Friday, 20 July 2018

చారిత్ర‌క‌, శిల్ప‌క‌ళా హంపిJuly 20, 2018


చారిత్ర‌క‌, శిల్ప‌క‌ళా హంపిదక్షిణ భారతదేశంలో అత్యంత ఖ్యాతి పొందిన ప్రాంతం కర్నాటకలోని హంపి. అద్భుతమైన కట్టడాలు, అరుదైన శిల్పకళా సౌందర్యాలు, ప్రకృతి సోయగాలు, నీటి పరవళ్ళు, సుందరమైన ప్రకృతి ఇలా.. పరవశించే ప్రదేశాల అందాలను ఆస్వాదించాలంటే హంపిని తప్పకుండా చూడాలి. ముఖ్యంగా చిన్నపిల్లలు, విద్యార్థులు ఇక్కడి పురాతన కట్టడాలు, నాటి రాజుల పాలనలోని వసతులు, సౌకర్యాలు, సాంప్రదాయాలు, ప్రమాణాలు వంటి అనేకమైన అంశాలను పరిశీలించవచ్చు. అందుకే విద్యార్థుల విజ్ఞానయాత్రలలో హంపి తప్పకుండా ఉంటుంది. శతాబ్దాల నాటి చరిత్రనూ అక్కడి కట్టడాలపై చూడొచ్చు. అందుకే ఆ చారిత్రక ప్రదేశంలో మనమూ ఈ వారం 'జర్నీ' చేద్దాం పదండి!!

పాఠశాలలకు మూడురోజులు సెలవులు రావటంతో హంపి వెళ్లేందుకు నేను, నా సతీమణి, ఇద్దరు పిల్లలు, అత్తగారితో కలిసి బయల్దేరాం. ఉదయం 7 గంటలకు అనంతపురం నుంచి కారులో బళ్లారి చేరుకున్నాం. కర్నాటక రోడ్డు సరిగా లేనందున 167 కిలోమీటర్ల హంపి చేరడానికి మూడున్నర గంటల సమయం పట్టింది. హంపికి చేరుకోవాలంటే కర్నాటకలోని అన్ని ప్రాంతాల నుంచీ బస్సు సౌకర్యం ఉంది. సందర్శకులు సాధారణంగా బెంగళూరు, బళ్లారి మార్గంగా వస్తుంటారు. ఎక్కడి నుంచి వచ్చినా ముందుగా హోస్‌పేటకు చేరుకుని, అక్కడి నుంచి హంపికి వెళ్లాల్సి ఉంటుంది. ఇదే క్రమంలో హుబ్లీ నుంచి గుంతకల్లు మీదుగా వెళ్లే రైళ్లు హోస్‌పేటలో ఆగుతాయి. అంటే, హంపికి చేరాలంటే రైలు మార్గమూ అందుబాటులో ఉన్నట్లే! హోస్‌పేట ప్రధానమైన వాణిజ్య కేంద్రంగా ఉండటంతో ఇక్కడ బస చేసేందుకు మంచి హోటళ్ళు అందుబాటులో ఉంటాయి. సందర్శకులు విరివిగా వస్తుండడంతో నార్త్‌, సౌత్‌తో పాటు డిమాండ్‌ ఉన్న వంటకాలను అందిస్తారు.

హోస్‌పేట నుంచి హంపికి 15 కిలోమీటర్లు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు బస్సులు ఈ మార్గంలో తిరుగుతాయి. హోస్‌పేట నుంచి హంపికి కడ్డిరాంపురం, కమలాపురం మీదుగా రెండు దార్లు ఉన్నాయి. కాలి నడకన హంపి చూడాలనుకునేవారు కమలాపురం మీదుగా వెళ్ళడం మంచిది.

శ్రీవిరూపాక్ష దేవాలయం 
హంపి ప్రాంతంలో చూడాల్సిన ప్రధాన సందర్శనా ప్రదేశం విరుపాక్ష దేవాలయం. ఈ పురాతన ఆలయానికి రెండు గోపురాలు ఉంటాయి. దేశాలయ ప్రధాన గోపురం 165 అడుగుల ఎత్తు, కిందిభాగం 20 అడుగులు వెడల్పు, 50 అడుగుల పొడవు కలిగి, పదకొండు అంతస్థులతో ఉంటుంది. దీనిని 'బీష్టప్పయ్య గోపురం' అని పిలుస్తారు. శ్రీకృష్ణదేవరాయలు పట్టాభిషేకం సమయంలో గోపురం, రంగమంటపం నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. దేవాలయ మహాప్రాంగణం 510 అడుగుల వెడల్పు, 120 అడుగుల పొడవు ఉంటుంది. దేవాలయ ప్రాంగణంలో అనేక చిన్న చిన్న దేవాలయాలతోపాటు వంటశాల, కార్యాలయం, పక్కనే రాతితో నిర్మితమైన నీటి కోనేరును చూడవచ్చు.

రాజ తులాభారం
విజయనగర కాలంలో దసరా పండగను ఘనంగా జరుపుకునేవారని చరిత్ర చెబుతోంది. పురంధరదాసుల మంటపం నుంచి పైకి వెళితే, రాతి స్తంభాలు ఒకదానిపై మరొకటి అమర్చి కనపడతాయి. దీనిని రాజతులాబారంగా పిలుస్తారు. మహానవమి నాడు ఇక్కడ ఒక త్రాసును కట్టి, ఒకవైపున రాజు మరోవైపున వజ్రవైడూర్యాలను తూచేవారని, వాటిని ప్రజలకు పంచేవారని చెబుతారు.

ఉగ్ర నరసింహ 
హంపిలో ఉగ్రనరసింహ విగ్రహం చాలా పెద్దది. దీని ఎత్తు సుమారుగా 22 అడుగులు. క్రీ.శ. 1528లో శ్రీ కృష్ణదేవరాయల కాలంలో ఒక బ్రాహ్మణుడిచే ఈ దేవాలయం నిర్మించినట్లు ఆధారాలున్నాయి. వజ్ర, వైడూర్యాలు ఉంటాయనే ఆశతో దుండగులు ఈ విగ్రహం చేతిని, కాలును ధ్వంసం చేశారట!

హజరా రామాలయం 
ఈ దేవాలయం అంతఃపురాన్ని పోలి ఉంటుంది. క్రీ.శ 1513లో దీనిని నిర్మించారు. ఈ దేవాలయానికి దక్షిణ భారతదేశంలో ఎంతో ఖ్యాతి ఉంది. దేవాలయం గోడలపై రామాయణం, పురాణాలను తెలిపే ప్రతిమలు, రాతలను నాటి శిల్పకారులు చెక్కారు. చూపరులకు ఈ దేవాలయ సందర్శన ఎంతో ఆసక్తిని, ఆశ్చర్యాన్ని కల్పిస్తుంది.

మహానవమి దిబ్బ 
రాజుల కాలంలో వినియోగించే రచ్చబండ ఇది. చతురస్రాకారంలో ఉండే ఈ రచ్చబండ 22 అడుగుల ఎత్తు, పై భాగంలో 80 అడుగుల వెడల్పు ఉంటుంది. కృష్ణదేవ రాయలు ఒడిశాపై విజయం సాధించిన సందర్భంలో దీనిని నిర్మించి నట్లు తెలుస్తుంది. ఈ దిబ్బను అప్పటి పోర్చుగీసు రాయబారి అతిసుందరంగా నిర్మించారు. ఈ దిబ్బ పైభాగం, కింద భాగంలో అప్పటి సంస్కృతులు తెలిపే శిల్పాలు దర్శనమిస్తాయి. దీని ఎదురుగా సుమారుగా 20 గజాల దూరంలో నల్లరాతి కళ్యాణి కోనేరు ఉంది. దీనిని కర్నాటక పురావస్తు శాఖ వారు వెలుగులోకి తెచ్చారు. వీక్షకులు ఎంతో ఆసక్తిగా వీక్షించే రీతిలో ఈ నిర్మాణం ఉంటుంది.

కమల మహల్‌ 
దీనిని లోటస్‌ మహల్‌, చిత్రాంగిని మహల్‌ అని పిలుస్తారు. రెండు అంతస్థులలో ఉండే ఈ నిర్మాణం సున్నపుగారతో నిర్మించారు. ఈ ప్రదేశంలో మండు వేసవిలోను చల్లదనం ఉండే రీతిలో కిటికీలను, ద్వారాలను నిర్మించారు. అప్పట్లో దీనిని రాణి విశ్రాంతి మందిరంగా చెబుతారు.

గజశాల 
పట్టపుటేనుగులను కట్టేందుకు నిర్మించిన అతి పెద్ద గజశాల ఇక్కడ కనిపిస్తుంది. ఏనుగులకు ఆహారం, నీరు అందించేందుకు మావటివాడు వెళ్లేందుకు వీలు కల్పించే రీతిలో నిర్మాణాలు చేశారు. ఈ కట్టడాలు చూడటానికి పైభాగం గోళాకారంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. ఇలా హంపిలోని ప్రతి కట్టడం రాజసం ఉట్టిపడేలా, నేటికీ చెక్కుచెదరని నాటి రాజుల పాలనాదక్షత, ప్రజల అంకితభావానికి నిదర్శనాలుగా కనిపిస్తాయి.

తుంగభద్ర ఆనకట్ట 
హోస్‌పేట నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి వెళ్లేందుకు అన్ని సమయాల్లో వాహనాలు అందుబాటులో ఉంటాయి. ఆనకట్ట పొడవు 2 మైళ్ళు, ఎత్తు 160 అడుగులు. అప్పట్లో సుమారుగా రూ.15 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు. డ్యాము నందు విద్యుత్‌ ఉత్పాదన కేంద్రం, ఆకర్షణీయమైన గార్డెన్స్‌, ఎక్కడ చూసినా పచ్చదనం కనిపిస్తుంది.

వీలైనంత వరకూ సందర్శకులు హోస్‌పేట నుంచి ఆహార పదార్థాలను తెచ్చుకుంటారు. హంపిలోనూ చిరు హోటళ్ళు ఉంటాయి. హంపిలో సైకిళ్ళు, మోటారు వాహనాలు అద్దెకు లభిస్తాయి. సందర్శకులకు పోలీస్‌ యంత్రాంగం నిత్యం అందుబాటులో ఉంటుంది. హంపి చూడదగిన వారు కనీసం రెండురోజుల పాటు సమయం కేటాయిస్తే పూర్తిస్థాయిలో హంపిని చూడవచ్చు. టిడి డ్యామ్‌ దగ్గరలో ఉన్నందున డ్యాంను, అక్కడి పార్కులను, బోటింగ్‌ను బాగా ఎంజారు చేయవచ్చు. అయితే డ్యామ్‌ పైకి వాహనాలకు సాధారణంగా అనుమతుండదు. అధికారుల ప్రత్యేక అనుమతితో డ్యామ్‌ సందర్శన సాధ్యమవుతుంది. హంపికి కొత్తగా వెళ్లేవారికి, అక్కడి విశేషాలు వివరించడానికి గైడ్స్‌ అందుబాటులో ఉంటారు. గైడు అవసరం లేని వారు దాని చరిత్ర తెలిపే పుస్తకాన్ని కాస్త ఓపిగ్గా తిరగేయగలిగితే చాలా విషయాలు తెలుసుకోవచ్చు. మేము పుస్తకం కొని, స్థానిక పోలీసులు, భద్రతా సిబ్బంది సహకారంతో హంపి సోయగాలను తృప్తిగా చూడగలిగాం.

- వి. రవిచంద్ర


No comments:

Post a Comment