Wednesday, 15 January 2020

అరకులోయ ఆంధ్రా ఊటీఅరకులోయ
పచ్చందనమే పచ్చదనమే!విశాఖమన్యం... ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. ఆంధ్రా ఊటీగా పిలుచుకునే అరకు అయితే శీతకాలంలో మంచుదుప్పటి కప్పుకుని పర్యటకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. విస్తారంగా విరబూసే వలిసెపూలతోటలతో భూదేవికి పసుపురాసినట్టుండే ఆ అందాలను చూడ్డానికి రెండు కళ్లూ సరిపోవు. ఇటు సందర్శకులను కట్టిపడేస్తూ... అటు గిరిజనులకు ఆదాయాన్నీ అందిస్తున్న వలిసెపూల గురించి మరిన్ని విశేషాలు...

వలిసెపూల అందాలతో విరాజిల్లే అరకును చూడ్డానికి చలికాలం ఎంతో అనువైంది. ఆకుపచ్చని ఓక్‌ చెట్లూ పుసుపుపచ్చని వలిసెల మధ్య పొగమంచు కమ్ముకుని పర్యటకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది అరకు వాతావరణం. కళ్లు తిప్పుకోనివ్వని ఆ అందాల్ని చూడ్డానికి లక్షలాది పర్యటకులు ఈ సీజన్‌లో విశాఖ మన్యానికి వెళుతుంటారు. సెలయేళ్లూ, జలపాతాలూ, బొర్రాగుహలూ తదితరాలన్నీ చూడ్డంతోపాటు ప్రత్యేకంగా సాగు చేసే వలిసె తోటల్లో ఫొటోలు దిగి... ఆ అందాల్ని కెమెరాలోనూ, జ్ఞాపకాల్ని మదిలోనూ భద్రపరచుకుని తిరిగివస్తుంటారు.

గిరిజనులకు జీవనాధారమైన వలిసెల సాగుకు ఉష్ణోగ్రత 10-15 డిగ్రీల సెల్సియస్‌లోపు ఉండాలి. అందుకు అరకు వాతావరణం చాలా అనుకూలం. ఆగస్ట్టులో ఈ పంటను సాగు చేస్తే నెలరోజుల్లోనే పువ్వులు వస్తాయి. దాంతో నాలుగునెలలపాటు ఆ ప్రాంతం పచ్చని వలిసెలతో కళకళలాడుతుందన్నమాట. అరకుతోపాటు, పాడేరు, చింతపల్లి, ముంచంగిపుట్టు, డుంబ్రిగుడ వంటి ప్రాంతాల్లో దాదాపు ఏడెనిమిదివేల ఎకరాల్లో రైతులు ఈ పంటను విరివిగా సాగు చేస్తున్నారు. అందుకే వలిసెల అందాలతో ప్రకృతి పసుపు పావడా కట్టుకున్నట్టు కనిపిస్తుందక్కడ. అంతేకాదు, మనదేశంలో వలిసెలు అత్యధికంగా సాగయ్యేది కూడా ఒక్క విశాఖ మన్యంలోనే. ఈ ప్రాంతంలో తప్ప తెలుగు రాష్ట్రాల్లో మరెక్కడా కనిపించని వలిసె గింజల నుంచి తీసిన నూనె కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. మనదగ్గర ఉత్తరాంధ్రతోపాటు ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్రల్లో ఈ నూనెను వంటల్లో ఎక్కువగా వినియోగిస్తారు. అలానే వలిసెపూల తేనెకి అరకు పెట్టింది పేరు. ఈ తోటల్లోనే తేనెటీగల పెంపకం కూడా పెద్ద ఎత్తున చేపడుతుంటారు. అందుకే గుంటూరు, కృష్ణాజిల్లాలకు చెందిన కొందరు రైతులు ఈ కాలంలో అరకులోనే ఉండి వలిసె రైతులకు ఎంతోకొంతిచ్చి తేనెటీగలను పెంచుతుంటారు. ఈ తేనె పట్టులతోనూ వలిసె రైతులకు లబ్ధి చేకూరుతోంది.

శీతకాలంలో సినిమా కళ...
మొదట్లో ఈ సాగుకు ఐటీడీఏ(ఇంటిగ్రేటెడ్‌ ట్రైబల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ) విత్తనాలు సరఫరా చేసేది. ఇప్పుడు రైతులే ముందు పంట తాలూకు గింజల్ని దాచుకుని మరుసటి ఏడాది విత్తుతున్నారు. అలానే ఈ పంటకు పెట్టుబడి కూడా పెద్దగా అవసరం ఉండదు. పైగా చీడలు అంతగా ఆశించవు. రైతులు ఎలాంటి రసాయన ఎరువులూ ఉపయోగించరు. పంట వేయడానికి ముందు మాత్రం సేంద్రియ ఎరువుతో నేలని చదును చేస్తారు. అలా చాలా తక్కువ పెట్టుబడితో లాభసాటిగా ఉండే వలిసెల సాగు పర్యటకులకి కనువిందు చేయడంతోపాటు రైతులకూ సిరులు కురిపిస్తోంది. పోషణ చక్కగా చేస్తే ఎకరానికి రెండుమూడు క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఒడిశాకు చెందిన వ్యాపారులే వీటిని కొనుగోలు చేసి నూనె ఉత్పత్తి చేస్తుంటారు. అలానే ఈ చలికాలం అరకుకు సినిమా కళని కూడా తీసుకొస్తుంది. ఎంతో ఆహ్లాదకరంగా ఉండే ఈ వాతావరణం ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ల కాలం నుంచే షూటింగులకు నెలవైంది. అరకు షూటింగుకు వెళ్లిన ప్రతి సినిమాలోనూ ఒక్క సీన్‌ అయినా వలిసె తోటల్లో ఉండి తీరాల్సిందే. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, ఒరియా తదితర సినిమాల షూటింగులూ ఇక్కడ  జరుగుతుంటాయి. ఈ పచ్చందాల మధ్య మీరు కూడా ఫొటోలు దిగేయండి మరి.
- బంగారంబండి అనిల్‌కుమార్‌No comments:

Post a Comment