Thursday, 16 January 2020

లోకల్‌ ఊటీలు

లోకల్‌ ఊటీలు

లేత చలిగాలులు చక్కిలిగింతలు పెడుతున్న వేళ.. తెలుగు నేల మంచు ధాన్యాలు కొలుస్తున్న వేళ.. హేమంత రాగాలు విందాం పదండి..చెంతనే ఉన్న మన ఊటీలకు కదలండి..
అరకులో వలిసె పూలు అరవిరిశాయి. అనంతగిరులు కమ్మని కాఫీకి ఆహ్వానిస్తున్నాయి. హేమంతం రాకతో.. మన్యసీమంతా చలికౌగిట చిక్కి చక్కగా కనువిందు చేస్తోంది. గిరులన్నీ మంచుతెరలు చుట్టుకొని ఆహ్లాదాలకు అడ్డాగా మారిపోయాయి. ఈ సౌందర్యాన్ని ఆస్వాదించడానికి సిద్ధమవ్వండి. కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే లంబసింగికి తరలి వెళ్లండి.
 

మన కశ్మీరం
లంబసింగి, విశాఖపట్నం

దట్టంగా కమ్ముకున్న పొగమంచు, మేనును తాకే చల్లగాలులు, పసుపు రంగు వలిసె పూల సోయగాలు.. ఈ ప్రకృతి సోయగాలు లంబసింగిలో కనిపిస్తాయి. తూర్పు కనుమల్లోని గిరిజన పల్లె సకల జనులకూ స్వాగతం పలుకుతోంది. ఆంధ్రా ఊటీగా, కశ్మీర్‌ ఆఫ్‌ ఆంధ్రాగా పేరున్న లంబసింగిలో చలికాలంలో సున్నా కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. సముద్రమట్టానికి 1,000 మీటర్ల ఎత్తులో ఉందీ పల్లె. ఇక్కడికి చేరుకునే మార్గం గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. గిరులను దాటుకుంటూ, లోయల్లోకి దిగిపోతూ సాగిపోయే దారి మనసును మధుసీమలకు తీసుకుపోతుంది. నవంబరు, డిసెంబరు, జనవరి మాసాల్లో ఇక్కడ పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. కొండపైకి చేరిన ప్రకృతి ప్రేమికులు.. గిరుల మాటున అస్పష్టంగా ఉదయిస్తున్న భానుబింబాన్ని చూసి ఆశ్చర్యానందాలకు లోనవుతారు. మిట్ట మధ్యాహ్నం పూట పొగమంచును దాటుకొని బలవంతంగా వచ్చే సూర్యకిరణాలు అందించే నులివెచ్చని స్పర్శను ఆస్వాదిస్తారు. ప్రకృతితో మమేకం అయ్యేవారు కొందరు. ఆ అందాలన్నింటినీ సెల్‌ఫోన్లో బంధిస్తూ ఇంకొందరు తన్మయం చెందుతారు.
లంబసింగిలో కాఫీ తోటలు విస్తారంగా కనిపిస్తాయి. స్ట్రాబెర్రీ తోటలు పలకరిస్తాయి. తోటల్లోకి వెళ్లి కలియ తిరగొచ్చు. అడుగంత ఎత్తు కూడా లేని తీగల్లాంటి స్ట్రాబెర్రీ మొక్కలు ఎంతో అందంగా ఉంటాయి. తాజా స్ట్రాబెర్రీలను కొనుక్కొని, దోసిళ్లలో నింపుకొని, కొసరి కొసరి తింటూ కోరినవన్నీ పొందిన అనుభూతికి లోనవుతారు.

లంబసింగి వచ్చినవారంతా అక్కడికి 50 కి.మీ. దూరంలో ఉన్న కొత్తపల్లి జలపాతానికి తప్పకుండా వెళతారు. లంబసింగి నుంచి కొత్తపల్లికి గంట ప్రయాణం. పైనుంచి జాలువారుతున్న నీటి ధారలు ముత్యాల హారాన్ని తలపిస్తాయి. జలపాత సోయగాలకు ముగ్ధులైపోయి ఎముకలు కొరికే చలిలోనూ జలక్రీడల్లో మునిగిపోతారు.
ఇలా వెళ్లాలి: లంబసింగి.. విశాఖపట్నం నుంచి 100 కి.మీ దూరంలో ఉంటుంది. విశాఖ నుంచి బస్సులు ఉన్నాయి. విశాఖపట్నం, రాజమండ్రి, నర్సీపట్నం మీదుగా చేరుకోవచ్చు. భద్రాచలం నుంచి సీలేరు, చింతపల్లి మీదుగా కూడా రావొచ్చు. లంబసింగి నుంచి అరకు 92 కి.మీ. దూరంలో ఉంటుంది.
- కేతిరెడ్డి రాజ్యలక్ష్మి
 

  శీతల సీమలో 
అనంతగిరి, వికారాబాద్‌

హైదరాబాదీలకు చెంతనే ఉన్న ఊటీ అనంతగిరి. వికారాబాద్‌ పట్టణానికి సమీపంలో ఉన్న ఈ పచ్చని కొండలు వారాంతపు విడిదిగా అలరిస్తున్నాయి. ఈ సమయంలో మరింత ఆహ్లాదాన్ని పంచుతాయి. చుట్టూ పచ్చదనం, పక్షుల కిలకిలలు మనసును తేలిక పరుస్తాయి. ట్రెక్కింగ్‌ జోన్‌గానూ ఇది ప్రసద్ధి చెందింది. మంచు కురిసే వేళలో.. నైట్‌క్యాంప్‌లో చలిమంటలు వేసుకొని ప్రకృతి ఒడిలో సేదతీరుతారు పర్యాటకులు. హేమంత రాత్రుల్లో నిర్మలాకాశంలో చుక్కలు లెక్కిస్తూ కాలాన్ని మరచిపోతారు. ఇక్కడి అనంత పద్మనాభస్వామి ఆలయ దర్శనంతో ఆధ్యాత్మిక ఆనందమూ కలుగుతుంది. కొండపై ఉద్యానవనం కాలక్షేపానికి కేరాఫ్‌గా నిలుస్తుంది.
చేరుకునేదిలా: అనంతగిరి.. వికారాబాద్‌ శివారులో ఉంటుంది. హైదరాబాద్‌ నుంచి వికారాబాద్‌కు (70 కి.మీ) చేరుకుంటే.. అక్కడి నుంచి అనంతగిరి కొండపైకి సులభంగా చేరుకోవచ్చు.

చల్లనికొండ    
హార్స్‌లీ హిల్స్‌, చిత్తూరు
వేసవిలోనూ చల్లదనాన్ని పంచే అద్భుత ప్రదేశం హార్స్‌లీ హిల్స్‌. చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలంలో ఉందిది. పరవశింపజేసే ప్రకృతి ఇక్కడి ప్రత్యేకత. తూర్పుకనుమల్లోని దక్షిణ భాగంలో విస్తరించిన హార్స్‌లీ హిల్స్‌ సముద్ర మట్టానికి 4,312 అడుగుల ఎత్తులో ఉంటుంది. దట్టమైన అడవిలో ఘాట్‌ రోడ్డు ప్రయాణం భలేగా ఉంటుంది. చల్లని కొండగాలి గుండెకు ఊసులు చెబుతుంది. డిసెంబరు, జనవరి నెలల్లో ఇక్కడ చలి పంజా విసురుతుంది. వెన్నులో చలి వణుకు పుట్టిస్తున్నా.. ప్రకృతితో మమేకం అవుతుంటారు పర్యాటకులు. మంచు పరదాల మాటునున్న పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ మురిసిపోతుంటారు. కొండపై బస ఏర్పాట్లు బాగుంటాయి. పర్యాటక, అటవీశాఖకు చెందిన అతిథి గృహాలు ఉన్నాయి.ప్రైవేట్‌ అతిథి గృహాలూ అద్దెకు లభిస్తాయి.
చేరుకునేదిలా: హార్స్‌లీ హిల్స్‌ మదనపల్లె నుంచి 29 కిలోమీటర్ల దూరంలో, తిరుపతి నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మదనపల్లె నుంచి ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేట్‌ ట్యాక్సీల్లోనూ వెళ్లొచ్చు. మదనపల్లె సమీపంలోని రిషి వ్యాలీ కొండలు కూడా చుట్టుముట్టిన మేఘమాలికలతో ఆహ్వానాన్ని పలుకుతాయి.

No comments:

Post a Comment