Thursday, 16 January 2020

అరకుఅరవిరిసె

అరకుఅరవిరిసె
ఉదయం 6.50 గంటలు.. విశాఖపట్టణం రైల్వే స్టేషన్‌.. ప్లాట్‌ఫామ్‌పై ప్రజలు గుంపులు గుంపులుగా ఉన్నారు. అందరి ఎదురుచూపులూ కిరండూల్‌ ప్యాసింజర్‌ గురించే.. అరకు అందాలు చూడాలనుకునే పర్యాటకులకు అంతకుముందే.. అద్భుతమైన దృశ్యాలను చూపిస్తుందీ రైలు. సొంత వాహనాలు ఉన్నా.. రైలు ప్రయాణానికే మొగ్గు చూపుతారంతా. రైలు కదిలింది మొదలు.. ప్రతిక్షణం ఓ అద్భుతమే!
విశాఖపట్టణం నుంచి 30 కిలోమీటర్లు దాటాక తర్వాత అసలైన ప్రయాణం మొదలవుతుంది. ఓవైపు కొండలు.. ఇంకోవైపు లోయలు.. రివ్వున వీచే చల్లగాలి.. ప్రతి దృశ్యం మనోహరమే! ఈ వింతల నుంచి తేరుకోకముందే.. చిమ్మచీకటి కమ్మేస్తుంది. రైలు శబ్దంలో లయ మారుతుంది. అంతలోనే మళ్లీ వెలుగు.. ఇంతలోనే మళ్లీ చీకటి.. ఇలా చీకటివెలుగుల కౌగిలిలో ప్రయాణం సాగిపోతుంది. ఈ మార్గంలో బొద్దవర గ్రామం నుంచి కరకవలస వరకు 70 కిలోమీటర్ల దూరంలో 52 సొరంగాలు ఉంటాయి. 150 మీటర్ల నుంచి కిలోమీటర్‌ పొడవున్న సొరంగాలు కూడా ఉన్నాయి. వీటి గుండా రైలు దూసుకుపోతున్నప్పుడు ప్రయాణికుల కేరింతలు సొరంగాల్లో ప్రతిధ్వనిస్తాయి. ఇదే రైలులో అద్దాల బోగీ (విస్టాడోమ్‌) ఒకటుంటుంది. అందులో ప్రయాణం మరింత ఆనందంగా సాగుతుంది. ఈ బోగీలో ప్రయాణించాలంటే ముందస్తుగా టికెట్‌ బుక్‌ చేసుకోవాల్సిందే.
బొర్రా గుహల మీదుగా.. 

అరకులోయకు వెళ్లే ప్రయాణికులు ముందుగా బొర్రా గుహలకు చేరుకుంటారు. సముద్రమట్టానికి 800 మీటర్ల ఎత్తున ఉండే ఈ గుహలు 150 మిలియన్‌ సంవత్సరాల కిందట ఏర్పడ్డాయని చెబుతారు. గుహల పైకప్పులోని సున్నపు రాయి కరిగి బొట్లుబొట్లుగా కింద పడి.. అందులోని నీరు ఆవిరై సున్నపురాయి మిగిలి విచిత్ర ఆకృతులు ఏర్పడ్డాయి. శివలింగం, తల్లీకూతుళ్లు, రాక్షసబల్లి వంటి రూపాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. బొర్రా గుహల నుంచి అరకు వెళ్లే దారిలో ప్రకృతి సౌందర్యం మనసును హత్తుకుంటుంది. చాలామంది ప్రైవేట్‌ ట్యాక్సీల్లో అరకు బాట పడతారు. వెళ్తూవెళ్తూ ముందుగా బొర్రాగుహలకు ఏడు కిలోమీటర్ల దూరంలోని కటికి జలపాతాన్ని సందర్శిస్తారు. ఇక్కడ గోస్తనీ నదీ జలాలు 50 అడుగుల ఎత్తు నుంచి దూకుతూ అలరిస్తాయి. దీనికి 18 కిలోమీటర్ల దూరంలోని తాడిగూడెం  జలపాతం కూడా సందర్శనీయ స్థలమే.
విరివనంలోకి.. 
తాడిగూడెం తర్వాత అనంతగిరి కొండలు ప్రారంభమవుతాయి. ఏపుగా పెరిగిన సిల్వర్‌ ఓక్‌ చెట్లు దర్శనమిస్తాయి. చెట్లకు దట్టంగా మిరియాల పొదలు అల్లుకొని ఉంటాయి. కనుచూపుమేరలో విస్తరించిన కాఫీ తోటలు మరింత ఆహ్లాదాన్నిస్తాయి. అనంతగిరి కొండలు దాటాక అసలైన దృశ్యం కంటపడుతుంది. కొండల నడుమనున్న విశాలమైన మైదానాల్లో విరిసిన పసుపుపచ్చని వలిసె పూలు తారసపడతాయి. సెప్టెంబరు నుంచి డిసెంబరు మధ్య కాలంలో ఈ పంట వేస్తారు. నవంబరు రాకతో.. ఆ ప్రాంతమంతా పూలవనంగా మారిపోతుంది. కేవలం ఈ పూలను చూసేందుకే అరకు వచ్చే పర్యాటకులూ ఉంటారంటే అతిశయోక్తి కాదు. కాసేపు ఇక్కడ ఫొటోలు దిగి, కబుర్లాడి ముందుకు కదులుతారు. మరో 12 కిలోమీటర్లు ప్రయాణిస్తే అరకులోయ వస్తుంది. చుట్టూ పచ్చదనం, ఆహ్లాదకరమైన వాతావరణం చూడగానే జీవితాంతం అరకులోనే ఉండిపోతే బాగుండు అనే భావన కలుగుతుంది.
ఆకాశం నుంచి ..
గతేడాది అరకులో మొదటిసారి బెలూన్‌ ఫెస్టివల్‌ నిర్వహించారు. 2019 జనవరిలో అరకులోయ మరోసారి బెలూన్‌ ఉత్సవానికి వేదిక అవుతోంది. హాట్‌ బెలూన్స్‌లో గగనతలానికి వెళ్లగానే.. కొండలు, లోయల్లో దాగున్న అందాలన్నీ కంటపడతాయి. గత ఏడాది 16 బెలూన్లు.. పర్యాటకులకు ఆనందాన్ని పంచితే.. ఈసారి బెలూన్ల సంఖ్య పెరగనుంది. అంతెత్తు నుంచి కాఫీ తోటలు, గిరిజన గ్రామాల సందర్శన గొప్ప అనుభూతినిస్తుంది.
* ఎప్పుడు: జనవరి 18,19,20
మంచి సమయమిది

అరకు ప్రయాణానికే కాదు.. విశాఖ విహారానికీ ఇది అనువైన సమయం. డిసెంబరు నెలలో సాగర నగరం పలు కార్యక్రమాలకు వేదిక కానుంది. ఆ వివరాలు..
ఎప్పుడు?: డిసెంబరు 4, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు
తీరంలో ధూంధాం 

విశాఖపట్టణం కేంద్రంగా ఏటా డిసెంబర్‌ 4న నిర్వహించే నావికా దినోత్సవం ఆద్యంతం ఉత్సాహంగా సాగుతుంది. 1971లో ఇండో పాక్‌ యుద్ధంలో భాగంగా భారత నౌకాదళం కరాచీ హార్బర్‌పై దాడి చేసింది. దీనికి గుర్తుగా ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రామకృష్ణ తీరంలో నావికా దళం చేసే విన్యాసాలు, యుద్ధనౌకల దాడులు, శతఘ్నుల మోతలు అమితంగా ఆకట్టుకుంటాయి.
ఉత్సవ విశాఖ 
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ పండగగా గుర్తింపు పొందిన విశాఖ ఉత్సవాలు డిసెంబరులో జరగనున్నాయి. మూడు రోజులు జరిగే ఉత్సవాల నేపథ్యంలో నగరంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాలను సుందరంగా ముస్తాబు చేస్తారు. తీరంలో విద్యుద్దీపాలు కాంతులీనుతుంటాయి. ఆర్కేబీచ్‌ ప్రధాన కేంద్రంగా జరిగే ఉత్సవాల్లో జానపద, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు దేశవిదేశీ కళాకారుల ప్రదర్శనలు ఉంటాయి.
పారాగ్లైడింగ్‌, పారామోటరింగ్‌, స్కూబా డైవింగ్‌ వంటి సాహస క్రీడలు పర్యాటకులను అలరిస్తాయి. నగర విహారానికి ప్రత్యేక ప్యాకేజీలు కూడా అందుబాటులో ఉంటాయి.
ఎప్పుడు?: డిసెంబరు 28 నుంచి 30 వరకు
ఇవీ చూడండి
అరకులో గిరిజన మ్యూజియం ప్రత్యేక ఆకర్షణ. గిరిజనుల జీవితం ప్రతిబింబించేలా రూపొందించిన ఆకృతులు భలేగా ఉంటాయి. పిల్లల ఆటవస్తువులు, అలంకరణ సామగ్రి, వివిధ పరికరాలు ఇక్కడ అమ్ముతారు.
గిరిజన సంక్షేమ శాఖ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సంయుక్తంగా ఏర్పాటు చేసిన బొటానికల్‌ ఉద్యానవనం కూడా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. 252 రకాల అరుదైన మొక్కలను ఇక్కడ చూడొచ్చు.
- గంట విజయ్‌ భాస్కర్‌

No comments:

Post a Comment