Sunday, 24 June 2018

పడమటి కనుమలలో రైలు ప్రయాణం


పడమటి కనుమలలో హాయి హాయిగా!
మైమరపించే రైలు ప్రయాణం

దట్టమైన పడమటి కనుమలు.. కొండల్ని కప్పేస్తున్నట్లుగా కనిపించే మేఘాలు.. మార్గమధ్యలో అడవుల నడుమ పల్లెటూళ్లు.. ఎత్తైన కొండల మధ్యభాగంలో సొరంగాలు.. వర్షాలకు హోరెత్తుతూ కనిపించే సెలయేళ్లు.. ఏమాత్రం అలసట తెలియని ఎనిమిది గంటల ప్రయాణం.. అప్పుడే అన్ని సొరంగాలు పూర్తయ్యాయా అంటూ నిట్టూర్పు.. వెరసి బెంగళూరు - మంగళూరు రైలు ప్రయాణం. వర్షాకాలంలో వెళ్లేందుకే అనేక మంది ఎదురుచూస్తుంటారు. జూన్‌ వచ్చిందంటే చాలు ఎప్పుడెప్పుడు వర్షాలు ఆరంభమవుతాయా? మనం ఎప్పుడు బయలుదేరేద్దామా? అంటూ చిన్నారులే కాదు పెద్దలు కూడా వెయ్యికళ్లతో ఎదురుచూస్తుంటారు.

ఉదయం 7.00 గంటలైంది. (ఈ మార్గంలో మరో నాలుగు రైళ్లున్నప్పటికీ పడమటి కనుమల అందాల్ని చూసేందుకు ఇదే అత్యంత అనువైంది) తమకు కేటాయించిన ఆసనాల్లో స్థిరపడ్డారు. సీట్లు లభించని ప్రయాణికులు ఓపిగ్గా నిలుచునే పరిసరాల్ని చూస్తున్నారు. అప్పటికే యశ్వంతపుర ప్లాట్‌ఫారంపై సందడి తారాస్థాయికి చేరుకుంది. ఇంకెప్పుడా అని ప్రయాణికులు గడియారాల వైపు తరచూ చూసుకుంటున్నారు. సమయం 7.10 అయిందని తెలుసుకునేలోపే సిగ్నల్‌లో పచ్చలైట్‌ వెలిగింది. వెనువెంటనే గార్డ్‌ నుంచి ఈల శబ్దం వినిపించింది. మందగామిగా రైలు బయలుదేరింది. చూస్తుండగానే వేగం పుంజుకుంది. నగరంలోనే ఉన్న చిక్కబాణవార స్టేషన్‌లో ఒక నిముషంపాటు ఆగింది. తిరిగి ప్రయాణమైన రైలు ఈసారి నెలమంగల స్టేషన్‌లో కాసేపు విశ్రమణ. ఇక నగరం అక్కడితో పూర్తయిందనేలా గుంపులుగుంపులుగా కనిపించిన ఇళ్లు మాయమయ్యాయి. నెలమంగల తరువాత కుణిగల్‌, యడియూరు, బాలగంగాధరనాథ నగర స్టేషన్లు వచ్చాయి. ఆ తరువాత త్యాగమూర్తి బాహుబలి విగ్రహమున్న శ్రవణబెళగొళ స్టేషన్‌ చూడొచ్చు. దూరం నుంచే వింధ్యగిరి పర్వతాన్ని, శిఖరాగ్రంలో కనిపించే గోమటేశ్వరుడిని దూరం నుంచి మనసారా మొక్కుకున్నారు ప్రయాణికులు. ఆ తరువాత చెన్నరాయపట్టణ, హాసన్‌, సకలేశపుర స్టేషన్లలో రైలు ఆగింది. ఆగిన స్టేషన్లలో చక్కిలాలు, నిప్పట్లు, కారం బొరుగులు, పనస తొనలు... ఇలా రకరకాల తినుబండారాల్ని రైల్లోనే బుట్టల్లో విక్రయించే వ్యాపారుల నుంచి ప్రయాణికులు పోటాపోటీగా కొనుగోలు చేశారు. అప్పటి వరకు కనిపించిన సూర్యతాపం సకలేశపుర స్టేషన్‌ దాటగానే మేఘాల ప్రవాహానికి కరిగిపోయింది. సకలేశపుర స్టేషన్‌ నుంచి రైలు పరుగులు తీస్తుంటే కనిపించిన దృశ్యాలకు మాటల్ని కూర్చడం సాధ్యం కాదనిపించింది. అడవి మధ్యలో పెద్దపెద్ద గొట్టాలు కానవస్తాయి. బహుశా ఎత్తినహొళె ఎత్తిపోతల పథకం కోసం నిల్వ ఉంచినవేమో అనే భావన.

ఎత్తైన కొండలు.. సొరంగాలు.. వాటిల్లో దూసుకెళ్తుంటే కమ్ముకునే చీకట్లకు రైల్లో ఆబాలగోపాలం కేరింతలతో స్వాగతం పలికింది. అప్పుడే వర్షం వచ్చిందేమో సొరంగాలపై నుంచి హోరెత్తుతూ దూకుతున్న ధారలు దిగువన సెలయేళ్లుగా ప్రవహిస్తున్నాయి. దట్టమైన అడవుల మధ్య కనిపించే నదులు భలే గమ్మత్తుగా ఉన్నాయి. సొరంగంలో వెళ్తుంటే చిమ్మచీకట్లు... ఎప్పుడూ అలాంటి అనుభవం ఎదురవని ప్రయాణికులు ఓనమాలు రాని విద్యార్థి కాన్వెంట్‌లో కూర్చున్న తొలిరోజు ఎలాంటి అనుభూతిని అనుభవిస్తాడో అలాంటి భావనతో వింతగా చూస్తూ కనిపించారు. మొదటి పది సొరంగాలు వచ్చినప్పుడు పెద్దపెట్టున కేకలు పెట్టిన ప్రయాణికులు ఆ తరువాత నిశ్శబ్ద ప్రేక్షకుల్నా పరిసరాల్ని చూస్తుండిపోయారు. అలా ఏకంగా 77 సొరంగాల్ని, వందలాది వంతెనల్ని దాటుకుంటూ రైలు వెళ్తుంటే మూడు గంటల సమయం క్షణాల్లా గడిచింది. అడవుల్ని దాటుకున్న రైలు నిదానంగా ప్రయాణించడాన్ని చూస్తే ఏదో స్టేషన్‌ వస్తున్నట్లుగా అనిపించింది. అప్పటికి మధ్యాహ్నం 2.20 గంటలు - దూరం నుంచి సుబ్రమణ్యరోడ్‌ అనే బోర్డును చూసి మేం దిగాల్సిన స్టేషన్‌ వచ్చిందని తెలుసుకుని గబగబా కిందకు దిగేవారెందరో! అక్కడ అల్పాహారానికి 15 నిముషాలకు పైగా రైలు నిలుస్తుందని తెలుసుకుని మళ్లీ ఎక్కితే ఎలా ఉంటుందని నిట్టూరుస్తుండగా రైలు మంగళూరు వైపు బయలుదేరింది. ఇలాంటి అనుభవం కావాలనుకునేవారు జూన్‌ నుంచి వర్షాకాలం పూర్తయ్యేలోపు ఈ మార్గంలో ప్రయాణించాలండోయ్‌!

No comments:

Post a Comment