Wednesday, 6 June 2018

అమర్‌నాథ్‌ యాత్ర


అమర్‌నాథ్‌ యాత్ర
(పహల్ గాం మీదుగా)
కర్రా నాగలక్ష్మి

శ్రీనగరు పట్టణానికి సుమారు 88 కిలో మీటర్లదూరంలో ఉన్న ప్రముఖ వేసవి విడిది పహల్ గాం. పహల్ గావ్ అనంతనాగ్ జిల్లాలో ఉంది. ఈ ఊరుకి అమర్‌నాథ్‌ యాత్రలో ప్రముఖ స్థానం ఉంది. అమర్‌నాథ్‌ యాత్రలో ముఖ్యపాత్ర ఉన్న 'ఛడీముబారక్ ' యీ దారిగుండా అమర్‌నాథ్‌ గుహకు తీసుకు వెళతారు. యాత్ర పూర్తయాకా తిరిగి యిదే మార్గం ద్వారా తీసుకొని వస్తారు.

శివ పురాణం ప్రకారం పరమ శివుడు పార్వతీ దేవికి అమరకథ చెప్పేందుకు అమర గుహకు వెళుతూ శివుని వాహనమైన నందిని యిక్కడ విడిచి పెట్టడం వల్ల యీ వూరుని ' బైల్ గావ్ ' గా పిలువ సాగేరు. కాలాంతరాన యిది పహల్ గావ్ గా మారింది.

పహల్ గావ్ వెళ్లే దారంతా కొండ ప్రాంతం, మంచి పంటనేల. కొండ క్రింద ప్రాంతాలలో మామిడి, బత్తాయి మొదలయిన పండ్ల తోటలు పర్వతాల యెత్తుపెరుగు తున్న కొద్ది యాపిల్, ఛెర్రి పండ్ల తోల మధ్యనుంచి ప్రయాణం అహ్లాదకరంగా ఉంటుంది. టాక్సీలో వెళ్లేవారు యీ తోటల దగ్గర ఆగి తోట యజమాని అనుమతితో తోటలు చూడొచ్చు. ఛెర్రీ లు ఆగష్టులో పండి కోతకొస్తాయి. యాపిల్స్ అక్టోబరులో కోత కొస్తాయి. ఇంకా పైకి వెళ్తున్న కొద్దీ అక్రోటు, బాదం తోటలు చూడొచ్చు. దేవదారు, కోనిఫర్ తోటలు రోడ్డుకి యిరువైపులా ఉండి మనకి స్వాగతం పలుకుతున్నాయా ? అనే భ్రమ కలిగిస్తాయి. కొండపైన జారుతున్న జలపాతాలు, పేరు తెలియని అడవి పక్షులు మన ప్రయాణపు బడలికను తెలియకుండా చేస్తాయి.

కనుచూపు మేర వరకు పచ్చని పచ్చిక బయలు, గలగల ప్రవహించే సెలయేళ్లు, అలా పచ్చికలో దేవదారు వృక్షాల కిందన నడుస్తూ కోనిఫర్ పూలను యేరుకుంటూ యెంతదూరం నడిచినా తనివి తీరదు. పర్యాటకుల సౌకర్యార్థం రోడ్లు వెడల్పు చెయ్యడం, హోటల్స్ అధిక సంఖ్యలో నిర్మించడం వల్ల 2014లో మేం వెళ్లినప్పుడు పచ్చిక బయళ్ల స్థానంలో ధూళి దుమ్ము, హోటల్స్ కనిపించి నిరుత్సాహాన్ని కలిగించేయి.

అయితే యిక యాత్ర లోకి వస్తే, జమ్ములో రిజిస్ట్రేషన్ చేసుకొని బస్సులో శ్రీనగరు మీదుగా పహల్గాం చేరుతాం. మేం మద్యాహ్నపు మూడింటికి పహల్గాం చేరేం మాతో బాటు బస్సులో వచ్చిన వారు ఆ రాత్రి అక్కడ బస చెయ్యాలనుకున్నారు. పర్వతాలలో ప్రయాణాలు యెక్కువగా వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది. ఆ రోజు యెక్కడా మబ్బులు లేవు, మరో నిముషంలో మబ్బులు కమ్మేయొచ్చు. అందుకే మేం పహల్గాంకి సుమారు పదహారు కిలో మీటర్ల దూరంలో ఉన్న'చందన వాడి' లో రాత్రి బస చెయ్యదలచుకున్నాం.

సుమారు అర కిలో మీటరు నడిచేక చిన్న బస్సులు యాత్రీకులను అక్కడకి 16 కిలో మీటర్ల దూరంలో ఉన్న ' చందన వాడి ' వరకు తీసుకు వెళుతున్నాయి, మేం కూడా వాటిలో ప్రయాణించి చందన వాడి చేరుకున్నాం. అక్కడ లంగరు నడుపుతున్న వారే యాత్రీకులకోసం రాత్రి బసకోసం ఉచిత టెంటులు నడుపుతున్నారు. అక్కడకు చేరగానే అడిగి మరీ మాకు కావలసిన ఆహారపదార్ధాలు యిచ్చేరు. బస్సు ప్రయాణానికి అలసిపోయిన మా శరీరాలను టెంటులో పడకల మీద చేర్చి సేదతీరసాగేం. అంతలోనే లంగరు నిర్వాహకులు టెంటులోకి వచ్చి ముందుగా పేరు నమోదు చేయించుకొని రజ్జాయిలు తీసుకోమని పిలిచేరు. చుట్టూరా చక్కని ప్రకృతి చుట్టూరా కొండలు కనుచూపు మేర వరకు పచ్చిక మైదానాలు చాలా అందంగా ఉండడంతో అలా కాసేపు పచ్చిక మీద నడచి వచ్చేం. అప్పటికి బాగా ఎండకాస్తూ ఉండడం వల్ల బాగా చెమట పట్టసాగింది యింత వేడిలో రజ్జాయిలు అవుసరమా? అని అనిపించి మేం వెళ్లలేదు. వాళ్లే వచ్చి రెండేసి రజ్జాయిలు యిచ్చి, సాయంత్రం ఆరింటికి లంగరు మూసేస్తారు కాబట్టి భోజనం ఆరులోపలే చెయ్యాలని, అలా తినలేని వారు భోజనం తీసుకొని తరవాత తినొచ్చునని చెప్పేరు. అయిదున్నర అయేసరికి సూర్యుడు అస్తమించడంతో మొదలయిన చలి అంతకంతకూ పెరగసాగింది. ఆరు తరువాత గుర్రాల వాళ్లు టెంటుకి వచ్చి బేరాలు చెయ్యసాగేరు. నడక మావల్లకాదు కాబట్టి మేం గుర్రాలను శేష నాగ్ వరకు మాట్టాడుకున్నాం. సుమారు పదమూడు పద్నాలుగు కిలో మీటర్ల దూరం ఒకే రోజులో ప్రయాణం అంటే కష్టం అన్న గుర్రపు యజమానిని వొప్పించి పొద్దున్న ఆరు లోపల బయలుదేరుదాం అని చెప్పేం. మా భోజనాలు చేసుకొని యేడుకల్లా నిద్రకివుపకరించేం.

యాత్ర మరునాడు మొదలు పెట్టబోతున్నాం అనే హుషారులో తొందరగా నిద్రపోయేం. శివుడు పార్వతితో అమర్‌నాథ్‌కి వెళుతూ ఈ ప్రదేశంలో తలపైనున్న చంద్రుణ్ణి విడిచిపెట్టాడని పౌరాణిక కథ.

పొద్దన్న అయిదున్నర కల్లా మేం మాట్లాడుకున్న గుర్రాలవారు వచ్చి మమ్మల్ని లేపేరు. అప్పటికే లేచిన లంగరు వాళ్లు టీ ఫలహారాల తయారీలో ఉన్నారు.

బాత్రూములేమీ లేవు బయట పళ్లు తోముకొని స్నానం వాయిదా వేసి టీ ఫలహారాలు కానిచ్చి ప్రయాణం మొదలు పెట్టేం.

సుమారు మూడు కిలో మీటర్ల యెగుడూ దిగుడూ దారిలో చందనవాడి నుంచి 2500 అడుగుల యెత్తు యెక్కి ' పిసు శిఖరం ' దాటాలి. చాలా కష్టంగా ఉంటుంది. వంకలు తిరిగిన యెగుడు దిగుడు కొండదారి మీద ప్రయాణం చాలా కష్టంగా ఉంటుంది. తరచు కురుసే వర్షాలకు జారిపడిన కొండరాళ్లను దాటుకుంటూ ప్రయాణంచాలి. ఈ పిసు శిఖరాన శివుడు తన శరీరంపైన ఉన్న విషజీవులను విడిచి పెట్టేడు.

సూర్యుడు మబ్బులలోనే ఉండిపోవడంతో మా ప్రయాణం మరింత అహ్లాదకరంగా మారింది. అక్కడనుంచి ' ఝాజీబల్ ' వరకు ఉన్న 5 కిలోమీటర్లూ దారి సాఫీగా యే యెగుడు దిగుబడులు లేక సాగింది. ఝాజీబల్ నుంచి నాగకోటి వరకు ఉన్న 2 కిలో మీటర్ల దారి కష్టమైనదని కావడంతో గుర్రాలమీంచి దిగి నడవాలి. దారి జారుడుగా ఉండడం వల్ల గుర్రాలు కూడా నిభాయించుకోలేవు. అందుకు ప్రతీ వారు యీ రెండు కిలో మీటర్లు నడిచే పూర్తి చెయ్యాలి. నాగకోటి లేక నాగర్ కోటిగా పిలువబడే యీ ప్రదేశంలో శివుడు తన శరీరం పైన ఉన్న నాగులను విడిచిపెట్టడు. నాగర్ కోటి నుంచి మరో కిలో మీటరు ప్రయాణం తరువాత రెండు కొండల మధ్యనుంచి నీలి రంగు సెలయేరు వస్తున్నట్లుగా శేషనాగు సరస్సు కనిపిస్తుంది.

శేషనాగ్ సరస్సు దగ్గర ఉన్న యేడు కొండలు శేషుడి పడగలని, శివుడు యిక్కడ శేషుడి విడిచి పెట్టేడని పురాణ కథ. శేషనాగ్ సరస్సుని చూస్తూ ఆ ప్రాంతం లో గల ప్రకృతికి పులకరించిపోతూ మరో రెండు కిలో మీటర్లు ప్రయాణించి శేషనాగ్ చేరేం. అప్పటికి చీకట్లు ముసురుతున్నాయి. మా గుర్రాలబ్బాయి దింపిన టెంటులో ₹600 ఒక మంచానికి యిచ్చి రెండు మంచాలు తీసుకున్నాం. సన్నగా వాన ప్రారంభించింది, అరకిలో మీటరు దూరంలో ఉన్న లంగరుకు వెళ్లి రాత్రి భోజనం చేసుకొనే సరికి వాన పెరిగింది. మేం మంచాల మీద రజ్జాయిల కింద పడుక్కున్నాం. వాన అంతకంతకూ పెరిగి కుంభవృష్టిగా కురవ సాగింది. మాతో పాటు టెంటులో ఉన్న మిగతా ముప్పై మందికి ఆరోజు యాత్ర లేదని తెలియడంతో తిండికి తప్ప మిగతా సమయం రజ్జాయిలోనే గడిపేము. మధ్య మధ్య లో వూసు పోడానికి కుశల ప్రశ్నలు, తరవాత భజనలు చేస్తూ గడిపేం. రాత్రి వాన నీరు టెంటులోకి ప్రవేశించేయి. మూడువందలుయిచ్చి కింద పడుక్కున్నవారి పడకలు తడిసిపోయేయి. కిందన నీరు మీదా టెంటు కారడం వల్ల తడి, చలి వల్ల రాత్రి యెవ్వరికీ నిద్ర లేదు.

మరునాడు కూడా వర్షం పడుతూనే ఉంది. అయితే ఉధృతం తగ్గింది. టెంటులో ఉండడానికి అద్దె రెండురెట్లు పెంచేరు టెంటు యజమానులు.

మూడో రోజు వాన తగ్గింది కాని దారి బురద అవడం వల్ల గుర్రాలని వెళ్లనివ్వలేదు. నడిచి వెళ్లేవారు టెంటులోంచి వెళ్లిపోయేరు. మేంనాలుగో రోజున ప్రయాణం తిరిగి ప్రారంభించేం. ఆరోజు మేం సుమారు 12 కిలోమీటర్లు ప్రయాణించి గుహ చేరుకొని దర్శనానంతరం సుమారు 18 కిలోమీటర్లు ప్రయాణించి బాల్టాల్ చేరాలన్నది మా ఆశ, అందుకని మేం ఉదయం 5 గంటలకి ప్రయాణం మొదలు పెట్టేం.

శేషనాగ్ నుంచి మా ప్రయాణం మహాగణ శిఖరం లేక గణేష శిఖరం అని పిలువబడే శిఖరం వైపు సాగింది. మొత్తం యాత్రలో యిదే కష్టమైన ప్రయాణం, యిక్కడ పరమశివుడు గణేషుడిని విడిచి పెట్టేడు.

ఈ ప్రాంతం లో మంచుకరిగి ప్రవహించే నీటితో బురదగా ఉంటుంది. ఇక్కడ నడవడం గుర్రాలకి, మనుషులకు కూడా చాలా కష్టంగా ఉంటుంది. కొన్ని చోట్ల గడ్డకట్టిన మంచుమీద కూడా ప్రయాణం సాగుతూ ఉంటుంది, గడ్డకట్టిన సెలయేళ్లు కావడం వల్ల కొన్ని చోట్ల పలుచని పొరలా గట్టిపడి కాలు పడగానే మంచు విరిగి మనిషి నీళ్లల్లో పడిపోయే ప్రమాదం ఉంటుంది అందుకే గుర్రాలవారు నడిచే చోట నడవాలి లేకపోతే మంచునీటిలో పడిపోవడం ఖాయం. గడ్డ కట్టిన మంచుమీద నడక తరువాత గణేషశిఖరానికి ప్రయాణం మొదలవుతుంది. యిక్కడ నుంచి నడక చాలా కష్టంగా మారుతుంది. ఒకటి యెత్తు యెక్కువగా ఉండడం, రెండు గాలిలో ఆక్సిజన్ శాతం చాలా తక్కువగా ఉండడం. ఇలాంటి సమయాలలో ముద్దకర్పూరం వాసన చూడమని పర్వతారోహకులు సలహా యిస్తారు. నడిచేవారు ట్వంటి- ట్వంటి ఫార్ములాని అనుసరిస్తారు, అంటే యిరవై అడుగులు నడిచిన తరువాత యిరవై దీర్ఘశ్వాసలు తీసుకోడాన్ని పర్వతారోహకులు ట్వంటి - ట్వంటి అని అంటారు. ఈ పర్వత శిఖరం 'పిసు శిఖరం' అంత యెత్తులేక పోయినా అప్పటికే శరీరం అలసిపోయి పోయి ఉండడం, గాలిలో ప్రాణవాయువు లోపించడం, కొండ ప్రాంతాలలో ఆకలి మందగించడం వల్ల సరైన ఆహారం తీసుకోక పోవడం వల్ల యెక్కడం కష్టమౌతుంది. గణేషశిఖరం దాటేక మాప్రయాణం బాబల్ శిఖరం వైపు సాగింది. శేషనాగ్ నుంచి బాబల్ శిఖరానికి సుమారు మూడు కిలో మీటర్లు ఉంటుంది. బాబల్ శిఖరాన్ని చేరుకోడానికి సుమారు మూడు గంటలు పడుతుంది. అప్పటికి మనం సుమారు 13800 అడుగుల యెత్తుకి చేరుకుంటాం.

బాబల్ శిఖరం మీంచి అమర్‌నాథ్‌ గుహ కనిపిస్తుంది కాని దారిలో మరో శిఖరాన్ని మనం యెక్కాలి. బాబల్ శిఖరం దగ్గర రెండు మూడు లంగరులు, బి.ఎస్.ఎఫ్ వారి మెడికల్ కేంపు ఉన్నాయి. గుర్రం దిగితే యెక్కడం వో పెద్ద ప్రశ్న గా ఉండడంతో ఆకలిగా ఉన్నా మేం దిగలేదు. కాని లంగరు వారు మా గుర్రాల దగ్గరకు వేడివేడి పాయసం, గోరు వెచ్చని నీరు అందించడంతో మా ప్రాణాలు లేచి వచ్చి మిగతా ప్రయాణం సుఖంగా చెయ్యగలగేం. గుప్పెడు టాఫీలు యిచ్చి నీరసంగా ఉన్నప్పుడు నోట్లో వేసుకోమని సలహా యిచ్చేరు. అక్కడనుంచి సుమారు 1.5 కిలోమీటర్లు ప్రయాణానంతరం 'మహాగణ శిఖరం' చేరుతాం. సుమారు 14500 అడుగులయెత్తుకి చేరుతాం. శివుడు యిక్కడ మిగతా గణాలను విడిచి పెట్టి పార్వతితో గుహ వైపు సాగిపోయేడు.

మహాగణశిఖరం నుంచి 1.5 కిలోమీటర్లు గడ్డకట్టిన అమరుగంగ నదిపైన ప్రయాణించి పౌష్ పత్రి చేరుకుంటాం. పోష్ పత్రి నుంచి సుమారు మూడు కిలో మీటర్ల యెగుడు దిగుడు దారిలో మెలికలు తిరిగిన దారిలో ప్రయాణించి పంచతరణి చేరుతాం. దీనిని సంగం అని కూడా అంటారు. యిక్కడ శివుడు తన ఢమురుకాన్ని విడిచి పెట్టినట్టుగా చెప్తారు. యిక్కడ నుండి సుమారు మూడు కిలోమీటర్లు కొంచం మట్టి కొండలమీద, గడ్డ కట్టిన మంచుమీద నడవాలి. పంచతరణి దగ్గర బాల్టాల్ నుంచి వచ్చే యాత్రీకులు కూడా కలుస్తారు. ఇక్కడ నుంచి యాత్రీకులు కాలినడకన వెళ్లాలి, గుర్రాలని ముందుకి అనుమతించరు.

ఆ మంచులో చలిలో నడుస్తూ గుహ చేరుకొని బాబా అమర్‌నాథ్‌ని దర్శించుకున్నాం.

తిరిగి వచ్చేటప్పుడు బాల్టాల్ మీదుగా సోనెమార్గ్ చేరుకొని అక్కడనుంచి శ్రీనగరు అక్కడ నుంచి టాక్సీలో జమ్ము చేరుకున్నాం.

అప్పట్లో బాత్రూములు ఉండేవి కావు కాని యిప్పడు టెంట్లలో నే అన్ని సదుపాయాలూ యేర్పాటు చేస్తున్నారు.

2002లో హెలీకాఫ్టర్ పంచతరణి వరకు ఉండేది. ప్రస్తుతం బాబల్ శిఖరం వరకు మాత్రమే నడుపుతున్నారు.No comments:

Post a Comment