Sunday, 30 September 2018

Ladakh - లడఖ్ - లద్దాఖ్‌
Ladakh - లడఖ్ - లద్దాఖ్‌‘‘లద్దాఖ్‌... ప్రపంచంలోకెల్లా  ఎత్తైన నివాసిత ప్రాంతం మాత్రమే కాదు, రంగులు మారే సరస్సూ, పాలపుంత ఆకాశమూ, అయస్కాంత కొండా, రెండు మూపురాల ఒంటెలూ... ఇలా ఎన్నో సహజ వింతలకీ అందాలకీ సాహస యాత్రలకీ నిలయం. అంతేకాదు, భారతీయ ఆధ్యాత్మికతకి ప్రతీకగా నిలిచే హిమాలయ పర్వతాలకీ, ప్రాచీన నాగరికతకి కారణమైన సింధునదికీ ఆలవాలం...’’ అంటూ అక్కడి విశేషాలను చెప్పుకొస్తున్నారు హైదరాబాద్‌కు చెందిన వి. మల్లికార్జున్‌.

సింధునదిని దర్శనం చేసుకోవాలనీ అక్కడి ప్రదేశాలను చూడాలనీ 17 మంది బృందంతో కలిసి బయలుదేరాం. ముందుగా సింధునదిలో పవిత్ర స్నానం చేయాలనే కోరికతో జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రంలో ఉన్న లద్దాఖ్‌లోని లేహ్‌ పట్టణానికి వెళ్లాలనుకున్నాం. దిల్లీ నుంచి లేహ్‌కు విమానంలో చేరుకున్నాం. అక్కడ దిగగానే ఎత్తైన హిమగిరులు దర్శనమిచ్చాయి. అయితే అవన్నీ మంచుతో కాకుండా మట్టి, రాళ్లతో నిండి ఉన్నాయి. చలికాలంలో మాత్రం మంచుతో కప్పబడి ఉంటాయట. కనుచూపుమేరలో పచ్చదనం కనిపించదు. అందుకే లద్దాఖ్‌ ప్రాంతంలోని కొండల్ని ఎడారి హిమాలయాలని అంటారు.

రాత్రి ఎనిమిది వరకూ వెలుగే!
లేహ్‌ సముద్ర మట్టానికి 11,500 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ గాలిలో ఆక్సిజన్‌ తక్కువ. నైట్రోజన్‌ ఎక్కువ. దానివల్ల మనకు శ్వాస తీసుకోవడంలో కొంత ఇబ్బంది కలుగుతుంది. దీనికోసం ఎక్కువసార్లు నీళ్లూ, ఫ్రూట్‌జ్యూసులూ తాగాలి. నోరు పొడారిపోకుండా లాలాజలం ఊరేలా లవంగం, పిప్పరమెంట్లు లాంటివి చప్పరించడం చేస్తే శ్వాస సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. ఆ వాతావరణానికి అలవాటు పడ్డానికి సాయంత్రం వరకూ గదిలోనే ఉన్నాం. లేహ్‌లో సూర్యోదయం ఉదయం ఐదుగంటలకే. చీకటిపడేది మాత్రం రాత్రి ఎనిమిది తరవాతే. అక్కడ జనసాంద్రత చాలా తక్కువ. వీరి జీవనోపాధి కేవలం పర్యటకం మాత్రమే. ఇక్కడ అత్యధిక శాతం టిబెటన్‌ బౌద్ధులే. సాయంత్రం సింధు దర్శన్‌ యాత్రా సమితి ఆధ్వర్యంలో జరిగిన ప్రారంభోత్సవ వేడుకకి వెళ్లాం. అక్కడ సింధు నదీ ప్రాశస్త్యం గురించీ, దేశభక్తిని పెంపొందించేందుకూ ప్రత్యేకంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను చూశాం. సుదూర హిమాలయాల్లో నివసిస్తున్న ప్రజలు దేశంలోని మిగిలిన అన్ని ప్రాంతాలతో కలిసి సమైక్యంగా ఉండాలన్న ఉద్దేశంతోనూ అందరూ శాంతియుతంగా జీవించాలని ఆకాంక్షిస్తూ భారత ప్రభుత్వం గత 22 సంవత్సరాల నుంచీ ఈ సింధు దర్శన్‌ యాత్రను చేపట్టింది. అందులో భాగంగా ఇక్కడ ఏటా జూన్‌లో ఈ వేడుకను నిర్వహిస్తారు. దీనికోసం అన్ని రాష్ట్రాలనుంచీ యాత్రికులు వస్తుంటారు.

సింధునది మానస సరోవరంలో పుట్టి, దాదాపు 2400 కి.మీ. పొడవుతో టిబెట్‌, లద్దాఖ్‌, పాకిస్తాన్‌లలో ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. లద్దాఖ్‌లో దాదాపు 250 కి.మీ. ప్రవహిస్తుంది. ప్రారంభోత్సవ కార్యక్రమాలయ్యాక  నదీస్నానానికి బయలుదేరాం. మానససరోవరంలో పుట్టి అక్కడినుంచి ఎన్నో మలుపులు తిరుగుతూ ప్రవహిస్తోన్న ఆ నదిని చూడగానే ఎక్కడలేని ఆనందం కలిగింది. అందులో స్నానం చేసి పూజాది కార్యక్రమాలు నిర్వహించాక, చుట్టుపక్కల ప్రదేశాలు చూడ్డానికి బయలుదేరాం.

నదీ సంగమం!
లేహ్‌ నుంచి కార్గిల్‌ వెళ్లే దారిలో సముద్రమట్టానికి దాదాపు 12,000 అడుగుల ఎత్తులో ఉన్న పత్తర్‌ సాహిబ్‌ గురుద్వారా దగ్గరకు వెళ్లాం. ఇక్కడ సిక్కు మత సంస్థాపకులైన గురునానక్‌ ఓ పెద్ద శిల దగ్గర ధ్యానం చేసి, జ్ఞానోదయం పొందారని ప్రతీతి. అందుకు చిహ్నంగా అక్కడ ఓ పెద్ద గురుద్వారా నిర్మించారు. ఇక్కడ ఎంతో పవిత్రంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ లంగర్‌(సంతర్పణ) ఉంటుంది. దీనికి సమీపంలో కనుచూపుమేరలో అన్నీ ఎడారి హిమాలయాలే. తరవాత సింధునది జంస్కర్‌ నది కలిసే సంగమ ప్రదేశానికి వెళ్లాం. ఇక్కడ సింధు నది నీలం రంగులోనూ జంస్కర్‌ నది మట్టి రంగులోనూ కనిపిస్తుంది. అక్కడినుంచి సింధునది పాకిస్తాన్‌ వైపు ప్రవహిస్తుంది. ఈ సంగమం ప్రపంచంలోనే అతి ఎత్తైనదిగా చెబుతారు. ఇక్కడి జంస్కర్‌ నదిలో రివర్‌ ర్యాఫ్టింగ్‌ చేస్తే ప్రపంచంలో అతి ఎత్తైన ప్రదేశంలో చేసినట్లేనట. మేం కూడా ర్యాఫ్టింగ్‌ చేశాం. ఒకవైపు ఎత్తైన హిమగిరులూ మరోవైపు ఎక్కడో లోయలో ఉన్నట్లున్న నదిలో పడవ ప్రయాణం అద్భుతంగా అనిపించింది.  ఈ జంస్కర్‌లోయలోనే మొరిరి అనే సరోవరం దగ్గరున్న కర్జోక్‌ ప్రాంతం పచ్చదనంతో కళకళలాడుతుంటుంది. ప్రపంచంలోకెల్లా ఎత్తైన వ్యవసాయ క్షేత్రం ఇదేనట. ఇక్కడికి సమీపంలోనే భారతీయ సైన్యం నిర్మించిన  ప్రపంచంలోకెల్లా ఎత్తైన వంతెన ఉంది.

అయస్కాంత పర్వతం!
తరవాత అయస్కాంత పర్వతం దగ్గరకు వెళ్లాం. ఇది లేహ్‌ నుంచి 30 కి.మీ. దూరంలో ఉంది. ఇది సముద్ర మట్టానికి 14,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. దీని ప్రభావం రెండు ఫర్లాంగుల వరకూ ఉంటుంది. అందుకే అక్కడ ఓ పసుపుపచ్చ గీత గీశారు. అక్కడ వాహనాన్ని నిలిపినట్లైతే అది నెమ్మదిగా పర్వతం వైపు కదులుతున్న దృశ్యం మనల్ని చకితుల్ని చేస్తుంది. ఈ ప్రాంతాన్ని నో ఫ్లై జోన్‌గా ప్రకటించారు. తరవాత హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ అనే కట్టడం దగ్గరకు వెళ్లాం. దేశ రక్షణకోసం వరసగా మనదేశం చేసిన యుద్ధాల్లో వీరుల పోరాటాలూ వాళ్ల విజయ ఘట్టాలూ అమరులైన సైనిక సోదరుల చిత్రపటాలూ అన్నీ అక్కడ ప్రదర్శనకి ఉంచారు. వాళ్లు వాడిన రకరకాల ఆయుధాలు కూడా అక్కడ ఉన్నాయి. చల్లని మంచులో సైనికులు ఎలా నివసిస్తారు, సైనికుడు తనతో ఎన్ని వస్తువులను తీసుకెళతాడు... వంటి అనేక విశేషాలను అక్కడ తెలుసుకోవచ్చు. మనలాంటివాళ్లకి ఏ బరువులూ లేకుండా మంచుపర్వతం ఎక్కడమే గగనంగా ఉంటే, సైనికులు మాత్రం అంతంత బరువులతో ఆ పర్వతాన్ని ఎక్కడం అనేది ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇప్పటివరకూ పరమవీరచక్ర, మహావీరచక్ర పతకాలు పొందిన సైనిక సోదరుల చిత్రపటాలూ కార్గిల్‌ యుద్ధంలో మరణించిన మేజర్‌ పద్మపాణి ఆచార్య చిత్రాలూ అక్కడ ఉన్నాయి. ఇక్కడ అమరవీరుల స్తూపం నిత్యం జ్వలిస్తూ కనిపిస్తుంది. ప్రతిరోజూ సాయంత్రం సైనిక సంగీత ప్రదర్శన, సౌండ్‌ అండ్‌ లైట్‌ షో ఉంటాయి.

ఉప్పునీటి సరస్సు!
అక్కణ్నుంచి ప్రపంచంలోనే ఎత్తైన పాంగోంగ్‌ ఉప్పునీటి సరస్సు చూడ్డానికి వెళ్లాం. ఇది లేహ్‌ నుంచి 130 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎడారి పర్వతాలగుండా ఘాట్‌రోడ్డులో సుమారు 5 గంటలు ప్రయాణం చేస్తే వస్తుందీ సరోవరం. సముద్రమట్టానికి 14 వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ సరస్సులో 60 శాతం చైనా స్వాధీనంలోనూ, 40 శాతం భారత్‌ అధీనంలోనూ ఉంది. ఇక్కడికి వెళ్లాలంటే అనుమతి పత్రం తప్పనిసరి. ఎంతో కష్టపడి ఎత్తైన కొండలను దాటుకుంటూ వెళ్లాం. కానీ అక్కడి సరస్సును చూడగానే ఆ కష్టాన్ని మరచిపోయాం. అంత అద్భుతంగా ఉందది. ఆకాశంలో సూర్యగమనాన్ని బట్టి రోజంతా రంగులు మారుతూ సందర్శకుల్ని చకితుల్ని చేస్తుందీ సరస్సు. ఉదయం వేళలో ముదురు నీలిరంగులో ఉండే నీళ్లు మధ్యాహ్నానికి ఆకుపచ్చరంగులోనూ సాయంత్రానికి పసుపూ ఎరుపూ కలగలిసినట్లుగా ఉంటాయి. ఇక్కడ సినిమా షూటింగులు జరుగుతుంటాయి. త్రీ ఇడియట్స్‌ సినిమాలోని చివరి సన్నివేశం ఇక్కడ తీసినదే. తిరుగు ప్రయాణంలో అదే సినిమాలో చూపించిన రంచోడ్‌దాస్‌ పాఠశాల కనిపించింది. నది ఒడ్డునే క్యాంపింగ్‌ సౌకర్యం ఉంది. రాత్రివేళలో ఆకాశంలోని చుక్కలన్నీ ఎంతో దగ్గరగా కనిపిస్తూ నక్షత్రలోకంలో ఉన్నామా అనిపిస్తుందనీ, ఆకాశంలో ఎలాంటి మబ్బులూ లేనివేళలో పాలపుంత కనిపిస్తుందనీ అక్కడివాళ్లు చెప్పారు.

ఎత్తైన రోడ్డుమార్గంలో...
హిమాలయాల్లోని మరో అద్భుత ప్రదేశమైన ఖార్డుంగ్‌ లాకి వెళ్లాం. ఇది ప్రపంచంలోనే ఎత్తైన రోడ్డుమార్గం. సముద్ర మట్టానికి 18,500 అడుగుల ఎత్తులో ఉన్న ఈ రోడ్డు మానస సరోవరానికన్నా మూడువేల అడుగుల ఎత్తులో ఉంది. లేహ్‌ నుంచి 39 కి.మీ. దూరంలో ఈ ప్రాంతానికి వెళుతుంటే మేఘాలు మనల్ని తాకుతున్నట్లే అనిపిస్తుంది. ఆ ప్రాంతంలోని కొండల్నీ ఆకాశాన్నీ చూస్తుంటే అంతరిక్షంలోనో మరో గ్రహంమీదో ఉన్న అనుభూతి కలుగుతుంది. ఇది భూమండలమేనా అన్న అనుమానమూ వస్తుంది. ఎత్తైన ఆ కొండలమీద నుంచి కిందకి చూస్తే అదో పాతాళలోకంలా కనిపిస్తుంది. ఆ ప్రాంతానికి చేరుకోగానే మంచుతో కప్పబడిన హిమాలయాలు కనువిందు చేస్తాయి. అక్కడ దిగి అందరం చిన్న పిల్లల్లా మంచులో ఆడుకున్నాం. అక్కడి నుంచి మరికాస్త ముందుకు వెళితే నుబ్రా వ్యాలీ వస్తుంది. లేహ్‌కు విరుద్ధంగా పచ్చని చెట్లతో కళకళలాడుతూ కనిపిస్తుంది. బాక్ట్రియన్‌ ఒంటెలుగా పిలిచే రెండు మూపురాల ఒంటెలు ఉన్నాయక్కడ. ఇవేకాదు, లేహ్‌లో మరెన్నో బౌద్ధారామాలూ, లేహ్‌ ప్యాలెస్‌... వంటి చారిత్రక స్థలాలు ఉన్నాయి. అవన్నీ చూసి సంతృప్తితో వెనుతిరిగాం.

No comments:

Post a Comment