Sunday, 30 September 2018

Ladakh - లడఖ్ - లద్దాఖ్‌
Ladakh - లడఖ్ - లద్దాఖ్‌‘‘లద్దాఖ్‌... ప్రపంచంలోకెల్లా  ఎత్తైన నివాసిత ప్రాంతం మాత్రమే కాదు, రంగులు మారే సరస్సూ, పాలపుంత ఆకాశమూ, అయస్కాంత కొండా, రెండు మూపురాల ఒంటెలూ... ఇలా ఎన్నో సహజ వింతలకీ అందాలకీ సాహస యాత్రలకీ నిలయం. అంతేకాదు, భారతీయ ఆధ్యాత్మికతకి ప్రతీకగా నిలిచే హిమాలయ పర్వతాలకీ, ప్రాచీన నాగరికతకి కారణమైన సింధునదికీ ఆలవాలం...’’ అంటూ అక్కడి విశేషాలను చెప్పుకొస్తున్నారు హైదరాబాద్‌కు చెందిన వి. మల్లికార్జున్‌.

సింధునదిని దర్శనం చేసుకోవాలనీ అక్కడి ప్రదేశాలను చూడాలనీ 17 మంది బృందంతో కలిసి బయలుదేరాం. ముందుగా సింధునదిలో పవిత్ర స్నానం చేయాలనే కోరికతో జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రంలో ఉన్న లద్దాఖ్‌లోని లేహ్‌ పట్టణానికి వెళ్లాలనుకున్నాం. దిల్లీ నుంచి లేహ్‌కు విమానంలో చేరుకున్నాం. అక్కడ దిగగానే ఎత్తైన హిమగిరులు దర్శనమిచ్చాయి. అయితే అవన్నీ మంచుతో కాకుండా మట్టి, రాళ్లతో నిండి ఉన్నాయి. చలికాలంలో మాత్రం మంచుతో కప్పబడి ఉంటాయట. కనుచూపుమేరలో పచ్చదనం కనిపించదు. అందుకే లద్దాఖ్‌ ప్రాంతంలోని కొండల్ని ఎడారి హిమాలయాలని అంటారు.

రాత్రి ఎనిమిది వరకూ వెలుగే!
లేహ్‌ సముద్ర మట్టానికి 11,500 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ గాలిలో ఆక్సిజన్‌ తక్కువ. నైట్రోజన్‌ ఎక్కువ. దానివల్ల మనకు శ్వాస తీసుకోవడంలో కొంత ఇబ్బంది కలుగుతుంది. దీనికోసం ఎక్కువసార్లు నీళ్లూ, ఫ్రూట్‌జ్యూసులూ తాగాలి. నోరు పొడారిపోకుండా లాలాజలం ఊరేలా లవంగం, పిప్పరమెంట్లు లాంటివి చప్పరించడం చేస్తే శ్వాస సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. ఆ వాతావరణానికి అలవాటు పడ్డానికి సాయంత్రం వరకూ గదిలోనే ఉన్నాం. లేహ్‌లో సూర్యోదయం ఉదయం ఐదుగంటలకే. చీకటిపడేది మాత్రం రాత్రి ఎనిమిది తరవాతే. అక్కడ జనసాంద్రత చాలా తక్కువ. వీరి జీవనోపాధి కేవలం పర్యటకం మాత్రమే. ఇక్కడ అత్యధిక శాతం టిబెటన్‌ బౌద్ధులే. సాయంత్రం సింధు దర్శన్‌ యాత్రా సమితి ఆధ్వర్యంలో జరిగిన ప్రారంభోత్సవ వేడుకకి వెళ్లాం. అక్కడ సింధు నదీ ప్రాశస్త్యం గురించీ, దేశభక్తిని పెంపొందించేందుకూ ప్రత్యేకంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను చూశాం. సుదూర హిమాలయాల్లో నివసిస్తున్న ప్రజలు దేశంలోని మిగిలిన అన్ని ప్రాంతాలతో కలిసి సమైక్యంగా ఉండాలన్న ఉద్దేశంతోనూ అందరూ శాంతియుతంగా జీవించాలని ఆకాంక్షిస్తూ భారత ప్రభుత్వం గత 22 సంవత్సరాల నుంచీ ఈ సింధు దర్శన్‌ యాత్రను చేపట్టింది. అందులో భాగంగా ఇక్కడ ఏటా జూన్‌లో ఈ వేడుకను నిర్వహిస్తారు. దీనికోసం అన్ని రాష్ట్రాలనుంచీ యాత్రికులు వస్తుంటారు.

సింధునది మానస సరోవరంలో పుట్టి, దాదాపు 2400 కి.మీ. పొడవుతో టిబెట్‌, లద్దాఖ్‌, పాకిస్తాన్‌లలో ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. లద్దాఖ్‌లో దాదాపు 250 కి.మీ. ప్రవహిస్తుంది. ప్రారంభోత్సవ కార్యక్రమాలయ్యాక  నదీస్నానానికి బయలుదేరాం. మానససరోవరంలో పుట్టి అక్కడినుంచి ఎన్నో మలుపులు తిరుగుతూ ప్రవహిస్తోన్న ఆ నదిని చూడగానే ఎక్కడలేని ఆనందం కలిగింది. అందులో స్నానం చేసి పూజాది కార్యక్రమాలు నిర్వహించాక, చుట్టుపక్కల ప్రదేశాలు చూడ్డానికి బయలుదేరాం.

నదీ సంగమం!
లేహ్‌ నుంచి కార్గిల్‌ వెళ్లే దారిలో సముద్రమట్టానికి దాదాపు 12,000 అడుగుల ఎత్తులో ఉన్న పత్తర్‌ సాహిబ్‌ గురుద్వారా దగ్గరకు వెళ్లాం. ఇక్కడ సిక్కు మత సంస్థాపకులైన గురునానక్‌ ఓ పెద్ద శిల దగ్గర ధ్యానం చేసి, జ్ఞానోదయం పొందారని ప్రతీతి. అందుకు చిహ్నంగా అక్కడ ఓ పెద్ద గురుద్వారా నిర్మించారు. ఇక్కడ ఎంతో పవిత్రంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ లంగర్‌(సంతర్పణ) ఉంటుంది. దీనికి సమీపంలో కనుచూపుమేరలో అన్నీ ఎడారి హిమాలయాలే. తరవాత సింధునది జంస్కర్‌ నది కలిసే సంగమ ప్రదేశానికి వెళ్లాం. ఇక్కడ సింధు నది నీలం రంగులోనూ జంస్కర్‌ నది మట్టి రంగులోనూ కనిపిస్తుంది. అక్కడినుంచి సింధునది పాకిస్తాన్‌ వైపు ప్రవహిస్తుంది. ఈ సంగమం ప్రపంచంలోనే అతి ఎత్తైనదిగా చెబుతారు. ఇక్కడి జంస్కర్‌ నదిలో రివర్‌ ర్యాఫ్టింగ్‌ చేస్తే ప్రపంచంలో అతి ఎత్తైన ప్రదేశంలో చేసినట్లేనట. మేం కూడా ర్యాఫ్టింగ్‌ చేశాం. ఒకవైపు ఎత్తైన హిమగిరులూ మరోవైపు ఎక్కడో లోయలో ఉన్నట్లున్న నదిలో పడవ ప్రయాణం అద్భుతంగా అనిపించింది.  ఈ జంస్కర్‌లోయలోనే మొరిరి అనే సరోవరం దగ్గరున్న కర్జోక్‌ ప్రాంతం పచ్చదనంతో కళకళలాడుతుంటుంది. ప్రపంచంలోకెల్లా ఎత్తైన వ్యవసాయ క్షేత్రం ఇదేనట. ఇక్కడికి సమీపంలోనే భారతీయ సైన్యం నిర్మించిన  ప్రపంచంలోకెల్లా ఎత్తైన వంతెన ఉంది.

అయస్కాంత పర్వతం!
తరవాత అయస్కాంత పర్వతం దగ్గరకు వెళ్లాం. ఇది లేహ్‌ నుంచి 30 కి.మీ. దూరంలో ఉంది. ఇది సముద్ర మట్టానికి 14,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. దీని ప్రభావం రెండు ఫర్లాంగుల వరకూ ఉంటుంది. అందుకే అక్కడ ఓ పసుపుపచ్చ గీత గీశారు. అక్కడ వాహనాన్ని నిలిపినట్లైతే అది నెమ్మదిగా పర్వతం వైపు కదులుతున్న దృశ్యం మనల్ని చకితుల్ని చేస్తుంది. ఈ ప్రాంతాన్ని నో ఫ్లై జోన్‌గా ప్రకటించారు. తరవాత హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ అనే కట్టడం దగ్గరకు వెళ్లాం. దేశ రక్షణకోసం వరసగా మనదేశం చేసిన యుద్ధాల్లో వీరుల పోరాటాలూ వాళ్ల విజయ ఘట్టాలూ అమరులైన సైనిక సోదరుల చిత్రపటాలూ అన్నీ అక్కడ ప్రదర్శనకి ఉంచారు. వాళ్లు వాడిన రకరకాల ఆయుధాలు కూడా అక్కడ ఉన్నాయి. చల్లని మంచులో సైనికులు ఎలా నివసిస్తారు, సైనికుడు తనతో ఎన్ని వస్తువులను తీసుకెళతాడు... వంటి అనేక విశేషాలను అక్కడ తెలుసుకోవచ్చు. మనలాంటివాళ్లకి ఏ బరువులూ లేకుండా మంచుపర్వతం ఎక్కడమే గగనంగా ఉంటే, సైనికులు మాత్రం అంతంత బరువులతో ఆ పర్వతాన్ని ఎక్కడం అనేది ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇప్పటివరకూ పరమవీరచక్ర, మహావీరచక్ర పతకాలు పొందిన సైనిక సోదరుల చిత్రపటాలూ కార్గిల్‌ యుద్ధంలో మరణించిన మేజర్‌ పద్మపాణి ఆచార్య చిత్రాలూ అక్కడ ఉన్నాయి. ఇక్కడ అమరవీరుల స్తూపం నిత్యం జ్వలిస్తూ కనిపిస్తుంది. ప్రతిరోజూ సాయంత్రం సైనిక సంగీత ప్రదర్శన, సౌండ్‌ అండ్‌ లైట్‌ షో ఉంటాయి.

ఉప్పునీటి సరస్సు!
అక్కణ్నుంచి ప్రపంచంలోనే ఎత్తైన పాంగోంగ్‌ ఉప్పునీటి సరస్సు చూడ్డానికి వెళ్లాం. ఇది లేహ్‌ నుంచి 130 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎడారి పర్వతాలగుండా ఘాట్‌రోడ్డులో సుమారు 5 గంటలు ప్రయాణం చేస్తే వస్తుందీ సరోవరం. సముద్రమట్టానికి 14 వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ సరస్సులో 60 శాతం చైనా స్వాధీనంలోనూ, 40 శాతం భారత్‌ అధీనంలోనూ ఉంది. ఇక్కడికి వెళ్లాలంటే అనుమతి పత్రం తప్పనిసరి. ఎంతో కష్టపడి ఎత్తైన కొండలను దాటుకుంటూ వెళ్లాం. కానీ అక్కడి సరస్సును చూడగానే ఆ కష్టాన్ని మరచిపోయాం. అంత అద్భుతంగా ఉందది. ఆకాశంలో సూర్యగమనాన్ని బట్టి రోజంతా రంగులు మారుతూ సందర్శకుల్ని చకితుల్ని చేస్తుందీ సరస్సు. ఉదయం వేళలో ముదురు నీలిరంగులో ఉండే నీళ్లు మధ్యాహ్నానికి ఆకుపచ్చరంగులోనూ సాయంత్రానికి పసుపూ ఎరుపూ కలగలిసినట్లుగా ఉంటాయి. ఇక్కడ సినిమా షూటింగులు జరుగుతుంటాయి. త్రీ ఇడియట్స్‌ సినిమాలోని చివరి సన్నివేశం ఇక్కడ తీసినదే. తిరుగు ప్రయాణంలో అదే సినిమాలో చూపించిన రంచోడ్‌దాస్‌ పాఠశాల కనిపించింది. నది ఒడ్డునే క్యాంపింగ్‌ సౌకర్యం ఉంది. రాత్రివేళలో ఆకాశంలోని చుక్కలన్నీ ఎంతో దగ్గరగా కనిపిస్తూ నక్షత్రలోకంలో ఉన్నామా అనిపిస్తుందనీ, ఆకాశంలో ఎలాంటి మబ్బులూ లేనివేళలో పాలపుంత కనిపిస్తుందనీ అక్కడివాళ్లు చెప్పారు.

ఎత్తైన రోడ్డుమార్గంలో...
హిమాలయాల్లోని మరో అద్భుత ప్రదేశమైన ఖార్డుంగ్‌ లాకి వెళ్లాం. ఇది ప్రపంచంలోనే ఎత్తైన రోడ్డుమార్గం. సముద్ర మట్టానికి 18,500 అడుగుల ఎత్తులో ఉన్న ఈ రోడ్డు మానస సరోవరానికన్నా మూడువేల అడుగుల ఎత్తులో ఉంది. లేహ్‌ నుంచి 39 కి.మీ. దూరంలో ఈ ప్రాంతానికి వెళుతుంటే మేఘాలు మనల్ని తాకుతున్నట్లే అనిపిస్తుంది. ఆ ప్రాంతంలోని కొండల్నీ ఆకాశాన్నీ చూస్తుంటే అంతరిక్షంలోనో మరో గ్రహంమీదో ఉన్న అనుభూతి కలుగుతుంది. ఇది భూమండలమేనా అన్న అనుమానమూ వస్తుంది. ఎత్తైన ఆ కొండలమీద నుంచి కిందకి చూస్తే అదో పాతాళలోకంలా కనిపిస్తుంది. ఆ ప్రాంతానికి చేరుకోగానే మంచుతో కప్పబడిన హిమాలయాలు కనువిందు చేస్తాయి. అక్కడ దిగి అందరం చిన్న పిల్లల్లా మంచులో ఆడుకున్నాం. అక్కడి నుంచి మరికాస్త ముందుకు వెళితే నుబ్రా వ్యాలీ వస్తుంది. లేహ్‌కు విరుద్ధంగా పచ్చని చెట్లతో కళకళలాడుతూ కనిపిస్తుంది. బాక్ట్రియన్‌ ఒంటెలుగా పిలిచే రెండు మూపురాల ఒంటెలు ఉన్నాయక్కడ. ఇవేకాదు, లేహ్‌లో మరెన్నో బౌద్ధారామాలూ, లేహ్‌ ప్యాలెస్‌... వంటి చారిత్రక స్థలాలు ఉన్నాయి. అవన్నీ చూసి సంతృప్తితో వెనుతిరిగాం.

తొండమనాడు - కూర్చున్న శ్రీనివాసుడు

తొండమనాడు
కూర్చున్న శ్రీనివాసుడు


ప్రభాతవేళ తిరుమలలో కొలువైన వేంకటేశ్వరస్వామిని మేల్కొల్పేందుకు ఆలపించే సుప్రభాతం ఎంత మధురంగా ఉంటుందో అభయ, కటి హస్తాలతో దర్శనమిచ్చే శ్రీవారి రూపం కూడా అంతే మనోహరంగా ఉంటుంది. అయితే ఆ నిలువెత్తు రూపానికి భిన్నంగా శ్రీదేవీ భూదేవిసమేతంగా సుఖాసీనుడై యోగముద్రలో ఉన్నట్టుండే శ్రీనివాసుడిని దర్శించుకోవాలంటే తిరుపతికి సమీపంలోని తొండమనాడు వెళ్లాల్సిందే.

‘‘దొమ్ములు చేసిన యట్టి తొండమాన్‌ చెక్కురవర్తి రమ్మన్న చోటికివచ్చి నమ్మినవాడు’’ అంటూ తొండమాన్‌ చక్రవర్తి గురించి వివరించాడు పదకవితా పితామహుడు అన్నమాచార్యుడు. శ్రీనివాసుడి సేవలో తరించిన రాజుగా తొండమానుడికి ఎంతో పేరుంది. శ్రీనివాసుడికి పిల్లనిచ్చి పెళ్లి చేసిన ఆకాశరాజుకు స్వయానా సోదరుడు ఈ తొండమాన్‌ చక్రవర్తి. ఆయన తన చివరి దశలో తిరుమలకు వెళ్లి స్వామిని సేవించే పరిస్థితిలేక... తన ఇంటనే స్వామి వెలసి ఉండాలని ఆ కలియుగ దేవుడిని వేడుకున్నాడు. చక్రవర్తి భక్తికి మెచ్చి శ్రీవారు తొండమాన్‌ ఇంటనే స్వయంభువుగా ఉద్భవించాడు. సుఖాసీనుడై చక్రవర్తి సేవలందుకున్నాడు. స్వామి విగ్రహం ఒక చేతితో యోగముద్ర, మరో చేత్తో అభయహస్తం కలిగి ఉండటంతోపాటు శ్రీదేవి, భూదేవి సమేత ప్రసన్న వేంకటేశ్వరుడిగా భక్తులకు దర్శనమిస్తుంది.

తొండమానుడి నిర్మాణం
శ్రీవారికి గొప్ప భక్తుడైన తొండమానుడు అగస్త్యాశ్రమానికి వెళ్లి అక్కడ సేదతీరుతున్న శ్రీనివాసుడిని దర్శించుకుంటాడు. ఆ సమయంలో శ్రీనివాసుడు తొండమానుడితో ‘కలియుగం అంతమయ్యే వరకూ నేను శేషాచల కొండల్లోనే స్థిరనివాసం ఏర్పర్చుకుంటాను. అక్కడ నా కోసం ఒక ఆలయాన్ని నిర్మించి దాని మధ్యలో బంగారు విమానాన్ని ఏర్పాటు చేయి’ అని ఆదేశిస్తాడు. దీనికి అంగీకరించిన తొండమానుడు విశ్వకర్మ సహాయంతో శ్రీవారి ఆలయ నిర్మాణాన్ని పూర్తిచేస్తాడు. రత్న ఖచితమైన సువర్ణ కలశాలతో ప్రకాశించే విమానాన్ని నిర్మించి, దాని చుట్టూ మూడు ప్రాకారాలతో, మూడు ప్రదక్షిణ మార్గాలనూ, మూడు మండపాలనూ, వంటశాలలనూ, బంగారుబావినీ నిర్మిస్తాడు. ఆనంద నిలయ విమానంపైన వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. ఆయనే విమాన వేంకటేశ్వరుడు. ఆయనను దర్శించిన వెంటనే ఆనందం కలుగుతుందని భక్తుల నమ్మకం. అందుకే శ్రీవారి గోపురం ఆనంద నిలయమని ప్రసిద్ధి. రోజూ తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకుని వచ్చాకే రాజ్యపాలన వ్యవహారాలు చూసుకోవడం తొండమానుడికి అలవాటు. ఒక సొరంగ మార్గం ద్వారా తిరుమలకు వెళ్లివచ్చేవాడట. అయితే, కొంతకాలానికి వృద్ధాప్యం కారణంగా తొండమానుడు స్వామిని దర్శించుకోవడానికి వెళ్లలేకపోయేవాడు. దీంతో స్వామినే తన కోటలో వెలిసి, తనకు సేవ చేసుకునే భాగ్యాన్ని కలిగించాలని వేడుకుంటాడు. దీంతో శ్రీవారు అభయహస్తంతో ఆసీన భంగిమలో శ్రీదేవీ, భూదేవిలతో కలిసి తొండమనాడులో స్వయంభూగా వెలిశాడు.

తామరగుంట పుష్కరిణి
తిరుమలలోని ఆకాశగంగ, కపిలతీర్థం జలపాతాల నుంచి వచ్చే జలాన్ని కాలువల ద్వారా తొండమనాడు చెరువులోకి వచ్చే విధంగా ఏర్పాటు చేశారు. ఈ జలాలతోనే స్వామికి నిత్యాభిషేకం జరుగుతుంది. రేణిగుంట రాళ్లకాలువ మీదుగా ఈ నీల్లు తొండమనాడు చెరువులోకి వస్తాయి. దీన్ని తామరగుంట చెరువుగా పిలుస్తారు. అంతరాలయ ద్వారంమీద తొండమానుడి విగ్రహం కనిపిస్తుంది. ఆలయ విమాన శిఖరం తిరుమలలో ఆనంద నిలయంమీద ఉన్నట్లే ఇక్కడా ఉండటం విశేషం. ఈ ఆలయం గత రాజుల వైభవానికి చిహ్నంగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహంలేదు. గద్వాల్‌ మహారాణి ఈ ఆలయానికి భూములను విరాళంగా ఇచ్చినట్లు ఆలయచరిత్ర పేర్కొంటోంది. ఆ రోజుల్లో స్వామికి నిత్య పూజలు, సేవలు, నివేదనలు, ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేవారని ప్రతీతి. 2008లో తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఆలయాన్ని తన ఆధీనంలోకి తీసుకుని అభివృద్ధి చేసింది. ప్రతి శ్రావణమాసంలో స్వామివారికి పవిత్రోత్సవాలు జరుగుతాయి. యోగ ముద్రలో వెలసిన స్వామిని దర్శించుకుంటే సకల మనోభీష్టాలు నెరవేరడమే కాకుండా మానసిక ప్రశాంతత లభిస్తుందనేది భక్తుల విశ్వాసం.

ఇలా చేరుకోవచ్చు
తిరుపతికి సుమారు ముప్పై కిలోమీటర్లు, శ్రీకాళహస్తికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉందీ తొండమనాడు గ్రామం. ఇక్కడికి చేరుకోవడానికి తిరుపతి, శ్రీకాళహస్తిల నుంచి ప్రతి అరగంటకో బస్సు అందుబాటులో ఉంటుంది. శ్రీకాళహస్తి నుంచి తిరుపతి మీదుగా పాపానాయుడుపేట వెళ్లే బస్సులో ప్రయాణించి ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు.

- ఆడెపు రాజ్‌కుమార్‌

Sunday, 23 September 2018

ద్వాదశ జ్యోతిర్లింగాలు ఒక్కచోటేసోమశిల
ద్వాదశ జ్యోతిర్లింగాలు ఒక్కచోటే
నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ పట్టణానికి దగ్గరలో


బోళాశంకరుడి అత్యంత శక్తిమంతమైన క్షేత్రాలుగా ద్వాదశ జ్యోతిర్లింగాలను చెబుతారు. వీటిలో ఏ ఒక్క క్షేత్రాన్ని దర్శించినా చాలనుకుంటారు. అలాంటిది దేవదేవుడు ఒకేచోట పన్నెండు రూపాల్లో పూజలందుకుంటున్న ప్రాంతం సోమశిల. ప్రకృతి అందాలకు నెలవైన ఇక్కడ పరమశివుడి ద్వాదశ జ్యోతిర్లింగాలూ కొలువై ఉండటం విశేషం.

మనసుదోచే నల్లమల అందాలూ
పరవళ్లు తొక్కే కృష్ణమ్మ గలగలలూ
మధురానుభూతిని మిగిల్చే పడవ ప్రయాణాలూ...
ఇలా ప్రకృతి సోయగాలకు చిరునామాగా నిలుస్తున్న సోమశిల ఆధ్యాత్మికంగానూ అంతే ప్రసిద్ధి చెందింది. కృష్ణుడి ఆనతిమేరకు ద్వాపరయుగంలో పాండవులు ప్రతిష్ఠించిన ఆలయాలుగా సోమశిలలో కొలువైన ద్వాదశ జ్యోతిర్లింగాలకు పేరు. ఒకవైపు ఆధ్యాత్మికతనూ మరోవైపు ప్రకృతి అందాలనూ తనలో ఇముడ్చుకున్న సోమశిల నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ పట్టణానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌ ఇక్కడికివచ్చి చేరడంతో కృష్ణమ్మ కొత్త అందాలను సంతరించుకుని పర్యటకులకు మరింత ఆహ్లాదాన్ని కలిగిస్తోంది. పుష్కర ఘాట్‌లో స్నానాలు చేసి పన్నెండు జ్యోతిర్లింగాలనూ దర్శించుకున్న తర్వాత నదిలో పడవ ప్రయాణం ద్వారా చుట్టుపక్కల ఉన్న పర్యటక ప్రాంతాలనూ వీక్షించవచ్చు. కృష్ణానదికి అవతలి ఒడ్డున ఉన్న సంగమేశ్వరస్వామి దివ్యమంగళ స్వరూపాన్నీ దర్శించుకోవచ్చు.

స్థలపురాణం
ద్వాపరయుగంలో పాండవులు అరణ్యవాస సమయంలో ఈ ప్రాంతంలో కొంతకాలం నివసించినట్లు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. జూదంలో ఓడిన పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో వారిని కలిసిన కృష్ణుడు సోమశిల ప్రాంతంలోని రెండు కొండల మధ్య ప్రవహిస్తున్న సప్తనదుల సంగమంలో శివలింగాన్ని ప్రతిష్ఠించమని చెబుతాడు. అందుకు అంగీకరించిన ధర్మరాజు శివలింగాన్ని తీసుకొచ్చే బాధ్యతను భీముడికి అప్పగిస్తాడు. భీముడు కాశీకి వెళ్లి లింగాన్ని తీసుకొచ్చే క్రమంలో కాస్త జాప్యం అవుతుంది. సమయం మించిపోతుందని భావించిన ధర్మరాజు మరోలింగాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తాడు. తాను తెచ్చిన లింగాన్ని పెట్టలేదని ఆగ్రహించిన భీముడు కాశీనుంచి తీసుకొచ్చిన లింగాన్ని దూరంగా విసిరేస్తాడు. దీంతో ఆ లింగం పన్నెండు ముక్కలై చెల్లాచెదురుగా పడిపోతుంది. తర్వాతికాలంలో ఆ శకలాలే పన్నెండు లింగాలుగా ఆవిర్భవించాయని భక్తుల నమ్మకం.

ఒకే చోట...
పదకొండో శతాబ్దంలో చాళుక్యులు సోమశిల ఆలయాన్ని పునరుద్ధరించినట్లు స్థలపురాణం తెలియజేస్తోంది. ద్వాదశ జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శించుకునే విధంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పన్నెండు జ్యోతిర్లింగాలనూ ఇక్కడ తీర్చిదిద్దారు. ఈ ఆలయ ప్రాంగణంలోనే సోమేశ్వరుడు, మహాకాళేశ్వరుడు, కాశీవిశ్వనాథుడు, నాగేశ్వరుడు, త్రయంబకేశ్వరుడు, కేదారేశ్వరుడు, శ్రీశైల మల్లికార్జునుడు, భీమశంకరుడు, రామలింగేశ్వరుడు... ఇలా పన్నెండు జ్యోతిర్లింగాలను ప్రతిష్ఠించారు. ఇక్కడ పూజలు చేస్తే అవివాహితులకు వివాహమవుతుందనీ సంతానం లేనివారికి సంతానం కలుగుతుందనీ భక్తుల విశ్వాసం. ఒకసారి వచ్చి మనసులోని కోర్కెలు స్వామికి తెలియజేస్తే అవి తప్పక నెరవేరతాయని చెబుతారు.

ఎలా వెళ్లాలంటే...
ప్రకృతి ప్రేమికులకు సోమశిల ప్రయాణం ఒక మరపురాని మధురానుభూతి. శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ పూర్తిస్థాయిలో రావడంతో ప్రస్తుతం పుష్కరఘాట్లు నీటితో కళకళలాడుతున్నాయి. ఇక్కడి కృష్ణానది ఈత కొట్టడానికి అనువైనది కావడం, చుట్టూ పర్యటక ప్రదేశాలు అధికంగా ఉండటంతో ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు ఎక్కువ సంఖ్యలో పర్యటకులూ, భక్తులూ వస్తుంటారు. హైదరాబాద్‌కి 185 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జ్యోతిర్లింగాలను దర్శించుకోవడానికి రోడ్డు, జల మార్గాలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి జిల్లా కేంద్రాల నుంచి కొల్లాపూర్‌ వరకు ప్రతి అరగంటకూ ఒక ఆర్టీసీ బస్సు సిద్ధంగా ఉంటుంది. జలమార్గం ద్వారా అయితే... కర్నూలులోని శ్రీశైలం, నందికొట్కూరు నుంచి పడవల్లో రావచ్చు.

- జి.వెంకటేష్‌

Tuesday, 18 September 2018

మహావిద్యాగణపతి
మహావిద్యాగణపతిసత్యప్రమాణాల దేవుడిగా విద్యలకు ఒజ్జగా కృష్ణాజిల్లాలో కొలువైన మహావిద్యాగణపతిని ఆరాధిస్తారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా పార్వతీనందనుడిని పూజిస్తారు. చోళరాజుల కాలంనాటి నల్లరాతి విగ్రహంతోపాటు ఆలయ మండపంలో ముఫ్ఫైరెండు రూపాల్లో గణనాథుడు దర్శనమివ్వడం ఈ క్షేత్ర విశిష్టత.

వినాయకుడు ప్రథమ పూజ్యుడు. ప్రమథ గణాలకు అధిపతి. విఘ్నాలను పోగొట్టే విశిష్ట దైవం. ఆయన్ను ఆరాధించేవారికి కొండంత అండ. అందుకే దేశవ్యాప్తంగా వినాయక నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తారు. పేదాగొప్పా తేడాలేకుండా ప్రతి ఇంటా గణపయ్యను కొలువుదీర్చి శక్తిమేరకు పత్రం పుష్పం ఫలం తోయం సమర్పిస్తారు. అలాంటి గజముఖుడు కృష్ణా జిల్లాలోని చల్లపల్లిలో మహావిద్యాగణపతిగా పూజలందుకుంటున్నాడు. అంతేకాదు ఆలయమండపం చుట్టూ వినాయకుడిని సిద్ధీబుద్ధీ సమేతంగా, సంతాన గణపతిగా, జ్ఞానమూర్తిగా... ఇలా వివిధ రూపాల్లో ఏర్పాటుచేశారిక్కడ.

విగ్రహం వెనక...
ఈ క్షేత్రంలో స్వయంభూగా వెలసిన గణనాథుడు భక్తులు కోరిన కోర్కెలు నెరవేరుస్తూ వరసిద్ధి వినాయకుడయ్యాడు. విద్యార్థులకు మంచి చదువులు ప్రసాదిస్తూ మహావిద్యాగణపతిగా ప్రసిద్ధి చెందాడు. అయితే ఈ ఆలయంలో పూజలందుకుంటున్న వినాయకుడి విగ్రహం ఏర్పాటు వెనక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. రెండేళ్ల కిందట... చల్లపల్లిలోని కేసీపీ చక్కెర కర్మాగారం ఆవరణలో వినాయకుడి ఆలయాన్ని ఏర్పాటు చేయాలని పరిశ్రమ యాజమాన్యం భావించింది. దేవాలయ నిర్మాణానికి శంకుస్థాపన కోసం మట్టిని తవ్వుతుండగా మూడు అడుగుల ఎత్తున్న నల్లరాతి వినాయకుడి విగ్రహం కనిపించింది. దైవానుగ్రహంగా భావించి ఆ విగ్రహాన్నే మూలవిరాట్టుగా ప్రతిష్ఠించి, పూజాదిక క్రతువులు నిర్వహిస్తున్నారు. పురావస్తు అధికారులు ఈ విగ్రహాన్ని పరిశీలించి ఇది చోళరాజుల కాలానికి చెందిందిగా గుర్తించారు. మొదట ఒక చిన్న మందిరాన్ని ఏర్పాటు చేసి వినాయకుడి విగ్రహాన్ని అందులో ఉంచారు. ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత ఆ దొరికిన విగ్రహాన్నే గర్భగుడిలో ప్రతిష్ఠించారు. ఇక్కడి వినాయకుడిని భక్తితో మనస్ఫూర్తిగా ఏ కోరిక కోరుకున్నా అది తప్పక నెరవేరుతుందని భక్తుల విశ్వాసం. అందుకే ఏటా జరిగే వార్షికోత్సవాల్లో పాల్గొనడానికి రాష్ట్రం నలుమూలల నుంచీ పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. కాణిపాకం వినాయకుడి దర్శనం వల్ల కలిగే ఫలితమే ఇక్కడి స్వామిని దర్శించినా సిద్ధిస్తుందని స్థానికుల నమ్మకం.

ఎన్నెన్ని రూపాలో...
లంబోదరుడు ఈ ఆలయంలో చతుర్భుజాలతో దర్శనమిస్తాడు. పైన రెండు చేతుల్లో పాశాంకుశాలు అనే ఆయుధాలనూ, కింది వాటిలో కుడి చేతిలో అక్షరమాల, ఎడమ చేతిలో మామిడి పండును పట్టుకుని కనిపిస్తాడు. అక్షరమాలను చేతిలో ధరించడం వల్లే ఇక్కడి వినాయకుడిని మహావిద్యా గణపతిగా అర్చిస్తారు. ఈ ఆలయంలో ఆగమశాస్త్ర ప్రకారం పూజాదిక క్రతువులను నిర్వహిస్తారు. ఏ ఆలయంలోనైనా ప్రధాన విగ్రహం ఒక్కటే ఉండటం సర్వసాధారణం. కానీ మహావిద్యా గణపతి ఆలయంలో మాత్రం మండపంగా ఏర్పాటు చేసిన పదహారు శిలా స్తంభాలకూ ఒక్కోదానికి రెండేసి చొప్పున మొత్తం ముప్ఫైరెండు విభిన్న ఆకృతుల్లో వినాయక విగ్రహాలు దర్శనమిస్తాయి. సంకట గణపతి, త్రిముఖ గణపతి, రుణ విమోచన గణపతి, సృష్టి గణపతి, ఏకాక్షర గణపతి... ఇలా అనేక రూపాల్లోని వినాయకుడి విగ్రహాలను అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.

నిత్య పూజలు
ఇక్కడ కొలువైన మహావిద్యాగణపతికి ఉదయం నుంచే వివిధ రకాల అభిషేకాలూ అర్చనలూ ప్రారంభమవుతాయి. శాస్త్ర ప్రకారం పంచహారతులు, నీరాజన సహిత మంత్రపుష్పాలు సమర్పిస్తారు. ప్రతి బుధవారం అన్నదాన కార్యక్రమాన్ని చేపడతారు. వీటితోపాటు హస్తద్రవ్య అభిషేకం, సహస్రనామార్చనలు, సంకష్టహర చతుర్ధినాడు ప్రత్యేక హోమాలు, కార్తికమాసంలో కోటి దీపోత్సవం, లక్ష గరిక పూజలను విశేషంగా జరిపిస్తారు. ఏటా చైత్రబహుళ పాఢ్యమి రోజున వార్షిక మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు.

ఇలా చేరుకోవాలి...
విజయవాడకు అరవై అయిదు కిలోమీటర్ల దూరంలో ఉందీ మహావిద్యాగణపతి ఆలయం. బస్‌స్టాండ్‌ నుంచి కరకట్ట మీదుగా చల్లపల్లి వెళ్లే బస్సులు అందుబాటులో ఉంటాయి. అక్కడి నుంచి మచిలీపట్నం వెళ్లే రహదారిలో అయిదు కిలోమీటర్లు రోడ్డు మార్గంలో ప్రయాణించి స్వామిని దర్శించుకోవచ్చు. విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్లే బస్సులూ, ప్రయివేటు వాహనాల్లో కూడా ఇక్కడికి చేరుకోవచ్చు.

- ముత్తా నారాయణరావు