Saturday, 14 April 2018

విలక్షణ రాముడు - విశిష్ట దేవుడు...


విలక్షణ రాముడు - విశిష్ట దేవుడు...

‘‘పదికొంపలు లేని పల్లెనైనను రామభజన మందిరమొండు వరలుగాత!’’ అనేది కవి వాక్యం.
మన దేశంలో గ్రామాలు ఎన్ని ఉన్నాయో దాదాపు అన్ని రామాలయాలున్నాయి. అయితే వీటిలో కొన్ని తమదైన విలక్షణతతో ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి రామాలయాల్లో కొన్ని.


మారుతి లేని రాముడు... మీసాల దేవుడు

‘‘యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృత మస్తకాంజలిం!’’
ఎక్కడ శ్రీరామ భజన, కీర్తన జరుగుతాయో అక్కడ హనుమంతుడు తన్మయంగా చేతులు జోడించి నిలబడతాడట! రామాలయాల్లో రాముని పాదాల దగ్గర ముక్త హస్తాలతో మారుతి విగ్రహం కనిపించడం సర్వసాధారణం. కానీ ఈ ఆలయంలో ఆంజనేయుడు కనిపించడు! తెలంగాణలోని మెదక్‌ జిల్లా గుమ్మడిదలలో ఈ ఆలయం ఉంది. హైదరాబాద్‌ నగరానికి సుమారు 48 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. కుత్బుల్లాపూర్‌ మున్సిపల్‌ కేంద్రానికి హైదరాబాద్‌లోని ప్రధాన ప్రాంతాలనుంచి బస్సులున్నాయి. అక్కడినుంచి దాదాపు సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

ప్రత్యేకత ఏంటంటే.... 

హనుమంతుడు లేని రామాలయం ఇది. ఇక్కడి రాముడిని ‘కల్యాణ రాముడ’ని కూడా పిలుస్తారు. శ్రీరామ కల్యాణ సమయానికి ఆంజనేయునితో రాముడికి పరిచయం లేదు కనుక, హనుమ విగ్రహాన్ని ఏర్పాటుచేసి ఉండకపోవచ్చనీ ఆలయ వర్గాల మాట.
ఈ ఆలయం ప్రత్యేకత ఇదొక్కటే కాదు... 

సీతాసమేతుడైన శ్రీరామునితోపాటు లక్ష్మణుడు - ఊర్మిళ, భరతుడు - మాండవి, శత్రుఘ్నుడు - శ్రుతకీర్తి దంపతుల విగ్రహాలు కూడా గర్భగుడిలో దర్శనమిస్తాయి. ఇలాంటి అరుదైన దర్శనం మరెక్కడా దొరకదు. 
మరో విశేషం ఏమిటంటే.... 
ఇక్కడ శ్రీరాముడు మీసాలతో కనిపిస్తాడు. ఇది సుమారు 900 ఏళ్ళనాటి ఆలయం. శ్రీరామనవమి రోజున ఇక్కడ నిర్వహించే సీతారామ కల్యాణంలో పాల్గొనే అవివాహితులకు త్వరలోనే పెళ్ళి అవుతుందని భక్తుల విశ్వాసం.

యోగ రామప్రభో!
చిన్ముద్రతో, చిదానందంగా భక్తులను అలరిస్తూ, నమ్మినబంటు హనుమంతుడికి గురుస్థానంలో నిలిచిన ప్రత్యేకమైన రాముడిని ఆ గుడిలో చూడవచ్చు. అక్కడి శ్రీరామచంద్రుడు రణశూరుడైన విజయ రాఘవుడు. తమిళనాడులోని నెడుంగుణమ్‌ (లేదా నెడుంగుండ్రమ్‌)లో ఉందీ విశిష్ట ఆలయం. తమిళనాడులోని అరణికి 20 కిలోమీటర్లు, తిరువణ్ణామలై (అరుణాచలం)కి సుమారు 55 కిలోమీటర్ల దూరంలో, వందవాసి పట్టణానికి దాదాపు 26 కిలోమీటర్ల దూరంలో నెడుంగుణమ్‌ ఉంది. చెన్నై నుంచి నేరుగా బస్సులున్నాయి.

ప్రత్యేకతలేమిటంటే.... 

కడప దగ్గరి పద్మాసన రాముడి మాదిరిగా ఇక్కడ కూడా శ్రీరాముడు యోగముద్రలో కనిపిస్తాడు. తమిళనాడులోని అతి పెద్ద రామాలయాల్లో ఇదొకటి. రాముడు యోగముద్రతో దర్శనమిచ్చే ఆలయాల్లో ప్రఖ్యాతమైనది కూడా ఇదే. రాముడు చిన్ముద్రతో - గురుస్థానంలో బోధిస్తున్నట్టు, హనుమంతుడు శిష్యుడి స్థానంలో వేదాధ్యయనం చేస్తూ, స్వామి చెబుతున్నది ఆలకిస్తున్నట్టూ ఉంటారు. లక్ష్మణుడు ధనుర్ధారిగా కనిపిస్తాడు. సీతమ్మ కుడిచేత్తో తామరపువ్వు పట్టుకొని, ఎడమచేతిని రాముని పాదాలవైపు చూపిస్తూ ఆయన పక్కన ఆసీనురాలై ఉంటుంది. రావణ సంహారం తరువాత తిరిగి వస్తూ, శ్రీరాముడు ఇక్కడ విడిది చేశారనీ, శుక మహర్షిని దర్శించుకున్నారనీ స్థలపురాణాలు చెబుతున్నాయి. విజయం సాధించి తిరిగి వచ్చిన వాడు కాబట్టి ఇక్కడి రాముడిని ‘విజయరాఘవన్‌’ అని కూడా పిలుస్తారు.

కుడివైపు జానకమ్మ!
‘‘వామాంక స్థిత జానకీ పరిలసత్‌ కోదండదండం కరే!’’ అని ప్రార్థనాశ్లోకంలో మాట.
ఏ రామాలయంలోనైనా రామునికి ఎడమవైపున సీతమ్మ కనిపిస్తుంది. భద్రాచలంలో రామాంకం మీద కొలువుతీరుతుంది. కానీ తిరుపతిలోని కోదండ రామాలయంలో మాత్రం ఆయనకు కుడివైపున సీతమ్మ ఉంటుంది.


ప్రత్యేకత ఏమిటంటే... 

తిరుపతి నగరం మధ్యలో ఉండే ఈ ఆలయానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. రావణ సంహారం తరువాత అయోధ్యకు వెళ్తూ, ఈ ప్రాంతంలో శ్రీరాముడు విశ్రమించాడని ఐతిహ్యం. దానికి గుర్తుగా ఈ ఆలయం నిర్మితం అయిందని అంటారు. తరువాత కలియుగంలో జనమేజయ చక్రవర్తి దీన్ని అభివృద్ధి పరిచారనీ కథనాలు ఉన్నాయి. నిర్మాణ శైలిలో ఈ గుడి తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని పోలి ఉంటుంది. ఇక్కడ శ్రీరాముడి కుడివైపున సీతమ్మ, ఎడమవైపున లక్ష్మణుడు ఉండడం విశేషం. అయితే అసలు వైఖానస ఆగమ నియమాల ప్రకారం అమ్మవారు దక్షిణంగా అంటే కుడివైపునే ఉండాలట! ఆ ప్రకారమే ఈ విగ్రహాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ఇలా కుడి పక్కన ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం మోక్షదాయకమని పెద్దల మాట, నమ్మకం.

పద్మాసనంలో పరంధాముడు
ధనుర్బాణాలు ధరించి, నిలబడి ఉన్న శ్రీరాముడు! భక్తుల స్మరణలో, మననంలో ముద్రపడిన రూపం ఇదే!! కానీ శ్రీరాముడు పద్మాసనంలో కూర్చొని ఉండడం ఎప్పుడైనా చూశారా? పద్మాసనాసీనుడైన రాముడిని కడప జిల్లా పెద్దపుత్త గ్రామంలోని ఈ ఆలయంలో దర్శించుకోవచ్చు. కడప నుంచి సుమారు 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్దపుత్తకు రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు.

ప్రత్యేకతలేమిటంటే.... 

ఇక్కడ సీతారాములు పద్మాసనాల్లో కూర్చొని దర్శనమిస్తారు. స్వామికి కుడివైపు లక్ష్మణుడు నిలబడి ఉంటాడు. రాముడి కుడి చెయ్యి యోగముద్రతో, ఎడమ చెయ్యి స్పర్శముద్రతో-(నేలను చూపిస్తూ) ఉంటాయి. ఆయన చేతుల్లో ధనుర్బాణాలుండవు. లక్ష్మణుడు మాత్రం వాటిని ధరించి ఉంటాడు. వారికి ముందు హనుమంతుడు కూర్చొని, బ్రహ్మసూత్రాలు చదువుతున్నట్టు కనిపించడం మరో విశేషం.

ముగ్గురయ్యల ముచ్చటైన స్వరూపం!
ఆ ఆలయంలో శ్రీరాముడు విష్ణుమూర్తిలా కనిపిస్తాడు. అంతేకాదు, వేరే ఏ రామాలయంలోనూ కానరాని అనేక విశేషాల నెలవు ఈ శ్రీరాముడి కొలువు! కేరళలోని త్రిస్సూర్‌ (త్రిచ్చూర్‌) జిల్లా త్రిప్రాయర్‌లో ఉందీ గుడి. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాల నుంచీ త్రిస్సూర్‌కు నేరుగా రైళ్ళున్నాయి. అక్కడినుంచి 25 కిలోమీటర్ల దూరంలోని త్రిప్రాయర్‌కు రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు.

ప్రత్యేకత ఏమిటంటే... 

‘త్రిప్రాయరప్పన్‌’, ‘త్రిప్రా దేవర్‌’గా ప్రసిద్ధుడైన త్రిప్రాయర్‌ శ్రీరాముడు చతుర్భుజుడు. ఒక చేతిలో పాంచజన్యం (శంఖం), మరో చేతిలో సుదర్శన చక్రం, ఇంకో చేతిలో కోదండం (విల్లు), నాలుగో చేతిలో జపమాల ఉంటాయి. వీటిలో జపమాల బ్రహ్మకు సంకేతం అంటారు. అలాగే శివుడికి సంబంధించిన లక్షణాలు కూడా కొన్ని కనిపిస్తాయి. సర్వసాధారణంగా ఏ వైష్ణవ ఆలయంలోనూ ఉండని విధంగా ఇక్కడ దక్షిణామూర్తి విగ్రహం ఉండడం విశేషం. హనుమంతుడు, గోశాల కృష్ణమూర్తితోపాటు ఉపదేవతలుగా గణపతి, అయ్యప్ప కూడా ఇక్కడ కొలువు తీరారు. అందుకే దీన్ని త్రిమూర్తి స్వరూపమైన ఆలయంగా భావిస్తారు. ఈ ఆలయంలోని శ్రీరామ విగ్రహాన్ని ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు పూజించాడనీ, ఆయన అవతార సమాప్తి తరువాత విగ్రహం ద్వారకతో పాటు సముద్రంలో మునిగిపోయిందనీ క్షేత్ర పురాణం చెబుతోంది. తరువాత బెస్తవారికి సముద్రంలో దొరికిన విగ్రహానికి ప్రతిష్ఠ జరిపారు. ఈ ఆలయం ‘తీవ్ర’ నది ఒడ్డున ఉంది.

పట్టాభి రాముడు
శ్రీరామ పట్టాభిషేకం చిత్రపటం చూసే ఉంటారుగా! అలాంటి భంగిమలో, విభీషణ వరదుడైన రాముడు కనిపించే ఇలాంటి అపూర్వ ఆలయం మరెక్కడా ఉండదేమో! తమినాడులోని అయోధ్యాపట్నంలో ఈ ఆలయం ఉంది. తమిళనాడులోని సేలం నగరానికి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో అయోధ్యాపట్నం ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాల నుంచీ సేలం వెళ్ళే రైళ్ళున్నాయి. అక్కడినుంచి రోడ్డు మార్గంలో అయోధ్యాపట్నం చేరుకోవచ్చు. 


ప్రత్యేకత ఏమిటంటే... 
ఇక్కడి ఆలయంలో రాముడు పట్టాభిషేక భంగిమలో కనిపిస్తాడు. ఎడమ కాలిని కుడి తొడ మీద వేసుకొని, వరద హస్తంతో దర్శనమిస్తాడు. ఆయన ఎడమవైపు సీతాదేవి కూర్చొని ఉంటుంది. దీని వెనక ఒక పురాణ గాథ ఉంది. రావణ సంహారం తరువాత తిరిగి వస్తూ, ఈ ప్రాంతంలో విశ్రమించిన రాముడిని- తదనంతరం జరగబోయే పట్టాభిషేకంలో కూర్చొనే భంగిమలో దర్శనం ఇవ్వాలని విభీషణుడు కోరాడు. ఆ కోరికను రాముడు నెరవేర్చాడు. దానికి తార్కాణం అన్నట్టు ఈ ఆలయంలో విభీషణుడి విగ్రహం సీతారాముల ముందు నిలబడి ఉంటుంది. విభీషణుడు ప్రార్థిస్తూ ఉంటే, వారిద్దరూ అతన్ని ఆశీర్వదిస్తున్నట్టు కనిపిస్తుంది.

No comments:

Post a Comment