Thursday, 28 June 2018

అమర్‌నాథ్‌ యాత్ర

28-06-2018

భక్తిగా... జాగ్రత్తగా

అమర్‌నాథ్‌ యాత్ర ఈ రోజు మొదలవుతోంది. భక్తులు ఎంత పవిత్రమైనదిగా భావిస్తారో అంతకు మించిన క్లిష్టతతో కూడుకున్న ప్రయాణం ఇది. అందుకే ఈ యాత్రకు బయలుదేరినవారు తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. హిమాలయాల్లో సముద్రమట్టానికి సుమారు 3,900 మీటర్ల ఎత్తున, చుట్టూ ఆవరించిన మంచు పర్వతాల మధ్య నెలకొన్న గుహాలయం ఇది. దాదాపు నలభై మీటర్ల ఎత్తులో ఉండే గుహలో హిమరూపంలో పరమశివుడు దర్శనమిస్తాడు. ఏడాదిలో కొంతకాలం తప్ప మిగిలిన మాసాల్లో ఈ ప్రాంతమంతా దట్టమైన మంచుతో కప్పి ఉంటుంది. ఆ ప్రాంతంలో మే నుంచి ప్రారంభమయ్యే వేసవి కాలంలో మాత్రమే అక్కడికి చేరుకోగలరు. ఈ రోజు (జూన్‌ 28వ తేదీ) నుంచి ఆగస్టు 26వ తేదీ వరకు ఈ యాత్ర కొనసాగుతుంది. అయితే వాతావరణం అనుకూలిస్తే తప్ప ఈ యాత్రకు అనుమతించరు. అమర్‌నాథ్‌ యాత్ర చేస్తున్నవారు తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలివి.

ఇవి మరచిపోవద్దు
గుర్తింపు వివరాలు: యాత్రకు మీరు అనుమతి పొందినట్టు ధ్రువీకరించే రిజిస్ట్రేషన్‌ కార్డు తీసుకువెళ్ళడం మరచిపోవద్దు. ఈ కార్డు లేకపోతే యాత్రకు అనుమతించరు. అలాగే మీ ఐడి ప్రూఫ్‌ కూడా తీసుకువెళ్ళండి. మీ పేరు, చిరునామా, యాత్రలో మీతోపాటు పాల్గొంటున్న వారి వివరాలు, మీ కుటుంబ సభ్యుల ఫోన్‌ నెంబర్లు కాగితం లేదా చిన్న పుస్తకంలో రాసి మీతో పాటు ఉంచుకోండి. అత్యవసర పరిస్థితుల్లో మీరు చిక్కుకున్నప్పుడు వాటి అవసరం ఉండొచ్చు.

ఆరోగ్య ధ్రువపత్రాలు:13 ఏళ్ల లోపు బాలబాలికలనూ, 75 ఏళ్లు దాటిన వారినీ ఈ యాత్రకు అనుమతించరు. యాత్రకు వెళ్లే భక్తులు పూర్తి స్థాయి రక్త పరీక్షలు, మూత్ర పరీక్ష, ఛాతీ ఎక్స్‌రే గుండె సంబంధిత ECG, 2D-ECHO తదితర పరీక్షలను వయసును బట్టి చేయించుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్య ధ్రువీకరణ పత్రం తీసుకోవాల్సి ఉంటుంది. దాని కాపీలను యాత్ర సమయంలో దగ్గర ఉంచుకోవాలి.

బీమా ఉండాల్సిందే: ఇది ప్రమాదకరమైన యాత్ర. కాబట్టి బీమా తీసుకోండి. సుమారు మూడు లక్షల రూపాయల వరకూ గ్రూప్‌ ఇన్స్యూరెన్స్‌ను అమర్‌నాథ్‌ యాత్ర బోర్డు అందిస్తోంది.

తగినంత నగదు: దారిలో ఆహారం, అవసరమైన పరికరాలు కొనుక్కోవడానికీ, బస చేయడానికీ అవసరమైన నగదు తీసుకువెళ్ళండి.

మార్గంలో మన కోసం...
ఆహారం:బిస్కట్లు, మిల్క్‌ పౌడర్‌, చక్కెర, డైరఫ్రూట్స్‌, గ్లూకోజ్‌, ఇతర తినుబండారాలూ మీతో పాటు తీసుకువెళ్ళండి. సీసాతో నీళ్ళు, గ్లాసు, స్పూన్లు, ఒక ప్లేట్‌ మీ కిట్‌లో ఉండాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోండి. మార్గమధ్యంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సరుకుల దుకాణాలు, ప్రభుత్వం, ప్రైవేటు వ్యక్తులు నిర్వహించే రెస్టారెంట్లు, టీ దుకాణాలు ఉంటాయి. కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ఉచితంగా ఆహారాన్నీ, దారిపొడుగునా మంచి నీటినీ అందిస్తున్నాయి. ఖాళీ కడుపుతో ప్రయాణం చెయ్యకండి. దానివల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.

హెలీ సేవలు: యాత్రికుల కోసం వివిధ సంస్థలు హెలికాఫ్టర్‌ సేవలు అందిస్తున్నాయి. నీల్‌గ్రాత్‌ (బల్తాల్‌) నుంచి పంచ్‌తరణి వరకూ ఒక వైపు ప్రయాణానికి రూ. 1,600, పహల్గామ్‌ నుంచి పంచ్‌తరణి వరకూ ఒకవైపు ప్రయాణానికి రూ. 2,751 ఛార్జీలుగా నిర్ణయించారు.

నో ప్రీపెయిడ్‌: జమ్మూ-కాశ్మీర్‌లో, యాత్ర జరిగే ప్రాంతంలో ఇతర రాష్ట్రాల ప్రీపెయిడ్‌ సిమ్‌ కార్డులు పని చెయ్యవు. భక్తులు తమ బృందంలో ఒక్కరికైనా పోస్ట్‌ పెయిడ్‌ ఫోన్‌ ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థ అయిన BSNL వారి కనెక్షన్‌ ఉన్న ఫోన్‌ను వెంట ఉంచుకోవడం ఉత్తమం. లేదంటే బల్టాల్‌, నున్వాన్‌ బేస్‌ క్యాంప్‌ల వద్ద ప్రీయాక్టివేటెడ్‌ సిమ్‌ కార్డుల్ని కొనుక్కోవచ్చు.

ఛార్జీలు తెలుసుకోండి:ఏ సేవకు ఎంత మొత్తంలో చెల్లించాలో అమర్‌నాథ్‌ బోర్డు నిర్ణయిస్తుంది. ఆ వివరాలతో బోర్డులు ఉంటాయి. ఆ మేరకు మాత్రమే చెల్లించండి.

ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌: వేసలైన్‌, కోల్డ్‌ క్రీమ్‌, మోశ్చరైజర్‌, లిప్‌ బామ్‌, సర్జికల్‌ కాటన్‌, నొప్పి నివారణ మాత్రలు, స్ర్పేలు, చిన్న చిన్న గాయాలు, ఆరోగ్య ఇబ్బందులకు అత్యవసరంగా ఉపయోగపడే మందులతో ఫస్ట్‌ఎయిడ్‌ బాక్స్‌ మీతో ఉంటే మంచిది. కర్పూరం కూడా తీసుకువెళ్ళండి. శ్వాసకోశ సమస్యలు ఎదురైనప్పుడు దాన్ని వాసన చూస్తే ఉపశమనం కలుగుతుంది.

ఇతర పరికరాలు: దారి మిట్టపల్లాలుగా ఉంటుంది. సుమారు మూడు కిలోమీటర్లకు పైగా మంచు మీద నడవాల్సి ఉంటుంది. కనుక ఊత కోసం పొడవైన కర్ర లేదా వాకింగ్‌ స్టిక్‌ తీసుకు వెళ్ళండి. టార్చిలైట్‌ కూడా దగ్గర ఉంచుకోండి.

చలిని గెలుద్దాం
దుస్తులు: అమర్‌నాథ్‌ మంచు ప్రదేశం. చలి ఎముకలు కొరికేస్తూ ఉంటుంది. ఆ చలిని తట్టుకోవడం చాలా కష్టం. అందుకే శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచడంతోపాటు వెచ్చదనాన్ని అందించే దుస్తులు ఈ యాత్రకు తప్పనిసరి. కాబట్టి ఊలుతో చేసిన స్వెట్టర్లు, ఫ్యాంట్లు, మంకీ క్యాప్‌లు, చేతి తొడుగులు ధరించండి. బయటి నుంచి గాలి శరీరాన్ని తాకకుండా జాగ్రత్త పడండి. రైన్‌ కోట్‌, స్లీపింగ్‌ బ్యాగ్‌, చలిని బాగా తట్టుకోగలిగే రగ్గులు, గొడుగు తీసుకువెళ్ళండి. సాధారణమైన చెప్పులు, షూస్‌ వేసుకోకండి. మంచులో నడవాల్సి ఉంటుంది కనుక వాటర్‌ ప్రూఫ్‌ బూట్లు ధరించండి. స్లిప్పర్లతో, కాళ్ళకు ఎలాంటి ఆచ్ఛాదనా లేకుండా నడవకండి. చెవుల్లోకి చలి గాలి వెళ్ళకుండా దూది పెట్టుకుంటే మేలు.

ఇవి వద్దు: మహిళలు చీరలు ధరించకపోవడం మంచిది. అలవాటు ఉంటే ఫ్యాంట్లు బెస్ట్‌. లేదంటే సల్వార్‌ సూట్లు వేసుకోవచ్చు. ధోవతీల్లాంటివి ధరించకండి.

బస: యాత్ర జరిగే సమయంలో జమ్మూ-కాశ్మీర్‌ పర్యాటకాభివృద్ధి సంస్థ దారి పొడుగునా గుడారాలు ఏర్పాటు చేస్తుంది. వీటిలో వివిధ సౌకర్యాలుంటాయి. ప్రైవేటు వసతి కూడా అందుబాటులో ఉంటుంది. బేస్‌ క్యాంపుల వద్ద వీటిని బుక్‌ చేసుకొవచ్చు. ప్రభుత్వం నిర్దేశించిన ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

అవగాహనతో ప్రయాణం
సమయాలు తెలుసుకోండి: డోమెల్‌, చందన్‌వారీల వద్ద ప్రవేశ ద్వారాలు సాధారణంగా ఉదయం 5 గంటల నుంచి 11 గంటల వరకూ తెరుస్తారు. ఆ సమయానికల్లా గేట్‌ దగ్గరకు యాత్రికులు చేరుకోవాలి. గేట్లు మూసిన తరువాత యాత్రికులు ప్రయాణానికి అనుమతించరు. మధ్యాహ్నం 3 గంటలు దాటిన తరువాత పంచ్‌తరణి క్యాంప్‌ నుంచి గుహాలయం వైపు ప్రయాణించకండి. సాయంత్రం 6 గంటల తరువాత దర్శనానికి అనుమతించరు.

సొంత ప్రయోగాలు వద్దు: దగ్గర దారి అని ఎవరో చెప్పారనో, మీ బుద్ధికి తోచిందనో తెలియని మార్గాల్లో ప్రయాణం చేయకండి. హెచ్చరిక సంకేతాలు ఉన్న ప్రదేశాల్లో ఎక్కువ సేపు నిలిచి ఉండకండి. అలాగే రాత్రిపూట గుహల దగ్గర ఉండడం శ్రేయస్కరం కాదు. ఆక్సిజన్‌ బాగా తక్కువగా ఉండడం వల్ల శ్వాస సంబంధిత ఇబ్బందులు తీవ్రంగా ఉంటాయి. కాబట్టి చీకటి పడకముందే వెనక్కి బయలుదేరడం మంచిది.

హడావిడి పనికిరాదు: తొందరగా వెళ్తామన్న ఆలోచనతో ఇతరుల్ని ఓవర్‌టెక్‌ చెయ్యడం, ట్రాఫిక్‌ నియమాలు ఉల్లంఘించడం లాంటివి చేయకండి. మీరు ప్రయాణించేది ప్రమాదకరమైన మార్గం. రెప్పపాటు పొరపాటు జరిగినా ప్రాణాపాయం పొంచి ఉంటుంది. ప్రశాంతమైన మనసుతో ప్రయాణం సాగించండి.

వారి సేవలే పొందండి: అమరనాథ్‌ ఆలయ బోర్డు గుర్రాలు, డోలీల నిర్వాహకులకు లైసెన్స్‌ కార్డులు ఇస్తుంది. అధికారికంగా నమోదైన వ్యక్తుల సేవలు మాత్రమే వినియోగించుకోండి. వారు మీతో పాటే వచ్చేలా చూసుకోండి. వారిని వదిలి దూరంగా వెళ్ళకండి. వారి పేరు, వివరాలు ఉన్న కార్డులు తీసుకోండి.

ఆదేశాలు పాటించండి: యాత్ర అధికారులు ఎప్పటికప్పుడు సూచనలూ, సలహాలూ ఇస్తూ ఉంటారు. వాటిని జాగ్రత్తగా వినండి. అర్థం కాకపోతే సమీపంలో ఉన్న వారిని అడిగి తెలుసుకోండి. యాత్ర సమయంలో అమరనాథ్‌ ఆలయ బోర్డు సిబ్బంది, పోలీసులు, పర్యాటక, ఆరోగ్య శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వాలంటీర్లు అందుబాటులో ఉంటారు. మీకు ఎలాంటి సందేహాలున్నా వాళ్ళను అడిగి తెలుసుకోండి.

పర్యావరణహితంగా: డిస్పోజబుల్‌ ప్లాస్టిక్‌ కప్పులూ, ప్లేట్లను వినియోగించకండి. పాలిథిన్‌ వాడకం జమ్మూ-కాశ్మీర్‌లో నిషేధం. చెత్తను నిర్దేశించిన ప్రదేశాల్లో మాత్రమే పడేయండి.

Wednesday, 27 June 2018

వైష్ణోదేవి


కోరిన వరాలిచ్చే వైష్ణోదేవి

ముగ్గురమ్మలు మూర్తీభవించిన దేవిగా, తనను దర్శించే భక్తులకు ధర్మార్ధ కామ మోక్షాలు ప్రసాదించే జగజ్జననిగా జమ్మూ-కాశ్మీరు రాష్ట్రంలో కొలువైవుంది వైష్ణోదేవి. ఈ చల్లని తల్లి దర్శనార్ధం భక్తులు ఎక్కడెక్కడినుంచో సంవత్సరం పొడుగునా అశేష సంఖ్యలో వస్తారనేదే దేవి మహిమకి నిదర్శనం. ఆ దేవిని దర్శించినవరెవరూ తమ న్యాయమైన కోరికలు తీరకుండా రిక్త హస్తాలతో వెను తిరగరని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

సముద్రమట్టానికి 5200 అడుగుల ఎత్తులో త్రికూట పర్వత గుహలో వెలసిన వైష్ణోదేవి, భక్తులు అడిగే న్యాయమైన కోర్కెలు తీర్చే చల్లని తల్లి. ఈ ఆలయం ఎన్ని ఏళ్ళు క్రితందో ఆధారాలు లేవు. భూగర్భ శాస్త్రవేత్తల పరిశోధనలో ఈ ఆలయం వున్న గుహ ఒక మిలియన్ సంవత్సరాల పూర్వంనుంచి వున్నదని కనుగొన్నారు. ప్రప్రధమంగా పాండవులకాలంలోనే శక్తి పూజలు ప్రారంభం అయినాయనీ, వారే ఈ ప్రాంతంలో దేవీ ఆలయాలు నిర్మించారని ఇంకొక కధనం.

ఉత్తరాదివారి కొంగు బంగారమై విలసిల్లే ఈ దేవి ప్రాశస్త్యం దక్షిణాదిలో అంత ఎక్కువగా కనబడదు. అందుకే ఇక్కడివారు ఈ దేవిని లక్ష్మీ స్వరూపమని కొందరు, పార్వతీ స్వరూపమని కొందరు చెబుతారు. నిజానికి మహాలక్ష్మీ, మహాకాళీ, మహా సరస్వతి .... ఈ ముగ్గురి తేజోమయ స్వరూపమే ఈ తల్లి. ఆ కధ ఏమిటంటే...

పూర్వం జగన్మాత అసురుల బాధలు ఎక్కువగా వుండి వారితో పోరాడే సమయంలో భూలోకంలో ధర్మాన్ని రక్షించి, ప్రజలని కాపాడేందుకు మహాలక్ష్మీ, మహాకాళి, మహా సరస్వతులు తమ తేజస్సునుండి ఒక దివ్య శక్తిని ఆవిర్భవింపచేయాలనుకున్నారు. వారి సంకల్పమాత్రంచేత అక్కడో అందమైన యువతి ప్రత్యక్షమైంది. వారు ఆ యువతిని భూలోకంలో ధర్మ సంరక్షణార్ధం రత్నాకరసాగర్ అనే ఆయనకి పుత్రికగా విష్ణు అంశతో జన్మించి ధర్మహిత కార్యాలు చేయమని, ఆధ్యాత్మికంగా ఉన్నతస్ధాయికి చేరుకున్న తర్వాత శ్రీ మహా విష్ణువులో ఐక్యం చెందుతావని చెబుతారు. ఆ మహాశక్తుల ఆదేశానుసారం రత్మాకరసాగర్ ఇంట జన్మించిన ఆ బాలికకు వైష్ణవి అని నామకరణంచేయబడ్డది.

వైష్ణవి చిన్నతనంనుంచే జ్ఞాన సముపార్జనలో లీనమైంది. ఏ గురువులూ ఆమె జ్ఞాన తృష్ణను తీర్చలేకపోయారు. జ్ఞానసముపార్జనలో ఉన్నతస్ధాయి చేరుకోవాలనే తపనతో వైష్ణవి అంతర్ముఖి అయిచేసిన అన్వేషణలో ధ్యానం విలువ తెలుసుకుంది. తపస్సుతోనే తన జీవన ధ్యేయాన్ని సాధించగలననుకుని, ఇల్లు వదిలి అడవుల్లోకెళ్ళి తపస్సు చేయసాగింది.

అదే సమయంలో 14 సంవత్సరాలు అరణ్యవాసంలోవున్న శ్రీరామచంద్రుడు అక్కడికి వచ్చాడు. వైష్ణవి శ్రీరామచంద్రుణ్ణి ఆ శ్రీమహావిష్ణువుగా గుర్తించి, తనని ఆయనలో లీనం చేసుకోమనికోరింది. శ్రీరామచంద్రుడు దానికి తగిన సమయంకాదని, తన అరణ్యవాసం తర్వాత తిరిగి వైష్ణవి దగ్గరకొస్తానని, ఆ సమయంలో ఆమె తనని గుర్తిస్తే తప్పక తనలో ఐక్యం చేసుకుంటానని తెలిపాడు. ఆ ప్రకారమే శ్రీరామచంద్రుడు అరణ్యవాసం, రావణవధానంతరం అయోధ్యకి తిరిగి వెళ్తూ ఆమెదగ్గరకు ఒక వృధ్ధుడి రూపంలో వచ్చాడు. కానీ ఆ సమయంలో వైష్ణవి ఆయనని గుర్తించలేకపోతుంది. అందుకని భగవంతునిలో ఐక్యమయ్యే ఆవిడ కోరిక తీరలేదు.

బాధపడుతున్న వైష్ణవిని శ్రీరామచంద్రుడు ఓదార్చి, ఆమె తనలో ఐక్యమవటానికి తగిన సమయమింకారాలేదని, కలియుగంలో తాను కల్కి అవతారం ధరిస్తానని, అప్పుడు ఆమె కోరిక నెరవేరుతుందని ధైర్యం చెప్పాడు. త్రికూట పర్వత సానువుల్లో ఆశ్రమం నెలకొల్పుకుని తపస్సు కొనసాగిస్తూ, ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలు అవరోహించమని, ప్రజల మనోభీష్టాలు నెరవేర్చి, పేద, బాధిత ప్రజల కష్టాలు తీర్చమని ఆదేశించాడు.

శ్రీరామచంద్రుని ఆజ్ఞానుసారం వైష్ణవి త్రికూట పర్వతసానువుల్లో ఆశ్రమాన్ని నెలకొల్పుకుని తన తపస్సు కొనసాగించింది. అనతికాలంలోనే ఆవిడ శక్తిని గ్రహించిన ప్రజలు ఆవిడ ఆశీస్సులకోసం రాసాగారు.

కొంతకాలం తర్వాత గోరఖ్ నాధ్ అనే తాంత్రికుడు వైష్ణవి గురించి, ఆమె దీక్ష గురించి తెలుసుకుని, శ్రీరామచంద్రుడు ఆదేశించిన ప్రకారం ఆమె ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలను అధిరోహించిందో లేదో తెలుసుకోవాలనే కుతూహలంతో, వివరాలు తెలుసుకురావటానికి అత్యంత సమర్ధుడైన తన శిష్యుడు భైరవనాధుణ్ణి పంపాడు. భైరవనాధుడు చాటుగా వైష్ణనిని గమనించాడు. తపస్విని అయినా వైష్ణవి ఎల్లప్పుడు ధనుర్బాణాలు ధరించి వుండటం, ఆవిడకి రక్షగా లంగూర్లు, ఒక భయంకర సింహం వుండటం గమనించాడు. భైరవనాధుడు వైష్ణవి అందానికి ముగ్ధుడై తనని వివాహం చేసుకోమని ఆమెని విసిగించసాగాడు.

వైష్ణవికి అత్యంత భక్తుడైన శ్రీధర్ ఒకసారి ఊరందరికీ భోజనాలు పెట్టాలని అందరినీ ఆహ్వానిస్తూ, గోరఖ్ నాధ్ ని, భైరవనాధ్ తో సహా మిగతా ఆయన శిష్యులనందరినీ భోజనానికి ఆహ్వానించాడు. భోజనసమయంలో భైరవుడు వైష్ణవిపట్ల అమర్యాదగా ప్రవర్తించాడు. వైష్ణవి మందలించినా వినడు. వివాదం పెద్దదిచేసి భైరవుణ్ణి శిక్షించటం ఇష్టంలేని వైష్ణవి వాయురూపంలో పర్వతాలలోకి వెళ్తుంది తన తపస్సును కొనసాగించటానికి.

భైరవుడు ఆమెని వదలకుండా వెంటాడుతాడు. బాణగంగ, చరణపాదుక, అధక్వారీ అని ప్రస్తుతం పిలువబడుతున్న ప్రదేశాల్లో ఆగుతూ త్రికూట పర్వతంలోని ఈ పవిత్రగుహ దగ్గరకు వెళ్తుంది వైష్ణవి. అప్పటికీ విడువకుండా వెంటాడుతున్న భైరవుడి తలని ఆ గుహ బయట ఒక్క వేటుతో నరుకుతుంది. తెగిన భైరవుడి తల కొంచెం దూరంలో ఒక పర్వత శిఖరంమీదపడింది.

అప్పుడు తన తప్పుతెలుసుకున్న భైరవుడు వైష్ణవీదేవిని క్షమించమని ప్రార్ధిస్తాడు. మాత దయతలచి, తన భక్తులంతా తన దర్శనం తర్వాత భైరవుణ్ణి దర్శిస్తారని, అప్పుడే వారి యాత్ర సంపూర్ణమవుతుందని వరమిస్తుంది.

తదనంతరం వైష్ణవి తన ధ్యేయం నెరవేర్చుకోవటానికి, అంటే అత్యున్నత తపస్సుతో శ్రీ మహావిష్ణువులో లీనమయ్యే అర్హత సంపాదించుకోవటానికి, అలాగే తనని సృష్టించిన త్రిమాతలు, మరియు శ్రీరామచంద్రుని ఆజ్ఞప్రకారం ప్రజల కోర్కెలు తీర్చటానికి త్రికూట పర్వతంపైన గుహలో, 3 తలలతో 5.5 అడుగుల ఎత్తయిన రాతిరూపం ధరించింది. వైష్ణోదేవిలో గుహాలయంలో మనకి కనిపించే మూడు రాతి రూపాలు (పిండీలంటారు అక్కడివారు) ఆ మాత తలలే. వాటినే మహాకాళీ, వైష్ణోదేవి, మహా సరస్వతిగా చెప్తారు అక్కడి పండితులు.

వైష్ణోదేవి ఆలయం చేరటానికి 14 కి.మీ. దూరం కొండలెక్కాలి. దోవ పొడుగుతా తినుబండారాలు, త్రాగు నీరు, శౌచాలయాలు వగైరా యాత్రీకులకి కావలసిన అన్ని రకాల సదుపాయాలు వున్నాయి. దోవలో అవసరమైతే కొంతసేపు ఆగి విశ్రాంతికూడా తీసుకోవచ్చు. 24 గంటలూ యాత్రీకుల సందడితో వుండే దోవ పైన చాలా మటుకు రేకులతో కప్పబడి పైనుంచీ పడే రాళ్ళనుంచేకాక, ఎండా వానలనుంచీ కూడా యాత్రీకులని రక్షిస్తుంటాయి. ఎత్తైన కొండలమీద నుంచి కనిపించే అందమైన ప్రకృతి దృశ్యాలు నడిచేవారికి అలసట తెలియనీయవు. కొండ ఎక్కలేనివారికోసం గుఱ్ఱాలు, డోలీలు వున్నాయి. గుఱ్ఱం కొంచెం నడుం గట్టితనాన్ని పరీక్షించినా, డోలీలో ఎలాంటివారైనా తేలికగా వెళ్ళవచ్చు. కుర్చీ లో మనం కూర్చుంటే దానికి వున్న కఱ్ఱల సహాయంతో నలుగురు మనుష్యులు మనల్ని మోసుకెళ్తారు. అదే డోలీ. తోవ పొడుగూతా భక్తులు జై మాతాకీ అంటూ లయ బధ్ధంగా చేసే నినాదాలు యాత్రీకులలో ఎనలేని ఉత్సాహాన్ని కలిగిస్తాయి.

ఆగేవాలే బోలో జైమాతాకీ| పీఛేవాలే బోలో జైమాతాకీ||
పాల్కీవాలే బోలో జైమాతాకీ| ఘోడేవాలే బోలో జైమాతాకీ||

అంటూ అందరినీ కలుపుకుంటూ చేసే నినాదాలతో మనమూ శృతి కలపకుండా వుండలేము.
అర్ధరాత్రి అయినా జనసంచారం, విద్యుద్దీపాలు వుంటాయి. నిర్భయంగా కొండ ఎక్కవచ్చు. అయితే రాత్రిళ్ళు డోలీలుండవు. ఆలయం అన్నివేళలా తెరిచివుంటుంది (రాత్రంతా కూడా).

దేవీ దర్శనానికి ఇదివరకు చిన్న గుహ మార్గంలో పాకుతూ వెళ్ళవలసి వచ్చేదిట. ప్రస్తుతం మార్గం సుగమంచేశారు. ఎక్కడా వంగకుండా నడుస్తూనే వెళ్ళిరావచ్చు.

ఇక్కడ దర్శనానికి చాలా చక్కని ఏర్పాట్లు చెయ్యబడ్డాయి. దర్శనానికి బయల్దేరే ముందే కింద ముఖ్యద్వారంగుండా వెళ్ళటానికి కూపన్ తీసుకోవాలి. పరఛీ అంటారు దీనిని. ఎక్కువ సమయం పట్టదు దీనికి. గ్రూప్ కి ఒకళ్ళు వెళ్ళి కూడా తీసుకోవచ్చు. ఇది తీసుకున్న ఆరు గంటలలోపు ముఖ్యద్వారంగుండా లోపలకి వెళ్ళాలి. లేకపోతే ఇంకొకటి తీసుకోవాల్సి వుంటుంది. అది వుంటేనే ముఖ్యద్వారంగుండా లోపలకి (కొండ ఎక్కటానికి) వెళ్ళనిస్తారు. మనం పైకి వెళ్ళాక పరఛీ చూపించి బేచ్ నెంబరు తీసుకోవాలి. దర్శనానికి వచ్చేవారిని ఇలా బేచ్ నెంబర్లు ఇచ్చి క్రమబధ్ధీకరిస్తారు. ఆ నెంబరు ప్రకారం దర్శనానికి వెళ్ళాలి. జరుగుతున్న బేచ్ నెంబరు బోర్డుమీదు చూపిస్తుంటారు. ఖాళీ వుంటే తర్వాత బేచ్ వాళ్ళనికూడా వెళ్ళనిస్తారు. దానితో తొక్కిడి వుండదు 5, 6 చోట్ల సెక్యూరిటీ చెక్ వుంటుంది. డోలీలు ఆలయానికి ఒక కి.మీ. దూరం దాకా వెళ్తాయి. గుఱ్ఱాలు ఇంకా కొంచెం దూరంగా ఆగుతాయి. అక్కడనుండి నడక తప్పదు. అయితే ఎలాంటివారైనా నెమ్మదిగా అన్నీ చూసుకుంటూ వెళ్తే శ్రమ తెలియదు. అనేక చోట్ల వచ్చే సెక్యూరిటీ చెక్ లతో మనం అంత దూరం వెళ్ళామని కూడా తెలియదు. కెమేరా, సెల్, తోలు బెల్టులు వగైరాలు అన్నీ అక్కడ లాకర్లలో పెట్టి వెళ్ళాల్సిందే.

ఆలయానికి చేరుకోవటానికి హెలికాప్టరుకూడా వున్నది. ఈ సర్వీసు కాట్రానుంచి వుంటుంది. ముందుగా ఆన్ లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు. అయితే ఆ సర్వీసులు వాతావరణాన్నిబట్టి వుంటాయి. మేము వెళ్ళినప్పుడు పొగమంచు ఎక్కువగా వున్నకారణంగా నెల రోజులనుంచి హెలికాప్టర్లు నడపలేదు.

ఇక్కడ కొన్ని జాగ్రత్తలు చెబుతాను. డోలీలో వెళ్ళాలనుకుంటే కిందే కౌంటర్ లో రానూ పోనూ కావాలో, కేవలం దింపటానికే కావాలో చెప్పి బుక్ చేసుకోండి. ఇవ్వాల్సిన డబ్బు, డోలీ తీసుకొచ్చేవాళ్ళల్లో ఒకరిద్దరి పేర్లతో సహా అన్ని వివరాలూ రాసి ఇస్తారు. ఇది గవర్నమెంటు వాళ్ళ కౌంటర్. అక్కడ అది ఒక్కటే వుంది అని అన్నారు. విడిగా డోలీ గానీ, గుఱ్ఱంగానీ మాట్లాడుకుంటే వాళ్ళకి లైసెన్సు టోకెన్లుంటాయి. మీ యాత్ర పూర్తయ్యేదాకా అవి అడిగి తీసుకుని మీ దగ్గర పెట్టుకోండి. ఎవరికీ పూర్తి డబ్బు ముందు ఇవ్వద్దు. మాట్లాడుకున్న డబ్బుకాకుండా మళ్ళీ మీదగ్గర నాస్తా, చాయ్ అంటూ వసూలు చేస్తారు.

డోలీ మాట్లాడుకునేటప్పుడే పాదగయ (అమ్మవారి పాదాలుంటాయి), అమ్మవారి ఆలయానికి ఇంకా కొంచెం పైకి వెళ్తే భైరవ ఆలయం వుంటుంది..అది చూస్తేగానీ యాత్ర సంపూర్తి కాదంటారు. ఇవ్వన్నీ చూపించాలి అని చెప్పండి. మాకు తెలియక అవి చూడలేదు. మధ్యలో డోలీ వాళ్ళనడిగితే దోవ సరిగాలేదని పైన కొండ చూపించి అదే భైరవాలయం దణ్ణం పెట్టమన్నారు (పెళ్ళిలో అరుంధతీ నక్షత్రంలాగా).

దోవ ఒకటే వుంటుంది. ఎలా వెళ్ళాలి అని కంగారు పడకండి. మీకు కావాల్సిన వివరాల బోర్డులుంటాయి. సీనియర్ సిటిజన్స్ కోసం 6 కి.మీ. కొండ ఎక్కిన తర్వాత ఆలయం వారి ఆధ్వర్యంలో బేటరీతో నడిచే కార్లున్నాయి (ఆటోలు). అక్కడదాకా గుఱ్ఱాలు, డోలీలలో వెళ్ళవచ్చు.

గర్భగుడిలో పూజారులెవ్వరూ డబ్బులు తీసుకోరు. మీరు అమ్మవారికిచ్చే కానుకలు హాయిగా హుండీలో వెయ్యండి. అమ్మవార్లు ముగ్గురుంటారు.. కాళీ, వైష్ణవీ, సరస్వతి...లింగ రూపంలో...మధ్యలో దేవి వైష్ణవి. ఈ సంగతి అక్కడవున్న పూజారి అందరికీ చెబుతూనే వుంటారు. అమ్మవార్ల పైన కిరీటాలుంటాయి. అంతేగానీ అక్కడ అమ్మవార్ల రూపం వుండదు.

దర్శనమయ్యాక అక్కడే కేంటీన్లు వుంటాయి.. పూరీ కూరా, రజ్మా రైస్ వగైరా ధరలు తక్కువే. భోజనం చేసి మరీ తిరుగు ప్రయాణం మొదలు పెట్టవచ్చు. పైన వుండటానికి కూడా వసతి వున్నది.

మార్గం
జమ్మూ రాష్ట్రంలోని కట్రాదాకా రైలు, రోడ్డు, వాయు మార్గాలున్నాయి. అక్కడనుండి యాత్ర మొదలయ్యే మైన్ గేట్ దాకా ఆటోలో వెళ్ళవచ్చు. దోవలో బస్ స్టాండులో ఆటో ఆపి పరఛీ తీసుకుని, అక్కడేవున్న డోలీ కౌంటర్ లో డోలీ మాట్లాడుకుని మైన్ గేట్ దాకా ఆటోలో వెళ్తే అక్కడనుంచి మాత్రమే డోలీ వగైరా యాత్ర మొదలవుతుంది.

ఆంధ్రభూమి

అరకు


అందాల అరకు

ప్రకృతి రమణీయత చూడాలంటే అరకులోయ వెళ్లాల్సిందే. ఇక్కడికి రాష్ట్రంలోని వారే కాకుండా, దేశ విదేశాలనుండి కూడా పర్యాటకులు వస్తుంటారు. అరకులోయ సముద్రమట్టానికి 900 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అణువణువునా ప్రకృతి రమణీయత, అద్భుత పర్వత పంక్తులు ఇక్కడ దర్శనమిస్తాయి.

విశాఖపట్నానికి ఇది 115 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒరిస్సా రాష్ట్రం సరిహద్దుకు చాలా దగ్గర్లో ఉంటుంది. నయగారాలను ఒలికించే జలపతాలు, ఆహ్లాదకరమైన వాతావరణం పర్యాటకులను మైమరపిస్తుంది. ఇక్కడ ప్రకృతి సోయగాన్ని ప్రత్యక్షంగా వీక్షించాల్సిందే గానీ వర్ణించనలవి కాదు. దాదాపు 36 కిలోమీటర్ల పరిథిలో విస్తరించి ఉన్న ఈ అందాల అరకు తప్పకుండా చూడాల్సిన ప్రాంతం.

అరకులోయకు ఘాట్‌రోడ్డు మార్గం ద్వారా వెళ్తున్నప్పుడు రోడ్డుకి రెండు వైపుల ఉన్న దట్టమైన అడవులు కనువిందు చేస్తాయి. ట్రెక్కింగ్‌కి ఇది అనువైన ప్రాంతం. భలే సరదాగా ఉంటుంది. అరకు వెళ్లే మార్గంలో మొత్తం 46 టన్నెళ్లు, బ్రిడ్జ్‌లు స్వాగతం చెబుతాయి. ఇక మధ్యమధ్యలో దర్శనమిచ్చే అనంతగిరి కొండలు కాఫీ తోటలకు ప్రసిద్ధి. అరకులోయను సందర్శించే వారు తప్పక వెళ్లాల్సిన చోటు బొర్రా గుహలు. ఇవి అరకులోయకు సుమారు 29 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.

మౌంట్‌ అబూ


మౌంట్‌ అబూ
ఎడారిలో మంచు పుష్పం

ఆరావళీ పర్వత శ్రేణులలో అందమైన రాణిలా వెలిగిపోతుండే మౌంట్‌ అబూ చిరునవ్వుతో స్వాగతం పలుకుతుంది. ప్రకృతి గీచిన చిత్రాలనే కాకుండా, పరవశింపజేసే ఆలయాలను సైతం తనలో ఇముడ్చుకున్న మౌంట్‌ అబూలో రాజస్థాన్‌ హస్తకళల అందాలకూ కొదవలేదు.

నక్కి సరస్సు జల సౌందర్యం, దిల్‌ఖుష్‌ చేసే దిల్‌వారా ఆలయాలు, వశిష్ట మహర్షి ఆశ్రమం... ఇలా ఒక్కటేమిటి, ఒకసారి చూస్తే మళ్లీమళ్లీ చూడాలనిపించే అద్భుత ప్రదేశం 'మౌంట్‌ అబూ'. ఎర్రటి ఎండలనే కాదు, చల్లటి మౌంట్‌ అబూను తనలో దాచుకున్న రాజస్థాన్‌ వెళ్లేందుకు 'అయ్యో... ఎర్రటి ఎండలోనా...?'' అని గాబరా పడాల్సిన పనిలేదు. ఎంచక్కా మౌంట్‌ అబూ ఉందిగా!!

ఆరావళి పర్వత శ్రేణులలో ఉండే అబూ అనే కొండమీద ఒక చిన్న పట్టణమే 'మౌంట్‌ అబూ'. సుమారు నాలుగు వేల అడుగుల ఎత్తైన కొండమీద ఉండే పట్టణం ఇది. రాజస్థాన్‌ రాష్ట్రం దక్షిణపు అంచుల్లోనూ, గుజరాత్‌ రాష్ట్రానికి ఆనుకుని ఉంటుంది.

ఇక్కడ మనసు దోచుకునే గొప్ప విశేషం ఏంటంటే... దిల్‌వారా అనే చోట ఉండే జైన దేవాలయం. లలితకళలు, శిల్పాలు పట్ల ఆసక్తిలేని వారు కూడా దిల్‌వారాలోని ఆలయాలను చూస్తే నిశ్చేష్టులైపోతారు. అంత సుందరంగా ఉండే ఆలయాలను 12 గంటల తర్వాత మాత్రమే తెరుస్తారు. వీటిని తృప్తిగా చూడాలంటే కనీసం రెండు గంటలు పడుతుంది. ఇక్కడి '''అచలాగఢ్‌్‌'' అనే ప్రదేశంలోని ఈశ్వరుడి గుడి కూడా చాలా ప్రాశస్త్యమైంది.

'ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విద్యాలయం' అనేది మౌంట్‌ అబూలో చెప్పుకోదగ్గ ప్రఖ్యాత సంస్థ. ఈ పట్టణానికి బయట దాదాపు 4 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ సంస్థకు సంబంధించి మూడు ప్రదేశాలు చాలా ముఖ్యమైనవి. ఒకటి... జ్ఞాన సరోవర్‌. రెండోది... ఓం శాంతి భవనం. మూడు... శాంతి వనం.

ఈ మూడు ప్రాంతాల్లో ఎన్నో ఎకరాల విస్తీర్ణం ఉన్న ఉద్యానవనాల మధ్య, ఊహించలేనంత పెద్ద పెద్ద భవనాలు ఉంటాయి. ఇక్కడ బ్రహ్మకుమారి సంస్థకు సంబంధించిన తాత్విక చింతన, ఆధ్యాత్మిక దృష్టికి సంబంధించిన విషయాలు మాత్రమే ఉంటాయి. ఈ భవనాల్లోని చిత్రాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఆ తర్వాత అబూ నడిబొడ్డున ఉండే రోడ్డుపైనే వీరి 'మ్యూజియం' ఉంది.

అబూ పట్టణ ప్రాంతానికి అధిదేవతగా పిలువబడే 'అధర్‌దేవి ఆలయం' కూడా చూడదగ్గది. దీనినే అద్భుదదేవి మందిరం అని కూడా అంటారు. అబూ పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో కొండ అంచునున్న ఓ చిన్న గుడి ఇది. ఒక చిన్న గుహలాంటి చోట ఉంటుంది. ఇక్కడికి చేరుకోవాలంటే, కొండ అంచునే సుమారు 200 మెట్లు ఎక్కుతూ వెళ్లాలి.

ఇక మౌంట్‌ అబూకు మూడు కిలోమీటర్ల దూరంలో కొండ అంచున ఉండే అద్భుతమైన ప్రాంతం 'హనీమూన్‌ పాయింట్‌'. ఈ కొండ ఆనుకుని నిట్టనిలువుగా కొన్ని వందల అడుగుల లోతులో ఉండే చదునైన లోయప్రాంతం ఉంటుంది. అక్కడికి దూరంగా ఒకటి రెండు చిన్న గ్రామాలుంటాయి. కొండ అంచున నిలబడి ఈ మనోహరమైన దృశ్యం చూసేందుకు అనువుగా ఇక్కడ సిమెంటుతో ప్లాట్‌ఫామ్స్‌ ఉంటాయి.

అబూ నుంచి సుమారు 12 కిలోమీటర్ల దూరంలోని కొండమీద ఉండే 'గురు శిఖర్‌ ఆలయం' కూడా ఎంతో ప్రసిద్ధి. 5,653 అడుగుల ఎత్తులో ఉండే ఈ ఆలయ శిఖరం అబూలోని కొండ శిఖరాలన్నింటిలోకి ఎత్తైనది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల విగ్రహాలున్న ఈ ఆలయంలో గురు దత్తాత్రేయుడి పాదముద్రలు కలిగిన మరో చిన్న ఆలయం కూడా ఉంది.

మౌంట్‌ అబూ నగరానికి మధ్యలో మెయిన్‌ బజారుకు ఆనుకుని ఉండే 'నక్కి' సరస్సు గురించి ఓ కథ ప్రచారంలో ఉంది. ఒకప్పుడు దేవతలు స్వయంగా వచ్చి తమ గోళ్లతో ఈ సరస్సును తవ్వారని, అందుకనే దీనికి నక్కి సరస్సు అనే పేరు వచ్చిందని స్థానికుల చెప్తారు. 14వ శతాబ్దంలో నిర్మించబడిన రఘునాథ్‌జీ మందిరం. దాన్ని ఆనుకుని దూలేశ్వర్‌ మహదేవ ఆలయం... కూడా ఈ సరస్సును ఆనుకునే ఉంటుంది.

నక్కి సరస్సు ఒడ్డుమీద సుమారు ఒక కిలోమీటర్‌ దూరం నడిచి వెళ్లినట్టయితే.... సరస్సుకు పడమర వైపు రెండు చిన్న కొండల మధ్య కనిపించే సూర్యాస్తమయ దృశ్యం అత్యద్భుతంగా ఉంటుంది. దీన్ని చూడ్డానికి వెళ్లే దారిలోనే, ఒక చోట చిన్న గుట్టపైన రాయి మీద రాయి నిలువుగా పేర్చి ఉంటుంది. దీన్నే కప్పపిల్ల రాయి అని పిలుస్తారు.

ఇంకా మౌంట్‌ అబూలో చూడదగ్గ విశేషాల విషయానికి వస్తే... రుషికేష్‌ ఆలయం. వశిష్ట మహర్షి ఆశ్రమం. అచలేశ్వర ఆలయం... ఉన్నాయి. ముఖ్యంగా దిల్‌వారాలో ఉన్న అద్భుతమైన ఆలయాలను చూడడం ఒక అపురూపమైన అనుభూతి. మన దక్షిణ భారతీయులకు ఊటీ, కొడైకెనాల్‌ ఎలాగో... ఎడారి ప్రాంతమైన రాజస్థాన్‌ వాసులకు మౌంట్‌ అబూ వేసవి విడిదిలాంటిదని చెప్పొచ్చు.

మౌంట్‌ అబూకు చేరుకోవడం ఎలా?
అన్ని ముఖ్యమైన పట్టణాల నుంచి అబూ పట్టణానికి బస్సులున్నాయి. అబూ రోడ్‌ అనే పేరుతో ఉండే ఓ రైల్వేస్టేషన్‌ నుంచి అబూ పట్టణానికి చేరుకోవాలంటే 37 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. రైల్వే స్టేషన్‌ నుంచి బస్సులు, జీబులు, టాక్సీలు అందుబాటులో ఉంటాయి. వాటిలో వెళ్లాలంటే... బస్సు ఛార్జీ అయితే మనిషికి 7 రూపాయలు. అదే జీపులోనయితే మనిషికి 20 రూపాయలు వసూలు చేస్తారు. ఇక టాక్సీలయితే 150 రూపాయల వరకూ ఉంటుంది.

కులు మనాలి


కులు మనాలి

మంచు పర్వతాల్ని చూడగానే ప్రతి ఒక్కరూ చిన్న పిల్లలై పోతారు. ఈ ప్రదేశంలో చిన్నా పెద్దా తేడా లేకుండా మంచు ముక్కలతో ఆడుకోడానికి పోటీపడతారు. అలాంటి ప్రాంతం ఏదనుకుంటున్నారా? అంతగా అందర్నీ మైమరిపించగలిగేది ఒకే ఒక్క ప్రాంతం. అదే కులు మనాలి. 


కులు మనాలి అంటే ఒకే ఊరు పేరు అనుకుంటారు. రెండు వేర్వేరు ఊరి పేర్లు. ఇవి హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రానికి ఓ చివర్లో ఉంటాయి. ముందుగా కులు, అక్కడ్నుండి 45 కిలోమీటర్ల దూరంలో మనాలిలు... తెల్ల మంచు దుప్పటి కప్పుకుని మరీ స్వాగతం చెబుతాయి. సిమ్లా నుంచి మనాలి 260 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సుమారుగా తొమ్మిది గంటలసేపు ప్రయాణం చేయాలి. దేశ రాజధాని నగరం ఢిల్లీ నుండైతే మనాలికి వెళ్లే ప్యాకేజీ బస్సులు అందుబాటులో ఉంటాయి. ఢిల్లీ నుండి 18 గంటల ప్రయాణం.

కులు, మనాలీలు పుణ్యక్షేత్రాలు కావు. ఇవి రెండూ కేవలం వేసవి విడిది కేంద్రాలు మాత్రమే. కులులో రఘునాథ్‌, మనాలీలో హిడింబి ఆలయాలు ఉంటాయి. హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రం మొత్తం హిమాలయ పర్వత శిఖరాల నడుమ నెలకొని ఉంటుంది. అందువల్ల కులు, మనాలి ఊళ్ల చుట్టూ ఎత్తైన కొండలే దర్శనమిస్తాయి.

వేసవికాలంలో కులు, మనాలిలో చాలా చల్లగా ఉంటుంది. అయితే చుట్టూ ఉన్న కొండలమీద ఒక్కటంటే ఒక్కటి కూడా పచ్చని చెట్టు ఉండదు. వర్షాకాలం తర్వాత సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో చెట్టన్నీ పచ్చగా కళకళలాడుతూ చూడముచ్చటగా ఉంటాయి. సెప్టెంబర్‌ నాటికి యాపిల్‌పంట వస్తుంది.

నవంబర్‌ నుంచి కులు, మనాలి ప్రాంతాల్లోని కొండలన్నీ మంచుతో నిండి ఉంటాయి. మనాలి నుంచి 55 కిలోమీటర్ల దూరంలో రొహతంగ్‌ కనుమ చూడదగ్గ ప్రాంతం. ఈ కనుమ దాటి వెళ్తే హిమాచల్‌లో చిట్టచివరిగా ఉండేది లాహుల్‌ జిల్లా, దాని తర్వాత లడక్‌ ప్రాంతం వస్తుంది. నవంబర్‌ నుంచి ఏప్రిల్‌ నెలల దాకా మనాలిలోని కొండలన్నీ మంచుతో నిండిపోతాయి. అక్కడ్నుండి రొహతంగ్‌ కనుమదాకా వెళ్లేందుకు వీలు లేకుండా రోడ్లన్నీ మంచుతో మూసుకుపోతాయి. కులు, మనాలిలో అసలయిన అందం నవంబర్‌ నుంచే ప్రారంభం అవుతుంది.

ముఖ్యంగా జనవరి, ఫిబ్రవరి మాసాల్లో ఇక్కడ మంచుమీద జరిగే స్కైయింగ్‌ ఆటలు చాలా ఆహ్లాదంగా సాగుతాయి. కేవలం మంచులో ఆడుకోడానికే పర్యాటకులు కూడా ఇక్కడికి పెద్ద సంఖ్యలో వస్తుంటారు. అందుకే ఈ నెలల్లో కులు, మనాలి ప్రాంతాల్లోని హోటళ్లలో గదులు దొరకడం చాలా కష్టం.

ఇక్కడి గదుల అద్దె దాదాపు 800 నుంచి వెయ్యి రూపాయల వరకు ఉంటుంది. ఇవే గదులు సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో అయితే 300 నుండి 400 రూపాయల దాకా వుంటాయి. ఇక్కడ చక్కటి పచ్చళ్లు, పప్పుతో మాంచి తెలుగు భోజనం ఏర్పాటు చేసే హోటళ్లు కూడా ఉన్నాయి.

మేఘాలయ


మేఘాలలో తేలిపోదామా ...


పచ్చని చెట్లమధ్య రాసి పోసినట్లుండే తెల్లని మేఘాలు... రోడ్డు పక్క, దూరంగా కనిపించే కొండలమీద ఉన్న చెట్లు... ఇలా ప్రకృతి మొత్తం తైలవర్ణచిత్రంలా ఉంటుందిక్కడ. ఇక వానాకాలంలో అయితే ఎటుచూసినా మేఘాల గుంపు కనిపిస్తుంది. ఆ వాతావరణం ప్రశాంతతకు చిహ్నమేమో అనిపిస్తుంది. అటువంటి మేఘాలయకు వెళ్లడమంటే మేఘాలలో తేలిపోవడమే.

మేఘాలయ భారతదేశపు ఈశాన్యప్రాంతంలో 300 కిలోమీటర్ల పొడవు, వంద కిలోమీటర్ల వెడల్పుతో పర్వతమయంగా ఉంటుంది. దీనికి ఉత్తరాన అస్సాం రాష్ట్ర సరిహద్దుగా బ్రహ్మపుత్ర నది.. దక్షిణాన షిల్లాంగ్‌ పట్టణం ఉంటుంది. ఇదే మేఘాలయ రాష్ట్ర రాజధాని కూడా...!

మేఘాలయ వాతావరణం మరీ వేడిగా, అలా అని మరీ చల్లగా ఉండదు. కానీ దేశం మొత్తంలో చూస్తే వర్షాలు మాత్రం ఈ ప్రాంతంలోనే అత్యధికం. ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో 1200 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదవుతుంది. షిల్లాంగ్‌కు దక్షిణాన ఉన్న చిరపుంజి పట్టణం ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఆ దగ్గర్లోని మాసిన్రామ్‌లో కూడా అంతే.

మేఘాలయలో మూడోవంతు అటవీ ప్రాంతమే. పశ్చిమాన 'గరో' పర్వత శ్రేణులు, తూర్పున 'ఖాసి, జైంతియా' పర్వతశ్రేణులు ఉన్నాయి. కానీ ఇవి మరీ ఎత్తుగా ఉండవు. షిల్లాంగ్‌ శిఖరం అన్నింటికంటే ఎత్తైంది (1,965 మీటర్లు). పర్వతాల్లో విలక్షణమైన 'స్టేలక్టైటు, స్టేలగ్మైటు' సున్నపురాయి వుంటుంది.

వర్షాలు ప్రారంభమైన తర్వాత మేఘాలయలో పర్యాటకులు తప్పనిసరిగా వెళ్లే ప్రదేశం ఒకటుంది. అదే షిల్లాంగ్‌కు సమీపంలోని చిన్న చిన్న గుట్టలు. మధ్యలో రాళ్లు... చుట్టూ పెరిగిన పెద్దపెద్ద చెట్లు కలిగిన ప్రదేశం ఇది. వీటిని ప్రకృతి శక్తులను తృప్తిపరిచేందుకు ప్రత్యేకంగా రూపొందించారని అక్కడుండే ఖాశీ తెగకు చెందిన ఆదివాసీలు చెబుతుంటారు. షిల్లాంగ్‌ నుంచి చిరపుంజికి ప్రయాణం కనువిందు చేసే ప్రకృతి దృశ్యాలతో హాయిగా సాగిపోతుంది. దారి పొడవునా బంగ్లాదేశ్‌ మైదాన ప్రాంతాలు, సుడులు తిరుగుతూ పర్వతాలను కప్పేసే పొగమంచు, గలగలమనే చిన్న చిన్న జలపాతాలు... ఎంత చూసినా తనివి తీరదు. క్షణమైనా రెప్పవేయాలనిపించదు. అంతగా ప్రకృతి సౌందర్యం అలరిస్తుంది. చిరపుంజిలో విశ్రాంతి తీసుకునేందుకు రిసార్టులు అందుబాటులో ఉంటాయి. ఇక ట్రెక్కింగ్‌ చేయడానికి సిద్ధపడితే సహజసిద్ధంగా ఏర్పడిన వంతెనలు ఉండనే ఉన్నాయి. ఇవి ఒక్కోటి 200 సంవత్సరాల పురాతనమైనవి. అన్నీ రబ్బరు చెట్లతో సహజసిద్ధంగా ఏర్పడినట్లు చెబుతుంటారు.

బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లోని మాలినోంగ్‌ గ్రామం కూడా మేఘాలయలో చూడదగిందే. ఇది ఆసియాలోనే పరిశుభ్రమైన గ్రామంగా పేరుగాంచింది. ''మేఘాలయ టూరిజం డెవలప్‌మెంట్‌ ఫోరం'' ఈ గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చాలా శ్రమించింది. ఆ శ్రమ ఫలితమా అన్నట్లు నిజంగానే ఆ ప్రాంతం చాలా శుభ్రంగా ఉంటుంది. రంగురంగు పూలు, చెట్ల కొమ్మల మీద విశ్రాంతి గృహాలు కలిగిన మాలినోంగ్‌... మేఘాలయలో తప్పక సందర్శించాల్సిన ప్రాంతాల్లో ఒకటి. ఇక్కడ ప్రజలు కూడా ఎంతో మర్యాదగా వ్యవహరిస్తారు. అయితే వారిని ఫొటోలు మాత్రం తీయనీయరు. షిల్లాంగ్‌ బారా బజార్‌లో స్త్రీల కోసం ప్రత్యేక దుస్తులు దొరుకుతాయి. అక్కడి ఖాసీ మహిళలు వీటిని లేసులు, పూసలతో అందంగా అలంకరించి ధరిస్తారు. అందరికీ అందుబాటు ధరల్లో అంటే... 200 రూపాయల నుంచి వేల రూపాయల ఖరీదు చేసే దుస్తులు ఇక్కడ లభిస్తాయి.

డాన్‌, బోస్కో మ్యూజియం, బారా బజార్‌, షిల్లాంగ్‌ శిఖరం, ఎలిఫెంట్‌ ఫాల్స్‌, సహజ వంతెనలు... మొదలైనవి మేఘాలయలో చూడదగ్గ పర్యాటక ప్రాంతాలు. ఆహారం, విషయానికి వస్తే... చైనీస్‌, టిబెటన్‌, భారతీయ వంటకాలు లభిస్తాయి. ఇక్కడి పోలీస్‌ బజార్‌ ప్రాంతంలో చాలా హోటళ్లున్నాయి. ఈ హోటళ్లన్నింటిలోనూ లభించే 'మొమో'లను అక్కడి వారు ఇష్టంగా తింటుంటారు.

ఎలా వెళ్లాలంటే...
గౌహతి వెళ్లాక, అక్కడి నుంచి రహదారి మార్గంలో ప్రయాణించాల్సి ఉంటుంది. 13వందల రూపాయల అద్దెతో ట్యాక్సీలు దొరుకుతాయి. షేరింగ్‌ పద్ధతిలో అయితే మూడు వందలు అవుతుంది. ఇక షిల్లాంగ్‌లో తిరిగేందుకు కూడా ఈ షేరింగ్‌ ట్యాక్సీలే అనుకూలంగా ఉంటాయి.

సైకిలెక్కి హిమ పర్వతాల్ని చుట్టేద్దాం
ఓ వైపు కొండ.. మరోవైపు లోయలో గలగలా పారే బియాస్‌ నది పరవళ్లు, కొండచిలువలా మలుపులు తిరిగిన తారురోడ్డు, 50 నుండ 100 అడుగుల ఎత్తుదాకా పెరిగిన దేవదారు చెట్ల పరిమళం, నీరెండలో చల్లటి చలి... ఇంతటి వింత అనుభూతిని అందించే ఈ ప్రాంతంలో ఆహ్లాదం తప్ప మరేమీ కనిపిచదు. ఇది మరెక్కడో కాదు... హిమాచల్‌ ప్రదేశ్‌లోని మంచు పర్వతాల్లో...

భగభగమండే ఎండల నుంచి మంచు కొండలకు, కాంక్రీట్‌ అడవుల నుంచి కీకారణ్యానికి, రణగొణ ధ్వనుల నుంచి కిలకిలారావాల వైపుకు మహా కాలుష్యం నుంచి స్వచ్ఛమైన వాతావరణానికి, యాంత్రిక ప్రపంచానికి దూరంగా ప్రకృతి ఒడిలో హాయిగా గడపాలంటే హిమాచల్‌ప్రదేశ్‌కు వెళ్లాల్సిందే!

అక్కడ బోలెడన్ని పర్యాటక ప్రాంతాలున్నప్పటికీ, నేషనల్‌ హిమాలయన్‌ మౌంటెన్‌ బైటింగ్‌ అనే కార్యక్రమంలో భాగంగా కొండల్లో సరదాగా సైకిల్‌ తొక్కుతూ వెళ్లడానికి పర్యాటకులు ఆసక్తి చూపుతారు. చల్లగా వుండే 'కులు' పట్టణానికి 28 కిలోమీటర్ల దూరంలోని ఓట్‌ అనే ప్రాంతం నుంచి ఈ యాత్ర మొదలవుతుంది. సముద్ర మట్టానికి మూడు వేల అడుగుల ఎత్తులో ఉంటుంది ఓట్‌. ఇక్కడి నుంచి సైకిల్‌ తొక్కుకుంటూ వెళ్లాల్సిన ప్రదేశం 'జలోరీ పాస్‌'. ఇది సముద్ర మట్టానికి 10,500 అడుగుల ఎత్తులో వుంటుంది. మొదటి రోజున సైకిల్‌ తొక్కుతూ... 16 కిలోమీటర్ల దూరం వెళ్లాలి. యాత్రను ఏర్పాటు చేసిన నిర్వాహకులే సైకిల్‌ ఇస్తారు. ఇది గేర్ల సైకిల్‌. తలకు హెల్మెట్‌, మోచేతులు, మోకాళ్లకు గార్డ్స్‌, చేతులకు గ్లవ్స్‌, కళ్లకు గాగుల్స్‌ వేసుకుంటే... మనల్ని మనమే గుర్తుపట్టలేం. ఉదయం 8 గంటలకు మొదలవుతుంది ఈ పర్యటన.

'ఓట్‌' వద్ద సుమారు 3 కిలోమీటర్లు పొడవుండే సొరంగం గుండా వెళ్లాల్సి ఉంటుంది. పల్లంగా ఉండే దారిలో సర్రున దూసుకుపోతూ... ఎత్తైన చోట సైకిల్‌ దిగి దాన్ని నడుపుకుంటూ... ఒక్కో మైలురాయి కనిపించినప్పుడల్లా ఇన్ని కిలోమీటర్లు పూర్తి చేశామనే విజయగర్వంతో ముందుకు సాగిపోతుందీ ప్రయాణం.

మధ్యాహ్నానికి బియాస్‌ నది ఒడ్డుకు చేరుకోవచ్చు. నది ఒడ్డున బండరాళ్లపై కూర్చుని నీటి గలగలలు ఆస్వాదిస్తుంటే భలే వుంటుందిలే... అలసటమీద వెంట తెచ్చుకున్న భోజనాన్ని తింటుంటే ఎంత హాయిగా ఉంటుందో. సాయంత్రానికి నిర్వాహకులు ఏర్పాటు చేసిన ప్రదేశంలో బస చేయొచ్చు. నడక, సైకిల్‌ తొక్కడం పెద్దగా అలవాటులేని వారు రాత్రి భోజనాలయ్యాక ఆదమరచి నిద్రపోతుంటారు.

రెండో రోజు యాత్రలో 'జిబి' అనే ఊరు చేరుకోవాల్సి ఉంటుంది. ఇక్కడికి చేరుకోవాలంటే... మొదటిరోజు బస చేసిన ప్రదేశం నుంచి 12 కిలోమీటర్ల దూరం వెళ్లాలి. అయితే ఇది బాగా ఎత్తు ప్రదేశం... సైకిల్‌ తొక్కడం కంటే ఎక్కువసేపు నడవాల్సి ఉంటుంది. మధ్యాహ్నానికల్లా 'జిబి' చేరుకోవచ్చు. ఈ ప్రాంతం దాటి రెండు మూడు ఫర్లాంగుల దూరం అడవిలోకి వెళ్తే చూడముచ్చటైన చిన్ని జలపాతం ఆహ్వానిస్తుంది. అప్పుడే ఐస్‌ కరిగి నీరైనట్టుగా, ఈ జలపాతం నీళ్లు చాలా చల్లగా ఉంటాయి. ఈ నీళ్లలో స్నానం కాదు కదా... నీళ్లు పట్టుకోడానికే వణికిపోతాం. అంత చల్లగా ఉంటాయి.

మూడో రోజున 'షోజా' అనే ప్రాంతానికి చేరుకోవాలి. అక్కడికి వెళ్లాలంటే కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరమే. అంటే మొదటి రెండు రోజులకంటే తక్కువ దూరమే. అయినప్పటికీ ఒక్క అడుగైనా సైకిల్‌ తొక్కలేని పరిస్థితి. ఎందుకంటే నిట్టనిలువు రోడ్డు, పక్కనే పెద్ద పెద్ద లోయలు... తక్కువ బరువున్న సైకిలైనా, చాలా బరువు అనిపిస్తుంది. ఇలాంటి కొండల్లో కూడా విసిరేసినట్లుగా అక్కడక్కడ ఇళ్లు కనిపిస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఈ ఇళ్లలో ఫ్రిజ్‌ తప్ప అన్ని వసతులూ అందుబాటులో ఉంటాయి. అక్కడ ఫ్రిజ్‌ అవసరం వుండదుగా మరి.

భూమికి ఎనిమిది వేల అడుగుల ఎత్తులో ఉండే షోజాలో చలి జిల్లుమనిపిస్తుంది. వేసవిలోనే చాలా చలిగా ఉండే ఈ ప్రాంతం, చలికాలంలో అయితే అసలు ఊహించుకోడానికే వణికిపోతారు.

చివరి మజిలీ 'జలోరీ పాస్‌'. షోజా నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుందది. అయితే బాగా ఎత్తుగా ఉంటుంది. సైకిల్‌ తీసుకెళ్లినా లాభం ఉండదు. అందుకే నడిచే వెళ్లాలి. అలా వెళ్తుంటే వచ్చే మలుపుల ముందు తిరుమల కొండ, శ్రీశైలం మలుపులు కూడా బలాదూరే. ఇక్కడ పొరపాటున కాలుజారి కిందపడితే ఎముకల్లో సున్నం కూడా మిగలదు. అయితే అక్కడక్కడ కొండరాళ్లపై పేరుకుపోయిన మంచును తాకుతూ నడుస్తుంటే కలిగే ఆనందం మాత్రం మాటల్లో చెప్పలేనిది.

అలా జలోరీ పాస్‌ చేరుకున్నాక... అక్కడికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉండే 'శేషనాగ సరస్సు' చూడదగ్గది. ఇక్కడికి వెళ్లాలంటే మొత్తం అడవిలోనే నడవాల్సి ఉంటుంది. చిన్న సరస్సు, నల్లటి రంగులో నీళ్లు, చుట్టూ చెట్లున్నా సరస్సులో ఆకు అనేదే కనిపించకపోవడం వింతగా అనిపిస్తుంది. అయితే అది స్థానికులకు ఓ పవిత్రమైన కొలను. ఆ పక్కనే గుడి కూడా ఉంటుంది. సరస్సు అందాలు... దగ్గర్లోని మంచుకొండల సోయగాలు... చూసేందుకు రెండు కళ్లూ సరిపోవు.

పైకి ఎక్కడం కంటే... కిందికి దిగటం సులువే కాబట్టి... తిరుగు ప్రయాణానికి హాయిగా, ఆనందంగా బయలుదేరొచ్చు. అయితే ఆ ఆనందం వెనుక అపాయం పొంచే ఉంటుంది. ఎందుకంటే సైకిల్‌ బ్రేక్‌ ఏ మాత్రం ఫెయిల్‌ అయినా.. అదుపు తప్పినా అంతే సంగతులు. కాబట్టి చాలా జాగ్రత్తగా కిందికి దిగాల్సి ఉంటుంది.

చల్లటి ఐస్‌ లాంటి నీళ్లు, పర్వతాలు, కొండలు, లోయలు, సైకిల్‌ తొక్కినందుకు కాళ్ల నొప్పులు, ఆ నొప్పులతోనే ఆదమరచి నిద్ర. ఆనందం... ఆహ్లాదం... ఆ వెనకే పొంచిఉండే ప్రమాదం ... చలి, ఆ చలిలోనే చెమట... మంచు, వర్షం... ఇలాంటి అందమైన ఆహ్లాదకరమైన ప్రయాణమే ఇది.

నేషనల్‌ హిమాలరు మౌంటెన్‌ బైకింగ్‌ పేరుతో వ్యవహరించే ఈ టూర్‌ను యూత్‌ హాస్టల్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (వైహెచ్‌ఏఐ) అనే సంస్థ ఏర్పాటు చేస్తోంది. అంతేకాకుండా ఈ సంస్థ పలు ట్రెక్కింగ్‌ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఆసక్తి ఉన్న పర్యాటకులు తమ పేర్లను నమోదు చేసుకుని పర్యటించొచ్చు. మరిన్ని వివరాల కోసం వైహెచ్‌ఏఐ ఇండియా డాట్‌ ఆర్గ్‌ అనే వెబ్‌సైట్‌ను చూడొచ్చు. 

తిరుమల మెట్ల ప్రయాణం


ఆహ్లాదం తిరుమల మెట్ల ప్రయాణం

తిరుమల. తెలుగువారి జీవితంలో ఓ భాగం. జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా తిరుమల తిరుపతి సందర్శించని తెలుగు వారు ఉండరు. ఎన్నిసార్లు చూసినా కొత్తగా, సరికొత్తగా ఉండే పుణ్యక్షేత్రం. నిత్య కల్యాణం, పచ్చతోరణంలా కళకళలాడుతూ కనిపించే తిరుమలకు మెట్ల దారిలో వెళితే ఆధ్యాత్మిక అనుభూతి మాత్రమే కాదు, ఆరోగ్యం, ఆహ్లాదకరం కూడా.

ఉరుకులు పరుగుల నేటి నవనాగరిక, యాంత్రిక జీవితంలో మనిషికి కాసింత ఊరటనిచ్చే వాటిలో కుటుంబ సమేతంగా జరిపే విహార, తీర్థయాత్రలు ప్రధానమైనవి. 28 సంవత్సరాల నా పాత్రికేయ జీవితంలో కుటుంబ సమేతంగా తిరుపతి నుంచి శ్రీవారి మెట్ల దారిలో కాలినడకన తిరుమల చేరడం మధురానుభవం.


ఓ శనివారం డ్యూటీ చేసి, కాచిగూడ స్టేషన్లో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ ఎక్కడంతో తిరుమల తిరుపతికి మా కుటుంబ ప్రయాణం సాగింది. ఉదయం ఆరు గంటలకు తిరుపతి చేరాల్సిన మా రైలు.. మూడు గంటలు ఆలస్యంగా గమ్యస్థానం చేరింది.

చలో... శ్రీవారిమెట్లు
తిరుపతి బస్టాండ్‌లో అలిపిరి బస్సెక్కి శ్రీవారిమెట్ల స్టాప్‌లో దిగి ఉచిత లగేజీ కౌంటర్లో సామాన్లు భద్రపరిచాం. అనంతరం శ్రీవారి మెట్లమార్గం ద్వారా తిరుమలకు మా కుటుంబ అధిరోహణ యాత్ర ప్రారంభమయ్యింది.


పచ్చటి ప్రకృతి ఒడిలో ఠీవిగా నిలబడి, రారండంటూ ఆహ్వానంతో పాటు, సవాలు విసురుతున్నట్లుగా కనిపించే శేషాద్రి కొండల్లో... ఎన్నో వ్యయప్రయాసల కోర్చి నిర్మించిన 2,350 మెట్లు ఎక్కుతూ, తిరుమల చేరడంలో ఉన్న శ్రమ, ఆనందం కలగలిసిన అనుభూతిని ఎవరికి వారు వ్యక్తిగతంగా పొందాల్సిందే తప్ప మాటల్లో వర్ణించలేం.

పొలోమంటూ పిల్లలు, పెద్దలు
నాలుగేళ్ల పిల్లల నుంచి ఆరుపదుల పెద్దల వరకూ, ఆడమగ తేడా లేకుండా మెట్లదారిలో హరితవనాల సౌందర్యం, పిల్లగాలి వీచికల ద్వారా హాయిగా తాకిన శేషాద్రి వనాల పరిమళాలను అనుభవిస్తూ, ఆస్వాదిస్తూ తిరుమల దిశగా కదిలిపోవడం ఈ ఈ దారిలో నిత్యకృత్యం. సుదూర యాత్రలు చేసే బహుదూరపు బాటసారులను గుర్తు చేసుకొంటూ... ఒక్కోమెట్టూ ఎక్కుతూ ఆపసోపాలు పడేవారు కొందరైతే, ఇదేం కష్టమైన పని కాదంటూ చెంగు చెంగున లేడిపిల్లల్లా, కోడెదూడల్లా దూసుకుపోయే వారు మరికొందరు. 'మీకు హైబీపీ ఉంటే మెట్ల దారి నడక ప్రాణంతకం' అన్న ముందస్తు హెచ్చరికను పక్కన పెట్టి, బిక్కు బిక్కుమంటూ నడిచే భక్తులు కొందరైతే, తమ శరీరాన్ని మోయటమే కష్టంగా భావించే స్థూలకాయులు సైతం మెట్ల దారిలో పాట్లు పడటం స్ఫూర్తిదాయకంగా అనిపిస్తుంది.

900 మెట్లు చేరితే...
మెట్లదారిలో 900వ మెట్టు చేరగానే మేమున్నామంటూ భక్తుల నమోదు ప్రత్యేక కౌంటర్‌ ఉద్యోగులు పలుకరిస్తారు. తొమ్మిది వందల మెట్లు ఎక్కిన ప్రతి ఒక్క యాత్రికుడి/రాలి ఫోటోతీసి శ్రీవారి ఉచిత దర్శన అనుమతి పత్రాన్ని ఇస్తారు.

అప్పటివరకూ ఆడుతూ, పాడుతూ హాయిగా సాగిన మెట్లదర్శన భక్తులకు అసలు పరీక్ష 1600 మెట్లు చేరగానే ప్రారంభమవుతుంది. ఇక్కడి నుంచి ప్రారంభమయ్యే మెట్లను మోకాలి మెట్లుగా చెబుతారు. నిట్టనిలువుగా నిర్మించిన మెట్లను ఎక్కడం అంత తేలిక కాదు. నాలుగు మెట్లు ఎక్కడం, కాసేపు విశ్రాంతి, ఆ తర్వాత మరోనాలుగు మెట్లు... ఇలా భారంగా, ఓ పరీక్షలా సాగుతుంది. ప్రయాణం 2100 మెట్లు దాటిన తర్వాత మరో చెక్‌ పాయింట్‌లో యాత్రికుల ఫొటో పత్రాలను మరోసారి పరీక్షించి, టీటీడీ స్టాంపువేసి మరీ ఇస్తారు. ఇక్కడి నుంచి మిగిలిన 250 మెట్ల ప్రయాణం 'అదిగో.. అల్లదిగో శ్రీహరివాసమూ' అన్నట్లుగా... గోవింద, గోవిందా అంటూ సాగిపోతుంది. శ్రీవారి మెట్లలో ఆఖరి మెట్టుపైన ఉన్న మండపం చేరడంతో ప్రతి ఒక్కరికీ ఏదో సాధించామన్న సంతృప్తి, శ్రీవారి పాదాల చెంతకు చేరామన్న భరోసా కలుగుతాయి.

మెట్ల మార్గం ద్వారా తమ ప్రయాణం పూర్తి చేయడం ద్వారా ఫిట్‌నెస్‌ను బేరీజు వేసుకొనే యాత్రికులు చాలామందే కనిపిస్తారు. ఏడాదికి ఓ సారైనా మెట్లదారిలో తిరుమల చేరందే తమకు తృప్తి ఉండదని, గత కొద్ది సంవత్సరాలుగా ఇలా చేయడం జీవితంలో ఓ భాగం చేసుకొన్నామని చెప్పేవారూ కనిపిస్తారు.

ఎన్నో లాభాలు
తిరుపతి నుంచి బస్సులో వచ్చే యాత్రికులకంటే మెట్లదారిలో కాలి నడకన వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ప్రాధాన్యమిస్తోంది. మెట్ల దారిలో వెళ్లిన భక్తులు 24 గంటల వ్యవధిలో శ్రీవారి దర్శనం చేసుకొనే అవకాశం ఉంటుంది. ప్రత్యేక క్యూ ద్వారా ఉచితంగా దర్శనం లభిస్తుంది. అంతేకాదు. కాలినడక భక్తులకు 25 రూపాయల ఖరీదు చేసే ఉచిత లడ్డూను సైతం అంద చేయాలని నిర్ణయించింది.

రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన నిరుపేద భక్తులకు మెట్లదారి ప్రయాణం నిజంగా ఓ వరమే అని చెప్పాలి. తిరుపతి నుంచి తిరుమల చేరాలన్నా, తిరుమల నుంచి తిరుపతి రావాలన్నా ఒక్కొ యాత్రికుడు 90 రూపాయలు బస్సు చార్జీగా చెల్లించాలి. విపరీతంగా పెరిగిన చార్జీల భారం మోయలేని పేదయాత్రికుల్లో కాలినడకనే మెట్లదారిలో తిరుమల వచ్చి వెళ్లే వారి సంఖ్య రాను రాను పెరుగుతోందని టీటీడీ గణాంకాలే చెబుతున్నాయి. దీనికితోడు మెట్లదారి ప్రయాణాన్ని ప్రోత్సహించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టింది.

మంచీ - చెడూ
ప్రతి చోటా మంచీ, చెడూ ఉండటం సహజమే. దానికి 'తిరుమల తిరుపతి' ఏ మాత్రం మినహాయింపు కాదు. తిరుమల దేవస్థానం అన్నా, శ్రీవారన్నా భక్తి విశ్వాసాలున్న చాలా మందికి అంతులేని భక్తి. అయితే దేవస్థానం ఉద్యోగుల్లో కొంతమందికి మాత్రం దక్షిణల పైన కూడా భక్తి ఉన్నట్లు కనిపిస్తుంది. స్వామి వారి కల్యాణం క్యూ దగ్గర నానా హడావిడి చేస్తూ 'దగ్గర నుంచి కల్యాణం చూడండి'  అంటూ భక్తులను ప్రలోభపెట్టి, స్వామివారి సాక్షిగా దక్షిణ పేరుతో లంచాలు డిమాండ్‌ చేసే ప్రబుద్ధ ఉద్యోగులకూ కొదవలేదు.

అయినా కూడా దేశం నలుమూలల నుంచి అనునిత్యం తిరుమలకు వచ్చే వేల, లక్షల భక్తులకు టీటీడీ చేస్తున్న సేవలు అసమానం. తిరుమలలో 24 గంటలు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం, నిత్యాన్నదాన పథకాలను ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.

రెండున్నర గంటల మెట్ల నడక, ఎనిమిదిగంటల పాటు క్యూలో నిరీక్షణ, 80 సెకన్ల శ్రీవారి దర్శనంతో మా తిరుమల యాత్ర ముగిసింది.

చొప్పరపు కృష్ణారావు

Sunday, 24 June 2018

పడమటి కనుమలలో రైలు ప్రయాణం


పడమటి కనుమలలో హాయి హాయిగా!
మైమరపించే రైలు ప్రయాణం

దట్టమైన పడమటి కనుమలు.. కొండల్ని కప్పేస్తున్నట్లుగా కనిపించే మేఘాలు.. మార్గమధ్యలో అడవుల నడుమ పల్లెటూళ్లు.. ఎత్తైన కొండల మధ్యభాగంలో సొరంగాలు.. వర్షాలకు హోరెత్తుతూ కనిపించే సెలయేళ్లు.. ఏమాత్రం అలసట తెలియని ఎనిమిది గంటల ప్రయాణం.. అప్పుడే అన్ని సొరంగాలు పూర్తయ్యాయా అంటూ నిట్టూర్పు.. వెరసి బెంగళూరు - మంగళూరు రైలు ప్రయాణం. వర్షాకాలంలో వెళ్లేందుకే అనేక మంది ఎదురుచూస్తుంటారు. జూన్‌ వచ్చిందంటే చాలు ఎప్పుడెప్పుడు వర్షాలు ఆరంభమవుతాయా? మనం ఎప్పుడు బయలుదేరేద్దామా? అంటూ చిన్నారులే కాదు పెద్దలు కూడా వెయ్యికళ్లతో ఎదురుచూస్తుంటారు.

ఉదయం 7.00 గంటలైంది. (ఈ మార్గంలో మరో నాలుగు రైళ్లున్నప్పటికీ పడమటి కనుమల అందాల్ని చూసేందుకు ఇదే అత్యంత అనువైంది) తమకు కేటాయించిన ఆసనాల్లో స్థిరపడ్డారు. సీట్లు లభించని ప్రయాణికులు ఓపిగ్గా నిలుచునే పరిసరాల్ని చూస్తున్నారు. అప్పటికే యశ్వంతపుర ప్లాట్‌ఫారంపై సందడి తారాస్థాయికి చేరుకుంది. ఇంకెప్పుడా అని ప్రయాణికులు గడియారాల వైపు తరచూ చూసుకుంటున్నారు. సమయం 7.10 అయిందని తెలుసుకునేలోపే సిగ్నల్‌లో పచ్చలైట్‌ వెలిగింది. వెనువెంటనే గార్డ్‌ నుంచి ఈల శబ్దం వినిపించింది. మందగామిగా రైలు బయలుదేరింది. చూస్తుండగానే వేగం పుంజుకుంది. నగరంలోనే ఉన్న చిక్కబాణవార స్టేషన్‌లో ఒక నిముషంపాటు ఆగింది. తిరిగి ప్రయాణమైన రైలు ఈసారి నెలమంగల స్టేషన్‌లో కాసేపు విశ్రమణ. ఇక నగరం అక్కడితో పూర్తయిందనేలా గుంపులుగుంపులుగా కనిపించిన ఇళ్లు మాయమయ్యాయి. నెలమంగల తరువాత కుణిగల్‌, యడియూరు, బాలగంగాధరనాథ నగర స్టేషన్లు వచ్చాయి. ఆ తరువాత త్యాగమూర్తి బాహుబలి విగ్రహమున్న శ్రవణబెళగొళ స్టేషన్‌ చూడొచ్చు. దూరం నుంచే వింధ్యగిరి పర్వతాన్ని, శిఖరాగ్రంలో కనిపించే గోమటేశ్వరుడిని దూరం నుంచి మనసారా మొక్కుకున్నారు ప్రయాణికులు. ఆ తరువాత చెన్నరాయపట్టణ, హాసన్‌, సకలేశపుర స్టేషన్లలో రైలు ఆగింది. ఆగిన స్టేషన్లలో చక్కిలాలు, నిప్పట్లు, కారం బొరుగులు, పనస తొనలు... ఇలా రకరకాల తినుబండారాల్ని రైల్లోనే బుట్టల్లో విక్రయించే వ్యాపారుల నుంచి ప్రయాణికులు పోటాపోటీగా కొనుగోలు చేశారు. అప్పటి వరకు కనిపించిన సూర్యతాపం సకలేశపుర స్టేషన్‌ దాటగానే మేఘాల ప్రవాహానికి కరిగిపోయింది. సకలేశపుర స్టేషన్‌ నుంచి రైలు పరుగులు తీస్తుంటే కనిపించిన దృశ్యాలకు మాటల్ని కూర్చడం సాధ్యం కాదనిపించింది. అడవి మధ్యలో పెద్దపెద్ద గొట్టాలు కానవస్తాయి. బహుశా ఎత్తినహొళె ఎత్తిపోతల పథకం కోసం నిల్వ ఉంచినవేమో అనే భావన.

ఎత్తైన కొండలు.. సొరంగాలు.. వాటిల్లో దూసుకెళ్తుంటే కమ్ముకునే చీకట్లకు రైల్లో ఆబాలగోపాలం కేరింతలతో స్వాగతం పలికింది. అప్పుడే వర్షం వచ్చిందేమో సొరంగాలపై నుంచి హోరెత్తుతూ దూకుతున్న ధారలు దిగువన సెలయేళ్లుగా ప్రవహిస్తున్నాయి. దట్టమైన అడవుల మధ్య కనిపించే నదులు భలే గమ్మత్తుగా ఉన్నాయి. సొరంగంలో వెళ్తుంటే చిమ్మచీకట్లు... ఎప్పుడూ అలాంటి అనుభవం ఎదురవని ప్రయాణికులు ఓనమాలు రాని విద్యార్థి కాన్వెంట్‌లో కూర్చున్న తొలిరోజు ఎలాంటి అనుభూతిని అనుభవిస్తాడో అలాంటి భావనతో వింతగా చూస్తూ కనిపించారు. మొదటి పది సొరంగాలు వచ్చినప్పుడు పెద్దపెట్టున కేకలు పెట్టిన ప్రయాణికులు ఆ తరువాత నిశ్శబ్ద ప్రేక్షకుల్నా పరిసరాల్ని చూస్తుండిపోయారు. అలా ఏకంగా 77 సొరంగాల్ని, వందలాది వంతెనల్ని దాటుకుంటూ రైలు వెళ్తుంటే మూడు గంటల సమయం క్షణాల్లా గడిచింది. అడవుల్ని దాటుకున్న రైలు నిదానంగా ప్రయాణించడాన్ని చూస్తే ఏదో స్టేషన్‌ వస్తున్నట్లుగా అనిపించింది. అప్పటికి మధ్యాహ్నం 2.20 గంటలు - దూరం నుంచి సుబ్రమణ్యరోడ్‌ అనే బోర్డును చూసి మేం దిగాల్సిన స్టేషన్‌ వచ్చిందని తెలుసుకుని గబగబా కిందకు దిగేవారెందరో! అక్కడ అల్పాహారానికి 15 నిముషాలకు పైగా రైలు నిలుస్తుందని తెలుసుకుని మళ్లీ ఎక్కితే ఎలా ఉంటుందని నిట్టూరుస్తుండగా రైలు మంగళూరు వైపు బయలుదేరింది. ఇలాంటి అనుభవం కావాలనుకునేవారు జూన్‌ నుంచి వర్షాకాలం పూర్తయ్యేలోపు ఈ మార్గంలో ప్రయాణించాలండోయ్‌!

Saturday, 16 June 2018

వాన జల్లుల్లో..లేత ఎండల్లో..


వాన జల్లుల్లో..లేత ఎండల్లో..

‘విహారయాత్రలు వేసవి సెలవుల్లోనే!’ అనే కాన్సెప్ట్‌ పాతబడు తోంది. ‘ఆనందించే హృదయం, ఆస్వాదించే నైజం ఉండాలే కాని సీజన్‌తో పనేముంది? కొండల్లో, కోనల్లో, లోయల్లో, పచ్చటి మైదానాల్లో నడుస్తూ... కురిసే చినుకు మధ్య తడుస్తూ... ప్రకృతిని తిలకించి పరవశించిపోవడం కన్నా సుఖం ఏముంటుంది?’ అంటోంది కొత్త తరం. అందుకే మాన్‌సూన్‌ టూర్స్‌ ఇప్పుడు పాపులర్‌ అవుతున్నాయి. మన దేశంలో ఎక్కువమంది ఎంపిక చేసుకుంటున్న అలాంటి గమ్యాల్లో కొన్ని... 


జీవితకాలపు అనుభూతి అగుంబే
ఎక్కడుంది?: కర్నాటక రాష్ట్రం షిమోగా జిల్లాలో. 

ప్రత్యేకతలేమిటి?:
‘దక్షిణ భారత చిరపుంజి’గా పేరు పొందిన అగుంబే అనేక ప్రత్యేకతలకు నెలవు. చుట్టూ దట్టమైన అడవులున్న ఈ ప్రాంతం సహ్యాద్రి పర్వతాల్లో మాల్నాడ్‌, శరావతి లోయల మధ్య ఉంటుంది. మైమరపించే జలపాతాలకూ, అత్యద్భుతమైన సౌందర్యానికీ అగుంబే పెట్టింది పేరు. ప్రకృతి ప్రేమికులు తప్పనిసరిగా చూడాల్సిన చోటు ఇది. అగుంబే ఘాట్‌ రోడ్డు దగ్గర నిలబడి- అరేబియా మహా సముద్రంలో సూర్యుడు అస్తమిస్తున్న దృశ్యం చూడడం జీవితకాలానికి సరిపోయే అనుభూతి అనడం అతిశయోక్తి కాదు. ఇక, కింగ్‌ కోబ్రాలకు ఈ ప్రాంతం పుట్టినిల్లు. ఇతర జాతుల సర్పాలు కూడా ఈ వర్షారణ్యంలో పెద్ద సంఖ్యలో ఉంటాయి. అరుదైన జంతు, వృక్షజాలంపై ఇక్కడ విస్తృతంగా పరిశోధవాన జరుగుతున్నాయి.

ఎలా వెళ్ళాలి?:
మంగుళూరుకు సుమారు 100 కిలోమీటర్ల దూరంలో అగుంబే ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాంతాల నుంచి మంగుళూరుకు రైలు సౌకర్యం ఉంది. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అగుంబే చేరుకోవచ్చు. సమీప విమానాశ్రయం మంగుళూరులో ఉంది. హైదరాబాద్‌ నుంచి రైళ్ళ కన్నా రోడ్డు మార్గంలో (బెంగళూరు మీదుగా) తక్కువ సమయంలో వెళ్ళవచ్చు.

వసతి:
అగుంబేలో అన్ని బడ్జెట్లకూ సరిపోయే వసతి సదుపాయాలున్నాయి. అయితే అన్నిటికన్నా ఆకర్షించేది దొడ్డ మేను బంగళా. నూట యాభై ఏళ్ళ నాటి భవనంలో నడుస్తున్న ఈ వసతి గృహాన్ని కస్తూరక్క అనే వృద్ధురాలు నిర్వహిస్తున్నారు. సంప్రదాయ పద్ధతుల్లో చేసిన ఇంటి భోజనం, ఎంతో చరిత్ర కలిగిన పాత కాలం ఇంట్లో బస... పర్యాటకులకు ప్రధాన ఆకర్షణ. అన్నట్టు ఈ భవనంలోనే ‘మాల్గుడి డేస్‌’ హిందీ సీరియల్‌ చిత్రీకరించారు.


వానంతా అక్కడే! మౌసిన్‌రామ్‌
ఎక్కడుంది?: మేఘాలయ రాష్ట్రంలోని ఈస్ట్‌ ఖాసీహిల్స్‌ జిల్లాలో. 

ప్రత్యేకతలేమిటి?:
ప్రపంచంలోనే అతి ఎక్కువ వర్షపాతం కలిగిన ప్రదేశంగా మౌసిన్‌రామ్‌ గిన్నిస్‌ బుక్‌లో చోటు సంపాదించుకుంది. అంతకు ముందు ఆ ఘనత మౌసిన్‌రామ్‌కు దగ్గర్లో ఉన్న చిరపుంజికి ఉండేది. అంతేకాదు, ఎప్పుడూ తేమగా ఉండే ప్రదేశంగా కూడా మౌసిన్‌రామ్‌ గుర్తింపు పొందింది. ఏడాదిలో కనీసం ఆరు నెలల పాటు ఇక్కడ వర్షాలు పడుతూనే ఉంటాయి. అందుకని ఇక్కడి ప్రజలు కావలసిన సరుకులన్నీ నిల్వ చేసుకుంటూ ఉంటారు. వర్షాలు ఎక్కువ కాబట్టి వృక్షజాలం బాగా పెరుగుతుంది. చెట్ల వేర్లను ఒకదానితో ఒకటి అల్లి, వెదురు కర్రలతో వంతెనలను ఈ గ్రామస్థులు తయారు చేస్తారు. వీటిలో కొన్ని వంతెనలు వంద మీటర్ల పొడవు కూడా ఉంటాయి. కనీసం అయిదారుగురిని అవలీలగా మోయగలిగేంత పటిష్ఠంగా ఇవి తయారవుతాయి. ఇలాంటి వంతెనలు మరెక్కడా కనిపించవు.

ఎలా వెళ్ళాలి?:
గువాహటికి సుమారు 150 కిలోమీటర్ల దూరంలో మౌసిన్‌రామ్‌ ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచి గువాహటికి రైళ్ళలో నేరుగా వెళ్ళవచ్చు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మౌసిన్‌రామ్‌ చేరుకోవచ్చు. సమీప ప్రధాన విమానాశ్రయం గువాహటిలో ఉంది.

వసతి:
మౌసిన్‌రామ్‌లో గెస్ట్‌హౌ్‌సలు, రిసార్టులు, హోటళ్ళు ఉన్నాయి. హోమ్‌ స్టే సదుపాయం కూడా అందుబాటులో ఉంది.


కొండా కోనల్లో... అంబోలి
ఎక్కడుంది?: మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌ జిల్లాలో
ప్రత్యేకతలేమిటి?:
ఎటు చూసినా జలపాతాలతో, ఎత్తైన కొండలతో, చల్లటి గాలులతో ఆహ్లాదం కలిగించే ప్రాంతం అంబోలి. వేసవి విడిదిగానే కాదు, వర్షాకాలంలో సందర్శించడానికి అనువైన గమ్యంగా కూడా ఇది ప్రసిద్ధి చెందింది. వర్షపాతం ఎక్కువ కాబట్టి ఎప్పుడూ తడిగా కనిపించే అంబోలిలోని పల్లె వాతావరణం మనసుకు ప్రశాంతత కలిగిస్తుంది. సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఉన్న ఈ ప్రదేశం నుంచి సూర్యోదయాలూ, సూర్యాస్తమయాలూ వీక్షించడం ఒక మరపురాని అనుభూతి.

ఎలా వెళ్ళాలి?:
కర్నాటకలోని బెల్గాం నగరానికి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాంతాల రైళ్ళు ఉన్నాయి. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 28 కి.మీ. దూరంలో ఉన్న అంబోలి చేరుకోవచ్చు. సమీప విమానాశ్రయం 113 కిలోమీటర్ల దూరంలోని గోవాలో ఉంది.

వసతి:
మహారాష్ట్ర టూరిజం, ప్రైవేటు సంస్థల యాజమాన్యంలో వసతి, భోజన సదుపాయాలున్నాయి.


అంతా పూల దుప్పటే! - వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌
ఎక్కడుంది?: ఉత్తరాఖండ్‌లోని ఛమోలీ జిల్లాలో
ప్రత్యేకతలేమిటి?:
ప్రకృతి అందాలను తనివితీరా చూడాలని కోరుకొనేవారికి వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌ నేషనల్‌ పార్క్‌ కన్నా మంచి ప్రదేశం మరొకటి ఉండదేమో.! చుట్టూ మంచు కప్పేసిన కొండలూ, అపురూపమైన బ్రహ్మకమల పుష్పాలతో సహా దాదాపు మూడువందల రకాల జాతుల పూలూ, విశాలమైన మైదానాలూ... అంతేకాదు అరుదైన సీతాకోక చిలుకలకూ, నల్లటి హిమాలయపు ఎలుగుబంట్లూ, కస్తూరి జింక లాంటి జీవాలకూ నిలయం ఇది. హిమవంతుడి కూతురు పార్వతీ దేవి ఉద్యానంగా దీన్ని అభివర్ణిస్తూ ఉంటారు. అందుకే ‘దేవభూమి’ అని పిలుస్తారు. ఇక్కడ హఠాత్తుగా మబ్బులు ముంచుకొచ్చి తడిపేసి పోతూ ఉంటాయి. జూన్‌ నుంచీ నవంబర్‌ వరకూ మాత్రమే సందర్శకులను ఈ వ్యాలీలోకి అనుమతిస్తారు. పూల సోయగాలు చూడాలంటే జూలై, ఆగస్ట్‌ నెలలు ఉత్తమం. ట్రెక్కింగ్‌ కోసం కూడా చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు. ఢిల్లీ, హరిద్వార్‌, ఋషీకేశ్‌ల నుంచి టూర్‌ ఆపరేటర్లు ప్రత్యేక ట్రెక్కింగ్‌ ప్యాకేజీలు నిర్వహిస్తారు. ఈ లోయను ప్రపంచ వారసత్వ సంపదగా ‘యునెస్కో’ గుర్తించింది. వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌ కు వెళ్ళే దారిలో హిమకుండ్‌ సాహిబ్‌ గురుద్వారానూ, గోవింద్‌ఘాట్‌కు 25 కి.మీ. దూరంలోని బదరీనాథ్‌నూ కూడా దర్శించుకోవచ్చు.

వసతి:
వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌లో వసతి సదుపాయాలు లేవు. సుమారు 21 కిలోమీటర్ల దూరంలో ఉన్న జోషీమఠ్‌లో కానీ, 49 కిలోమీటర్ల దూరంలోని ఛమోలీలో కానీ బస చేయవచ్చు.

ఎలా వెళ్ళాలి?:
ఢిల్లీ నుంచి హరిద్వార్‌, గోవింద్‌ఘాట్‌ మీదుగా రోడ్డు మార్గంలో వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌ చేరుకోవాల్సి ఉంటుంది. హరిద్వార్‌కు సుమారు 290 కిలోమీటర్ల దూరంలో ఈ పూల లోయ ఉంది. గోవింద్‌ఘాట్‌ నుంచి సుమారు 15 కిలోమీటర్లు ట్రెక్కింగ్‌ చేయాల్సి ఉంటుంది. గుర్రాల మీదా, డోలీల్లో కూడా వెళ్ళొచ్చు.


పన్నెండేళ్ళకు ఓసారి... - మున్నార్‌
ఎక్కడుంది?: కేరళలోని ఇడుక్కి జిల్లాలో
ప్రత్యేకతలేమిటి?:
తేయాకు, సిల్వర్‌ ఓక్‌ తోటలూ, లోయలూ, పర్వత శ్రేణులతో అలరారే మున్నార్‌ను భూతల స్వర్గంగా పర్యాటకులు వర్ణిస్తూ ఉంటారు. కేరళకు వచ్చే టూరిస్టులు తప్పనిసరిగా సందర్శించే ప్రాంతం ఇది. పడమటి కనుమలలో ఉన్న మున్నార్‌ చుట్టూ కొండలు ఆవరించి ఉంటాయి. ట్రెక్కింగ్‌ కోసం చాలామంది ఇక్కడికి వస్తారు. అలాగే ఘాట్లలో బైక్‌ల మీద చేరుకొనే వారు కూడా ఎక్కువే. మున్నార్‌ చుట్టుపక్కల చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఫోటోపాయింట్‌, ముత్తిరప్పుళ నది, ఇడుక్కి ఆర్క్‌ డ్యామ్‌, దేవికుళం హిల్‌ స్టేషన్‌, అట్టుకల్‌ జలపాతం వీటిలో కొన్ని. పన్నెండేళ్ళకు ఒకసారి మున్నార్‌ కొండల మీద ‘నీల కురంజి’ అనే జాతి పూలు పూస్తాయి. అప్పుడు నేలంతా పూల దుప్పటి కప్పుకున్నట్టుంటుంది. ఈ పుష్పాల్లో నలభైకి పైగా రకాలున్నాయి. వాటిలో కూడా వివిధ రంగులుంటాయి. అన్నట్టు, పుష్కరం- అంటే 2006వ సంవత్సరం తరువాత ఆ పూలు పూసేది ఈ ఏడాదే! జూలై నుంచి నవంబర్‌ మధ్య మున్నార్‌ టూర్‌ ప్లాన్‌ చేసుకుంటే ఆ పూల ఋతువును మీ కళ్ళల్లో నింపుకోవచ్చు.

ఎలా వెళ్ళాలి?:
ఎర్నాకుళం నగరానికి మున్నార్‌ సుమారు 130 కిలోమీటర్ల దూరంలో మున్నార్‌ ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాంతాల నుంచి మున్నార్‌కు రైళ్ళు ఉన్నాయి. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మున్నార్‌ చేరవచ్చు. సమీప విమానాశ్రయం కొచ్చిన్‌ (కొచ్చి)లో ఉంది.

వసతి:
మున్నార్‌లో సాధారణ హోటళ్ళు మొదలుకొని లగ్జరీ రిసార్టుల వరకూ... అన్ని బడ్జెట్లకూ అనువైన వసతి సదుపాయాలూ ఉన్నాయి.


పచ్చని ప్రకృతి ఒడిలో...  కొడైకెనాల్‌
ఎక్కడుంది?: తమిళనాడులోని దిండిగల్‌ జిల్లాలో
ప్రత్యేకతలేమిటి?:
తమిళనాడులో ఊటీ తరువాత ఎక్కువ మంది సందర్శించే చోటు కొడైకెనాల్‌. దేశ, విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్న హిల్‌ స్టేషన్లలో ఇదొకటి. సమ్మర్‌ డెస్టినేషన్‌గా కొడైకెనాల్‌ ఖ్యాతి అందరికీ తెలిసిందే. అయితే ఈ ప్రాంతంలో జలపాతాలు ఉధృతంగా కనిపించేది మాత్రం వర్షాకాలంలో. వాతావరణం కూడా ఈ సీజన్లో హాయిగా ఉంటుంది. ఎండా, వానా దోబుచులాడుతూ ఉంటాయి. తడిసిన లోయలూ, పొగ మబ్బులు కమ్ముకున్న కొండలతో కొడైకెనాల్‌ చూడచక్కగా కనిపిస్తుంది. కొండలూ, మైదానాలూ, జలపాతాలూ, కొలనులతో సహజ సౌందర్యానికి ఆటపట్టుగా ఇది నిలుస్తోంది. సైకిలింగ్‌, బోటింగ్‌, ట్రెక్కింగ్‌, హార్స్‌ఏరైడింగ్‌ లాంటి సాహసాలకూ, వినోదాలకూ, గోల్ఫ్‌ లాంటి క్రీడలకూ ఇక్కడ లోటు లేదు. కొడైకెనాల్‌లో కూడా పన్నెండేళ్ళకు ఒకసారి నీల కురంజి పుష్పాలు పూస్తాయి. ఈ ఏడాది జూలై నుంచి అక్టోబర్‌ మధ్య వీటిని చూడవచ్చు. సమీపంలోని సైలెంట్‌ వ్యాలీ, పచ్చ లోయ, ఫౌనా ఫ్లోరా పూల మ్యూజియం, బ్రయంట్‌ పార్క్‌, బెరిజం చెరువు వ్యూ పాయింట్‌, కొడైకెనాల్‌ చెరువు, వెండి జలపాతం తప్పనిసరిగా సందర్శించాల్సిన ప్రదేశాల్లో కొన్ని.

ఎలా వెళ్ళాలి?:
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాంతాల నుంచి మదురై వైపు వెళ్ళే రైళ్ళు కొడైకెనాల్‌ రోడ్డు రైల్వే స్టేషన్‌లో ఆగుతాయి. అక్కడి నుంచి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో కొడైకెనాల్‌ ఉంది. సమీప విమానాశ్రయం మదురైలో ఉంది. (120 కి.మీ.)

వసతి:
కొడైకెనాల్‌లో యాత్రికులు బస చేసేందుకు అనుకూలమైన సదుపాయాలు విస్తృతంగా ఉన్నాయి.

Friday, 15 June 2018

కోరింగ అభయారణ్యం


కోరింగ.. పిలవంగ

చుట్టూ దట్టమైన చెట్లు.. మధ్యలో చిత్తడి నేలపై నిర్మించిన చెక్కల వంతెన.. ఓ పక్క సముద్రంలో కలుస్తున్న గోదావరి సోయగాలు.. చెట్టు కింద ఆహారం కోసం తచ్చాడుతున్న నీటి పిల్లి.. చెట్టుపైన పొందికగా కట్టుకున్న గూడులో నుంచి తొంగి చూసే ఎలుక... ఇవన్నీ చూడాలంటే తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలో ఉన్న కోరింగ అభయారణ్యానికి వెళ్లాలి.

ఒకప్పుడు సముద్ర వాణిజ్య కార్యకలాపాల్లో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన కోరింగ.. ఇప్పుడు ప్రముఖ పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో కనుమరుగైన ఈ పోర్టు తిరిగి కోరింగ అభయారణ్యంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. 235.7 చదరపు కిలోమీటర్లు విస్తరించిన మడ అడవులు.. కోరింగను ప్రకృతి సౌందర్యానికి పట్టుగొమ్మగా నిలబెట్టాయి. పక్షులు, జంతువులు, జలచరాలు.. ఈ వనాన్ని జీవవైవిధ్యానికి ఆవాసంగా మార్చాయి. 1998లో అభయారణ్యంగా ప్రకటించిన తర్వాత కోరింగ పర్యాటకంగానూ అభివృద్ధి చెందుతూ వస్తోంది. చిరుజల్లుల వేళ.. సుందరవనాలు (మడ అడవులు) మరింత మనోహరంగా కనిపిస్తాయి.

పక్షుల విడిది
వలస పక్షుల విడిదిగా కోరింగ విలసిల్లుతోంది. శీతాకాలంలో 239 జాతులకు చెందిన సుమారు 88 వేల పక్షులు సంతానోత్పత్తి కోసం ఇక్కడికి వస్తుంటాయి. గౌరు కాకులు, హిమాలయాల్లో ఉండే బ్రాహ్మణి కైట్‌, స్టార్క్‌ కొంగలు, కింగ్‌ఫిషర్‌ పక్షులు ఎక్కువగా వలస వస్తాయి. గోదావరి, సముద్రం సంగమించే ఈ ప్రాంతమవ్వడంతో ఇక్కడి తీపి, ఉప్పు కలయికతో మిశ్రమ లవణ సాంద్రత ఉంటాయి. అందుకే ఈ నీటిలో విభిన్న జాతులకు చెందిన జలచరాలు మనుగడ సాగిస్తున్నాయి. 575 రకాల చేప జాతులను గుర్తించారు. చిత్తడి నేలలో మండపీతలు, పాములు అధికంగా ఉంటాయి. అంతేకాదు ఇక్కడ ఎలుకలు కూడా పక్షులతో పోటీగా చెట్లపై గూళ్లు కట్టుకోవడం విశేషం. కోరింగ పరిధిలో ఉన్న 32వ నీటిపాయ లోనికి వెళ్తే చెట్లపై ఎలుకలు కట్టుకున్న గూళ్లు కనిపిస్తాయి.

చిక్కటి అడవిలో చెక్క వంతెన
కోరింగ వనాల్లో.. 35 రకాల మడజాతి వృక్షాలు ఉన్నాయి. నల్లమడ, తెల్లమడ, బిల్లమడ వృక్షాలు కనిపిస్తాయి. వనంలో నీటి కుక్కలు, నీటి పిల్లులు, బంగారురంగులో ఉండే నక్కలను చూడొచ్చు. చొల్లంగి గ్రామం దగ్గర అభయారణ్యానికి ప్రవేశం ఉంటుంది. కోరింగ గ్రామంలో మ్యూజియం, వసతి సముదాయాలు ఉన్నాయి. మడ అడవుల్లోని 32వ క్రీకు (నీటిపాయ)లో వివిధ రకాల పక్షి జాతులను వీక్షించే ఏర్పాట్లు ఉన్నాయి. కిందంతా చిత్తడి నేల ఉండటంతో నడవడం సాధ్యం కాదు. అందుకే అడవిలో విహరించడానికి చెక్క వంతెన ఏర్పాటు చేశారు. నాలుగు కిలోమీటర్ల మేర నిర్మించిన వంతెనపై కాలినడకన విహరిస్తూ.. వన సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు. క్రీకులో ప్రయాణించడానికి జెట్టీలు ఏర్పాటు చేశారు. 200 ఏళ్ల కిందటి పాతలైట్‌ హౌస్‌ను ఇటీవలే అభివృద్ధి చేశారు. యాత్రికులు బోట్‌లో వెళ్తారు. హోప్‌ ఐలాండ్‌ ఇక్కడ మరో ఆకర్షణ. నిండైన పచ్చదనంతో అలరించే ఈ ద్వీపానికి బోట్లలో చేరుకోవచ్చు.

వినోదంతో పాటు..
కోరింగ వచ్చే పర్యాటకులకు వినోదంతో పాటు విజ్ఞానం అందించే ఏర్పాట్లు చేశారు అధికారులు. అభయారణ్యం ప్రత్యేకతలను తెలిపేందుకు ఆడియో విజువల్‌ థియేటర్‌ను నిర్మించారు. 25 మంది ఒకేసారి ఇందులో కూర్చొని ఈ వీడియోలు, పర్యావరణ ప్రాధాన్యం వివరించే చిత్రాలు, పర్యాటక విశేషాలు తెలిపే డాక్యుమెంటరీ వీక్షించవచ్చు.
ఎలావెళ్లాలి?

కాకినాడ నుంచి చొల్లంగి సుమారు 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాకినాడ, సామర్లకోట నుంచి చొల్లంగికి బస్సులు, ప్రైవేట్‌ వాహనాల్లో వెళ్లొచ్చు.

Wednesday, 13 June 2018

ఆగుంబే


దక్షిణాది చిరపుంజీ.. ఆగుంబే!

వాహనాల రణగొణ ధ్వనులుండవు.. ఇరుగుపొరుగు నివాసుల మాటలు వినిపించవు.. కనీసం కనిపించరు కూడా! అక్కడక్కడ భయంకరమైన నిశ్శబ్ద రాజ్యం. అప్పుడప్పుడూ వర్షపు హోరు.. సాధారణ జీవితానికి దూరంగా ఇలాంటి వాతావరణంలో కొద్ది రోజులైనా విహరించాలని తపించనివారు అరుదు. అందుకే వర్షాకాలం ఆరంభం కావడంతోనే దక్షిణాది చిరపుంజిగా పేరుపొందిన ఆగుంబెను అత్యధికులు సందర్శిస్తుంటారు. శివమొగ్గ జిల్లా తీర్థహళ్లి తాలూకాలోని ఈ కుగ్రామం వర్షాకాలం వస్తేచాలు సందడిగా మారుతుంది. మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు. సాధారణ బస లభిస్తున్నా సందర్శకులకు కొదవ ఉండదు. మొన్నటి వరకు ఒకే పూటకూళ్ల ఇల్లు మాత్రమే ఉండేది. ఇటీవలి కాలంలో అనేక సంస్థలు హోటళ్లను నిర్వహిస్తున్నాయి. కొండల్ని తాకుతూ వెళ్లే మేఘాలు, అప్పుడప్పుడూ ఏకధాటి వర్షం కురిసే సందర్భాలు.. పచ్చదనంతో సింగారించుకుని కనిపించే పరిసరాలు ఆగుంబె ప్రాంతాన్ని మైమరిపిస్తాయి. జీవితంలో ఒక్కసారైనా అక్కడికి వెళ్లాలనుకుంటారు. సూర్యాస్తమయాన్ని చూడడం ఇక్కడి ప్రత్యేకత. నల్లతాచులు ఇక్కడ తరచూ కనిపిస్తుంటాయి. వీటిపై పరిశోధనలు చేసే శాస్త్రవేత్తలు కనిపిస్తారు. పడమటి కనుమల్లో వర్షాలపై కూడా పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఇక్కడి అడవుల్లో కనిపించే అపురూపమైన వృక్ష సంపదపై కూడా అధ్యయనాలు కోకొల్లలు. శివమొగ్గ, ఉడుపి, మంగళూరు నుంచి బస్సు సదుపాయం దండి. రైల్లో ఉడుపి వరకు వచ్చి అక్కడి నుంచి బస్సుల్లో కూడా చేరుకుంటారు. వర్షంలో తడుస్తూ సాహస యాత్ర చేయడం ఇక్కడి ప్రత్యేకత. ఇందుకోసమే జూన్‌ మొదటి వారం నుంచి సందడి కనిపిస్తుంది. సాధారణంగా వర్షాలు వద్దనుకునేవారు నవంబరు నుంచి ఫిబ్రవరి వరకు ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు మక్కువ చూపుతుంటారు.

Wednesday, 6 June 2018

బదరీ నాధ్


బదరీ నాధ్
జోషిమఠ్, భవిష్య బదరి

కర్రా నాగలక్ష్మి 

నందప్రయాగ నుంచి మా ప్రయాణం బదరీ నాధ్ వైపు సాగింది. సుమారు 63 కిలో మీటర్ల ప్రయాణం తరువాత విష్ణు ప్రయాగ చేరేం. బదరీనాథ్ దారిలో వున్న పంచప్రయాగలలో ఒకటిగా ఈ విష్ణు ప్రయాగని లెక్కపెడతారు. ఇక్కడ అలకనంద  'నీతి పాస్' లో పుట్టిన దౌళిగంగతో సంగమించి విష్ణు గంగగా పిలవబడుతోంది. ధౌళి గంగ నీరు చాలా తెల్లగా ప్రవహిస్తూ పాల నురుగను తలపిస్తుంది.

సంగమం నుంచి కాలినడకను రెండు మూడు కిలో మీటర్లు వెళితే విష్ణు కుండం వస్తుంది. పచ్చని ప్రకృతి మధ్యన యీ కుండం చాలా ప్రశాంతతను కలుగ జేస్తుంది. అందుకనేనేమో నారదుడు విష్ణుమూర్తి కొరకై యిక్కడ తపస్సు చేసుకొని విష్ణుమూర్తిని పిన్నును చేసుకున్నాడు . పురాతనమైన పాడు పడ్డ చిన్న మందిరం, విష్ణుకుండినులు తప్ప మరకమీద లేవు.

విష్ణ ప్రయాగలో 400MW హైడెల్ పవర్ ప్రోజెక్ట్ నిర్మ్ంచిన తరువాత ఇక్కడ జనావాసాలు పెరిగాయి, కాలక్రమేణా విష్ణు కుండానికి ప్రాముఖ్యత పెరిగి ఈ మందిరం పునరుధ్దరింప బడుతుందని ఆశిద్దాం.

విష్ణుప్రయాగకి దగ్గరగా ఉన్న 'హనుమన్ చట్టి' నుంచి కాలినడకన వెళితే హనుమంతుడి మందిరం ఉందని అన్నారు, కాని ఆ నిర్జనమైన దారిలో మందిరానికి వెళ్లే సాహసం చెయ్యలేక పోయేము.

సంగమ ప్రదేశంలో విష్ణు గంగ పైన షడ్భుజాకారంలో ఓ చిన్న మందిరం వుంది, ఆ మందిరం 'అహల్యా బాయి హోల్కర్' చే నిర్మింపబడిందని, అందులో ఆమె తపస్సు చేసుకొనేదని స్థానికులు చెప్పేరు.

మేం వెళ్లినప్పుడు ఆ మందిరానికి మరమ్మత్తులు చేస్తున్నారు .

హైడల్ పవర్ ప్రాజక్టు రావడంతో ఈ గ్రామం పట్నంగా మారింది. ఇళ్లు, గెస్ట్ హౌసులు  స్కూల్స్ వచ్చేయి. రోడ్లుకూడా విశాలంగా మారేయి.

విష్ణు ప్రయాగ నుంచి మనకి మంచుతో కప్పబడ్డ పర్వతాలు కన్పించి కనువిందు చేస్తాయి. పాతికేళ్లముందు ఋషికేశ్ నుంచే చలి మొదలయేది, అడపాదడపా గడ్డకట్టిన మంచు కొండలపై కనిపిస్తూ, ఒక్కో మలుపులో వరసగా తెల్లని మంచుకప్పుకున్న యెత్తైన పర్వతాలు కనువిందు చేసేవి. కాని ఇప్పుడు అలాంటి సుందర దృశ్యాలు సుమారుగా లేవనే చెప్పాలి .

బదరీ వెళ్లే దారిలో వచ్చే మరో చిన్న ఊరు ' హేలంగ్ '. ఈ  ఊరులో పదికి మించి ఇళ్లు ఉండవు కాని ఈ 
ఊరుకి దగ్గరగా ఉన్న మూడు మందిరాలవల్ల యీ ఊరు యాత్రీకులలో ప్రాముఖ్యతను పొందింది.

ఇక్కడ నుండి సుమారు రెండుకిలోమీటర్ల దూరంలో కొండదిగువన పంచబదరీ క్షేత్రమైన 'ధ్యానబదరి
' మందిరాన్ని దర్శించుకోవచ్చు. చాలా చిన్న మందిరం . ఇక్కడ బదరీ నారాయణుడు ధ్యానం చేసుకున్నాడనేది స్థలపురాణం వల్ల తెలుస్తోంది .

హేలంగ్ నుంచి సుమారు పద్నాలుగు కిలోమీటర్ల నడక తరువాత పంచకేదార క్షేత్రమైన ' కపాలేశ్వర మందిరాన్ని , భవిష్య కేదార్ మందిరాన్ని దర్శించుకో వచ్చు .

బదరీ వెళ్లే దారిలో వచ్చే మరో వూరు 'పిపల్ కోటి'. దీని గురించి ప్రత్యేకంగా యెందుకు చెప్తున్నానంటే యీ 'పిపల్ కోటి'లో మనకి కాలసిన దక్షిణ భారతదేశముపు ఫలహారాలు దొరకుతాయి . ఇప్పడు మనకి బదరీనాథ్ లో కూడా మన ఆహారాలు గత అయిదారు సంవత్సరాలుగా దొరకుతున్నాయి . కాని 'పిపల్ కోటి' లో పాతిక సంవత్సరాల నుంచి (అప్పట్లోనే మొదటి మారు యాత్రకి వెళ్లేం ) పాతికేళ్ల కిందట బదరీలో అన్నం పెరుగు దొరికేవి కావు. పాలు లేని కాఫీ, టీలు వుండేవి. అప్పట్లో మంచి టీ టిఫిన్స్ , భోజనం ' పిపల్ కోట ' లోనే దొరికేవి.

జోషీమఠ్
ఋషికేశ్ కి సుమారు 251 కిలోమీటర్ల దూరంలో ఉత్తరాఖండ్ రాష్ట్రం లో చమోలి జిల్లాలో వుంది జోషిమఠ్ . శీతాకాలంలో బదరీనాథుని మందిరం మూసివేసినప్పుడు ఆ విగ్రహాలను జోషిమఠ్ లో వుంచి పూజలు చేస్తారు .

శంకరాచార్యుల వారు పురాణాలలో వున్న బదరీనాధ్ వర్ణనను అనుసరించి యిక్కడకు రాగా హిమపాతం వల్ల బదరీకి దారి మూసుకు పోగా ఆది శంకరులు తన శిష్యులతో యిక్కడ బస చేసి మఠస్థాపన చేసి మంచు కరిగినతరువాత బదరీ చేరి నారద కుండంలో వున్న విగ్రహాలను వెలికి తీసి ప్రతిస్టించేరు . శంకర భగవత్పాదులు నివాసమున్న స్థలం వారు వాడిన వస్తువుల యిక్కడ మనం చూడొచ్చు . శంకరాచార్యుల వారిచే స్థాపింపబడ్డ బదరీపీఠం జోషిమఠలో వుంద్ , యీ మఠం అధర్వణ వేదానికి సమర్పితమైంది.

జోషిమఠ్ లో టాక్సీ స్టాండు నుంచి కిందకి దిగితే నరసింహ మందిరం వస్తుంది . ఇది చాలా పురాతన మైన మందిరం , లోపల పూజారుల నివాసాలు వున్నాయి , పైన గదులలో ఆదిశంకరుల పడక , ఆసనం మొదలైనవి చూడొచ్చు . యీ మందిరానికి వున్న ప్రాముఖ్యత యేమిటంటే యీ మందిరం లో వున్న మూలవిరాట్టు కి ఒక చెయ్య విరిగిపోయి వుంటుంది . రెండో చెయ్య విరిగి పోయిన నాడు బదరీనాథ్ మందిరప్రాంతం మొత్తం నేలమట్టం అయిపోతుందట . తర్వాత బవిష్య బదరీ లో బదరీనారాయణుడు పూజలందుకుంటాడట.

జోషిమఠ్ నుంచి సుమారు పదమూడు కిలోమీటర్ల దూరంలో వున్న తపోవనం వెళ్లొచ్చు . తపోవనం ఋషులు మునులు తపస్సు చేసుకున్న ప్రదేశం అని అంటారు .

ఎక్కువ యాత్రీకుల తాకిడి లేని ప్రదేశం , ఆశ్రమాలు తప్ప మరేమీలేవు .

పచ్చని ప్రకృతి , ప్రశాంత కావాలనుకునే వారు తప్పక వెళ్ల వలసిన ప్రదేశం .

జోషిమఠ్ వూరులోంచి కొండపైకి వెళితే అక్కడ రెండుదారులు వస్తాయి . ఒకటి ఔలి , రెండవది తపోవనం వైపు వెళతాయి , బవిష్య బదరీ వెళ్లాలంటే తపోవనం రోడ్డు మీదుగా వెళ్లాలి .

భవిష్య బదరి వెళ్లడానికి ప్రయాణ సాధనాలు అంతగా లేవు , జోషిమఠ్ నుంచి టాక్సీ తీసుకోవచ్చు . ఋషికేశ్ నుంచి వచ్చిన టాక్సీలలో కూడా వెళ్లొచ్చు .

ఒకటి అరా లోకలు బళ్లు తప్ప మరే రాకపోక వుండవు , ఓ అయిదారు కిలో మీటర్లు వెళ్లిన తరువాత రోడ్డు కి కుడి వైపున రోడ్డు పైనే వేడినీటి బావి వుంటుంది . అందులో నీరు యెంత వేడిగా వుంటుందంటే నీరు కుతకుతలాడుతూ  వుంటుంది . పసుపు వర్ణం లో లోపలనుంచి మన్ను బయటకి వస్తూ వుంటుంది . మేము బవిష్యబదరి వెళదామనుకొని స్థానికుల దగ్గర సమాచారం సేకరిస్తూ వుంటే వారు యీ బావి గురించి , అందులోంచి వచ్చే పసుపుపచ్చటి మన్ను గురించి చెప్పి ఆ మన్నుకి చాలా మెడిసనల్ వేల్యూ వుందని యెటువంటి చర్మ రోగమైనా తగ్గిపోతుందని అక్కడ చుట్టుపక్కల గ్రామాల వారు దానినే చర్మరోగాలకు మందుగా వాడుతారని చెప్పడంతో మేము రెండు మూడు ప్లాస్టిక్ డబ్బాలు తీసుకు వెళ్లేం . మన్ను వేడిగా వుండటం వల్ల మేం డబ్బా తో తియ్యడాని ప్రయత్నిస్తే డబ్బా కడిగి సొట్టపడింది . అయితే యెలాగో మన్ను కలక్ట్ చేసేం .

సైన్సు ప్రకారం కిందన గంధకం నిక్షేపాలు వున్న చోట వేడినీటి బుగ్గలు యేర్పడతాయని , ఆ ప్రకారంగానే యిక్కడ పైకి వస్తున్న పసుపురంగు మన్నులో గంధకం కలసిందను కుంటే అక్కడ మట్టికి గంధకం వాసనలేదు . నాకు సల్ఫర్ యెలర్జీ వుండడం వల్ల నేను చర్మ రోగాలకు యే ఆయింట్ మెంట్ వాడను , వాడలేను . కాని యీ మన్ను వాడితే నాకు యెటువంటి ఎలర్జీ కలుగలేదు . ఈ వ్యాసం చదివిన పెద్దలు యెవరైనా నా సందేహం తీర్చగలరు .

అక్కడ నుంచి మరే 4 కిలో మీటర్ల ప్రయాణం తరువాత భవిష్య బదరీకి వెళ్లే కాలి దారి దగ్గర ఆగేం .

భవిష్య బదరీ స్థానికులలో ప్రాముఖ్యం పొందినా యెక్కువ యాత్రీకులు రాకపోడం తో యిక్కడ యాత్రీకులకు కావలసిన సదుపాయాలు లేవు  , అంటే నడవ లేని వారికి కోసం గుర్రాలు , డోలీలు లాంటివి , వసతి సౌకర్యాలు లేవు .

భవిష్య బదరి కొండలపై అయిదు కిలో మీటర్ల నడకన చేరుకోవచ్చు . ఆ ప్రాంతంలో రెండే గుర్రాలున్నాయని , ప్రొద్దుట వెళితే గుర్రాలు దొరకొచ్చని , ఆలశ్యం అయితే మన్నుమొయ్యడానికి తీసుకు వెళ్తారని చెప్పడంతో తొందరగా వెళ్లేం, స్థానికులు చెప్పినట్లు మాకు ఆ గుర్రాలు దొరికేయి , అయితే జీను కట్టని గుర్రాల మీద ప్రయాణం మహా సాహసమనే చెప్పాలి . యెలోగోవోలా ప్రయాణించసాగేం . గుర్రాలతోపాటు వూరు మీదుగా వూరంటే  నాలుగు కుటుంబాలు    అంతే , అదేవూరు . అక్కడ ఆ పేదవారిచ్చిన ఆథిధ్యం తీసుకున్నాం , యేదో వారు వండుకున్నది మాకు పెట్టేరు , అది తిని మేం యిచ్చిన డబ్బు వారు పుచ్చుకోకపోతే వారి పిల్లల చేతిలో పెట్టి బట్టలు కొనుక్కోమని చెప్పేం .

వారు వాళ్ల యిళ్ల ముందున్న స్థలంలో కూరగాయలు , గోధుమలు పండించుకుంటున్నారు .

తర్వాత దారిలో మరో పల్లెను కూడా దాటేం , పడిపోతున్న పెద్దపెద్ద రాళ్లను దాటుకొని , జలపాతాలను దాటుకొని పైకి చేరేం . పైన పేద్ద మైదానం , కనుచూపు మేర వరకు పచ్చని తివాసీ పరచినట్లుంది .

అక్కడ నుంచి పచ్చిక మీద నడుస్తూ మరో అర కిలో మీటరు నడిచేం , ఆ నడక ఆయాసం కలుగజేసినా రెండింతలు అహ్లాదాన్నిచ్చింది. కోనిఫర్ చెట్లతో నిండివున్న అడవిని చేరడం అక్కడ చిన్న కుటీరం , అందులో నివసిస్తున్న స్వామీజీని కలుసుకున్నాం , పేరడిగితే స్వామీజీలకు పేరేమిటి ? అనే సమాధానం చెప్పేరు . ఆ కుటీరం యెండని కాని వరాన్ని కాని ఆపలేదు , అలాగే స్వామీజీకి యే రక్షగా యివ్వలేదని చూడగానే తెలుస్తోంది . మరో కాషాయ అంగ వస్త్రం తప్ప మరేమీ లేవు . ఎలా వుంటున్నారు అనే ప్రశ్నకి " యిలాగే " అనే సమాధానం వచ్చింది .

మా గుర్రలాబ్బాయి , స్వామీజీ కుటీరానికి యెదురుగా వున్న కొండదగ్గరకు మమ్మలని తీసుకు వెళ్లేరు . కొండముందర చిన్న చిన్న కర్రలతో పందిర కట్టి వుంది , వెనుకాతలకొండని ఆనుకొని ఓ రాతి ఆకారం , కొండలోంచి బయటకి వస్తున్నట్టుగా వుంది . మొహం , కాళ్లు చేతులు వున్నాయి , మిగతా అవయవాలు తీరుగా యేర్పడలేదు . అదే బదరీనాథుని బవిష్య రూపమని , ఆకృతి పూర్తిగా యేర్పడిననాడు యిప్పటి బదరీ మూసుకుపోతుందని , యీ ఆకృతి బదరీనారాయణునిగా పూజలందుకుంటుందని వివరించేరు.

ప్రస్తుతం స్వామీజీ పూజలు నిర్వహిస్తున్నట్లు చెప్పేరు .

అక్కడ యెంత ప్రశాంతంగా వుందంటే అలా యెంతసేపైనా గడిపేయొచ్చని అని పించింది .

అయితే మా గుర్రాలబ్బాయి , స్వామీజీ పులులు తిరిగే వేళయిందని అంటే బయలుదేరి పోయేం  .

రోజూ అదే వేళకు పులులు అటు వైపు వస్తాయట , స్వామీజీ రోజూ చూస్తూ వుంటారట , కాని అతనిని యేమి చెయ్యవట . నాకు నమ్మబుద్దికలుగలేదు .

మట్టిలోంచి , నూతులలోంచి విగ్రహాలు బయటకి రావడం చూసేం అలా వచ్చిన విగ్రహాలు పూర్తిగా చెక్కబడి వుండడం కూడా చూసేం , నిరంతరంగా నీటి రాపిడికి ఆకృతులు యేర్పడడం కూడా చూసేం కాని యిక్కడ యెటువంటి నీరు పడకుండా యెవరూ చెక్కకుండా ఓ కొండ నుంచి ఆకృతి వుబ్బుగా పైకి రావడం మహా వింతగా అనిపించింది . రెండు చేతులు , తల , కాళ్లు , మధ్య శరీరం తెలుస్తున్నాయి అలాగే ఓ చెయ్యి పైకెత్తి శంఖం ధరించినట్లు మరొక చెయ్య అభయముద్రలో వున్నట్లు తెలుస్తోంది .

ఆ ప్రదేశాన్ని వదిలి రాలేక రాలేక వచ్చేం .

తర్వాత తపోవనం వైపు ప్రయాణం సాగించేం . భవిష్య బదరీనుంచి సుమారు 10 కిలోమీటర్ల ప్రయాణానంతరం లోయ లాంటి ప్రాంతం చేరుకున్నాం .

మిగతా వివరాలు పై వారం చదువుదాం అంత వరకు శలవు.
అమర్‌నాథ్‌ యాత్ర


అమర్‌నాథ్‌ యాత్ర
(పహల్ గాం మీదుగా)
కర్రా నాగలక్ష్మి

శ్రీనగరు పట్టణానికి సుమారు 88 కిలో మీటర్లదూరంలో ఉన్న ప్రముఖ వేసవి విడిది పహల్ గాం. పహల్ గావ్ అనంతనాగ్ జిల్లాలో ఉంది. ఈ ఊరుకి అమర్‌నాథ్‌ యాత్రలో ప్రముఖ స్థానం ఉంది. అమర్‌నాథ్‌ యాత్రలో ముఖ్యపాత్ర ఉన్న 'ఛడీముబారక్ ' యీ దారిగుండా అమర్‌నాథ్‌ గుహకు తీసుకు వెళతారు. యాత్ర పూర్తయాకా తిరిగి యిదే మార్గం ద్వారా తీసుకొని వస్తారు.

శివ పురాణం ప్రకారం పరమ శివుడు పార్వతీ దేవికి అమరకథ చెప్పేందుకు అమర గుహకు వెళుతూ శివుని వాహనమైన నందిని యిక్కడ విడిచి పెట్టడం వల్ల యీ వూరుని ' బైల్ గావ్ ' గా పిలువ సాగేరు. కాలాంతరాన యిది పహల్ గావ్ గా మారింది.

పహల్ గావ్ వెళ్లే దారంతా కొండ ప్రాంతం, మంచి పంటనేల. కొండ క్రింద ప్రాంతాలలో మామిడి, బత్తాయి మొదలయిన పండ్ల తోటలు పర్వతాల యెత్తుపెరుగు తున్న కొద్ది యాపిల్, ఛెర్రి పండ్ల తోల మధ్యనుంచి ప్రయాణం అహ్లాదకరంగా ఉంటుంది. టాక్సీలో వెళ్లేవారు యీ తోటల దగ్గర ఆగి తోట యజమాని అనుమతితో తోటలు చూడొచ్చు. ఛెర్రీ లు ఆగష్టులో పండి కోతకొస్తాయి. యాపిల్స్ అక్టోబరులో కోత కొస్తాయి. ఇంకా పైకి వెళ్తున్న కొద్దీ అక్రోటు, బాదం తోటలు చూడొచ్చు. దేవదారు, కోనిఫర్ తోటలు రోడ్డుకి యిరువైపులా ఉండి మనకి స్వాగతం పలుకుతున్నాయా ? అనే భ్రమ కలిగిస్తాయి. కొండపైన జారుతున్న జలపాతాలు, పేరు తెలియని అడవి పక్షులు మన ప్రయాణపు బడలికను తెలియకుండా చేస్తాయి.

కనుచూపు మేర వరకు పచ్చని పచ్చిక బయలు, గలగల ప్రవహించే సెలయేళ్లు, అలా పచ్చికలో దేవదారు వృక్షాల కిందన నడుస్తూ కోనిఫర్ పూలను యేరుకుంటూ యెంతదూరం నడిచినా తనివి తీరదు. పర్యాటకుల సౌకర్యార్థం రోడ్లు వెడల్పు చెయ్యడం, హోటల్స్ అధిక సంఖ్యలో నిర్మించడం వల్ల 2014లో మేం వెళ్లినప్పుడు పచ్చిక బయళ్ల స్థానంలో ధూళి దుమ్ము, హోటల్స్ కనిపించి నిరుత్సాహాన్ని కలిగించేయి.

అయితే యిక యాత్ర లోకి వస్తే, జమ్ములో రిజిస్ట్రేషన్ చేసుకొని బస్సులో శ్రీనగరు మీదుగా పహల్గాం చేరుతాం. మేం మద్యాహ్నపు మూడింటికి పహల్గాం చేరేం మాతో బాటు బస్సులో వచ్చిన వారు ఆ రాత్రి అక్కడ బస చెయ్యాలనుకున్నారు. పర్వతాలలో ప్రయాణాలు యెక్కువగా వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది. ఆ రోజు యెక్కడా మబ్బులు లేవు, మరో నిముషంలో మబ్బులు కమ్మేయొచ్చు. అందుకే మేం పహల్గాంకి సుమారు పదహారు కిలో మీటర్ల దూరంలో ఉన్న'చందన వాడి' లో రాత్రి బస చెయ్యదలచుకున్నాం.

సుమారు అర కిలో మీటరు నడిచేక చిన్న బస్సులు యాత్రీకులను అక్కడకి 16 కిలో మీటర్ల దూరంలో ఉన్న ' చందన వాడి ' వరకు తీసుకు వెళుతున్నాయి, మేం కూడా వాటిలో ప్రయాణించి చందన వాడి చేరుకున్నాం. అక్కడ లంగరు నడుపుతున్న వారే యాత్రీకులకోసం రాత్రి బసకోసం ఉచిత టెంటులు నడుపుతున్నారు. అక్కడకు చేరగానే అడిగి మరీ మాకు కావలసిన ఆహారపదార్ధాలు యిచ్చేరు. బస్సు ప్రయాణానికి అలసిపోయిన మా శరీరాలను టెంటులో పడకల మీద చేర్చి సేదతీరసాగేం. అంతలోనే లంగరు నిర్వాహకులు టెంటులోకి వచ్చి ముందుగా పేరు నమోదు చేయించుకొని రజ్జాయిలు తీసుకోమని పిలిచేరు. చుట్టూరా చక్కని ప్రకృతి చుట్టూరా కొండలు కనుచూపు మేర వరకు పచ్చిక మైదానాలు చాలా అందంగా ఉండడంతో అలా కాసేపు పచ్చిక మీద నడచి వచ్చేం. అప్పటికి బాగా ఎండకాస్తూ ఉండడం వల్ల బాగా చెమట పట్టసాగింది యింత వేడిలో రజ్జాయిలు అవుసరమా? అని అనిపించి మేం వెళ్లలేదు. వాళ్లే వచ్చి రెండేసి రజ్జాయిలు యిచ్చి, సాయంత్రం ఆరింటికి లంగరు మూసేస్తారు కాబట్టి భోజనం ఆరులోపలే చెయ్యాలని, అలా తినలేని వారు భోజనం తీసుకొని తరవాత తినొచ్చునని చెప్పేరు. అయిదున్నర అయేసరికి సూర్యుడు అస్తమించడంతో మొదలయిన చలి అంతకంతకూ పెరగసాగింది. ఆరు తరువాత గుర్రాల వాళ్లు టెంటుకి వచ్చి బేరాలు చెయ్యసాగేరు. నడక మావల్లకాదు కాబట్టి మేం గుర్రాలను శేష నాగ్ వరకు మాట్టాడుకున్నాం. సుమారు పదమూడు పద్నాలుగు కిలో మీటర్ల దూరం ఒకే రోజులో ప్రయాణం అంటే కష్టం అన్న గుర్రపు యజమానిని వొప్పించి పొద్దున్న ఆరు లోపల బయలుదేరుదాం అని చెప్పేం. మా భోజనాలు చేసుకొని యేడుకల్లా నిద్రకివుపకరించేం.

యాత్ర మరునాడు మొదలు పెట్టబోతున్నాం అనే హుషారులో తొందరగా నిద్రపోయేం. శివుడు పార్వతితో అమర్‌నాథ్‌కి వెళుతూ ఈ ప్రదేశంలో తలపైనున్న చంద్రుణ్ణి విడిచిపెట్టాడని పౌరాణిక కథ.

పొద్దన్న అయిదున్నర కల్లా మేం మాట్లాడుకున్న గుర్రాలవారు వచ్చి మమ్మల్ని లేపేరు. అప్పటికే లేచిన లంగరు వాళ్లు టీ ఫలహారాల తయారీలో ఉన్నారు.

బాత్రూములేమీ లేవు బయట పళ్లు తోముకొని స్నానం వాయిదా వేసి టీ ఫలహారాలు కానిచ్చి ప్రయాణం మొదలు పెట్టేం.

సుమారు మూడు కిలో మీటర్ల యెగుడూ దిగుడూ దారిలో చందనవాడి నుంచి 2500 అడుగుల యెత్తు యెక్కి ' పిసు శిఖరం ' దాటాలి. చాలా కష్టంగా ఉంటుంది. వంకలు తిరిగిన యెగుడు దిగుడు కొండదారి మీద ప్రయాణం చాలా కష్టంగా ఉంటుంది. తరచు కురుసే వర్షాలకు జారిపడిన కొండరాళ్లను దాటుకుంటూ ప్రయాణంచాలి. ఈ పిసు శిఖరాన శివుడు తన శరీరంపైన ఉన్న విషజీవులను విడిచి పెట్టేడు.

సూర్యుడు మబ్బులలోనే ఉండిపోవడంతో మా ప్రయాణం మరింత అహ్లాదకరంగా మారింది. అక్కడనుంచి ' ఝాజీబల్ ' వరకు ఉన్న 5 కిలోమీటర్లూ దారి సాఫీగా యే యెగుడు దిగుబడులు లేక సాగింది. ఝాజీబల్ నుంచి నాగకోటి వరకు ఉన్న 2 కిలో మీటర్ల దారి కష్టమైనదని కావడంతో గుర్రాలమీంచి దిగి నడవాలి. దారి జారుడుగా ఉండడం వల్ల గుర్రాలు కూడా నిభాయించుకోలేవు. అందుకు ప్రతీ వారు యీ రెండు కిలో మీటర్లు నడిచే పూర్తి చెయ్యాలి. నాగకోటి లేక నాగర్ కోటిగా పిలువబడే యీ ప్రదేశంలో శివుడు తన శరీరం పైన ఉన్న నాగులను విడిచిపెట్టడు. నాగర్ కోటి నుంచి మరో కిలో మీటరు ప్రయాణం తరువాత రెండు కొండల మధ్యనుంచి నీలి రంగు సెలయేరు వస్తున్నట్లుగా శేషనాగు సరస్సు కనిపిస్తుంది.

శేషనాగ్ సరస్సు దగ్గర ఉన్న యేడు కొండలు శేషుడి పడగలని, శివుడు యిక్కడ శేషుడి విడిచి పెట్టేడని పురాణ కథ. శేషనాగ్ సరస్సుని చూస్తూ ఆ ప్రాంతం లో గల ప్రకృతికి పులకరించిపోతూ మరో రెండు కిలో మీటర్లు ప్రయాణించి శేషనాగ్ చేరేం. అప్పటికి చీకట్లు ముసురుతున్నాయి. మా గుర్రాలబ్బాయి దింపిన టెంటులో ₹600 ఒక మంచానికి యిచ్చి రెండు మంచాలు తీసుకున్నాం. సన్నగా వాన ప్రారంభించింది, అరకిలో మీటరు దూరంలో ఉన్న లంగరుకు వెళ్లి రాత్రి భోజనం చేసుకొనే సరికి వాన పెరిగింది. మేం మంచాల మీద రజ్జాయిల కింద పడుక్కున్నాం. వాన అంతకంతకూ పెరిగి కుంభవృష్టిగా కురవ సాగింది. మాతో పాటు టెంటులో ఉన్న మిగతా ముప్పై మందికి ఆరోజు యాత్ర లేదని తెలియడంతో తిండికి తప్ప మిగతా సమయం రజ్జాయిలోనే గడిపేము. మధ్య మధ్య లో వూసు పోడానికి కుశల ప్రశ్నలు, తరవాత భజనలు చేస్తూ గడిపేం. రాత్రి వాన నీరు టెంటులోకి ప్రవేశించేయి. మూడువందలుయిచ్చి కింద పడుక్కున్నవారి పడకలు తడిసిపోయేయి. కిందన నీరు మీదా టెంటు కారడం వల్ల తడి, చలి వల్ల రాత్రి యెవ్వరికీ నిద్ర లేదు.

మరునాడు కూడా వర్షం పడుతూనే ఉంది. అయితే ఉధృతం తగ్గింది. టెంటులో ఉండడానికి అద్దె రెండురెట్లు పెంచేరు టెంటు యజమానులు.

మూడో రోజు వాన తగ్గింది కాని దారి బురద అవడం వల్ల గుర్రాలని వెళ్లనివ్వలేదు. నడిచి వెళ్లేవారు టెంటులోంచి వెళ్లిపోయేరు. మేంనాలుగో రోజున ప్రయాణం తిరిగి ప్రారంభించేం. ఆరోజు మేం సుమారు 12 కిలోమీటర్లు ప్రయాణించి గుహ చేరుకొని దర్శనానంతరం సుమారు 18 కిలోమీటర్లు ప్రయాణించి బాల్టాల్ చేరాలన్నది మా ఆశ, అందుకని మేం ఉదయం 5 గంటలకి ప్రయాణం మొదలు పెట్టేం.

శేషనాగ్ నుంచి మా ప్రయాణం మహాగణ శిఖరం లేక గణేష శిఖరం అని పిలువబడే శిఖరం వైపు సాగింది. మొత్తం యాత్రలో యిదే కష్టమైన ప్రయాణం, యిక్కడ పరమశివుడు గణేషుడిని విడిచి పెట్టేడు.

ఈ ప్రాంతం లో మంచుకరిగి ప్రవహించే నీటితో బురదగా ఉంటుంది. ఇక్కడ నడవడం గుర్రాలకి, మనుషులకు కూడా చాలా కష్టంగా ఉంటుంది. కొన్ని చోట్ల గడ్డకట్టిన మంచుమీద కూడా ప్రయాణం సాగుతూ ఉంటుంది, గడ్డకట్టిన సెలయేళ్లు కావడం వల్ల కొన్ని చోట్ల పలుచని పొరలా గట్టిపడి కాలు పడగానే మంచు విరిగి మనిషి నీళ్లల్లో పడిపోయే ప్రమాదం ఉంటుంది అందుకే గుర్రాలవారు నడిచే చోట నడవాలి లేకపోతే మంచునీటిలో పడిపోవడం ఖాయం. గడ్డ కట్టిన మంచుమీద నడక తరువాత గణేషశిఖరానికి ప్రయాణం మొదలవుతుంది. యిక్కడ నుంచి నడక చాలా కష్టంగా మారుతుంది. ఒకటి యెత్తు యెక్కువగా ఉండడం, రెండు గాలిలో ఆక్సిజన్ శాతం చాలా తక్కువగా ఉండడం. ఇలాంటి సమయాలలో ముద్దకర్పూరం వాసన చూడమని పర్వతారోహకులు సలహా యిస్తారు. నడిచేవారు ట్వంటి- ట్వంటి ఫార్ములాని అనుసరిస్తారు, అంటే యిరవై అడుగులు నడిచిన తరువాత యిరవై దీర్ఘశ్వాసలు తీసుకోడాన్ని పర్వతారోహకులు ట్వంటి - ట్వంటి అని అంటారు. ఈ పర్వత శిఖరం 'పిసు శిఖరం' అంత యెత్తులేక పోయినా అప్పటికే శరీరం అలసిపోయి పోయి ఉండడం, గాలిలో ప్రాణవాయువు లోపించడం, కొండ ప్రాంతాలలో ఆకలి మందగించడం వల్ల సరైన ఆహారం తీసుకోక పోవడం వల్ల యెక్కడం కష్టమౌతుంది. గణేషశిఖరం దాటేక మాప్రయాణం బాబల్ శిఖరం వైపు సాగింది. శేషనాగ్ నుంచి బాబల్ శిఖరానికి సుమారు మూడు కిలో మీటర్లు ఉంటుంది. బాబల్ శిఖరాన్ని చేరుకోడానికి సుమారు మూడు గంటలు పడుతుంది. అప్పటికి మనం సుమారు 13800 అడుగుల యెత్తుకి చేరుకుంటాం.

బాబల్ శిఖరం మీంచి అమర్‌నాథ్‌ గుహ కనిపిస్తుంది కాని దారిలో మరో శిఖరాన్ని మనం యెక్కాలి. బాబల్ శిఖరం దగ్గర రెండు మూడు లంగరులు, బి.ఎస్.ఎఫ్ వారి మెడికల్ కేంపు ఉన్నాయి. గుర్రం దిగితే యెక్కడం వో పెద్ద ప్రశ్న గా ఉండడంతో ఆకలిగా ఉన్నా మేం దిగలేదు. కాని లంగరు వారు మా గుర్రాల దగ్గరకు వేడివేడి పాయసం, గోరు వెచ్చని నీరు అందించడంతో మా ప్రాణాలు లేచి వచ్చి మిగతా ప్రయాణం సుఖంగా చెయ్యగలగేం. గుప్పెడు టాఫీలు యిచ్చి నీరసంగా ఉన్నప్పుడు నోట్లో వేసుకోమని సలహా యిచ్చేరు. అక్కడనుంచి సుమారు 1.5 కిలోమీటర్లు ప్రయాణానంతరం 'మహాగణ శిఖరం' చేరుతాం. సుమారు 14500 అడుగులయెత్తుకి చేరుతాం. శివుడు యిక్కడ మిగతా గణాలను విడిచి పెట్టి పార్వతితో గుహ వైపు సాగిపోయేడు.

మహాగణశిఖరం నుంచి 1.5 కిలోమీటర్లు గడ్డకట్టిన అమరుగంగ నదిపైన ప్రయాణించి పౌష్ పత్రి చేరుకుంటాం. పోష్ పత్రి నుంచి సుమారు మూడు కిలో మీటర్ల యెగుడు దిగుడు దారిలో మెలికలు తిరిగిన దారిలో ప్రయాణించి పంచతరణి చేరుతాం. దీనిని సంగం అని కూడా అంటారు. యిక్కడ శివుడు తన ఢమురుకాన్ని విడిచి పెట్టినట్టుగా చెప్తారు. యిక్కడ నుండి సుమారు మూడు కిలోమీటర్లు కొంచం మట్టి కొండలమీద, గడ్డ కట్టిన మంచుమీద నడవాలి. పంచతరణి దగ్గర బాల్టాల్ నుంచి వచ్చే యాత్రీకులు కూడా కలుస్తారు. ఇక్కడ నుంచి యాత్రీకులు కాలినడకన వెళ్లాలి, గుర్రాలని ముందుకి అనుమతించరు.

ఆ మంచులో చలిలో నడుస్తూ గుహ చేరుకొని బాబా అమర్‌నాథ్‌ని దర్శించుకున్నాం.

తిరిగి వచ్చేటప్పుడు బాల్టాల్ మీదుగా సోనెమార్గ్ చేరుకొని అక్కడనుంచి శ్రీనగరు అక్కడ నుంచి టాక్సీలో జమ్ము చేరుకున్నాం.

అప్పట్లో బాత్రూములు ఉండేవి కావు కాని యిప్పడు టెంట్లలో నే అన్ని సదుపాయాలూ యేర్పాటు చేస్తున్నారు.

2002లో హెలీకాఫ్టర్ పంచతరణి వరకు ఉండేది. ప్రస్తుతం బాబల్ శిఖరం వరకు మాత్రమే నడుపుతున్నారు.వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌ Valley of Flowers

అందాల పూలలోయ..!
‘హిమాలయాలు...  మంచుకొండలూ హిమనదాలూ జీవనదులూ సరోవరాలూ... వంటి ప్రకృతి అందాలకీ రకరకాల జీవజాతులకీ రంగురంగుల పూలజాతులకీ ముఖ్యంగా అరుదైన బ్రహ్మకమలాలకీ పుట్టిల్లు. అందుకే ఆ కొండల్లో ఎన్నిసార్లు తిరిగినా చూడాల్సినవేవో ఎక్కడో ఒకచోట మిగిలే ఉంటాయి. అలాంటిదే జోషిమఠ్‌ నుంచి బదరీనాథ్‌కు వెళ్లే దారిలో ఉన్న పూల లోయ ఉరఫ్‌ వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌...’ అంటున్నారు పుణెకి చెందిన కర్రా నాగలక్ష్మి.

వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌కి వెళ్లాలంటే ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలోని గోవింద్‌ఘాట్‌ మీదుగా వెళ్లాలి. హెలీకాప్టర్‌ సేవలు అందుబాటులో ఉంటాయి. కానీ వాటికన్నా అక్కడినుంచి నడకదారినగానీ గుర్రాలూ లేదా డోలీల్లోగానీ ప్రయాణించడమే మేలు. ఇక్కడ హిమపాతం, వర్షపాతం రెండూ ఎక్కువే. దాంతో హెలీకాప్టర్‌ సేవలు తరచూ రద్దు అవుతుంటాయి. హరిద్వార్‌ నుంచి గోవింద్‌ఘాట్‌కి 296 కి.మీ. అక్కడికి ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం నడుపుతున్న బస్సులూ ట్యాక్సీలతోబాటు ప్రైవేటు బస్సులూ ఉంటాయి. బస్సులో ఎక్కువ సమయం పడుతుందని టాక్సీలో బయలుదేరాం.

గోవింద్‌ఘాట్‌లో...
ముందుగా ఉత్తరాఖండ్‌లోని శ్రీనగర్‌కి చేరుకున్నాం. రాత్రి అక్కడ బస చేసి ఉదయాన్నే బయలుదేరి జోషిమఠ్‌కి వెళ్లాం. అప్పటికే గోవింద్‌ఘాట్‌కు వెళ్లే దారి మూసేశారట. దాంతో ఆ రోజు అక్కడే బస చేశాం. అక్కడినుంచి గోవింద్‌ఘాట్‌కి సుమారు 20 కిలోమీటర్లు. జోషిమఠ్‌ నుంచి బదరీనాథ్‌కు వెళ్లే మార్గాన్ని ఆనుకొనే ఉంటుంది గోవిందఘాట్‌. ఉదయాన్నే బయలుదేరి, ఓ కిలోమీటరు ప్రయాణించాక ఘాట్‌కు చేరుకున్నాం. అక్కడ హోటళ్లు అన్ని వర్గాలవాళ్లకీ అందుబాటులో ఉన్నాయి. సమీపంలోనే ఓ పక్క అలకనందా నది కనిపిస్తుంటుంది. దాని ఒడ్డున గురుద్వారా ఉంది. అందులో యాత్రికులకు ఉచిత భోజన, పార్కింగ్‌ సదుపాయాలు ఉన్నాయి. అక్కడి నుంచి కాలిబాట మొదలవుతుంది. మేం గురుద్వారా దగ్గరే ఆగి, తేలికపాటి బ్యాగుల్లో రెండు రోజులకి సరిపడా బట్టలూ ఇతరత్రా నిత్యావసర వస్తువులూ సర్దుకుని మిగిలినవి టాక్సీలోనే వదలి నడకదారిన బయలుదేరాం. గురుద్వారాలో లగేజీని దాచుకునే సౌకర్యం ఉంది. ఈ యాత్రకు అవసరమైన మాయిశ్చరైజింగ్‌ క్రీమూ సన్‌స్క్రీనూ చలిని ఆపే కోట్లూ కొండల్లో నడవడానికి వీలుగా ఉండే షూ తప్పనిసరి. తలనొప్పి, జ్వరం... వంటి వాటికి అవసరమైన మందుల్నీ వెంట తీసుకెళ్లాలి. టార్చిలైట్‌ తప్పనిసరి.

నదీ సంగమం!
ఓ అరకిలోమీటరు నడిచాక గానీ గుర్రాలూ డోలీలూ దొరకవు. నడక దారిన వెళ్లేవారికి సామాన్లు మోసేవారూ దొరుకుతారు. వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌తోబాటు హేమకుండ్‌ సాహెబ్‌ చూడ్డానికి గుర్రాలు మాట్లాడుకున్నాం. సుమారు 12 కిలోమీటర్లు ప్రయాణించాక ఘంగారియాకి చేరుకున్నాం. అక్కడి నుంచి ముందుగా వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌కి వెళ్లాలనుకున్నాం. ఆ దారిలో కాస్త దూరం మట్టి, బురద. మరికాస్త దూరం బండరాళ్లు. ఎత్తు ఎక్కువగా ఉన్నచోట గుర్రాలమీద నుంచి దిగి నెమ్మదిగా ఎక్కసాగాం.

దారిలో అలకనందా నది పరవళ్లు తొక్కుతూ మమ్మల్ని పలకరిస్తూనే ఉంది. అత్యంత కష్టమ్మీద ఆ పన్నెండు కిలోమీటర్లూ ప్రయాణించాక పచ్చని మైదానం, చిన్న చిన్న సెలయేళ్లూ ప్రవహిస్తూ కనువిందు చేశాయి. ఘంగారియాకి వెళ్లడానికి మొత్తంగా ఆరుగంటల సమయం పట్టింది.
ఘంగారియా బైందరలోయలో ఉంది. బైందర గంగ, పుష్పవతి నదుల సంగమ ప్రదేశమే ఘంగారియా. ఈ రెండు నదులూ సంగమించి లక్ష్మణ గంగగా ప్రవహించి గోవింద్‌ఘాట్‌ దగ్గర అలకనందలో కలుస్తాయి. ఘంగారియాలో టెంట్లూ మట్టి ఇళ్లే ఉన్నాయి. వాటిల్లోనే యాత్రికులకి అవసరమైన భోజన, వసతి సదుపాయాలను కల్పిస్తారు. ఈ ఘంగారియా పూలలోయకీ హేమకుండ్‌ సాహెబ్‌కీ కూడలి లాంటిది. గోవింద్‌ఘాట్‌ తరవాత నివాస, భోజన సదుపాయాలు కలిగిన ప్రదేశం ఇదే. ఇక్కడి హోటళ్లు ఆరుగంటలకే మూసేస్తారు. ఆ లోగానే భోజనాన్ని ముగించుకోవాలి. బసలో సామాన్లు ఉంచి టీ, స్నాక్సూ కానిచ్చి పూలలోయకి బయలుదేరాం. మధ్యాహ్నం మూడు తరవాత ఈ లోయలోకి అనుమతించరు. ప్రవేశద్వారం వద్ద టిక్కెట్లు తీసుకుని నడక మొదలెట్టాం. ఒకసారి తీసుకున్న టిక్కెట్టుతో మూడురోజులవరకూ వ్యాలీలోకి వెళ్లవచ్చు.
అందాల పూలలోయలో...
ఉత్తరాంఛల్‌లోని చమోలి జిల్లాలోని సుమారు 3,660 మీటర్ల ఎత్తులోని సుందర ప్రదేశమే ఈ పూలలోయ. ఎగుడుదిగుడు కొండలమీద నడుచుకుంటూ వెళ్లాక నందాదేవి నేషనల్‌ పార్కు వచ్చింది. అందులోనుంచే వ్యాలీలోకి ప్రవేశించాలి. ఆ దారి బీభత్సమే. అక్కడ ఎప్పుడు వాన పడుతుందో ఊహించలేం. ఆ వానలకి కొండరాళ్లు దొర్లుకుంటూ వస్తుంటాయి. దాంతో నడవడమే కష్టం. ఏకంగా మూడు కిలోమీటర్లు నడవాలనుకున్న మా అంచనా తప్పింది. సూర్యాస్తమయానికి నందాదేవి నేషనల్‌ పార్కు గేటు దగ్గరకు చేరుకున్నాం. చీకటి రాత్రిలో ఎక్కువసేపు తిరగలేం అన్న కారణంతో వెనుతిరిగాం. మర్నాడు పొద్దున్నే అయిదు గంటలకి డోలీలు కట్టించుకుని బయలుదేరాం. నందాదేవి జాతీయ పార్కుకి వెళ్లడానికి మూడు కిలోమీటర్ల నడక అంటే రానూపోనూ ఆరు కిలోమీటర్లు, అంత నడక అలవాటు ఉండదు కాబట్టి డోలీ కట్టించుకుని బయలుదేరాం. డోలీవాళ్లే మాకు గైడ్స్‌. 

లేలేత సూర్యకిరణాలు హిమాలయాలపై పడి అవి తిరిగి పూలలోయలో ప్రతిబింబించే ఆ సుందర దృశ్యాన్ని వర్ణించడం మహాకవులకే సాధ్యం అనిపించింది. లోయంతా పూలముగ్గులేసినట్లే ఉంది. ఒక్కోచోట ఒక్కో రంగు పూలూ... మధ్యమధ్యలో ఇంద్రధనుస్సులా రంగురంగుల పూలూ వాటిమధ్యలో వచ్చే పిల్ల సెలయేళ్లూ దాటుతుంటే చిత్రమైన అనుభూతి. ఒకటి రెండు కిలోమీటర్ల దాటాక రంగురంగుల క్రోటన్లు... పూలమొక్కల మధ్యలో రంగుల ఆకుల మొక్కల్ని చూస్తుంటే, ఎవరో పుష్పగుచ్ఛంలో అమర్చినట్లుగా ఉంది. నిజంగా ఆ అమరిక అద్భుత ప్రకృతి చిత్రమే. దూరం నుంచి చూస్తే రంగురంగు చారల తివాచీ పరిచినట్లుగా కనిపిస్తోంది. ఈ పూలఅమరిక ఏటా మారిపోతుంటుంది. ఎందుకంటే గాలివానలకి విత్తనాలు రకరకాల ప్రదేశాల్లో పడి మొలకెత్తుతాయి. 

ఎంత దూరం నడిచినా నలువైపులా కనుచూపు మేరలో రంగురంగుల పూలే... జెరానియం, స్నేక్‌ ఫాయిల్‌, హుక్‌డ్‌ స్టిక్‌ సీడ్‌, హిమాలయన్‌ రోజ్‌, బ్లూ పాపీ, కోబ్రాలిల్లీ, డాగ్‌ ఫ్లవర్‌... ఇలా ఎన్నో రకాలు. వృక్ష నిపుణులకయితే పండగే. సెలయేళ్లు దాటుకుంటూ పూలవనంలో ఎంత దూరం ప్రయాణించామో తెలియలేదు. వెనక్కి రావాలనే అనిపించలేదు. ఒకచోట చిన్న సమాధి కనిపించింది. అది జాన్‌ మార్గరెట్‌ అనే ఆమెదనీ, 1939లో ఇక్కడ దొరికే అరుదైన పుష్పజాతులమీద అధ్యయనం చేసేందుకు వచ్చి ప్రమాదవశాత్తూ మరణించిందనీ రాసి ఉంది. తరవాతి కాలంలో ఆమె చెల్లెలు అక్క జ్ఞాపకార్థం సమాధిని నిర్మించిందని డోలీవాళ్లు చెప్పారు. ఆ తరవాతే ఈ ప్రదేశం వెలుగులోకి వచ్చింది. 

ఇక్కడ పూచే ప్రతి పూవూ ఔషధభరితమే. రామాయణంలో హనుమంతుడు తీసుకొచ్చిన సంజీవని పర్వతం ఈ పూలలోయలోదేనని అంటారు. ఆ పూలమీదుగా వీచే గాలిని పీల్చినా రోగాలన్నీ తగ్గుతాయట. సుమారు 8 కిలోమీటర్ల పొడవూ 2 కిలోమీటర్ల వెడల్పులతో హిమాలయ పర్వతశ్రేణుల మధ్య విస్తరించిన ఈ పూలలోయకి తూర్పున నందాదేవి అభయారణ్యం ఉంది. ట్రెక్కర్లు నందాదేవి అభయారణ్యానికి పొద్దున్నే వెళ్లి, సాయంకాలానికి తిరిగి వస్తుంటారు. ఇక్కడ మంచు పులి, నల్ల ఎలుగుబంట్లు, ఎర్ర నక్కలు, నీలి గొర్రెలు, కస్తూరి మృగాలు ఉంటాయి.
లోయలో అక్కడక్కడా కొంగలూ డేగలతోబాటు రంగురంగుల ఈకలతో ఉండే మోనల్‌ పక్షులు కనువిందు చేశాయి. అంత అందమైన లోయను వదల్లేక వదల్లేక వెనక్కి మళ్లాం. ఘంగారియా చేరాక గానీ మేం అల్పాహారం కూడా చేయలేదని గుర్తు రాలేదు. వేడివేడిగా నూడుల్స్‌ తిని, టీ తాగి హేమకుండ్‌ సాహెబ్‌కి బయలుదేరాం.

హేమకుండ్‌ సాహెబ్‌!
గోవింద్‌ఘాట్‌ నుంచి పూలలోయకి 12 కిలోమీటర్ల ప్రయాణం ఒక ఎత్తయితే, ఘంగారియా నుంచి హేమకుండ్‌ వరకూ ఉన్న ఐదు కిలోమీటర్ల దూరం మరో ఎత్తు. ఈ కిలోమీటర్ల లెక్క ఎప్పుడూ ఒకేలా ఉండదు. తరచూ కురిసే వర్షాల వల్ల ముందు ఉన్న దారి మూసుకుపోతుంటుంది. కొండరాళ్ల మధ్య నుంచి దారి చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. హేమకుండ్‌కి వెళ్లడం అంటే 4329 మీటర్ల ఎత్తుకి చేరుకున్నట్లే. కొండలు నిటారుగా ఉంటాయి. శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు ఆక్సిజన్‌ సిలిండర్లు వెంట ఉంచుకోవడం మంచిది. సన్నగా వాన పడటంతో వణుకు మొదలైంది. భగవన్నామ స్మరణ చేసుకుంటూ ప్రయాణం సాగించాం. మరో రెండుకిలోమీటర్ల తరవాత కొండల్లో బ్రహ్మకమలం మొక్కలు పూలతో కనిపించేసరికి మా ఆనందానికి హద్దులేకపోయింది. మేం వెళ్లింది సెప్టెంబరు మాసం కావడం వల్ల బ్రహ్మకమలాల్ని చూడగలిగాం. ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం వీటిని రక్షిత పూసంపదగా ప్రకటించింది. పూలను ఫొటోలు తీసుకున్నాం. మిగిలిన ప్రయాణం కష్టంగా ఉన్నా బ్రహ్మకమలాలు చూసుకుంటూ ప్రయాణం సాగించాం. మొత్తం అయిదు కిలోమీటర్లూ రెండున్నర గంటల్లో చేరుకున్నాం. 

గుర్రాలు దిగి, గురుద్వారాకి నడిచి వెళ్లాం. గురుద్వారా బయట లాంగరులో వేడి టీ, కిచిడీ, రోటీ కూర ఇస్తున్నారు యాత్రికులకి. గురుద్వారాకి పక్కన ఉన్న సరస్సే హేమకుండ్‌. 1960లో ఇక్కడ గురుద్వారా నిర్మించారు. నాటి నుంచీ ఏటా ఇక్కడ యాత్రికులకు ఉచిత భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతిరోజూ ఉదయాన్నే ఐదు కిలోమీటర్లు నడిచి వచ్చి ఇక్కడ వంటలు చేసి పెట్టే వాళ్ల శ్రద్ధను మెచ్చుకోకుండా ఉండలేం. రాత్రికి హేమకుండ్‌లో ఎవరూ ఉండకూడదనీ దేవతలు ఆ సరస్సులో స్నానం చెయ్యడానికి వస్తారనీ వాళ్లను చూసిన మనుషులు ప్రాణాలతో ఉండరన్నది స్థానికుల నమ్మకం. దాంతో మళ్లీ మధ్యాహ్నం కిందకి వచ్చేస్తారు. అయితే రాత్రిపూట అక్కడ ఆక్సిజన్‌ ఉండదు కాబట్టి మరణిస్తారనేది సైంటిస్టుల వాదన. సరస్సు చుట్టూ ఏడు కొండలూ(సప్తశృంగపర్వతం) వాటిమీద సిక్కుల మతపరమైన ధ్వజాలూ కనిపిస్తాయి. వీటిని నిశాన్‌ సాహెబ్‌ అంటారు. అక్కడికి సమీపంలో ఓ చిన్నబోర్డు మీద లక్ష్మణుడు తపస్సు చేసుకున్న ప్రదేశం అని రాసి ఉంది. ఆ ఎముకలు కొరికే చలిలో సిక్కులు ఆ సరోవరంలో స్నానాలు చేయడం ఆశ్చర్యం కలిగించింది. అక్కడి హాల్లోని పవిత్ర గంథ్రాన్ని దర్శించి, వేడి టీ తాగి ఘంగారియాకి బయలుదేరాం.

బదరీనాథ్ ధాం యాత్ర


బదరీనాథ్ ధాం యాత్ర

భారతదేశంలో ఉన్న ముఖ్యమైన తీర్థ స్థానాలలో ఒకటైన బదరీనాథ్ పేరు తెలియని హిందువు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. భారతదేశంలో నాలుగు ముఖ్యమైన యాత్రలైన రామేశ్వరం, ద్వారక, మధుర, బదరీనాథ్‌లను చార్‌ధాం యాత్ర అని అంటారు.

"ప్రతి హిందువు తమ జీవిత కాలంలో ఈ యాత్రలను చేసుకుంటే మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని తీర్ధ స్థానాలను దర్శించుకున్నంత పుణ్యం వస్తుంది. " అని ఆది శంకరులు అన్నారు.

చార్‌ధాంలలో వొకటైన బదరీనాథ్ ధాంని " విశాల్ బదరి " అని కూడా అంటారు. ఇది వైష్ణవుల 108 దివ్య దేశాలలో 107వ దివ్య దేశంగా, అతి పవిత్ర స్థలంగా చెప్పాబడింది. ప్రతీ సంవత్సరం అక్షయ తృతీయ నాడు మొదలయ్యే ఈ యాత్ర ఆశ్వీజ శుక్ల దశమి వరకు కొనసాగుతుంది.

దేశరాజధాని ఢిల్లి నుంచి సుమారు 520 కిమీ దూరంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఘరేవాల్ ప్రాంతంలో చమోలి జిల్లాలో వున్నది విశాల్ బదరి. ఢిల్లి నుంచి హరద్వార్, ఋషికేశ్ వరకు రైల్ మార్గం కుడా వుంది. అక్కడ నుంచి అంతా ఘాట్ రోడ్డు మీద ప్రయాణం సాగుతుంది. దేవప్రయాగ, శ్రీనగర్ (ఉత్తరా ఖండ్), రుద్రప్రయాగ్, కర్ణ ప్రయాగ్, నంద ప్రయాగ్, చమోలి, పిపల్ కోటి, జోషిమఠ్, గోవింద్ ఘాట్, పాండుకేశ్వర్ అనే ప్రాంతాల మీదుగా యీ ప్రయాణం సాగుతుంది.

సాధారణం గా మే, జూన్ మాసాలలో చాలా మంది యీ యాత్ర ప్లాన్ చేసుకుంటారు. ఆ రెండు మాసాలూ భక్తుల రద్దీ వుండడంతో వుండడానికి వసతి దొరకటం చాలా యిబ్బంది అవుతుంది అంతే కాకుండా దర్శనానికి కూడా చాలా సమయం చలిలో వేచి వుండవలసి వస్తుంది. జులై, ఆగస్ట్ నెలలు వర్షాలు కురుస్తాయి. కాబట్టి ఆ రెండు మాసాలు కూడా విడిచి పెడితే సెప్టెంబర్, అక్టోబర్ నెలలు ఈ యాత్రకి అనువుగా ఉంటాయి. మే, జూన్ నెలలలో ఉన్నంత చలి ఉండదు, వాతావరణం ప్లెజెంట్ గా ఉంటుంది. రద్దీ లేకపోవడంతో బదరీనాథునికి చేసే విష్ణు సహస్రనామ సేవ హారతి సేవలలో పాల్గొనవచ్చు.

ఉత్తరాఖంఢ్ రాష్ట్రంలోని చమోలి జిల్లాలో హిమాలయాలకూ, దేశ సరిహద్దుకు దగ్గరగా స్వఛ్ఛమైన జలాలతో ఉరుకులు పరుగులతో ప్రవహించే అలకనంద వొడ్డున ఉంది ఈ కోవెల. అలకనంద నది దాటగానే కుడి వైపున ఆది కేదార్ మందిరం, నారదకుండం, ఉష్ణ కుండం ఉంటాయి. బదరీనాధుని దర్శించుకొనే భక్తులు నారదకుండం దర్శించుకొని ఉష్ణకుండంలో స్నానాలు చేసుకొని ఆది కేదారేస్వరుని దర్శించుకొని బదరీనాధుని దర్శించుకుంటారు. కోవెల ముఖ్య ద్వారంలోకి ప్రవేశించగానే ఎడమచేతి వైపు చిన్న మందిరంలో లక్ష్మిదేవి కొలువై ఉంటుంది. అక్కడ నుంచి ఇంకా ముందుకి వెళితే వేదాంత దేశిక, రామానుజా చార్యుల మందిరాలను చూడొచ్చు. ఇంకొంచం ముందుకి వెళితే పెద్ద పెద్ద చెవులున్న రాక్షసుని విగ్రహం కనిపిస్తుంది. ఇతని పేరు గంఠాకర్ణుడని, ఇతడు అక్కడి క్షేత్రపాలకుడని రాసిన బోర్డ్ కనిపిస్తుంది. ప్రస్తుతం పాత విగ్రహానికి క్షతి కలగటంతో దాని స్థానే చిన్న విగ్రహం ప్రతిష్టించేరు.

అక్కడి పూజారులు గంటా కర్ణుని కధ యిలా చెప్తారు. వారు చెప్పిన ప్రకారం గంటాకర్ణుడు, రావణాసురుడు కుబేరునితో యుద్ధానికి వెళ్ళినపుడు అతని ముఖ్య సైన్యాధికారిగా ఉండేవాడని, ఆ యుద్ధములో రావణాసురుడు విజయం పొంది కుబేరుని సామ్రాజ్యమునకు గంటాకర్ణుని పట్టాభిషిక్తుని చేసి లంకకు వెళ్లిపోయెనట. గంటాకర్ణుడు కుబేరుని వద్దకు వెళ్లి అతని రాజ్యము అతనినే ఏలుకొమ్మని తాను శివ ధ్యానంలో గడుపుతానని కోరగా, కుబేరుడు వోడిన రాజ్యం తిరిగి తీసుకొనుట వీరుల లక్షణం కాదని రాజ్యభారం గంటాకర్ణునికే విడిచిపెట్టి కుబేరుడు 'మానా' గ్రామాన్ని ఆనుకొని ఉన్న కొండలలో తాను వొక కొండ రూపం ధరించెనని నేటికి కుడా కుబేరుడు ఆ పర్వతాలలో వొక పర్వతంగా ఉన్నాడని స్థానికుల నమ్మకం. గంటాకర్ణుడు దేవతలకు విధేయుడిగా పరిపాలన చేస్తూ తన భక్తితో శివుని మెప్పించి మోక్షాన్ని పొందుతాడు. గంటాకర్ణుని కోరిక మేరకు ఆ పెద్ద గంఠని దర్శించుకున్నవారికి కుడా మోక్షం కలిగేటట్లు శివుడు వరమిచ్చేడన్నది కధ. 2013లో సంభవించిన వరదలలో ఆ గంటకు గంటా కర్ణుని విగ్రహానికి క్షతి కలుగడంతో ఆరెండింటిని తొలగించేరు.

ఇక ఆదికేదార్ కధ
శివుడు పార్వతీ సమేతుడై యిక్కడ నివాసముండేవాడట. మహా భారత యుద్ధానంతరము విచలిత మనస్కుడయిన విష్ణుమూర్తి మహర్షుల సలహాను అనుసరించి తపస్సు చేసుకొనేందుకు అనువైన ప్రదేశాన్ని వెతుకగా విష్ణుమూర్తికి ఆదికేదార్ ప్రాంతం తపస్సాచరించుటకు అనువైనదిగా తోచుతుంది. కాని అప్పటికే శివ పార్వతులు అక్కడ నివాసముండుట చూచి ఆ ప్రదేశమును కపటము ద్వారా జయించి అక్కడ తపస్సు చేసుకోవాలని తలంచుతాడు. అందులో భాగంగా పార్వతీ పరమేశ్వరులు వ్యాహ్యాళికి పోవు మార్గంలో చిన్న బాలుని రూపంలో రోదిస్తూ ఉంటాడు. బాలుని పై జాలితో పరమేశ్వరుడు వారిస్తున్నా వినక పార్వతి ఆ బాలుని తమ నివాసానికి తెచ్చి సపర్యలు చేస్తుంది. మరునాడు పార్వతీ పరమేశ్వరులు వ్యాహ్యాళికి వెళ్లగా విష్ణుమూర్తి తపస్సమాధిలో మునిగిపోతాడు. తిరిగి వచ్చిన పర్వతీ పరమేశ్వరులు తేజోమూర్తి అయిన విష్ణు మూర్తిని చూచి జరిగిన మోసము గ్రహించి విష్ణుమూర్తికి యిష్ఠమైన శనగపప్పు ఆప్రదేశములో పండ కోడదనే శాపాన్ని పెట్టి ఇప్పటి కేదార్ కు చేరుకుంటారు. ఇక్కడ ఇతర పదార్ధములతో పాటు శనగ పప్పును నైవేద్యంగా సమర్పించడం కనిపిస్తుంది.

బదరీనాధ్ కోవెల దగ్గరనుంచి అలకనంద వొడ్డునే సుమారు వొక కిలొమీటరు దూరంలో విష్ణుమూర్తి బాలుని రూపంలో పార్వతికి లభించిన చోటును చూడొచ్చు.

వైకుంఠములో విష్ణుమూర్తిని కానక అతనిని వెతుకుతూ భూలోకానికి వచ్చిన లక్ష్మీదేవి ఆ కురుస్తున్న హిమపాతం మధ్యలో తపస్సమాధిలో ఉన్నవిష్ణుముర్తిని చూచి తాను బదరిక వృక్షముగా మారి తన స్వామిని హిమాపాతము నుండి కాపాడుతూ ఉంటుంది. కాలాంతరమున విష్ణుమూర్తి మనస్సు శాంతించగా ఇహలోకానికి వచ్చి తనరక్షణకై బదరికా వృక్షముగా అవతరించిన లక్ష్మిని గుర్తించి తాను ఆ ప్రదేశములో బదరీనాధునిగా పిలువబడి పూజింపబడతానని చెప్పెను.

గర్భ గుడిలో రెండు చేతులలో శంఖు, చక్రాలు ధరించి యోగముద్రలో తామరపువ్వుపై కూర్చున్న నాలుగు చేతుల బదరీనాధుని విగ్రహంతో పాటు కుబేరుడు, నర నారాయణులు, నారదుడు, గరుత్మంతుడు, ఉద్దవుడు, నవదుర్గలు మిగతా కొన్ని దేవతా మూర్తులను చూడొచ్చు.

బదరీనాథ్ కోవెలకి అరకిలొమీటరు దూరంలో బ్రహ్మ కపాలంలో చనిపోయిన వారికి పిండ ప్రదానం చేస్తే చనిపోయిన వారికి ఊర్ధ్వలోక ప్రాప్తి కలుగుతుందని చెప్తారు. బ్రహ్మ నాలుగో ముఖం అన్నీ తప్పుడు మాటలు మాట్లడేదట, దానికి ఆగ్రహించిన విష్ణుమూర్తి తన చక్రంతో ఆ తలను ఖండించగా అది భూలోకంలో ఇక్కడ పడిందట.

బదరీనాథ్ నుండి భారత దేశపు సరిహద్దు ఆఖరు జనావాస గ్రామంగా పిలువా బడే "మానా" గ్రామం మూడు కిలోమీటర్ల దూరంలో వుంటుంది.

భారత దేశపు ఆఖరి టీ దుకాణం లో వేడివేడి తీ తాగి సేద తీరి వినాయకుడి గుహ, వ్యాస గుహల్ని దర్శించు కోవచ్చు. వ్యాస గుహలో వ్యాసుడు కూర్చొని మహాభారత కధ చెప్పగా వినాయకుడు గణేశ గుహలో కూర్చొని మహాభారతాన్ని రచించెనని చెప్తారు. వ్యాసగుహకు కొద్ది దూరం లో భీంపుల్ దగ్గర ఉదృతంగా ప్రవించే సరస్వతీ నది కొద్ది అడుగుల దూరంలో అంతర్వాహిని అయిపోతుంది. పెద్ద శబ్దం తో ప్రవహిస్తూ తన మహాభారత రచనకు ఆటంకం కలిగిస్తున్న సరస్వతిని హోరు తగ్గించుకోనమని వ్యాసుడు కోరగా సరస్వతి నది వ్యాసుని మాట పెడ చెవిన పెట్టడంతో వ్యాసుడు అంతర్వాహిని కమ్మని శాపమిస్తాడు. యిక్కడ అంతర్వాహిని అయిన సరస్వతీ నది తిరిగి అలహాబాద్ లో పైకి వచ్చి గంగా, యమునలతో సంగమిస్తుంది.

భీమ్ పుల్ నుంచి వొక కిమీ దూరంలో చిన్న మహాలక్ష్మి మందిరం చూడొచ్చు విష్ణుమూర్తిని వెతుకుతూ వచ్చినప్పుడు లక్ష్మీ దేవి మొదట కాలు పెట్టిన ప్రదేశంగా చెప్తారు. రెండు కిలోమీటర్లు నడిచి వెళితే ద్రౌపతి సమాధిని చూడొచ్చు. అక్కడి నుంచి మరో కిలోమీటరు నడిస్తే కుంతీదేవి సమాధి చూడొచ్చు. కుంతీ దేవి సమాధి నుంచి " వసుధార " మరో మూడు కోలోమీటర్ల దూరం వుంటుంది. కాని వసుధార వరకు వెళ్ళాలంటే మిలటరీ పెర్మిషన్ తెచ్చుకోవాలి. అందుకే మేము కుంతీదేవి సమాధి వరకు వెళ్లి కూడా వసుధార వెళ్లలేకపోయేం. వ్యాస గుహ దగ్గర వున్న కొండలపై వో గుఱ్ఱం ఆకారం కనిపిస్తుంది. అది విష్ణు మూర్తిని దివి నుంచి భువికి తెచ్చిన గుఱ్ఱంగా చెప్తారు. వ్యాస గుహ దగ్గర వున్న స్థానికులని ఎవరిని అడిగినా దీనిని చూపిస్తారు.

యింకా యిక్కడ చూడ వలసిన ప్రదేశాలు యివి నవదుర్గా మందిరం, శివకోవెల, చరణ పాదుక, ఊర్వశి మందిరం, పంచ శిలలుగా చెప్పబడే నర శిల నారాయణ శిల, నారద శిల, గరుడ శిల, వరాహ శిల, పంచ ధారలుగా చెప్పే నాలుగు వేద ధారలు, వసుధారలు.

బదరినాథ్ మందిర ప్రాంగణం లోంచి వెనుక వైపుకి చూస్తే నరశిల, నారాయణశిల కనిపిస్తాయి, వాటిపైన కాషాయరంగు పతాకాలు వుండడం కూడా గమనించ వచ్చు. నారదశిల, గరుడశిలలు ఉష్ణకుండం దగ్గర చూడొచ్చు. వరాహశిలఅలకనంద నది దాటి మందిరానికి వచ్చేటప్పుడు అలకనంద నదిలో కుడివైపున చూడొచ్చు.

వేదధారలుగా పిలువబడే నాలుగు ధారలు మానా గ్రామం వెళ్ళే దారిలో కొండల మీంచి రోడ్డు మీదకు ప్రవహిస్తూ కనిపిస్తాయి. వసుధార భీంపూల్ దగ్గర నుంచి దూరంగా కొండలలో వాతావరణం బాగుంటే కనిపిస్తుంది.

ఊర్వశి మందిరం
సతీదేవి మొక్క 108 పీఠాలలొ యిది వొకటి. యిక్కడ సతీ దేవి యొక్క ఊరువు భాగం పడిందని అంటారు. యీ ప్రదేశం లోనే విశ్వామిత్రుని ఊరువులనుంచి ఊర్వశి వుద్భవించిందని అంటారు. యీ మందిరం చాలా చిన్నది. యిది బదరీనాథ్ గ్రామంలో వుంటుంది. స్థానికులు దీనిని 'ఊర్వశి మాతా మందిర్ ' గా వ్యవహరిస్తారు.

చరణ్ పాదుక -- బదరీనాథ్ కోవెల వెనుక వైపునుంచి కాలి బాటన వెళితే స్వఛ్చమైన నవ్వు మొహాలతో ఆప్యాయంగా పలుకరించి టీ తాగండి ,భోజనం చేసి వెళ్ళండి అని పిలిచే స్టానికుల యిళ్ల మధ్య నుంచి వెళ్ళితే కొంత దూరంలో " అఘొరీ బాబా ఆశ్రమం " కనిపిస్తుంది. దానిని దాటుకొని స్వచ్చమైన సెలయేరు ప్రక్కగా పచ్చని కొండ చరియలలో ప్రయాణం చేస్తూ నాలుగు కిలోమీటర్లు నడిస్తే చరణ్ పాదుక చేరుకోవచ్చు. యిక్కడ నారాయణుడు తన పాదరక్షలు విడిచి పెట్టి ఆదికేదార్ వెళ్ళేడనేది యిక్కడ ప్రచారంలో వున్న కధ.

శంకరాచార్యులు బదరీ నాథ్ గురించి వేదాలలో చదివి యీ ప్రదేశాన్ని వెతుక్కుంటూ వచ్చి విగ్రహాలు నారద కుండంలో వున్నట్లు తెలుసుకొని వాటిని బయటికి తీయించి తిరిగి ప్రతిష్ఠించి పూజలు చేసి తనతో కుడా వచ్చిన నంబూద్రి బ్రాహ్మణులను నిత్య పూజాది కార్య క్రమాలు నిర్వర్తించుటకు నియమించెనని చెప్తారు. యిప్పటికి యిక్కడ నంబూద్రి వంశస్తులే పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శంకరా చార్యులచే నిర్మించ బడ్డ యీ దేవాలయం రెండు మూడు మార్లు జరిగిన ప్రకృతి విపరీతాలకు నేలకూలిందని అంటారు. 2013 లో సంభవించిన వరదలలో యీ కోవెలకు ఎక్కువ హాని జరుగలేదు.

ఈ యాత్ర సంవత్సరంలో ఆరు నెలలు మాత్రమే జరుగుతుంది. మిగతా ఆరునెలలు కోవెల తలుపులు మూసివేస్తారు. యీ ప్రాంతంలో కార్తీక మాసం మొదలు వైశాఖ మాసం వరకు హిమపాతం విపరీతంగా వుండడంతో యిక్కడి ప్రజలు యీ ఆరునెలలు ఆణి మఠ్, జోషిమఠ్ లలో గడుపుతారు. యీ ఆరునెలలు బదరీ నాథుని మూర్తులను ఆణి మఠ్ లో వున్న కోవెలలో వుంచి పూజలు నిర్వహిస్తారు. యీ కోవేలని వృద్ద బదరి అని అంటారు. వైశాఖ మాసంలో వచ్చే శుక్ల తదియ నాడు బదరీ కోవెల తలుపులు ఆ జిల్లా కలెక్టర్ సమీపంలో తెరుస్తారు. తలపులు మూసినప్పటి అఖండ దీపం ఆరునెలల తరువాత కూడా వెలుగుతూ వుండడం వో విశేషం. ఆ రోజున అఖండ దీపం దర్శించు కోడానికి ప్రపంచ నలుమూలాల నుంచి వేలాది భక్తులు తరలి వస్తారు.

ఉత్తరాఖండ్ యాత్రలు చేసుకోనే వారికి ముఖ్యంగా చేసే సూచన యేంటంటే తగినన్ని వులెన్స్ పట్టుకు వెళ్ళడం, అందాజుగా వారం రోజులు యాత్ర అంటే మరో నాలుగు రోజులు కలుపుకొని అన్ని రోజులకు సరిపడే విధంగా ప్రణాళిక వేసుకుంటే మంచిది. యెటువంటి ప్రాకృతిక విపత్తులు లేకుండా యాత్ర జరిగితే మంచిదే కాని పర్వత ప్రాంతాలలో వాతావరణంలో హెచ్చు తగ్గులు విపరీతంగా  ఉంటాయి. అన్నింటికీ తగు జాగ్రత్తలు తీసుకోవడం విజ్ఞుల లక్షణం.

యాత్రలు ఎందుకు చెయ్యాలి అంటే మనిషిలో సహన శక్తిని పెంచుతుందట. భగవన్నామ స్మరణతో యాత్ర మొదలు పెట్టండి.

కర్రా నాగలక్ష్మి