పేరుగల రాక్షసుడు ఉండేవాడు. అతని భార్య దారుక ఆ రాక్షస దంపతులు మానవులను బాధిస్తూ, మహర్షుల యజ్ఞయాగాదులను నాశనం చేస్తూ పశ్చిమ సముద్ర తీరంలో 1000 యోజనాల పొడవు 1000 యోజనాల వెడల్పుగల వనాన్ని సొంతం చేసుకొని విలాసంగా విహరించసాగారు. వారిచే బాధింపబడే సాధువులందరు ఔర్వమహర్షి దగ్గరకు వెళ్ళి తమ బాధలను చెప్పుకున్నారు. వానిని రక్షించాలని భావించిన ఔర్వ మహర్షి “నిరపరాధులైన భూమిమీది ప్రజలను హింసించిన యెడల ఆ రాక్షసులు మరుక్షణమే మరణించెదరుగాక” అని శపించాడు.

ఆ విషయం తెలిసిన దారుకుడు ఆ వనాన్నంతటిని పైకెత్తి సముద్రం మధ్యలో స్థాపించుకున్నాడు. మహర్షి తన శాపంలో “భూమిమీద ప్రజలు” అన్నందువల్ల ఆ రాక్షస దంపతులు భూమిపై ఉన్న ప్రజల జోలికి పోకుండా సముద్రంలో ప్రయాణించేవారిని సంహరిస్తూ నిర్భయంగా కాలం గడపసాగారు.


విశ్వేశ్వరలింగం

విశ్వేశ్వర జ్యోతిర్లింగం పురాణ ప్రసిద్ధమైన కాశీనగరంలో ఉన్నది. కాశీక్షేత్రానికి వారణాసి, వారణాసి, మహాశ్మశానం,ఆనందకాననం, అవిముక్తం, రుద్రావాసం, ముక్తిభూమి, శివపురి, క్షేత్రపురి,కాశిక మొదలైన పేర్లున్నాయి. “వరణ” “అసి” అనే రెండు నదులు రెండు ప్రక్కల ఈ క్షేత్రానికి ప్రవహించటం వల్ల దీనికి వారణాసి అనే పేరు వచ్చినట్లు కనబడుతుంది.

మోక్షదాయకమైన ఏడు క్షేత్రాలలో కాశీ ప్రసిద్ధి పొందింది. వేదాలలోను పురాణాలలోను కాశీక్షేత్రం యొక్క మహిమ గొప్పగా వర్ణించబడింది. స్కాంద  పురాణంలోని కాశీఖండం ఈ క్షేత్రాన్ని గురించిన అసంఖ్యాకమైన వివరాలను తెలియజేస్తోంది.

ప్రళయ కాలంలో పరమేశ్వరుడు కాశీనగరాన్ని, తన త్రిశూలంమీద నిలబెట్టాడని చెబుతారు. “కాశ్యాంతు మరణాన్ముక్తిః” అనే సూక్తివలన ఈక్షేత్రంలో మరణిస్తే ముక్తి తప్పక లభిస్తుందని తెలుస్తోంది. ఈ క్షేత్రంలో మరణించిన వారికి కాశీ విశ్వనాథుడు కుడిచెవిలో తారకమంత్రాన్ని ఉపదేశిస్తాడని పూరాణాలు చెబుతున్నాయి.

“ఎప్పుడు కాశీకి వెళతానో! ఎప్పుడు విశ్వనాథుని సేవిస్తానో!” అని మనస్సులో పదే పదే తపన పడేవారికి కాశీలో నివసించినంత పుణ్యఫలం లభిస్తుందని.

    కదా కాశీం గమిష్యామి కదా డ్రక్ష్యామి శంకరం |
    ఇతి ఋవాణస్సతతం కాశీవాసఫలం లభేత్ ||

అనే పురాణవచనం చెబుతోంది.

యాత్రామార్గం:
దేశంలోని అన్ని ప్రధాన నగరాలనుంచీ కాశీ క్షేత్రానికి వెళ్ళటానికి రైలు సదుపాయాలున్నాయి. విజయవాడ నుంచి ఈ క్షేత్రం వెళ్ళేవారు కాజీపేట నాగపూర్, ఇటార్సీ, అలహాబాద్ మీదుగా వెళ్ళవలసి ఉంటుంది.

పురాణగాథ:
చిత్‌స్వరూపుడైన పరమశివుడు ఈ ప్రపంచాన్ని సృష్టించాలని అనుకున్నప్పుడు సగుణ రూపములో శివ స్వరూపుడుగా ఆవిర్భవించాడు. స్త్రీ పురుష రూపాలలో ప్రకటీకృతమైన ఆ పరబ్రహ్మమే శక్తిగాను, శివుడుగాను రూపొందారు. ఆ శివశక్తులు ప్రకృతి, పురుషులను సృష్టించారు. ప్రకృతి, పురుషుడు ఇరువురూ తమ తల్లిదండ్రులను తెలుసుకోలేక విచారిస్తున్నారు. అదే సమయంలో నిర్గుణ పరబ్రహ్మ అయిన పరమశివుడు అక్కడ ప్రత్యక్షమై “మీరిద్దరూ తపస్సు చేయండి బ్రహ్మాండాన్ని సృష్టించండి ” అని చెప్పాడు.

“ప్రభూ తపస్సు చేయటానికి అనువైన స్థానం ఏది ” అని ప్రశ్నించారు ప్రకృతి పురుషులు. అప్పుడు పరమశివుడు ఐదు కోసుల పరిమితి గల ఒక సుందరమైన నగరాన్ని వారికి నిర్మించి ఇచ్చాడు. ఆ మహానగరం ఆ పురుషునికి దగ్గరలో ఆకాశంలో నిలబడింది. ఆ నగరమే కాశీక్షేత్రం. పురుషుడే శ్రీమహావిష్ణువు.

విష్ణుదేవుడు కాశీనగరం నుండి సృష్టి చేయాలని సంకల్పించి చాలా సంవత్సరాలపాటు తపస్సు చేశాడు. ఆ సమయములో అలసిపోయిన ఆయన శరీరం నుండి అసంఖ్యాకమైన స్వేదజలధారలు ప్రవహించి విశాలమైన ఆకాశంలో వ్యాపించాయి. ఆ విచిత్రమైన దృశ్యాన్ని చూచి విష్ణువు ఆశ్చర్యంతో శిరస్సును కంపించాడు. అప్పుడీతని కుడిచెవి నుండి ఆభరణం (మణిభూషణం) జారిపడింది. అది పడిన ప్రదేశమే “మణికర్ణిక” అనే మహాతీర్థమయ్యింది. మహత్తరమైన ఆ జలరాశిలో కాశీనగరం మునిగిపోవటం మొదలయ్యింది. అప్పుడు పరమశివుడు కాశీపట్టణాన్ని తన త్రిశూలంపై ధరించాడు. మహావిష్ణువు తన భార్య అయిన ప్రకృతితో అక్కడ నిద్రించాడు. అప్పుడు ఆయన నాభినుంచి చతుర్ముఖబ్రహ్మ ఆవిర్భవించాడు. ఆయన శివాజ్ఞను పొంది బ్రహ్మాండాన్ని సృష్టించాడు. ఆ సందర్భంలో మహావిష్ణువు అణువుకంటే చిన్న, బ్రహ్మాండంకంటే పెద్ద అయిన పరమాత్మ స్వరూపుడగు పరమశివుని ఎన్నో విధాల స్తుతించాడు.

శ్రీమన్నారాయణుని సోత్రానికి పరమశివుడు సంతుష్టుడై, బ్రహ్మ, విష్ణు మొదలైనవారి ప్రార్థనను మన్నించి విశ్వేశ్వర జ్యోతిర్లింగంగా వారణాసిలో కొలువుతీరాడు.

త్ర్యంబకేశ్వరలింగం:

నాసిక్ మండలంలోని సహ్య పర్వతశిఖరం మీద వెలసియున్న త్ర్యంబకేశ్వర జ్యోతిర్లింగం ప్రపంచ ప్రఖ్యాతి గాంచినది. ఆ పరిసరాలలోనే పంచవటి ఉన్నది. లక్ష్మణుడు, శూర్పణఖకు ముక్కు, చెవులు కోసిన ప్రదేశమే పంచవటి. రావణాసురుడు సీతను అపహరించినది కూడా ఈ ప్రదేశంలోనే. ఇక్కడికి కొద్దిదూరంలో ఉన్న బ్రహ్మగిరి మీద గోదావరి నది పుట్టింది.

భక్తుల పాపాలను పోగొట్టుటలో ఉత్తర భారతదేశంలోని  గంగానది ఎలా ప్రసిద్ది గాంచినదో దక్షిణ భారతదేశంలోని గోదావరినది అంతటి ప్రసిద్ధిగాంచినది. గంగానది అవతరించటానికి భగీరథుని తపశ్శక్తి కారణం కాగా, గోదావరినది ఆవిర్భవించడానికి గౌతమమహర్షి త్యాగఫలం కారణమయ్యింది. అందువల్లనే గంగానదికి ‘భాగీరథి ‘ అని ప్రేరువచ్చినట్లు గోదావరికి ‘గౌతమి’ అని పేరు వచ్చింది.

గోదావరి, గౌతమ మునీంద్రుల ప్రార్థనవల్ల భక్తవత్సలుడైన శివుడు త్ర్యంబకేశ్వర రూపంలో ఇక్కడ వెలసియున్నాడు. ఈ ఆలయంలో మూడు చిన్న చిన్న లింగాకృతులు ఉన్నాయి. వాటిని బ్రహ్మ, విష్ణు, శివాత్మకమైన వాటిగా భక్తులు భావిస్త్తారు.

యాత్రామార్గం: మహారాష్ట్రలో ఉన్న ఈ జ్యోతిర్లింగాన్ని చూడటానికి బొంబాయి నగరం నుండి నాసిక్ వరకు 184 కి.మీ.లు రైలులో ప్రయాణించి అక్కడి నుండి 30 కి.మీ. బస్సులో ప్రయాణించి ఈ క్షేత్రాన్ని చేరవచ్చు.

పురాణగాథ:
గౌతముడు తపస్సంపన్నుడైన మహర్షి. ఆయన ధర్మపత్ని అహల్యాదేవి. బ్రహ్మగిరి శిఖరంమీద గౌతముడు అహల్యతో కలసి 1000 సం||రాలు కఠోరమైన తపస్సు చేశాడు. ఇది ఇలా ఉండగా ఒకప్పుడు అనావృష్ఠి కారణంగా దేశం నాలుగు మూలలా కరువుకాటకాలు వచ్చాయి. త్రాగటానికి నీరుకానీ, తినటానికి తిండిగానీ లేక ప్రజలు మలమలా మాడిపోయారు. పశువులకు గడ్డిలేక ఒక్కొక్కటి అంతరించి పోయాయి. చెట్టు చేమలు ఎండిపోయాయి. నేలబీటలు వారింది. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రపంచమంతా పాడుపడినట్లు అయింది.

దేశంలోని ఆ పరిస్థితి గౌతముని మనస్సును కదిలించివేసింది. కరుణామయుడైన గౌతముడు, వరుణదేవుని గురించి ఆరునెలలు తపస్సు చేశాడు. వరుణుడు ప్రత్యక్షమై “మహర్షీ నీ తపస్సుకు కారణం గ్రహించాను. నీవు చిన్న సరస్సు ఒకటి నిర్మించుకో, నేను దానిని నిండుగా అయ్యేలా చేస్తాను. అందులోని నీటిని ఎంతవాడినా తరగక అక్షయమై ఉంటుంది. అది అని చెప్పి అంతర్థానమయ్యాడు.

గౌతముడు సరస్సును నిర్మించాడు. వరుణదేవుని అనుగ్రహం వలన అది అక్షయ జలంతో నిండిపోయింది. గౌతముడు ఆ నీటితో తన నిత్యకృత్యాలు నెరవేర్చుకుంటూ జపహోమాలు, పూజలు మొదలైనవి యథావిధిగా చేసుకొంటున్నాడు. ఈ సరోవరంలోని నీటివల్ల పరిసర ప్రాంతమంతా చెట్లు చిగిర్చి పచ్చపడింది. పశువులకు, పక్షులకు సుఖజీవితం లభించింది. ఆ సరసున చుట్టూ ఒక చక్కని తపోవనం తయ్యారయ్యింది.

ఎక్కడెక్కడి ఋషులు అక్కడికి వచ్చి చేరారు. మునులంగా గౌతమాశ్రమం చుట్టూ వర్ణశాలలను నిర్మించుకొని కాలం సుఖంగా గడపసాగారు .

ఇది ఎలా ఉండగా ఒకరోజు ఋషుల భార్యలు గౌతముని భార్య అయిన అహల్యాదేవితో కారణం లేకుండానే తగాదాపడ్డారు. అంతటితో ఆగక తమ భర్తలను గౌతమునిపైకి పురికొల్పారు. విశ్వాసం లేని ఆ ఋషులు గౌతముని మీదికి కయ్యానికి కాలుదువ్వారు. చివరకు గౌతమునికి హాని తలపెట్టారు. అయినా ఋషుల దూషణలనుగానీ రోషంతో కూడిన తీవ్రపదజాలాన్ని గానీ గౌతముడు లెక్కపెట్టక సహనంతో ఉన్నాడు. అతని సహనం. వారి కోపాన్నీ వేయింతలు చేసింది. చివరకు చెడ్డవారైన ఆ ఋషులు గౌతముని పంటపొలాలలోనికి తోలరు. ఆవు పంటను పాడుచేయుట చూచి గౌతముడు ఒక గడ్డిపరకతో ఆవును అదలించాడు. ఆ గడ్డిపరక ఆవును తాకునంతనే ఆ ఆవు గిరగిర తిరిగి నెలపై కొరిగి మరణించింది.ఇదంగా ఋషులు చేసిన కుట్ర అని గౌతముడు ఊహించలేదు.

ఆవు నేలపై పడినే వెంటనే సమయం కోసం వేచి చూస్తున్న ఆ ఋషులందరూ పరుగు పరుగున గౌతముని వద్దకు వచ్చి గోహత్య చేసినందుకు గౌతమ మహర్షిని రకరకాలుగా నిందించారు. అహంకారం వల్ల కళ్ళు మూసుకుపోతున్నాయా! అని నిలదీశారు. అంతేకాక తక్షణమే ఆ వనాన్ని వదలి వెళ్ళిపోవలసినదని శాసించారు. ధర్మమూర్తి అయిన గౌతముడు చేసేదిలేక భార్యతో కలసి ఆశ్రమాన్ని వదలి కొంతదూరం వెళ్ళి అక్కడ ఒక కుటీరాన్ని నిర్మించుకొన్నాడు.

మునులంతా అహంకారంతో గౌతముని కుటీరానికి వెళ్ళి “ఓయీ గౌతమా నీతలపై గోహత్యా పాతకం తాండవిస్తోంది. నీ ముఖం చూస్తేనే పంచ మహాపాపాలు అంటుకుంటాయి. నీ దర్శనంవల్ల అష్టకష్టాలు సంప్రాప్తిస్తాయి. నీవు మాకు దగ్గరలో ఉన్నందువల్ల మేము చేసే యజ్ఞయాగాదులకు దేవతలు హాజరుకావటంలేదు. హోమంలో వేసే పదార్థలు దేవతలకు కానీ పితృదేవతలకు కానీ చెందటంలేదు. అందువల్ల ఇక్కడ ఉండే అర్హత నీకులేదు. నీ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకో ” అని గర్జించారు.

గౌతముడు “మునులతో నా పాపానికి ప్రాయశ్చిత్తం కూడా మీరే చెప్పండి.” అన్నాడు.

అప్పుడు ఋషులు గౌతముని చూచి “నీవు మూడుసార్లు భూప్రదక్షిణం చేసిరావాలి. ఒక నెలకాలం ఏ విధమైన ఆహారం తీసుకోకుండా తపోదీక్ష సాగించాలి. ఈ బ్రహ్మగిరి చుట్టూ 101సార్లు తిరిగి రావాలి. ఇక్కడకు గంగను తీసుకొనిరావాలి. ఆ నీటితో కోటీ శివలింగాలకు అభిషేకం చేసి పూజించాలి. తరువాత 100 బిందెల నీటితో శివుని అభిషేకించాలి. అప్పటికి గానీ నీ గోహత్యాపాతకం తీరదు.” అని కఠోరంగా పలికారు.

గౌతముడు ఋషుల ఆదేశాన్ని శిరసా వహించాడు. వాళ్ళు చెప్పిన పనులన్నీ కొనసాగించాడు. భార్యతో కలసి బ్రహ్మగిరిపైన పార్ధివలింగాకారములో ఉన్న పరమశివుని భక్తితో పూజించాడు.

గౌతముని ధర్మాసక్తికి, దైవభక్తికి, సహనానికి శివుడు సంతోషించి ప్రమథగణంతో సహా ప్రత్యాక్షమై గౌతమునితో “నీ భక్తికి మెచ్చాను. నీ కోరిక తీర్చటనికే వచ్చాను. కావలసిన వరం ఏమిటి కోరుకో.” అన్నాడు.

గౌతముడు ఆనందంతో ప్రభూ నీ దర్శనం వలన నా జన్మ తరించినది. నాకు ఇంకేమీ వద్దు” అని శివుని పాదాలు పట్టుకోని ప్రార్థించాడు.

శివుడు “నీవు మునులలో శ్రేష్ఠవు. నీ తోడి ఋషులు నీ గొప్పతనాన్ని సహించలేక అజ్ఞానముతో నిన్ను హింసించారు. వారిని క్షమించు. ” అన్నాడు .

అందుకు గౌతముడు “స్వామీ వారు నాకు చాలా ఉపకారం చేశారు. లేకుంటే మీ దర్శనభాగ్యం నాకు కలిగేది కాదుగదా” అన్నాడు.

గౌతముని శాంత స్వభావానికి పరమశివుడు సంతోషించి “గౌతమా ఇదిగో నీ కోరికను అనుసరించి గంగను ప్రసాదిస్తున్నాను. ఈ గంగ గౌతమి అనే పేరుతో నీ కీర్తిప్రవాహంలాగా ప్రవహిస్తుంది. నేను త్ర్యంబకేశ్వర జ్యోతిర్లింగ రూపంతో ఈ గౌతమి తీరంలో ఉండి నీవంటి భక్తులను అనుగ్రహిస్తాను.” అని అంతర్ధనమయ్యాడు.

ఋషులంతా గౌతముని పాదాలపై పడి క్షమించమని వేడుకున్నారు. దేవతలంతా సంతోషించారు. అప్పటి నుండి గంగ “గౌతమి” పేరుతో ప్రవహిస్తూ భూమిని పవిత్రం చేస్తోంది. శివుడు త్ర్యంబకేశ్వర రూపంతో ఆ తీరంలో విరాజిల్లుతున్నాడు.
కేదారేశ్వర లింగం

హిమాలయాలలోని కేదార శిఖరంపై విరాజిల్లే జ్యోతిర్లింగమే కేదారనాథ లింగం. కేదార శిఖరానికి పడమటి వైపున ‘మందాకిని’, తూర్పువైపున అలకనంద ప్రవహిస్తున్నాయి. మందానికి ఒడ్డున కేదారనాథస్వామి, అలంకనంద ఒడ్డున బదరీనారాయణ స్వామి వెలసియున్నారు. అలకనందా, మందాకిని నదులు ‘రుద్రప్రయాగ’లో కలసి కొంతదూరం ప్రవహించి ‘దేవప్రయాగ’ దగ్గర ‘భాగీరథి’లో కలుస్తున్నాయి. అందువల్ల గంగా స్నానముచేసే భక్తులు కేదారనాథ, బదరీనాథ్‌ల చరణ కమలాల నుండి వచ్చిన నీటిలో మునుగుతున్నట్లుగా భావించి పులకించిపోతారు. స్కాందపురాణంలోని కేదారఖండం ఈ కేదారేశ్వర జ్యోతిర్లింగం మహిమను గొప్పగా వర్ణించింది. ఏ భక్తుడైన కేదారనాథుని దర్శించకుండా బదరీయాత్ర చేసినట్లుయితే వాని యాత్ర నిష్ఫలమని పై పురాణం చెబుతోంది.

కేదారనాథుని దర్శించటానికి బయలుదేరిన ప్రాణి మార్గమధ్యంలో మరణించినా స్వామిని దర్శించిన పుణ్యం తప్పక లభిస్తుందని పురాణలు చెబుతున్నాయి.

కేదారనాథక్షేత్రం హరిద్వారమునకు 240 కి.మీ.లు., ఋషి కేశమునకు 211 కి.మీ.లు. 12 జ్యోతిర్లింగాలలో అత్యంత ఉన్నతమైనది కేదారనాథ్. ఇది సముద్ర మట్టానికి సుమారు 16,000 అడుగుల ఎత్తులో వుంది. 12 జ్యోతిర్లింగాలలో అతిపెద్దది కూడా ఇదే. పర్వతశిఖరమే జ్యోతిర్లింగము కనుక దీనికి పానుపట్టంలేదు. గర్భగృహాన్ని లింగాకారములో ఉన్న పర్వత శిఖరము ఆక్రమించివున్నదని చెప్పటంకంటే జ్యోతిర్లింగ రూపమైన పర్వత శిఖరం చుట్టూ ఆలయం నిర్మించబడిందని చెప్పటం బాగుంటుందేమో. ఈ జ్యోతిర్లింగంలో కైలాసపర్వతం యొక్క సూక్ష్మరూపం గోచరిస్తుంది.

కేదారనాథ్ యాత్రలో శివశక్తి స్పష్టంగా కనపడుతుంది.

యాత్రామార్గం:
ఉత్తరప్రదేశ్‌లోని ఈ క్షేత్రానికి వెళ్ళాలంటే విజయవాడ నుండి నేరుగా ఢిల్లీ వెళ్ళి అక్కడ నుండి ఋషికేశ్ దాకా రైలులో ప్రయాణించి అక్కడ నుండి 280 కి.మీ బస్సులో వెళ్ళి గుప్తకాశీని దాటి గౌరీకుండాన్ని చేరాలి. అక్కడే గౌరీదేవి ఆలయం ఉంది. అక్కడే మంచుకొండల మధ్య నిరంతరం ఒక నీటిబుగ్గలో నుండి వేడినీరు వస్తూ ఉంటుంది. అదే గౌరీకుండం. అక్కడే పార్వతీదేవి తపస్సు చేసింది. ఆమె సౌకర్యం కోసమే తండ్రి అయిన హిమవంతుడు ఆ తపోభూమిని ఏర్పాటు చేశాడు. అదే నేడు భక్తులకు సౌకర్యంగా వుంది. ప్రకృతిలోని విచిత్రాలలో యీ వేడినీటిబుగ్గ ఒకటి.

గౌరీకుండం నుంచి భక్తులు తప్పనిసరిగా కాలినడకనగానీ, డోలీలలో గానీ, పొట్టి గుఱ్ఱాలపై గానీ 14 కి.మీ.లు ప్రయాణించి కేదరనాథ్‌ను చేరాలి. గుఱ్ఱపుస్వారికి సుమారు 200 రూ.లు, డోలీకి 350 రూ.లు తీసుకుంటారు. ఉదయం బయలుదేరితే కేదరానాథ్ దర్శనము చేసుకొని సాయంత్రానికి గౌరీకుండానికి తిరిగి రావచ్చు.

రాత్రిపూట కేదరానాథ్‌లోని ఉండాలనుకొన్న యాత్రికులకు “కాలీకంబ్లీ వాలాసత్రం” “భారత్ సాధూసమాజ్” వారి యాత్రా నివాసం, టూరిస్ట్ బంగ్లా మొదలైనవి వసతిని కల్పిస్తున్నాయి. కేదారేశ్వర వాతావరణం చాలా మనోహరంగా ఉంటుంది. కానీ తరుచు హఠాత్తుగా మబ్బులు కమ్మి వడగండ్లతో వాన పడుతుంది.

పురాణగాథ:
నరనారాయణులు గొప్ప తపస్సంపన్నులు. వారిద్దరూ విష్ణుమూర్తి యొక్క అవతారములు. ఆ మహర్షులు బదరికాశ్రమంలో చాలా సంవత్సరాలు తపస్సు చేసి జగత్తుకు మేలు కలగాలన్న కోరికతో కేదార శిఖరంపై శివుని ఆరాధించటం మొదలుపెట్టారు.

వారిద్దరూ ప్రతిరోజు ప్రభాత కాలంలో మందాకినిలో స్నానం చేసి ఈశ్వరుని పార్థింప లింగములను నిర్మించుకొని భక్తితో పూజ చేసేవారు. మందాకిని నీటితోనూ పవిత్రమైన బిల్వప్రతితోనూ చక్కగా వికసించిన తామర పువ్వులతోనూ వారిద్దరూ ప్రతిరోజు మిక్కిలి శ్రద్ధతో శివుని పూజించేవాళ్ళు.

ఇలా కొంతకాలం గడిచాక పరమశివునికి నరనారాయణులపై కరుణ కలిగి వారికి సాక్షాత్కరించాడు. అప్పుడు వారిద్దరు శివునికి సాష్టాంగ నమస్కారములు చేసి ఏంతగానో స్తుతించారు. ప్రసన్నుడైన శివుడు వారిని వరం కోరుకోమన్నాడు. అప్పుడు వారిద్దరు చేతులు జోడించి “మృత్యుంజయా ! జగత్ కళ్యాణం కోసం మేము నిన్ను ఆరాధించాము. నీవు మమ్ము అనుగ్రహించావు. ఇక ముందుకాలములో కూడా నిన్ను ఇక్కడ సేవించినవారికి కోరికలు నెరవేరుస్తూ ఈ శిఖరం మీదనే ‘కేదారేశ్వరుడు’ అనే పేరుతో నిలిచివుండు. నిన్ను దర్శించి స్తుతించిన భక్తులు తరిస్తారు. ఇదే మా కోరిక”  అని ప్రార్థించారు. పరమశివుడు వారి కోరికను మన్నించి కేదారనాథ్ జ్యోతిర్లింగ రూపంలో అక్కడే ప్రకాశిస్తున్నాడు.

ఈ స్వామిని కృతయుగంలో నరనరాయణులు, త్రేతాయుగంలో ఉపమన్యు మహర్షి, ద్వాపర యుగంలో పాండవులు పూజించి ధన్యులయ్యారు. కేదారనాథ్ దేవాలయంలో పాండవులు శిలావిగ్రహాలను మనం చూస్తాం.

ఘృష్ణేశ్వరలింగం

దక్షిణ భారతదేశంలోని జ్యోతిర్లింగాలలో ఒకటైన ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు సమిపంలో వుంది. దౌలతాబాద్‌కు 4 కి.మీ. దూరంలోని ఎల్లోరాలో ఉన్న ఈ జ్యోతిర్లింగం “స్పర్శవేది లింగం”. సంతానం లేనివారు ఈ స్వామిని సేవించి సంతానాన్ని పొందుతారు. ఇతిహాస కాలంలో ‘విశాల’ దేశంగా ప్రసిద్ది చెందిన ఆ ప్రాంతానికి అదే ముక్తికేద్రం.

యాత్రామార్గం:
ఈ క్షేత్రానికి చేరటానికి ఔరంగాబాద్ నుండి నేరుగా బస్సులు ఉన్నాయి. స్థానికులచే “వెరూలా”గా పిలువబడే ఈ క్షేత్రం ఔరంగాబాదుకు 8 కి.మీ.లు ఇది చిన్నగ్రామం అయినందువల్ల యాత్రికుల వసతికి ఏర్పాట్లు అంతగా లేవు. అందువల్ల యాత్రికుల ఔరంగాబాద్‌లోనే విశ్రాంతి తీసుకుంటారు.

పురాణగాథ:
పూర్వం దేవగిరి అనే పట్టణంలో సుధర్ముడు, సుదేహ అనే బ్రాహ్మణ దంపతులుండేవారు. వారిద్దరు ధర్మ కార్యాలలో ఆసక్తి కలిగి వైదిక విధులను నిర్వర్తిస్తూ శివభక్తులై ఉండేవారు. వారికి సకల సంపదలు ఉన్నప్పటికి సంతానం లేనందువల్ల ఎన్నో నోములు నోచి తీర్థయాత్రలు చేసి అప్పతికీ ఫలితం లేనందువల్ల తమ వంశాన్ని ఎలా నిలుపుకోవాలా అని ఆలోచించసాగారు.

ఒకనాడు సుదేహ తన భర్తతో సంతానం కోసం తన చెల్లెలు అయిన ఘృశ్మలను వివాహం చేసుకొనవలసినదిగా వత్తిడి చేసింది. భార్య కోరికమేరకు సుధర్ముడు చివరకు ఘృశ్మలను పెళ్ళిచేసుకొన్నాడు. శివానుగ్రహం వలన ఘృశ్మలకు చక్కని కుమారుడు పుట్టాడు. వారు ముగ్గురు పిల్లవానిపై మమకారాన్ని పెంచుకుటూ ఎంతో గారాబంతో విద్యాబుద్దలు చెప్పించారు.

శివభక్తురాలైన ఘృశ్మల తన వివాహం అయినప్పటినుంచి ప్రతిరోజూ 1001 పార్థివ లింగాలకు పూజచేసి అనంతరం వాటిని ఇంటికి దూరంగా ఉన్న ఒక చెరువులో వేసివచ్చిన తరువాతనే భోజనం చేసేది. తమ కుటుంబానికి మంచి జరగటం కోసం ఆమె చేస్తున్న పూజలవల్లనే తనకు పుత్రసంతానం కలిగిందని ఆమె విశ్వసించేది.

ఇదిలా వుండగా ఘృశ్మల కొడుకు పెరిగి పెద్దవాడయ్యాడు. సుధర్ముడు మంచి సంస్కారం, చక్కని రూపంగల ఒకామెను తీసుకొని వచ్చి ఆమెతో తన కుమారునికి వివాహం జరిపించాడు.

సుధర్ముడి పెద్ద భార్య సుదేహ తన చెల్లెలి వివాహం అయినప్పట్టి నుండి చుట్టు ప్రక్కల ప్రజలు ఆమెకు యిస్తున్న గౌరనాన్ని, ఆమెకు పుత్రుడు కలిగిన తరువాత ప్రజలు ఆమెకు మరింత గౌరవాన్ని యివ్వడాన్ని ఓర్చుకోలేకపోయింది. కొడుకు, కోడలుతో ఘృశ్మల ఎంత ఆనందంగా ఉన్న విషయం సుదేహకు మరీ భాదను కలిగించింది.ఎలాగైనా ఆ ఆనందాన్ని కాలరాయాలని అనుకొంది. అసూయా ద్వేషాలతో కుళ్ళిపోతున్న ఆమె మనస్సుకు ఘృశ్మల కొడుకును చంపేయాలనిపించింది. ఒకనాటి రాత్రి అందరూ నిద్రిస్తుండగా కొడుకు తలనరికి యింటికి దూరంగా ఉన్న చెరువులో వేసి ఏమీ తెలియనిదానిలా వచ్చి నిద్రకు ఉపక్రమించింది. భర్త మొండెం నుంచి ప్రవహించిన రక్తం తన శరిరానికి తాకగానే కోడలు నిద్రలేచి భర్త తలనరికి ఉండటం చూసి పెద్దగా ఏడుస్తూ అత్తమామలకు చెప్పబోయింది. శివపంచాక్షరీ జపంలో నిమగ్నమై ఉన్న సుదర్ముడు ఏమీ గమనించే స్థితిలో లేదు. ఘృశ్మల ఆనాటి లింగార్చనలో లీనమై ఉంది.

కోడలి ఏడుపులు విని కళ్ళు తెరచిన ఘృశ్మల కొడలితో “అమ్మా నేటితో కోటింగార్చన పూర్తి అయ్యింది. శివుడు మనకు సాక్షాత్కరించునున్నాడు. అందువల్ల యీ శుభసమయంలో నీకు పతివియోగం కాని, నాకు పుత్రశోకం గాని ఉండదు నా కుమారుడు ఎలా మరణించాడో అలాగే తిరిగి జీవిస్తాడు” అంటూ పూజలో నిమగ్నమయ్యింది.

కోడలికి ఏం చేయాలో దిక్కుతోచలేదు.

పూజ పూర్తి అయిన వెంటనే ఘృశ్మల లింగాలను తీసుకొని వెళ్ళి చెరువులో వేసింది.

వెంటనే శివుడు ప్రత్యక్షమై “నీ కోటి లింగార్చనకు, శివపూజలో నీ ఏకాగ్రతకూ మెచ్చాను. వరం కోరుకో.” అన్నాడు.

అందుకు ఘృశ్మల “స్వామీ నా కోడలు పతి వియోగం విలవిలలాడుతోంది. ఆమెకు పతిబిక్ష పెట్టు. నీవు ప్రత్యక్షమైన ఈ ప్రదేశంలోనే జ్యోతిర్లింగ రూపునివై ఘృశ్మేశ్వరునిగా ప్రజల సేవలనందుకొంటూ నిన్ను సేవించినవారికి సంతాన నష్టంగాని అకాల మరణంగాని లేకుండా కాపాడు.” అని కోరింది.

‘తథాస్తు’ అన్నాడు శివుడు.

ఇప్పుడున్న ఘృష్ణేశ్వరలింగానికి దగ్గరలో చెరువులో కోటిలింగాలున్నాయి.

No comments:

Post a Comment