Saturday, 8 December 2018

సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలు

సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలు
ఆరు ముఖాలు ఆరు ధామాలు


ఆదిదంపతుల పుత్రుడైన సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలు దేశ, విదేశాల్లో ఎన్నో ఉన్నాయి. తమిళనాడులో వీధికొక మురుగన్‌ ఆలయం ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఆ ఆలయాలన్నిటికీ మకుటాయమైనవిగా, మహిమాన్వితమైనవిగా తమిళనాడులోని ‘ఆరుపడై వీడుగళ్‌’ (ఆరు దివ్యధామాలు) ప్రసిద్ధి చెందాయి. వీటిలో ఒక్కో ఆలయానిదీ ఒక్కో ప్రత్యేకత.


తిరుచందూర్‌
సాగరతీరంలో

ఆరుపడై వీడుగళ్‌ సుబ్రహ్మణ్య క్షేత్రాలైన ఆరింటిలో అయిదు కొండలపై ఉండడం విశేషం. ఒక్క తిరుచందూరు ఆలయం సాగరతీరంలో ఉంటుంది. అన్నిటికన్నా మహిమాన్వితమైనదిగా దీన్ని పరిగణిస్తారు. శూరపద్ముడు అనే రాక్షసుడిని అంతం చేయడానికి దేవతల సేనాని అయిన కుమారస్వామి తన సేనలతో ఇక్కడ విడిది చేసినట్టు పురాణాలు చెబుతున్నాయి. రణసన్నద్ధుడైనట్టు సర్వాలంకారాలతో సమ్మోహనకరంగా కనిపించే మురుగన్‌ రూపాన్ని ఎంత చూసినా తనివి తీరదంటారు భక్తులు. ఈ స్వామివారి విభూతిని ప్రసాదంగా స్వీకరిస్తే ఆరోగ్యం సిద్ధిస్తుందనీ, దుష్ట శక్తుల పీడ నివారణ అవుతుందనీ నమ్మకం. ఆలయానికి సమీపంలోని సముద్ర తీరం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడికి 92 కి.మీ. దూరంలో కన్యాకుమారి చక్కటి పర్యాటక ప్రదేశం.

ఎక్కడుంది?: తమిళనాడులోని తూత్తుకుడి (ట్యుటికోరన్‌) జిల్లాలో
ఎలా వెళ్ళాలి?: తూత్తుకుడికి 46 కి.మీ., తిరునల్వేలికి 53 కి.మీ., మదురైకి 180 కి.మీ. దూరంలో తిరుచందూర్‌ ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాంతాల నుంచి తిరునల్వేలికి నేరుగా రైలు సదుపాయం ఉంది. మదురై వరకూ రైలులో వెళ్ళి, అక్కడి నుంచి రోడ్డు, రైలు మార్గాలలో తిరుచందూరు చేరుకోవచ్చు. హైదరాబాద్‌ నుంచి తిరునల్వేలి వరకూ ప్రైవేటు బస్సులు నడుస్తున్నాయి. రైళ్ళ కన్నా తక్కువ సమయంలో వెళ్ళొచ్చు. సమీప విమానాశ్రయం ట్యుటికోరన్‌లో
ఉంది.

తిరుప్పరన్‌కుణ్రమ్‌
పెళ్ళిళ్ళకు ప్రసిద్ధి

ఎక్కడుంది?: తమినాడులోని మదురై నగర శివార్లలో
ఎలా వెళ్ళాలి?: తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన ప్రాంతాల నుంచీ మదురైకి రైలు, విమాన సదుపాయాలు ఉన్నాయి. హైదరాబాద్‌ నుంచి ప్రైవేటు బస్సులు కూడా ఉన్నాయి. అక్కడి నుంచి తిరుప్పరన్‌కుణ్రమ్‌ ఆలయానికి సులువుగా చేరుకోవచ్చు.
ప్రత్యేకతలు: ఒకే కొండలో మలచిన ఆలయం ఇది. దీన్ని విశ్వకర్మ నిర్మించాడని ప్రతీతి. దేవసేన (దేవయాని)తో సుబ్రహ్మణ్యస్వామికి ఇక్కడే వివాహం జరిగిందని స్థల పురాణం చెబుతోంది. అందుకే వివాహాలు చేసుకోవడానికి ఇది ఎంతో పవిత్రమైన ప్రదేశంగా తమిళులు భావిస్తారు. మరో విశేషం ఏమిటంటే, మిగిలిన అయిదు ఆలయాల్లో స్వామి నిలబడి ఉంటారు. తిరుప్పరన్‌కుణ్రమ్‌ గుహాలయంలో మాత్రం ఆయన ఆసీనుడై ఉంటారు. ఒకవైపు దేవసేన, మరోవైపు నారద మహర్షి విగ్రహాలు ఉంటాయి. ఈ ఆలయంలో స్వామి విగ్రహానికి బదులు ఆయన శూలానికి (వేలాయుధం) అభిషేకాలు నిర్వహిస్తారు. ఇక్కడికి దగ్గరలోని మదురైలో మీనాక్షి అమ్మవారి ఆలయం మరో ముఖ్యమైన యాత్రాస్థలం.

పళని
కావడి మొక్కుల జ్ఞానక్షేత్రం

ఎక్కడుంది?: తమినాడులోని దిండిగల్‌ జిల్లాలో
ఎలా వెళ్ళాలి?: దిండిగల్‌కు 57 కి.మీ., కోయంబత్తూరుకు 118 కి.మీ., మదురైకి 120 కి.మీ. దూరంలో పళని ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన కేంద్రాల నుంచి ఈ మూడు ప్రాంతాలకూ నేరుగా రైళ్ళున్నాయి. సమీప విమానాశ్రయం కోయంబత్తూరులో ఉంది.
ప్రత్యేకతలు: పళనిని ‘తిరు ఆవినన్‌కుడి’ అని కూడా అంటారు. ఇక్కడి బాల సుబ్రహ్మణ్యుణ్ణి ‘దండాయుధపాణి’ అనీ, ‘వేలాయుధుడ’నీ పిలుస్తారు. కుడిచేత దండాన్ని పట్టుకొని, ఎడమ చేతిని నడుముకు ఆన్చి, కౌపీనంలో బాల సుబ్రహ్మణ్య స్వామి దర్శనమిస్తారు. పళనిని ‘జ్ఞాన క్షేత్రం’ అంటారు. జ్ఞానప్రదాతగా దండాయుధపాణిని ఎందరో తమిళ కవులు స్తుతించారు. మురుగేశుడికి మొక్కుకొని కావళ్ళు ఎత్తే సంప్రదాయం ఇక్కడే మొదలైందని పెద్దలు చెబుతారు. ఈ ఆలయాన్ని చేరుకోడానికి 690 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. చిన్న రైలులో కూడా వెళ్ళవచ్చు.

స్వామిమలై
ఓంకార ఉపదేశ స్థలం

ఎక్కడుంది?: తమిళనాడులోని కుంభకోణానికి సుమారు 6 కి.మీ. దూరంలో
ఎలా వెళ్ళాలి?: తిరుచురాపల్లి (తిరుచ్చి) నుంచి సుమారు 80 కి.మీ. దూరంలో స్వామిమలై ఉంది. తిరుచ్చికి తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రధాన ప్రాంతాల నుంచి కుంభకోణానికి నేరుగా (వీక్లీ) రైలు సౌకర్యం ఉంది. లేదా తిరుచ్చిలో దిగి, అక్కడి నుంచి రోడ్డు, రైలు మార్గాల్లో కుంభకోణం చేరుకోవచ్చు. సమీపవిమానాశ్రయం తిరుచ్చిలో ఉంది.
ప్రత్యేకతలు: స్వామిమలైలోని సుబ్రహ్మణ్యుణ్ణి ‘స్వామినాథుడు’ అని పిలుస్తారు. ఈ ఆలయానికి 60 మెట్లు ఉంటాయి. అవి భారతీయ సంప్రదాయంలోని అరవై సంవత్సరాలకు సంకేతమని పెద్దలు చెబుతారు. ప్రణవమంత్రమైన ఓంకారాన్ని తండ్రి అయిన శివుడికి మురుగన్‌ ఉపదేశించాడనీ, ఆ ప్రదేశం ఇదేననీ స్థలపురాణం పేర్కొంటోంది. తండ్రికే గురువైన స్వామి వెలసిన చోటుగా దీన్ని ‘గురుమలై’ అని కూడా అంటారు. కుంభకోణం చుట్టుపక్కల అనేక సందర్శనీయ స్థలాలూ, ఆలయాలూ ఉన్నాయి.

పళముదిర్చోళై
అటవీ ప్రాంతంలో ఆరోగ్య దాత

ఎక్కడుంది?: తమిళనాడులోని మదురైకి సుమారు 24 కి.మీ. దూరంలో
ఎలా వెళ్ళాలి?: తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన ప్రాంతాల నుంచీ మదురైకి రైలు, విమాన సదుపాయాలు ఉన్నాయి. హైదరాబాద్‌ నుంచి ప్రైవేటు బస్సులు కూడా ఉన్నాయి.
ప్రత్యేకతలు: ‘ఆరుపడై వీడు’ ఆలయాల్లో తన దేవేరులు వల్లి, దేవసేనలతో కుమారస్వామి కొలువైన ఏకైక గుడి ఇది. అడవుల మధ్య ప్రశాంత వాతావరణంలో ఈ ఆలయం ఉంటుంది. సమీపంలో ‘నూపురగంగ’ అనే జలప్రవాహం ఉంటుంది. ఈ స్వామిని కూడా ఆరోగ్యప్రదాతగా అర్చిస్తారు. ప్రముఖ తమిళ కవయిత్రి, సాధువు అయిన అవ్వయార్‌ను స్వామి పరీక్షించింది ఇక్కడే అని ఐతిహ్యం. ఈ ఆలయంలో స్వామివారి శక్తి ఆయుధానికి అభిషేకాలు నిర్వహిస్తారు. ఆలయానికి దగ్గరలో అనేక జలపాతాలున్నాయి. భక్తులు వీటిలో స్నానాలు చేసి స్వామిని దర్శించుకుంటారు. శివ, గణేశ ఆలయాలు కూడా ఈ సముదాయంలో ఉన్నాయి.

తిరుత్తణి
365 మెట్ల స్వామి వాసం


ఎక్కడుంది?: తమిళనాడులోని తిరువళ్ళూరు జిల్లాలో
ఎలా వెళ్ళాలి?: తిరుపతికి 67 కి.మీ., చెన్నైకి 83 కి.మీ. దూరంలో తిరుత్తణి ఉంది. ఆ నగరాలకు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన ప్రాంతాల నుంచీ బస్సు, రైలు, విమాన సదుపాయాలు ఉన్నాయి. తిరుపతి, చెన్నై నుంచి రైలు, రోడ్డు మార్గాల్లో తిరుత్తణి చేరుకోవచ్చు.
ప్రత్యేకతలు: తమిళనాడుకు ఒక చివర ‘తిరుచందూర్‌’ ఉంటే, మరో చివర ‘తిరుత్తణి’ ఉంది. తెలుగు రాష్ట్రాలకు అతి సమీపంగా ఉన్న సుబ్రహ్మణ్య క్షేత్రం తిరుత్తణి. ఈ ఆలయానికి చేరుకోడానికి 365 మెట్లు ఎక్కాలి. అవి ఏడాదిలోని 365 రోజులకు సంకేతం అంటారు. వల్లి-సుబ్రహ్మణ్యుడు కలుసుకున్న చోటు, వారి వివాహం జరిగిన ప్రదేశం ఇదేనని పురాణాలు పేర్కొంటున్నాయి. ఇక్కడ స్వామిని ప్రార్థిస్తే అభీష్ట సిద్ధి, మానసిక ప్రశాంతత లభిస్తాయని భక్తులు నమ్ముతారు. తిరుత్తణికి సుమారు 50 కి.మీ. దూరంలో ‘వల్లిమలై’ ఉంది. వల్లీదేవి స్వస్థలంగా దాన్ని భావిస్తారు. స్వామివారి ఉత్సవమూర్తులకు పైన ఉండే గొడుగు రుద్రాక్షలతో చేసి ఉండడం విశేషం.

No comments:

Post a Comment