Saturday, 14 April 2018

విజయదశమి - విజయిూభవ


విజయిూభవ

విజయదశమి’... విజయాల పండుగ.
జగన్మాత దుర్గాదేవి మహిషాసురమర్దినిగా పూజలందుకున్న వేళ...
అర్జునుడు జమ్మిచెట్టు మీద నుంచి ఆయుధాలు తీసిన రోజు...
శరన్నవరాత్రుల్లో అమ్మవారు రాజరాజేశ్వరి అలంకారంతో భక్తులను అలరించే ఘడియ...
లక్ష్మీపూజ... సరస్వతీపూజ... ఆయుధ పూజ... శమీపూజ... అన్నీ శుభాలే.
మది నిండా సంతోషాలతో...
దసరా సరదాలతో...
తెలుగింటి ‘నవదుర్గల’ ఆశీస్సులతో...
విజయీభవ!

దేవీ జ్ఞానప్రసూనాంబికే!
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని వాయులింగేశ్వరుని ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. శ్రీకాళహస్తీశ్వరుని దేవేరి జ్ఞానప్రసూనాంబ ఒక్కో రోజు ఒక్కో అలంకరణలో దర్శన భాగ్యం కల్పిస్తారు. మొదటి రోజు అమ్మవారు శైలపుత్రి అలంకారంలో, 2వ రోజు బ్రహ్మచారిణీ దేవి, 3వ రోజు చంద్రఘంటాదేవి, 4వ రోజు కూష్మాండదేవి, 5వ రోజు స్కంధమాతాదేవి, 6వ రోజు కాత్యాయనీదేవి, 7వ రోజు కాళరాత్రీ దేవి, 8వ రోజు మహాగౌరీదేవి, 9వ రోజు సిద్ధిధాత్రి దేవి అలంకారంలో భక్తులను అనుగ్రహించారు. 10వ రోజున విజయదశమి వేడుకలు వైభవంగా నిర్వహిస్తారు.

కరుణా సముద్ర.. కనకమహాలక్ష్మి
విశాఖలో కొలువుదీరిన శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారు ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్నారు. శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ దేవస్థానం 24 గంటలు తెరిచే ఉంటుంది. ఏ సమయంలోనైనా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉంది. విజయదశమి పర్వదినం సందర్భంగా స్వర్ణాభరణ అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ సందర్భంగా అమ్మవారికి స్వర్ణ పుష్పార్చన నిర్వహిస్తారు.

భక్తిముక్తిదాయిని భ్రమరాంబిక
ద్వాదశ జ్యోతిర్లంగాల్లో ఒకటిగా మల్లికార్జునుడు, అష్ఠాదశ శక్తుల్లో ఒకరిగా భ్రమరాంబాదేవి వెలిసిన పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలం. ఏటా శ్రీశైల దేవస్థానం మల్లికార్జునస్వామివారికి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు, భ్రమరాంబదేవికి దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తుంది. భ్రమరాంబదేవి అమ్మవారి గర్భాలయం స్వామివారి ఆలయానికి వెనకభాగాన కొంత ఎత్తులో ఉంటుంది. తొమ్మిదిరోజులపాటు నవదుర్గ అలంకారాల్లో విశేషపూజలు అందుకునే భ్రమరాంబదేవి పదవ రోజు విజయదశమి పర్వదినం నాడు నిజాలంకరణలో భక్తులకు దర్శనమిస్తుంది.

శ్రీచక్రంపై మాణిక్యాంబ
అష్టాదశ శక్తి పీఠాలలో ద్వాదశ శక్తి పీఠం ద్రాక్షారామ మాణిక్యాంబ అమ్మవారు. తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామంలో మాణిక్యాంబ అమ్మవారిని దక్షిణాభి ముఖంగా, సాలగ్రామ శిలతో నిర్మితమైన శ్రీచక్రం బిందువుపై ఆదిశంకారాచార్యులు పున:ప్రతిష్ఠించారు. అష్టాదశ శక్తిపీఠాలలో ఎక్కడా జరుగని విధంగా అమ్మవారికీ, శ్రీచక్రానికీ అర్చన ఏకకాలంలో జరగడం ఇక్కడి విశేషం. దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో మాణిక్యాంబ అమ్మవారికి విశేష పూజలు జరుగుతాయి. నిత్య చండీహోమం జరుగుతుంది. విజయ దశమి రోజున శమీపూజ అనంతరం గజ వాహనంతో నగరోత్సవం జరుగుతుంది.

శుభాల దేవి!
జయశంకర్‌ జిల్లాలోని కాళేశ్వరం త్రివేణీసంగమ క్షేత్రం. ఇక్కడి శ్రీకాళేశ్వర ముక్తీశ్వర దేవాలయంలో అష్టతీర్థాలు ఉన్నాయి. ఒకే పానవట్టంపై కాళేశ్వరుడు, ముక్తీశ్వరుడు అరు రెండు లింగాలు ఉండడం ఈ ఆలయ విశిష్టత. పైగా ముక్తీశ్వరుడు ఉన్న చోట శుభానందదేవికి, సరస్వతీదేవికి ప్రత్యేక ఆలయాలు ఉండడం విశేషం. శుభాలను కలిగించేటువంటి ఈ అమ్మవారిని శుభానందదేవిగా పిలుస్తున్నారు. ఈ ఆలయంలో దసరా ముందు అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి.

ఉజ్జయినీ మహాకాళి!
నగరాన్ని కలరా వ్యాధి నుండి కాపాడిన మహిమాన్విత సికింద్రాబాద్‌లో వెలిసిన శ్రీ ఉజ్జయినీ మహాకాళి. 1813లో మిలటరీలో పనిచేస్తున్న సికింద్రాబాద్‌ వాస్తవ్యుడైన సురిటి అప్పయ్య ఆర్మీ డోలీ బేరర్‌గా మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ టవర్‌కు బదిలీ అయ్యారు. బదిలీ అయిన కొన్ని రోజులకు ఉజ్జయినిలో కలరా వ్యాధి సోకి వేలాదిమంది మృత్యువాత పడ్డారు. ఆ సమయంలో అప్పయ్య, ఆయన అనుచరులు ఉజ్జయినిలోని శ్రీ మహాకాళి దేవిని దర్శించి, కలరా వ్యాధి నుండి కాపాడవలసిందిగా ప్రార్థించారు. పరిస్థితులు అనుకూలించిన తర్వాత సికింద్రాబాద్‌లోనే అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ చేయించారు.

భక్తుల కొంగు బంగారం
వరంగల్‌ జిల్లాలోని భద్రకాళి అమ్మవారు స్వయం వ్యక్తం. ఈ జగన్మాత మహా దుర్గాష్టమి వేళ భూ మండలం మీద భద్రకాళిగా అవతరించిన ప్రదేశం ఓరుగల్లు మహానగరమని ప్రతీతి. మహాష్టమి అని పిలిచే దుర్గాష్టమి వేళ జనగ్మాత కోటి యోగిని గణాలతో భద్రకాళి రూపంలో ఆవిర్భవించినదని దేవీ భాగవతం చెబుతోంది. ఇక్కడ ప్రతి ఏటా నిర్వహించే శరన్నవరాత్రి వేడుకల్లో అమ్మవారి జన్మ నక్షత్రమైన దుర్గాష్టమినాడు తెలంగాణ నుంచే గాక ఇతర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ప్రతి రోజు వివిధ ఆకారాల్లో అమ్మవారిని అలంకరించి, వాహన సేవలు నిర్వహించే ఈ వేడుకలు అమ్మవారి కల్యాణోత్సవంతో ముగుస్తాయి.

అన్నపూర్ణకు ప్రతిరూపం
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ దివ్యక్షేత్రం అతిపెద్ద శైవక్షేత్రాల్లో ఒకటి. శ్రీరాజరాజేశ్వరస్వామివారు ఈ క్షేత్రంలో ప్రధాన దేవతామూర్తి. ప్రధాన ఆలయంలో శ్రీస్వామివారికి కుడివైపున శ్రీరాజరాజేశ్వరీదేవి అమ్మవారు, ఎడమవైపున శ్రీలక్ష్మీగణపతిస్వామివారు కొలువై ఉంటారు. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీరాజరాజేశ్వరీ అమ్మవారు నవదుర్గల రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. దుర్గాష్టమి రోజున మహిషాసురమర్దినిగా అమ్మవారికి మహాపూజ నిర్వహిస్తారు. కాశీ క్షేత్రంలోని అన్నపూర్ణదేవి ప్రతిరూపం వేములవాడ క్షేత్రంలో ఉందనీ, అదే కారణంగా ఈ క్షేత్రానికి దక్షిణ కాశిగా పేరువచ్చిందని ప్రతీతి.

మహా ‘శక్తి’ స్వరూపిణి
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఉత్తర వాహిని తుంగభద్రానదీ తీరంలో కొలువైంది జోగులాంబ అమ్మవారు. 18 శక్తిపీఠాల్లో జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్‌లో ఉన్న ఐదవ శక్తిపీఠం జోగులాంబదేవి. క్రీ.శ 17వ శతాబ్దంలో ఆదిశంకరుడు శ్రీచక్రప్రతిష్ఠ చేసి జోగులాంబదేవిని ప్రతిష్ఠించారని చెబుతారు. అమ్మవారు ఉగ్రరూపంలో ఉంటుంది. జోగులాంబ దేవాలయంలో శరన్నవరాత్రుల్లో భాగంగా 9 రోజుల పాటు అమ్మవారికి వివిధ రూపాల్లో అలంకరణ చేస్తారు. 9వ రోజున తుంగభద్రా నదిలో హంసతూలిక పడవలో అమ్మవారి ఉత్సవ విగ్రహాలను ఊరేగించి భక్తులకు కనువిందు చేస్తారు.


No comments:

Post a Comment