Wednesday, 14 March 2018

కేదారనాథ్‌ - బద్రినాథ్‌

వెండికొండల్లో కేదారం... బద్రినాథ్‌


దేవభూమిగా ఖ్యాతిచెందిన ఉత్తరాఖండ్‌లో కేదార్‌నాథ్‌, బద్రినాథ్‌లు హిమాలయ పర్వతసానువుల్లో ఉన్నాయి. హిమాలయ శ్రేణుల్లో వెలసిన ఈ పుణ్యక్షేత్రాలు ఏటా మంచులో కూరుకుపోయి ఉంటాయి. దాదాపు ఆరునెలలు మూసి ఉండే ఈ ఆలయాలు సాధారణంగా మేనెలలో మాత్రమే తెరచుకుంటాయి. అక్టోబర్‌లో లేదా నవంబర్‌లో తిరిగి మూసుకుపోయే మంచు మేటల వల్ల దర్శనానికి వీలుపడదు.

దిల్లీ నుంచి సుమారు 500కి.మీ దూరంలో వున్న ఈ క్షేత్రాలకు యాత్రికులకు అనుకూలమైన రీతిలో ఎన్నో టూరిస్టు బస్సులు నడుస్తుంటాయి. హరిద్వార్‌, రుషికేశ్‌ల మీదుగా ఈ ప్రయాణాన్ని (రిషికేశ్‌ వరకూ రైల్లో వెళ్లొచ్చు). ప్లాన్‌ చేసుకోగలిగితే, ఒకే టూర్‌ ప్యాకేజీగా చక్కని యాత్ర ప్లాన్‌ చేసుకోగలిగిన వారవుతారు. రిషికేశ్‌ నుంచి హిమాలయాల మీదనే కేదార్‌నాథ్‌ చేరుకోవాలంటే 250కి.మీ దూరం ప్రయాణించాలి.

ఒకవైపు ఎత్తయిన పర్వతాలు, ఇంకో వైపు అగాధమైన లోయలు. దానికున్న దారి మాత్రం ఇరుకు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కైలాసనాథుడిపై భారం వేసి ప్రయాణం చేయతగిన యాత్ర. పైగా కొండచరియలు విరిగిపడి దారి ఎక్కడెక్కడ మూసుకుపోతుందో కూడా చెప్పలేని పరిస్థితి.

ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన కేదారం శివభక్తుల పాలిట మందారం. విష్ణుభక్తులకు బదరీ మోక్షరాదారి.

ఇక్కడ భగవంతుని మహిమకు గొప్ప నిదర్శనం. ఈ రెండు ఆలయాలకూ తాళాలు వేసే ముందు ఆఖండ జ్యోతిని వెలిగిస్తారు. ఆలయాలను ఆర్నెల్ల తర్వాత తిరిగి తెరిచాక కూడా ఇవి వెలుగుతూనే వుంటాయి.పూర్తిగా మంచుతో కప్పబడిపోయినా.. వీటికి కావలసిన వాయు ప్రసారం ఎలా అందుతుందో అన్నది ఇప్పటికీ మానవుడి పరిశోధనకు అంతుబట్టకపోవడం దైవమహిమకు నిదర్శనంగానే నిలిచిపోయింది. ప్రఖ్యాత శాస్త్రవేత్తలు సైతం దీనికి జవాబు చెప్పలేకపోయారు. దీనిని దైవమహిమగానే భావించాలి.

అంతేకాకుండా.. ఈ రెండు క్షేత్రాలకు మధ్య వందలాది కి.మీ పరిధిలో నిత్యశీతలం... తప్ప వేడి అనేది ఉండదు. ఇటువంటి చోట 120డిగ్రీల సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రత కలిగిన వేడినీటి వూటల ప్రవాహం. నిజంగా ఇది అద్భుతం. ఇదెలా సాధ్యమనే విషయమై పరిశోధనలు అయితే జరిగాయి. కానీ పరిశోధనలకు అందలేదు. జన్మలో ఒక్కసారైనా ఈ క్షేత్రాలను దర్శించలేని వారి జన్మవృథా అనేది కొందరి విశ్వాసం.

ఈ యాత్ర కష్టసాధ్యమే కానీ అసాధ్యమేమీ కాదు.

12 వేల అడుగుల ఎత్తులో.. కేదార్‌నాథ్‌
గౌరీకుండ్‌ అనే శిఖర ప్రాంతం వరకు ఏదో రీతిన వాహన సదుపాయాలు లభ్యం అవుతున్నప్పటికీ అక్కడి నుంచి మోటారు వాహనాలకు అవకాశం లేదు. డోలీ కట్టించుకుని కానీ, కాలినడకన ప్రయాణించి కానీ 14కి.మీ ప్రయాణం తప్పదు. ఎంతో సుశిక్షితంగా, సునిశితంగా గుర్రాలు యాత్రికుల్ని తీసుకెళ్లగలవు. కానీ వాటిని ఎక్కేవారికి ధైర్యం చాలకపోతే ఇబ్బందే. డోలీ ప్రయాణం ఖరీదైనది. ఒక్కో వ్యక్తికి 14కి.మీలకు రానుపోను రూ.2,500లకు పైగా వసూలు చేస్తారు.

సముద్రమట్టానికి 12వేల అడుగుల ఎత్తున ఉన్న, మంచుతో అవరింపబడి ఎంతో మనోహరంగా ఉన్న కేదార్‌నాథ్‌ ఆలయాన్ని పాండవులు నిర్మించారని ప్రతీతి.

శివభక్తుల పాలిట భువిలో వెలసిన కైలాసంగా భావించబడుతున్న ఈ జ్యోతిర్లింగ క్షేత్రంలో భక్తులే స్వయంగా కేదారేశ్వరుని దర్శించుకుని పూజలు జరుపుకోవచ్చు. ఆదిశంకరాచార్యులు స్వయంగా ఈ శివుని దర్శించాకే హిమాలయాల్లోకి వెళ్లి అదృశ్యమయ్యారట.

ఇక్కడ ఇప్పటికీ వందలాది సంవత్సరాల నుంచి రుషులు తపస్సు చేస్తున్నారని కొందరు చెబుతుంటారు. వారిలో వృద్ధాప్య ఛాయలు ఏమాత్రం కనిపించవు. ఇక్కడ మరణిస్తే పునర్జన్మ ఉండదంటారు.

ఇంత శీతల ప్రదేశంలోనూ పర్యాటకులకు అనువైన వసతి గృహాలు, హోటళ్లు ఉంటాయి. విద్యుత్తు సరఫరాకు అవకాశం లేని ప్రాంతం. మేలో మండు వేసవిలో ఇక్కడ మాత్రం చలిగా ఉంటుంది. బదరీనాథ్‌


కేదారనాథ్‌ నుంచి సరాసరి బదరీనాథ్‌కు వెళ్లలేం. తిరిగి గౌరీకుండ్‌కు చేరుకోవాలి. ఇక్కడి నుంచి బదరీనాథ్‌ 230కి.మీ దూరంలో ఉంటుంది.

జోషీమఠ్‌ వరకు అన్నికాలాల్లోనూ యాత్రికులకు వెళ్లగల అవకాశం ఉంటుంది. ఇక్కడి నుంచి బదరీనాథ్‌కు 42కి.మీ ఇది కూడా వన్‌వే ట్రాఫిక్‌. గౌరీకుండ్‌ నుంచి జోషీమఠ్‌ 160 కి.మీ.దూరంలో ఉంది.

బదరీ దేవాలయం మూసి ఉన్న కాలంలో నారాయణుడికి ఇక్కడే పూజలు జరుగుతాయి.

జోషీమఠ్‌ నుంచి బదరీనాథ్‌ చేరుకోవడానికి సుమారు 4గంటలు ఈ పడుతుంది.ఈ ప్రాంతం హిమాలయాల్లో సుమారు పదివేల అడుగుల ఎత్తున ఉంటుంది.విష్ణుభక్తులకు ఇది భూలోక వైకుంఠం. బ్రహ్మకపాలం పేరుగల ప్రాంతం ఇక్కడికి చేరువలోనే ఉంది.ఇక్కడ పితృదేవతలకు పిండప్రదానం చేస్తే, ఏ ఇతర ప్రాంతాల్లోనైనా ఏటా పిండ ప్రదానం అవసరం లేదని చెబుతారు. ఈ ప్రదేశంలో ఎక్కువగా రేగు చెట్లు ఉండటం వల్ల ఈ ప్రాంతాన్ని బదరీనాథ్‌ అంటారట.

క్రీ.శ 15శతాబ్దిలో గఢ్వాల్‌ రాజులచే ఇక్కడ ఆలయం నిర్మితమైందనీ కానీ క్రీ.శ 8వ శతాబ్ది నాటికే, ఇక్కడ శంకరాచార్యుల వారి ప్రయత్నంతో ఆలయానికి అంకురార్పణ జరిగిందని చెబుతారు. కేదార్‌నాథ్‌ మాదిరిగానే ఇక్కడ కూడా తప్తకుండ్‌లో వేడినీటి వూటలు వస్తుంటాయి.

ఇక్కడికి సమీపంలోనే ‘మానా’అనే ఊరు ఉంది. ఈ గ్రామం భారత్‌-చైనా సరిహద్దును ఆనుకొని ఉంది. భారతదేశానికి సంబంధించి ఇదే చివరి గ్రామం.

ఎలా వెళ్లాలి
హైదరాబాద్‌ నుంచి కేదార్‌నాథ్‌ 1,485 కి.మీ దూరంలో ఉంది. కేదార్‌నాథ్‌ వెళ్లడానికి రైలు, విమాన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. కేదార్‌నాథ్‌కు 239కి.మీ దూరంలో ఉన్న డెహ్రాడూన్‌లోని జాలీగ్రాంట్‌ విమానాశ్రయానికి దిల్లీ నుంచి ప్రతిరోజూ విమానాలు ఉన్నాయి. విమానాశ్రయం నుంచి టాక్సీ సౌకర్యం ఉంది. కేదార్‌నాథ్‌కు 221దూరంలో ఉన్న రిషికేష్‌కు రైలు సౌకర్యం ఉంది. ఇక్కడి నుంచి ట్యాక్సీలో కేదార్‌నాథ్‌ (14 కి.మీ) చేరువకు వెళ్లవచ్చు. అక్కడి నుంచి 14కి.మీ నడక మార్గంలో కేదార్‌నాథ్‌ చేరుకోవచ్చు. రిషికేశ్‌, కోట్‌ద్వార్‌ నుంచి రోడ్డు మార్గాన యాత్రికులు ట్యాక్సీలు, ఇతర ప్రైవేటు వాహనాల్లో దిల్లీ - మనా జాతీయరహదారి(538కి.మీ) మీదుగా చేరుకోవచ్చు. కేదార్‌నాథ్‌ నుంచి నడకదారిలో గౌరీకుండ్‌ చేరుకుని, రిషికేశ్‌, డెహ్రాడూన్‌, కోట్‌ద్వారా, హరిద్వార్‌ నుంచి బస్సు సౌకర్యం కూడా ఉంది.

* పటా- కేదార్‌నాథ్‌కు పవన్‌హాన్స్‌, యూటీఎయిర్‌, ఎయిర్‌ఛార్టర్‌, ప్రభాతమ్‌ సంస్థలు హెలికాప్టర్‌ సేవలను ప్రారంభించాయి. దీనికి ఒక్కొక్కరికిగాను రూ.7,000నుంచి 7,200వరకు వసూలు చేస్తున్నారు.No comments:

Post a Comment