Saturday, 14 April 2018

సింహాద్రి అప్పన్న


అపురూపం... అప్పన్న నిజరూప దర్శనం

వరాహ - నారసింహ అవతారాల సమ్మేళనంగా అలరారుతున్న సింహాద్రినాథుడు ద్వయరూపాల్లో దర్శనమిచ్చే భక్తవరదుడు. ఏడాదికి ఒక్కరోజు మాత్రమే లభించే సింహాద్రి అప్పన్న నిజరూపాన్ని కొన్ని క్షణాల పాటైనా కనులారా వీక్షించడం మహద్భాగ్యంగా భక్తులు భావిస్తారు. ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుంటే సర్వపాపాలు తొలగిపోతాయని ప్రగాఢంగా విశ్వసిస్తారు. శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి చందనోత్సవానికి విశాఖపట్నం జిల్లాలోని సింహగిరి ముస్తాబవుతోంది.

ఇదీ ఇతిహాసం:
ప్రహ్లాదుడిని రక్షించేందుకు అవతరించిన నృసింహస్వామి విగ్రహ రూపంలో సింహగిరిపై వెలిశాడు. ఆ విగ్రహానికి ఆరాధన లేకపోవడంతో దాని చుట్టూ పెద్ద పుట్ట పెరిగింది. షట్‌ చక్రవర్తులలో ఒకరైన పురూరవుడు ఊర్వశితో కలిసి ఆకాశమార్గంలో విహరిస్తూ సింహగిరిపై రాత్రి విశ్రమించగా, అదే కొండపై తాను వున్నట్టు స్వామి అతని స్వప్నంలో కనిపించి చెబుతాడు. సింహగిరిపై ఈశాన్య దిక్కున గంగధారకు సమీపంలో పుట్టలో వున్న స్వామిని అక్షయ తృతీయనాడు చక్రవర్తి గుర్తిస్తాడు. పుట్టను తొలగించి గంగధార జలాలతో, పంచామృతాలతో స్వామిని అభిషేకించి, ఆరాధిస్తాడు.తాను చాలా ఏళ్లు వల్మీకం (పుట్ట)లో వున్నందున అలాంటి చల్లదనం కోసం పుట్టమన్నుకు బదులు గంధంతో తనను కప్పి ఉంచాలని పురూరవుడిని స్వామి ఆదేశిస్తాడు. దీంతో పుట్ట మన్ను బరువుకు సమానమైన శ్రీగంధాన్ని అక్షయ తృతీయ రోజున తొలిసారిగా పురూరవుడు సమర్పిస్తాడు. అప్పటి నుంచి వరాహలక్ష్మీ నృసింహస్వామి చందనోత్సవం ఆ రోజున నిర్వహిస్తూ వస్తున్నారు.

చందన యాత్ర అంటే:
ఏటా అక్షయతృతీయ రోజున స్వామి విగ్రహంపై ఉన్న చందనాన్ని తొలగిస్తారు. ఆ రోజంతా స్వామి నిజరూపంలో భక్తులకు సాక్షాత్కరిస్తారు. మళ్లీ అదే రోజు రాత్రి చందన సమర్పణ చేస్తారు. సుమారు 12 మణుగుల (500 కిలోల) శ్రీచందనపు పూతతో స్వామిని నిత్య రూపంలోకి తీసుకువస్తారు. ఆ మొత్తం చందనాన్ని స్వామికి నాలుగు విడతలుగా సమర్పిస్తారు. వైశాఖ శుక్ల పక్ష తదియ (అక్షయ తృతీయ) నాడు వేకువజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి చందన ఒలుపు ప్రారంభిస్తారు. బంగారు, వెండి బొరిగెలతో చందనం తొలగిస్తారు. నిజరూపంలోకి వచ్చిన స్వామికి విశేష పూజలు నిర్వహించి శిరస్సుపైన, ఛాతీపైన చందనాన్ని ముద్దలుగా పెడతారు. మొదట నిజరూప దర్శనాన్ని ఆలయ అనువంశిక ధర్మకర్తలైన పూసపాటి వంశీయులకు కల్పిస్తారు. అనంతరం భక్తులను అనుమతిస్తారు. నిజరూపంలోని స్వామికి సహస్ర ఘటాభిషేకం జరుపుతారు. అదే రోజు రాత్రి భక్తుల దర్శనాల అనంతరం తొలివిడతగా మూడు మణుగుల (సుమారు 125 కిలోల) శ్రీచందనాన్ని పూతగా వేస్తారు. మిగిలిన తొమ్మిది మణుగుల చందనాన్ని వైశాఖ పూర్ణిమ, జేష్ట పూర్ణిమ, ఆషాఢ పూర్ణిమలలో మూడేసి మణుగుల చొప్పున సమర్పిస్తారు. నాలుగు విడతల చందన సమర్పణతో స్వామి నిత్య రూపంలోకి వస్తారు.

ఎలా వెళ్ళాలి?:
విశాఖపట్నం రైల్వే స్టేషన్‌ నుంచి సుమారు 13 కిలోమీటర్లు, ఆర్టీసీ బస్‌ కాంప్లెక్స్‌ నుంచి 17 కిలోమీటర్ల దూరంలో, విశాఖ విమానాశ్రయం నుంచి సుమారు ఏడున్నర కిలోమీటర్ల దూరంలో సింహాచలం ఉంది. సింహాచలానికి ఐదు కిలోమీటర్ల దూరంలో సింహాచలం రైల్వే స్టేషన్‌ ఉంది. నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి సింహాచలానికి ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. కొండదిగువ నుంచి సింహగిరి చేరుకునేందుకు ఆర్టీసీ బస్సులతోపాటు దేవస్థానం ట్రాన్స్‌పోర్టు బస్సులు అందుబాటులో ఉన్నాయి.
వాసు, విశాఖపట్నం
Apr 15, 2018

సింహాచలం
అపురూపం అప్పన్న నిజరూపం

ఏ ఆలయానికి వెళ్లినా అక్కడి దేవుడి దివ్యమంగళ విగ్రహానికి నమస్కరించి ఆ రూపాన్ని మదిలో నిలుపుకుని వెనుదిరుగుతారు భక్తులు. ప్రత్యేక సందర్భాల్లో ఆ మూర్తి అలంకరణలో భిన్నత్వం మినహా మిగతా సమయాల్లో దేవతా విగ్రహరూపం ఒకేలా ఉంటుంది. కానీ సింహాచలం కొండల్లో వెలసిన వరాహ నరసింహ మూర్తిని దర్శించుకోవాలంటే ఏడాది మొత్తంలో ఒకే ఒక్క రోజు వీలవుతుంది. మిగతా రోజుల్లో చందనలేపనంలో మునిగిపోయే అప్పన్న ఈ ఏడాది ఏప్రిల్‌ 18న నిజరూప దర్శనం ఇవ్వనున్నాడు.

ఎటుచూసినా శ్రీచందన పరిమళాలూ సంపెంగల సౌరభాల్లాంటి ఎన్నో ప్రకృతి రమణీయతలతో విరాజిల్లే క్షేత్రం సింహాచలం. వరాహ, నారసింహ అవతారాలను రెండింటినీ మేళవించి సాక్షాత్తూ శ్రీమహావిష్ణువే అప్పన్నస్వామిగా వెలసిన ప్రాంతం సింహగిరి. నిత్యం చందనార్చితుడై లింగాకృతిలో సాక్షాత్కరించే స్వామి వైశాఖ శుద్ధ తదియ (అక్షయ తృతీయ) నాడు మాత్రమే తన నిజరూప దర్శన భాగ్యాన్ని కల్పిస్తాడు. వరాహ వదనంతో, మానవ శరీరంతో,  సింహ వాలంతో విలక్షణ మూర్తిగా భాసిల్లుతున్న స్వామి వరాహ నరసింహమూర్తిగా దర్శనమిచ్చేది ఆ రోజే.

చందనోత్సవం...
విష్ణుమూర్తి అవతారాల్లోని ఒకటైన నరసింహమూర్తికి అనేక ఆలయాలు ఉన్నాయి. కానీ దేశంలో మరెక్కడా లేనివిధంగా సింహాచలంలో కొలువుదీరిన అప్పన్న స్వామికి ఏటా చందనోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటారు. దీనికి కారణం లేకపోలేదు, ప్రహ్లాదుడి కోరిక మేరకు... హిరణ్యాక్షుడిని వధించిన వరాహావతారం, హిరణ్యకశిపుడిని సంహరించిన నరసింహావతారం రెండూ ఉగ్రరూపాలే. ఈ రెండు అవతారాల సమ్మిళితమై ఏక విగ్రహంగా ఏర్పడిన స్వామిని శాంతింపజేయడానికే ఆయన్ను చందన లేపనంతో సేవిస్తారని పురాణాలు పేర్కొంటున్నాయి. అంతేకాదు పురూరవ చక్రవర్తి నరసింహ స్వామిని మొదటిసారిగా దర్శించింది అక్షయ తృతీయనాడే. అందుకే ఆనాటి నుంచీ ప్రతి అక్షయ తృతీయ నాడూ స్వామి మీద ఉన్న చందనాన్ని తొలగించి నిజరూప దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నారని స్థలపురాణం తెలియజేస్తోంది.

యాత్ర ఇలా...
నిజానికి అక్షయ తృతీయకు వారం రోజుల ముందు నుంచీ ప్రత్యేక పూజలు నిర్వహించి చందనాన్ని రంగరించే ప్రక్రియను మొదలుపెడతారు. దేవాలయంలోని బేడ మండపం దీనికి వేదికవుతుంది. రంగరించిన చందనానికి అరవై రకాల వనమూలికలూ సుగంధ ద్రవ్యాలను కలిపి స్వామికి చందన లేపనాన్ని తయారుచేస్తారు. అక్షయ తృతీయకు ముందు రోజు బంగారు గొడ్డలితో స్వామి మీద ఉన్న చందనాన్ని అర్చక స్వాములు తొలగిస్తారు. అనంతరం వేదమంత్రాల నడుమ గంగధార నుంచి తెచ్చిన జలాలతో సహస్ర ఘఠాభిషేకాన్ని నిర్వహిస్తారు. ఆ తర్వాత స్వామి నిజరూపాన్ని చూసేందుకు భక్తులను అనుమతిస్తారు. సాయంత్రం మళ్లీ చందన పూత పూస్తారు. దీంతో ఈ యాత్ర ముగుస్తుంది.

నాలుగు విడతలుగా
వరాహలక్ష్మీనరసింహ స్వామికి సమర్పించే చందనానికి ఎంతో విశిష్టత ఉంది. నిత్యం చందన రూపుడై సాక్షాత్కరించే స్వామికి నాలుగు విడతలుగా చందనాన్ని పూస్తారు. దీన్ని తమిళనాడు, కేరళల నుంచి కొనుగోలు చేస్తారు. మొదట అక్షయ తృతీయనాడు మూడు మణుగుల చందనాన్ని సమర్పిస్తారు. ఆ తర్వాత వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ పౌర్ణమి రోజుల్లో మూడు విడతలుగా తొమ్మిది మణుగుల చందనాన్ని పూస్తారు. మొత్తంగా స్వామికి సుమారు అయిదు వందల కిలోల చందనాన్ని సమర్పిస్తారన్నమాట.

చందన ప్రసాదం
చందనయాత్ర పూర్తయిన మరుసటి రోజు నుంచే గంధాన్ని ప్రసాదంగా పంపిణీ చేస్తారు. ఏడాది పొడవునా స్వామి విగ్రహం మీద ఉన్న చందనాన్ని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ చందనాన్ని నీటిలో కలుపుకొని సేవిస్తే వ్యాధులు నయమవుతాన్నది భక్తుల విశ్వాసం. అందుకే ఈ ప్రసాదాన్ని పొందడానికి భక్తులు కిలోమీటర్ల మేర బారులు తీరుతారు.

ఇలా చేరుకోవచ్చు
విశాఖపట్నంలో కొలువైన సింహాద్రి అప్పన్న క్షేత్రాన్ని చేరుకోవడానికి రైలు, రోడ్డు, విమాన మార్గాలు అందుబాటులో ఉన్నాయి. నగరానికి సుమారు 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వామిని దర్శించుకోవడానికి ద్వారకా బస్‌స్టేషన్‌, మద్దిలపాలెం, గాజువాక, ఎన్‌ఏడీ ప్రాంతాల నుంచి ప్రతి పది నిమిషాలకూ ఓ బస్సు ఉంటుంది.

- ఎం.సత్యనారాయణ, న్యూస్‌టుడే, సింహాచలం

No comments:

Post a Comment