Saturday, 14 April 2018

భాగ్యనగరంలో అయోధ్యరాముడు


భాగ్యనగరంలో అయోధ్యరాముడు
ఎనిమిది రోజుల పాటు శ్రీరామ నవమి ఉత్సవాలు

అయోధ్య మినహా దేశంలో మరెక్కడా కానరాని పట్టాభిషిక్త శ్రీరాముడు భాగ్యనగరంలో కొలువుదీరి ఉన్నాడు. 186 ఏళ్ల క్రితం ఆస్‌ఫజాహీల పాలనలో నగరం నడిబొడ్డున శ్రీ సీతారామ మందిరం నిర్మితమైంది. ఈ ఆలయం సర్వమత సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. ఐదు ప్రధాన దేవాలయాలు, ఆరు ప్రధాన ద్వారాలు, ఏడు మెట్ల బావులు.. వెరసి మల్లేపల్లి, సీతారాం బాగ్‌లోని ‘శ్రీ సీతారాం మహరాజ్‌ సంస్థాన్‌’గా  వెలుగొందుతున్న రామాలయ విశేషాలు...

శ్రీరామచంద్ర మూర్తి, సీతా సమేత.. లక్ష్మణ, హనుమ, భరత, శత్రుజ్ఞ సహిత పట్టాభిషేక మహోత్సవ విగ్రహ మూర్తి కొలువుదీరిన దేవాలయం అయోధ్య మినహా భాగ్యనగరంలో మాత్రమే కొలువుదీరడం విశేషం. నగరం నడిబొడ్డునున్న మల్లేపల్లి, సీతారాంబాగ్‌లోని దాదాపు 25 ఎకరాల స్థలంలో పచ్చని చెట్లు, పూలు, పండ్ల తోటల నడుమ 1832, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, పునర్వసు నక్షత్ర యుక్త లగ్నంలో శ్రీరామ మందిరం నిర్మితమైందని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది.

ఈ ఆలయ ప్రతిష్ఠాపన మహోత్సవానికి కంచిలోని ప్రతివాది భయంకర మఠాధిపతి ‘అనంతాచార్యులు’ విచ్చేసినట్లు ఆలయ నిర్మాతల లిఖిత గ్రంథాల ద్వారా వెల్లడైంది. నాల్గో నిజాం ప్రభువు ఫర్కుందా అలీఖాన్‌ పరిపాలనలో సీతారామ మందిరం నిర్మితమైంది. రాజస్థాన్‌లోని లక్ష్మణ్‌గఢ్‌ ప్రాంతానికి చెందిన పురాన్‌మల్‌ గనేరివాల్‌ ఈ ఆలయాన్ని కట్టించారు. ఆయన కుటుంబానికి చెందిన ఆరోతరం వారసులు అనంత్‌ప్రసాద్‌ గనేరివాలా, అరవింద్‌ కుమార్‌ గనేరివాలా ప్రస్తుతం ఆలయ ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు.

పట్టాభిషేక ఘట్టం

రామాలయం ప్రధాన ద్వారం ఉత్తర భారతీయ సంస్కృతిని తలపిస్తూ, బద్రీనాథ్‌ ఆలయ శైలిని తలపిస్తోంది. ఆ ముఖద్వారం గోడలపై వివిధ రంగుల్లో లతలు, పుష్పాలు, కొమ్మల డిజైన్లతో స్టకో వర్క్‌ కనపడుతుంది. గర్భగుడిలో సీతాసమేత శ్రీరాముడు, లక్ష్మణ, హనుమ, భరత, శత్రుజ్ఞలు సహితంగా శ్రీరాముని పట్టాభిషేక ఘట్టాన్ని తలపించే పాలరాతి విగ్రహ మూర్తులు కొలువై ఉన్నారు. అయోధ్యలోని రామమందిరంలో నెలవైన విగ్రహ మూర్తుల పోలికతో జైపూర్‌లో రూపొందించిన మూలవిరాట్‌ మూర్తులను ఇక్కడ ప్రతిష్ఠించారు. స్వామి వారి కైంకర్యాలు, పూజా విధానం ‘పాంచ రాత్ర ఆగమ’ పద్ధతిలో జరుగుతుంది. ‘ఆలయ ప్రాంగణంలో కొలువైవున్న ఆంజనేయస్వామి దేవాలయం పురాతనమైందని’ పండితులు అన్నంగరాచార్యులు వివరిస్తున్నారు. మొదట శైవ ఆరాధకులైన గనేరివాలా కుటుంబీకులు రామ మందిరానికి పూర్వమే అదే ప్రాంగణంలో నిర్మించిన శివాలయానికి వెనుకభాగంలో దర్శనమిస్తోంది.

కల్యాణ వైభోగమే..!
సీతారాం బాగ్‌ ఆలయంలో శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు ఎనిమిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతాయి. భద్రాచలంలో పగటిపూట రాములవారి కల్యాణం జరిగితే, ఇక్కడ మాత్రం రాత్రివేళ కల్యాణ మహోత్సవం జరుగుతుంది. నవమి నాలుగోరోజు రథోత్సవంలో సీతారాముల ఊరేగింపు సంబురాన్ని తలపిస్తుంది. ‘గతంలోరధోత్సవాన్ని తిలకించేందుకు నిజాం ప్రభుత్వాధికారులు కొందరు ఆలయాన్ని సందర్శించేవారని’ అన్నంగరాచార్యులు తెలిపారు.

ఆలయ నిర్మాణానికి అనుమతి

రెండు శతాబ్దాల క్రితం జైపూర్‌కి చెందిన పురాన్‌మల్‌ గనేరివాలా కుటుంబం వ్యాపారం నిమిత్తం హైదరాబాద్‌ రాజ్యానికి విచ్చేశారు. వర్తకంలో నిలదొక్కుకున్న వీరు ఇక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. అనతికాలంలోనే ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకున్న గనేరివాలా కుటుంబీకులు నిజాం ప్రభువు అభిమానాన్ని చూరగొన్నారు. అలా పురాన్‌మల్‌ కుమారుడు ప్రేమ్‌సుఖ్‌దాస్‌ మరాట్వాడా (ఇప్పటి మహారాష్ట్ర)లోని ‘అమరావతి’ ప్రదేశానికి పన్ను వసూలుచేసే అధికారిగా నియమితుడయ్యాడు. సుఖ్‌దాస్‌ ఆ బాధ్యతను స్వీకరించిన కొద్దికాలానికే, ప్రజల నుంచి పన్నుగా వసూలు చేసిన మొత్తం 200 ఎడ్ల బండ్లకి సరిపోయేంత సొమ్మును నాల్గో నిజాంకు అప్పగించాడు. అదే సమయంలో కంచిలోని ప్రతివాద భయంకర మఠం పీఠాధిపతి అనంతాచార్యులు బోధనలతో ప్రభావితుడైన పురాన్‌మల్‌ వైష్ణవ మతాన్ని స్వీకరించాడు. ఆ స్వామీజీ ఆదేశానుసారం ధార్మిక సేవాకార్యక్రమాల్లో భాగంగా తన కొడుకు సుఖ్‌దా్‌సతో కలిసి రామాలయ నిర్మాణం తలపెట్టాడు. అందుకు మొదటగా నిజాం ప్రభుత్వానికి కొంత కప్పం చెల్లించి అనుమతి పొందాడు. 1820వ దశకంలో ఆలయ నిర్మాణ పనుల్ని ప్రారంభించారు. 1832లో ఆలయంలోని మూల విరాట్‌ను ప్రతిష్ఠించారు.

విభిన్న సంస్కృతుల మేళవింపు

ఆలయం నిర్మాణంలో ఎక్కువ భాగం గ్రైనేట్‌, సున్నం రాయిని వినియోగించినట్లు చారిత్రక అధ్యయనకారులు అనూరాధా రెడ్డి చెబుతున్నారు. ఉత్తర, దక్షిణ భారతదేశ సంప్రదాయాలతోపాటు, మొగలాయి, కుతుబ్‌షాహీలు, యూరోపియన్‌ నిర్మాణ శైలి ఆలయ కట్టడాల్లో కనిపిస్తుంది. కోట తలుపులను తలపించేలా ఆ దర్వాజాలు 20 అడుగుల ఎత్తులో ఉంటాయి. రెండో ప్రవేశ ద్వారం పూర్తిగా హిందూ సంప్రదాయ శైలిలో నిర్మించారు. ఆ గోపురంపై దశావతార మూర్తులు, కోతి బొమ్మలు, తామర మొగ్గలు వంటి డిజైన్లు కనిపిస్తాయి. మూడో ప్రవేశ ద్వారం పూర్తిగా ఉత్తర భారతీయ నిర్మాణశైలికి అద్దంపడుతోంది. ఆలయం లోపలికి ప్రవేశించగానే, అక్కడ గుమ్మటాలు, ద్వారాలు, విశ్రాంతి గదుల కిటికీలు వంటివి మొగలాయి సంస్కృతిని పోలి ఉంటాయని అనురాధారెడ్డి వివరిస్తున్నారు. అనంతాచార్యులు ఆదేశం ప్రకారం దక్షిణ భారతదేశ శైలితో వరదరాజస్వామి, లక్ష్మీదేవి ఆలయాలు నిర్మించారు. ఆ మందిరాల గోపురంపై ఆళ్వారుస్వామి ప్రతిమలు దర్శనమిస్తాయి.

సౌభ్రాతృత్వానికి ప్రతీక
గంగా జమున తెహజీబ్‌ సంస్కృతికి హైదరాబాద్‌ ఆలవాలం. ఇక్కడ ఎన్నో ఏళ్ల నుంచే సర్వమత సౌభ్రాతృత్వం నెలకొందనడానికి సీతారాంబాగ్‌ మందిరం కూడా నిదర్శనం. రామ మందిరం ప్రాంగణంలోనే మసీదు నెలవైంది. మందిరం, మసీదు మధ్య కేవలం ఒకే ప్రాకారం నిర్మితమైంది. ‘హిందూ, ముస్లిం ఐకమత్యానికి ఈ మందిరం ప్రతీక. నిత్యం ఎంతో మంది ముస్లిం కుటుంబాలవారు ఆలయ ప్రధాన ద్వారం వరకు విచ్చేసి, అర్చనలు చేయించుకుంటారు. పండుగలు, పర్వదినాల్లో కానుకలు సమర్పించుకుంటారు’ అని అన్నంగరాచార్యులు చెబుతున్నారు.

మెట్ల బావులు.. మండపాలు
ఆలయ ప్రాంగణంలో మొత్తం ఏడు బావులుండేవి. అందులో ప్రస్తుతం నాలుగు మెట్ల బావులు మాత్రమే కనిపిస్తాయి. అవి కూడా శిథిలావస్థకు చేరాయి. ఆలయ ప్రధాన ద్వారం వద్ద నెలవైన మెట్లబావిని సుదర్శన కోనేరుగా పిలుస్తారు. ఒకప్పుడు ఈ బావి నీటిని స్వామి అభిషేకానికి ఉపయోగించేవారు. ఆలయ ప్రవేశ ద్వారం దాటిన తర్వాత ఎడమవైపున నెలవైన కోనేరును రామానుజ పుష్కరిణిగా పిలుస్తారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే యతీశ్వరులు స్నానం చేసేందుకు బావిని నిర్మించారు. ఆ పక్కనే విశ్రాంతి మండపం కనిపిస్తుంది. దక్షిణాన గజేంద్ర మోక్ష మండపం, కోనేరు కనిపిస్తాయి.

రాతితో అత్యంత అరుదైన శైలిలో నిర్మించిన మెట్ల బావులన్నీ శుద్ధి చేయక నిరుపయోగంగా ఉన్నాయి. ఆలయంలో శుక్రవారం మండపం, కల్యాణమండపం, తులసీ కల్యాణ మండపం, ధనుర్మాస ఉత్సవాల మండపం వంటి పలు గ్రైనేట్‌ రాతి నిర్మాణాలు గుడి లోపల, బయట దర్శనమిస్తాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక విశ్రాంతి గదులు, అర్చకులు, మేళగాళ్లు, కైంకర్యాల నిర్వాహకులు, పూలదండలు కట్టే కుటుంబాలు తదితరులు నివసించేందుకు ఆలయ ప్రాంగణంలోనే గృహసముదాయాన్ని నిర్మించారు. ఈ దేవాలయానికి 2010 ఇంట్యాక్‌ అవార్డు దక్కింది. ‘దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ఆలయ మరమ్మతు పనులు త్వరలో ప్రారంభమవుతాయి. అందుకు ఒక కమిటీ కూడా ఏర్పడిందని’ అరవింద్‌కుమార్‌ గనేరివాల్‌ తెలిపారు.

No comments:

Post a Comment