Tuesday, 18 September 2018

మహావిద్యాగణపతి
మహావిద్యాగణపతిసత్యప్రమాణాల దేవుడిగా విద్యలకు ఒజ్జగా కృష్ణాజిల్లాలో కొలువైన మహావిద్యాగణపతిని ఆరాధిస్తారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా పార్వతీనందనుడిని పూజిస్తారు. చోళరాజుల కాలంనాటి నల్లరాతి విగ్రహంతోపాటు ఆలయ మండపంలో ముఫ్ఫైరెండు రూపాల్లో గణనాథుడు దర్శనమివ్వడం ఈ క్షేత్ర విశిష్టత.

వినాయకుడు ప్రథమ పూజ్యుడు. ప్రమథ గణాలకు అధిపతి. విఘ్నాలను పోగొట్టే విశిష్ట దైవం. ఆయన్ను ఆరాధించేవారికి కొండంత అండ. అందుకే దేశవ్యాప్తంగా వినాయక నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తారు. పేదాగొప్పా తేడాలేకుండా ప్రతి ఇంటా గణపయ్యను కొలువుదీర్చి శక్తిమేరకు పత్రం పుష్పం ఫలం తోయం సమర్పిస్తారు. అలాంటి గజముఖుడు కృష్ణా జిల్లాలోని చల్లపల్లిలో మహావిద్యాగణపతిగా పూజలందుకుంటున్నాడు. అంతేకాదు ఆలయమండపం చుట్టూ వినాయకుడిని సిద్ధీబుద్ధీ సమేతంగా, సంతాన గణపతిగా, జ్ఞానమూర్తిగా... ఇలా వివిధ రూపాల్లో ఏర్పాటుచేశారిక్కడ.

విగ్రహం వెనక...
ఈ క్షేత్రంలో స్వయంభూగా వెలసిన గణనాథుడు భక్తులు కోరిన కోర్కెలు నెరవేరుస్తూ వరసిద్ధి వినాయకుడయ్యాడు. విద్యార్థులకు మంచి చదువులు ప్రసాదిస్తూ మహావిద్యాగణపతిగా ప్రసిద్ధి చెందాడు. అయితే ఈ ఆలయంలో పూజలందుకుంటున్న వినాయకుడి విగ్రహం ఏర్పాటు వెనక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. రెండేళ్ల కిందట... చల్లపల్లిలోని కేసీపీ చక్కెర కర్మాగారం ఆవరణలో వినాయకుడి ఆలయాన్ని ఏర్పాటు చేయాలని పరిశ్రమ యాజమాన్యం భావించింది. దేవాలయ నిర్మాణానికి శంకుస్థాపన కోసం మట్టిని తవ్వుతుండగా మూడు అడుగుల ఎత్తున్న నల్లరాతి వినాయకుడి విగ్రహం కనిపించింది. దైవానుగ్రహంగా భావించి ఆ విగ్రహాన్నే మూలవిరాట్టుగా ప్రతిష్ఠించి, పూజాదిక క్రతువులు నిర్వహిస్తున్నారు. పురావస్తు అధికారులు ఈ విగ్రహాన్ని పరిశీలించి ఇది చోళరాజుల కాలానికి చెందిందిగా గుర్తించారు. మొదట ఒక చిన్న మందిరాన్ని ఏర్పాటు చేసి వినాయకుడి విగ్రహాన్ని అందులో ఉంచారు. ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత ఆ దొరికిన విగ్రహాన్నే గర్భగుడిలో ప్రతిష్ఠించారు. ఇక్కడి వినాయకుడిని భక్తితో మనస్ఫూర్తిగా ఏ కోరిక కోరుకున్నా అది తప్పక నెరవేరుతుందని భక్తుల విశ్వాసం. అందుకే ఏటా జరిగే వార్షికోత్సవాల్లో పాల్గొనడానికి రాష్ట్రం నలుమూలల నుంచీ పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. కాణిపాకం వినాయకుడి దర్శనం వల్ల కలిగే ఫలితమే ఇక్కడి స్వామిని దర్శించినా సిద్ధిస్తుందని స్థానికుల నమ్మకం.

ఎన్నెన్ని రూపాలో...
లంబోదరుడు ఈ ఆలయంలో చతుర్భుజాలతో దర్శనమిస్తాడు. పైన రెండు చేతుల్లో పాశాంకుశాలు అనే ఆయుధాలనూ, కింది వాటిలో కుడి చేతిలో అక్షరమాల, ఎడమ చేతిలో మామిడి పండును పట్టుకుని కనిపిస్తాడు. అక్షరమాలను చేతిలో ధరించడం వల్లే ఇక్కడి వినాయకుడిని మహావిద్యా గణపతిగా అర్చిస్తారు. ఈ ఆలయంలో ఆగమశాస్త్ర ప్రకారం పూజాదిక క్రతువులను నిర్వహిస్తారు. ఏ ఆలయంలోనైనా ప్రధాన విగ్రహం ఒక్కటే ఉండటం సర్వసాధారణం. కానీ మహావిద్యా గణపతి ఆలయంలో మాత్రం మండపంగా ఏర్పాటు చేసిన పదహారు శిలా స్తంభాలకూ ఒక్కోదానికి రెండేసి చొప్పున మొత్తం ముప్ఫైరెండు విభిన్న ఆకృతుల్లో వినాయక విగ్రహాలు దర్శనమిస్తాయి. సంకట గణపతి, త్రిముఖ గణపతి, రుణ విమోచన గణపతి, సృష్టి గణపతి, ఏకాక్షర గణపతి... ఇలా అనేక రూపాల్లోని వినాయకుడి విగ్రహాలను అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.

నిత్య పూజలు
ఇక్కడ కొలువైన మహావిద్యాగణపతికి ఉదయం నుంచే వివిధ రకాల అభిషేకాలూ అర్చనలూ ప్రారంభమవుతాయి. శాస్త్ర ప్రకారం పంచహారతులు, నీరాజన సహిత మంత్రపుష్పాలు సమర్పిస్తారు. ప్రతి బుధవారం అన్నదాన కార్యక్రమాన్ని చేపడతారు. వీటితోపాటు హస్తద్రవ్య అభిషేకం, సహస్రనామార్చనలు, సంకష్టహర చతుర్ధినాడు ప్రత్యేక హోమాలు, కార్తికమాసంలో కోటి దీపోత్సవం, లక్ష గరిక పూజలను విశేషంగా జరిపిస్తారు. ఏటా చైత్రబహుళ పాఢ్యమి రోజున వార్షిక మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు.

ఇలా చేరుకోవాలి...
విజయవాడకు అరవై అయిదు కిలోమీటర్ల దూరంలో ఉందీ మహావిద్యాగణపతి ఆలయం. బస్‌స్టాండ్‌ నుంచి కరకట్ట మీదుగా చల్లపల్లి వెళ్లే బస్సులు అందుబాటులో ఉంటాయి. అక్కడి నుంచి మచిలీపట్నం వెళ్లే రహదారిలో అయిదు కిలోమీటర్లు రోడ్డు మార్గంలో ప్రయాణించి స్వామిని దర్శించుకోవచ్చు. విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్లే బస్సులూ, ప్రయివేటు వాహనాల్లో కూడా ఇక్కడికి చేరుకోవచ్చు.

- ముత్తా నారాయణరావు

No comments:

Post a Comment