Thursday, 3 January 2019

లంబసింగిమంచు కురిసే వేళలో
పొగమంచు అందాలను ఆస్వాదిద్దాం అలా అలా తాకే మంచు తుంపర్లు...
చుట్టూ దుప్పటిలా పరుచుకున్న పొగమంచు...
గడ్డ కట్టించే చలి...
కశ్మీర్‌ను తలపించే వాతావరణం...
చూస్తే ఎవరికైనా మనసు పులకరించకమానదు. హాయి హాయిగా శరీరం తేలిపోతూనే ఉంటుంది. అది మాటల్లో చెప్పలేని అనుభూతి. అనుభవిస్తేనే తెలుస్తుంది. ఈ వాతావరణం మరెక్కడో లేదు. మన రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లా మన్యంలో నెలకొంది. అక్కడ కురుస్తున్న మంచు వాతావరణం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది.

విశాఖ మన్యంలో మండువేసవిలోనూ చల్లని వాతావరణం కనిపిస్తుంటుంది. శీతాకాలమైతే చెప్పనవసరమే లేదు. చలికి గజగజలాడాల్సిందే. చింతపల్లి, లంబసింగి వంటి ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. ఇది సముద్రమట్టానికి సుమారు 3600అడుగుల ఎత్తులో ఉంది. చలికాలం మంచుదట్టంగా కమ్ముకుని వర్షం చినుకుల్లా కురుస్తుంది.  సూర్యకిరణాలు ఇక్కడ నేలను తాకే అవకాశాలు తక్కువ. ఉదయం 8 నుంచి 11 గంటల మధ్యలో దట్టమైన పొగమంచు కప్పేసి ఉంటుంది. ఎముకలు కొరికే చలి, పొగమంచు వంటి సహజసిద్ధ ప్రకృతి సోయగాలు విశేషంగా ఆకట్టుకుంటాయి. చుట్టూ ఎత్తయిన కొండలు, వంపులు తిరిగిన ఘాట్‌ రోడ్డు, కాఫీతోటలు, నీటివనరులు దర్శనమిస్తాయి. ఇది ఆంధ్రా కశ్మీర్‌గా గుర్తింపు పొందింది. ఇక్కడ స్ట్రాబెర్రి పండ్ల పెంపకాన్ని చూడడానికి ఆసక్తి చూపుతుంటారు. సమీపంలోనే బ్రిటీష్‌ కాలం నాటి రూథర్‌పర్డ్‌ అతిథిగృహం ఉండేది. ఇప్పుడు అది పూర్తిగా శిథిలమైంది. లంబసింగి నుంచి 14 కిలోమీటర్ల దూరంలో చింతపల్లి పోలీస్‌స్టేషన్‌పైనే ఆనాడు అల్లూరి సీతారామరాజు, తన బృందంతో దాడి చేసి ఆయుధాలను పట్టుకుని వెళ్ళిపోయారు. పర్యాటకులు తప్పనిసరిగా జి.మాడుగుల మండలం కొత్తపల్లి జలపాతం... అక్కడి నుంచి పాడేరు మీదుగా అరకు, బొర్రా గుహలను సందర్శిస్తారు. దూరప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు రాత్రి బస చేసేందుకు లంబసింగిలో ఎటువంటి వసతి సదుపాయాలు లేకపోవడంతో స్థానికులే వారికి భోజన, వసతి సదుపాయాలను సమకూరుస్తున్నారు. ఇటీవల కొందరు లంబసింగి, తాజంగి ప్రాంతాల్లో చిన్నచిన్న రిసార్టులు ప్రారంభించారు. క్యాంప్‌ టెంట్లను ఏర్పాటు చేసి అద్దెకు ఇస్తున్నారు. ఆరుబయట మంచులో క్యాంప్‌ ఫైర్‌ వెలిగించి టెంట్‌లో సేదతీరడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పర్యాటకశాఖ రూ.8 కోట్లతో నిర్మిస్తున్న రిసార్ట్‌ పనులు మూడు నాలుగు నెలల్లో పూర్తి చేస్తామని ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ డీవీఎమ్‌ ప్రసాద్‌ రెడ్డి చెప్పారు.


ఇలా చేరుకోవచ్చు

విశాఖపట్నం నుంచి చింతపల్లి మీదుగా భద్రాచలం బస్సులు ఉన్నాయి. మల్కాన్‌గిరి, వయా భద్రాచలం మీదుగా హైదరాబాద్‌ బస్సు కూడా రోజుకోసారి విశాఖ నుంచి వెళుతుంటుంది. వీటి ద్వారా చేరుకోవచ్చు. ఆరు గంటల ప్రయాణం. విశాఖ నుంచి నర్సీపట్నం చేరుకుంటే అక్కడి నుంచి భద్రాచలం బస్సులతో పాటు ప్రైవేటు వాహనాలు చాలా ఉంటాయి.భిన్న భౌగోళిక పరిస్థితుల వల్లే

రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పోల్చి చూస్తే లంబసింగి భిన్నమైన భౌగోళిక స్వరూపంతో నిండి ఉంది. ఈ ప్రాంతం సముద్రమట్టానికి 1000 మీటర్ల ఎత్తులో ఉంది. ప్రతి 100 మీటర్లకు ఒక డిగ్రీ సాధారణ ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. ఆ లెక్కన మిగతా ప్రాంతాలతో పోల్చితే ఇక్కడ 10 డిగ్రీలు తగ్గుతుంది. గాలిలో సాంద్రత తక్కువ కారణంగా ఇక్కడ పొగమంచు నేరుగా నేలను తాకకుండా చెట్ల ఆకులపై పడుతుంది. చుట్టూకొండలే ఉండడంతో పొగమంచు వేరే చోటుకు ప్రయాణించడానికి వీల్లేకుండా అక్కడే స్థిరంగా ఉండిపోతుంది. అవన్నీ కలగలిపి ఉండటమే ప్రత్యేకత. తెలుగురాష్ట్రాల్లో ఒకటి రెండు చోట్ల ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నా అక్కడ మంచు, అడవుల ప్రభావం ఉండదు.

- డాక్టర్‌ డీవీ రమణారెడ్డి, ఏడీఆర్‌, చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం
No comments:

Post a Comment