Friday, 1 June 2018

కేరళ సౌందర్యం

పడమటి కనుమల్లో.. తొలకరి జల్లుల్లో..
ఊరూరా సెలయేళ్లు. ఓచోట ముందుకు ఉరికే నదీనదాలు. మరోచోట వెనక్కి మళ్లిన సాగర జలాలు. ఈ వాగుల్లోకి వంగి చూస్తూ పొంగిపోయే కొబ్బరి చెట్లు.. ఇదీ కేరళ సౌందర్యం. ఎన్నెన్నో అందాలు తురుముకున్న పడమటి కనుమలు.. తొలకరి జల్లుల్లో మరింత సౌందర్యాన్ని సంతరించుకుంటాయి. రుతురాగాల వేళ.. కమ్ముకొచ్చే కారుమబ్బులు.. అమాంతంగా కురిసే వానజల్లులు.. వెల్లివిరిసే హరివిల్లులతో మలయాళసీమ మరింత మనోహరంగా దర్శనమిస్తుంది. ఆ సహజ సౌందర్యాన్ని ఆస్వాదించాలనుకుంటున్నారా.. కేరళలోని ఈ ప్రాంతాలకు వెళ్లిరండి మరి.
హరిత భరితం వయనాడ్‌
యనాడ్‌ జిల్లా వానల రాకతో కడిగిన ముత్యంలా మెరిసిపోతూ దర్శనమిస్తుంది. కాబిని, పనమరామ్‌ నదుల మధ్య ఉన్న వయనాడ్‌లో సారవంతమైన నేలలు ఎక్కువ. ఈ జిల్లా సముద్రమట్టానికి 700 నుంచి 2100 మీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. అటవీ విస్తీర్ణం ఎక్కువే. వయనాడ్‌ జిల్లా పరిపాలనా కేంద్రం కల్పెట్టా. ఆదివాసీలు ఎక్కువగా ఉంటారిక్కడ. కాఫీ, టీ తోటలు కనిపిస్తాయి. సుగంధ ద్రవ్యాలు విశేషంగా పండిస్తారు. కొండలు, లోయలు, మైదానప్రాంతాలు, కాలువలు.. ఇలా ఈ ప్రాంతమంతా హరిత భరితమే.
 
ఎలావెళ్లాలి?
* వయనాడ్‌కు సమీపంలో ఉన్న రైల్వేస్టేషన్‌ కొజికోడ్‌ (85 కి.మీ). హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్టణం నుంచి కొజికోడ్‌కు రైళ్లు (వీక్లీ) అందుబాటులో ఉన్నాయి. ఇక్కడి నుంచి కల్పెట్టాకు బస్సులు, ట్యాక్సీలో వెళ్లొచ్చు.
* ఎర్నాకులం, త్రిశూర్‌, కొచ్చి, తిరువనంతపురం నుంచి కూడా వయనాడ్‌ జిల్లా కేంద్రానికి బస్సులు, ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి.
* హైదరాబాద్‌, బెంగళూరు నుంచి వయనాడ్‌కు ట్రావెల్‌ బస్సులు కూడా నడుస్తున్నాయి.
వయల్‌ (వరి పంటలు), నాడ్‌ (ప్రాంతం) వరి అధికంగా పండే ప్రాంతం కావడంతో దీనిని వయల్‌నాడ్‌ అంటారు. అదే వయనాడ్‌గా స్థిరపడింది  
చూడాల్సినవి
వయనాడ్‌ వణ్యప్రాణి 
సంరక్షణ కేంద్రం
కురువా ద్వీపం, కాబిని నది 
బాణాసుర సాగర్‌
మీన్‌ముట్టి జలపాతం
లక్కిడీ వ్యూపాయింట్‌
నీలిమల వ్యూ పాయింట్‌, చెంబ్రా పీక్‌
సంద్రమంత సంతోషం కోవలం
* కోవలం బీచ్‌ సాహస క్రీడలకు కేరాఫ్‌గా నిలుస్తోంది. కోవలం సర్ఫింగ్‌ క్లబ్‌ నిర్వాహకులు యాత్రికులకు సర్ఫింగ్‌ శిక్షణ కూడా ఇస్తుంటారు.
ఎలావెళ్లాలి?
* ముందుగా తిరువనంతపురం చేరుకోవాలి. అక్కడి నుంచి సులభంగా కోవలం వెళ్లొచ్చు.
కోవలం అంటే ‘కొబ్బరిచెట్ల వనం’ అని అర్థం. కేరళ అనగానే నారికేళ వృక్షాలే కళ్లముందు కదలాడుతాయి. కోవలంలో మరింత ఎక్కువగా కనిపిస్తాయి. కేరళ రాజధాని త్రివేండ్రం నుంచి 17 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ పర్యాటక కేంద్రం సముద్ర తీరాలకు పెట్టింది పేరు. ఒకప్పుడు చేపలవేటకు ప్రసిద్ధిగా ఉన్న ఈ ప్రాంతం 1970 నుంచి పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందింది. హిప్పీలు తమ కార్యకలాపాలకు దీనిని అడ్డాగా మలుచుకోవడంతో ట్రావెలోకంలో కోవలం పేరు వినిపించడం మొదలైంది. కేరళలోని సుందర ప్రదేశాలకు దీటుగా ఇప్పుడు పర్యాటకులను అలరిస్తోంది. ఏడాది పొడవునా కోవలంలో పర్యాటకుల రద్దీ కనిపిస్తుంది. రుతుపవనాల వేళ తీరం వెంబడి చల్లటి గాలులు వీస్తుంటాయి. ఆకాశంలో నల్లని మబ్బులు బారులు తీస్తాయి. చిరుజల్లులు మొదలయ్యాక మనసులో సంతోషం సంద్రమంత ఉప్పొంగుతుంది.  
చూడాల్సినవి
లైట్‌హౌస్‌ బీచ్‌
హవా బీచ్‌
సముద్ర బీచ్‌
కోవలం చేపల మార్కెట్‌
వెల్లయానీ సరస్సు
తిరువనంతపురం 
వానలో.. నావలో..  అలెప్పీ
నీటిపై తేలియాడుతున్నట్టుండే అలప్పుజా(అలెప్పీ)కు ‘తూర్పు వెనీస్‌’ అన్న పేరుంది. అలెప్పీలో అడుగడుగునా కాలువలే. వాటిలో తేలికపాటి తెప్పలతో మొదలుపెడితే.. రాజభవనాన్ని మరిపించే హౌస్‌బోట్ల వరకు రకరకాలు కనిపిస్తాయి. కాలువ గట్లు ఆకుపచ్చ తివాచీ పరచినట్టు పచ్చగా ఉంటాయి. కొబ్బరిచెట్ల ఆకులు ఈ కాల్వలకు గొడుగు పడుతుంటాయి. సహజ సౌందర్యంతో కనువిందు చేసే అలెప్పీలో సకుటుంబ సమేతంగా హౌస్‌బోట్‌లో విహరిస్తే అంతకన్నా ఆనందం ఏముంటుంది. ఇక్కడి వెంబనాడ్‌ సరస్సు సౌందర్యం గురించి ఎంత చెప్పిన తక్కువే. ఈ సరస్సులో పతిరమన్నాల్‌ ద్వీపంలో విహరించకుండా పర్యాటకులు తిరుగు ప్రయాణమవ్వరు. కాలువలు, సరస్సులే కాదు.. బీచ్‌లతో కూడా అలరిస్తుంది అలెప్పీ!
ఎలా వెళ్లాలి?
* విజయవాడ, విశాఖపట్టణం నుంచి అలెప్పీకి నేరుగా రైళ్లు అందుబాటులో ఉన్నాయి.
* సికింద్రాబాద్‌ నుంచి ఎర్నాకులం వరకు రైళ్లో వెళ్లి.. అక్కడి నుంచి బస్సులో అలెప్పీ (58 కి.మీ) చేరుకోవచ్చు.
* అలెప్పీ సమీపంలో కొచ్చి విమానాశ్రయం ఉంది. హైదరాబాద్‌ నుంచి కొచ్చీకి నాన్‌స్టాప్‌ విమాన సర్వీసులు ఉన్నాయి. విజయవాడ, విశాఖల నుంచి సింగిల్‌స్టాప్‌ సర్వీసులు ఉన్నాయి.
చూడాల్సినవి
అలెప్పీ బీచ్‌
కృష్ణపురం బీచ్‌
అలెప్పీ లైట్‌హౌస్‌
ముళ్లక్కల్‌ దేవీ ఆలయం
అంబలపుజా దేవాలయం
తనువెల్లా హరివిల్లు  తెన్మల
గరాల రణగొణ ధ్వనులకు దూరంగా.. కీచురాళ్ల ఇచ్చికాలకు దగ్గరగా.. ఉన్న మనోహరమైన సీమ తెన్మల. కొల్లం నగరానికి 66 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనదేశంలో తొలి పర్యావరణ యాత్రా కేంద్రంగా గుర్తింపు పొందిన పర్యాటక ప్రదేశమిది. తెన్మల అంటే తేనె గుట్ట అని అర్థం. ఒకప్పుడు ఇక్కడి చెట్టు, పుట్ట, గుట్ట తేనెపట్టులతో అలరిస్తూ ఉండేది. ఇప్పుడన్ని తేనెటీగలు లేవనుకోండి. కానీ, ఇక్కడి వనంలో ఔషధ గుణాలు కలిగిన మొక్కలు, చెట్లు దండిగా ఉన్నాయి. తొలకరి పలకరింపుతో తెన్మల తనువెల్లా హరివిల్లు విరబూస్తుంది. ప్రకృతి ఆరాధకులు తప్పకుండా సందర్శించాల్సిన ప్రదేశం ఇది. సాహస యాత్రికుల కోసం ట్రెక్కింగ్‌, రాక్‌క్లైంబింగ్‌ వంటి ఆటలూ అందుబాటులో ఉన్నాయి.  భారీ వృక్షాల మధ్య నుంచి నేలకు పాతిక అడుగుల ఎత్తులో నిర్మించిన ప్రత్యేక మార్గంపై నడక మధురమైన అనుభూతినిస్తుంది.
ఎలా వెళ్లాలి?
* కొల్లం నుంచి తెన్మలకు 66 కి.మీ దూరం. తిరువనంతపురం 72 కి.మీ. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్టణం నుంచి కొల్లం, తిరువనంతపురానికి రైళ్లు అందుబాటులో ఉన్నాయి. అక్కడి నుంచి బస్సులోగానీ, ట్యాక్సీలో గానీ తెన్మల చేరుకోవచ్చు.
* హైదరాబాద్‌ నుంచి తిరువనంతపురానికి నాన్‌స్టాప్‌ విమానసర్వీసులు అందుబాటులో ఉన్నాయి. విజయవాడ, వైజాగ్‌ నుంచి కనెక్టింగ్‌ సర్వీసులు ఉన్నాయి.
చూడాల్సినవి
లీజర్‌ జోన్‌
నక్షత్రవనం
తెన్మెల డ్యామ్‌
బటర్‌ఫ్లై సఫారీ
వేలాడే వంతెన
షెండుర్ని వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
పాండవుల గుహ

No comments:

Post a Comment