Friday, 15 June 2018

కోరింగ అభయారణ్యం


కోరింగ.. పిలవంగ

చుట్టూ దట్టమైన చెట్లు.. మధ్యలో చిత్తడి నేలపై నిర్మించిన చెక్కల వంతెన.. ఓ పక్క సముద్రంలో కలుస్తున్న గోదావరి సోయగాలు.. చెట్టు కింద ఆహారం కోసం తచ్చాడుతున్న నీటి పిల్లి.. చెట్టుపైన పొందికగా కట్టుకున్న గూడులో నుంచి తొంగి చూసే ఎలుక... ఇవన్నీ చూడాలంటే తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలో ఉన్న కోరింగ అభయారణ్యానికి వెళ్లాలి.

ఒకప్పుడు సముద్ర వాణిజ్య కార్యకలాపాల్లో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన కోరింగ.. ఇప్పుడు ప్రముఖ పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో కనుమరుగైన ఈ పోర్టు తిరిగి కోరింగ అభయారణ్యంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. 235.7 చదరపు కిలోమీటర్లు విస్తరించిన మడ అడవులు.. కోరింగను ప్రకృతి సౌందర్యానికి పట్టుగొమ్మగా నిలబెట్టాయి. పక్షులు, జంతువులు, జలచరాలు.. ఈ వనాన్ని జీవవైవిధ్యానికి ఆవాసంగా మార్చాయి. 1998లో అభయారణ్యంగా ప్రకటించిన తర్వాత కోరింగ పర్యాటకంగానూ అభివృద్ధి చెందుతూ వస్తోంది. చిరుజల్లుల వేళ.. సుందరవనాలు (మడ అడవులు) మరింత మనోహరంగా కనిపిస్తాయి.

పక్షుల విడిది
వలస పక్షుల విడిదిగా కోరింగ విలసిల్లుతోంది. శీతాకాలంలో 239 జాతులకు చెందిన సుమారు 88 వేల పక్షులు సంతానోత్పత్తి కోసం ఇక్కడికి వస్తుంటాయి. గౌరు కాకులు, హిమాలయాల్లో ఉండే బ్రాహ్మణి కైట్‌, స్టార్క్‌ కొంగలు, కింగ్‌ఫిషర్‌ పక్షులు ఎక్కువగా వలస వస్తాయి. గోదావరి, సముద్రం సంగమించే ఈ ప్రాంతమవ్వడంతో ఇక్కడి తీపి, ఉప్పు కలయికతో మిశ్రమ లవణ సాంద్రత ఉంటాయి. అందుకే ఈ నీటిలో విభిన్న జాతులకు చెందిన జలచరాలు మనుగడ సాగిస్తున్నాయి. 575 రకాల చేప జాతులను గుర్తించారు. చిత్తడి నేలలో మండపీతలు, పాములు అధికంగా ఉంటాయి. అంతేకాదు ఇక్కడ ఎలుకలు కూడా పక్షులతో పోటీగా చెట్లపై గూళ్లు కట్టుకోవడం విశేషం. కోరింగ పరిధిలో ఉన్న 32వ నీటిపాయ లోనికి వెళ్తే చెట్లపై ఎలుకలు కట్టుకున్న గూళ్లు కనిపిస్తాయి.

చిక్కటి అడవిలో చెక్క వంతెన
కోరింగ వనాల్లో.. 35 రకాల మడజాతి వృక్షాలు ఉన్నాయి. నల్లమడ, తెల్లమడ, బిల్లమడ వృక్షాలు కనిపిస్తాయి. వనంలో నీటి కుక్కలు, నీటి పిల్లులు, బంగారురంగులో ఉండే నక్కలను చూడొచ్చు. చొల్లంగి గ్రామం దగ్గర అభయారణ్యానికి ప్రవేశం ఉంటుంది. కోరింగ గ్రామంలో మ్యూజియం, వసతి సముదాయాలు ఉన్నాయి. మడ అడవుల్లోని 32వ క్రీకు (నీటిపాయ)లో వివిధ రకాల పక్షి జాతులను వీక్షించే ఏర్పాట్లు ఉన్నాయి. కిందంతా చిత్తడి నేల ఉండటంతో నడవడం సాధ్యం కాదు. అందుకే అడవిలో విహరించడానికి చెక్క వంతెన ఏర్పాటు చేశారు. నాలుగు కిలోమీటర్ల మేర నిర్మించిన వంతెనపై కాలినడకన విహరిస్తూ.. వన సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు. క్రీకులో ప్రయాణించడానికి జెట్టీలు ఏర్పాటు చేశారు. 200 ఏళ్ల కిందటి పాతలైట్‌ హౌస్‌ను ఇటీవలే అభివృద్ధి చేశారు. యాత్రికులు బోట్‌లో వెళ్తారు. హోప్‌ ఐలాండ్‌ ఇక్కడ మరో ఆకర్షణ. నిండైన పచ్చదనంతో అలరించే ఈ ద్వీపానికి బోట్లలో చేరుకోవచ్చు.

వినోదంతో పాటు..
కోరింగ వచ్చే పర్యాటకులకు వినోదంతో పాటు విజ్ఞానం అందించే ఏర్పాట్లు చేశారు అధికారులు. అభయారణ్యం ప్రత్యేకతలను తెలిపేందుకు ఆడియో విజువల్‌ థియేటర్‌ను నిర్మించారు. 25 మంది ఒకేసారి ఇందులో కూర్చొని ఈ వీడియోలు, పర్యావరణ ప్రాధాన్యం వివరించే చిత్రాలు, పర్యాటక విశేషాలు తెలిపే డాక్యుమెంటరీ వీక్షించవచ్చు.
ఎలావెళ్లాలి?

కాకినాడ నుంచి చొల్లంగి సుమారు 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాకినాడ, సామర్లకోట నుంచి చొల్లంగికి బస్సులు, ప్రైవేట్‌ వాహనాల్లో వెళ్లొచ్చు.

No comments:

Post a Comment