Thursday, 16 January 2020

కథ కంచి నుంచే..

కథ కంచి నుంచే..
దసరదా యాత్ర
ఓ గుడికి వెళ్తే.. భక్తి భావం వికసిస్తుంది. మరో క్షేత్రానికి వెళ్తే.. నిర్మాణశైలి సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. ఇంకో ధామానికి వెళ్తే.. ప్రాచీన సంప్రదాయ విపంచి మనసు పొరలను కదిలిస్తుంది.. దసరా కదా! పైగా వారం రోజుల సెలవులు.. అటు ఆధ్యాత్మికత.. ఇటు విజ్ఞాన వినోదాల సమాహారాన్ని ఆస్వాదించొద్దాం.. పదండి విజయోస్తు!!
ధ్యాత్మిక కేంద్రాలకు చిరునామా తమిళనాడు. కంచి, మదురై, చిదంబరం, రామేశ్వరం, అరుణాచలం ఇలా ఎన్నో పుణ్యక్షేత్రాలకు నెలవు. ఉత్సవాలు, ఊరేగింపులు తరచూ జరుగుతూనే ఉంటాయి. యాత్రికులతో కిటకిటలాడుతుంటాయి. నవరాత్రుల సందర్భంగా ఆధ్యాత్మిక ధామాలు కొత్త శోభను సంతరించుకుంటాయి. ఈ సమయంలో వీటిని దర్శించుకుంటే కలిగే అనుభూతి జీవితాంతం గుర్తుండిపోతుంది. ముందుగా చెన్నై వెళ్తే.. అక్కడి నుంచి వరుసగా కంచి, చిదంబరం, కుంభకోణం, తంజావూరు, శ్రీరంగం, మదురై క్షేత్రాలను దర్శించుకోవచ్చు.
ఇదీ మార్గం..
వారం రోజుల్లో ఈ ఆధ్యాత్మిక యాత్ర పూర్తి చేసుకోవచ్చు. ముందుగా చెన్నైకి చేరుకుంటే.. అక్కడి నుంచి సొంత వాహనంలో గానీ, ట్యాక్సీలో గానీ, ప్రజా రవాణా ద్వారా గానీ ప్రయాణం కొనసాగించవచ్చు. చెన్నై నుంచి కంచి 74 కి.మీ. దూరంలో ఉంటుంది.
కంచి నుంచి చిదంబరం 190 కి.మీ. దూరంలో ఉంటుంది. మహాబలిపురం, పుదుచ్చేరి వంటి పర్యాటక కేంద్రాల మీదుగా చిదంబరం చేరుకోవచ్చు.
చిదంబరం నుంచి కుంభకోణానికి దూరం 80 కి.మీ. ఈ మార్గంలో గంగాయికొండ చోళపురం వస్తుంది. ఇక్కడ కూడా ఒక బృహదీశ్వరాలయం ఉంది.
కుంభకోణం నుంచి తంజావూరు 40 కి.మీ. దూరంలో ఉంటుంది. ఇక్కడి నుంచి శ్రీరంగం 60 కి.మీ., అక్కడి నుంచి మదురై 145 కి.మీ. దూరంలో ఉంటాయి.
మదురై నుంచి పళని (120 కి.మీ.), కొడైకెనాల్‌ (100 కి.మీ.) వెళ్లొచ్చు.
కామాక్షి సన్నిధిలో..: కంచి
అన్ని కథలూ కంచికి చేరతాయి. కంచి కథ మాత్రం శతాబ్దాల కిందటే మొదలైంది. దేశంలోని ఏడు మోక్ష క్షేత్రాలలో ఇదీ ఒకటి. వెయ్యి ఆలయాల నగరంగా దీనికి పేరు. కంజీవరం, కాంచీపురం అనీ పిలుస్తారు. ఈ పట్టణంలో ఒకవైపు శైవ ఆలయాలు, మరోవైపు వైష్ణవాలయాలు దర్శనమిస్తాయి. శక్తి ఆలయాలు కోకొల్లలు. అన్నీ పురాతనమైనవే! మండువా లోగిళ్లు, చిన్న చిన్న వీధులు, చిన్నాపెద్దా ఆలయాలు, పూల అంగళ్లు, రకరకాల దుకాణాలు, వచ్చిపోయే యాత్రికులతో కంచిలో నిత్యం తిరునాళ్ల సందడి కనిపిస్తుంది. ఈ క్షేత్రంలో కామాక్షి ఆలయం ప్రముఖమైంది. ఎందరో యోగులు కామాక్షి సన్నిధిలో సాధన చేస్తుంటారు. మరోవైపు ఎన్నో కళలు కల నేత కంచిపట్టు పుట్టిల్లు కూడా ఇదే! పట్టణంలో నేతన్నల ఇళ్లు తప్పక సందర్శించాల్సిందే! పట్టుచీరలు నేయడంలో వారి పట్టును కళ్లారా చూడాల్సిందే.
చూడాల్సినవి
ఏకాంబరేశ్వరాలయం
కైలాసనాథ ఆలయం
వరదరాజ కోవెల
చిత్రగుప్తుని గుడి
బృహద్‌ వైభవం: తంజావూరు
ఇక్కడ రూపుదిద్దుకున్న వీణ.. దేశం నలుమూలలా సుస్వరాలు పలికిస్తూ ఉంది. ఇక్కడి చిత్తరువులు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. కళలకు కాణాచి ఈ పట్టణం. ఆలయాల నిలయం ఈ క్షేత్రం. చోళరాజుల పరాక్రమానికి చారిత్రక గుర్తు. అదే తంజావూరు. ఇక్కడి బృహదీశ్వరాలయం చూసి తీరాల్సిందే. క్రీ.శ 1004-1009 మధ్య మొదటి చోళరాజు హయాంలో దీనిని నిర్మించారని చెబుతారు. శత్రురాజులపై విజయానికి గుర్తుగా ఈ భారీ ఆలయాన్ని కట్టించారట. అరుదైన శిల్పాలతో అలరించే ఈ గుడి యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది. బృహదీశ్వరాలయం ఎత్తు సుమారు 216 అడుగులు. ఆలయంలో పదమూడున్నర అడుగుల ఎత్తున్న శివలింగం దర్శనమిస్తుంది. దీనికి ఎదురుగా 19 అడుగుల భారీ నందీశ్వరుడు కొలువుదీరి ఉంటాడు. ఈ ఆలయాన్ని నిర్మించి వెయ్యేళ్లు పూర్తవుతున్నా.. నేటికీ చెక్కుచెదరలేదు. తంజావూరులోని సరస్వతీ మహల్‌.. ఆసియా ఖండంలోనే పురాతనమైన గ్రంథాలయాల్లో ఒకటి. తాళపత్రాలు, పురాతన గ్రంథాలు ఎన్నో ఇక్కడ భద్రంగా ఉన్నాయి.
చూడాల్సినవి
గణపతి గుడి
మరాఠా ప్యాలెస్‌
రాయల్‌ ప్యాలెస్‌
అంతా రహస్యం: చిదంబరం
పంచభూత లింగ క్షేత్రాల్లో ఒకటి చిదంబరం. కంచి ఏకాంబరేశ్వరుడు భూతత్వ లింగమైతే.. ఇక్కడ శివయ్య ఆకాశ లింగం. నిరాకారంగా సాక్షాత్కరిస్తాడు. అదే చిదంబర రహస్యం. ఆలయాల నెలవు ఈ క్షేత్రం. నలభై ఎకరాల సువిశాల ప్రాంగణంలో ప్రధాన ఆలయం ఉంటుంది. అపురూప శిల్పకళతో ద్రవిడ వైభవాన్ని కళ్లముందు ఉంచుతుంది. క్రీస్తుశకం రెండో శతాబ్దంలో దీనిని నిర్మించారని చెబుతారు. 13వ శతాబ్దంలో పునర్నిర్మించారట. ఈ ఆలయంలో పరమేశ్వరుడు చంద్రమౌళీశ్వరుడిగా, నటరాజస్వామిగా దర్శనమిస్తాడు. ఆకాశలింగంగా ఏ రూపమూ లేకుండా అనుగ్రహిస్తాడు. గర్భాలయం వెనుక గోడ మీద ఓ చక్రం గీసి ఉంటుంది. అది ఎవరికీ కనిపించకుండా ఒక తెర అడ్డంగా ఉంటుంది. ప్రత్యేక సందర్భాల్లో తెరను తొలగిస్తారు. ఉప ఆలయాలు, భారీ మంటపాలతో కోవెల అపురూప దృశ్యకావ్యంగా కనిపిస్తుంది.
చూడాల్సినవి
పిచ్చవరం మడ అడవులు
కాళి అమ్మన్‌ ఆలయం
అనంత సౌందర్యం: శ్రీరంగం
శ్రీరంగం ప్రముఖ వైష్ణవ క్షేత్రాలలో ఒకటి. రెండు పాయలుగా విడిపోయిన కావేరీ నదిలో ఓ ద్వీపంలా ఉంటుందీ క్షేత్రం. ఇక్కడి అనంతపద్మనాభుడి ఆలయం అనంత శిల్పసంపదకు ఆలవాలం. 156 ఎకరాల్లో విస్తరించిన ఆలయం 7 ప్రాకారాలు, 22 గోపురాలు, 9 తీర్థాలతో అద్భుతంగా కనిపిస్తుంది. ఈ క్షేత్రాన్ని ఎందరో రాజులు, చక్రవర్తులు అభివృద్ధి చేశారు. ఇక్కడి రాజగోపురం 236 అడుగుల ఎత్తు ఉంటుంది. 192 అడుగుల వెడల్పు, 13 అంతస్తులతో ఆశ్చర్యం కలిగిస్తుంది. శ్రీరంగానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తిరుచిరాపల్లి. చోళ రాజులు మొదలు విజయనగర పాలకుల వరకు ఎందరో రాజుల ఏలికలో తిరుచిరాపల్లి చిరస్మరణీయమైన కీర్తిని గడించింది. మదుర నాయకుల పాలనలో అభివృద్ధి సాధించింది. ఇక్కడి రాక్‌ఫోర్ట్‌ ఆనాటి రాజుల వైభవానికి చిహ్నంగా నిలిచింది. తిరుచిరాపల్లి పట్టణానికి శ్రీరంగం ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
అడుగడుగున గుడి: కుంభకోణం
కుంభకోణం గురించి తరచూ పత్రికల్లో చదువుతాం. నాలుగు రోజులయ్యాక ఆ సంగతే మర్చిపోతాం. అసలైన కుంభకోణం చూస్తే.. మనసు ఆనందంతో నిండిపోతుంది. జన్మంతా ఆ క్షేత్ర వైభవం గుర్తుండిపోతుంది. ఈ చిన్న పట్టణంలో వందకుపైగా పురాతన ఆలయాలున్నాయి. వీటిలో కొన్ని శివాలయాలైతే, ఇంకొన్ని విష్ణు ఆలయాలు. బ్రహ్మ ఆలయమూ ఉంది. శివాలయాల్లో ప్రముఖమైనది కుంభేశ్వరస్వామి కోవెల. ఈ స్వామి పేరిటే.. దీనికి కుంభకోణమనే పేరు వచ్చింది. పట్టణ శివారులో మహామాఘం అనే పెద్ద కోనేరు ఉంటుంది. జీవనదికి పుష్కరాలు నిర్వహించినట్టు.. ఈ కోనేరుకూ చేస్తారు. ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి బృహస్పతి సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు 12 రోజుల పాటు పుష్కరాలు చేస్తారు. ఇందులో పాల్గొనేందుకు లక్షల మంది యాత్రికులు తరలి వస్తారు. మరో విశేషమేంటంటే.. నవగ్రహాల గుడులు. సాధారణంగా నవగ్రహాలకు కలిపి ఒకటే ఆలయం ఉంటుంది. కుంభకోణంలో ఒక్కో గ్రహానికీ ఓ గుడి ఉంది. ఈ పట్టణంలో కంచు, రాగి, ఇత్తడితో విగ్రహాలు రూపొందిస్తుంటారు. ఇక్కడ తయారయ్యే మూర్తులు దేశదేశాలకు ఎగుమతి అవుతుంటాయి. పట్టుచీరల తయారీ కేంద్రాలూ ఎక్కువే ఇక్కడ. కాఫీకీ కుంభకోణం ప్రసిద్ధి.
మమతల తల్లి: మదురై
చల్లని చూపుల తల్లి మీనాక్షి. అళగర్‌ పెరుమాళ్‌ అందాల చెల్లిగా కొలువుదీరిన అమ్మ.. విద్యను అనుగ్రహిస్తుందనీ, సంపదను కటాక్షిస్తుందనీ భక్తుల విశ్వాసం. మొదట అమ్మవారిని దర్శించుకున్న తర్వాతే.. శివాలయానికి వెళ్తారు భక్తులు. దేవీ ఆలయంలో నిత్యం పండగ వాతావరణం కనిపిస్తుంది. సువిశాలమైన ఆలయ ప్రాంగణంలో ఎన్నెన్నో ఉపాలయాలు ఉంటాయి. నాలుగు దిక్కులా నాలుగు అందమైన గోపురాలు ఉంటాయి. వీటి ఎత్తు సుమారు 160 అడుగులు. ఆలయ ప్రాంగణంలో అందమైన కోనేరు ఉంటుంది. వెయ్యి స్తంభాల మంటపం ప్రత్యేక ఆకర్షణ. తెల్లవారుజామున 5 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకూ ఆలయం తెరిచే ఉంటుంది. ఆలయ వైభవం ఇలా ఉంటే.. మదురై పట్టణ సౌందర్యం మరింత అబ్బురపరుస్తుంది. వైగై నది ఒడ్డున ఉన్న ఈ పురాతన పట్టణం ప్రశాంతంగా కనిపిస్తుంది. సనాతన కుటుంబాలు, అందమైన లోగిళ్లతో వీధులు దర్శనమిస్తాయి. ఉత్సవాల వేళ.. యాత్రికులతో వాడలన్నీ కిక్కిరిసిపోతాయి.
చూడాల్సినవి
అళగర్‌ ఆలయం
సుబ్రహ్మణ్య గుడి
వైగై ఆనకట్ట
ఇస్కాన్‌ మందిరం

No comments:

Post a Comment