Thursday, 16 January 2020

సాయి స్మృతుల్లో..హాయి శ్రుతుల్లో..

సాయి స్మృతుల్లో..హాయి శ్రుతుల్లో..

ఏ కొట్టులో చూడూ కోవా పేడాలు.. దారి వెంట చెరకు రసాలు.. ఎవరిని కదిలించినా ‘జీ సాయిరాం..’ పలకరింపులు. షిరిడీ క్షేత్ర పరిసరాల్లో నిత్యం కనిపించే దృశ్యాలివి. సాయిబాబా దర్శనానికి ఏడాదంతా భక్తులు క్యూ కడుతుంటారు. బాబా సమాధి పొందిన విజయ దశమి సందర్భంగానైతే తండోపతండాలుగా తరలివెళ్తారు. ఈ ఏడాది భక్తుల సంఖ్య మరింత పెరగనుంది కూడా. వందేళ్ల కిందట 1918లో దసరా నాడే సాయిబాబా మహాసమాధి చెందారు. మరి ఆ శతాబ్ది మహోత్సవాల్లో పాల్గొనాలని భక్తులంతా ఇప్పుడు చలో షిరిడీ అనే అంటున్నారు. ఒక్క బాబా సమాధిని దర్శించుకోవటమే కాదు.. వీలుంటే షిరిడీ చుట్టుపక్కల ఉన్న యాత్రా స్థలాల్ని చుట్టేసిరావొచ్చు.
కళలకు నెలవు.. 
ఔరంగాబాద్‌.. మహారాష్ట్ర పర్యాటక రాజధానిగా పేరొందిన ఈ పట్టణం.. షిరిడీ నుంచి 108 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబు ఈ ప్రాంతాన్ని పాలనాకేంద్రంగా చేసుకొని దక్షిణాది వ్యవహారాలు చూసుకునేవారు. అప్పటి నుంచి ఈ పట్టణం ఔరంగాబాద్‌గా పేరొందింది. ఇక్కడ చూడాల్సిన వాటిలో బీబీ-కా-మక్బరా ఒకటి. దక్కన్‌ తాజ్‌మహల్‌గా గుర్తింపు పొందిన ఈ కట్టడం.. ఔరంగజేబు భార్య రబియా దురానీ సమాధి. ఔరంగాబాద్‌ సమీపంలో శత్రుదుర్భేద్యమైన దౌలతాబాద్‌ కోట (15 కి.మీ) సందర్శించాల్సిన ప్రదేశం. శతాబ్దాల నుంచి పట్టువస్త్రాల తయారీలో తన ప్రత్యేకతను చాటుకుంటున్న ఔరంగాబాద్‌లో అందమైన పట్టు చీరలు, నాణ్యమైన శాలువాలు కూడా లభిస్తాయి.
* ఔరంగాబాద్‌ సమీపంలో ప్రఖ్యాత అజంతా-ఎల్లోరా గుహలున్నాయి. అజంతా 95 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దానికి చెందిన ఈ గుహల్లోని అపురూప శిల్పాలు బౌద్ధమతానికి ప్రతీకలుగా కనిపిస్తాయి. గుర్రపునాడా ఆకారంలో ఉన్న గుట్టల్లో ఏకంగా 29 గుహలుండటం విశేషం.


* ఔరంగాబాద్‌ నుంచి ఎల్లోరా 32 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. క్రీస్తుశకం 5-10 శతాబ్దాల మధ్య నిర్మించిన ఈ గుహల్లో హిందు, బౌద్ధ, జైన మతాల ఆనవాళ్లు ఉన్నాయి. విభిన్న మతాల వైభవం ఇక్కడ దర్శించవచ్చు. గుట్టల్లోని కైలాస దేవాలయం ఆనాటి కళాకారుల గొప్పదనాన్ని తెలియజేస్తుంది. కొండను తొలచి ఆలయాన్ని నిర్మించిన తీరు అబ్బురపరుస్తుంది.
* ఔరంగాబాద్‌కు దగ్గర్లో ఉన్న శైవక్షేత్రం (58 కి.మీ) ఘృష్ణేశ్వర్‌. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఘృష్ణేశ్వరుడి దర్శించేందుకు ఏడాది పొడుగునా భక్తులు తరలి వెళ్తుంటారు. దిల్లీ సుల్తానుల దాడిలో ధ్వంసమైన ఈ ఆలయాన్ని 18వ శతాబ్దంలో పునరుద్ధరించారు.


షిరిడీకి వచ్చిన భక్తులు బాబా లీలలను స్మరిస్తుంటారు. సాయినామం జపిస్తూ ఉంటారు. భక్తులే కాదు.. సాధారణ పర్యాటకులు కూడా.. బాబా సంస్థానంలోకి అడుగుపెట్టాక అలౌకికమైన అనుభూతికి లోనవుతారు. సమాధి మందిరంలో నిలువెత్తు పాలరాతి విగ్రహం.. కంటి చూపును కట్టిపడేస్తుంది. రాగయుక్తంగా సాగే హారతులు.. తన్మయత్వంలో ముంచేస్తాయి. మందిరమంతా కలయ తిరిగి.. సాయి సమాధిని దర్శించి, బాబా విభూతి నుదుటన ధరించి, ఆయన చిత్రమాలికను వీక్షించి.. ప్రశాంతమైన మనసుతో బయటకు కదులుతారు భక్తులు.

సాయి సన్నిధిలో.. 
బాబా సమాధి దర్శనంతో షిరిడీ పర్యటన పూర్తవ్వదు. సాయి సచ్ఛరిత్రతో అనుబంధం ఉన్న ప్రదేశాలెన్నో ఇక్కడ ఉన్నాయి. బాబాను తొలిసారి ‘సాయి’ అని పిలిచిన మహల్సాపతి అర్చకత్వం వహించిన ఖండోబా దేవాలయం, సాయి స్వయంగా పెంచిన పూదోట.. లెండీ వనం, బాబా నివాసమున్న ద్వారకామాయి మసీదు, తరచూ వెళ్లి విశ్రాంతి తీసుకున్న బాబా చావడీ.. ఇలా ఎన్నో ఇప్పుడు పర్యాటక కేంద్రాలుగా బాసిల్లుతున్నాయి. పట్టణంలోని దీక్షిత్‌వాడా సందర్శనశాలలో సాయికి సంబంధించిన అరుదైన చిత్తరువులు దర్శించవచ్చు. ఇక్కడి సాయి హెరిటేజ్‌ విలేజ్‌లో బాబా జీవితంలోని ముఖ్య ఘట్టాలను శిల్పాల రూపంలో చూడొచ్చు.

ఇలా వెళ్లాలి: హైదరాబాద్‌ నుంచి షిరిడీకి నాన్‌స్టాప్‌ విమాన సర్వీసులు నడుస్తున్నాయి. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్టణం నుంచి షిరిడీకి రైళ్లు అందుబాటులో ఉన్నాయి. షిరిడీ సమీపంలోని నాగర్‌సోల్‌కు సికింద్రాబాద్‌ నుంచి రెగ్యులర్‌ రైలు సర్వీసులు ఉన్నాయి. అక్కడి నుంచి షిరిడీకి (40 కి.మీ) ట్యాక్సీల్లో వెళ్లొచ్చు.


అంతా శనైశ్చర మహిమ.. 
షిరిడికి వచ్చే యాత్రికులు తప్పక సందర్శించే ప్రాంతం శని శింగణాపూర్‌. శనైశ్చరుడు కొలువుదీరిన ఈ పుణ్యక్షేత్రం షిరిడీకి 74 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి. ఒక్కొక్కరికి రూ.300 (రానూపోనూ) వరకు వసూలు చేస్తారు. నల్లటి రాతి స్తంభాన్ని శనైశ్చరుడిగా భావించి తైలాభిషేకాలు నిర్వహిస్తారు. మరో విశేషం ఏంటంటే.. ఈ గ్రామంలోని ఇళ్లకు ద్వారాలు ఉండవు. శనిదేవుడి మహిమ కారణంగా తమ గ్రామంలో ఎలాంటి చోరీలు జరగవంటారు స్థానికులు.


రామాయణానికి కేరాఫ్‌.. 
షిరిడీ పర్యటనలో మరో మజిలీ నాసిక్‌. ‘గ్రేప్‌ సిటీ’గా పేరొందిన నాసిక్‌లో ఒకవైపు గోదావరి గలగలలు వినిపిస్తాయి. మరోవైపు ద్రాక్షతోటలు విస్తారంగా కనిపిస్తాయి. షిరిడీ నుంచి 86 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ నగరం. ప్రకృతి సంపదకు లోటులేదిక్కడ. మొఘల్‌ చక్రవర్తుల పాలనలో గుల్షనాబాద్‌గా పేరొందిన ఈ నగరం.. చారిత్రక నేపథ్యంతో పాటు పౌరాణిక ప్రాశస్త్యం, ఆధ్యాత్మిక వైభవం కలిగి ఉంది. నాసిక్‌ చుట్టుపక్కల ప్రాంతాలు రామాయణ గాథతో ముడిపడి ఉన్నాయి. ఈ ప్రదేశంలోనే లక్ష్మణుడు.. శూర్పణఖ ముక్కు, చెవులు కోశాడనీ, అందుకే ఈ ప్రాంతానికి నాసిక్‌ అని పేరువచ్చిందని అంటారు. పట్టణంలోని పంచవటి ప్రముఖ పర్యాటక కేంద్రం. వనవాసకాలంలో సీతారామలక్ష్మణులు ఇక్కడే ఉన్నారని స్థల పురాణం. గోదావరి నదిపై రామ, లక్ష్మణ గుండాలున్నాయి. ఒడ్డున ఉన్న సీతాగుఫా (గుహ) ప్రాంతంలోనే రావణుడు సీతమ్మను అపహరించాడని చెబుతారు. ఈ ప్రదేశాలకు నిత్యం యాత్రికులు వస్తూనే ఉంటారు. పదిహేడో శతాబ్దంలో నిర్మించిన కాలారామ్‌ ఆలయంలో అణువణువునా అద్భుతమైన శిల్పకళ అలరిస్తుంది. పట్టణంలోని ముక్తిధామ్‌ ఆలయం పూర్తిగా పాలరాతితో నిర్మించారు. ఆలయం గోడలపై భగవద్గీతలోని శ్లోకాలన్నీ చెక్కడం విశేషం. పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో పాండవ గుహలుంటాయి. వీటిలో బౌద్ధం, జైనమతాలకు చెందిన శిల్పాలను చూడొచ్చు. చిక్కటి అడవిలో ఉండే పాండవ గుహల దగ్గర ట్రెక్కింగ్‌,
రాక్‌క్లైంబింగ్‌ ఈవెంట్లు జరుగుతుంటాయి. నగరంలోని నాణేల మ్యూజియం ఔత్సాహికులను ఆకర్షిస్తుంది.

గోదావరి పుట్టినిల్లు.. 
నాసిక్‌ నుంచి త్రయంబక్‌ 30 కి.మీ దూరంలో ఉంటుంది. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఇదీ ఒకటి. ఇక్కడి ఆలయ నిర్మాణశైలి అబ్బురపరుస్తుంది. గోదావరి నది జన్మించిందీ ఇక్కడే. సహ్యాద్రి పర్వతాల్లోని బ్రహ్మగిరిపై గోముఖం నుంచి ఉద్భవించిన గోదావరి.. తెలుగు రాష్ట్రాలను పునీతం చేస్తోంది. త్రయంబక్‌ పర్యటనకు వచ్చే సాహసయాత్రికులు బ్రహ్మగిరిపై ట్రెక్కింగ్‌ చేస్తుంటారు. ఇక్కడికి సమీపంలోని దుగర్‌వాడి జలపాతం సందర్శనీయ స్థలం.

No comments:

Post a Comment