Wednesday, 27 June 2018

తిరుమల మెట్ల ప్రయాణం


ఆహ్లాదం తిరుమల మెట్ల ప్రయాణం

తిరుమల. తెలుగువారి జీవితంలో ఓ భాగం. జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా తిరుమల తిరుపతి సందర్శించని తెలుగు వారు ఉండరు. ఎన్నిసార్లు చూసినా కొత్తగా, సరికొత్తగా ఉండే పుణ్యక్షేత్రం. నిత్య కల్యాణం, పచ్చతోరణంలా కళకళలాడుతూ కనిపించే తిరుమలకు మెట్ల దారిలో వెళితే ఆధ్యాత్మిక అనుభూతి మాత్రమే కాదు, ఆరోగ్యం, ఆహ్లాదకరం కూడా.

ఉరుకులు పరుగుల నేటి నవనాగరిక, యాంత్రిక జీవితంలో మనిషికి కాసింత ఊరటనిచ్చే వాటిలో కుటుంబ సమేతంగా జరిపే విహార, తీర్థయాత్రలు ప్రధానమైనవి. 28 సంవత్సరాల నా పాత్రికేయ జీవితంలో కుటుంబ సమేతంగా తిరుపతి నుంచి శ్రీవారి మెట్ల దారిలో కాలినడకన తిరుమల చేరడం మధురానుభవం.


ఓ శనివారం డ్యూటీ చేసి, కాచిగూడ స్టేషన్లో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ ఎక్కడంతో తిరుమల తిరుపతికి మా కుటుంబ ప్రయాణం సాగింది. ఉదయం ఆరు గంటలకు తిరుపతి చేరాల్సిన మా రైలు.. మూడు గంటలు ఆలస్యంగా గమ్యస్థానం చేరింది.

చలో... శ్రీవారిమెట్లు
తిరుపతి బస్టాండ్‌లో అలిపిరి బస్సెక్కి శ్రీవారిమెట్ల స్టాప్‌లో దిగి ఉచిత లగేజీ కౌంటర్లో సామాన్లు భద్రపరిచాం. అనంతరం శ్రీవారి మెట్లమార్గం ద్వారా తిరుమలకు మా కుటుంబ అధిరోహణ యాత్ర ప్రారంభమయ్యింది.


పచ్చటి ప్రకృతి ఒడిలో ఠీవిగా నిలబడి, రారండంటూ ఆహ్వానంతో పాటు, సవాలు విసురుతున్నట్లుగా కనిపించే శేషాద్రి కొండల్లో... ఎన్నో వ్యయప్రయాసల కోర్చి నిర్మించిన 2,350 మెట్లు ఎక్కుతూ, తిరుమల చేరడంలో ఉన్న శ్రమ, ఆనందం కలగలిసిన అనుభూతిని ఎవరికి వారు వ్యక్తిగతంగా పొందాల్సిందే తప్ప మాటల్లో వర్ణించలేం.

పొలోమంటూ పిల్లలు, పెద్దలు
నాలుగేళ్ల పిల్లల నుంచి ఆరుపదుల పెద్దల వరకూ, ఆడమగ తేడా లేకుండా మెట్లదారిలో హరితవనాల సౌందర్యం, పిల్లగాలి వీచికల ద్వారా హాయిగా తాకిన శేషాద్రి వనాల పరిమళాలను అనుభవిస్తూ, ఆస్వాదిస్తూ తిరుమల దిశగా కదిలిపోవడం ఈ ఈ దారిలో నిత్యకృత్యం. సుదూర యాత్రలు చేసే బహుదూరపు బాటసారులను గుర్తు చేసుకొంటూ... ఒక్కోమెట్టూ ఎక్కుతూ ఆపసోపాలు పడేవారు కొందరైతే, ఇదేం కష్టమైన పని కాదంటూ చెంగు చెంగున లేడిపిల్లల్లా, కోడెదూడల్లా దూసుకుపోయే వారు మరికొందరు. 'మీకు హైబీపీ ఉంటే మెట్ల దారి నడక ప్రాణంతకం' అన్న ముందస్తు హెచ్చరికను పక్కన పెట్టి, బిక్కు బిక్కుమంటూ నడిచే భక్తులు కొందరైతే, తమ శరీరాన్ని మోయటమే కష్టంగా భావించే స్థూలకాయులు సైతం మెట్ల దారిలో పాట్లు పడటం స్ఫూర్తిదాయకంగా అనిపిస్తుంది.

900 మెట్లు చేరితే...
మెట్లదారిలో 900వ మెట్టు చేరగానే మేమున్నామంటూ భక్తుల నమోదు ప్రత్యేక కౌంటర్‌ ఉద్యోగులు పలుకరిస్తారు. తొమ్మిది వందల మెట్లు ఎక్కిన ప్రతి ఒక్క యాత్రికుడి/రాలి ఫోటోతీసి శ్రీవారి ఉచిత దర్శన అనుమతి పత్రాన్ని ఇస్తారు.

అప్పటివరకూ ఆడుతూ, పాడుతూ హాయిగా సాగిన మెట్లదర్శన భక్తులకు అసలు పరీక్ష 1600 మెట్లు చేరగానే ప్రారంభమవుతుంది. ఇక్కడి నుంచి ప్రారంభమయ్యే మెట్లను మోకాలి మెట్లుగా చెబుతారు. నిట్టనిలువుగా నిర్మించిన మెట్లను ఎక్కడం అంత తేలిక కాదు. నాలుగు మెట్లు ఎక్కడం, కాసేపు విశ్రాంతి, ఆ తర్వాత మరోనాలుగు మెట్లు... ఇలా భారంగా, ఓ పరీక్షలా సాగుతుంది. ప్రయాణం 2100 మెట్లు దాటిన తర్వాత మరో చెక్‌ పాయింట్‌లో యాత్రికుల ఫొటో పత్రాలను మరోసారి పరీక్షించి, టీటీడీ స్టాంపువేసి మరీ ఇస్తారు. ఇక్కడి నుంచి మిగిలిన 250 మెట్ల ప్రయాణం 'అదిగో.. అల్లదిగో శ్రీహరివాసమూ' అన్నట్లుగా... గోవింద, గోవిందా అంటూ సాగిపోతుంది. శ్రీవారి మెట్లలో ఆఖరి మెట్టుపైన ఉన్న మండపం చేరడంతో ప్రతి ఒక్కరికీ ఏదో సాధించామన్న సంతృప్తి, శ్రీవారి పాదాల చెంతకు చేరామన్న భరోసా కలుగుతాయి.

మెట్ల మార్గం ద్వారా తమ ప్రయాణం పూర్తి చేయడం ద్వారా ఫిట్‌నెస్‌ను బేరీజు వేసుకొనే యాత్రికులు చాలామందే కనిపిస్తారు. ఏడాదికి ఓ సారైనా మెట్లదారిలో తిరుమల చేరందే తమకు తృప్తి ఉండదని, గత కొద్ది సంవత్సరాలుగా ఇలా చేయడం జీవితంలో ఓ భాగం చేసుకొన్నామని చెప్పేవారూ కనిపిస్తారు.

ఎన్నో లాభాలు
తిరుపతి నుంచి బస్సులో వచ్చే యాత్రికులకంటే మెట్లదారిలో కాలి నడకన వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ప్రాధాన్యమిస్తోంది. మెట్ల దారిలో వెళ్లిన భక్తులు 24 గంటల వ్యవధిలో శ్రీవారి దర్శనం చేసుకొనే అవకాశం ఉంటుంది. ప్రత్యేక క్యూ ద్వారా ఉచితంగా దర్శనం లభిస్తుంది. అంతేకాదు. కాలినడక భక్తులకు 25 రూపాయల ఖరీదు చేసే ఉచిత లడ్డూను సైతం అంద చేయాలని నిర్ణయించింది.

రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన నిరుపేద భక్తులకు మెట్లదారి ప్రయాణం నిజంగా ఓ వరమే అని చెప్పాలి. తిరుపతి నుంచి తిరుమల చేరాలన్నా, తిరుమల నుంచి తిరుపతి రావాలన్నా ఒక్కొ యాత్రికుడు 90 రూపాయలు బస్సు చార్జీగా చెల్లించాలి. విపరీతంగా పెరిగిన చార్జీల భారం మోయలేని పేదయాత్రికుల్లో కాలినడకనే మెట్లదారిలో తిరుమల వచ్చి వెళ్లే వారి సంఖ్య రాను రాను పెరుగుతోందని టీటీడీ గణాంకాలే చెబుతున్నాయి. దీనికితోడు మెట్లదారి ప్రయాణాన్ని ప్రోత్సహించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టింది.

మంచీ - చెడూ
ప్రతి చోటా మంచీ, చెడూ ఉండటం సహజమే. దానికి 'తిరుమల తిరుపతి' ఏ మాత్రం మినహాయింపు కాదు. తిరుమల దేవస్థానం అన్నా, శ్రీవారన్నా భక్తి విశ్వాసాలున్న చాలా మందికి అంతులేని భక్తి. అయితే దేవస్థానం ఉద్యోగుల్లో కొంతమందికి మాత్రం దక్షిణల పైన కూడా భక్తి ఉన్నట్లు కనిపిస్తుంది. స్వామి వారి కల్యాణం క్యూ దగ్గర నానా హడావిడి చేస్తూ 'దగ్గర నుంచి కల్యాణం చూడండి'  అంటూ భక్తులను ప్రలోభపెట్టి, స్వామివారి సాక్షిగా దక్షిణ పేరుతో లంచాలు డిమాండ్‌ చేసే ప్రబుద్ధ ఉద్యోగులకూ కొదవలేదు.

అయినా కూడా దేశం నలుమూలల నుంచి అనునిత్యం తిరుమలకు వచ్చే వేల, లక్షల భక్తులకు టీటీడీ చేస్తున్న సేవలు అసమానం. తిరుమలలో 24 గంటలు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం, నిత్యాన్నదాన పథకాలను ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.

రెండున్నర గంటల మెట్ల నడక, ఎనిమిదిగంటల పాటు క్యూలో నిరీక్షణ, 80 సెకన్ల శ్రీవారి దర్శనంతో మా తిరుమల యాత్ర ముగిసింది.

చొప్పరపు కృష్ణారావు

No comments:

Post a Comment