Tuesday, 13 March 2018

మంగళగిరి - పానకాల నరసింహస్వామి





సగం పానకం ఏమైంది?

గుటకలు వేస్తూ తాగే దేవుడు... బెల్లం చుట్టూ చేరని చీమలు
నృసింహ దేవుడు! పానకమే ఆయనకు అమృతం! నోటికి అందించగానే... గుటకలు వేస్తూ మింగుతాడు! ‘మీ కోసం’ అంటూ సగం వదిలేస్తాడు! గుంటూరు - విజయవాడ నడుమ ఉన్న మంగళగిరి క్షేత్రంలో ఈ వింత కనిపిస్తుంది.

దేశంలో... ఆ మాటకొస్తే ప్రపంచంలో ఎక్కడైనా దేవుడి ముందు నైవేద్యాలు పెట్టడమే! మంగళగిరిలో మాత్రం నేరుగా పానకాన్ని నరసింహుడి నోటికి అందిస్తారు. మనం పానీయాలను తాగేటప్పుడు గుటకలు వేయడం సహజం. అదే విధంగా... మంగళగిరి నరసింహుడి నోటికి పానకం అందించినప్పుడు గుటకల శబ్దం వినిపిస్తుంది. ఎగువ మంగళగిరిలో... ఒక చిన్న గుహలా ఉన్న కొండ అంచులో పది నుంచి 15 సెంమీల వ్యాసంలో బిలాకృతి ఉంటుంది. ఈ బిలానికి రెండువైపులా శంఖు చక్రాల ఆకారాలు కనిపిస్తాయి. ఇదే ఇక్కడి స్వామివారి నిజరూపం. భక్తులు సమర్పించే పానకాన్ని అర్చకులు ఈ బిలంలో శంఖు ద్వారా పోస్తుంటారు.

భక్తులు నివేదించే పాత్రలో కచ్చితంగా సగం మాత్రమే లోపలికి పోతుంది. మిగిలిన సగాన్ని భక్తులు తీర్థంగా సేవిస్తారు. వందల సంవత్సరాలుగా ఈ చిత్రం జరుగుతూనే ఉంది. లోపల ఉన్న పానకం ఒక్క చుక్క కూడా బయటకు రాదు. ఈ కొండ ఒక అగ్నిపర్వతమని.. అందులో ఉన్న గంధకాన్ని చల్లబరచేందుకే పూర్వీకులు ఈ బిలాకృతిని ఏర్పరిచి పానకం పోయడం మొదలుపెట్టారని కొందరు వాదిస్తారు. అయితే... ఈ కొండలో ఎలాంటి గంధకం నిల్వలు లేవని, అది సాధారణ కొండ మాత్రమేనని పరిశోధనల్లో తేలింది. మంగళగిరి పానకాల స్వామి క్షేత్రంలో మరో వింత ఏమిటంటే... నిత్యం బెల్లం పొడికొట్టి, లీటర్ల కొద్ది పానకం తయారు చేస్తున్నా ఒక్క చీమ కూడా రాకపోవడం గమనార్హం.

పురాణగాథ ఇది... కృతయుగంలో నముచి అనే రాక్షసుడు విష్ణువు వదిలిన చక్రాయుధం నుంచి తప్పించుకునేందుకు మంగళగిరి కొండపై ఉన్న చిన్న బిలంలో దాగున్నాడట! అప్పుడు స్వామి సూక్ష్మ సుదర్శన రూపంలో అదే బిలంలో చేరి నముచిని వధించాడట! ఉగ్రరూపంలో ఉన్న స్వామిని శాంతపరిచేందుకు దేవతలు అమృతాన్ని నివేదించారట. తదనంతరం స్వామివారు అక్కడే స్వయంవ్యక్తమై వెలిశారని... కృతయుగంలో అమృతాన్ని, త్రేతాయుగంలో ఆవుపాలను, ద్వాపరయుగంలో నేతిని, కలియుగంలో బెల్లం పానకాన్ని నైవేద్యంగా స్వీకరిస్తున్నారని పురాణ గాథ వివరిస్తోంది.

- మంగళగిరి





No comments:

Post a Comment