Thursday, 16 January 2020

గోదావరి నదీ పరిక్రమ

నదీ నమామీ పరిక్రమామి
తల్లి గోదారిని చుట్టేద్దాం
ఉప్పొంగే గోదారి.. గలగలల గోదారి.. అఖండ గోదారి.. ఆ నదీమతల్లి ఏ తీరులో ప్రవహించినా మనోహరమే! ఎక్కడో బ్రహ్మగిరిలో జననం.. మరెక్కడో ఉన్న కడలికై పయనం. గిరులు దాటుకొని.. లోయల్లో పడిపోయి.. పాయలుగా విడిపోయి.. తన పరీవాహక ప్రాంతాన్ని పచ్చగా చూసే కల్పవల్లి గోదావరి. దక్షిణ గంగగా పేరొందిన గోదావరికి కృతజ్ఞతా పూర్వకంగా ప్రదక్షిణ చేసే సంప్రదాయం ఒకటుంది. అదే గోదావరి పరిక్రమ. త్రయంబకం మొదలు సాగర సంగమం వరకు గో‘దారి’ వెంట సాగుతూ.. తీర్థరాజాల్లో మునుగుతూ.. క్షేత్రాలను దర్శించుకుంటూ.. ప్రణతులిడటం జన్మకో అదృష్టం!
మహారాష్ట్రలోని త్రయంబక క్షేత్రం సమీపంలో ఉన్న బ్రహ్మగిరి గోదావరి ఉద్భవ స్థానం. పడమటి కనుమల్లో పల్లవించిన నది త్రయంబకేశ్వరుడి ఆలయం చెంత పిల్ల కాల్వగానే తన ప్రస్థానం మొదలుపెడుతుంది. తర్వాత అనేక ఉపనదులను తనలో కలుపుకొంటూ ముందుకు సాగుతుంది. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలను పావనం చేసి.. అఖండ గోదారిగా రూపుదాల్ఛి. కడలిలో కలిసిపోతుంది. గోదావరి నది పొడవు సుమారు 1,465 కిలోమీటర్లు. ఈ నది చుట్టూ ప్రదక్షిణ చేయడం అంటే మామూలు విషయం కాదు. దాదాపు 3,500 కిలోమీటర్ల ప్రయాణం చేస్తే గానీ.. పరిక్రమ పూర్తవ్వద్ధు.
అనుకూల సమయం?
అక్టోబరు మాసాంతం నుంచి మార్చి పూర్తయ్యే వరకు గోదావరి పరిక్రమకు అనుకూల సమయం. యాత్రలో పరిసరాల్లోని క్షేత్రాలనూ సందర్శించవచ్ఛు 18 రోజుల్లో పరిక్రమ పూర్తవ్వాలనేది పెద్దల మాట.
గంగాఖేడ్‌: ధర్మపురి నుంచి జగిత్యాల, మెట్‌పల్లి, నిజామాబాద్‌, బోధన్‌, ముద్‌ఖేడ్‌ మీదుగా గంగాఖేడ్‌ (315 కి.మీ) చేరుకోవాలి. గంగాఖేడ్‌ చారిత్రక నగరం.
చూడాల్సినవి: గంగాఖేడ్‌ కోట, పాండురంగాలయం, శివాలయం, జ్యోతిర్లింగ క్షేత్రం పర్లి (31 కి.మీ.)
షిరిడీ: గోదావరి తటిపై లేకున్నా.. పరిక్రమలో షిరిడీని తప్పక దర్శిస్తారు భక్తులు. బాబా దర్శనంతో ప్రశాంతత కలుగుతుందని నమ్మకం.
చూడాల్సినవి: సాయిబాబా మందిరం, ఖండోబా దేవాలయం, బాబా పెంచిన పూదోట.. లెండీ వనం, ద్వారకామాయి మసీదు, బాబా చావడి
షిరిడీ నుంచి మళ్లీ నాసిక్‌ మీదుగా త్రయంబకం చేరుకొని గోదావరి దర్శనంతో సంపూర్ణ పరిక్రమ పూర్తవుతుంది.
ధర్మపురి: యోగ లక్ష్మీ నారసింహుడు కొలువై ఉన్న క్షేత్రమిది. చెంతనే ఉగ్ర నరసింహుడి దర్శనమూ చేసుకోవచ్ఛు పరిశుద్ధంగా పారే గోదావరి జలాల్లో స్నానంతో పాపాలు తొలగిపోయాయన్న అనుభూతి కలుగుతుంది.
చూడాల్సినవి: నరసింహస్వామి ఆలయం, కోటి లింగాల (శాతవాహనుల మొదటి రాజధాని 18 కి.మీ.)
మంథని: మంత్రపురిగా పేరున్న మంథనిలో సనాతన సంప్రదాయ వైభవం కనిపిస్తుంది. వేదఘోష వినిపిస్తుంది.
చూడాల్సినవి: మహాలక్ష్మీ ఆలయం, భిక్షేశ్వర గుడితో పాటు ఇతర పురాతన ఆలయాలు
కాళేశ్వరం: త్రివేణి సంగమ క్షేత్రమిది. గోదావరి, ప్రాణహిత, సరస్వతి (అంతర్వాహిని) కలిసే పవిత్రస్థలి. అపురూప ఆలయాలు ఎన్నో ఉన్నాయిక్కడ.
చూడాల్సినవి: కాళేశ్వర-ముక్తీశ్వర ఆలయం, దత్తాత్రేయ గుడి, కాళేశ్వరం ప్రాజెక్టులోని నిర్మాణాలు
బూర్గంపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంటుంది. ఇక్కడ ప్రశాంత గోదావరిని చూడొచ్ఛు ఇక్కడి నుంచి భద్రగిరి ఆలయ శిఖరం అత్యద్భుతంగా దర్శనమిస్తుంది.
కొవ్వూరు: నరసాపురం నుంచి పాలకొల్లు మీదుగా కొవ్వూరు చేరుకోవాలి. దీనికి గోష్పాద క్షేత్రమని పేరు.
చూడాల్సినవి: సోమేశ్వర మందిరం, పట్టిసీమ, భద్రకాళీ వీరభద్రస్వామి ఆలయం
మూడు రకాలుగా ప్రదిక్షణ..
కంఠ పరిక్రమ: త్రయంబకం నుంచి కాశ్యపీ జలాశయం మీదుగా గంగాపూర్‌లోని గోదావరి నదిపై నిర్మించిన డ్యామ్‌ నుంచి మళ్లీ త్రయంబకం చేరుకోవడంతో కంఠ పరిక్రమ పూర్తవుతుంది.
నాభి పర్యంతం: త్రయంబకంలో మొదలుపెట్టి గంగాపూర్‌ డ్యామ్‌, పంచవటి, పైఠాన్‌, నాందేడ్‌, బాసర, కాళేశ్వరం వరకు రావాలి. అక్కడ గోదావరి-ప్రాణహిత సంగమ ప్రాంతాన్ని దర్శించుకొని కాళేశ్వరం, మంథని, ధర్మపురి, నాందేడ్‌, గంగాఖేడ్‌, నెవాసా, షిరిడీ, నాసిక్‌, త్రయంబకం చేరుకోవడంతో నాభి పర్యంతం పరిక్రమ పూర్తవుతుంది.
సంపూర్ణ ప్రదక్షిణం: త్రయంబకం నుంచి గోదావరి సముద్రంలో కలిసే చోటు వరకు వెళ్లి.. మళ్లీ త్రయంబకానికి చేరుకోవడం సంపూర్ణ పరిక్రమ ప్రత్యేకత. త్రయంబకం నుంచి నదికి ఉత్తర తీరంలో ఉన్న క్షేత్రాలను దర్శించుకుంటూ ముందుకు సాగాలి. గోదావరి సాగర సంగమ ప్రాంతాన్ని సందర్శించిన తర్వాత దక్షిణ తీరంలోని క్షేత్రాల మీదుగా సాగుతూ మళ్లీ త్రయంబకం చేరుకోవాలి. దీనిని ఉత్తమ ప్రదక్షిణగా చెబుతారు.
త్రయంబకం, పంచవటి, పైఠాన్‌, బాసర, చెన్నూరు, గడ్చిరోలి, భద్రాచలం, రాజమహేంద్రవరం, యానాం వెళ్లి.. అక్కడ గోదావరి సంగమ ప్రాంతాన్ని సందర్శించాలి. అక్కడి నుంచి నరసాపురం మీదుగా కొవ్వూరు, బూర్గంపాడు, కాళేశ్వరం, మంథని, ధర్మపురి, గంగాఖేడ్‌, షిరిడీ, నాసిక్‌ మీదుగా త్రయంబకం చేరుకోవడంతో సంపూర్ణ పరిక్రమ పూర్తవుతుంది.
త్రయంబకం: త్రయంబకంలో గోదావరి చిన్న కాల్వలా కనిపిస్తుంది. గంగాద్వారా పర్వతంపై గోదావరి ఆలయం ఉంటుంది. అక్కడి నుంచి బ్రహ్మగిరి దర్శనం చేసుకుకోవడంతో పరిక్రమ మొదలవుతుంది.
చూడాల్సినవి: త్రయంబక జ్యోతిర్లింగం, గోరఖ్‌నాథ్‌ గుహ, కేదారీశ్వరాలయం, స్వామి సమర్థ ఆశ్రమం, రామలక్ష్మణ తీర్థం
పైఠాన్‌: మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ జిల్లాలో ఉంటుంది పైఠాన్‌. ఒకప్పుడు ప్రతిష్ఠానపురమనే పేరుతో శాతవాహనుల రాజధానిగా ఉండేది.
చూడాల్సినవి: నాథ్‌సాగర్‌ డ్యామ్‌, సంత్‌ ఏక్‌నాథ్‌ మందిరం, ధ్యానేశ్వర్‌ ఉద్యానవనం, జయక్వాడీ పక్షుల సంరక్షణ కేంద్రం, పైఠాన్‌ పట్టుచీరల పరిశ్రమ
బాసర: పైఠాన్‌ నుంచి షాహగడ్‌, పర్భణీ, నాందేడ్‌, నిర్మల్‌, ముధోల్‌ మీదుగా బాసర చేరుకోవాలి. చదువుల తల్లి సరస్వతీదేవి కొలువై ఉన్న క్షేత్రమిది. ఇక్కడ ప్రశాంత గోదావరి మనసుకు ఆహ్లాదాన్నిస్తుంది.
చూడాల్సినవి: సరస్వతీ ఆలయం, వ్యాస మహర్షి గుహ, దత్తాత్రేయ ఆలయం
చెన్నూరు: బాసర నుంచి నిర్మల్‌, మంచిర్యాల మీదుగా చెన్నూరు చేరుకోవాలి. ఇక్కడ గోదావరి ఉత్తర వాహిని. అందుకే సాధకులు చెన్నూరులో నదీ స్నానానికి ప్రాధాన్యమిస్తారు.
చూడాల్సినవి: భవానీ అగస్తీశ్వర మందిరం
గడ్చిరోలి: చెన్నూరు నుంచి బెల్లంపల్లి, ఆసిఫాబాద్‌, రాజురా, గోండ్‌పిపారీ, అష్టి మీదుగా గడ్చిరోలి (సుమారు 285 కి.మీ.) చేరుకోవాలి. ఈ మార్గంలోనే వార్ధానది, వెన్‌ గంగా నది ప్రాణహితలో కలుస్తాయి.
చూడాల్సినవి: వెన్‌గంగా తీరంలో అష్టి దగ్గర పురాతనమైన మార్కండేశ్వర మందిరం
భద్రాచలం: గడ్చిరోలి నుంచి సిరొంచా, కాళేశ్వరం, భూపాలపల్లి, ఏటూరునాగారం, వాజేడు, చెర్ల మీదుగా భద్రాచలం (510 కి.మీ.) చేరుకోవాలి. తెలుగునాట శ్రీరాముడి దివ్యక్షేత్రం భద్రాచలం. ఇక్కడి భద్రగిరిపై శ్రీరామచంద్రుడు చతుర్భుజాలతో వెలిశాడని స్థల పురాణం.
చూడాల్సినవి: రామాలయం, పర్ణశాల
రాజమహేంద్రవరం: భద్రాద్రి నుంచి చింతూరు, మారేడుమిల్లి, రంపచోడవరం మీదుగా రాజమహేంద్రవరం (201 కి.మీ.) వెళ్లాలి. పచ్చని అడవి గుండా సాగే ఈ ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. కాటన్‌ బ్యారేజీ తర్వాత గోదావరి రెండు పాయలు యానాం వైపు, రెండు నరసాపురం దిశగా సాగిపోతాయి. ఈ పాయలే మళ్లీ ఏడుగా విడిపోయి ప్రవహిస్తాయి.
చూడాల్సినవి: రాజమహేంద్రవరం నగరం, కడియం నర్సరీలు, ద్రాక్షారామం
యానాం: ఇక్కడే గౌతమీ నది మొదటిపాయ సముద్రంలో కలుస్తుంది. సంగమ ప్రాంతాన్ని బోటులో వెళ్లి చూడొచ్ఛు లాంచీల్లో మిగిలిన పాయలు దాటుకొని వశిష్ఠ మొదటి పాయ నుంచి మళ్లీ నదిలోకి ప్రవేశించొచ్ఛు తగిన భద్రత లేకపోతే లాంచీలకు దూరంగా ఉండండి. యానాంలో సాగర సంగమం చూసుకొని రోడ్డు మార్గంలో నరసాపురం చేరితే పరిక్రమ సగం పూర్తవుతుంది.
చూడాల్సినవి: అంతర్వేది, మురమళ్ల (వీరభద్ర ఆలయం), అప్పనపల్లి (కోనసీమ తిరుపతి)
పంచవటి: అరణ్యవాస సమయంలో సీతారామలక్ష్మణులు గోదావరి ఒడ్డున ఉన్నారని నమ్ముతారు. లక్ష్మణుడు.. శూర్పణఖ ముక్కు కోసింది, రాముడు.. మారీచుడ్ని సంహరించింది ఇక్కడే అని చెబుతారు.
చూడాల్సినవి: రామ కుండం, లక్ష్మణ కుండం, సీత కుండం, పంచవటి (ఐదు వట వృక్షాలు), సీతా గుహ, కాలారామ్‌ ఆలయం, గంగాపూర్‌ డ్యామ్‌, కాశ్యపీ డ్యామ్‌
- నారాయణ గురూజీ, మంథని

No comments:

Post a Comment